అదొక ప్రేమ లేఖ

శేఖర్ కమ్ముల ఏంచెప్పినా మరీ మన ఇంట్లో కథలలాగే ఉంటాయి చాలా వరకూ. హేపీడేస్ సినిమాలో ఒక సన్నివేశం చూస్తుంటే అందరూ తరచుగా వాడే ఒక సేయింగ్ గుర్తొచ్చింది. అందరూ అంటే అందరూ కాదు. సాహిత్యం బాగా చదువుకుని జీవితాన్ని చక్కగా అర్ధం చేసుకునే వాళ్లనమాట.
లైఫ్ ఈజ్ గ్రేటర్ దేన్ ఫిక్షన్. అనే మాట అది.
జీవితానుభవాలనుంచే కళలు ఉద్భవిస్తాయి. రచయితలు కళాకారులు అనుభవాలకు కాసిని రంగులు అద్ది మనని విభ్రమం లో ముంచుతారు.
ఇంతకీ ఆ సినిమాలో బహు చురుకుగా ఉండే ఇంజనీరింగ్ కుర్రాడు ఉంటాడు. మిగిలిన మగపిల్లలు తమ సహ విద్యార్ధినులను ప్రేమిస్తే వాడు ఏకంగా ఇంగ్లీష్ మేడం నే ప్రేమిస్తాడు.
ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఆవిడ చూసీ చూడనట్టు వదిలేస్తూ ఉంటుంది. ఒకసారి మిత్రులందరూ పిక్నిక్ కి వెడుతూన్నప్పుడు ఆమెను తమతో రమ్మని కోరుతాడు. ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. వాళ్లాయన ఫోటో కూడా చూపెడుతుంది. కానీ వినడు. ఏమైనా రావాలంటాడు. అప్పుడు ఆమె ఒక ఇంగ్లీష్ పద్యం ఇచ్చి ఇది చదివి అప్పజెపితే వస్తానంటుంది.
చదువు మీద శ్రద్ధ లేని ఆ కుర్రాడు నానా పాట్లు పడి చదవి ఆమె కు అప్పజెప్పడంలో ఆమె వంపుసొంపులకు వివశుడై నట్లు కొడతాడు
సరే ఆమె రాను పొమ్మంటుంది.
శేఖర్ నేర్పరి ఐన కళాకారుడు. ఈ సన్నివేశానికి లింక్ చివర్లో కలుపుతాడు.
కాంపస్ సెలక్షన్స్. కంపెనీలు వస్తున్నాయి. సదరు కుర్రవాడు ఇంటర్య్వూ కి హాజరయ్యాడు. ఆ కళాశాలలో చదివిన సీనియరే బోర్డు లో ఉన్నాడు. ఇంటర్వ్యూ లో ఒక్క ఇంగ్లీషు మాటేనా మాటాడలేక పోతే సెలక్ట్ చేసే అవకాశం లేదు. వీడికి రాదు. సీనియర్ బతిమాలుతాడు. ఒరేయ్ ఒక్క వాక్యం చెప్పరా అని.
సడన్ గా వీడికి ఆ పోయమ్ గుర్తొస్తోంది. గడగడా చెప్పేస్తాడు.
ఉద్యోగం వచ్చేసింది.
 మేడమ్ ఎందుకోసం చదివించినా అది ఎంత బాగా ఉపయోగపడిందీ వాడికి. మంచి ఆలోచనలూ పనులూ ఏ ప్రలోభంతోనో, లేదా తప్పకో చేసినా ఎప్పటికైనా అవి గొప్పగా ఉపయోగపడితీరుతాయి. చట్టక్కున నా అనుభవమే గుర్తొచ్చింది.
మాకు భాషాప్రవీణ మూడవ సంవత్సరం లో రామరాజభూషణుడి వసుచరిత్రం పాఠ్య భాగంగా ఉండేది. అంటే అందులో ఒక ఆశ్వాసం మొత్తం. దాదాపు నూటతొంభయ్ పద్యాలు.
మాష్టారు మల్లంపల్లి శరభయ్య గారు చెప్పేవారు. ఒక పీరియడ్ కి ఒక పద్యం అయ్యేది. ప్రతీ పద్యానికి రెండుకు మించి అర్ధాలుంటాయి ఆ ప్రబంధంలో.
నిన్నటి పద్యం ఇవాళ క్లాస్ లో విధిగా అప్పజెప్పి తీరాలి. లేకపోతే మాష్టారు ముక్కచివాట్లు పెట్టేవారు.
ఏడ్చుకుంటూ చదివేవాళ్లం. ఒక్కొక్కనాడు అప్పటికప్పుడు బట్టీపట్టి నట్టుతూ చెప్పేవాళ్లం. ఆయనకు తెలిసిపోయేది. ముక్కున పట్టుకుని వచ్చేవు ఎక్కడో దార్లో జారిపోయి ఉంటుంది. పోయి వెతుక్కో అని తిట్టేవారు
ఏమైతేనేమి ఆ సంవత్సరం ఆ నూటతొంభై పద్యాలూ అప్పజెప్పేసేం. .తర్వాత సంవత్సరం చదువు ఐపోయింది. నేను ఏదో హైస్కూల్ కి తెలుగు పంతులమ్మ గా వెళ్లిపోదామనుకున్నాను.
కానీ నాకు వచ్చిన గ్రేడ్ కి ఓరియంటల్ కాలేజీ లో అధ్యాపకురాలిగా ఉద్యోగం వచ్చింది. నిండా ఇరవయ్యేళ్లు లేవు. నేనా ఆడపిల్ల ల కాలేజ్ లో చదువుకున్నాను. ఇక్కడ కో ఎడ్యుకేషన్. జమాజెట్టీల్లాంచి ఆడపిల్లలు నా కంటె పెద్దవాళ్లైన మగపిల్లలు.
నేను చదువుకుని వచ్చిన వసుచరిత్ర అదే అధ్యాయం పాఠం చెప్పాలి.
ఇంకేం ఉంది. మొత్తం నోటికి వచ్చు గా. కుర్రాళ్లు మొదట్లో చిన్న పర్సనాలిటీ ఉన్న ఈ చిన్న మేడమ్ ని ఓ చూపు చూద్దాం అనుకున్నారట.
మా మాష్టారి దయ వల్ల నేను పుస్తకం అక్కరలేకుండా గడగడా పద్యం చదివి రెండు మూడు అర్ధాలతో వ్యాఖ్యానిస్తూ పాఠం చెప్పేసరికి రమారమి ఆరడుగుల పొడుగున్న మధునాపంతుల సత్యనారాయణమూర్తి కూడా కిక్కురు మంటే ఒట్టు.
ఐతే వాళ్ళకి తెలియని రహస్యం అలా నేను ఆ ఒక్క ఆశ్వాసం మాత్రమే చెప్పగలనని. కానీ అది కల్పించిన ఆత్మ విశ్వాసం ముప్ఫయి ఎనిమిదేళ్ల ఉద్యోగ జీవితం మీద ఉండిపోయింది.
బలవంతంగా చేయించినా మంచి పనులు ఎలా అవసరం లో పెద్ద అండ అవుతాయో బహుశా శేఖర్ కీ అనుభవం లో ఉండే ఉంటుంది. లేకపోతే అలాంటి సంఘటన ముందు వెనకలతో తియ్యలేడు.
ఇంత కథ చెప్పుకున్నాక వసుచరిత్ర లో ఒక పద్యమేనా చెప్పుకోక పోతే ఎలాగ?!
గిరిక నాయిక వసురాజు నాయకుడు. ప్రేమా, తర్వాత విరహంలో ఉండగా గిరిక చెలులతో పూలతోటలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఆమె విరహం పెరిగి పోయి తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది.
అదంతా అతిశయోక్తి మయమే. కానీ ఆ చమత్కారం, భాషా సౌకుమార్యపు వైదుష్యం ఏమని చెప్పగలం చూడండి
పవమానమానవ ప్లవమాన కైరవ చ్యవమాన రజము
మైనంట తివురు
కరసారసాగ్ర తామరసాతిసాంద్ర సీధురసాప్తి కన్నీరు తుడవగోరు
మదనానలప్రభా సదనామ్లకోమల చ్ఛదనార్చి పై చూపు జరపజూచు
సలయాహతలతాకిసలయాగమలయాగమలయా
నిలున కూర్పు తెలుపదలచు
గుంజ పుట గుంజదళిపుంజశింజితంబు
వెగ్గలంబైన చెవియొగ్గి వినగడంగు
పంచశరభూత పరిభూత పంచభూతములు
తదాయస్థలంబుల గలుపు కరణి
ఈ పద్యం ఒక్క సారి పైకి చదివి చూస్తే ఆ అందమేమిటో తెలుస్తుంది. భట్టుమూర్తి తన పద్యాలు వీణ మీద పలికించేవాడట.
మరణం అంటే మనలో ఉన్న పంచభూతాలూ ప్రపంచంలో ఉన్న పంచభూతాలలో కలిసిపోవడమే కదా, అందుకని నాయిక ఆత్మహత్య ఇలా చేసుకుంటోంది.
గాలికి కదులుతున్న కలువపువ్వు లోంచి రాలుతున్న పుప్పొడిని శరీరానికి రాసుకుంటోంది.
తన చేతిలోఉన్న తామర పువ్వులోని మకరందంతో కన్నీటిని కలుపుతోంది.
ఎర్రని మంట లాంటి మామిడిచిగుళ్ల కాంతి తో దృష్టి ని కలిపేస్తోంది
మంట లాంటి మలయానిలంతో ఊర్పు గాలిని కలుపుతోంది
తుమ్మెదల రొద తాలూకు శబ్దం లో తన వినికిడి ని చేరుస్తోంది.
ఇలా మన్మధుడి పంచబాణాల్లాంటి పంచభూతాలలోనూ తనలోని పంచభూతాలను కలపడం ద్వారా మరణానికి సన్నద్ధమౌతోంది. అంటే ఆమె విరహం తోటలోని ఈ దినుసుల వల్ల చావుతో సమానంగా ఉంది అని చమత్కారం.
ఇలా ఈ పద్యం మీద గంటసేపూ క్లాస్ చెప్పవచ్చు. అదలా ఉంచుదాం.
ఈ ప్రబంధ కవులందరిమీదా పూర్వకవుల ప్రభావాలు ఉన్నాయి. ఈ ఊహకి మూల శ్లోకం మాష్టారు అప్పుడు చెప్పారు. దాని మీద ఇష్టం తో వెంటనే కంఠస్థం చేశాను. ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే అదొక ప్రేమ లేఖ
పంచత్వం తనురేతు భూతనివహే స్వాంశా మిళంతు ధృవం
ధాతత్వాం ప్రణిపత్య సాగరమిదంయాచే
నిబద్ధాంజలిః
తద్వాపీషు పయః తదీయముకురే జ్యోతిః
తదీయాంగణే వ్యోమస్యాత్చ
తదీయవర్త్మని ధరా తత్తాళవృంతేనిలః
కవి ఒక అలభ్య అయిన ఆమెను ప్రేమించాడు. ఆమె దొరకదని తెలిసి ఆమె లేకపోతే బతకలేనని చెప్తూ శ్లోకం లో ప్రేమ లేఖ రాశాడు. ఆమెకు పంపాడు
చనిపోవడం అంటే మన లోని పంచ భూతాలను విశ్వం లోని పంచభూతాలలో వేటిని వాటిలో కలపడం కదా
కాబట్టి నేను చనిపోయాక నాలోని జలాంశ నువు నిత్యం స్నానం చేసే నూతి నీళ్లలో కలవాలి.
నువు అందం చూసుకునే అద్దం లో తేజో అంశ, నువు తిరిగే ప్రదేశంలో ఆకాశం అంశ,
నువు నడిచే నేలమీద పృధ్వీ అంశ,
 నువు వీచుకునే తాలవృంతాలలో నాలోని వాయువు తాలూకు అంశా కలవాలని కోరుకుంటున్నాను
అని ఈ ప్రేమ లేఖకి అర్ధం
ఎంత అద్భుతంగా ఉందీ
ఇక ఆ ప్రియురాలు అతన్ని వదిలిపెడుతుందా
కానీ రాలేక పోయింది
అతను చనిపోయాడు
చివరికి మళ్లీ జీవితం సాహిత్యం కన్న ఎంతో కఠినమైనది అన్న చోటుకే చేరుకున్నాం అనుకుంటాను .
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జీవితం ఎన్ని పూతోటల వెంటతిరిగినా చేరవలసిన మజిలీ చేరి తీరాల్సిందే..శేఖర్ కమ్ములను, వసుచరిత్రను మీరు మాత్రమే ముడి పెట్టగలరు, ప్రేమలేఖ రాయగలరు.

  • మొదట అన్ని పద్యాలు కంఠతా పట్టి, ఇంకా గుర్తుపెట్టుకున్న మీకు 👏👏👏 .. Life is beautiful movie నేను చాలాసార్లు చూశాను్. Life is Greater than Fiction! నాకు “North 24 Kaatham ” malayalam movie గుర్తుకొచ్చింది. .నేను IFFలో చూశాను. ఈ మద్యన మళ్ళీ చూశాను. IT company లోపనిచేసే ఒక యువకుడు అనుభవంతో జీవితం చాలా గొప్పది అని.తెలుసుకుంటాడు. Life is Beautiful , శేఖర్ కమ్ముల సినిమానుంచి , విద్యార్థి జీవితం, అలాగే ఉద్యోగపర్వానికి తీసుకుని వెళ్ళి, వసుచరిత్రలోని పద్వాలను తీసుకుని అలభ్యమైన యువతిని ప్రేమించి ప్రియురాలిని పొందలేక , ఆ బాధతో పంచభూతాలను కలిపి ప్రేమలేఖను రాయించి మృత్యువును పొందటం !!,ఎలా లింకులు అల్లుకుంటూ వెళ్ళారో చూడండి! ఇలా తీగలు అల్లుకుంటూ వెళ్ళటంమీకే సాధ్యం! ఎక్కడినుంచీనో ఎక్కడికో తీసుకుని వెళ్ళి వదులుతారు. అభినందనలు మీకు !

  • Life is beautiful అని మొదలు పెట్టి Life is painful అని ముగించారు.మీ ఆలోచనల కదంబం ఎంతో బావుంది లక్ష్మి
    గారూ ! మీ ప్రేమలేఖ నోరు తిరక్కపోయినా అర్ధం ఎంతో నచ్చింది.అభినందనలు.

  • హీనపక్షం కుత్తుకబంటి అనుభూతులైనా లేకుంటే ఏ కళారూపాన్నీ లోనికి తీసుకోలేని నేను, కనీసం కాలి మడమలు, గిలకలు కూడా తడపని శేఖర్ కమ్ముల సినిమా ప్రస్తావనతో మొదలైన ఈ శేఫాలికని చదవడానికి మున్ముముందుకు వెళ్లిన కారణం- తలకూడా మునిగిపోయే నిండారు అనుభవాన్ని ఇవ్వడంలో మీరెన్నడూ నిరాశపరచరన్న నమ్మకంతోనే వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారూ. అప్పట్లానే అద్భుతం

  • అద్భుతమైన సంస్కృత తెలుగు పద్యాలు,
    సరళమైన అంద మైన వివరణ.
    ధన్యవాదాలు

  • ఎక్కడి శేఖర్ కమ్ముల – Happy Days సినిమా…ఎక్కడి వసుచరిత్ర?
    ఎక్కడ ఎవరి మధ్య ప్రేమ! ఎవరి మధ్య మోహం! భలేగా ముళ్ళు వేసారు. జీవితం అంతా బంధాలు, అనుబంధాల ముడులేగా! Of course, at the end of the day, life is greater than fiction.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు