అనిర్వచనం

వీధిలో కి వెళ్లినప్పుడు
ఆ ఇంటి ముందుకు రాగానే
పలకరింపుగా నవ్వుతాను..
ప్రతిగా ఏ నవ్వూ వినపడదని తెలిసినా
ఆకలి తీర్చడంలోని ఆనందం
అక్కడి పరిసరాలకు బాగా తెలుసు
ఆ పరిసరాల గుండా
ఎన్ని వందల మైళ్ళు నడిచినా
ఆకలి వేయదు మరి
మాటలు కేవలం
అర్థవంతమైన ధ్వనులు కావు
అవి రెండు హృదయాలను
పటిష్టంగా కలిపే రహదారులు
చెలిమి పత్రాలపై
రహస్యంగా చేసే ఇరువురి సంతకాలు
కొన్ని క్షణాలు ఎంత బరువుగా
చుట్టుముడతాయో
ఒక్కోసారి తెలిసి వేసే అడుగులు కూడా
చీకట్లోకి దారితీస్తాయి
అయినా హృదయానికి ఏ రాయీ తగలదు
 నా దిండు కింద
  నలిగినపోయిన  ఆ పుస్తకంలో
 వాక్యాలే కాదు..
 అక్షరమక్షరం అపురూపమే
ఆ ఇంటిముందు నుంచి
నడిచే ప్రతీసారీ
రెండు కన్నీటి మొక్కలను
ఆ గడప దగ్గర నాటిపోతాను
ప్రేమను సంపూర్ణంగా
ఎవరు నిర్వచించగలరు..?
*
స్కెచ్: స్వాతి పంతుల 

సునీత గంగవరపు

నేను గంగవరపు సునీత. తెలుగు ఉపాధ్యాయురాలిని. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తుంటాను. రెండు కవిత సంపుటాలు ముద్రించాను. పాటలు వినడం, పాడడం అంటే కూడా ఇష్టం.

2 comments

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆకుపై మంచు నీటి బిందువులా ఉండే చక్కని కవిత. మీకు అభినందనలు 💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు