పాప దుమ్ములో ఆడుకుంటుంది, అమ్మ వెనక్కి లాగింది.
కాసేపాగి అమ్మ చూడకుండా పాప మళ్ళీ దుమ్ములోకి వెళ్ళింది. నచ్చజెప్పినా, కోప్పడినా వినలేదు. అమ్మకి విసుగొచ్చి తన పని తాను చేసుకుంటూ చూస్తూ ఊరుకుంది. వంటగదిలో వస్తువులు సర్దుతుంటే, వెల్లులి రెబ్బల సీసా ఖాళీగా కనపడింది. మూత తెరిచి వాసన పోవడానికి అరుగు మీద ఎండలో పెడదామని బయటికి వచ్చింది. వీధి చివర పాప ఇంకా ఆడుకుంటూనే కనపడింది. సాయంత్రానికి ఒళ్ళంతా దుమ్ము పూసుకుని, అలసిపోయి పాప ఇంటికి వచ్చే వేళకి మోకాళ్ళ మీది దెబ్బలకి మందుతో, స్నానానికి వేణ్ణీళ్ళతో అమ్మ ఎదురు చూస్తూ ఉంది. రేప్పొద్దున మళ్ళీ ఆట, దుమ్ము, దెబ్బలు అన్నీ మామూలే అని తెలిసినా…
***
అంతే చేయగలిగేది!
సహనమే సాధన, నమ్మకమే నల్లేరు దారి.
***
కలలో విన్న మాటల్ని నిద్ర లేచాక పాటగా రాస్తుంది ఆమె. కోనేటిలో నీటి తళతళల్ని, ఉందో లేదో తేలని ఆకాశపు నీలాన్ని చూసి నైరూప్యంలోకి రంగుల్ని విరజిమ్ముతాడు అతను. అనుకరణ విద్యలో పూర్తిగా ఆరితేరిపోయాక, వీళ్ళు తయారు చేసిన నమూనాల ఆధారంగా ఒక గొప్ప సింహాసనం తయారవుతుంది, యే శిల్పీ కల్పించుకోకుండానే. ఏనాటికైనా పట్టాభిషేకం జరిగేది అహానికే అని అందరికీ తెలిసిందే. శబ్ధమే గాత్రాన్ని సృష్టించుకుందని, సారమే రూపాన్ని నిర్మించుకుందని చెప్పీ చెప్పలేక, సముద్రం మాత్రం అనాదిగా అలల ఆట ఆడుతూనే ఉంది.
***
“కొత్త ఇంటికి మారిపోయాం కదా, దారి గుర్తుపెట్టుకోవడం ఎలా?” అనడిగింది పాప.
అమ్మ మనసులో ఇలా అనుకుంది-
‘ముళ్ళకంచె హద్దుకి అవతలి బాటని, కిటికీ ఊచల మధ్యగా ఎంతగా చూసినా తెలిసేదేం లేదు. ఎన్నోసార్లు తలుపులు తెరుచుకుని బయటికి వెళ్లాలి, కొత్త కొత్త దారుల్లో తప్పిపోవాలి. ఇల్లు ఎక్కడో అని ప్రతిసారి వెతికి వేసారి కనిపెట్టాలి. మరో మార్గం లేదు. ఎన్నిసార్లు తప్పిపోతే, ఎంతగా భయపడి వెతుక్కుంటే, అంత బాగా గుర్తుండిపోతుంది ఇంటికి చేర్చే దారి.’
పాపకి మాత్రం ఇలా చెప్పింది-
“నేనున్నాను కదమ్మా, నా చెయ్యి పట్టుకుని నడువు, అన్నీ గుర్తుంటాయి.”
పాప అమ్మ వైపు అపనమ్మకంగా చూసింది.
***
సున్నితంగా (subtle)చెప్తే భావోద్వేగం అంత గాఢo గా కలుగుతుంది, నీ సునిసిత, సూక్ష్మ పద ప్రయోగం అంతరంతరాలను కదిలించింది, ముఖ్యంగా సహనమే సాధన, అహంకారానికే పట్టాభిషేకం మరియు తప్పిపోయి, భయపడి వెదికితే వాక్యాలు ముందు నడచిన కథనానికి విలువ పెంచే ముగింపులు. అభినందనలు 💐