ముందుగా వొక కన్ఫెషన్ :
యిది ‘గద్దలాడతండాయి’ నవల పాఠ్యానికి కొత్త అర్థ నిర్ణయం చేసే సాహసం కాదు. దాని అసలు అర్థం అన్వేషించే వొక అసమగ్ర ప్రయత్నం లేదా వొక ముగింపు తెలీని పూనిక మాత్రమే.
***
సమగ్రత వొక ఆశయం మాత్రమే …
గద్దలాడతండాయి –
రాయలసీమ ప్రాదేశిక నవల
రాయలసీమ గ్రామీణవాద నవల
రాయలసీమ వ్యావసాయిక నవల
రాయలసీమ మాండలిక నవల
రాయలసీమ బహుజన నవల
రాయలసీమ దళిత బహుజన నవల …
యిలా యీ నవలని మన పరిమిత సాహిత్యపరిజ్ఞానం నుంచో రొట్టకొట్టుడు మూస పరిభాష నుంచో మరింత పచ్చిగా చెప్పాలంటే మన అకడమిక్ చేతగానితనం నుంచో రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. అందుకు రచయిత స్వామి కూడా యేదో వొక మేరకు ఆమోదం తెలపొచ్చు. పేరు వొకానొక గుర్తింపేగానీ స్వరూప స్వభావాల అంతరంగాల పరిపూర్ణ చిత్రం యెప్పటికీ కాదు. మన సౌలభ్యం కోసం యీ నవలని యేదో వొక చట్రంలోకి యిమడ్చడం అసమంజసం. అలా చేస్తే రచనకు తీరని అన్యాయం చేసినట్టే. పాఠకుల దృష్టినీ సృజనాత్మక పఠనోత్సాహాన్నీ సీమితం చేసినట్టే. పైన పేర్కొన్నవన్నీ యీ నవలకున్న భిన్న పార్శ్వాలు స్తరాలు మాత్రమే. వాటన్నిటి కలయికలోంచి చూసినప్పుడు మాత్రమే నవల సమగ్ర స్వరూపం గోచరిస్తుంది. నిర్దిష్టతని మరచి చేసే సాధారణీకరణం యెంత మోసమో కాల్పనిక తలం నుంచి కళాత్మక దృష్టితో చూసినపుడు సాధారణీకరణ వైపు నడపని సాహిత్యం, సాహిత్యవిమర్శ కూడా అంతే అసమగ్రం. అవి ఖాళీలను పూడ్చవు. పెంచుతాయి. ఖాళీలని పెంచేదేదీ వుపయోగపడదు.
***
అందుకే మరొక కన్ఫెషన్:
పోయిన శతాబ్దంలో యిప్పటికి పాతికేళ్ళ క్రితం తొలిసారి ‘గద్దలాడతండాయి’ చదివినప్పుడు దానిలోని యాస బాసలకీ మౌఖిక కథన శైలికీ ముచ్చటపడి యిన్నాళ్ళూ దాన్ని అలాగే గుర్తుపెట్టుకున్నా. యిప్పుడు మళ్ళీ చదువుతుంటే నా చేసిన నేరం తెలిసొచ్చింది. ఆరేడు నెలల నుంచీ ఆ అపరాధ భావన పట్టి పీడిస్తూనే వుంది. యిప్పుడైనా నవల పాఠ్యాన్ని పక్కనపెట్టి రచయితని పట్టుకోడానికి వెర్రి ప్రయత్నం చేశాను. రచనని వదిలేసి మానవ సమాజంపై అది ప్రసరించే వెలుగుని చూడలేక మనిషి జీవితం లోతుల్లోకి అది అందించే లోచూపుని గుర్తించలేక దాని పొరల్లో దాగివున్న తాత్త్వికంశాల వైపు దృష్టి సారించలేక రచయిత వెంట పడటం మరొక నేరం. దాన్నుంచి బయటపడే క్రమంలోనే యీ కాసిన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను.
***
పాఠ్యం ముందు మోకరిల్లి :
దాదాపు ముప్పై సంవత్సరాల పూర్వం …
తెలుగు నేలమీద ఆధునికోత్తర వాదులు మహాకథనాలకు కాలం చెల్లింది అని యింకా ప్రకటించక ముందే పుట్టిన నవల యిది (రచనా కాలం 1991, ప్రచురణ 1996). సాధారణంగా మహాకథనాల్లో వొక వీరుడో మహావీరుడో వుంటాడు. కథంతా అతని చుట్టూ తిరుగుతూ వుంటుంది. యేవో కొన్ని ఆదర్శాలు ఆశయాలు ఆశలు వాటిని సాధించడానికి సంఘర్షణ కొన్ని పరాజయాలు విజయాలు … మధ్య మధ్యనో చివరాఖరికో నైతిక ధార్మిక ప్రవచనాలూ … యిలా యేదో వొక నిశ్చిత పురా పద్ధతి వుంటుంది. వొక mould వుంటుంది. ఆధునికేతిహాసాల్లో సైతం, విప్లవ రచనలుగా ప్రచారమయ్యే నవలల్లో కూడా, దీన్ని చూడొచ్చు. యీ మూసని బద్దలు కొట్టింది యీ నవల. పాఠ్యాన్ని ఆడ్డుపెట్టుకొని రచయిత దేన్నీ ప్రవచించడానికి పూనుకోలేదు. యే వొకటి రెండు సందర్భాల్లోనో తప్ప పాత్రల పట్ల వాటి ప్రవర్తన పట్ల నైతికత పట్ల Judgmental గా కూడా లేడు. సాధ్యమైనంత తాటస్థ్యాన్ని పాటించాడు. నిజానికి రచయిత అదృశ్యమైపోవడం యీ పాఠ్యంలో వున్న విశేషం. అందుకు అతను వొక టెక్నిక్ యెన్నుకున్నాడు. రచయిత కథకుడి అవతారమెత్తుతాడు. మొత్తం కథనమంతా అనగనగా… యిలా జరిగింది అని శ్రోతని ముందు పెట్టుకుని కథ వినిపించినట్టు వుంటుంది. సర్వసాక్షి కథనంలో కథకుడు తానెరిగిన అంశాల్ని గుదిగుచ్చి పాఠకులతో వొక సుదీర్ఘ సంభాషణకి వుపక్రమిస్తాడు. భుజమ్మీద చెయ్యేసి కథ జరిగే స్థల కాలాల్లోకి తీసుకుపోయి అక్కడ మనని వదిలేస్తాడు. అందువల్ల పాఠ్యం లోతుల్లోకి పాత్రల అంతరంగాల్లోకి సంఘటనల మూలాల్లోకి పదాల వెనక వాక్యాల మధ్యలో వాచ్య సూచ్యార్థాల అంచుల్లో స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు పాఠకులకు లభిస్తుంది.
***
స్థల కాలాలకు లోబడి …
పాఠ్యానికే కాదు పాఠ్యాన్ని అర్థం చేసుకోడానిక్కూడా స్థల కాల పరిమితులూ ప్రభావాలు వుంటాయి. పాతికేళ్ళ క్రితం, యిప్పుడూ యీ నవల వొకేలా అర్థం కావాలని లేదు. అప్పటి సామాజిక స్థితిగతులకనుగుణంగా యేర్పడ్డ చూపు యిప్పటి పరిస్థితుల అవసరం రీత్యా స్వీకరించే దృక్పథం వేరు కావొచ్చు. వుదాహరణకి నవల్లో చెనిక్కాయలు దొంగతనం చేసిన మాదిగ మల్లేశంతో కాళ్లు మొక్కించుకోడానికి ఆధిపత్య కులాలకు చెందినవాళ్ళే కాకుండా బిసి కులాలకు చెందిన బోయోల్లు కురవోల్లు ఈడిగోల్లు సైతం వుత్సాహం చూపిన ఘటన వుంది. మొత్తం భారతీయ సమాజంలో మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్య సమాజంలో యీ పాతిక ముప్పై యేళ్ళలో దళిత – బిసి – బహుజన వాదాల్లో అనేక అతివ్యాప్తి అవ్యాప్తులు చోటుచేసుకున్నాయి. వాటిని గమనంలోకి తీసుకున్నప్పుడు యస్సీ యస్టీ బిసి మైనారిటీల ఐక్యతని కోరుకునే యివ్వాళ్టి బహుజన రాజకీయ సమీకరణల సందర్భంలో ఆ సంఘటనలోని వైరుధ్యం కొత్త వ్యాఖ్యానానికి గురి కావొచ్చు. కానీ నవల కథా కాలం (ముప్పై అయిదేళ్ళకి పూర్వం) నాటి పరిస్థితులనుంచి మాత్రమే రచనని అంచనావేయగలం. గతితార్కిక చారిత్రిక భౌతిక దృక్పథం అందుకు వుపకరించే పనిముట్టు అని నాకు అనిపించింది. ఆ వెలుగులోనే నవల లోపలికి ప్రయాణం చేశాను.
అలాగే భైరవాని తిప్ప ప్రాజెక్టు దిగువన వున్న పాపం పల్లె కేంద్రంగా మల్లం పల్లె మీదుగా కళ్యాణ దుర్గం నుంచి వొక దిక్కున అనంతపురం వరకూ మరో దిక్కున బళ్ళారి వరకూ పరివ్యాప్తమైన వొకానొక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన కథ యిది. వొక విధంగా చూస్తే ఆ ప్రాంతమే కథలో ప్రధాన యితివృత్తం. ప్రాంతమే ప్రధాన పాత్ర అన్నా తప్పులేదు. వొక ప్రాంతపు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక చలనాన్ని సాహిత్య మాధ్యమంగా అవగాహన చేసుకోడానికి కొన్ని పరిమితులున్నప్పటికీ రచయిత ప్రతిభా వ్యుత్పత్తుల ద్వారా వొక ప్రాంతాన్ని కేంద్రం చేసుకొని మొత్తం వ్యవస్థ సమగ్ర రూపాన్నీ సూక్ష్మ దర్శినిలో గోచరింపజేయవచ్చు. పలామూ కేంద్రంగా మహాశ్వేతా దేవి భారతదేశ ముఖచిత్రాన్ని సాక్షాత్కరింపజేసినట్టు స్వామి నీటి సమస్య దగ్గర్నుంచి మొదలయ్యే రాయలసీమ స్థితిగతుల్ని వ్యవసాయంలో వచ్చిన మార్పులన్నిటినీ బి టి ప్రాజెక్టు కింది గ్రామాన్ని నేపథ్యం చేసుకుని సూక్ష్మంగా చూపగలిగాడు (భైరవాని తిప్ప ప్రాజెక్టు ఆయకట్టు కింద వ్యవసాయంలో లబ్ధిపొందిన ప్రాంతంలో నవలని నడిపితే దాని తీరు మరోవిధంగా వుంటుంది).
ప్రాజెక్టు కట్టాకా చుక్క నీరు తేమ లేకుండా యెండిపోయిన బావులూ వంకలూ … వొక భౌతిక వాతావరణాన్ని రచయిత మొదటి అధ్యాయంలోనే యేర్పరిచాడు. యెండిపోయిన యేటి వర్ణన కేవలం వాతావరణ వర్ణన మాత్రమే కాదు, మొత్తం నవలని నడిపే యింధనం. తర్వాతి అధ్యాయాల్లో బావులు నిండుగా వున్న కాలాన్నీ బోరు బావుల కాలాన్నీ వాటికింద వ్యవసాయం లో వచ్చిన మార్పుల్నీ యెంతో వివరంగా విశదం చేస్తాడు.
నాగేంద్రప్ప అన్నదమ్ముల బోరుకింది వ్యవసాయం, నీటి పంపకాల కారణంగా అన్నదమ్ములమధ్య ద్వేషాలు వైషమ్యాలు తగూలు, గిట్టుబాటు కాని వ్యవసాయం నుంచి వ్యాపారంలోకి మారాలని నాగేంద్రప్ప నిర్ణయించుకోవడం, నడిపోడు (వెంకటేశులు) సొంతంగా బోరు శాంక్షన్ తెచ్చుకోవడం, పంటల మార్పు, కరెంటు కష్టాలు, మోటరు కాలిపోవడం, పక్కనే పెద్ద భూస్వామి శంకర రెడ్డి సబ్ మెర్సిబుల్ పంపుతో నీళ్ళు తోడేయటం, వెంకటేశ్వర్లు ఆత్మహత్య, అతని భార్య రాములమ్మ బెండ తోట నీటికోసమే రెడ్డికి లొంగిపోవడం మొత్తం జీవితమంతా నీటి చుట్టూనే తిరుగుతుంది. బోరుబావులొచ్చిన తర్వాత సాంస్కృతిక జీవితంలో వచ్చిన మార్పుల్ని సైతం రచయిత యీ క్రమంలో ప్రస్తావించాడు.
( రైతులు తోటల్లో –
ఆయిల్ మిషిన్లు వేసుకుండిరి.
మళ్లీ కరెంటు మోటార్లు వేసుకుండిరి.
కవిలి తోలేది ఇడిసిపెట్టిరి.
కవిలి తోలేది ఇడిసి పెట్టినంక
కవిలి పాటలూ మరిచిపోయిరి.)
రచయిత యిక్కడితో ఆగిపోలేదు. చివరికి ‘దండిగా దుడ్లున్న రైతుకే’ సేద్యం లాభసాటిగా వుందనీ సన్న రైతులకి ప్రాణాంతకంగా తయారయ్యిందనీ తేల్చి చెప్పి నీటి సమస్య వెనక వున్న రాజకీయాల్ని యెండగట్టడంతో రాయలసీమ సమగ్ర చిత్రం రూపుకడుతుంది.
‘ఈ సబ్సిడీ బోర్లకి ఇన్ని కోట్ల దుడ్లు ఖర్చుపెట్టే బదులు మన చెరువుల్నీ, కుంటల్నీనీళ్ళతో నింపితే చాలు …’
‘మన రాయలసీమ నీటి సమస్య అనేది ఒక లంజ ! ఎందుకంటే దాన్ని బాగా వాడుకుని ఇడిసిపెట్టని రాజకీయ నాయకులే లేరు’
‘రాయలసీమకు నీళ్ళు రాకుండా చేసి తన ఊరికి మాత్రం కాలవ నీళ్ళు తెప్పించుకుండె సంజీవరెడ్డి’
నవల్లో రైతులు మాట్లాడిన మాటలే యిప్పుడు రాయలసీమ అస్తిత్వ వాదానికి నినాదంగా మారాయి. నవల ఆత్మే కాదు; రచయితగా సామాజిక కార్యకర్తగా స్వామి అస్తిత్వం కూడా యిక్కడే వుంది (‘నేను రాయలసీమ వాణ్ణి కాకపొతే – ఈ నవలను అస్సలు రాసేవాన్ని కానుగాక కాను’).
నీటి సమస్యే కాదు, స్థూలంగా దేశంలో, సూక్ష్మంగా సీమ నేలపై పార్లమెంటరీ రాజకీయాల్లోని కుల సమీకరణల్ని రచయిత లోతుగా అర్థం చేసుకున్నాడు. దాదాపు ముప్పై అయిదు సంవత్సరాలపాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రేసుని సినిమా చరిష్మాతో మట్టికరిపించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నవల మొదలౌతుంది. తొలిసారి కాంగ్రెసేతర పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక రాజకీయాల్లో వస్తున్న మార్పులు అధికారం చుట్టూ తిరిగే పార్టీ ఫిరాయింపులు అందుకు కారణమౌతున్న భిన్న పోలరైజేషన్ లు వోటు బ్యాంక్ గణాంకాలు అన్నీ నవల్లో సహజంగా చోటుచేసుకున్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో పాలనా వ్యవహారాల్లో వచ్చిన మార్పులు (మధ్యాహ్న భోజన పథకం, రెండు రూపాయిలకి కిలో బియ్యం వంటి వినూత్న పథకాలు) భిన్న సందర్భాల్లో చర్చకు వస్తాయి. మార్పు మంచిదే అని బుద్ధిజీవులు కూడా కొందరు భావించారేమో గానీ వూళ్ళల్లో పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ముఖ్యంగా కులాధిపత్యాలు అణచివేతలు అధికారుల అవినీతి అన్నీ మూడు పువ్వులు ఆరు కాయలయ్యాయి. నాదెళ్ళ భాస్కరరావు కారణంగా వచ్చిన మధ్యంతర యెన్నికల సందర్భం నవల్లో ప్రధాన విషయంగా ఫోకస్ అయ్యింది. ప్రజల్లో భిన్న స్థాయిల్లో వున్న రాజకీయ అవగాహనని/ అనవగాహనని తెలియజేయడానికి ఆ సందర్భాన్ని రచయిత వాడుకున్నాడు.
‘ఇరవై మంది పెద్ద కులమోల్లు (ఈ రెడ్లు గానీ కమ్మోల్లు గానీ), మన ఇన్నూరుమంది తక్కువ కులమోల్లని (బాయోల్లని) పరిపాలించేది చానా విచిత్రంగా ఉంది మామా!’ అనె భీమప్ప.
ఆ నాటికి యిదొక చైతన్యం. అయితే అన్ని గుర్తుల మీదా ముద్ర వేసే వాళ్ళు బ్యాలెట్ మడిచి జేబులో పెట్టుకు పోయేవాళ్ళు వున్న కాలంలో యీ చైతన్యానికి అర్థంలేదు. ‘తుపాకి వున్నోనికి ఇన్నూరు మంది అయినా బయపడల్సిందే’ అన్న యెరుక పార్లమెంటరీ రాజకీయాల పరిమితుల్ని చెప్పకనే చెబుతుంది. ఇన్నూరు మంది బాయోల్లు మరి కొందరు కురమోల్లు కలవడానికి ఆనాడు అవకాశముందేమో గానీ వూళ్ళోని మాదిగోల్లతో వోట్ల పొత్తు కూడా కలిసే కాలం కాదది. ఆ ఆలోచనే లేదు. అప్పుడే కాదు బిసి దళితకులాల ఐక్యత యీ నాటికీ వొక ఆదర్శంగానే కనిపిస్తుంది. ఆచరణలో యింకా యెండమావిలా వూరిస్తూనే వుంది.
యీ స్థల కాల పరిమితులకు లోబడే నవలని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత కొన్ని ఆలోచనలు అర్థ రహితంగా కనిపించవచ్చు. సంఘటనలు సందర్భాలు సన్నివేశాలు పాత్రలు సంభాషణలు వాటి లోతులు రాయలసీమ పాఠకులకు సైతం అప్పుడూ యిప్పుడూ వొకేలా గోచరించాలని లేదు. ప్రతి పాఠ్యానికీ యీ పరిమితులుంటాయి. అయితే జీవితం పట్ల రచయిత దార్శనికత, రచనా శిల్పంపై authority ఆ రచననని స్థలకాలాల్ని అధిగమించి సార్వకాలీనం సార్వజనీనం చేస్తాయి. రచయిత ప్రాపంచిక దృక్పథం అందుకు యెంతగానో దోహదం చేస్తుంది. అది సూటిగానో గూఢంగానో సూచ్యంగానో వాచ్యంగానో పాఠ్యంలో వ్యక్తమౌతుంది.
***
పాఠ్యం చాటున రచయిత:
జానపద కథా గేయాల్లో సైతం కథకుల (narrator/story teller) సామాజిక నేపథ్యం, స్వీయ జీవితానుభవ సారం, ప్రాపంచిక దృక్పథం కథనంపై ప్రభావం చూపక మానవు. కొన్ని సందర్భాల్లో కథకుల ఆలోచనలు మనోగతాలు వ్యక్తిత్వం కథనంలో అయత్నంగా వ్యాఖ్యలుగా వెలికి వస్తాయి. కళ్ళముందు చోటుచేసుకునే కఠోర జీవన వాస్తవికత అతణ్ణి తటస్థంగా వుండనీదు. అతిసహజంగానో అప్రయత్నంగానో పీడితులవైపుకి వొరగడం వారితో మమేకమవడం గమనిస్తాం.
అందుకే …కథకుడి వేషం కట్టిన రచయిత –
- ‘పులి’ లాంటి ఈశ్వరరెడ్డి ‘ఉక్కుపాదాల కింద పడి నలిగిపోకుండా అతని కాళ్ళ సందుల్లోనే ఒదిగి ఒదిగి’ వుండే బక్కప్రాణుల్తోకలిసి బెంగటిల్లుతాడు.
- ఒక పూట తిండైనా దొరుకుతుందని బడికీ వచ్చిన పిల్లలకూ మధ్యాహ్న భోజనానికీ మధ్య, వాళ్ళ ఆకలి చూపుల్లో, వాళ్ళ తల్లిదండ్రుల ఆక్రోశాల్లో, వాటిని స్వార్థం కోసం వుపయోగించుకునే క్షుద్ర రాజకీయాల్లో నలిగిపోతుంటాడు.
- వూరి బడుగుజీవుల పొట్టలు కొట్టి వొకటికి ‘మూడు లాభాలు’ గుంజే సుబ్బయ్య శెట్టి దోపిడిని సహించలేనితనంలో తన వునికి ప్రకటించుకుంటాడు.
- డొక్కలెండిన పశువులకు నాలుగు గడ్డిపాసల కోసం పరాయి మొగాడికీ తనను తాను అప్పజెప్పుకునే ఈడిగ రంగమ్మ శరీర భాషలో వ్యక్తమౌతాడు.
- మాదిగోళ్ళ దుడ్లతో తిని తాగి తేన్చిన నాగేంద్రప్ప గుడ్డల వ్యాపార పరిభాషలో (దుడ్లకి మాత్రం మాదిగోల్ల మైల అంటకపాయ) తొంగి చూస్తాడు.
- వెంకటేశులు కొడుకు చిత్తయ్య అటు చదువబ్బక యిటు వ్యవసాయప్పనులూ చేతగాక దుర్వ్యసనాల పాలవడానికి కారణాల్ని వెతికే సందర్భంలో దొరికిపోతాడు.
- కన్నబిడ్డలకు కడుపారా తిండి పెట్టలేని ‘పేద తల్లి పుట్టెడు దుఃఖం’లో ప్రత్యక్షమౌతాడు.
- నాలుగెకరాల్లో చెనిక్కాయ పండించినప్పటికీ చివరికి చెనిక్కాయల దొంగతనం చేసి పట్టుబడి పోయిన మాదిగ మల్లేశుతో బాయోల్లు కురవోల్లు ఈడిగోల్లు కాళ్లు పట్టించుకునేదానికి ఉవ్విళ్ళూరుతూ తోసుకుని ముందుకొచ్చి అతనికి గుండు కొట్టించి సున్నంబొట్లు పెట్టించి గాడిదమీద ఊరేగించినపుడు మాదిగ పెద్దమనుషులు నిస్సహాయంగా చూస్తూ వుండగా మల్లేశు పిల్లల్ని బడికి తీసుకుపోయిన అయ్యవారి మానవీయ స్పందనలో సాక్షాత్కరిస్తాడు.
- మామ హనుమంతుతో తాగి తూలుతూ దరమ సందేహం వ్యక్తం చేసిన మాదిగ ఏబు నవ్వులో దాక్కొని వుంటాడు (ఏబు నవ్వె, కసి కసిగా నవ్వె. పగలబడి నవ్వె).
- చివరికి జయమ్మకి పుట్టిన దయ్యం పిల్లలో పూర్తిగా బాహాటమౌతాడు.
- అన్నిటికంటే అధ్యాయాలకు పెట్టిన పేర్లలో : మూడు లాభాలొచ్చె, కవిలి తోలేది పాయె-కవిలి పాటలు పాయె, ఒంటి చన్ను తల్లికి ముగ్గురు ఆకలి బిడ్డలంట, చెమట బొట్టుకు నోరు లేదు, చట్టానికి నీతి లేదు, ఈ ఓటరు ఎంతయు కృతజ్ఞుడు, సద్దికంటే చింతకాయ తొక్కు జాస్తి వంటి చోట్ల స్వయంగా ప్రకటనాత్మకంగా దర్శనమిస్తాడు.
ఇవి కొన్ని వుదాహరణలు మాత్రమే, కానీ ఆ యా సందర్భాల్లో రచయిత గొంతు స్పష్టంగా గుర్తుపట్టగలం. ఆ స్వరంలో సామాజికంగా అణచివేతకీ ఆర్ధికంగా దోపిడీకి గురవుతున్న బడుగు జీవులపట్ల ఆవేదన వెల్లడవుతుంది. మనుషుల స్వార్థపరత్వం పట్ల, మానవ స్వభావాన్ని శాసిస్తోన్న ఆర్థిక సంబంధాల పట్ల అవకాశవాద రాజకీయాల పట్ల పసిడిగలవాడి పక్కన నిర్లజ్జగా కులుకుతున్న రాజ్యాంగ వ్యవస్థల పట్ల మొత్తం వికృత సమాజంపట్ల తన క్రోధాన్నీ అసహ్యాన్నీ జయమ్మ కడుపున వికృత శిశువుని పుట్టించి తీర్చుకున్నాడు.
నవల్లో అనేక పాత్రలు విరుద్ధ అభిప్రాయాలు మాట్లాడతాయి, వ్యక్తం చేస్తాయి, ప్రకటిస్తాయి. ప్రభుత్వాధికార్లు బోరుల శాంక్షన్ కోసం వచ్చినపుడు మాల మాదిగల మీద చేసిన వ్యాఖ్యానాలు, జయమ్మ చలపతితో వెళ్ళిపోయినప్పుడు, రాములమ్మపై అత్యాచారం జరిగినప్పుడు ప్రకటించిన భిన్న ఆలోచనలు మల్లేశు దొంగతనం సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలు సామాజిక వైరుధ్యాలు ఆ యా వ్యక్తుల ముఖతా వెలువడినట్టుగానే గ్రహించాలి.
- సాధారణంగా పాత్రల సంభాషణల్లో వినిపించే ఆలోచనల్ని ఆ యా పాత్రల వ్యక్తిత్వానికీ సామాజికతకీ ఆపాదించి చూడటం పాఠ్య విమర్శలో పద్ధతే గానీ భిన్న సందర్భాల్లో కొందరి మాటల్లో రచయిత స్వచ్ఛందంగా ప్రతిధ్వనించాడు.
ఒక వుదాహరణ చూద్దాం :
“మమ్మల్ని గుళ్లలోకి పోనియ్యండి.”
“ఇళ్ళలోకి రానియ్యండి.”
“ఊరి మధ్యలో ఉండనియ్యండి – చాలు! వద్దు వద్దు అనినా మేము పైకి వస్తాము.”
అన్న ఏబు మాటల ద్వారా ఆర్థికాభివృద్ధి ఆత్మ గౌరవాల మధ్య ప్రాథమ్య సమస్య వచ్చినప్పుడు దళితులు ఆత్మగౌరవాన్నే కోరుకుంటున్నారనీ ఆర్ధిక అసమానత కన్నా సామాజిక అసమత్వమే యెక్కువగా బాధిస్తున్నదనీ రచయిత బలంగా ఆవిష్కరించాడు. ఈ సన్నివేశంలో మొగ్గగా వున్న పాత్ర నవల చివరికి వచ్చేసరికి పువ్వై పగలబడి విచ్చుకొంది.
నిజానికి యీ నవలలో రచయిత ఆశయాన్నో దృక్పథాన్నో పట్టుకోవడం అంత కష్టమైన పనేం కాదు. రచయిత మున్నుడి (నువ్వెవరు? నీ కథేమి?)లో తన గ్రామీణ వ్యవసాయ శూద్ర కుటుంబ నేపథ్యంతో పాటు మార్క్సిజం పరిజ్ఞానం కూడా నవల రాయడంలో తోడ్పడిందని స్వయంగా ప్రకటించాడు.
శంకర రెడ్డి ఈశ్వర రెడ్డి సుబ్బయ్య ల దోపిడీ స్వరూపాన్ని (వొకడు దొంగ కాటాకి పవిత్రతని జోడిస్తాడు, మరొకడు లిటిగేషన్ కి రాజకీయాల్ని తారుస్తాడు, యింకొకడు మనుషులమధ్య తంపులు పెడతాడు) ప్రత్యక్షంగా వర్ణిస్తూనే నాగేంద్రప్ప అవకాశవాద రాజకీయాలు, ఈడిగ రంగమ్మ వడ్డే లింగయ్యతో యేర్పరచుకున్న లైంగిక సంబంధం, నాగేంద్రప్ప కుటుంబం విడిపోయి వాటాలేసుకున్న సందర్భంలో తల్లిదండ్రుల పోషణ గురించిన అతని ఆలోచనలు, కూతురి కూలి డబ్బులకి ఆశపడి లింగయ్య ఆమెని అల్లుడి దగ్గరకి పంపకుండా ఆపడం, అతని కోడలు లారీ డ్రైవర్ తో వెళ్లిపోవడం, వొకే కులానికి చెందినప్పటికీ కట్న కానుకల కారణంగా చలపతి జయమ్మల ప్రేమ పెళ్ళిగా పరిణమించకపోవడం, తనపై అత్యాచారం చేసిన శంకర రెడ్డికే రాములమ్మ లొంగిపోవడం వంటి మానవ సంబంధాల్లోని అపసవ్యతలన్నిటికీ ఆర్థిక మూలాల్ని చూడగలిగాడు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకు దాసోహమైన వైనాన్ని సులువుగా ఆవిష్కరించగలిగాడు. యీ క్రమం అంతటా కులం యెంత బలీయంగా పనిచేస్తుందో సూక్ష్మంగా పసిగట్టగలిగాడు. ఫ్యూడల్ అణచివేత పద్ధతుల్ని సున్నితంగా ఆవిష్కరించగలిగాడు. దుడ్డు ఉన్నవాడిదే బర్రె తుపాకి ఉన్నవాడిదే రాజ్యం అని గ్రహించగలిగాడు.
***
పాఠక దృష్టికోణం నుంచి …
రచనకు రచయిత దృష్టికోణమే గాక పాఠకుల దృష్టికోణం వొకటి వుంటుంది. పాఠకుల ఆశయానికి అనుగుణంగా కథ దానిలో పాత్రలూ నడుస్తాయి. లేదా రచయిత నడుపుతాడు. కానీ యీ రచయిత ఆ వైపు చూడలేదు. పాఠకుల ఆశయానికి విరుద్ధంగా నవల్లో అనేక ఘటనలు చోటుచేసుకుంటాయి. బోయ నాగేంద్రప్ప వడ్డే లింగన్న యిద్దరిలో యెవరో వొకరు ధర్మం వైపు నిలబడతారనీ మాదిగవాడలో ఏబులాంటి వారెవరో సామాజిక దుర్నయం మీద తిరగబడతారనీ శంకరరెడ్డి లైంగిక దుర్మార్గానికి రాములమ్మ, రాజకీయార్థిక ఆధిపత్యానికి భీమప్ప లొంగిపోకపోతే బాగుండుననీ పాఠకుల సహజమైన ఆశ. మంచి గెలవాలనో చెడు వోడిపోవాలనో ఆశించడం తప్పు కాదు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నవల్లో యెక్కడా తిరగబడే పాత్రలు లేవు. అవసరార్థం అవకాశవాదులుగా మారిపోయేవాళ్ళు పోరాడకుండానే వోడిపోయేవాళ్ళు ప్రతిఘటించి రాజీ పడిపోయేవాళ్ళు పాఠకుల ఆశయానికి గండికొడతారు. పాత్రల్ని తెలుపు నలుపులుగా చూపడానికి రచయిత యిష్టపడలేదు. అందువల్ల ‘గడ్డలాడతండాయి’ యథాతథ స్థితిని మాత్రమే వర్ణించిన ఫిర్యాదు నవలే అని యెవరైనా భావించడానికి అవకాశం యేర్పడింది. కానీ వాళ్ళందర్నీ అలా రూపొందించిన అదృశ్య శక్తుల్ని యథాతథంగా దృశ్యమానం చేయడమే రచయిత వుద్దేశం అనీ సమాజంలో లేని చైతన్యం పాత్రలకి ఆపాదించడం శిల్పరీత్యా నేరంగా భావించాడనీ అర్థం చేసుకోవాలి. యథార్థత మరోలా వున్నప్పుడు అది రచనలో అసంభావ్యతని కోరుకోదు. లేని చలనాన్నిచిత్రించదు.
పల్లెల్లో సంఘటనలు జరగడానికి అవకాశాలు తక్కువ అని సామాజికవేత్తలు అంటారు. నిజమే. పట్టణాల్లో వున్నంత సామాజిక చలనం పల్లెల్లో కనిపించదు. అలా అని అసలు కదలికే వుండదు అనుకోరాదు. దాన్ని గుర్తించడానికి నిశితమైన చూపు అవసరం. పట్టణాల్లో చలనం వేగంగా వుంటుంది. సంక్లిష్టతతో కూడుకొని వుంటుంది. అక్కడ ప్రతి చలనం వ్యాపారంతో ముడివడి వుంటుంది. అది గ్రామాల్లోకి ప్రవేశించినప్పుడు మారే విలువల్ని అర్థం చేసుకోవడానికి విమర్శనాత్మక వైఖరి కావాలి (ఈ నవల్లో నాగేంద్రప్ప, నామిని ‘మూలింటామె’లో వసంత తెచ్చిన మార్పులు … పల్లెల్లో చోటుచేసుకునే విలువల విధ్వంసానికి కొత్త నిర్వచనాల్ని సమకూరుస్తాయి). అది స్వామిలో పుష్కలంగా వుంది.
***
పాఠ్యం ఆవరణ దాటి బయటికి అడుగేసి …
పాఠ్యం దానికదే స్వతంత్రం కాదు. యెన్నో ప్రభావాలకు లోనౌతుంది. లేదా ఆ యా ప్రభావాల్ని కొన్నిటిని ఐచ్ఛికంగా నిరాకరిస్తుంది. అందువల్ల పాఠ్యం అధ్యయనంలో దాని ఆవరణ బయటి విషయాలు కూడా పరిశీలనార్హాలే. వాటి వెలుగు పాఠ్యం మీద ప్రసరించక మానదు. వొకవేళ అలా జరగకుంటే అందుకు కారణాలు కూడా అన్వేషించాలి. పాఠ్యాన్ని అర్థం చేసుకోడానికి అది అదనపు వనరు అవుతుంది.
నవల్లో జయమ్మని మోసం చేసిన చలపతి వొక యన్జీవో వాలంటీర్. ఆ ఆర్గనైజేషన్ [రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ – ఆర్ డి టి] పేరు కూడా వొక సారి ప్రసక్తమైంది. కానీ విద్య వైద్య మహిళా సాధికారత వంటి రంగాల్లో దాని కార్యకలాపాల గురించి గానీ గ్రామంలో అది తెచ్చిన మార్పుల గురించిగానీ యెక్కడా విశదం కాలేదు. 1970 ల్లో స్పెయిన్ దేశస్తుడైన Ferrer స్థాపించిన యీ స్వచ్ఛంద సంస్థ రాయలసీమలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు పాపంపల్లిలోకి పెద్దగా చొచ్చుకొచ్చినట్టు కనపడలేదు. అందుకే వడ్డే లింగయ్య కోడలికి సరైన వైద్య సదుపాయం అందలేదు. కూలి కోసం భర్తతో బళ్లారి వెళ్ళినప్పుడు అక్కడ లారీ డ్రైవర్ తో వెళ్ళిపోడానికి అది కూడా వొక కారణమే. విద్యారంగంలో అట్టడుగు కులాలవారిలో అక్షరాస్యత పెంచడానికి ఆర్ డి టి చేసిన కృషి గ్రామాన్ని తాకినట్టులేదు. అలాగే ఏబు లాంటి వొకరిద్దరు దళిత కులాలకు చెందిన కొత్తతరం కుర్రాళ్ళు క్రిష్టియానిటీలోకి మారడం వెనక ట్రస్టు కార్యక్రమాల ప్రభావం వుండి వుండొచ్చు. వొకానొక సందర్భంలో ట్రస్టు మతమార్పిడిని ప్రోత్సహిస్తుందని దాని బాధ్యులపై దాడులు జరిగిన దాఖలాలు వున్నాయి. చలపతి లాంటి అనైతిక వర్తనులు వాలంటీర్లుగా వున్న స్వచ్చంద సంస్థలు యే మేరకు సమాజంలో సమూల పరివర్తనకి దోహదం చేయగలవు? అని పరోక్షంగా రచయిత హెచ్చరిస్తున్నాడేమో అన్న ఆలోచన కలుగుతుంది.
అలాగే కథా కాలంలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ గ్రూప్ రాజకీయాలు అనంతపురం జిల్లాలో క్రియాశీలంగానే వున్నాయి. నవల్లో పాపంపల్లికి నిత్య సంబంధంలో వున్న కళ్యాణదుర్గం ఆ రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపిన బండయ్య సొంతూరు. ‘సూర్యుడు మావోడు’గా ప్రసిద్ధి చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రైతుకూలి సంఘం, చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం కూడా పనిచేస్తున్నాయి. దాదాపు అదే కాలంలో అనంతపురంలో శేషయ్య మార్గదర్శకత్వంలో హక్కుల వుద్యమాలు, ఇమాం భూమన్ ఎఎన్ ల సాంస్కృతిక వుద్యమాల ‘కదలిక’లు బలమైన గొంతులకు నెలవుగా వున్నాయి. అయినా వీటి ప్రభావం యీ గ్రామం మీద పడలేదు. తెలంగాణలోలా విప్లవోద్యమ చైతన్యం యీ ప్రాంతం పల్లెల్లోకి విస్తృతంగా వ్యాపించలేదని అంగీకరించినా వీటిని పక్కనుంచినా పార్లమెంట్ ని పందులదొడ్డిగా అభివర్ణించిన తరిమెల నాగిరెడ్డి భావజాలంగానీ అంతకుముందు నుంచీ నీలం రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుల పార్లమెంటరీ వామపక్ష రాజకీయాలుగానీ నవల్లో ప్రస్తావనకి రాకపోవడం ఆశ్చర్యమే. విప్లవోద్యమ ప్రభావంలో ఘటనలు ఆ గ్రామంలో చోటుచేసుకుని వుండకపోవచ్చు గానీ రచయితగా స్వామి యీ నవల్లో కులం మీద పెట్టిన దృష్టి వర్గం మీద పెట్టలేదేమోనని అనిపిస్తుంది. యీ రాజకీయ చిత్రం ‘మీ రాజ్యం మీరేలండి’ కాన్వాస్ మీదికి యెక్కింది. బహుజన దృక్పథం వైపు, ప్రాంతీయ అస్తిత్వవాదం వైపు నడిచే స్వామి భవిష్యత్ సృజనకీ ఆచరణకీ బీజాలు యిక్కడే యీ నవల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి.
***
పాఠ్యం : మౌఖికత – భాషా శైలీ శిల్పాలు
‘గద్దలాడతండాయి’ని రాయలసీమ మాండలికం లో వచ్చిన తొలి నవలగా కొందరు భావించారు. కానీ అంతకు ముందే నామిని ‘మునికన్నడి సేద్యం’ వచ్చింది. అయితే స్వామి యీ నవల కోసం జానపద కథన రీతిని యెన్నుకొన్నాడు. కేశవరెడ్డి ‘మూగవాని పిల్లంగోవి’ లో కూడా యిటువంటి కథన శైలి కనిపిస్తుంది. కేశవరెడ్డి జానపద కథన శైలిని లిఖిత భాషా సంప్రదాయంలోకి తర్జుమా చేశాడు. స్వామి పాత్రల భాష (ఆ యా వర్గాలకు అనుగుణమైన పాత్రోచిత సంభాషణ శిల్పాన్ని పాటిస్తూనే) కథకుడి కథన భాష మొత్తం వుచ్చారణ పద్ధతులు, శబ్దగతమైన యాస పదాలపై వూనిక భావాల పొందికకి అనుగుణమైన వాక్యాల అల్లిక వాటి వ్యక్తీకరణ రీతులు, నుడికారాలు సామెతలు సంగతులు అన్నీ మౌఖిక భాషా సంప్రదాయానికి దగ్గరగా వుండేలా కఠినమైన నియమాన్ని పాటించాడు. యిది రచయిత అమ్మ వొడిలో నేర్చిన భాష. మాదిగ నల్లప్ప చిత్తయ్యల వంటి పల్లె ప్రజల బడిలో నేర్చిన భాష. కాళోజీ అన్నట్టు రచయితలు బడి పలుకులు వదిలి పలుకుబడులు స్వీకరించాలి. అప్పుడే రచన ప్రజాస్వామిక స్వభావాన్ని సంతరించుకుంటుంది. జానపద మౌఖిక కథన శైలిని స్వీకరిస్తూనే కొన్ని చోట్ల రచయిత గొంతు లిఖిత భాషా శైలిని సైతం ఆశ్రయిస్తుంది. ఆ యా సందర్భాల్లో కథనంలో మిశ్ర మౌఖికత లక్షణాలు గోచరిస్తాయి. దాన్ని అధిగమించడానికి రచయిత అలవోకగా కవితాత్మక అభివ్యక్తికి చేరువౌతాడు. నవల్లో అధ్యాయాలకు పేర్లు పెట్టడం దగ్గర్నుంచి యీ విషయాల్ని గమనించగలం (స్వామి మౌఖిక భాషా కథన శైలుల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు). నవలా రచనలో స్వామిది శుద్ధ దేశీ సంప్రదాయం. యితివృత్తం భాషా కథన రీతి అన్నీ దేశీయమే. మరింత గట్టిగా చెప్పాలంటే పక్కా లోకల్. నవలని లోకలైజ్ చేయడంలో స్వామి సిద్ధహస్తుడని అతని తొలి నవలే బలంగా నిరూపించింది. అది తర్వాతి రచనల్లో విశ్వరూపం ధరించింది. Discourse జోలికి పోని శుద్ధ Native Narrative యిది. స్వామి యీ నవలని చదివించడు; వినిపిస్తాడు. ఈ ప్రత్యేకతే చదువరిని రచనలో లీనమయ్యేలా చేస్తుంది.
***
యివ్వాళ యీ పాఠ్యం అవసరమా అంటే …
అవును అవసరమే. కింది మాటలు చూడండి :
వెంకటరెడ్డి(మల్లేశు చెనిక్కాయల దొంగతనంపై పంచాయితీ పెట్టినప్పుడు) :
‘చానా మితిమీరిపోతాండారు ఈ మాదిగ నాకొడుకులు బస్సెక్కితే మనతో సరిసమానంగా కూర్చుంటారు. సినిమాకి పొతే మన పక్కనే దొరలమాదిరి కూర్చుంటారు. మా నాయన కాలంలో వీళ్ళు ఊర్లో చెప్పులు ఏసుకుని నడుస్తాండ్లే.’
శంకరరెడ్డి భార్య భీమప్పతో (రాములమ్మపై శంకరరెడ్డి అత్యాచారానికి పాల్పడినప్పుడు):
‘మీ ఆడోల్లు పవిత్రంగా ఉండల్లంటే ఇంట్లోనే పెట్టుకోండిరా! సేన్లలోకీ, తోటల్లోకీ ఎందుకు పంపుతారు?’
గవర్నమెంట్ వుద్యోగి (ప్రభుత్వ అభివృద్ధి పథకాల గురించి చేసే సంభాషణలో :
‘వీళ్ళు ఇంతే సార్! గవర్నమెంటుకు బుద్ధిలేక వీళ్ళకోసం ఏవేవో స్కీములు పెడుతుందిగానీ వీళ్ళకు కష్టపడి కృషి చేసి అభివృద్ధిలోకి రావల్ల అనే ఆలోచన వీసమెత్తు కూడా ఉండదు. ఇంకా విత్తనాలూ, ఎరువులూ ఇవ్వండి. అమ్ముకొని తింటారు. సేద్యం చేసుకోమని ఎద్దులు ఇవ్వండి. కోసుకొని తింటారు. ఎద్దులని తినేవాళ్ళు వ్యవసాయం ఏం చేస్తారు, సార్!’
వెంకటేశులు (పై సందర్భంలోనే):
‘ఏ గవర్నమెంటు వచ్చినా ఈ మాదిగ నా కొడుకులకే చేస్తుంది.’
ఎస్సై ఈశ్వరరెడ్డి తో (మాదిగ మల్లేశుకి గుండుకొట్టించి సున్నంబొట్లు పెట్టించి, గాడిదమీద వూరేగించిన విషయమై ఎంక్వయిరీకి వచ్చినప్పుడు) :
‘ఎందుకన్నా మంచిది ! వాని గుండుకు వెంట్రుకలు పెరిగేవరకూ …’
ఆనాటి కారంచేడు చుండూరుల దగ్గర్నుంచి నిన్నటి లక్షింపేట నేటి హథ్రాస్ వరకు దళితులపట్ల బలిసిన కులాల వారి ఆలోచనల్లో అణచివేత విధానాల్లో వారితో మిలాఖతై వత్తాసుగా నిలిచే రాజ్య స్వభావంలో మార్పు లేకపోవడం చూస్తే యీ నవల ప్రాసంగికత అర్థమౌతుంది.
***
వొక సాధారణ పాఠకుడిగా …
నేను యీ నవల్లోని యే పాత్రతోనూ తాదాత్మ్యం చెందలేదు. అలా అన్జెప్పి జరిగిన సంఘటనలతో పూర్తిగా తాటస్థ్యాన్నీ పాటించలేదు. నిజానికి పాటించలేకపోయాను. అదొక విచిత్రమైన స్థితి. పాఠకుడిగా ఆ యా పాత్రలతో/వ్యక్తులతో యేకకాలంలో దూరంగానూ దగ్గరగానూ వుండటం గమ్మత్తైన అనుభూతి. వాళ్ళలో కొందరిని నేను గుండె లోతులనుంచి ద్వేషించాను. మరి కొందర్ని ప్రేమించాను. కొందరి పట్ల అసహ్యం కలిగింది. కొందరి విషయంలో సానుభూతి యేర్పడింది. అందుకే కొన్ని సన్నివేశాల్లో లీనమయ్యాను. చాలా సార్లు యిదీ అని తెలీని వుద్వేగానికి గురయ్యాను. నీళ్ళకోసం అలమటించే సీమ రైతులతో నేను మాటకలిపాను. పాలకుల నీటి రాజకీయాల పట్ల క్రుద్ధుణ్ణయ్యాను. భర్తపోయి రెడ్డి చేతిలో చిక్కిన నిస్సహాయురాలు బోయ రాములమ్మతోపాటు విలపించాను. ఎర్రటి నిప్పు లాంటి భీమప్ప నల్లని బొగ్గులా మారిన విషాదం చూసి కుంగిపోయాను. కులం కారణంగా సవర్ణుల చేతిలో అవమానాల పాలైన మల్లేశు భార్య మాదిగ కొల్లమ్మతో కలిసి దుఖించాను. అదే సందర్భంగా తప్పుచేసిన మొగుణ్ణి కాపాడేదానికి కులం బలంతో మచ్చుకత్తితో నిలబడ్డ శంకర్రెడ్డి భార్యని చూసి విస్తుపోయాను. కడుపు నొప్పితో వొక పక్క, ఆ కారణంగానే కూలికి పోలేక అత్తా మామా భర్తల సూటిపోటు మాటలతో మరోపక్క విలవిల్లాడిన వడ్డె గౌరమ్మ బాధతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఏబు హనుమంతులతో కలిసి పగలబడి నవ్వాను. చదువుకోకపోతే బతకలేరని పిల్లల్ని బడికి పంపమని మల్లేశుని బతిమలాడే అయ్యవారి ఆత్మఘోషలో మాత్రం అసంకల్పగానే సంలీనమయ్యాను (ఈ అయ్యవారు వూరి ఘటనలకి ప్రత్యక్ష సాక్షి. రచయిత స్వామి కూడా ఆ యా సందర్భాల్లో ఆ టీచర్లో పరకాయ ప్రవేశం చేశాడేమో!).
నేనిలా స్పందించడానికి కారణం నా సామాజిక వ్యక్తిత్వం నుంచి నిర్మితమైన ప్రాపంచిక స్పృహ కావొచ్చు. నే చదివిన, అనుభవించిన జీవితం యిచ్చిన యెరుక కావొచ్చు. నా ఆత్మిక ధర్మమే కావొచ్చు (యే ప్రభావాలూ లేకుండా అది సహజంగా స్వతంత్రంగా యేర్పడుతుందా?).
***
చివరిగా – ముగింపు లేని అన్వేషణ లో …
వొక మనిషికి అనేక అస్తిత్వాలు (చానాళ్ళ కింద రచయిత స్వామి అస్తిత్వాన్నే వుపాధి అని ప్రతిపాదించాడు) వున్నట్టే వొక పాఠ్యానికి నానార్థాలుంటాయి. యిదీ దీని అసలు తత్త్వం అని చేసే అంతిమ నిర్ణయాలు నిర్ధారణలు సత్యావిష్కరణకి ఆటంకాలే.
అనేక సత్యాల్లో యేది అసలు సత్యమన్న మరో ప్రశ్న మోసుకుంటూ,
వస్తు రూప దృక్పథాల పరంగా యీ పాఠ్యానికి మరికొన్ని కొనసాగింపులు కూడా వుంటాయన్న నిశ్చయమైన యెరుకతో – సెలవ్.
యీ నాలుగు మాటలూ మీ ముందు ప్రస్తావించడానికి అవకాశమిచ్చిన నా అభిమాన రచయిత బండి నారాయణ స్వామికి యెనలేని మప్పిదాలతో … అంతులేని నెనరుతో …
స్థల కాలాల స్పృహకోల్పోయిన కరోనా గృహ నిర్బంధం నుంచి
*
Add comment