అదే తుది వీడ్కోలు అనుకోలేదు!

జీవిత యానాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తుంటారు. అందరూ ఒకే స్టేషనులో  రైలు ఎక్కరు. ఒకే స్టేషనులో దిగరు. అందువల్ల ఎవరితోనైనా మన పరిచయాలు ఏ స్టేషన్లో మొదలయ్యాయి , సంభాషణలు స్నేహంగా మారేంత దూరం ప్రయాణం చేశామా?  ప్రయాణం ప్రభావశీలమైనదేనా వంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనముందుకు వస్తాయి. తొంభై ఏడేళ్ల వయసులో కథ గురించిన పూర్తి స్పృహలో  ఉండగానే కోడలు ఇచ్చిన ఉదయపు కాఫీ తాగి తన ఊపిరిని తూర్పుగాలికి ఇచ్చి  కథాపట్నం రామారావు   కూతురి చేతుల్లో ఒరిగిపోయిన వార్త విన్నప్పటి నుండి నా పరిస్థితి అదే. ఆ భావోద్విగ్న జ్ఞాపకాల మత్తడి తో చిత్తడి అయిన నాలాంటి సమాన ధర్ముల కోసం ఈ నాలుగు మాటలు.

   రామారావు గారి కథలతో   నా తొలి పరిచయం 1972 ప్రాంతాలలో . మా నాన్న కేతవరపు రామకోటి శాస్త్రి గారికి భారతి పత్రిక నుండి సమీక్ష కోసం వచ్చిన మూడు కథల సంపుటి  నాకు కాళీపట్నం రామారావు గారిని పరిచయం చేసింది. శాంతి , వీరుడు – మహావీరుడు , చావు అన్న మూడు కథలు అందులో ఉన్నాయి.చావు కథ చాల రోజులు నన్ను వెంటాడింది.  తల్లీ తండ్రీ కూలిపనులకు పోతే ముసలవ్వ దగ్గర కనిపెట్టుకొని ఉన్న అమ్మాయి అవ్వ ను చలి నుండి కాపాడటానికి ఇంట్లో ఉన్న గుడ్డముక్కలు అన్నీ తెచ్చి కప్పి చనిపోయిందని తెలిసాక శవం మీద బట్టలు తీయవచ్చా తీయకూడదా అన్న ప్రశ్నను లోలోపలే అణిచేసుకొని చలికి  వణుకుతున్నతమ్ముణ్ణి చూస్తూ   బట్టలు ఒక్కొక్కటే తీసి దులిపి మడతలు పెడుతున్న దృశ్యం కళ్ళ ముందు అలా పటం కట్టినట్లు అయి ఆందోళన పెట్టింది. 1975 లో ఎమ్మెలో చేరాక డిపార్ట్మెంట్ గ్రంధాలయంలో ఏ అవసరం కోసమో పాత భారతి ప్రతులు తిరగేస్తుంటే రాగమయి వంటి కథలు తటస్థపడి చదవమన్నాయి. కుటుంబంలో అధికారాలు, అభిమానాలు ,ప్రేమలు , బాధ్యతలు ఒక గంభీరమైన వాతావరణంలో చిత్రించబడిన  ఆకథలు చదువుతుంటే అర్ధమవుతున్నట్లే ఉండి , అంతుపట్టని గూఢత ఏదో అనుభవానికి వస్తుండేది. బుచ్చిబాబు రచనల కోసం, దానితో పాటు కొడవటిగంటి కుటుంబరావు రచనల కోసం పరిశోధనా కాలంలో రకరకాల పాత పత్రికలు వెతుకుతూ ఏ కథ  కనబడ్డా ఆగిపోయి చదివే క్రమంలో కాళీపట్నం రామారావు కథలు దాదాపు అన్నీ చదివేశా. 1982 నాటికి ఇంత జరిగింది.

 ఆ తరువాత రెండేళ్లకు విశాఖ పట్నంలో కాళీపట్నం రామారావు గారితో ప్రత్యక్ష పరిచయం కలిగింది.  1984 (ఆగస్టు ?) లో విశాఖపట్నంలో జరిగిన విరసం కథా నవల వర్క్ షాప్ కు హాజరు కావటం వల్ల  ఆయనకు విద్యార్థిని కాగలిగాను. ఆ వర్క్ షాప్ కు రావిశాస్త్రి , కాళీపట్నం రామారావు ఇద్దరు మాస్టర్లు .. వాళ్ళిద్దరి ని చూడటమే కాదు , మూడు రోజులు సన్నిహితంగా మెలగటం, కథ గురించిన వాళ్ళ అనుభవ పాఠాలను వినటం ఎంత ఆనందించానో … రామారావు గారు అసలే టీచర్ కదా ! కథల రచనలో మెళుకువలు , అధ్యయన విమర్శ పద్ధతులు బోధపరచటానికి కొన్ని కథలను ఎంపిక చేసి కాపీలు తీయించి పంచి ముందుగా చదివి రావాలని   హోమ్ వర్క్ ఇయ్యటం,    ఆ కథల పై ప్రశ్నలు వేసి   క్లాస్ లో ప్రతి ఒక్కరి అవగాహనను పరిశీలించి చర్చను కొనసాగించిన తీరు కథా విమర్శకు, కథా బోధనకు కూడా నాకు ఒక పద్ధతిని అభివృద్ధి చేసుకొనటానికి ఎంతో ఉపయోగపడ్డాయి.  ఆ పాఠశాలలో మా సిలబస్ లో జీవధార కథ ఒకటి అలా నాలో  ముద్రపడి పోయింది. ప్రకృతి వనరులపై పెత్తనాలు బలపడుతూ నీటి వసతి వంటి కనీసావసరాలకు మనుషులు చిన్నవో, పెద్దవో యుద్ధాలు చేయవలసిన పరిస్థితులలోకి నెట్టబడటం లోని విషాదాన్ని వినిపించిన కథ అది.

అప్పుడే కెకె రంగనాథాచార్యులు గారి ఆధ్వర్యంలో సారస్వతపరిషత్తులో నడుస్తున్న  ప్రసంగాల పరంపరలో   ‘తెలుగు కథా నవలా విమర్శ ‘ అనే  అంశంపై మాట్లాడటానికి సిద్ధమవుతున్న క్రమంలో  కారా కథలపైన వచ్చిన విమర్శలు పరిచయం అయ్యాయి. ముఖ్యంగా యజ్ఞం కథ మీద వచ్చినన్ని విమర్శలు తెలుగులో మరే కథమీద రాలేదని కూడా నాకు తెలిసింది అప్పుడే. ఒక రచయిత ఒక కథ మీద అంత చర్చ జరిగిందంటే అందులో లోనారసి చూడవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయనే అర్ధం.  కారా కథలపై నా ఆసక్తి మరింత పెరగటానికి యజ్ఞం కథా విమర్శలు ఆ రకంగా బలమైన ప్రేరణ అయ్యాయి. 1990 లో కారా గారి కథాకథనం పుస్తకం వచ్చింది. దానికి ముందుమాట వ్రాస్తూ ఆర్ ఎస్ రావు గారు ప్లానింగ్ అండ్ అగ్రేరియన్ పూర్ మీద 47 తరువాత భారతదేశ చరిత్ర మీద ఒక పాపులర్ వ్యాసం వ్రాయమని ఎవరో అడిగినప్పుడు ఆర్ధిక గణాంకాలను వదిలేసి నక్సల్ బరి ముందు చరిత్రకు యజ్ఞం కథను , తరువాత అంత గొప్పరచన కొమురం భీముని తీసుకొని  వ్రాసానని చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి . అప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర అధ్యాపక మిత్రులతో కలిసి సాహిత్యాన్ని చదవటం, విశ్లేషించటం అభ్యాసం చేస్తున్న నాకు కాళీపట్నం రామారావు కథలను చదవవలసిన పద్ధతి ఏమిటో తెలిసివచ్చిన సందర్భం అది.  కారా కథలలో కష్టజీవులు అనే అంశం మీద ఒక విద్యార్థితో పరిశోధన చేయించటానికిపూనుకొన్నాను కానీ అతను ఆ పని మధ్యలోనే విరమించుకొని వెళ్ళిపోయాడు. కానీ నేను కారా కథలను చదువుకొంటూనే ఉన్నాను. పై పొరలను తొలగించుకొంటూ తవ్వుకొంటూ పోతుంటే కారా కథల లోపలి   పోరల ల్లోకి వెళ్లేకొద్దీ బయటపడే మానవజీవిత ఇతిహాస వైచిత్రికి అబ్బురపడుతూ నలుగురితో ఆ సంతోషాన్ని పంచుకొనటానికి వ్రాయటం అప్పటి నుండి నాకు వ్యసనం అయిపొయింది.

అదలా ఉంచితే ఈ తొంభయ్యవ దశకంలోనే కారా మాస్టారితో నాకు పరిచయం మరింత పెరిగింది. 1992 – 93 ప్రాంతాలు. కవన శర్మగారు వరంగల్ లో ఉంటున్నరోజులు అవి. కారామాస్టారి స్టూడెంట్ ఆయన. వివినమూర్తిగారు , వల్లంపట్ల గారు  ఆయనకు మంచి స్నేహితులు. కారా గారికి ఈ ముగ్గురూ అభిమాన శిష్యులు. వరంగల్ లో ఉన్న  కవనశర్మ గారి ఇంటికి మాస్టారు మిగిలిన ఇద్దరితో కలిసి వచ్చారు . రచన సాయిగారు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన సందర్భంగా కవన శర్మగారు ఒక సాయంత్రం వాళ్ళింట్లో ఏర్పాటుచేసిన ఇష్టాగోష్టికి నేను కూడా వెళ్లాను. దానికి కేంద్రం కథల  మాష్టారే. ఆయనతో ఆ ముగ్గురి చనువూ , వాళ్ళ మాటలకు ఆయన ముసిముసి నవ్వులు నాకలా గుర్తుండి పోయాయి. అంత పెద్ద కథకుడు కారా .. ఆయన సాహిత్య వారసులు అన్నట్లుగా ఉన్న కథకులు విమర్శకులు అయిన ఆ ముగ్గురు  నా  అధ్యాపక విద్యార్థి మిత్రులకు కూడా పరిచయం కావాలి అనిపించింది.

మా నాన్న కన్యాశుల్కం నాటకం శతజయింతి  సందర్భంలో ఏర్పరచిన జిజ్ఞాసా వేదిక ఉద్దేశాలలో ఊళ్లోకి ఇటువంటి సాహిత్య సామాజిక రంగాల వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళను పిలిచి మాట్లాడించటం కూడా ఒకటి కనుక ఆ పేరు మీద ఇంట్లోనే ఒక సమావేశానికి  ఏర్పాటు చేసాను. కొత్తగా కట్టుకొన్న ఇల్లు. హాల్ పెద్దది. కడుతున్నప్పుడు అందులో మనం సాహిత్య సమావేశాలు జరుపుకోవాలి అంటుండే నాన్న ఆ ఇంట్లోకి రాకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించి అప్పటికి యేడాది. ఆయన సంస్మరణ లో కారా గారితో ఆ రకంగా తొలి సమావేశం జరుపుకొన్నాం. ముప్ఫయ్ నలభై  మంది మిత్రులం కింద పరచిన చాపల మీద జంపాకానల మీద కూర్చుంటే కారాగారు కూడా మాతో పాటేకూర్చున్నారు.  సంభాషణగా సాగిన  ఆ సాయంత్రపు సాహిత్య సమావేశం నాటి    ప్రజాస్వామిక సంస్కృతిక సౌరభాల గుబాళింపు గుండెల నిండా నిండే ఉంది.

ఆ తరువాత మరో రెండేళ్లకో మూడేళ్లకో 1996 లోనేమో … కవన శర్మగారూ మొదలైన వాళ్లంతా పూనుకొని ఆయనకు శ్రీకారానికి పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల పర్సు బహూకరణకు ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంలోనే అనుకుంటా  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  గోల్డెన్ త్రెష్ హోల్డ్  కాంపస్ లో కథా గోష్టి ఏర్పరచారు. కారా తో పాటు , కేతు విశ్వనాథ రెడ్డి గారు , చేకూరి రామారావు గారు , రమణగారు , నేను అందులో పాల్గొన్నాం. అదొక్కటే కాదు ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం వారు ప్రదర్శించిన చావు నాటకం చూడటం కూడా నాకు ఇష్టమైన జ్ఞాపకాలు.

కారా మేష్టారు కోరిక అనటం కన్నా కల అనటం బాగుంటుందేమో అది కథానిలయం ఏర్పాటు.  1997 లో అది ఏర్పడింది. దానికి పుస్తకాలను, పాతపత్రికలను సేకరించటానికి ఆయన ఊరూరూ తిరిగారు. ఆ క్రమంలో వరంగల్ కూడా వచ్చారు. మాఇంట్లోనే ఉన్నారు. వరంగల్ లో రచయితలను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న అరుదైన పుస్తకాలనో , పత్రికలనో ఇస్తే తీసుకొని , వెతికి పెట్టి ఇచ్చేటట్లు మాట తీసుకొనటం ఇదీ ఆయన పద్ధతి. అందరి ఇళ్లకు ఆయనను వెంటపెట్టుకొని పోయాను.  నేనప్పుడు టీవీఎస్ చాంప్  అనే చిన్న రెండు చక్రాల బండిని రాకపోకలకు వాడుతుండేదానిని. ఆ బండి మీద నా వెనక కూచుని రావటానికి  ఏ మాత్రం సంకోచ పడని ఆయన అతిసాధారణత నాకిప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

అప్పుడు నేను కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి పెద్ద తలకాయ బాధ్యతలలో ఉన్నాను. కాళీ పట్నం రామారావు గారిని తీసుకొని వెళ్లి    మా విభాగం విద్యార్థులకు   పరిచయం చేయటం,  తెలుగు కథ గురించి వాళ్లకు ఆయన ఒక ఉపన్యాసం ఇయ్యటం  నాకెప్పుడూ ఉద్వేగకరమైన జ్ఞాపకమే. 1999లో ప్రోగ్రెసివ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన కాళీపట్నం రామారావు రచనల సంపుటికి  హైదరాబాద్ లో  జరిగిన ఆవిష్కరణ సభలో నేనూ పాల్గొని నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలగటం కూడా నాకొక సంతోషకరమైన జ్ఞాపకం.

కథానిలయం శ్రీకాకుళంలో విశాఖ ఎ కాలనీ లో వెనక వరసలో ఉంది. అదే కాలనీలో ముందు వరుసలో మా చెల్లెలు మైధిలి ఉంటుంది. మా చెల్లెలి ఇంటికి ఎప్పుడు వెళ్లినా ఒక సారి కారా గారి దగ్గరకు వెళ్లి కబుర్లాడి రావలసిందే.వీలయినప్పుడల్లా కథానిలయం వార్షికోత్సవ సభలలో పాల్గొనటం నాకు ఎంతో ఇష్టం.2002 ఫిబ్రవరిలో కథానిలయం వార్షికోత్సవ సభలోనే కాదు తరువాత చాలా సభలలో కారా మాస్టారితో వేదిక పంచుకొనే అవకాశం నాకు లభించింది. అదే సంవత్సరం అక్టోబర్ 28 న విరసం ప్రచురించిన కుటుంబరావు తాత్త్విక వ్యాసాల పుస్తకంతో కలిపి జిజ్ఞాసా వేదిక  పక్షాన మేము ప్రచురించిన మా నాన్న  వ్రాసిన  ‘భాషా సాహిత్యాలు – సామాజిక భావనలు’  పుస్తకాన్ని  విప్లవరచయితల సంఘం బానర్ కింద  కథా నిలయంలో కారా మాష్టారు  ఆవిష్కరించటం నాకు హాట్రిక్ సాధించినంత సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. “జీవితం విస్తృతమైంది. అనుభవాలు భిన్నభిన్నమైనవి. అన్నీ కలిసివచ్చేవాళ్ల అనుభవాలు,ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళ అనుభవాలు వేరువేరుగా ఉంటాయి.  రామకోటి శాస్త్రి గారు రెండవ వర్గం పక్షాన నిల్చుని సత్య శోధనతో జీవితం గడిపారు కనుక మారగలిగారు అనీ, కొత్త భావాలకు ఆలోచనలకు కిటికీలు తెరిచి పెట్టారు” అనీ  ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు నాకలా గుర్తుండి పోయాయి. కె. వరలక్ష్మి గారికి చాసో స్ఫూర్తి అవార్డు ఇచ్చి చాగంటి తులసి గారు ఏర్పాటు చేసిన సభలో కూడా రామారావు గారితో నేనున్నాను. ఇలాంటి సందర్భాలన్నీ  మాష్టారి పక్కన కూర్చునే అవకాశం వచ్చిన  విద్యార్థికి కలిగే సంబరాన్ని ఇచ్చాయి. వివినమూర్తి గారు , అట్టాడ అప్పల్నాయుడు గారు , పడాల జోగారావు గారు, గంటెడ గౌరునాయుడుగారు, రెడ్డి శాస్త్రి గారు, రామారావు నాయుడుగారు, దాసరి రామచంద్రరావు గారు,  చిత్ర గారు, ఇలా ఉత్తరాంధ్ర రచయితలతో నా పరిచయాలు కథానిలయంతో ముడిపడి బలపడ్డవే.

 2010 లో స్త్రీల సాహిత్యం పై పరిశోధనా ప్రాజెక్ట్ చేపట్టాక శ్రీకాకుళం వెళ్లి పది పదిహేనురోజులు మకాం వేసేదాన్ని. తిండి ,నిద్ర చెల్లెలి దగ్గర . పదింటికల్లా కథానిలయం చేరుకొంటే  సాయంత్రం వరకు అక్కడే . కాళీపట్నం రామారావు గారు పుస్తకాలు సవరిస్తూనో, కేటలాగులు చూసుకొంటూనో  మధ్యాహ్నం భోజనాల వేళవరకు అక్కడే ఉండేవాళ్ళు. సాయంత్రం వెళ్లబోయే ముందు కథానిలయం ఎదురుగానే ఉండే వారింటికి వెళ్లి  ఆయనతో ఆరోజు నేను చేసిన పని గురించి, తెలుసుకొన్న కొత్త మహిళా రచయితల గురించి  మాట్లాడుతూ  కలిసి టీ తాగిన రోజులు ఎన్నో .. మంద్ర స్వరంతో మాట్లాడుతూ కథానిలయం అభివృద్ధి గురించి , ఎక్కడెక్కడో ఉన్న పుస్తకాల సమాచారం గురించి చెప్తుంటే యువ పరిశోధకులలో కూడా కనపడని ఈ జిజ్ఞాస , ఉత్సాహం ఊటలెత్తుతున్న ఆయనను చూస్తుంటే  గొప్ప స్ఫూర్తిగా ఉండేది.

కథను ప్రేమించి శ్వాసించి సంభాషించి కథల ఖజానాను తెలుగు సాహిత్య సమాజానికి కానుకగా ఇచ్చిన కారా మాష్టారితో నేను పంచుకొన్న అనేక సాహిత్య సమాలోచనా సందర్భాలకు గుర్తుగా ఆయనకు కానుక ఏదన్న ఇయ్యాలని బాగా అనిపించింది. కథా సాహిత్యంపై నేను వ్రాసిన విమర్శ వ్యాసాలు పుస్తకంగా ప్రచురించి అంకితం ఇయ్యటం ఆయన పట్ల నా ప్రేమను , గౌరవాన్ని వ్యక్తం చేయటానికి సరైన మాధ్యమం అనిపించింది. ఎంపిక చేసిన 40 వ్యాసాలతో కి పుస్తకం సిద్ధం చేసాను. 2019 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలో జరిగిన కథానిలయం వార్షికోత్సవ సభలో కథకోసం కాలినడకన గ్రామాలు చుట్టి శ్రీకాకుళం చేరుకొన్న రచయితల బృందం సమక్షంలో ‘కథా మథనం’   పుస్తకాన్ని ఆవిష్కరింప  చేసి ఆయన చేతుల్లో పెట్టాను. అదే చివరి కలియక అవుతుందని అప్పుడనుకోలేదు. ఏడాదిపాటు  శ్రీకాకుళం వైపే వెళ్ళటం కుదరలేదు. 2020 లో కరోనా ఉపద్రవం ఎటూ కదలనియ్యలేదు. ఏడాదిపైగా అదే స్థితి.

2020 నవంబర్ 9 న కాళీపట్నం రామారావు గారి పుట్టినరోజున ‘సాహిత్యం లోకి ‘ అనే సమూహం  కారా కథల పై  విశ్లేషణ అనే  అంశంపై నిర్వహించిన జూమ్ సమావేశంలో మాట్లాడటంలో పెద్ద విశేషం లేదుకానీ కారా మాస్టారిని చూడటం, పలకరింపులు ఒక ఉద్విగ్న భరితమైన అనుభవం. మళ్ళీ 2021 ఫిబ్రవరి లో కథా నిలయం వార్షికోత్సవం శ్రీకాకుళం వెళ్లి నిర్వహించుకొనే పరిస్థితులు లేవు , రామారావు మాస్టారు ఎట్లా ఉన్నారో… చూసొద్దామంటే కట్టి పడేసిన కరోనా కాలంలో ఊపిరాడని సాహిత్య బంధు బృందం జూమ్ సమావేశంలోనైనా కలిస్తే బాగుండునని ఆశపడుతుంటే జిజ్ఞాసవేదిక ఆ బాధ్యతను తీసుకున్నది. కథానిలయంతో  కలిసి 2021 వార్షికోత్సవ సదస్సును ఫిబ్రవరి 24 న నిర్వహించింది. వివిన మూర్తి గారు , మల్లీశ్వరి,  నేను నిర్వహణ బాధ్యతలు పంచుకొని పనిచేసిన   అసమావేశంలో  కథా విమర్శలో నా అనుభవాలు అనే అంశం మీద రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, కథతో నా అనుభవాలు అనే అంశం మీద ఎంఎస్ కె కృష్ణజ్యోతిగారు  , కథానిలయంతో నా అనుభవాలు అనే అంశంమీద వివినమూర్తిగారు  కథా నిలయం భవిష్యత్ కార్యకలాపాల పై అట్టాడ అప్పలనాయుడు గారు మాట్లాడారు. ఖాదర్ మొహియుద్దీన్, దాసరి రామచంద్ర రావు , కాళీపట్నం సుబ్బారావు , కెవిఎస్ ప్రసాద్ , కలుగుల వెంకటరావు , విశాఖవర్మ , జి. విశ్వనాధ్, దాసరి అమరేంద్ర కథానిలయంతో , కారాతో తమ ప్రయాణం అనుభవాలు పంచుకున్నారు. వయోభారంతో ఉన్నాఉత్సాహంగా కూర్చొని కొడుకు కాళీ పట్నం సుబ్బారావు గారు పేరు పేరునా మమ్మల్ని అందరినీ వీడియోలో చూపించి గట్టిగా చెబుతుంటే అందరినీ గుర్తు పడుతూ ఆయన పలకరిస్తుంటే చూడాలి ఆ సంబరం ..కథానిలయం గురించి ఆయన కలలను పంచుకొనటానికి వ్రాసి  పెట్టుకొన్నకాగితం చదవటానికి  చిన్న ప్రయత్నం చేశారు. అదే ఆయన తుది ఉపన్యాసం , తుది వీడ్కోలు అవుతుందని అనుకోలేదు.

ఆ నాడు ఈ తీరం నుండి సుదూరాన ఉన్న ఆయనకు జూమ్ కెమెరా ముందు చేసిన నమస్కారమే మిగిలింది.

*

కాత్యాయనీ విద్మహే

9 comments

Leave a Reply to ఎ.కె.ప్రభాకర్. Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చేయించటానికి సమర్ఢులైన మీ లాంటి టీచర్లుండాలే గానీ కారాఆ మాష్టారి కథలమీద ఇరవై పి.హేచ్.డీ లు చేయచ్చు. సామాజిక ఆర్థిక శాస్త్రాల అధ్యయనం చేసిన సాహితీ వేత్తలు ఇంటర్-డీసిప్లినరీ రిసెర్చ్ చెయ్యగలిగితే ఎంతో మేలు జరుగుతుంది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ బదులు తెలుగు చదవాల్సింది అనిపిస్తుంది.ఎంతవర్క్ అయినా చెయ్యవచ్చును.

  • చాలా విలువయిన విషయాలతో కాళీపట్నం రామారావు గారు గురించి చాలా బాగా రాశారు కాత్యాయని గారు . నేను కారా మాస్టారిని చాలా సార్లు కలిశాను. 2015 ఢిల్లీలో జరిపిన ఉత్తరాంద్ర కధా సదస్సు గురించి ఉత్తరాంద్ర సాహిత్యకారులను కధానిలయం లో కలిశాను. మాష్టారితో వారింట్లో భోజన సమయం లో చాలా అత్నియంగా మాట్లాడారు.

  • విలువైన విషయాలు తెలిశాయి.
    కారా మాస్టారుకథలు చదవడమే గానీ ఒక్కసారి కూడ కలవలేకపోయాను

  • బాగా వ్రాశారు. మనం 2002 లో జరిగిన కథా నిలయం 5వ వార్షికోత్సవం లోనే మొదటి సారి కలుసుఉన్నాం,..మేష్టారి దయవలన.

  • మరచిపోలేని మధురానుభూతిని మిగిల్చిన అమూల్యమైన ప్రయాణాలు. ప్రతి మజిలీ అపురూపమైనదే.

  • కొన్ని వందలసార్లు కథానిలయం వెబ్ సైట్ లోకి వెళ్లి నాకు కావలసిన సమాచారాన్ని, కథల్ని వెతుక్కోవడం చేసేదాన్ని.ఎన్నోసార్లు విజయనగరం మా బంధువుల ఇంట్లో కార్యాలకని వెళ్ళి వేస్తునే ఉండేది.కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా కథానిలయం కు వెళ్ళాలన్నా కుదరలేదు.కారామాష్టారు ఉండగా వెళ్ళలేకపోయాను న్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.చాలా బాగా ఆయనతో, కథానిలయం తో మీ అనుబంధాన్ని రాసారు.

  • కార మాస్టారు గారి గురించి చాలా విషయాలు చెప్పారు అభినందనలు కృతజ్ఞతలు మేడం.. కేతవరపు రామకోటి శాస్త్రి గారు నాకు పీజీలో ప్రత్యక్ష గురువులు , మా గోఖలే కథలు మీద నేను తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం ప రాజమండ్రిలో ఎంఫిల్ చేస్తున్నప్పుడు కారా మాస్టారు వారితో తో పపరిచయం ఏర్పడింది. నా గురువు గారి కూతురు ఇంకొక నా గురువు గారి గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది కృతజ్ఞతలు కాత్యాయిని మేడం మీకు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు