అనిశ్చిత బతుకుల్లోంచి కొంత ఉత్తేజం!

థా రచయిత కన్నా ముందుగా నేను అనువాదకుడిని. ఓ నాలుగు అనువాద కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాకా, సొంత కథలు రాయడం ప్రారంభించాను. సొంత కథలు నేను తక్కువే రాసాను, అయితే వాటికి ప్రేరణ మాత్రం నేను దగ్గర నుండి గమనించిన వ్యక్తులు, సంఘటనలు, వారి ఆనందాలు, వారి భయాలు, అభద్రతలు. సరిపడా ధనం లేకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి, చెదురుతున్న కుటుంబ సంబంధాలు తదితర అంశాలే.

నేను రాసిన కథలన్నీ నాకు నచ్చినవే అయినా. కొన్ని కథల మీద కాస్త ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఒక కథ రాసిన ఉద్దేశం స్పష్టంగా పాఠకులకి చేరినప్పుడు రచయితకి కలిగే సంతృప్తిని నాకు కల్గించిన నా కథ 2014లో రాసిన ముసుగు వేయొద్దు మనసు మీద. దీనికి ముందు, తరువాత కూడా ఎన్నో కథలు రాసినా, ఇది నాకు ప్రత్యేకం.

సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటు రంగం ఎదుగుదల, సాంకేతికాభివృద్ధి దేశంలో ఎన్నో మార్పులకి కారణమయ్యాయి. పలు విదేశీ సంస్థల శాఖలు మన దేశంలోకి రావడం, వాటి ఉద్యోగ విధానాలను మన సంస్థలలో అనుసరించడం – దశాబ్దాలుగా వస్తున్న ఉద్యోగ భద్రత హఠాత్తుగా లోపించడం, కాలక్రమంలో కొన్ని వృత్తులు/నైపుణ్యాలు పనికిరాకుండా పోవడం జరిగి ముఖ్యంగా ప్రైవేటు సంస్థల ఉద్యోగులలో ఆందోళనలకు కారణమయ్యాయి. ఒక ప్రైవేటు సంస్థలో యజమానికి పి.ఎస్.గా/స్టెనోగ్రాఫర్‍గా ఉన్న వ్యక్తి – కంప్యూటర్స్ పెద్దగా రాని వ్యక్తి – సంస్థ విధానాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారలేకపోతాడు. యజమాని రిటైరై, ఆయన కొడుకు హయాం వచ్చేసరికి – ఇతని అవసరం పెద్దగా ఉండదు. కొత్త బాస్ కంప్యూటర్ సావ్వీ. తన అపాయింట్‍మెంట్స్ అన్నీ గూగుల్ క్యాలెండర్‍లో ఎంటర్ చేసుకుని, అలెర్ట్స్ పెట్టుకుంటాడు. తన లెటర్స్ తానే ఈమెయిల్ ద్వారా పంపుకుంటాడు, తన ప్రయాణ ఏర్పాట్లు తన ట్రావెల్ కార్డుతో తానే చేసుకుంటాడు. పి.ఎస్. ని తొలగించాలకున్నా, తండ్రి వద్ద నమ్మకంగా చాలా ఏళ్ళు పనిచేసాడన్న చిన్న సింపతీ ఉంటుంది. అలా అని తాను తీసేయ్యడు.. అతనంతట అతనే మానేసేలా చేసేందుకు రకరాకల పనులు చెప్పి చేయిస్తుంటాడు.

తన పట్ల కొత్త బాస్ ప్రవర్తిస్తున్న తీరుని గ్రహిస్తాడు. అతనికి తన అవసరం లేదని, తనని ఎప్పుడైనా తొలగించవచ్చని పి.ఎస్. అర్థం చేసుకుంటాడు. స్వతహాగా భయస్థుడైన అతనిలో ఈ మార్పులు అభద్రతని కలిగిస్తాయి. కొత్తగా కంప్యూటర్ నేర్చుకోవడం, లేదా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సంకోచం అతనికి జీవితం పట్ల మరింత భయాన్ని కలిగిస్తాయి. ఇతని కథ ఇలా ఉంటే, వీరేశంది మరో రకం సమస్య. జీవిక కోసం మిక్కీ మౌస్ డ్రైస్ వేసుకుని పుట్టినరోజు పార్టీలలో పిల్లలకు ఆనందం కలిగించేలా గెంతులు వేయడం అతని పని. ఇదే కాక, ఇంకా వేర్వేరు పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూంటాడు.

అయితే అతనికి బ్రతుకు పట్ల ధీమా ఉంటుంది. చిన్నా చితకా పనులు చేసుకుంటున్నా అతనిలో ధైర్యం సన్నగిల్లదు. పైగా తాను చేసే పనులలోనే తన ఆనందాల్ని వెతుక్కుంటాడు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదంటాడు. అతని పరిచయంతో పి.ఎస్.లోనూ కాస్త మార్పు వస్తుంది. ఇదీ క్లుప్తంగా కథ.

ఈ కథ చెప్పే కథకుడు నాకు తెలిసిన వ్యక్తే. అతని జీవితంలోని కొన్ని ఘటనలను, మా మిత్రుడి అన్నయ్య జీవితంలోని కొన్ని సంఘటలన మేళవించి – పి.ఎస్. పాత్రని కల్పించాను. వీరేశం పాత్రధారి నాకో బర్త్‌డే పార్టీలో కలిసాడు. నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను. ఆ రోజు అతనితో జరిపిన సంభాషణ ఆధారంగా కథలో కొన్ని ఘట్టాలు కల్పించాను. అలాగే ఓ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అక్కడున్న బట్టల కొట్ల వద్ద సింహం డ్రెస్ వేసుకుని జనాలని పిలుస్తున్న ఓ వ్యక్తి, ఒక్కసారిగా తల మీద ముసుగు బయటకి తీసి ఆ వేషం వేసుకోవాల్సి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ, తన పేదరికాన్ని, కొట్టు యజమానుల్ని దూషించాడు. చాల స్వల్ప సమయంలో జరిగిన ఘటన, కానీ నా మనసులో ముద్ర పడిపోయింది. దీన్ని వీరేశం పాత్రకి ముడిపెట్టాను. మా ఆఫీసు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసి తరచూ మానేసే వ్యక్తులకి ఎదురయ్యే చిన్న చిన్న ఘటనలను ఈ కథలో ఒకే పాత్రకి ఎదురైనట్లుగా చూపాను.

వీటన్నిటి వల్ల చక్కని కథ రూపొందింది. ఈ కథకి మెచ్చిన వారు ఉన్నారు, నచ్చనివారూ ఉన్నారు. వీరేశం పాత్రకి పెట్టిన యాస, కొందరు బాలేదన్నారు. మరికొందరు వీరేశం పాత్ర స్వభావాన్ని బట్టి ఆ పాత్రకి ఆ పేరు నప్పలేదన్నారు. కథలో ఇంకా లోతు ఉంటే బావుండేదని కొందరన్నారు. కథ ద్వారా జీవితంలోని సమస్యలకి పరిష్కారం చెప్పకపోయినా, వాటిని ఎదుర్కునేందుకు కావల్సిన సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో సఫలమయ్యాయని ఓ సీనియర్ రైటర్ నా భుజం తట్టారు.

అప్పట్లో ఎ.వి. రమణ మూర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గారు ప్రతి నెల వచ్చిన కథలను విశ్లేషించి – ఆ నెల ఉత్తమ కథగా ఒక కథని ఎంచుకుని సారంగలో ఆ కథ గురించి వివరించి, ఆ రచయితని ఇంటర్వ్యూ చేసేవారు. నా ఈ కథ 2014 మార్చిలో ఉత్తమ కథగా ఎంపికైంది.

కొంత అనిశ్చితితోనూ, దాన్నుంచి ఉద్భవించే అశాంతితోనూ జీవించే మనుషుల మనసులని ఈ కథ తాకి, ఒక కొత్త ఉత్తేజాన్ని వాళ్ళలో నింపడం అనే ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందని రమణమూర్తి గారు, సత్యప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు. ఇది సారంగ తరఫున నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను.

ఈ కథ ద్వారా నాకు మరో గౌరవం కూడా లభించింది. 2017లో తెలుగు కథల కన్నడ అనువాద సంకలనం ‘ఇందిన తెలుగు కథెగళు’లో ఈ కథకి కన్నడ అనువాదం ప్రచురితమైంది. ఈ కథని శ్రీ పెండకూరు గురుమూర్తి కన్నడంలోకి అనువదించారు. వారికి నా కృతజ్ఞతలు. ఇతర కథకుల కథలను తెలుగులోకి అనువదించే నాకు, నా కథ వేరే భాషలోకి అనువాదం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఈ కథని కినిగె పత్రికలో ప్రచురించిన సంపాదకులు శ్రీ మెహర్‍కీ, కథకి తగ్గ చిత్రాన్ని గీసిన పి.ఎస్. చారి గారికీ,  ఉత్తమ కథగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ చేసిన ఎ.వి. రమణ మూర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గార్లకు సారంగ టీమ్‍కి నా ధన్యవాదాలు.

*

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను,  ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

4 comments

Leave a Reply to Kolluri Soma Sankar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు