యాభై ఏళ్ల క్రితం యాదృఛ్ఛికంగా కలుసుకుని, కలుసుకోగానే స్నేహం కలిపేసుకుని అప్పటినుంచి ఇప్పటిదాకా పలకరించుకుంటూ, జోకులు వేసుకుంటూ ఇంకా సన్నిహితంగానే మసలుతున్న ఇద్దరిలో ఒకడు నా క్లాస్ మేట్ అయిన మూర్తి ..భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తి అయితే ఆ రెండో వాడు కేవలం గాలివాటానికి నాకు పరిచయం అయిన వాడు. వాడి పేరు సాయిదాసు…ఇదంతా చదివితే, గిదివితే అతను నన్ను చెడా మడా తిట్టుట, కొట్టుట చేసే అవకాశం ఉంది. అయినా నాకు తెలిసిన అతని జీవితం గురించి క్లుప్తంగా వ్రాస్తాను. ఎందుకంటే అది చాలా స్పూర్తి దాయకం.
అతని తండ్రి రాజమండ్రిలో బడి పంతులు. తల్లిదండ్రులకి ఒకడే కొడుకు. అతను బి.ఎస్.సి అవగానే వాళ్ళ నాన్న “నువ్వు కూడా బియి.డి చదివి స్కూల్ మేష్టర్ అవరా” ఆనగానే అతనికి “టాట్…చస్తే అవను” అని అలిగి ఇంట్లోంచి పారిపోయి బొంబాయి వచ్చేశాడు. మా ఐఐటి లో లెక్చరర్ గా ఉండే అతని బంధువు ఇంట్లో తలదాల్చుకుని జీవితాన్ని వెతుక్కోడం మొదలు పెట్టాడు. అప్పుడు మొదలయింది మా పరిచయం. అతని మొదటి డైలాగులు “మీకేమిటి సార్. చదువుకున్న వాళ్ళు. బాగా పైకొస్తారు. నేనేమో బైతు గాణ్ణి. మీ కున్న కల్చర్ నాకెక్కడ వస్తుంది”…లాంటివి. జోకేమిటంటే, ఇప్పుడు అతను కోటేశ్వరుడైన ఒక పెద్ద పారిశ్రామిక వేత్త అయినా ఇంకా ఆ మాట మీదే నిలబడతాడు. అక్కడ నించి ఇక్కడికి ఎలా వచ్చాడూ అన్నది అందరూ తెలుసుకో వలసిన జీవిత పాఠం. ముందుగా అతను ఐఐటి లో కొంత మంది పిల్లలకీ, ఐఐటి ఉన్న పవయ్ సరస్సుకి అవతలి వేపు ఉన్న విహార్ లేక్ ని ఆనుకుని ఉన్న NITIE ( National Institute for Training Industrial Engineers) అనే సంస్థ డైరెక్టర్ రష్మి మయూర్ అనే ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాడు.
ఈ NITIE కి మా కేంపస్ నుంచి వెళ్ళాలంటే వెనకాల అతి పెద్ద నీళ్ళ ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న పైప్ గొట్టాల మీద గంట నడవాలి. జారి పడితే అంతే సంగతులు. విహార్ లేక్ నుంచి బొంబాయి మొత్తానికి మంచి నీటి సరఫరా ఆ గొట్టాల లోంచే వెడుతుందిట…. చిన్న వైపరీత్యం ఏమిటంటే ఏ మేష్టర్ ఉద్యోగం అయితే చస్తే చెయ్యను అని ఇంట్లోంచి పారిపోయి వచ్చాడో అదే మరో రూపంలో కొన్నాళ్ళు ఆదుకుంది. ఈ నడక అతని రోజు వారీ చర్య కానీ ప్రవేటు చెప్పడం ద్వారా వచ్చే జీతం తక్కువే…అంచేత ఎలాగో అలాగ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా చేరాడు…నా ప్రాణాలకి..ఎందుకంటే అప్పటికి మేము ఇంచుమించు ‘ఒరే’ బాపతు స్నేహానికి వచ్చేసాం. వాడి కి కోటా ఉండేది కాబోలు. అది చేరుకో లేనప్పుడల్లా “ఒరే. ఇక్కడ సంతకం పెట్టు” అని నా చేత పోలిసీలు చేయించేసే వాడు. ఆ తరవాత వాయిదాలు కట్ట లేక చచ్చేవాడిని. వాడి మేజిక్ అలాంటిది. ఇలా ఒకటి , రెండేళ్ళ తరవాత అక్కడ జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో పార్ట్ టైమ్ చేరి MBA చేశాడు. వెంటనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతనికి ఉన్న అతి మంచి గుణం డబ్బు మాట ఎలా ఉన్నా ఎవరికైనా, దేనికైనా ఒళ్ళు దాచుకోకుండా, మనసు పెట్టి సహాయం చెయ్యడం. ఉదాహరణకి ఎవరికైనా బొంబాయిలో ఫ్లాట్ కావాలన్నా, వారం వారం కూరలు తెచ్చి పెట్టాలన్నా, మడత మంచాలు చేయించి పెట్టాలన్నా, రైలు టిక్కెట్లు కొనిపెట్టాలన్నా ఊరికి ఉపకారి ఈ సాయిదాసే. మళ్ళీ అదే డైలాగ్ “మీకేం సార్. చదువుకున్నారు….” మేము బండి వాడు అని సరదాగా పిలిచే వాళ్ళం కూడాను.
MBA అయ్యాక బొంబాయిలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరినా, కేంపస్ నుంచి వెళ్లి ఖార్ అనే బొంబాయి ప్రాంతానికి మకాం మార్చినా మమ్మల్నీ, మేము చేసిన సహాయాలనీ అతను మర్చిపోలేదు. బహుశా అతని సహాయం చేసే గుణం వలన కొన్ని అగర్వాల్ కుటుంబాలతో పరిచయం అయింది. అగర్వాల్ అంటే ఇండియాలో, ఆ రోజుల్లో ఇనుప వ్యాపారం చాలా మటుకు తమ ఆధీనంలో పెట్టుకున్న మార్వాడీలు. వాళ్ళు మన వాడిని బరోడా తీసుకెళ్ళి ఆ వ్యాపారానికి పరిచయం చేశారు. అనగా…మార్కెటింగ్ లో ఒక దక్షిణ భారత బ్రాహ్మణ యువకుడి అవసరం కలగడం ఒక ఎత్తు అయితే ఇతని గుణ గణాలు మరొక ఎత్తు. అప్పటి నుంచీ ఇతని భాష మార్వాడీ హిందీ గా మారిపోయింది. పేరు కూడా కాస్త రూపాంతరం చెందింది. మకాం బెంగుళూరుకి మారింది. గత నలభై ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, ఇతర ఇనుము ఫేక్టరీలకి మార్కెటింగ్ స్థాయి నుంచి తనే రే రోలింగ్ మిల్స్ సంస్థాపించి, పారిశ్రామిక వేత్త స్థాయి కి ఎదిగాడు. అయినా ఒదిగే ఉంటాడు. “మీకేం సార్. చదువుకున్న వాళ్ళు..” అంటూనే ఉన్నాడు. నాకు తెలిసీ బెంగుళూరు లో ఉన్న మార్వాడీ లకి అతను తెలుగు వాడు అని తెలియదు. కొందరు గొప్ప వాళ్ళ లాగా తెలుగు వాడిని అని చెప్పుకోడానికి ఎప్పుడూ సిగ్గు పడడం లాంటి పెడ బుద్దులు లేవు. ఈ ప్రస్థానం లోనే ఒక మంచి తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాడు.
ఇక అతని తో అనేక చమత్కారాలు జరిగేవి. ఉదాహరణకి మా వారాంతం పేకాట లో…మా కుర్ర గేంగ్ ….అంటే నేను, మూర్తి, రావు, చందూ, ఈ దాసు, కొలాబా నించి వచ్చే సోమయాజులు గాడు, శివరామ్, ఏమ్వీ రావు….అవును కిషోర్ గాడూ….నెలకి ఒకటి, రెండు సార్లు రమ్మీ ఆడేవాళ్ళం. ఓకుకి పైసా ఆట. ఆల్ కౌంట్ ఒక రూపాయి. ఆ రోజుల్లో తెలుగు నాట పేకాట లో వ్యసన పరులు కాకుండా సరదాగా ఆడుకునే వారి హాస్యాలు అన్నీ మేమూ ఆదుకున్నాం. ఆల్ కౌంట్ అవగానే అదృష్టం మార్చుకోడానికి ఏదైనా “తొండి” చెయ్యాలి గురూ అని కిషోర్ అంటే..అవును కదా అని సాయిదాసు బాత్ రూమ్ వెళ్లి వచ్చే వాడు. మరొకడు కుడి కాలి బొటన వేలు పట్టుకుని జోకర్ పడేదాకా వదిలే వాడు కాదు. ఇక ముందు పక్కవాడి ముక్కలు దొంగ తనం గా చూడడం, లేదని బుకాయించడం, తన ఆట పారేసి పక్క వాడికి ఎలా ఆడాలో ప్రెవేటు చెప్పడం, అర్జంటు గా “ఈ వెధవ చొక్కా బా లేదు గురూ” అని ‘తొండి’ లో భాగంగా చొక్కా విప్పేయడం..ఒకటేమిటి…..అపరిమితమైన ఆత్మీయమైన మహానందాన్ని ఆ వారాంతం పేకాట లో అనుభవించే వాళ్ళం. అప్పుడప్పుడూ కొందరు లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా వచ్చి ఆడే వారు…
అన్నట్టు ఈ ‘బండి వాడైన’ సాయిదాస్ ప్రతిష్టాత్మకమైన ఖార్ జింఖానా లో సభ్యుడు గా ఉండే వాడు. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అక్కడ పేకాట కాస్త పెద్ద స్థాయి లో ఉండేది. ఎందుకంటే హిందీ సినిమా వాళ్ళు కొందరు, బాగా డబ్బున్న ప్రముఖులు ఆడేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉన్న వాళ్ళు జీవన్ అనే కేరెక్టర్ నటుడు, ఓం ప్రకాష్ అనే హాస్య నటుడు. హిందీ పౌరాణికం సినిమాలలో ఎప్పుడూ అతనే నారదుడి పాత్ర, విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు వేసే వాడు. అతని తో భయపడుతూ పేకాటడం ఒక చిత్రమైన అనుభవం…అప్పటికి కుర్రాడినే కదా!
ఇక జోకులకి మరొక స్థావరం క్రికెట్….నేను, మూర్తి, రావు మా హాస్టల్ టీమ్ కి ఆడేవాళ్ళం. హాస్టల్ కి సంబంధం లేకపోయినా సాయిదాసు అలా చెలామణీ అయి పోయి మాతో ఆడేవాడు. ఇంటర్ హాస్టల్ పోటీలు, బొంబాయి ఆంద్ర మహాసభ టీమ్ తో మేచ్ లు…ఇలా వీలున్నన్ని. ఒక సారి సాయిదాసు గాడు మా ఐఐటి టీమ్ కి ఖార్ జింఖానా టీమ్ తో వాళ్ళ గ్రౌండ్స్ లో మేచ్ ఏర్పాటు చేశాడు. ఐఐటి యా మజాకా యా? చూడడానికి చాలా మంది వచ్చారు. సాయిదాసు ఖార్ టీమ్ కి ఆడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న సంఘటన….
స్పష్టంగా జ్ఞాపకం లేదు గానీ నేనూ, మూర్తి, రావు, కిషోర్ లలో ఇద్దరం బేటింగ్ లో ఉన్నాం. సాయిదాసు బౌలింగ్ మొదలు పెట్టాడు. 20 గజాలు పరిగెట్టి బంతి విసరగానే అది చెయ్యి జారిపోయి బేట్స్ మన్ వేపు బదులు వెనక్కి ..అంటే వాడు పరిగెత్తుకుని వచ్చిన వేపే ఘాం అని వెళ్లి పోయింది. “ఛా, దానెమ్మ’ లాంటిదేదో అనేసి , మళ్ళీ అలాగే మరో బంతి వెయ్యగానే అది కూడా అలాగే వెనక్కే వెళ్లి పోయింది. ఈ తతంగం ఒకటికి రెండు మూడు సార్లు చూసి మొత్తం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, పెవిలియన్ నుంచి చూస్తున్న వాళ్ళు, ఎంపైర్లు పడీ పడీ నవ్వుతుంటే నాకు ఒక వెధవ ఐడియా వచ్చి “అలా కాదు గురూ, నువ్వు బేట్స్ మన్ వికెట్ల వేపు నుంచి రెండో వేపు పరిగెట్టి వేస్తే బంతి కరెక్ట్ వేపు పడుతుంది” అని కోతి సలహా ఇచ్చాను. వాడు కోపపడ లేదు సరి కదా, హాయిగా మనసారా నవ్వేసి, కసిగా వేసిన తర్వాత బంతికి నేను డక్ ఔట్ అయ్యాను. ఆ సంఘటన, ఆ జోకు, నా డక్ ఔట్.. ఇప్పటికీ తలచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది….మేం అందరం యాభై ఏళ్ల తర్వాత కూడా అది తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం!
ఒక మా జీవితాలలో మరో పార్శ్వం నాటకాలు. అసలు సంగతి మార్చే పోయాను. సాయిదాస్ సినీ హీరో దిలీప్ కుమార్ లా ఉండేవాడు. అంటే మన తెలుగు నటుడు చలం లాగా కూడా అనమాట. అలా అని కిషోర్ గాడి లాగా తను హీరో కేటగిరీ అని ఫిక్స్ అయిపోలేదు. వాడిని మేమే నాటకాలలోకి లాగాం. నాకు బాగా జ్ఞాపకం ఉన్న నాటకం రావి కొండల రావు గారి ‘కుక్క పిల్ల తప్పిపోయింది.’ అందులో చందూ ది ప్రధాన పాత్ర చిదంబరం. నేను దర్శకత్వం. అతి సరదా అయిన వైపరీత్యం..అంటే ఐరనీ …సాయిదాసు కి జీవితంలో మొదటి సారి నాటకంలో పాత్రగా అది ఆ చిదంబరం యజమాని కి ఇంటి నౌకరు వేషం! “అవును సార్, మీరంతా చదువుకున్న వాళ్ళు, నేను బైతుగాడిని” అనే వాడి ఉతపదానికి సరిగ్గా అతికే వేషం. మరొకడూ, మరొకడూ అయితే ఆ నౌకరు వేషానికి ఒప్పులోక పోవును కానీ సాయిదాసు కాబట్టి పైకి ఎన్ని ఏడుపులు ఏడిచినా ఆ వేషం వెయ్యడానికి ఒప్పుకుని బాగా వేశాడు. ఇక్కడ జోక్ ఏమిటంటే, నిజానికి ఆ వేషం నేనే వేద్డును కానీ తెల్లగా ఉంటాను కాబట్టి నప్పను “ఆఫీసుల్లో బంట్రోతులు, ఇంట్లో నౌకర్లు నల్లగానో, కనీసం చామన ఛాయగానో ఉండవలయును”. అదీ ఆ రోజుల్లో సిద్దాంతం.
ఇక ఈ నాటకంలో సరదాగా చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. ముందుగా….అసలు చిదంబరం వెయ్య వలసిన నటుడికి రిహార్సల్ అన్నీ అయ్యాక జబ్బు చేసి, ఆఖరి క్షణంలో చందూ ఆ పాత్ర వెయ్య వలసి వచ్చింది. అంచేత అతి తక్కువ రిహార్సల్ లో అన్నీ ఒక లాగే ఉండే ఆ పాత్ర డైలాగులు తెగ తారు మారు చేసే వాడు. దాంతో ఇతర నటులు బిక్క మొహాలు పెట్టే వారు. అంచేత నేను ఆ పాత్ర ఒక టేబుల్ దగ్గరే ఎక్కువ సేపు ఉండేలాగా, ఆ బల్ల క్రింద నేను ప్రాంప్టర్ గా చిన్న టార్చ్ లైట్ పెట్టుకుని వాడికి ఆ గంటన్నారా డైలాగు లు అందించడం ఒక విశేషం. అలాగే ఏమ్వీ రావుకి మొదటి సారి వేదిక ఎక్కడం. పెద్ద మీసాలు, గళ్ళ లుంగీతో పెద్ద అడులేసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి, కుక్క పిల్లని చిదంబరం బల్ల మీదకి విసిరేసి “ఇదిగో నీ కుక్క పిల్ల. ఏదీ నా డబ్బు” అదొక్కటే డైలాగ్. దానికి చిదంబరం :ఈ కుక్క పిల్ల నాది కాదు మహా ప్రభో” అని భోరుమనాలి. “చంపేస్తా. అదంతా నాకు తెల్దు, డబ్బిస్తావా, చస్తావా” అని తిట్టడం. అంతే అతని పాత్ర. సమస్య అల్లా …అతని స్టేజ్ మీదకి వచ్చి, ప్రేక్షకులకి చూడగానే బిగుసుకు పోయాడు. నోరు పెగల్లేదు. డైలాగు రాలేదు. కుక్క పిల్లని విసర లేదు. నెర్వస్ గా మీసం దువ్వేసుకుంటూ వణికిపోయాడు. పైగా చందూ కేసి మెడ సారిస్తూ, రహస్యంగా ”నీదే డైలాగ్, చెప్పు” అని ఓవర్ ఏక్షన్ చెయ్యడం మొదలు పెట్టాడు. స్టేజ్ అంతా ఘోరమైన నిశ్శబ్దం. బల్ల క్రింద ఉన్న నాకు ఏమవుతోందో తెలీదు. చందూ గాడికి చెమట్లు. ఒక నిముషం తర్వాత ప్రేక్షకులకి విషయం తెలిసిపోయి నవ్వుతూ చప్పట్లు, ఈలలు మొదలెట్టారు. ఆ సమయంలో వెనక ఉన్న సాయిదాసు విషయం గ్రహించి. అడుగు ముందుకు వేసి “ఆ కుక్క పిల్ల మాది కాదని మా యజమాని అంటున్నారండి” లాంటి డైలాగ్ చెప్పి నాటకానికి కొనసాగింపు చేశాడు. అలా సమస్య పరిష్కరించడం సాయిదాసుకి వెన్నతో పెట్టిన విద్య. అతను జీవితంలో అంత ఉన్నత స్థాయిని అందుకోడానికి అదొక ప్రధాన లక్షణం.
నేను అమెరికా వచ్చిన తరువాత సొంత వ్యాపారం పెట్టుకున్నాక, నేనూ, సాయిదాసూ వ్యాపారంలో నాకు పరోక్ష భాగస్వామిగా చాలా సహాయం చేసే వాడు. అవును..అదే డైలాగ్ “మీకేంటి సార్ ….”
అప్పుడప్పుడు మా సాహితీ సభలకి విరాళం కూడా ఇస్తాడు. ఇలాంటి వాటినే స్నేహం అంటారు. కొన్ని స్నేహం దాకా వచ్చినా, అనేక కారణాలకి విడిపోతాయి. అలాంటి మరి కొందరు స్నేహితుల గురించి – వచ్చే సంచిక లో…………..
మీ మిత్రులు సాయిదాస్‌గారి జీవనప్రయాణం మీరన్నట్లే స్ఫూర్తిదాయకం.
అవును. అవకాశాలని వెతుక్కోవడం, దొరికిన వాటిని సరి అయిన పద్ధతిలో అన్వయించుకోడం అందరూ నేర్చుకోవలసిన విషయాలే.
అన్నయ్యా….నువ్వూ, అంజి అన్నయ్య ఇంజినీరింగ్ రోజులనాటి మన కాకినాడ క్రికెట్ జ్ఞాకాలు నీ వంగూరి జీవిత కాలంలో వ్రాశావా? దయచేసి నాకు ఆ లంకెలు పంపించవా దయచేసి. ధన్యవాదాలు.