“అదేనేల”లో ఆకాశమంత కవిత్వం

అంతకుముందు చదివినవే అయినా ఒక కవి కవితలన్నీ ఒక పుస్తకంలో చూడడం కొత్తగా ఉంటుంది. విడి విడి పువ్వులని చూడడం కంటే, వాటన్నిటినీ కలిపి అల్లిన ఒక పూమాలని చూసినట్టు. ఒక కవితాసంకలనం చదివినప్పుడు ఆ కవి యొక్క కవితాత్మ మనకి మరింత స్పష్టపడుతుంది.

అలాంటిది సంస్కృతం మొదలుకొని లిపిలేని ఆదివాసీ భాషల దాకా, భారత దేశంలో ఆన్ని భాషలలో వచ్చిన కవిత్వాన్నంతటినీ సమగ్రంగా విశ్లేషించి, ఆయా భాషలలో కవిత్వం నడిచి వచ్చిన దారిని మనకి ఎరుకపరచి, ఆ దారిలో పూసిన పువ్వుల్లో తమకి నచ్చిన వాటిని అనువదించి మనకి అందించి, తద్వారా భారతీయ కవితాత్మని పట్టుకునే ప్రయత్నం చాలా చాలా గొప్ప విషయం. ఒక యూనివర్సిటీయో, గ్రంధాలయాలో పదిమంది సభ్యులతో ఒక ప్రాజెక్టుగా చేయాల్సిన బృహత్తర కార్యాన్ని ఒక డెబ్బై యేళ్ళ మనిషి ఒంటి చేత్తో చేయడాన్ని కీర్తించడానికి మాటలు చాలవు. ఇదే పుస్తకంలోని రాజస్థానీ ఋషి ఈసర్ దాస్ బర్హత్ కావ్యం “హరీ రాస్” లోంచి పంక్తుల్ని ఎరువు తెచ్చుకోవాల్సిందే

సర్వశక్తిమంతుడైన ప్రభువా

నీ పరిపూర్ణతకు

నా దోషాలకూ

పరిమితులు లేవు

వర్ష బిందువుల్లా

ఇసుకరేణువుల్లా

వాటిని లెక్కించలేము

“ఆదేనేల” పుస్తకం, ముకుంద రామారావు గారికి కవిత్వం మీదున్న అపారమైన ప్రేమకి నిదర్శనంగా నిలుస్తుంది. నలభై యేళ్ళకే అన్నీ వదిలేసి, కాళ్ళుజాపేసే బద్దకస్తులున్న ఈ కాలంలో ఈ వయసులో కూడా దాదాపు 800 కవితల అనుసృజనకి పూనుకోవడం చూస్తే, కోంకణీ కవి నగేశ్ కర్మాలి కింది పంక్తుల్లోని అంశ ఏదో ముకుంద రామారావు గారిలో కూడా ఉండి ఉండాలి అనిపిస్తుంది.

ఇంకా నా కాళ్ళలో శక్తి ఉంది

నన్ను పెరిగే నీటిపోటు తీసుకుపోనీ

జలపాతంలా నేను జారిపడనీ

సూర్యుని ఎడతెగని జల్లులలో

నన్ను ప్రకాశవంతంగా మండనీ

అందరిలో ఒకడినయ్యేందుకు

నన్ను నేను మూసుకుపోనీ

ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే ఒక కాలంలో ఒక భాష నుంచి మరొక భాషకి కవిత్వం ఎలా ప్రవహించింది, ఒకే భాషలో ఒక తరంనుండి మరొక తరానికి ఎలా ప్రవహించింది, ఉద్యమాలు అణచివేతలో ఎలాంటి కవిత్వం వచ్చింది, కడుపునిండిన సమాజాలలో ఎలాంటి కవిత్వం వచ్చింది, కల్లోల కాశ్మీరంలో ఎలాంటి కవిత్వం వస్తోంది మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒకట్రెండు PhD problems ఈ పుస్తకం నుంచి ఉద్భవించే అవకాశం ఉంది. వాడుకలో లేని సంస్కృత భాషలోని కవిత్వాన్నే తీసుకుంటే,

“ఆత్మని ఆన్ని జీవుల్లోనూ ,

ఆన్ని జీవుల్లోనూ ఆత్మనూ దర్శించేవాడు

దేనినీ ద్వేషించడు ”

అన్న ఉపనిషత్ వాక్యం మొదలుకొని

“రాత్రివేళ సంచరిస్తున్న దీపశిఖవలే

స్వయంవరం మండపంలో

వధువు తమ ముందుకు వస్తుంటే

మెరిసిపోతున్న రాకుమారుల ముఖాలు

ఆమె దాటిపోగా చీకట్లో కూరుకుపోతున్నాయి”

కవికుల గురువు కాళిదాసు ఉపమాలంకారాలని స్పృశించి

“కొత్తిమీర సువాసన

పసుపు బంగారంతో వండబడుతుంటే

అన్నబ్రహ్మాన్ని సాక్షాత్కరిస్తూ

అన్న పూర్ణ దేవత దిగివస్తుంది. “

రాధ వల్లభ త్రిపాఠీ “వంట గది” కవిత మీదుగా

“అసంఖ్యాక ముఖాల

ప్రపంచంలోకి నేను ప్రవేశించి

మిత్రత్వం మనవిని పంపుతున్నాను”

హర్షదేవ్ మహదేవ్ “ఫేస్ బుక్” కవితల దాకా ఎంత వైవిధ్యమో. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం గురించి సంస్కృత కవిత! ఒక సంస్కృత కవిత్వం లోనే ఇంత వైవిధ్యముంటే, ఇక భాషలన్నీ కలిపి చూసినప్పుడు వస్తువులోనూ, వ్యక్తీకరణలోనూ ఉన్న వైవిధ్యానికి అంతులేదు. అలాంటి కవిత్వం యొక్క శక్తినీ పరిమితినీ కూడా అద్భుతంగా వ్యక్తపరుస్తుంది అస్సామీ యువకవి హేమంగ కుమార్ దత్తా రాసిన “రాత్రి మీద పద్యం”

మేఘాల మీద పద్యం

నేలని తడపదు

మేఘాలు తడుపుతాయి

 

పంట మీద పద్యం

తిండి పెట్టదు

పంట పెడుతుంది

 

గాలి మీద పద్యం

చెమట తుడవదు

గాలి తుడుస్తుంది

 

ఏ రాత్రీ సూర్యుణ్ణివ్వదు

రాత్రి మీద పద్యం ఇస్తుంది

కెరటం ఎలా అయితే సముద్రపు లోతుల్లో పుట్టి ఆ తీరాన నిల్చున్న మనిషిని తాకుతుందో కవిత్వం కూడా కవి హృదయపు లోతులలో పుట్టి, పాఠకుడిని తాకుతుంది. అలా తాకిన కవిత్వం ఏ మేరకు సఫలీకృతం కాగలిగింది అన్నది చాలా విషయాల మీద ఆధారపడి. ఉంటుంది. లోతుల్లో జాంతవ ప్రకృతి మీద సంస్కృతిని బట్టల్లా తొడుక్కుంటాడు మనిషి. భాష, పదచిత్రాలు, వివేచన ఇవి సంస్కృతికి సంబంధించినవి. లయ, ఇంద్రియ స్పర్శ ఇవి ప్రాకృతికమైనవి. భారత దేశంలో ఒక నానుడి ఉందిట – ప్రతి రెండు మైళ్ళకీ నూతి నీరు మారుతుంది ప్రతి నాలుగు మైళ్ళకీ మాట తీరు మారుతుంది అని. భాష పరంగా ఇంత వైవిధ్యమున్న భారత దేశంలో సంస్కృతికి సంబంధించి ఒక ఏకత్వాన్ని మనం చూడవచ్చు.

ఉదాహరణకి ఒక పంజాబీ ఆదివాసీ కవిత. పంజాబీ ఆది వాసులు దీపం ఆర్పేయడం మంచి శకునం కాదని నమ్మేవారుట. అందుకని రాత్రి దీపం ఆర్పేముందు ఇలా చెప్పుకునేవారుట.

ఓ మట్టి ప్రమిదా మీ ఇంటికి వెళ్ళు

తలుపు దగ్గర నీ కోసం మీ అమ్మ ఎదురు చూస్తోంది

మంచి శకునాలతో తిరిగి ఉదయమే రా

నీతో పాటు సౌభాగ్య తైలం తీసుకురా

తెలుగు ప్రజలు కూడా దీపం ఆరిపోయింది అని కాకుండా “దీపం కొండెక్కిపోయింది” అనడం మనకి తెలుసు. భాషలు వేరైనా సంస్కృతిని ప్రతిబింబించే సామాన్య పదచిత్రాలు భారతీయ కవిత్వాన్ని అనువదించడానికీ, పాఠకుడు ఆ అనుసృజనను చదివి అనుభవంలోకి తెచ్చుకోడానికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ముకుంద రామారావు గారు స్వయంగా కవి కావడం, ఈ పద చిత్రాల్ని అద్భుతంగా పటుకోవడం వల్ల ఈ కవితలు అనువాదాల్లా కాకుండా అచ్చ తెలుగు కవితల్లాగే ఉన్నాయి. నోబెల్ కవుల కవిత్వాన్నీ, పాశ్చాత్య కవుల కవిత్వాన్నీ అనువదించేటప్పుడు దొరకని ఆనందం ఈ భారతీయ కవిత్వాన్ని అనువదించడంలో లభించిందని స్వయంగా ముకుంద రామారావు గారే ఒప్పుకోవడానికి కారణం కూడా ఈ అనుభవాలలోని సారూప్యతే అనుకుంటాను.

దాదాపు తొమ్మిదివందల పేజీల ఈ పుస్తకంలో

“మనస్సా! నెమ్మది నెమ్మది నెమ్మది గానే అన్నీ అయ్యేది

వందల కుండల నీళ్ళు తోటమాలి పోసినా ఋతువు వస్తేనే పువ్వు పూసేది”

కబీర్ దోహాలు ఉన్నాయి.

నీతో

కళ్ళు నిండి ఉన్నాయి, చూసేందుకు ఏమీ లేదు

చెవులు నిండి ఉన్నాయి, వినడానికి ఏమీ లేదు

చేతులు నిండి ఉన్నాయి, కొలిచేందుకు ఏమీ లేదు

మనస్సు నిండి ఉంది, ధ్యానించేందుకు ఏమీ లేదు

కూడల సంగమ దేవా

భక్తి ఉద్యమ కాలంలోని కన్నడ వచనాలు ఉన్నాయి.

తమ ప్రియులను

కలాల్లో అయినా చూసుకునే స్త్రీలు అదృష్టవంతులు

కానీ అతను లేనిది నిద్ర కూడా రాదు కదా

కలని ఎవరు ఎలా కనగలరు (ప్రాకృతం- మలయశేఖరుడు)

గాధాసప్తశతిలోని ప్రేమ కవితలున్నాయి.

ఇవ్వాళ

జుట్టు లేకుండా

ఉడుపు వేసుకుని

భిక్ష కోసం తిరుగుతూ

నాకు నేనుగానే

చెట్టుకింద కూచున్నాను ఇప్పుడు

బంధనాల ముడులన్నీటినీ విప్పేసి

ఆలోచనలేవీ లేకుండా (పాలీ – విమల)

బౌద్ధ థేరీ గాథల్లోని వైరాగ్యం ఉంది.

కళ్ళు మూసుకుని

సూర్యుని వైపు చూస్తే

నాకు కనిపించే రంగు

కక్కుకున్న రక్తం

అమ్మా-

నదిని విను

అది ఘోషించినన్నాళ్ళు

నేను బతికే ఉన్నానని నీకు తెలుస్తూనే ఉంటుంది. (మేఘాలయ – క్యంఫం సింగ్ నోంకిన్రిహ్)

ఈశాన్య భారతపు విప్లవ కవితలున్నాయి.

అతనే ఒక గాయపడ్డ నీడ

అతనికి అస్తిత్వం లేదు

పగిలిన కప్పుకీ అతనికీ ఏ మాత్రం బేధం లేదు

కానీ ఇప్పుడు

అతని అస్తిత్వం కోసం అతను ఎదురు చూస్తున్నాడు

అతని కోసం అతను ఎదురుచూస్తున్నాడు

గర్వపడుతున్నాడు తనని తాను

ఒక దళిత కవినని చెప్పుకుందుకు (ఉర్దూ- జయంత్ ఫార్మర్)

అద్భుతమైన దళిత కవిత్వం ఉంది.

ఓ ఫరీద్! నేను నల్ల దుస్తులే

ధరించాలనుకున్నాను, ఇంకా

నలుపులోనే నా సంపూర్ణ వేషం

పూర్తిగా పాపాల దుస్తులే నేను ధరించేది

అయినా ప్రజలు నన్ను ఫకీరనే పిలుస్తారు (పంజాబీ- బాబా ఫరీద్)

సూఫీ మార్మిక కవిత్వం కూడా ఉంది.

ఇంత విస్తృతమైన భారతీయ కవిత్వాననంతటినీ ఒక దగ్గర చదవడం నాకైతే పండగలాగే ఉంది. ఈ పుస్తకాన్ని తీసుకువచ్చి నాబోటి వాడికి ముకుంద రామారావు గారు మహోపకారం చేసారు. ఆరునెలలుగా ఈ కవిత్వంలో మునిగితేలుతున్నాను. రోజుకో పేజీ random గా తీసి ఆ పేజీలోని కవిత చదువుకుంటాను. ఎక్కడో, ఏ కాలంలోనో ప్రభవించిన కవిత నాలో మళ్ళీ కొత్తగా వికసిస్తుంది. ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన ఆ కవి నాలో మళ్ళీ ప్రభవిస్తాడు. ఆ భావనే అద్భుతంగా ఉంటుంది.

ఇలాంటి పుస్తకాన్ని సమగ్రంగా విశ్లేషించడం నాలాంటి వాడివల్ల అయ్యే పని కాదు. గత అయిదారేళ్ళుగా నేను కవిత్వంగానీ వచనంగానీ రాసిందేమీ లేదు. అలాంటి స్థితిలో కూడా నా చేత ఈ నాలుగు మాటలూ ఇష్టంగా రాయించిన “ఆదేనేల” కవిత్వ ప్రియులందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. చివరిగా మాతణ్గ పుత్త థేరా రాసినట్టు,

చాలా చలిగా ఉంది చాలా వేడిగా ఉంది

చాలా ఆలస్యం అయిపోయిందంటారు వాళ్ళు

వాళ్ళ పనిని ఇలా ఉపేక్షించే వారికి

అవకాశాలు వారిని దాటిపోతాయి

 

కానీ వేడి చలి

గడ్డిపోచ కంటే ఎక్కువ కాదనుకునే వారికి

పురుషోచిత ధర్మాన్ని అతను నెరవేరుస్తున్నట్టు

అతని ఆనందం ఎప్పటికీ విఫలమవదు

ముకుంద రామారావు గారి కవిత్వానందం ఎప్పటికీ విఫలమవదు అని చెప్పడానికి నాకెలాంటి సందేహం లేదు.

ప్రతులకు:

SAHITHI PRACHURANALU

#33-22-2, CHANDRAM BUILDINGS

C R ROAD, CHUTTUGUNTA

VIJAYAWADA – 520004

PH: 0866-2436642

 

Amazon Link:

https://www.amazon.in/Ade-Nela-Mukunda-Rama-Rao/dp/B07WL72Z5Z/ref=sr_1_2?dchild=1&keywords=mukunda+rama+rao&qid=1587564266&s=books&sr=1-2

 

మూలా సుబ్రహ్మణ్యం

3 comments

Leave a Reply to Dr Munaga Rama Mohana Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మూలా! మిత్రుడు ముకుంద రామారావు విజయవంతంగా నిర్వర్తించిన బృహత్తర కార్యక్రమానికి మీ సమీక్ష న్యాయం చేకూర్చింది. ఎంతో కాలంగా ఆయన చేస్తున్న కృషి తెలుగు వారందరికీ గర్వకారణం.

  • ముందుగా మీ సమీక్షకు జోహార్లు
    ముకుందరామారావు గారు వారి వివిధ రచనల ద్వారా ఎంతో మంది కవులకు మార్గదర్శకులయ్యారు . వారు భగవత్ కృప మెండుగా వున్నా భాగ్యశాలి . ఎవరో మహానుభావుడు అన్నట్లు ” There is a common thread in the feelings of all human races irrespective of their place of birth on the planet earth “ . ముకుంద రామారావుగారు వివిధ సంస్కృతుల కవిత్వానికి వారధిలాంటి వారు . వారు చేసిన చేస్తున్న కృషి అనితర సాధ్యం అనిపిస్తుంది . వారు ముక్కుసూటి మనిషి అదొక కారణం అయ్యివుండొచ్చు వారి రచనలకి సాహిత్య ఎకాడమి పురస్కారం రాకపోవటానికి .
    ఇక విషయానికొస్తే వారి కవితల్ని అత్యద్భుతం గా సందర్బోచితంగా , సవివరంగా , వారు ఏదైనా విడిచిపెట్టివుంటే వాటిని వుటంకిస్తూ మీ సమీక్ష ద్వారా జనబాహుళ్యానికి మహోపకారం చేసారని భావిస్తున్నాను . మీ ఈ విశేష ప్రయత్నానికి నా నమో వాక్యములు
    Dr రామ మోహన రావు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు