‘అద్దం వెనుక’ ఏముంది?

మానవీయ సంబంధాల జెండాను ఒక చేత, తెలంగాణ గ్రామీణ జీవితాల అజెండాను మరో చేత పట్టుకొని తెలుగు కథా యవనిక మీదికి దూసుకొస్తున్న కొత్త కథా కెరటం కొట్టం రామకృష్ణారెడ్డి. ఇప్పటి దాకా తాను రాసిన 18 కథలను ఇటీవలే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ‘నూనెసుక్క’ పేరుతో ప్రచురించారు. గత కొన్ని వారాలుగా నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’ ఆదివారం సంచికలో ‘జోలి’ పేరుతో కాలమ్ రాస్తున్నారు. ఇతర ప్రక్రియల జోలికి పోకుండా కేవలం కథా ప్రక్రియకు మాత్రమే పరిమితమై తెలంగాణ జీవిత మూలాలను కథీకరిస్తున్న కొట్టం రామకృష్ణారెడ్డి కథలు తెలంగాణ కథా సాహిత్యానికి ఒక కొత్త చేర్పు. ఆయన కలం నుండి జాలువారిన మంచి ప్రేమ కథ ‘అద్దం వెనుక’. ఈ కథ మొదట 2016లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.

నూటికి అరవై శాతం ఫ్యూడలిస్టిక్ భర్తలే ఉంటారు. అంటే భార్యల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా తనదే పై చేయి ఉండాలని తన భావాలను, తన ఇష్టాలను, తన పెత్తనాన్ని భార్య మీదే కాదు మొత్తం కుటుంబం మీద రుద్దుతారు. ఆ నలభై శాతం కూడా గత కొన్ని దశాబ్దాలుగా చదువు సంధ్యలు పెరగడం మూలంగా మారినట్టు కనిపిస్తున్నారు కానీ సారాంశంలో మళ్ళీ భర్తల పెత్తనమే వేరే షేడ్ లో కనిపిస్తుంది.

భర్త/భార్య అందవిహీనంగా ఉన్నాడనో, తనకు తగిన వాడు కాదనో సంసారం చేసేటప్పుడు కూడా చాలా మంది భార్యలు/భర్తలు తనకు నచ్చిన సినిమా హీరో/హీరోయిన్ ను ఊహించుకొని సంసారం చేసేవారు మధ్య తరగతి, దిగివ మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది ఉంటారు. సెక్సాలజీలో ఇదొక ప్రత్యేక అధ్యయనాంశం.

ఈ కథలో రామయ్య ఒక అమాయకమైన భర్త. పల్లెటూరి రైతు. పెళ్లీడు వచ్చేదాకా చెట్లల్లో చెట్టులా, రాళ్లలో రాయిలా బతికాడు. ఎద్దులా పని చేస్తాడు. పాలేరు కన్నా హీనమైన బతుకు వెళ్లదీశాడు. సీతమ్మతో పెళ్లయ్యాకే అతని జీవితంలో నలుపు, తెలుపు రంగులు పోయి ఇతర రంగులు నవ్వడం మొదలైంది. అమితంగా ప్రేమించే భార్య దొరకడం తన అదృష్టమనుకున్నాడు. ప్రేమగా సీతమ్మ అతనికి చాలా నేర్పించింది. చిక్కుడుకాయ రుచి, పుంటికూర రుచి, ఉడకబెట్టిన పెసరకాయ రుచి.. ఇలా ఎన్నో రుచుల్ని నేర్పిస్తుంది. ఇట్లా అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారం ఒక చిత్రమైన, ఊహించని మలుపు తిరుగుతుంది. భార్య మనసులోని కోరికను తెలుసుకున్న రామయ్య బజారులో మల్లె పూలు కనిపిస్తే కొనుక్కుపోయినంత సహజంగా దాన్ని తీర్చాలనుకుంటాడు. దాని కోసం ఎంతో ఆరాట పడుతాడు. రామయ్య మంచి మనసు, విశాల హృదయానికి ఆశ్చర్య పోయిన సీతమ్మ..

“నేనంటే ఎందుకింత ప్రేమ. నువ్వు ప్రేమించినంత ఇదిగ నేను నిన్ను ప్రేమిస్తున్ననా? అన్న అనుమానం వస్తున్నది నాకు. నా కిష్టమైనవన్నీ తెస్తనే ఉంటివి. ఇస్తనే ఉంటివి. ఏ మొగడైన గిట్లజేస్తడా? మంచి చెడు సూసేది లేదా?” అంటూ తీపిగా మందలిస్తుంది. ఇంతకు ఆమె మనసులోని కొరికేమిటి? ఆ కోరికను తీర్చడానికి రామయ్య ఏం చేశాడు. ‘అద్దం వెనుక’ ఏముంది? అనేది మనం కథలో చదవాల్సిందే. మొదటి నుంచి చివరిదాకా పాఠకుడిని ముక్కు పట్టి లాక్కుపోయే కథ.

భార్య భర్తల నడుమ ఉండాల్సిన ప్రేమ, అన్యోన్యత ఎంత గాఢంగా ఉండాల్నో చెప్తూనే ఈ కథ పరస్పర ఇష్టాలను గౌరవించాలని కూడా చాలా సున్నితంగా చెప్తుంది. అంత సంస్కారం మనలో ఎంత మందికి ఉందనేది కోటి రూకల ప్రశ్న. భార్య మనసు మూలలో తానూహించని కెరటమొకటి కదులుతుందంటే ఏ భర్తకైనా గుండెలోతుల్లో ముల్లుగుచ్చుకున్నంత బాధ కలుగుతుంది. కానీ ఈ కథలోని నాయకుడు రామయ్య నిరక్ష్యరాస్యుడు అయినా గుణంలో గొప్పవాడు. సీతమ్మ కూడా రామయ్యకు దీటైన ఉదాత్త గుణమున్న భార్యే. ఒక బలహీన క్షణంలో తన మనసు చలించినా తన కంటి ముందటి, తన మనసెరిగిన, నిజ జీవిత హీరో రామయ్యనే మనసారా ప్రేమిస్తుంది.

ఊహల్లో కాదు వాస్తవాదీన రేఖ మీద బతకాలని ఆ వైపుగా మలుపు తీసుకున్న పాత్ర సీతమ్మ. నిజానికి ఇందులోని భార్యా, భర్తలు తమ పరిణతి చెందిన ప్రవర్తన ద్వారా ఒకరికొకరు పోటీ పడుతారు. కథా వస్తువు ఎంత గొప్పదో కథ చెప్పడానికి వినియోగించిన శిల్పం కూడా అంతే గొప్పది కావడం వల్ల ఈ కథ ఒక మంచి కథగా మిగిలిపోయింది. లేక పోతే చాలా పేలవమైన కథగా తేలిపోయేది. ‘అద్దం వెనుక’ ఏముంది? అనే ట్విస్ట్ వల్లే ఈ కథ పాఠకులకు ఎప్పటికీ గుర్తుండి పోయే కథగా మారింది. కథకు వాడిన భాష, శైలీ కూడా ఆకట్టుకుంటాయి.

గ్రామీణ జీవితాలకు చెందిన కథ కాబట్టి అక్కడి భాషనే కథకు వాడడం చాలా బాగా నప్పింది. కథకుడు వాడిన ఉపమానాలు కూడా మనస్సుకు హత్తుకుంటాయి. సీతమ్మ రామయ్య మీద ప్రేమను ఎలా చూపిస్తుందో చెప్తూ ఆ ప్రేమ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజంగా ఉంటుంది అంటాడు. రామయ్యను వర్ణిస్తూ “ఎండనక, వాననక చేసే మొద్దు పనికి రాటుదేలి రాయిలాగా అయ్యాడు. తెల్లారేదీ, పొద్దుగుంకేదీ కూడా తెలీకుండా చేలల్లోనే చెట్టులా పెరిగాడు. కష్టం తప్ప కల్లాకపటం తెలియని మనిషి రామయ్య. చెట్టునూ, పుట్టనూ, పిట్టనూ, పశువునూ మాలిమి చేసుకున్నంత తొందరగా మనుషులతో కలవలేడు. సీతమ్మ తన జీవితంలోకి కాలు పెట్టాక మనుషులనూ ప్రేమించడం నేర్చుకున్నాడు రామయ్య” లాంటి వాక్యాలు కథకు చాలా బలాన్ని చేకూర్చాయి.

భార్య మనసు తెలిసిన తర్వాత రామయ్య మానసిక పరిస్థితిని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు కథకుడు. కథా సంవిధానం, కార్యకారణ సంబంధాలు చాలా చక్కగా కుదిరిన కథ. కథలోని ప్రతి వాక్యం కేంద్ర బిందువు వైపు పయనించడం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులోని ఏ ఒక్క వాక్యాన్ని తీసేసినా మొత్తం కథ కుప్ప కూలిపోతుంది. ఇది కథకుడు సాధించిన కథా చట్రం.

ఒకవైపు గ్రామీణ వ్యవసాయ జీవిత చిత్రణ, ఇంకో వైపు భార్య భర్తల అనురాగం జమిలీగా సాగుతాయి ఈ కథలో. జీవితంలో అప్పుడప్పుడు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య ఖాళీలు ఏర్పడుతాయి. వాటిని ఎలా అధిగమించాలో నేర్పే కథ ఇది. వాస్తవ జీవితంలో రామయ్య ఆలోచించినంత పరిపక్వతగా పురుషులంతా ఆలోచిస్తారా అనేది కాసేపు పక్కన పెడితే భార్య సంతోషం కోసం రామయ్య పడిన ఆరాటం మెచ్చుకోదగింది. కథ కొత్త ద్వారాలను తెరవాలి, ఏదో సరికొత్త పరిమళాన్ని మనసుకు పూసిపోవాలి. ఈ కథ అలాంటిది. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, భార్యా, భర్తల అనుబంధాలు విచ్చిన్నమౌతున్న తరుణంలో ఈ కథకెంతో ప్రాసంగికత ఉంది.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

36 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘అద్దం వెనుక’ కథకు ఈనాటికీ ప్రాసంగికత ఎందుకు ఉందో చెప్పిన తీరు బాగుంది . జీవితంలో అప్పుడప్పుడు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. వాటిని ఎలా అధిగమించాలో నేర్పే కద ఇది అనడం బాగుంది. మన సమాజంలో నూటికి నూరు శాతం(సారాంశం లో) మంది భర్తలు ఫ్యూడలిస్టిక్ భర్తలే అన్న విశ్లేషకుడి అభిప్రాయం తో ఎక్కువ మంది ఏకీభవిస్తారనుకుంటాను.కథారచయితకు, విశ్లేషకులు ఇద్దరికీ అభినందనలు

  • మీ విశ్లేషణ సదివినంక అసలు అద్దం వెనుక ఏముందో తెలుసుకోవాలనిపిస్తుంది. భార్య మనసులోని కోరిక ఎలాంటిదో చూడాలి. ఈ కథ నమూనాగా తెలిసిన దంపతుల అనురాగాన్ని కొలువాలి అన్నంతగా అనిపిస్తుంది.

    ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం వల్ల చెప్పేవారు లేక వారివారి అహాల వల్ల చాలామంది తమ బంధాల్లోని అన్యోన్యతను కోల్పోతున్నారు. ఇటువంటి కథల అవసరం ఇప్పటి సమాజానికి అవసరం.

  • “”కథను నేను చదవలేదు కాని ఆ కథను చదివించినంత బాగా విశ్లేషించారు,ముఖ్యంగా మీరు వాడే భాషలో చాలా పరిణతి కనిపించింది,నిజానికి “”అద్దం వెనక”ఏముందో తెలియదు గాని మీ విశ్లేషణ మాత్రం చాలా బాగుంది…

  • మానవ సంబంధాలు, భార్యా, భర్తల అనుబంధాలు విచ్చిన్నమౌతున్న తరుణంలో ఈ ‘ అద్దం వెనుక’ కథకు ప్రాసంగికత ఉంది.

    గొప్ప విశ్లేషణ. రామకృష్ణ రెడ్డి, వెల్దండి శ్రీ ధర్ గార్లకు అభినందనలు

  • అద్దం వెనుక ఏముందో చాలా బాగుంది వివరించారు సార్. మంచి విశ్లేషణ. కథ చదవకుండా వదలం.

  • వ్యాసం మొదటి పేరాలోనే “అద్దం వెనుక” అని కథ పేరు బ్లూ కలర్ లో ఉంది. దాని మీద క్లిక్ చేసి కథను లోడ్ చేసుకొని చదవొచ్చు. స్పందించిన గుండెబోయిన శ్రీనివాస్, బండారి రాజ్ కుమార్, బంటు ఆనంద్, డా. సిద్దెంకి యాదగిరి గారలకు ధన్యవాదాలు…

  • “కథా సంవిధానం, కార్యకారణ సంబంధాలు చాలా చక్కగా కుదిరిన కథ. కథలోని ప్రతి వాక్యం కేంద్ర బిందువు వైపు పయనించడం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులోని ఏ ఒక్క వాక్యాన్ని తీసేసినా మొత్తం కథ కుప్ప కూలిపోతుంది. ఇది కథకుడు సాధించిన కథా చట్రం” అని గింత మంచిగ చెప్పినంక ఇగ ఇప్పుడే సదువాలనిపిస్తుంది.. ఆసక్తికరమైన విశ్లేషణ…

  • Relevant to present Telangana rural society good review
    Husband s generally don’t allow ideas of wives.

  • Hi,
    Sreedhar katha Ela undo teliyadu kani nee vishleshana chusaka a katha chsdivithe enkentha baguntundo anpisthunda.. kotha pathakulni etle akarshinche vimarsha needi
    Hatsoff to you.

  • చక్కటి విశ్లేషణ సర్… హృదయపూర్వక అభినందనలు…

  • కథపై మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సర్. నిష్కల్మషంగా చేసే విశ్లేషణలు రచయితకు ఎంతగానో తోడ్పడతాయి . అభినందనలు సర్. వ్యాసం చివరనా వ్రాస్తాను. 💐💐💐🙏

  • బంధాలు అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్న ఈ కాలంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి అద్దం వెనుక ఏముంది కథ ప్రాసంగికతను చాలా బాగా విశ్లేషించారు. గ్రామీణ జీవితాల నేపథ్యం నుంచి కథను సమీక్షించిన తీరు, లోతుగా ఉంది చక్కని విశ్లేషణ ను అందించిన వెల్దండి శ్రీధర్ కి అభినందనలు రామకృష్ణా రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు

  • కథపై మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సర్. నిష్కల్మషంగా చేసే విశ్లేషణలు రచయితకు ఎంతగానో తోడ్పడతాయి . అభినందనలు సర్. వ్యాసం చివరనా వ్రాస్తాను. 💐💐💐🙏

  • మీ విశ్లేషణ చదివిన వెంటనే అద్దం వెనుక ఏముందో, సీతమ్మ కోరిక గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.వెంటనే చదివాను.రచయిత ఆత్మను చక్కగా తెలిపారు. ఊహ, వాస్తవాలలో వాస్తవాన్ని స్వీకరించిన సీతమ్మ, రామయ్య ల పరిణితి కనిపిస్తుంది…అని మీరు ఇచ్చిన విశ్లేషణ బాగుంది.ఈ యాంత్రిక జీవితంలో ఎంతమంది రామయ్యలో..మంచి కథా విమర్శ.

  • అద్భుతమైన కథ.నిజంగా వాళ్ళ ప్రేమను చదువుతుంటే మనసంతా ఒకరకమైన పులకింత.రామయ్య సీతమ్మ ల ప్రేమ చాలా అద్భుతంగా ఉంది. నిజముగా అలాంటి ప్రేమ పొందటం ఒక గొప్ప వరం.కథా పఠన సమయంలో వాస్తవానికి ఈర్ష్య పుట్టింది.ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందా అని అనిపించింది.అతుకుల బొంతల బ్రతుకులలో కనిపించే చిన్న దీపాన్నే ప్రేమ అనుకుంటున్న మనం రామయ్య,సీతమ్మల స్వచ్ఛమైన ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని ఆస్వాదించాలి.స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు,జీవితం అందంగా ఉంటుంది అని చాటి చెప్పిన కథ.చదువు,డబ్బు,అందం,ఆస్తుల కంటే ఆనందాన్ని పంచేది స్వచ్ఛమైన మనస్సే అని తెలియచేసే కథని అందించిన మిత్రమా మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
    కథా పఠనం ఒక గొప్ప లక్షణం.కథల వల్ల ఎన్నో కొత్త కొత్త ముఖాలు,లక్షణాలు కల్గిన వ్యక్తులు,కొత్త లోకం,కొత్త కొత్త సంస్కృతులు, ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కేవలం కథల ద్వారానే సాధ్యం.మన ఊహకు కూడా అందని,చూడని విషయాలను తెలుసుకోగలుగుతాం.ఇంత మంచి కథలను అందిస్తూ,వాటిపైన సరియైన విశ్లేషణ తో మా మనసులను రంజింపచేస్తున్న శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

  • ఒక చిన్న కథాంశాన్ని ఎంత ఆర్ధంగా, హృద్యంగా రాయవచ్చో అంతకన్నా ఎక్కువ ఆర్ధంగానూ, హృద్యంగానూ, అర్థవంతంగానూ “అద్దం వెనుక” కథను రాశారు రచయిత శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారు. ఆ కథను శ్రీ శ్రీధర్ గారు ఎంతో విపులంగా విశ్లేషించారు. మొదట ‘విశ్లేషణ’ చదివాను. ఎంతయినా ‘చేయి తిరిగిన విశ్లేషకులు’ కదా, బాగా రాశారనుకొని కథను చదివాను. కథను చదివాక ఎందుకో విశ్లేషణ మళ్లీ చదవాలనిపించి రెండవసారి చదివాను. ఎంతో నచ్చింది. కథా రచయిత ధన్యుడు కదా అనిపించింది. కథను అక్షరం పొల్లు పోకుండా చదివీ, కథాసారాన్ని ఔపోసన పట్టీ, కథాత్మను అవగతం చేసుకునీ, ఎంతో ఇష్టంగా ఈ కథను శ్రీ శ్రీధర్ గారు విశ్లేషించారనిపించింది. మామూలుగా ఉన్న ఆ వాక్యాలలో ఇంతటి మార్మికత ఉందా అని అబ్బురపడేలా వివరంగా సూత్రీకరించారు. రచయిత గారు అన్యదా భావించరనే అభిప్రాయంతో సాహసించి ఇక్కడ ఒక మాట చెప్పదలచుకున్నాను. కథ అద్భుతంగా ఉంటే, విశ్లేషణ అంతకన్నా ఎంతో గొప్పగా, అత్యంత అద్భుతంగా ఉంది !! వారిరువురికీ నా హృదయ పూర్వక అభినందనలు.!!!

  • తెలంగాణ పల్లెల్లో ఎద్దోలే బతికే అనేక మంది భర్తలు, భర్త అడుగుల్లో అడగుగా జీవిత పర్యంతం కరిగిపోయిన భార్యలు మీ విశ్లేషణ వెనుక కనిపిస్తున్నారు అన్నయ్య.

    మట్టిలో పుట్టి మట్టిలోనే బంధాలను అల్లుకొని మట్టిలోనే కలిసిపోయిన ప్రకృతి పురుషులు కనిపిస్తున్నారు.

    కథ పూర్తిగా చదవాలన్న ఆసక్తి రేపిన విశ్లేషణ అన్నయ్య. చాలా బాగుంది.

  • మంచి విశ్లేషణ అన్న… కథ లాగే ఆసక్తి గా సాగింది.

  • కథా నిర్మాణం ఎలా ఉందో, అద్దం వెనుక ఏముందో కానీ మీ విశ్లేషణ మాత్రం ఆసాంతం తెల్వకుండానే నా చేయి పట్టుకొని పరుగెత్తుకుంటూ తీసుకెళ్లింది. మీకు అభినందలు సార్

  • కుటుంబమే సమాజానికి మూలదినుసు. ఆలుమొగల అనుబంధాలు, సంసారానికి ఇరుసులాంటిది. దంపత్యజీవితములో , ఇతర వ్యక్తుల్ని వూహించుకోవడం మధ్యతరగతికి మాత్రమే కాదు మానవ జాతికి ఉన్న ఒక బలహీనతగా సిగమాండ్ ఫ్రాయిడ్ ఏనాడో చెప్పాడు.
    అద్దం ముందు కంటే అద్దం వెనక సంగతి తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. సమీక్షకులు కథలోని సున్నిత భావాలను చాలా చక్కగా పట్టుకున్నారు. అభినందనలు.

  • గ్రా మీణ వాతావరణంలో భార్య భర్తల సంబందాలను మానవ సంబంధాల లను చక్కగా విశ్లేషించారు.ఈ ప్రేమానురాగాలతోనే భారతీయ సంస్కృతి సజీవంగా ఉంది.పెళ్ళి అనే బంధం తో రెండు జీవితాలు ముడిపడి పోతాయి

    మీ రివ్యూ చదివాకా కథ చదవాలనే ఆసక్తి కలుగుతుంది.

  • *విశ్లేషణ వెనుక*
    అద్దం వెనుక చదవక ముందే ” విశ్లేషణ వెనుక” ఏంటా అని చదివాను .అద్దం వెనుక ఏముందో అర్థమైపోయింది..నిజంగా ఇలాంటి కథలు ఇప్పటి తరానికి ఎంతో అవసరం అనిపించింది . అద్భుతమైన విశ్లేషణ అందించిన డా.శ్రీధర్ గారికి కథా రచయిత కి ఇద్దరికి అభినందనలు … త్వరలో అద్దం వెనుక చదవాలి

  • చక్కని విశ్లేషణ సార్
    మీరు చేస్తున్న కథా సమీక్ష విశ్లేషణ లు చాలా బాగున్నాయి
    నాకైతే మీ సమీక్ష వలన ఎంతలోతుగా కథను అర్థం చేసుకోవచ్చు అనేది తెలిసింది
    ధన్యవాదాలు

  • కొట్టం రామకృష్ణారెడ్డి రాసిన అద్దం వెనుక కథకు వెల్దండి శ్రీధర్ చేసిన విశ్లేషణ చాలా చక్కగా ఉంది. విశ్లేషణ చదివిన తర్వాత పాఠకుడికి అద్దం వెనుక ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం తప్పక కలుగుతుంది. పాఠకుడి చేత కథను చదివింప చేస్తుంది. నేను కూడా అదే చేశాను. అద్దం వెనుక కథ భారతీయ సంప్రదాయంలోని పెళ్లి, భార్యాభర్తల అనుబంధాన్ని విశ్లేషించే కథ. కథకు మంచి ముగింపు రచయిత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ కథలో రామయ్య, సీతమ్మ పేర్లను రచయిత ఎన్నుకోవడం లోనే ఆదర్శ దాంపత్యాన్ని సూచించాడు. భార్య భర్తలు ఒకరి కోరికలను,మరొకరు నెరవేర్చడానికి ఎలా తాపత్రయపడతారు చాలా సహజంగా చిత్రీకరించారు రామకృష్ణారెడ్డి. సీతమ్మ రామయ్య ల పెళ్లి తర్వాత .. గంతకు తగ్గ బొంత, కాకి ముక్కుకు దొండ పండు అనే రెండు భిన్న అర్థాలను సూచించే నానుడులను రచయిత ఎందుకు రాశారో?.
    శ్రీధర్ ,విశ్లేషణలో సెక్సాలజీ ఈ కథకు సరికాదని నా అభిప్రాయం.

  • విశ్లేషణ చాలా బాగుంది. ఇలాంటి కథలు నేటి కాలంలో ఆలుమగల అనుబంధానికి ఎంతగానో ఉపయోగకరం.

  • రావుల కిరణ్మయి,హన్మకొండ,వరంగల్ says:

    సమీక్ష ఒక మంచి కథ ను పరిచయం చేసింది.బాగుంది అనడం సరిపోదేమో. అద్దం వెనుక ఏముందో అనే ఆతృతను చివరి వరకు కొనసాగించి పాఠకుల లో ఉత్సుకత ను కలిగించారు. చదువుతున్న ంతసేపు ఈ కథ ఎలా దొరకాలని ఆలోచిస్తూ చదివాను.చివరగా మీరు బ్లూ లైన్ టచ్ చేయండి.కథ చదవడానికి అని చూసి ఊరట చెందాను. విశ్లేషణ అనేది నా దృష్టిలో కథకు జరిగిన అభిషేకం లా తోచింది.ఇంకా మంచి మంచి కథలను పరిచయం చేయాలని మీ కృషి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

  • కథను చదివించేలా ఉంది సార్ మీ విశ్లేషణ.

  • మీ కథా విశ్లేషణ చాలా బాగుంది ఆ కథను ఒకసారి చదవాలని ఉందిఅనేంతగారాసారు.
    అద్దంవెనుక ఎలాంటి అగాధం ఉందోతెలుసుకోవాలని ఉందిపూర్తి కథను పంపి స్తారని ఆశిస్తున్నాను

  • “అద్దం వెనుక” కథా విశ్లేషణ చదివిన తర్వాత కథ చదవాలనిపించేట్లు చేయడం ద్వారా మీరు విజయవంతమయ్యారు

  • చాలా అద్భుత వర్ణన. మీ విశ్లేషణ పుస్తకం పై ఆసక్తి రేకెత్తిస్తోంది. చదవాలనిపిస్తుంది.

  • పల్లెటూరి వాతావరణానికి అద్దం పట్టిన కథ ‘అద్దం వెనుక’.
    కథ చెప్పినతీరు,సంభాషణలు సహజపరిమళాలతో ఉంది.
    వెల్దండి శ్రీధర్గగారి విశ్లేషణ కథపట్ల,రచయిత పట్ల సహృదయతతో, సహానుభూతితో సాగింది. ‘కథను చదువాలె’ అన్న ఆసక్తి కలిగించేవిధంగా ఉంది.
    ఫాంటసైజు చెయ్యటం మధ్య,దిగువతరగతులలోనే కాదు .అన్ని తరగతులలోనూ ఉంది.
    కథాపరంగా చూస్తే—–
    రామయ్య తన భార్య ఇష్టాన్ని గమనించి ఆమె కోరిక తీర్చాలనుకోవటం సహజంగా లేదు.ఎంత ప్రేమ ఉండనీకాక, ఎంత ఏమీ చదువుకోని పల్లెఅమాయకుడు కానీకాక ఏ మగవాడూ ఆ పని చెయ్యడు.
    ‘కాకిముక్కుకు దొండపండు’ సామెత సరే , ఓకే.
    మరి గంతకుదగ్గ బొంతేంది?బహుశా సీతమ్మ కుంటిదనేమో!

  • sir, you selected cotridictory story to under stand the differenciation evevn bitwin wife and husbund and also social persions. without explantion of contridiction of literature its not a literature such literature is decieved literature .

  • Addam venuka kathanu adyantham vishleshinchina Sridhargaariki, yuva kathaa keratam Ramakrishnaku Haardhika Abhinandanalu

  • మీరు చేసిన వ్యాఖ్యానం ఎప్పటి లానే అద్భుతంగా ఉంది సార్. గ్రామీణుల మనస్తత్వం లోని స్వచ్ఛత పాఠకుల మనసుపై ప్రత్యేక ముద్ర వేస్తుంది.రచయిత కథనం,మీ విశ్లేషణ ఒక సానుకూల దృక్పథాన్ని పఠితలకు అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

  • మీరు సమీక్షించిన…
    అద్దం వెనుక కథ… విశేషాలు. చదువుతుంటే… పూర్తి కథను చదవాలని పించింది…. భార్యా భర్తల మధ్య అన్యోన్యత హృదయాలను గెలుచుకుంది…
    మంచి కథలకు… మంచి విశ్లేషణ మరింత బలాన్ని చేకూరుస్తుంది… శ్రీధర్ గారి కలం నుండి…
    మరిన్ని… విశ్లేషణలు… రావాలని కోరుకుంటూ…
    Weldon…Mr.Veldanti…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు