‘ జలగీతం’ కావ్యం రాయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది?
1995 లోనే నీటిని ఒక వస్తువుగా తీసుకుని దీర్ఘ కవిత రాయలనుకున్నాను. అప్పటినుంచి జలంపైన దేశ విదేశాల సాహిత్యాన్ని చదువుతూ పోయాను. మధ్యలో వి.సి. పదవి(1999-2002) రావడం వల్ల అది కొంత ఆగిపోయింది. పదవి ముగియగానే నా లౌకిక ధూళిని కడుక్కోవడానికి ఈ కావ్య రచనకు పూనుకున్నాను. మా నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ పెనుభూతం వల్ల కలిగిన విధ్వంసం తొలి ప్రేరణ. అలాగే మా ఇంట్లో చేదబావి ఉండేది కాదు. నేను మా అమ్మ నీళ్ళు చేదుకుని బిందెలు మోసుకురావడంలో నాకు నీటి విలువ తెలిసింది..
ఈ కావ్యరచనా నిర్వహణలో మీరు చేసిన పరిశోధన, ప్రణాళికల గురించి తెలియచేస్తారా?
ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. భూగోళం మీదికి నీరు వచ్చినదగ్గరనుంచి దాని నిర్వహణ, నీటి కరువు వగైరాల గురించి అప్పటికే ఒక ఆలోచన ఉంది. ఒక రకంగా ఇది నా ఆరేళ్ళ అధ్యయన కృషి ఫలితం.
దీర్ఘకావ్య రచనలో అనుసరించవలసిన పద్ధతులు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా.
అసలు దీర్ఘకవిత అనే మాటే ఒక వైరుధ్యం. దీర్ఘమైతే కవిత్వముండదు. కవిత్వముండాలంటే దీర్ఘత పనికి రాదు అని ఆంగ్లకవి ‘ఎడ్గార్ ఎలన్ పో ‘ అన్నాడు. నా జలగీతాన్ని నా ముఖత: ప్రత్యక్షంగా విన్న మహాకవి సినారె ‘ఈ కావ్యంలో మొదటి వాక్యంతో మొదలైన ఉద్వేగస్థాయి అట్లాగే కొనసాగి రెండువేల లైన్ల దాకా ప్రవహించింది. దీనిలోని కవితా శక్తికి (poetic energy) నిదర్శనం’ అన్నారు.
‘ జలగీతం ’ కావ్యం ద్వారా మీరు చెప్పదల్చుకున్న ప్రధాన విషయం ఏమిటి?
నీరు ఎంత విలువైందో చెప్పదల్చుకున్నా. ఇప్పుడు నడుస్తున్నవాటిలో చాలావరకు నీటి రాజకీయాలే. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే రేపు జరిగేవన్ని నీటి యుద్ధాలే. జనావళిని ఈ ఎరుకలోనికి జాగృతపరచడమే ఈ కావ్యo ఉద్దేశం.
జల గీతం 12 భాషల్లోకి అనువాదమవ్వడం గొప్ప విషయం. ఆయా భాషా ప్రాంతాల్లో పాఠకుల స్పందనలు ఏ విధంగా ఉన్నాయి?
పన్నెండు భాషల్లోనే కాదు. ఇంకా ఇతర భాషల్లో కూడా వివిధ దశల్లో ఉన్నాయి. జలం భాషా పరిమితుల్ని దాటి ప్రవహిస్తూనే ఉంది. ముందుగా హిందీలో వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాణిక్యాంబ చాలా కష్టపడి చేశారు. ప్రముఖ హిందీ విమర్శకుడు విశ్వనాథ్ తివారి జలగీతాన్ని గొప్ప కావ్యంగా అభివర్ణించారు. హిందీఅనువాదానికి భారత కేంద్ర ప్రభుత్వంనుండి లక్ష రూపాయల పురస్కారం కూడా లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి నుండి కూడా అనువాద పురస్కారం వచ్చింది. ప్రముఖ హిందీకవి కేదారనాథసింగ్ దీనిని ఎంతో కొనియాడారు. ఈ కావ్యం water man రాజస్తాన్ కు నీళ్ళిచ్చిన రామన్ మెగసెసే అవార్డ్ గ్రహిత రాజేంద్ర సింగ్ కు అంకితమివ్వబడింది. ఆయన నన్ను ‘జలకవివర్ ’ అని సంబోధించడం ఒక అనుభూతి.
అలాగే రమణిక్ సోమేశ్వర్ అనే ప్రముఖ కవి దీనిని గుజరాతీలోకి తీసుకెళ్ళాడు. జలగీతంలోని 27 అధ్యాయాలు 27 గుజరాతీ సాహిత్య పత్రికల్లో ప్రచురించబడి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. గుజరాతీ అనువాదానికి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. అలాగే ప్రొఫెసర్లు అల్లాడి ఉమా, ఎం శ్రీధర్ లు చేసిన ఆంగ్లానువాదం జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎందరినో ఆకర్షించింది. అదేవిధంగా ఉర్దూ ప్రొఫెసర్ (రహమత్ యుసుఫ్ జాయ్), మలయాళం (ఎల్ ఆర్ స్వామి), కన్నడం (మార్కండాపురం శ్రీనివాస), పంజాబీ (స్వరణ్ జిత్ సవి), మరాఠి (నిరంజన్ ఉజ్ గర్), పర్షియన్ (అజీజుద్దీన్ అహమద్ ఉస్మానీ), ఇటీవలే సంస్కృతం (ఎం నారాయణ శర్మ), ఒడియా (బెంగాలీ నందా) లోకి వెళ్లింది. ఆశ్చర్యమేమిటంటే గిరిజన భాషైన బంజారాలోకి కృష్ణనాయక్ అనే కవి అనువదించారు. తమిళంలో అచ్చులో ఉంది. ఇది పూర్తయితే దక్షిణభారతభాషలన్నింటిలోకి వచ్చినట్టుగా ఉంటుంది.
తెలుగు జల గీతంలోని విషయ తీవ్రత, కవితాసాంద్రత అనువాదాల్లో ప్రతిఫలించిందా?
అనువాదంలో కొంత తరుగు ఉంటుంది కాని నువ్వంటున్నట్టు భావతీక్షణత వల్ల అది కొంత కమ్ముకపోతుంది. నేను జలగీతం అనువాదకులందరితో వందలాది గంటలు కూర్చున్నా. అదృష్టవశాత్తు అది వీలయ్యింది. ఆయా అనువాదకులతో అనువాద సమస్యలపైన నా అనుభవాల గురించి రాస్తే అదే ఒక పుస్తకమౌవుతుంది. “నేనూ నా అనువాదకులు” అనే ఎప్పటికైనా రాస్తానేమో!
జలగీతం కావ్యం పలు యూనివర్సిటీల్లో సైతం పాఠ్యాంశంగా నిర్ణయించారు. కదా. దశాబ్దాల బోధనానుభవం వున్న మీరు ఈ కావ్యాన్ని ఏ పద్ధతిలో బోధిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?
జలగీతం మొదట రాజేందర్ సింగ్ రాజస్తాన్ లో నడిపే ‘జల్ బిరాదరీ’ ఇన్సిట్యూట్ లో నీటి శిక్షకుల కోసం పాఠ్య గ్రంథంగా బోధిస్తున్నారు(హిందీలో). గుజరాత్ లోని భుజ్ యూనివర్సిటీలో ఏం. ఫిల్ స్థాయిలో పాఠ్యగ్రంథంగా ఉంది. అలాగే వార్ధా యూనివర్సిటీలోకూడా పాఠ్యగ్రంథంగా బోధిస్తున్నారు. అంతేకాక కాకతీయ, ఉస్మానియా, శ్రీకృష్ణదేవరాయ, తెలంగాణ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంటర్మడియట్ స్థాయిలో ఒక పాఠ్యాంశంగా చేర్చబడింది. ఆయా భాషల్లో ఏం.ఫిల్, పి.హెచ్ డి లు జరుగుతున్నాయి.
ఇక బోధన విషయానికొస్తే జలమే ఒక ప్రవాహంలాగా అధ్యాపకున్ని ముందుకు తీసుకెళుతుంది.
జలగీతం కావ్యం ఇంతగా పాఠకాదరణ పొందుతుందని మీరు ఊహించారా? పొందడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా.
‘ జలగీతం ’ ఆవిష్కరణ రోజే నాకు అర్ధమయింది. కారణం: వస్తువు నీరు కావడం ఒకటి. రెండవది నేను దానికి అభివ్యక్తిని సమకూర్చిన పద్ధతి. ఇప్పుడు అందరికీ జలప్రాధాన్యత అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈ కావ్యాన్ని ప్రేమించడం సులభమవుతుంది.
సమాజంలో జల చైతన్యం ఏమైనా పెరిగిందా? జలానికున్న ప్రాధాన్యాన్ని గుర్తించారా?
జలసామాజిక వేత్తలు అక్కడక్కడ దీని పఠన శిబిరాలను ఏర్పరచడం నాదృష్టికి వచ్చింది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఔత్సాహికులకు ఇది కొంత ఉత్తేజం కలిగించిందని నాకనిపించింది.
ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా ఎలా రాయగలుగుతున్నారు. రహస్యం ఏమైనా ఉందా? 23 కవితా సంపుటాలు వెలువరించారు. ఈ అనుభవంతో కవిత్వంలో వచ్చిన పరిణామాలను వివరిస్తారా?
నేను ప్రధానంగా వస్తుత: కవిని. ఇతరేతరమైన అకడమిక్ పాలనారంగాల్లో మునిగితేలినా అవి నా కవితావేశాన్ని తగ్గించలేకపోయాయి. యాభైకి పైగా గ్రంథాలు వెలువరించినా సంఖ్యా ప్రసిద్ధికంటే సారాంశసిద్ధే నాకు ముఖ్యం. వీటివల్ల ఇరవైమూడు కవితా సంపుటాలతో పాటు, పరిశోధన, విమర్శ, యాత్రా చరిత్ర, అనువాదగ్రంథాలు, వ్యాఖ్యానాలు, శీర్షికారచనలు, వాచకాలు మొదలైనవి ఉన్నాయి.
కవిత్వంలో గత మూడున్నర దశాబ్దాలుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విప్లవకవిత్వ ప్రాబల్యం తగ్గి అస్తిత్వ ధోరణులు కొనసాగుతున్నాయి. వెరసి ఒక విశాలమైన మానవీయ ఆవరణ వైపు ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచీకరణ భూతానికి వ్యతిరేకంగా ఒక అలజడిని ప్రకటిస్తున్నాయి. అయితే అది కూడా ఈ మధ్య సడలి అమెరెకీకరణవైపు కదులుతున్నట్టు తోస్తున్నది.
మీరు‘వృద్ధోపనిషత్ ’ అనే కావ్యాన్ని రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ విశేషాలు తెలియజేస్తారా?
2011 నుండి వృద్ధాప్యంపైన కవిత్వం రాయాలనుకున్నాను. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న చాలా సాహిత్యాన్ని చదివాను. వృద్ధాప్యం అనివార్యమే అయినా వృద్ధులు నిరాశలోకి క్రుంగిపోకుండా ఉండే వాతావరణకల్పన దీనిలో జరిగింది. అలాగే యువతకు వృద్దులు ఎంత విలువైనవారో చెప్పి, వారిపట్ల కొంత concern కలిగి ఉండాలని ఉద్దేశం. అయితే ఈ కావ్యంలో నీతి ప్రబోధం ఉండదు. జీవన పరిస్థితుల వర్ణన ఉంటుంది. మానవత్వాన్ని గుర్తుచేసే దిశగా సాగుతుంది.
నేడు వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి, కొత్తగా రాస్తున్న యువకవులకు ఏమైనా సూచనలు ఇస్తారా?
బాగా రాస్తున్నారు. కాకపోతే మరింత అధ్యయనం అవసరం. ఏది రాసినా జీవితానుభవంలోంచి వస్తే, దానికి నిజాయితి తోడైతే, కృషి దానిలో వెలుగును నింపితే, ఏ కవిత్వమైనా పాఠక హృదయగమ్యంగా సాగుతుంది.
*
కావ్యాలు ఎంత పరిశ్రమ, స్వానుభవం తో జన్మిస్తాయో అంత ఎరుక, మమేకత్త్వంతో పదుగురిలోకి ప్రయాణిస్తాయి… పీఠభూమి అయిన హైదరాబాదు, కరవు జిల్లా అనంతపురంలో ఈ నీటి ఎద్దడి మహా కష్టం… పాలకులకు అర్ధంకానిది, స్త్రీల జీవితం సగంముప్పావు ఆ నీటికోసం పడే ఆరాటమే… మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జలకవి గారికి నమస్సులు…
మంచి సంభాషణ .రఘు సార్ కు ధన్యవాదాలు.నేనూ జలగీతంలో భాగమయ్యాను.సంస్కృతంలోకి అనువాదం చేయడం ఒకటి.చిన్న లఘు విమర్శ రాయడం మరొకటి.ఈ రెండూ ఈ మధ్యే ఆవిష్కరణ కూడా అయ్యాయి.
జలగీతం..ఈ కాలానికి బాగా అవసరమైన కావ్యం.ఈ అనువాదాన్ని పరిష్కరణకోసం కొంత మంది పండితులకు వినిపించాను.ఆసందర్భంలో రాజేందర్ సింగ్ గారి గురించి చర్చ వచ్చినప్పుడు ఆయన ఫోటోను కళ్ళకద్దుకున్నవాళ్లే ఎక్కువ.ఆయన ఐదు నదులు బతికించారనే అంశంపై ఒక భాగం ఉంటుంది ఇందులో..
ఆ సందర్భం నాకైతే గొప్పగా ఉంటుంది తలుచుకుంటే.
ఫ్లోరోసిస్ వ్యాధికి గురైన వారి బాధను చదివినప్పుడూ కుర్చీలో వెనక్కి చేరగిలబడిన వాళ్లూ గుర్తున్నారు.
దీని తరవాత కూడా ప్రకృతి ముఖ్యంగా నీటిపై మూడు దీర్ఘకవితలు వచ్చాయి.
బాగుంది సార్ ….
జలగీతం 12 భాషలలోకి అనువదించబడటం గొప్ప విషయం.సర్ చెప్పినట్లు జలం భాషా పరిమితులను దాటి ప్రవహిస్తోంది!శర్మ సర్ సంస్కృతానువాద పుస్తకావిష్కరణ రోజే ఈ బుక్ తీసుకోవాలనుకున్నాను. మాకు దగ్గర బుక్ షాప్ లో దొరకలేదు. మీ ఇంటర్వ్యూ చదివాక మళ్ళీ పుస్తకం తెచ్చుకుని చదవాలనే ఆసక్తి కలిగింది. గోపి సర్ కి మీకు అభినందనలు
చాలామంచి సంభాషణ..రఘు సర్ అడిగిన ప్రశ్నలు..దానికి గోపీగారు విస్తారంగా ఇచ్చిన సమాధానాలు బాగున్నయ్!!
నిజమే… జలగీతంలోని కవితా పంక్తులు ఆద్యాంతం పాఠకుడిని చైతన్య పరుస్తూనే ఉంటాయి. ఒక గొప్ప కావ్యం జలగీతం.
జలగీతం ఆవిష్కరణా మూలాలు గోపీ సార్ ద్వారా రాబట్టడం బాగుంది. ఆసక్తికరమైన ఇంటర్వ్యూ అందించినందుకు రఘు సార్ కు కృతజ్ఞతలు…
-నర్రా
శుభాకాంక్షలు డా.రఘు సర్, చాల బాగుంది గోపి గారి ఇంటర్వ్యూ. అయితే దీర్ఘకవిత లక్షణాలను కాసింత వివరంగా రాబడితే బాగుండేదేమో కొత్తవారికి ఉపకరించేది. మరిన్ని ఇంటర్వ్యూలు మీ నుంచి కోరుతూ….
విశ్వ రహస్యాలని దాచుకున్న నీటి మనసును ఒడిసిపట్టి అద్భుతమైన ఒక దీర్ఘ కావ్యంగా మలచిన ఆచార్య గోపీ సార్ గారికి, చక్కని ఇంటర్వ్యూ తో కవి అంతరంగాన్ని ఆవిష్కరించిన డా.రఘు గారికి అభివాదాలు..🙏