తెలంగాణ మలిదశ ఉద్యమ అవసరాలను ముందే గుర్తించి అందుకు అనుగుణంగా సాహిత్య నిర్మాణం చేసిన తొలి కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు కాసుల ప్రతాపరెడ్డి. మీరు అనార్కిస్టా ? మార్క్సిస్టా ? ఆధునికాంతరవాదా ? అని అడుగుతే నేనేమిటో నాకే తెలియదు ఎవరు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పే ప్రతాపరెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో ‘గుక్క’ తిప్పుకోకుండా ఎలా వైరుధ్యాల మధ్య సమన్వయాన్ని సాధించింరో ఈ ఇంటర్యూలో చదవండి:
ప్రశ్న : తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు రాసినంత కవిత్వం అంతకు ముందు ఎందుకు రాయలేదు ?
జవాబు : అంతకు ముందు వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు నా స్వీయ అనుభవాలు కాదు. నాకు అనుభవంలో లేనిది నేను రాయలేను. అయినప్పటికీ అస్తిత్వ ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించిన. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం నా స్వీయ అనుభవం. అందులోనూ నా భావోద్వేగ ప్రకటనకు కవిత్వం బలంగా పనికి వచ్చింది అంటే, ఒక రకంగా ఆత్మాశ్రయ కవిత్వం. అదే క్రమంలో సార్వజనీనతను సంతరించుకునే స్థాయికి నా కవిత్వం వెళ్ళింది. ఒక విధంగా చెప్పాలంటే నా సాహిత్యం మొత్తం నిబద్దత నుంచి నిమగ్నతకు ప్రయాణం చేసింది.
ప్రశ్న : ఆత్మాశ్రయ కవిత్వం సార్వజనీనతను ఎట్లా సంతరించుకుంది అని మీరు భావిస్తున్నారు ?
జవాబు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు నాలాంటి భాదలే తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నరు. కనుక నా అనుభవాలే తమవిగా స్వీకరించగలిగే స్థితి ఆ సమాజానికి ఉంది. తెలంగాణ పదాలతో ఒక కొత్త అభివ్యక్తిని రూపొందించుకొని నా కవిత్వం ప్రజల ముందుకొచ్చింది. అందువల్ల నేను కవిత్వం తక్కువ రాసినప్పటికీ నా వ్యక్తీకరణలో ఉన్న కొత్త డిక్షన్ వల్ల నా కవిత్వ పాదాలు నినాదాలుగా మారి తెలంగాణ గోడలు ప్రజల గొంతులైనవి. వస్తువు, కవిత్వ నిర్మాణ శైలి కూడా ఇక్కడ మారింది. తెలంగాణలోని వైరుధ్యాలని ఏక రూపంగా వ్యక్తపరచ గలిగాను.
ప్రశ్న : తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమాలు బలంగా నడుస్తున్న కాలంలో సహజంగా అందరూ కవిత్వం వైపు మొగ్గు చూపితే మీరు కథా ప్రక్రియను ఎందుకు ఎంచుకున్నారు ?
జవాబు : నేను సాహిత్య రంగంలో ప్రవేశించే నాటికే కవిత్వం ఎక్కువగా వస్తున్నది. ఆకాలంలో వచ్చిన ఉద్యమ కథలు, నవలలు పఠనయోగ్యం కావనే అభిప్రాయం బలంగా ఉండేది. ఆ రచనలను చదవటానికి నిబద్ధత అవసరమనే ఒక అభిప్రాయం కూడా కొంతమంది బలంగా వ్యక్తపరిచారు. అదే సమయంలో నేను సామాన్య పాఠకులు చదివే నవలా సాహిత్యం పై పరిశోధన ప్రారంభించాను. ‘ తెలుగు నవలా వ్యాపార ధోరణి’ అనే అంశంపై Mphil పరిశోధన చేశాను. సామాజిక ప్రయోజనం లేని ఈ రచనలు సామాన్య పాఠకుల్లోకి విరివిగా చొచ్చుకు పోవటం నేను చూశాను. అందువల్ల సామాజిక ప్రయోజనం ఆశించే వచన ప్రక్రియకు రీడబిలిటీ సాధించడానికి ప్రయోగాత్మకంగా నేను కథా ప్రక్రియను ప్రధానంగా ఎంచుకున్నాను.
ప్రశ్న : మీ కథల ప్రత్యేకత ఏమిటి ? అప్పటి ప్రయోజనాత్మక కథలకు భిన్నంగా మీరు పాఠకుల దగ్గరికి ఎలా చేరుకోగలిగారు ?
జవాబు : తెలంగాణలో నాటి ఉద్యమ రచయితలు తమవి కాని జీవితాలను చిత్రీకరిస్తూ వచ్చారు. పేద రైతుల, రైతు కూలీల సమస్యలను ఎంచుకొని తమ కథల్లో చిత్రిస్తూ వచ్చారు. అయితే ఆ రచనలు ఎవరికోసమైతే ఉద్దేశించి వచ్చినవో వారికి చేరే అవకాశం లేదు. ఒక వర్గ శత్రువును ఎంచుకొని ఆ వర్గ శత్రువుతో పోరాటాన్ని చిత్రించి విజయం సాధించే కథలు విరివిగా వచ్చాయి. మొదట్లో నేను రాయడానికి పూనుకున్నప్పుడు చాలా మంది రాసిన కథల్నే నేను ఎందుకు రాయాలనే ప్రశ్న ఉదయించింది. ప్రగతిశీల దృక్పధాన్ని వ్యక్తం చేయడానికి స్వీయ అనుభవాల్లోంచి, చూసిన వాటి నుంచి, విన్న వాటి నుంచి వస్తువును ఎన్నుకొని రాసాను. శిల్పంలో సంక్లిష్టత లేకుండా చూసుకున్న. దానివల్ల తెలంగాణలో వచ్చిన కథా సాహిత్యంలో నా కథలు ప్రత్యేకంగా నిలబడినవి. నా కథలు సాధారణ పాఠకులకు చేరిన అనుభవాలు కూడా నాకు ఉన్నవి. నా ఎల్లమ్మ కథా సంపుటిలోని కథలు చదివితే ఈ విషయం మీకు బోధపడుతుంది.
ప్రశ్న : తెలంగాణలో వచ్చిన ఉద్యమాల నేపథ్యంలో వెలువడిన సాహిత్య పరిణామ క్రమాన్ని మీ ‘ తెలంగాణ సాహిత్యోద్యమాలు’ గ్రంధం సమగ్రంగా రికార్డు చేసిందా ?
జవాబు : గత ముప్పై ఏళ్ల కాలంలో తెలంగాణలో వెలువడిన సాహిత్యాన్నంతటిని నేను పరిశీలిస్తూ వచ్చాను. విప్లవోద్యమ సాహిత్యంతో పాటు అస్తిత్వ ఉద్యమాల సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాను. నిజానికి నేను సృజనాత్మక సాహిత్యాన్ని అవసరం కొద్ది విమర్శనాత్మక దృష్టితో వ్యాస రూపంలో రాస్తూ వచ్చాను. ఆ వ్యాసాలను అన్నింటినీ ఒక క్రమపద్ధతిన పేర్చి ఈ గ్రంథాన్ని వెలువరించాను. తెలంగాణలో వచ్చిన ఉద్యమ సాహిత్య పరిణామ క్రమాన్ని స్థూలంగా ఈ గ్రంథం వ్యక్తీకరిస్తుంది. కవిత్వం, కథ, నవల, విమర్శ తెలంగాణలో ఎలా ఎదుగుతూ వచ్చిందో తెలుసుకోవడానికి, అందులోని నూతన వ్యక్తీకరణలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. సమగ్రమైన తెలంగాణ సాహిత్యోద్యమాల పరిణామక్రమాన్ని విశ్లేషించాలనుకునే వారికి ఈ గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది. ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియను సమగ్రంగా విశ్లేషించడానికి ఒక అధ్యయన పద్ధతిని ఇది తెలియజేస్తుంది.
ప్రశ్న : మీ తెలంగాణ సాహిత్యోద్యమాలు పుస్తకం చదువుతే మీరు భౌగోళిక తెలంగాణకు మించి మరేదో ప్రయోజనాన్ని ఆశించి నట్టు అనిపిస్తుంది. అది ఏమిటి
జవాబు : నేను తొలుత భౌగోళిక తెలంగాణకు మాత్రమే పరిమితమై మాట్లాడినట్లు కనిపిస్తుంది కానీ ‘ భౌగోళిక సందర్భం’ అనే పుస్తకంలోని వ్యాసాలు ఆ రకంగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నేను కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాను. స్థిరాభిప్రాయాన్ని నిశ్చల నిశ్చితాలు నెగేట్ చేయడానికి నేను అలా చేశాను. తెలంగాణలోని రాజకీయాలను, సాహిత్యాన్ని, సంస్కృతిని కలగలుపుతూ సమీకృతం చేస్తూ అంటే సాహిత్యం నుంచి రాజకీయాలను, రాజకీయాలనుంచి సాహిత్యాన్ని అందులో భాగంగా సంస్కృతిని ఏక మొత్తంగా వ్యక్తీకరిస్తూ ఆ వ్యాసాలు రాశాను. అందుకే సాహిత్యంలో ఇటువంటి విశ్లేషణ పద్ధతిని ఇప్పటి వరకు తాను చూడలేదని బి. నర్సింగరావు మెచ్చుకున్నారు. అలా వ్యక్తీకరించే క్రమంలో భౌగోళిక తెలంగాణ కోసం సిద్దాంత వైరుధ్యాలను, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన నేపథ్యంలో తెలంగాణ సాహిత్యానికి ఉద్యమానికి ప్రగతిశీల ప్రత్యామ్నాయం చూపడానికి తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం పనికి వస్తుందని చెప్పాను. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి స్థానీయత పనిముట్టు అవుతుందని భావించాను. అందుకే తెలంగాణ ప్రాంతీయ సాహిత్యానికి ప్రాపంచిక దృక్పథం ఉందని విశ్వసించాను. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం భౌగోళిక తెలంగాణ సాధనకు మాత్రమే పరిమితం కాదని, కాకూడదని నమ్మాను. అయితే భౌగోళిక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రగతిశీల మేధావులు, కార్యకర్తలు రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముందుకు సాగలేక పోయారు. దీనికి తోడు ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో విఫలమయ్యారు. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల వైఫల్యాన్ని విశ్లేషిస్తూ తెలంగాణ ఉద్యమం- ఆత్మావలోకనం అనే వ్యాసం రాసాను. (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు – పేజీ నెంబర్ 197).
ప్రశ్న : బ్రిటిష్ ఆంధ్ర నైజాం ఆంధ్ర మధ్య జరిగిన తెలుగు సాహిత్య పరిణామక్రమాలు భిన్నంగా ఉన్నాయని వాదిస్తూ వచ్చారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు ?
జవాబు : బ్రిటిష్ ఆంధ్రులకు మేము భిన్నమని చెప్పడం ఉద్యమ కాలంలో ఒక అనివార్యత. రెండు సమాజాలు ఒకటి కాదని, సామాజిక పరిణామక్రమంలో తేడాలున్నాయని గ్రహింపునకు వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్యాన్ని ఎలా చూడాలనే ప్రశ్న ఉదయించింది. కేవలం సాహిత్యంలోనే కాకుండా అన్ని రంగాల్లోను భిన్నమని చెప్పడానికి అనుసరించాల్సిన అధ్యయన పద్దతులు ఏమిటనే ప్రశ్న కూడా ఎదురయ్యింది. ఈ పరిస్థితుల్లోనే నేను నా సంపాదకత్వంలో “తెలంగాణ తోవలు” (2001) అనే వ్యాస సంకలనాన్ని వెలువరించాను. తెలంగాణకు చెందిన 18 మంది రచయితలు ఆ భిన్నత్వం ఏమిటో దాన్ని ఎలా విశ్లేషించాలో తెలంగాణ విషయాలను, ఉనికిని చాటుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటో వివరించారు. ఈ సంకలనంలోని వివిధ ఉద్యమాల సాహిత్యం తెలంగాణలో ఒక రకంగానూ, ఆంధ్రలో మరో రకంగానూ వ్యక్తమైన తీరును ‘వాళ్ళూ – మనమూ’ అనే వ్యాసంలో (పేజీ నెంబర్ 58) తులనాత్మకంగా పరిశీలించాను. ఈ పుస్తకం అప్పట్లో ఒక సంచలనం. తెలంగాణ ఉద్యమకారులకు ఒక చైతన్య దీపిక. అస్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఈ పుస్తకం దారి చూపింది.
ప్రశ్న : సాహిత్యంలోనే కాకుండా వర్తమాన రాజకీయాల్లో తెలంగాణ దృష్టి కోణంతో విశ్లేషణలో కూడా మీరు కృషి చేశారు. ఆ కృషి ఎలాంటిదో ఒకసారి వివరించండి ?
జవాబు : తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైన దశలో ఆంధ్ర పాలక వర్గాలు చేస్తున్న వాదనలను తిప్పి కొట్టడానికి, ప్రతి వాదనలు చేయడానికి వీలుగా నేను India info.com అనే ఆన్ లైన్ పత్రికలో కె.నిశాంత్ పేరు మీద ఒక కాలమ్ నిర్వహించాను. ఆంధ్ర పాలక వర్గాల అభిప్రాయాలను తిప్పికొట్టడానికి తెలంగాణ NRI లు ఆ వ్యాసాలను విరివిగా వాడుకున్నారు. ఆ వ్యాసాల సంకలనమే “భౌగోళిక సందర్భం” (2001) పుస్తకంగా వెలువడింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఆంధ్ర పాలక వర్గాలు, ఆంధ్ర మేధావి వర్గం చేస్తున్న వాదనల్లోని నిర్హేతుకతను, ఆధిపత్య ధోరణిని కార్యకారణలతో వ్యతిరేకిస్తూ విరివిగా వ్యాసాలు రాశాను. హైదరాబాద్ పై, తెలుగు భాష పై వాళ్ళు చేసిన వాదనల్లోని ఆధిపత్య ధోరణిని, మోసకారి తనాన్ని, ప్రదర్శిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ ఆ రచనలు వెలువడ్డాయి. సీనిమా, జర్నలిజం వంటి రంగాల్లో దశాబ్దాలుగా తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, అణచివేత పద్దతులను సోదాహరణంగా విశ్లేషించాను. అణచివేత, వివక్షల పరిణామక్రమాన్ని వివరించాను. ఈ వ్యాసాలు అర్దసత్యాలను, అసత్యాలను తిరస్కరించి తెలంగాణ దృక్కోణం నుంచి సత్యాలను ఆవిష్కరిస్తాయి. అందువల్ల ప్రగతిశీల ఆంధ్ర మేధావి వర్గానికి కూడా అవి మింగుడు పడలేదు. అందుకు తార్కాణం నాపై జరిగిన అసత్య ప్రచారాలు, భౌతిక దాడులే ఉదాహరణ. ఈ వ్యాసాల్లో కొన్ని “తెలంగాణ సందర్భాలు”(2007) అనే పుస్తక రూపంలోనూ, అన్ని వ్యాసాలు”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు”(2015) అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి.
ప్రశ్న : తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ఏవిధంగా చాటిచెప్పింరు ?
జవాబు : తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్తూ ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడానికి వివిధ రూపాల్లో కృషి చేశాను. మలి దశ ఉద్యమంలో
తెలంగాణ దృక్పదంతో వచ్చిన మొదటి కథ నాదే. ప్రాంతీయం పేరు మీద ఆ కథ వెలువడింది. తెలంగాణ నవల (పరిణామ క్రమాన్ని) విస్తృతిని మొదట సమగ్రంగా వ్యక్తీకరించింది నేనే (తెలంగాణ నవలలు -2007). తెలుగు జర్నలిజం, తెలుగు సినిమా రంగాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా విస్తరించాయో తొలుత చెప్పింది నేనే. (2002 జూన్ 1- పేజీ నెంబర్ 160); (తెలంగాణ 2001 – పేజీ నెంబర్ 169).
తెలంగాణ దృక్పదంతో వచ్చిన మొదటి కథ నాదే. ప్రాంతీయం పేరు మీద ఆ కథ వెలువడింది. తెలంగాణ నవల (పరిణామ క్రమాన్ని) విస్తృతిని మొదట సమగ్రంగా వ్యక్తీకరించింది నేనే (తెలంగాణ నవలలు -2007). తెలుగు జర్నలిజం, తెలుగు సినిమా రంగాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా విస్తరించాయో తొలుత చెప్పింది నేనే. (2002 జూన్ 1- పేజీ నెంబర్ 160); (తెలంగాణ 2001 – పేజీ నెంబర్ 169).
ప్రశ్న : సురవరం ప్రతాపరెడ్డిని సరిగ్గా అంచనా వేయటంలోనే తెలుగు సాహిత్యం విఫలమైంది అని మీరు ఎలా చెప్తారు ?
జవాబు : తెలంగాణ సాహిత్యాన్ని తెలుగు సాహిత్య చరిత్ర తనలో ఇముడ్చుకుని ఒక సమగ్ర రూపాన్ని ఇవ్వడంలో విఫలమైంది. రెండు సందర్భాల్లో మాత్రమే తెలుగు సాహిత్యం తనకు అనుకూలంగా తెలంగాణ సాహిత్యాన్ని స్వీకరించింది. ఒకటి తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం కాగా రెండోది విప్లవోద్యమ సాహిత్యం. మిగిలిన సందర్భాల్లో తెలంగాణ సాహిత్యం పట్ల, సాహితీ వేత్తల పట్ల వివక్షను ప్రదర్శిస్తూ వచ్చింరు. తెలిసి కొంత, తెలియక కొంత తెలంగాణ సాహితీ వేత్తలు విస్మరణకు గురవుతూ రావడం గమనించవచ్చు. ఈ కారణంగానే సురవరం ప్రతాపరెడ్డి చేసిన అనితర సాధ్యమైన కృషి మరుగున పడిపోయింది. సురవరం ప్రతాపరెడ్డి రాసిన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” వంటి గ్రంథం ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో రాలేదు. ఈ స్థితిలో “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అనే గ్రంథానికి సంపాదకత్వం వహించి ఆయనకు సాహిత్య చరిత్రలో ఇవ్వాల్సిన స్థానం గురించి చెప్పాను. ( ఆంధ్రుల సాంఘిక చరిత్ర: సురవరం ప్రతాపరెడ్డి – సంపాదకత్వం – తెలుగు అకాడమీ ప్రచురణ 2016).
*
అనుభవం లోకి రానిది ఏదీ రాయరు ప్రతాపరెడ్డి గారు. ఇది వాస్తవం. అస్తిత్వ ఉద్యమాలలో వాటికి మద్దతుదారుగా నిలవడంతో ప్రతాపరెడ్డి గారి పాత్ర విస్మరించరానిది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మాలాంటి వాళ్లనెందరినో మేల్కొలిపారు. తెలంగాణ వాదులు రాస్తున్న ప్రతిపుస్తకాన్ని నిశితంగా పరిశీలించి విమర్శలు సమీక్షలు లువరించేవారు. కథకుడిగా ఎల్లమ్మ ఇతర కథలు, తెలంగాణ సాహిత్యోద్యమాలు ఆయన కృషికి చిన్న అద్దాలు. అయితే ఈ ఇంటర్వ్యూ సంపూర్ణం అనిపించడం లేదు. వర్తమాన సాహిత్య గమనం మీద, రాజకీయ సామాజిక పరిణామాల మీద ఇంకా కొన్ని ప్రశ్నలు అడగొచ్చు.
మీ స్పందనకు కృతజ్ఞతలు సార్. కాసుల ప్రతాపరెడ్డి చేసిన సాహిత్య కృషి మీదే ఈ ఇంటర్వ్యూ కేంద్రీకృతమై ఉంది. అందువలన మీరన్నట్టు ఇతర అంశాలను స్పృశించలేదు. ఇష్టంగా ఉన్నది ఎంత చదివినా ఇంకా ఇంకా చదువాలనిపిస్తుంటది. మరొక ఇంటర్వ్యూ లో ఆ ఖాళీలను పూర్తి చేస్తాను.
తెలంగాణ తోవలు వ్యాస సంకలనం చదివాను..చాలా 1ఇన్ఫర్మేటివ్ వ్యాసాలు. మీ ఇంటర్వ్యూ బాగుంది..తెలంగాణా సాధించుకున్నప్పటి స్థితి, ఇప్పటి స్థితి సాహిత్యపరంగా చర్చించండి.
తప్పకుండా సార్. స్పందనకు కృతజ్ఞతలు సార్.
కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ ఉద్యమ సాహత్యాన్ని అనేకకోణాల్లో పట్టి చూపారు. ఆయన కథల ద్వార తెలంగాణ అవసరం ఏమిటో వివరించారు. ఆ కృషిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ గారి ముఖాముఖి రచన బాగుంది.
కాసుల ప్రతాప రెడ్డి గారి రచనల గురించి, మలి దశ ఉద్యమం లో వారి సాహిత్య సేవ గురించి చాలా విషయాలు తెలిసాయి ఈ ముఖాముఖి ద్వారా. ఇంటర్వ్యూ ఇంకొంచెం సమగ్రంగా ఉంటే బాగుండు అనిపించింది, తొందరగా ముగిసినట్టనిపించింది. మంచి ఇంటర్వ్యూ అందచేసిన ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదములు.