ఒక వేసవి మధ్యాహ్నం
మా ఇంటి వాకిట్లో కూర్చున్న అమ్మలక్కలు
బియ్యం లో రాళ్లు ఎరుతూ ఒక అమ్మ
నుగ్గింజలు జల్లెడ పడుతూ ఒక అక్క
ఒకరు
చింతకాయలు ఒలుస్తున్నారు
తల్లో పేలు చూస్తూ మరొకరు
తిరగలి లో
నలుగుతున్న రాగి గింజలా కాలం
లేచి పోయిన పార్వతి కూతురు
భర్త తో వేగలేక వెనక్కివచ్చిన సుజాత
మధ్యలో తొంగిచూసి వెళ్లారు
ఏడో సారి కూడా బేరం కుదరక
ఆగిన పావని పెళ్లి గురించి మాట్లాడుకున్నారు
సీతకు రాముడు చేసిన అన్యాయం
ద్రౌపదికి పాండవులు చేసిన నష్టం
భర్తకోసం చూపు కోల్పోబడ్డ గాంధారి
వీళ్లంతా వస్తూ, పోతూ ఉన్నారు
అందరి కళ్ళల్లోను
తరతరాలగా కురుస్తున్న మగ వృష్టికి తడిచి
ఎలుస్తున్న గుండె గోడల
దుఃఖపు శబ్దం
చుట్టూ కమ్ముకున్న
పురుషాధిక్యపు పొగ
అప్పుడు
స్తబ్దుగా ఉన్న కొన్ని అగ్ని పర్వతాల్ని
చూశాను
చేతులూపుతూ మాటల్నిఅలా పువ్వులా అల్లుతున్న
వారి వేలి కొసల్లో
చిగురించే మొక్కల్ని చూశాను
ఇప్పుడు సంభాషణ
రాత్రి వైపు మళ్లింది
అప్పుడు
వారి ముఖాల్లో
ఉరుకుతున్న యేరొకటి చూశాను
ఒక స్త్రీ అన్నది కదా
మనం ఓడినట్టు నటిస్తాం గానీ
మనల్ని గెలవడంఅసాధ్యమని ప్రకటిస్తే
తర్వాత నాకేమి వినబడలేదు గానీ
ఒక ప్రకటన మాత్రం చేయగలను
స్త్రీలు
బలవంతులు
*
తరతరాలుగా కురుస్తున్న మగవృష్టికి తడిచి….బాగుంది కవిత
బావుంది
సున్నితమైన స్వరంతో చేసిన
బలమైన ప్రకటన..
ఆడువారి ముచ్చట్లు ఇంతందంగా ఉంటాయా?మీ కవిత్వం సహజత్వం తోబుట్టువులు మేష్టారు
మంచి కవిత మిత్రమా
Anthaku minchi guruvu gaaru
Good one!!
ఆడవారి ముచ్చట్ల మధ్య ఘాటుగా వెలువడే “పురుషాధిక్య పొగ”ను కవిత్వంలో బంధించటానికి బలమైన అంతర్దృష్టి ఉండాలి. బాగుంది. అభినందనలు గోపాల్ గారూ.
మగాడు జీర్ణించుకోలేనీ
నగ్న సత్యం ను కుండ బద్దలు కొట్టినట్లే…
అభినందనలు గోపాల్ గారూ
నిజ జీవితాన్ని కవితలో ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది సార్
సహజాతి సహజంగా ఏవిధమైన గందరగోళాలు లేకుండా చెప్పాల్సిన విషయాన్ని బాగా చెప్పారు.అభినందనలు
సరళమైన ఘాటైన వ్యక్తీకరణ. అభినందనలు గోపాల్ జీ
Chala bagundhi sir..👌
గోపాల్ సార్ (అ)బల ఎవరో ఏంటో విస్పష్టంగా చెప్పి పురుషాధిక్య లోకపు బుడతడికి చురక అంటించినారు…
అయ్యా, మీరు సామాన్యులు కాదు
మగవృష్టి,పురుషాధిక్యపు పొగ , దుఃఖపుశబ్దం……..
చక్కని పదబంధాలు
అమ్మలక్కలు నెల్లూరు మాండలికానికి ప్రతినిధి
వీటన్నింటి మేళవింపుతో కవిత అద్భుతంగా పండింది.బాగుంది.