అనుకోని ఆతిధ్యం

వంగూరి జీవిత కాలమ్-70

1975 ఏప్రిల్ నెల తొలిరోజుల్లో చికాగో నుంచి నిఝంగానే కట్టుబట్టలతో హ్యూస్టన్ ఉద్యోగాన్వేషణ కొసం వచ్చిన ‘ముగ్గురు మరాఠీలం”  ఈమని శాస్త్రీ, అతని తమ్ముడు రఘురామ్, నేనూ… రెండు రోజులు చిన్న మొటెల్ లో బస చేశాం. స్థానిక రైస్ యూనివర్శిటీ లో డాక్టరేట్ చేస్తున్న ముగ్గురు, నలుగురు యువకులని కలిశాం. మాకు వచ్చిన అతి పెద్ద సమస్య…బస. రోజుల తరబడి మొటెల్ లో ఉండే ఆర్ధిక స్తోమత లేక పోవడం, ఆ యూనివర్శిటీ విద్యార్ధులే ఒకే గదిలో నలుగురైదుగురు కలిసి ఉండే పరిస్థితిలో మాకు చోటు కల్పించలేక పోవడం. మేము నిరుద్యోగులం కాబట్టి అపార్ట్ మెంట్ అద్దెకి ఇవ్వడానికి అన్ని చోట్లా నిరకరించడం తో మా పని కుడితిలో పడ్డ ఎలకలాగా, ఒడ్డున పడ్డ చేపలాగా తయారు అయింది. కానీ  ఎందెందు వెదకిన అదెందే కలడు…

ఇక హ్యూస్టన్ లో మూడో రోజు…ఇప్పటికీ మర్చిపోలేని రోజు….మానవత్వానికి మరపురాని రోజు…మా ఎపార్ట్ మెంట్ వేటలో మేము ముగ్గురం పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా ఎక్కే మెట్టూ, దిగే మెట్టుగా అన్ని చోట్లా నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించబడి మధ్యాహ్నం సుమారు రెండు గంటలకి ఆకలి వేసింది. రెస్టారెంట్ కి వెళ్ళి తినే పరిస్థితి లేదు కాబట్టి బ్రెడ్డూ, పళ్ళూ, కంద మూలాలూ కొనుక్కుందాం అని “జై వ్యాసా, జైమినీ, వశిష్టా” అని మా గోత్రనామాల ఋషులని తల్చుకుని జోకులు వేసుకుంటూ  బెలైర్ అనే రోడ్డు మీద సూపర్ మార్కెట్ కోసం వెతుకుతూ కారులో వెడుతున్నాం. నేను జేబులో ఎంత చిల్లర ఉందో లెక్క పెట్టుకుంటున్నాను. ఇలా ఆకలి వేసినప్పుడు, మన జేబులో ఎంత చిల్లర ఉందో దానికి సరిపడా తిను బండారాలు కొనుక్కోవాలి కానీ, డాలర్ నోట్లు పైకి తియ్యకూడదు అనేది అప్పుడు మేము  పెట్టుకున్న రూలు. అప్పుడు బ్రెడ్ ఖరీదు బేడా, పావలా యే!.

సరిగ్గా అప్పుడు దూరంగా పేవ్ మెంట్ మీద….అంటే రోడ్డుకి పక్కనే మనుషులు నడిచే సిమెంట్ దారి మీద ఒకాయన చేతిలో గోధుమ రంగు సంచీ…అంటే గ్రోసరీలు కొన్నప్పుడు అవి పెట్టుకునే బ్రౌన్ బేగు…ని భారంగా మోసుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ కనపడ్డాడు. చూడ్డానికి ఆయనా మన గోధుమ రంగులోనే ఉన్నాడు. వెంటనే –

“గురూ…మనవాడే…ఇండియన్” అని ముగ్గురం తబ్బిబ్బు అయిపోయాం. ఈ రోజుల్లో అది నవ్వలాటగా అనిపించవచ్చును కానీ, రోడ్డు మీదైనా, ఎక్కడైనా మన భారతీయుడిలా కనపడితే చాలు…వెళ్ళి కావలించుకుని, పరిచయాలు చేసేసుకుని మహదానందపడిపోయే రోజులు అవి.  పైగా మేము ఉన్న నిస్సహాయ పరిస్థితిలో మరొక భారతీయుడు అలా కనపడడంతో భలే సంతోషం వేసింది. పైగా ఆయన కొంచెం పెద్దాయన, భారీ సంచీ మోస్తూ మెల్లగా నడుస్తూ కనపడదంతో వెంటనే శాస్రి ఆయన నడుస్తున్న పక్కనే కారు ఆపి “సార్, మీకు రైడ్ కావాలా?” అని అడిగాడు. ఈ లోగా నేనూ, రఘూ కారు దిగి, ఆయన్ని ఎగా దిగా చూసి మళ్ళీ “బరువు మోసున్నారు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం” అనగానే ఆయన నడవడం ఆపి “మీరెవరు?” అని కాస్త అనుమానాస్పందంగా అడిగాడు. ఇంకేముందీ… ఉద్యోగాల కొసం  చికాగో నుంచి మేము రావడం, ఎక్కడా నివాసానికి చోటు దొరక్కపోవడం..ఈ కథ అంతా ఆయనకి చెప్పాం. ఇదంతా మిట్టమధ్యాహ్నం నడి ఎండలో, నడిరోడ్డు మీద…అంతా కలిపి పది నిమిషాల లోపే..

ఆఖర్న “మీరు ఇండియన్ లా ఉన్నారు. మీకు తెలిసిన ఎపార్ట్ మెంట్ మెనేజ్ మెంట్ కి ఎవరికైనా చెప్పి మాకు ఒక చిన్న ఎపార్ట్ మెంట్ ఇప్పించగలరా? అని అడిగాం.

దానికి ఆయన అదోలా చూసి “ఎంత మంది ఉన్నారు?” అని అడిగాడు.”

“మేము ముగ్గురమే.”

“అలా అయితే నా ఎపార్ట్మెంట్ కి వచ్చెయ్యండి” అన్నాడు ఆయన మొహం లొ ఏ విధమైన భావాలూ లేకుండా.

“మీ ఎపార్ట్ మెంట్ కా?’ అని అనుకోని ఈ ప్రతిపాదనకి మేము విస్తుపోయాం.

“అవును. యు సీ….నేను ఇక్కడే ఒక రెండు బెడ్ రూమ్ లు ఉండే ఎపార్ట్ మెంట్ లో ఒక్కడినే ఉంటాను. బేచలర్ ని. మీరు ముగ్గురూ నాతో కొన్నాళ్ళు ఉండవచ్చును. మీలో ఎవరికైనా ఉద్యోగం రాగానే మీ బస మీరు చూసుకోవచ్చును.” అని వివరంగా ఆయన అనగానే మాకు నోటమాట రాలేదు.

“అయ్య బాబోయ్..అంత కంటేనా?…” మేము ముగ్గురం ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాం. ‘ఎందెందు వెదకిన”..లాంటి పద్యాలు జ్ణాపకం వచ్చి ఇంకా ఒక బ్రౌన్ సంచీలో కూరగాయలు పట్టుకున్న ఈ గోధుమ రంగు ఆసామీ సాక్షాత్తూ ఆ గజేంద్రుడిని రక్షించడానికి అవతరించిన విష్ణుమూర్తిలా కనపడ్డాడు. కాస్త తమాయించుకుని, అనేకానేక ధన్యవాదాలు చెప్పుకుని యాదాలాపంగానే మా ముగ్గురి పేర్లతో పరిచయం చేసుకుని “సార్, మీ పేరేమిటి?“ ఇండియాలో ఎక్కడ నుంచి?” అని అడిగాను.

“నాది ఇండియా కాదు. పాకిస్తాన్”. అయామ్ ఫ్రమ్ పెషావర్. మై నేమ్ ఈజ్ నయీమ్….నయీముద్దీన్”.

అది వినగానే..భారత దేశంలో పవిత్ర గోదావరీ పరీవాహిక ప్రాంతాల నుంచి వచ్చిన మా ముగ్గురు అగ్రకుల సంజాత యువకులకీ ఒక క్షణం మాట పెగల లేదు. బహుశా అసంకల్పిత ప్రతీకార చర్యగా మా మొహాలు మాడిపోయే ఉంటాయి. ఎక్కడి కాకినాడ? ఎక్కడి తణుకు? ఎక్కడి పెషావర్?

అప్పటి మా పరిస్థితిలో మేము మారుమాట్లాడకుండా ఆయన్ని కారులో ముందు సీటు లో కూచోబెట్టి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం దగ్గరలోనే..అంటే సుమారు 5 మైళ్ళ దూరం లోనే ఉన్న ఆయన నివసించ” నెపోలియన్ స్క్వేర్” అనే ఎపార్ట్ మెంట్ సముదాయానికి వెళ్ళాం. మా ముగ్గురి సామానూ కార్లో డిక్కీలోనే అనేసుకుని మోటెల్ ఖాళీ చేసేసి, ముగ్గురి పెట్టే, బేడా ట్రంక్ లో …ఇండియాలో డిక్కీ అంటాం..అదనమాట..అందులో   రోజు పొద్దున్నే  కుక్కేశాం. ఆ రైస్ కుర్రాళ్ళని  బతిమాలుకుని రోజూ స్నానపానాలు అక్కడా, రాత్రి నిద్ర కారులోనూ అని మా ఆలోచన. అలాంటిది మధ్యాహ్నటి కల్లా ఈ నయీమ్ ఇంట్లో కుదిరిపోవడం ఎంత ఆశ్చర్యమో కదా!

ఈ నయీముద్దీన్ కి 40 ఏళ్ళు పైనే ఉంటాయి. ఒక విధంగా నా జాతకం లాంటిదే. సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. పాకిస్తాన్ లో పెషావర్ డామ్ అనే పెద్ద హైడ్రాలిక్ నీటి విద్యుచ్ఛక్తి కేంద్రం చీఫ్ ఇంజనీర్ గా హాయిగా పనిచేసుకుంటున్న వాడల్లా ఒక సారి అక్కడి అమెరికన్ కాన్సలేట్ వారు అమెరికా లో ఉద్యోగ అవకాశాల గురించి పెట్టిన ఒక సెమినార్ కి వెళ్ళి,  అప్లై చేయగానే అతనికి నాలాగా గ్రీన్ కార్డ్ ఇచ్చారు. వెంటనే ఎలా వచ్చాడో కానీ హ్యూస్టన్ వచ్చి ఎక్కడా అతని అర్హతలకి తగ్గ సరి అయిన ఇంజనీరింగ్ ఉద్యోగం దొరక్క, ఒక చిన్న కంపెనీలోడ్రాఫ్ట్సమన్ గా ఇంజనీరింగ్ డ్రాయింగులు గీసి పెట్టే మామూలు ఉద్యోగంలో చేరాడు. ఆ జన్మ బ్రహ్మచారి.  అతను పని చేసే కంపెనీ అక్కడికి  పది నిమిషాల నడక. రోజూ నడిచే ఉద్యోగానికి వెళ్ళి రావడం, వారానికి ఒకసారి మాకు కనపడిన ఇరవై నిమిషాల నడకలో ఉన్న సూపర్ మార్కెట్ కి సరిపడా సరుకులు కొనుక్కోవడం, ఇంట్లో ఉన్న ఒక చిన్న బ్లాక్ & వైట్ టీవీ చూడడం అతని వ్యాపకాలు. అమెరికా రాగానే పేరు నయీమ్ అని ఒకే ఒక పేరుకి కుదించుకున్నాడు. స్నేహితులు, బంధువులు ఎవ్వరూ లేని ఏకాకి జీవితం. మిత భాషి. మా బోటి వాగుడు కాయలకి సరిగ్గా వ్యతిరేక స్వభావం.  చిన్న చిరునవ్వు తప్ప ఇంకేమీ ఆభరణాలు లేవు.

పాకిస్తాన్ కి చెందిన ఒక ముస్లిం పెద్దాయన పూర్తిగా అనామకులం, రాజకీయ పరంగా శత్రువు అయిన భారతదేశానికి చెందిన ముగ్గురు యువకులని ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా, మా కథని పూర్తిగా నమ్మి, కేవలం సహాయం చేద్దాం అనే మానవతా స్పూర్తితో తన ఇంట్లో ఆతిధ్యం ఇవ్వడం తల్చుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  దాన్ని కేవలం అమెరికా దేశం మహాత్మ్యం అని అనుకోవచ్చునా? ఈ నేలా, ఈ గాలీ, ‘మెల్టింగ్ పాట్’ లాంటి ఈ సామాజిక వాతావరణం కారణమా? ఇండియా, పాకిస్తాన్ లేదా హిందూ, ముస్లిం అనే బేధభావాలూ అక్కడివేనా? ఇక్కడకి రాగానే మన మనస్తత్వాలలో మార్పు వస్తుందా? లేక ఆనాడు జరిగినదంతా కేవలం కాకతాళీయమా?

నయీమ్ ఇంట్లో సుమారు రెండు నెలలు ఎలా గడిపానో… త్వరలోనే…ఆనాటి నెపోలియన్ స్క్వేర్ ఎపార్ట్ మెంట్స్ ఈనాడూ ఇంచుమించు అదే రూపం…

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Leave a Reply to పట్నాల ఈశ్వర రావు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి అనుభవం.ధర్మరాజు కౌరవుల గురించి చెప్పినట్లు బయటకు వెళ్తే అందరం ఒక్కటే

    • బాగా చెప్పారు, మిత్రమా…అమెరికా వచ్చాక నేణు నేర్చుకున్న మొదటి పాఠాలలో “మనుషులు అందరూ సమానమే” ..Al men are created equal” అనే అమెరికన్ మౌలిక భావన…

      మీ స్పందనకి ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు