అతనొస్తాడా? వస్తాడు!

కాశానికి రంగులెవరు వేశారు?
సముద్రంలో నీలమెవరు కలిపారు?
సూరిబాబుదైనా సిరాజుద్దీన్‌దైనా రక్తానికి ఎరుపునెవరిచ్చారు?

మరి, స్నేహానికి పచ్చరంగు అద్దడమెందుకూ?
రంగులన్నీ కలుపుకున్న ధవళకాంతుల్లో, అతనొస్తాడా?

వస్తాడు.
సాహిల్… వస్తాడు.

అఫ్సర్ కథ “సాహిల్ వస్తాడు” వినండి!

*

 

 

సాహిల్ వస్తాడు!

డైరీలో కొన్ని పేజీలు  ఇలా కలత నిద్రలు.

ఈ నాలుగైదు రాత్రిళ్ళు చార్మినార్  చుట్టూ నేనొక్కణే నా చుట్టూ నేనే తిరుగుతూ.  

ఎవరూ లేని నాలుగు చేతులు మాత్రమే ఎత్తి నిల్చున్న వొంటరి చార్మినార్.

వచ్చీ రాని నిద్రలో వెంటాడే  కల నువ్వు.

తెగిన కలలో సీతాకోకల గుంపుల శవాలు.

వాటి మీద నా అడుగుల అలికిడి నాకు వినిపిస్తోంది. నేనూ వింటున్నాను.

 కచ్చితంగా వారం క్రితం ఇక్కడ నేనూ సాహిల్ ఫణి చిన్నపిల్లల్లా  సీతాకోకల రంగుల ఉత్సాహంతో, లయబద్ధమయిన తూగులతో  తిరిగాం, భుజాల మీద గట్టిగా చేతులేసుకొని.

 ఇప్పుడది జ్ఞాపకం!

 సాహిల్ పాడే వాడు:

 లోపల వొక సీతాకోక చిలక వుంటుంది అదే తపనతో, అదే ప్రాణంతో.

అది ఇంకో మృతదేహంగా మిగలకుండా  ఏ కల్మషం లేని మల్లిపూవు చేతులు కాపాడతాయో

ఏ లేతగొంతులోని స్వచ్చమయిన పదాలతో అది మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకుంటుందో…

 వొక్కో సారి …కాదు చాలాసార్లు

ఆ సీతాకోక చిలకని నేనే…నేనే!

ఇంకా కొన్ని సార్లు అది నువ్వు కూడా.

      ఇవి పూర్తిగా నా వాక్యాలు కావు. ఇందులో కొన్ని వాక్యాలు ఉర్దూలో నేను సాహిల్ నోటంట విన్నవి. ఇప్పుడు నేను  వున్న స్థితి లో ఆ వాక్యాల్ని అటూ ఇటూ మార్చి, నా మనస్థితిని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నా. అంతే!

 

1

సీతాకోక చిలక అంటే సాహిల్ భాషలో …తితలీ!

కాని, నా లోకంలో తితలీ అంటే సీతాకోక మాత్రమే కాదు, నా భాష. నా ప్రపంచం. నా చిట్టి తల్లి…

నా తితలీకి నేను అన్నీ చెప్పుకోవాలి.

తితలీ కూడా నాకు అన్నీ చెప్పుకోవాలి.

అలా చెప్పుకోని రోజు మా ఇద్దరికీ చీకటి పడదు, మా ఇద్దరి కంటి మీద కునుకు వాలదు. కునుకు వాలినా నిద్రపట్టదు. నిద్రపట్టినా కలత కలలు.

 ప్రతి రాత్రీ భోజనమయ్యాక మా ఇల్లంతా స్లో మోషన్ లోకి వచ్చేస్తుంది. మేం ముగ్గురమూ మెలకువకీ నిద్రకీ వుండే ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతాం.  ఇంకో సారి పైపైన వంటిల్లు  సర్దుకుంటుంది నీరూ. నేనేమో అలసటతో మంచంమీద వాలిపోతాను తిన్నగా.

అప్పుడు- వచ్చేస్తుంది  తితలీ – పేరుకు తగ్గట్టే- తన సీతాకోక పరుగులతో!

ఇవాళ కూడా నేను భోంచేసాను, ఏదో చెయ్యక తప్పదన్నట్టు చేసాను.

భోంచేసేటప్పుడు నీరూతో కాసిని మాటలు మాట్లాడాను, అదీ ఏదో తప్పదు అన్నట్టు.

ఇవాళ ఇవన్నీ నిరాసక్తంగా చేస్తున్నప్పుడు తితలీకి నేను దొరికిపోతున్నాను. నాకు తెలుసు. కాని, నాకు తెలిసినవన్నీ తితలీకి చెప్పలేనని ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తోంది!

నిజానికి తితలీ ఈ రెండు రోజుల నించి నన్ను మరీ దగ్గిరగా పరిశీలిస్తున్న విషయం కూడా నాకు తెలుసు.

సాహిల్ అంటే నాకెంత ఇష్టమో , తనకూ అంతే ఇష్టం. అసలు దానికి తితలీ అని ముద్దు పేరు పెట్టిందే వాడు కదా! “ఈ చిన్నీకి రెక్కలు లేవనే కాని, సీతాకోక పాపలా పుడితే అది ఇలాగే ఉంటుందిరా!” అని ఆ పేరే దానికి ఖాయం చేశాడు. వాడు ఆ పేరు ఖాయం చేసాక, అది ఎంత బలంగా రిజిస్టర్ అయిపోయిందంటే దానికి అసలు పేరు ఇంకోటి  ఉందన్నది  ఎప్పుడో కాని గుర్తుకురాదు మాకు.  

 అది సాహిల్ తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, ఎక్కడాలేని కబుర్లు గంటల తరబడి చెప్తుంది. వొక్క మాటలో చెప్పాలంటే,  వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ ఇద్దరి ఈడూ వొక్కటే అవుతుంది. మూడుపదుల వయసు దాటినా, ఇంకా పసితనపు ఛాయలు వీడనితనం ఏదో సాహిల్ లో వుంది. వాడి ఆ పసితనం అంటే నాకు భలే ఇష్టం!

తితలీకి నేనూ  అన్నీ చెప్పుకోవాలి.

తితలీ కూడా నాకు అన్నీ చెప్పుకోవాలి.

ఇవాళ కూడా తితలీ నా ముందుకొచ్చి నిలబడింది అద్దంలా.

ఆ అద్దంలో నేను నాకు కనిపించాలి, నేనొక బాల్యపు ఏమీ తెలియనితనంలోకి  వెళ్ళిపోయి!

అందులో నేను ఆడుకోవాలి, కారణాలేమీ పట్టించుకోని చిన్నప్పటి నాన్సెన్స్ రైములు పాడుకోవాలి.

అన్నీ…అన్నీ చెప్పుకోవాలి, మనసు పొరలు నిష్పూచీగా విప్పుకోవాలి. వొక్క మాటా మిగలడానికి వీల్లేదు. వొక్క పొరా మిగలడానికి వీల్లేదు.

ఈ క్షణం  నా గొంతు పెగలడం లేదు. వొక్క మాటా రావడం లేదు. ఏం చెప్పాలి తితలీ అనే ఈ  ఎనిమిదేళ్ళ అమాయకత్వానికి? చుట్టూ వున్న ఈ లోకం ఇంకా విచ్చుకునే స్వచ్చమయిన పువ్వే అనుకునే నా చిట్టితల్లికి?  నా లోపలి వొక్క మాట అయినా ఇవాళ “ఇదీ” అని కచ్చితంగా  చెప్పగలనా? చెప్పలేక కాసిని కాకమ్మ  కథలూ, తీపికబుర్లూ చెప్పి నిద్రలోకి పంపేయనా?

“ఏం చెప్పను, తితలీ? ఏం చెప్పను? నీకూ నాకూ తెలిసిన ఆ సాహిల్ ఇప్పుడు లోకం కొత్తగా  విప్పుతున్న ఈ సాహిల్ ….వొకటి కాదు…సాహిల్ ఇప్పుడు రెండు … రెండట!”

నా మౌనంలోకి నేను జారుకున్నాను. ఆ మౌనంలో నేను తితలీకి ఏదో చెప్పుకుంటూ వుండిపోయా.

 

2

 

ఎక్కడి నించో సాహిల్ పాడుతున్నాడు:

ఈ లోకం ఎలాంటిదో  ఎంత చెప్పినా నీకు తెలియదు

సీతాకోక రెక్కల మీది హరివిల్లుని తుడిచేస్తుంది

అవేవో కృత్రిమ రంగుల్ని చెక్కుతుంది.

 

పడమటి సంధ్యకి నెత్తురు పూసి రక్తపాతం అంటుంది

అనుమానాలూ, అవమానాలూ సందేహాలూ సంశయాలు దీని వొంటి నిండా.

 

“తుడిచేసేయ్ శుభ్రంగా!” అని చాలా సందర్భాల్లో చాలా వాటికి అనుకున్నా కాని, ఈ పొద్దున్నపోలీస్ స్టేషన్లో జరిగిన సంభాషణని ముఖంమీద ఉమ్మిలాగానో, చొక్కా మీద బురదలాగానో అంత తేలికగా తుడిచేయలేకపోతున్నా.

“కొన్ని అక్కడికక్కడే వదిలేయాల్రా! మరచిపోవాల్రా! మనకి పని ముఖ్యం!” అంటున్నాడు ఫణి.

 

“అందుకే కదా, మౌనంగా వుండిపోయా. లేకపోతే లోపల రక్తం వుడికిపోతోంది. నాకే ఇలా వుంటే హసీనాకి ఎలా అనిపించి వుండాలి!”

 

“హసీనాకి ఏమీ అనిపించి వుండదు. సాహిల్ ముస్లిం అన్న విషయం నువ్వు మరచిపోయినా, హసీనాకి ఎప్పుడూ గుర్తుంటుంది కదా! అంటే, ఆ ముస్లిం అన్న లేబుల్ కింద పడాల్సిన అవమానాలూ, అనుమానాలూ అన్నీ ఈపాటికి అనుభవించే వుంటుంది! కాదంటావా?”

 

ఫణి ప్రశ్నకి నా దగ్గిర సమాధానం లేదు.

 

ఎక్కడికెళ్ళాడో ఏమో  సాహిల్!  

 

ఈ పొద్దున్న వాడు  వచ్చేసి వుంటే బాగుండేది — అని అప్పటికి పాతిక ముప్ఫై సార్లు లోపలా, ఇంకో డజను సార్లు పైకే అనుకున్నాను. రాకపోయినా ఈ సాయంత్రం వరకూ వాడి కోసం ఎదురుచూసి వుండాల్సింది అని కూడా అనుకున్నాను.  కాని, పొద్దున్న ఇంటి నించి బయటికి వెళ్ళిన మనిషి సాయంత్రం సజావుగా వస్తాడో రాడో తెలియని ఈ నగరపు బతుకులో … మతం అనేది చివరికి కలహకారణంగానే మిగిలిపోయిన  ఈ రోజువారీ హింసలో.. ఆందోళన తట్టుకోలేక తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వచ్చినా, ఆ పోలీస్ స్టేషనులో ఆ సర్కిల్  గాడి ముఖం చూడకుండా వుండాల్సింది. లేదూ, వాడు కాక ఇంకొకడెవడో ఆ పూట అక్కడ డ్యూటీలో వుండి వుంటే బాగుండేది.

 

మా మాటలు పూర్తిగా వినకుండానే ఆ సర్కిల్ “సాహిల్ ..పేరు…అంటే ముస్లిం…అవునా? మహమ్మదా? షేకా? సయ్యదా?” ఆ గొంతులో వెటకారం.

 

ఫణి నా మొహంలోకి సందేహంగా చూసాడు, “ వాడి ఇంటి పేరు మహమ్మద్ కదా?”

 

“తెలియదు…సాహిల్ …అసలు పేరు మాత్రమే తెలుసు!” అని నేను వెనక్కి తిరిగాను, హసీనా వేపు! హసీనా అప్పటికే బిక్కచచ్చిపోయి వుంది, మొదటి సారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆమె కళ్ళలో ఆ బెరుకు స్పష్టంగా కనిపిస్తోంది. బలవంతంగా కొన్ని మాటలు కూడదీసుకుంటూ “మహమ్మద్” అంది నెమ్మదిగా హసీనా.

 

సర్కిల్ మా వేపు తిరిగి, “మహమ్మద్ అయినా, సయ్యద్ అయినా ముస్లిం కదా! అతను మీకు ఎప్పటినించీ తెలుసు?” అడిగాడు.

 

“జూనియర్ కాలేజ్ నించీ…” నేనూ ఫణి వొకే సారి సమాధానమిచ్చాం.

“అతను మీకు బాగా తెలుసా? అంటే క్లోజా? సాయిబుల భాషలో జిగిరీనా?” సర్కిల్ గొంతులోని సటైర్ పదునుగా వినిపిస్తూనే వుంది. నాకు లోపల్నించి చురకత్తి మెలితిప్పుతున్నట్టుగా వుంది.

“అవును” అన్నాం ఈ సారి కూడా ఇద్దరమూ కలిసే.

 

సర్కిల్ మా వేపు అదోలా జాలిగా చూసాడు, ఆ స్నేహం ఏదో చట్టవిరుద్ధం అన్నట్టుగా.

“వొక్క విషయం చెప్తాను. అతను ముస్లిం, మీరు హిందువులు. అతనిది ముస్లిం మైండ్! ముస్లిం మైండ్ అంటే  violent. అది అంత తేలిక కాదు అర్థం చేసుకోడం- అది వొక మిస్టరీ! మీకు తెలియని లైఫ్ అతనికి చాలా వుండి వుంటుంది. ఇన్ని బాంబు బ్లాస్ట్ లూ, బస్సులు తగలబెట్టడాలూ, చావులూ, హత్యల  తరవాత కూడా మీకీ విషయం అర్థం కాకపొతే మీరు వొట్టి అమాయకులైనా అయి  వుండాలి, లేకపోతే, వొక తెలివయిన మాయలో ఇరుక్కొని వుండాలి. ”

 

“ఉండడానికి వీల్లేదు…”అని బల్లగుద్ది చెప్పాలని వుంది. నా మనసులో ఏం జరుగుతుందో తెలిసినట్టు, కాసేపు నెమ్మదిగా వుండు అన్నట్టు నా కళ్ళలోకి చూసాడు ఫణి.

 

అవును, సాహిల్ గురించి నాకూ, ఫణికి తెలుసు. అందరిలానే వాడు పద్దతిగా బతకాలనుకునే వొక భార్యకి భర్త, అందమయిన కలల కేంద్ర బిందువైన వొక పదేళ్ళ ముద్దుల బిడ్డకి తండ్రి, ఇవాల్టికి ఈ రోజు గడిస్తే చాలు అనుకునే చిరు ఉద్యోగి. అన్నిటికీ మించి, మా ఇద్దరి స్నేహం కోసం ప్రాణం పెట్టే దోస్తు. అంతకంటే ఇంకేం చెప్పాలి సాహిల్ గురించి?! మంచి సంగీతానికి చెవి కోసుకునే వాడు, మాట్లాడే ప్రతి వాక్యంలో గజల్ సౌందర్యాన్ని పొదిగే వాడు. తన స్నేహితుల మధ్య ఆ రెండీటిని వొక అందమయిన సేతువుగా కట్టుకుంటూ వెళ్ళే వాడు.

 

అన్నిటికీ అన్నిటికీ మించి- తమ రెండు కుటుంబాల మధ్య ఎప్పటినించో తెగని బంధం. ప్రతి పండగలో ప్రతి ఫామిలీ ఫంక్షన్లో తోడుగా నిలిచే ఆత్మీయత.

 

ఆ నమ్మకంతోనే కదా అంత అర్థరాత్రి తన ఇంటి దాకా పరుగెత్తుకు వచ్చింది హసీనా కొడుకుని వెంటబెట్టుకుని.  

                                                                


సీనా కళ్ళల్లో నేనెప్పుడూ నీళ్ళు చూడలేదు.

 ఆ మాటకొస్తే, రాత్రి పదకొండు  గంటల సమయంలో హసీనాని చూడడం అదే మొదటిసారి. 
భోజనాలవీ అయ్యాక ఇక పడకేద్దామని అనుకుంటున్న సమయంలో వున్నట్టుండి తలుపు కొట్టింది హసీనా. ఆమె కళ్ళ నిండా నీళ్ళు. వణికిపోతున్న వొళ్ళు. పక్కన పెద్ద కొడుకు – పదేళ్ళ ఫైజ్ – వాడూ అదే స్థితిలో వున్నాడు. 

“సాహిల్ ఇంకా ఇంటికి రాలేదు!” కంగారుగా అంది హసీనా.
తలుపు తీయగానే ముందు లోపలికి  వచ్చి కూర్చోమంది నీరూ.
వాళ్ళిద్దరూ సోఫాలో కూలబడిపోయారు. ” బోలో…హసీనా!” అంది నీరూ అనునయంగా హసీనా చేతులు దగ్గిరకి తీసుకొని .
హసీనా చాలా నిబ్బరంగా వుండే మనిషి. వూరికే దేనికీ కంగారు పడదు.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తుళ్ళిపడే ప్రవాహంలా కలకలలాడుతూ వుంటుంది. సాహిల్ భాషలో చెప్పాలంటే “ప్రవాహమయినా కాసేపు స్తబ్దమై పోతుందేమో గాని, హసీనాని అసలు అలా నిశ్సబ్దంగా ఊహించలేం. హసీనాది నవ్వుల కలకల భాష. అవతలి వ్యక్తికి ఉర్దూ రాకపోయినా సరే, ఆమె నవ్వులకు భాష అనేది అడ్డంకి కాదు,” అంటాడు. హసీనాతో కాసేపు మాట్లాడితే చాలు, పెద్ద పెద్ద దిగులు కొండలు కూడా ఇట్టే కరిగిపోతాయి మరి! అందుకే, హసీనా అంటే నీరూకి భలే ఇష్టం! సాహిల్ కి ప్రాణం! తితలీ సంగతి ఇక చెప్పక్కర్లేదు.
పొద్దుటి నించీ రాలేదు, రామూ భాయ్!” అంది ఏడుస్తూ.
ఆమె ఏడుపు ఆపుకోలేకపోతోంది. అవాళ ఆదివారం. సాహిల్ పనిలోకి వెళ్ళడు. ఆదివారం నాడు వొక గంటన్నర మాతో – అంటే  మా తిక్కత్రయంతో-  చాయ్ మహల్ కి వచ్చి చాయ్ తాగుతాడు తప్ప బయటికి ఇంకెక్కడికీ వెళ్ళడు.
ఆ సాయంత్రం సాహిల్ రాలేదని ముందుగా గుర్తించినవాడు ఫణి. కాని, ‘వస్తాడులే వస్తాడులే అని అనుకుంటూ ఉండగానే మా గంటన్నర గడిచిపోయింది. రెండు కప్పులు చాయ్ తాగి, ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. పోనీ నేనయినా  ఓ రెండడుగులు వేసి సాహిల్ ఇంటికి వెళ్లి వస్తే పోయేదేమో! కాని, సాహిల్ ఎక్కడికీ వెళ్ళడని నా గట్టి నమ్మకం.
ఇప్పుడు హసీనా ఏడుపు, ఫైజ్ దిగులు కళ్ళూ చూస్తూ వుంటే, ఎంత పొరపాటు చేసానా అని లోపల్లోపల గిల్టీగా వుంది.
భాబీ, మీరు ఈ పూట ఇక్కడే వుండండి. వాడు ఎక్కడో ట్రాఫిక్ లో చిక్కుకొని వుంటాడు. ఏదో పని మీద ఎక్కడో ఆగిపోయి వుంటాడు. మీరేమీ  కంగారు పడకండి” అంటున్నా కాని… ఇంత రాత్రి దాకా సాహిల్ ఇంటికి రాకపోవడం…ఏమిటీ? అన్న ప్రశ్నకి నా దగ్గిర కూడా సమాధానం లేదు! “ఫణికి వొక సారి ఫోన్ చేయండి” అంది నీరూ. వెంటనే ఫణికి చేసాను. నో రెస్పాన్స్…వాళ్ళంతా ఈపాటికి నిద్రలో వుండి వుంటారు.
ఫణికి మాత్రం ఎం తెలుస్తుంది? వాడూ సాయి తనతో ఆరుగంటల క్రితమే కదా కలిసారు!? వాళ్ళూ తనలాగే ఇంటికి వెళ్లి ఎవరి సంసారం గొడవల్లో వాళ్ళు వుండి వుంటారు.
మళ్ళీ ఫణి కోసం ప్రయత్నిద్దామనుకునే లోపు వాడే చేసాడు. విషయం చెప్పాను. కాని, వాడికేమీ తోచినట్టు లేదు. కాసేపు రకరకాలుగా ఆలోచించిచివరికి “ఒరేయ్, పొద్దుటి దాకా చూద్దాం. రాకపోతే, నా ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ వున్నాడు కదా…అతని దగ్గిరకి వెళ్దాం. ” అన్నాడు. వాడి గొంతులో కూడా ఏమీ తోచని తనమూ, కంగారూ వినిపిస్తూనే వున్నాయి.
అసలు సాహిల్ గాడి గురించి నాకు తెలియకపోవడం ఏమిటి? మా ఇద్దరి మధ్యా ఏ విషయంలోనూ దాపరికాలు లేవు, ఆ మాటకొస్తే నా విషయాలు నేనెంత వరకూ వాడికి చెప్తానో తెలియదు గాని, వాడు మాత్రం  ప్రతీదీ నాకు పూసగుచ్చినట్టు చెప్పుకోవడం వాడికి చిన్నప్పటి నించీ- అంటే మా జూనియర్  కాలేజీ రోజుల నించీ-  అలవాటు.
సాయంత్రం కాగానే పని నించి రాగానే ఇంటికి వెళ్లి హసీనాతో తన ఇద్దరు పిల్లలతో వో పావు గంట గడిపి, ఆదరాబాదరా నా దగ్గిరకి—ఆమాటకొస్తే ముందు తితలీ దగ్గిరకి-   వస్తే తప్ప అతనికి శాంతిగా వుండదు.  


      కాని, ఇవాళ సాహిల్…?!


       నిజమే, సాహిల్ గురించి నాకు అంతా తెలుసు అని   మనస్పూర్తిగా  చెప్పగలను.

          ఏ ఇద్దరి మధ్య ఏముందో కనుక్కోడానికి ఈ జీవితంలో అంతగా అవకాశాలు దొరకవ్! కానీ, కొన్ని basic instincts మేలుకునే అరుదయిన సందర్భాల్లోనో, సన్నివేశాల్లోనో కాసింత తోడు కనిపిస్తే, ఆ తోడు నిజంగా బాగుంటుంది, నిలిచే తోడులా అనిపిస్తుంది.  డిగ్రీ చదివేటప్పుడు ఎండాకాలం సెలవుల్లో వొక మధ్యాన్నం నా గదికి వచ్చాడు సాహిల్. నేను అప్పుడే వో మధ్యాన్నం కునుకు తీసి చాయ్ కప్పు తీసుకొని కూర్చుని వున్నా. 
       వాడు రాగానే కొద్దిసేపు మౌనంగా వున్నాడు. వాడి మౌనానికి వాడినే వదిలేయడం ఇష్టం లేక, “అలా బయటికి నడుద్దాం. పద!” అన్నాను. 
      అప్పుడు వాడు చాలా సిగ్గుపడుతూ తల కిందికి వంచుకొని అన్నాడు: “అరె, రామూ…నేనొక తప్పు చేస్తున్నా వారం నించీ!”
      తప్పు…?”
      అవును…నీకు హసీనా తెలుసు కదా?!”
       హా. తెలుసు. తెలియకపోవడం ఏమిటి?!” అన్నాను కాస్త చిలిపిగా వాడి కళ్ళలోకి చూస్తూ. అసలు ఈ వయసులో మరీ దగ్గిర స్నేహితుల కళ్ళకి తెలియని రహస్యాలు ఏమీ ఉండవని వాడికీ తెలుసు. వాడి కళ్ళు చెప్తున్న భాషని నిజానికి వాడికంటే ముందే నేనే పసిగట్టాను. కాని, వాడు చెప్పకుండా నేనెందుకు నోరువిప్పాలని చుప్ రుస్తుమ్లాగా  – ఏమీ తెలియనట్టు-   వుండిపోయా.
       హసీనాతో నేను తలమునకలుగా ప్రేమలో వున్న మాట నిజమే కాని, కలలో నిద్రలో నేను చేస్తున్న పనులు పెద్ద బాలేవు!” అన్నాడు తల దించుకునే. 
      నాకు అర్థమయింది వాడు ఏం మాట్లాడుతున్నాడో! నిజానికి వాడు అసలు ఆ విషయాలేమీ నాకు చెప్పక్కరలేదు. కాని, చెప్పకుండా వుండలేనితనం…”ఇలా ఏదయినా వొక విషయం దాస్తే నాకు రాత్రల్లా నిద్రపట్టదు,” అంటాడు. “అట్లా అని మా నిద్ర చెడగొడతావా, బేవకూఫ్! ఇంత వయసు వచ్చినా వొక్క అమ్మాయినీ పటాయించలేక సిగ్గుతో చచ్చిపోతున్నాం నేనూ ఫణి గాడు!” అన్నా నవ్వుతూ. 
       హసీనాతో ఈ ప్రేమ వొక అందమయిన యాక్సిడెంట్. వొక గజల్ ప్రవాహం. ఈ లోకమంతా ఇద్దరే ఇద్దరు ఆ ఇద్దరూ వొక్కరే అనిపించే మహఫిల్ కలకలం! కాని, ఈ పాడు దేహమూ, దాని చుట్టూ ఈ కలలూ నన్ను డేంజర్ లో పడేస్తున్నాయ్. ఏదయినా పొరపాటు చేస్తానేమో!” 
      నువ్వు డేంజర్ లో పడ్డా, హసీనా పడనివ్వదు. ఇక కలలంటావా?! భరించాల్సిందే! ఇక్కడ నీ ఇస్లామూ, జాయజ్/ నాజాయజ్..ధర్మమూ అధర్మమూ … అంటూ బాధపడుతూ  కూర్చోకు.  కంటినిండా కలలు కను. పెళ్ళయ్యాక ఎలాగూ పిల్లల్ని కనే బిజీలో కలల్ని కనే తీరిక ఉండకపోవచ్చు!” 
       అయితే, ఆట్టే ఎక్కువ కాలం కలలు కంటూ వుండిపోలేదు సాహిల్. తప్పు చేస్తున్నానన్న భావం – అది ఇస్లాం దృష్టిలో తప్పు అన్న భావం- వాణ్ని అలా వుండనివ్వ లేదు.  డిగ్రీ పూర్తికాకుండానే, వొక ఫుట్ వేర్ షాప్ లో మేనేజర్ గా చేరిపోయాడు, కేవలం — ఆర్థికంగా త్వరగా సెటిలై, హసీనాని పెళ్ళిచేసుకోడానికి! నీతీ నియ్యతు మీద వాడికి అంత పట్టింపు!
      ఆ నిర్ణయం తీసుకోడానికి వొక వారం ముందు సాహిల్ అన్న మాట మాత్రం నాకూ, ఫణికి కూడా బాగా గుర్తు. “ధర్మబద్ధం కాని పని ఏదీ నేను చేయలేను, అది కేవలం నా శరీరానికి మాత్రమె పరిమితమయ్యే విషయం అయినప్పటికీ!” 
       నువ్వు సత్యకాలం మనిషివే ఇంకా?” అని ఆ రోజు నేనూ, ఫణి వాడి మొహమ్మీదనే జోకులేయడం ఇంకా గుర్తుంది. 
      ఇప్పుడు ఆలోచిస్తూంటే సాహిల్ కి  లోపల్లోపల  ఎప్పుడూ వొక డైలమా ఏదో ఉంటూ వచ్చిందా అని అనిపిస్తుంది. కాని, వొక్కటి మాత్రం నిజం – ఇంకో మనిషికి హాని తలపెట్టే ఏదీ సాహిల్ చేయలేడు, ఆ మేరకు అతను బలహీనుడు. ఈ సర్కిల్ ఏమంటాడూ –“బాంబ్ బ్లాస్ట్ తరవాత ముస్లిం మైండ్” –సాహిల్ దా?

తితలీకి అన్నీచెప్పుకోవాలి. కాని  ఎలా చెప్పాలి ఇప్పుడిది?

చెప్పగలనా? సాహిల్ చుట్టూ పేరుకుపోతున్న ఈ అబద్ధాలూ, వాటి కథలూ చెప్పగలనా?

 ఇన్నాళ్ళుగా తెలిసిన సాహిల్ ని, ఈ వొక్క రోజు  అదృశ్యమయి పోయిన సాహిల్ ని విడివిడిగా చూడగలనా? ఇదంతా కట్టు కథేనని లోకానికి కూడా తెలిసిపోతుంది, తప్పదు.   రేప్పొద్దుటికల్లా సాహిల్ రాకపోడు! అప్పుడు తన ఆలోచనలకి తనకే నవ్వూ రాకపోదు!

  4

 ఆ సాయంత్రం ఎప్పటిలాగానే  చాయ్ మహల్లో వొక కప్పు చాయ్ తాగుదామని ఫణి అన్నాడు. కానీ, సాహిల్ లేని చాయ్ కానీ, చాయ్ మహల్ గానీ నాకు సయించలేదు.

          “చాయ్ చుక్క గొంతులో పడే ముందు- వొక గజల్ సమోసా రుచి చూడు  …” అంటూ వరసగా రెండు గజల్స్ అందుకునే వాడు. అందులో నాకు బాగా నచ్చింది.

 

ప్రేమంటే ఏమిటో తెలుసు గాని అందాల నా చెలికి నా ఇల్లే తెలియదు

దేవుడి పేరు వింటే విన్నదేమో కానీ ఆమెకి అతని జాడే తెలియదు

 

మరీ పరధ్యానంగా వున్నానేమో, యవ్వనపవనం ఎప్పుడొచ్చి ఎలా వెళ్ళిందో తెలియదు.

వసంతం వచ్చి వాకిట నిల్చుందని తెలుసు కానీ, ఆకురాలు కాలమే తెలియదు

 

          ఈ గజల్ అది వాడి గొంతులో ఎన్ని వొయ్యారాలు పోతుందో తెలియదు. వొక నిండు మహఫిల్ లో కూర్చొని అటు సంగీతమూ ఇటు పాటా పోటీపడి సాగుతున్నట్టుగా వుంటుంది సాహిల్ సమక్షం!

ఇవాళ సాహిల్ జ్ఞాపకమయిపోతున్నాడా?

లేదు…లేదు…వీల్లేదు… లేదు.

ఫణి ఏదో అంటున్నాడు. కాని, నాకేమీ వినిపించడం లేదు. మహల్ నిండా ఏదో పాట కెరటాలుగా చుట్టేస్తున్నది. ఆ పాటలోని వొక్క అలా నన్ను తాకడం లేదు.

చాయ్ వచ్చే లోపలే నేను అక్కడినించి లేచి వచ్చేసాను.

సాహిల్ లేని ఆ మెహఫిల్…నాకు వద్దు వద్దనిపించింది.

ఇంటికి రాగానే నీరూ నన్ను గమనించి, వెంటనే చాయ్ పట్టుకొచ్చింది. టీవీ పెట్టబోయింది. టీవీ వద్దన్నాను. ఊరుకుంది.

ఆ తరవాత “ఇవాళ నుమాయిష్ -ఎక్జిబిషను-  వుంది. అట్లా వెళ్లి వద్దామా?” అంది.

“వద్దులే…!” అనేసి పక్క గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుండి పోయాను, బట్టలు మార్చుకోకుండానే!

నీరూ నా వెనకే గదిలోకి వచ్చింది.

“ఇవాళ  హసీనా వచ్చింది, ఫైజ్ ని వెంటబెట్టుకొని!” అంది.

“అవునా?”

“అవును. హసీనా చూస్తే నాకు చాలా దిగులుగా వుంది. ఫైజ్,తితలీ కాసేపు ఆడుకున్నారు. కాని, ఫైజ్ ఆడే మూడ్ లో లేడు. కాసేపు వుండి వెళ్ళిపోయారు.”

“ఏం చేయాలి, నీరూ? నాకేమీ తోచడం లేదు.”

“మీరేమీ అనుకోనంటే వొక మాట అడగనా? మీకు తెలియకుండా సాహిల్ కి ఇంకో స్త్రీ ఉందేమో! అయినా తను ముస్లిం కదా…”అంది నెమ్మదిగా.

“ముస్లిం అయితే…!” నా తల తిరిగిపోయింది.

“ప్లీజ్…ఇంకేమీ మాట్లాడకు…ప్లీజ్…నన్నిలా వుండనీ కాసేపు!” అని నేను విసురుగా పక్కకి తిరిగి పడుకున్నాను.

ఇంకో స్త్రీ వుండడం తప్పు అని కాదు నా ఉద్దేశం. కాని, సాహిల్ అలా మాకు తెలియకుండా వ్యవహరించే మనిషి కాదని చెప్పడమే నా ఉద్దేశం. అది నీరూకి అర్థమయిందా? అసలు నీరూకి సాహిల్ ఇప్పుడు ‘ముస్లిం’ లాగా  కనిపించడం…!

“నువ్వెవరికీ ఏమీ సమాధానం చెప్పలేవు. ఇప్పుడంతా సాహిల్ ని ముస్లిం అనే చూస్తారు కాని, వొక మనిషి మిస్ అయ్యాడని మాత్రం అనుకోరు…అలా వుంది ఇప్పుడు పరిస్తితి!” అని ఫణి అన్న మాటలు గుర్తొచ్చాయి.

సాహిల్ ఎవరు అన్న ప్రశ్న తితలీకి కూడా ఉందా?

 5

 ప్పుడే గదిలోకి వచ్చినట్టుంది తితలీ.

“నాన్నా!” అని పక్కకి వచ్చి పడుకుంది. తితలీ కూడా సాహిల్ గురించేమన్నా అంటుందా?

“నాన్నా..ఇవాళ ఫైజ్ వచ్చాడు. కాని, ఎక్కువ సేపు ఉండలేదు!”

“అవునా?” అంటూ తితలీని దగ్గిరకి తీసుకున్నాను.

“నాన్నా. సాహిల్ మామూ…” అంటూ ఏదో అనబోయింది.

నేను తితలీ కళ్ళలోకి చూసాను. అవే అమాయకపు కళ్ళు. కాసింత తడి వాటి మెరుపు కింద.

“నాన్నా…సాహిల్ మామూ వస్తాడు..మాతో ఆడుకుంటాడు..” అని నన్ను హత్తుకొంది తితలీ.

నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు.

ఏడుస్తూ ఉండిపోయాను, తితలీని హత్తుకొని!

·          

 

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

31 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మై మూన్ హ్యాడ్ బ్లడ్ క్లాట్స్…. వాళ్లెప్పటికీ తిరిగి రాలేరు.

    సాహిల్ కోసం మాత్రం లక్షలాది తెలుగు చింతలు…

    వాళ్లని తలచుకునేవారేలేరు 30 ఏళ్లుగా….

    సెక్యులర్ మ్యాంగో ఆకుపచ్చగా నుండును…

    మతోన్మాద మ్యాంగో పండు పసుపు (కాషాయ చాయ) రంగులో నుండును….

    తెలుగు కెరీరిస్టు బోన్సాయ్ కవి గాయక నట వైతాళికుల

    గత 70 ఏళ్ల భేరీ, కాహళ, ఢమరుక, రచనా దిక్కులు పిక్కటిల్లడంలో

    మెజారిటీ వాసుల నిట్టూర్పు సమసిపోయింది.

  • సాహిల్ రావాలా ?
    న్యాయాన్యాలు కి మతం ప్రాతిపదికయిన రాజ్యం లోనికి,
    మెదడుకి సైతం మతకపాలాన్ని తొడగగలిగిన దాని వ్యవస్థల దాపుల్లోకి ,
    సాహిల్ రావాలా ??

    ఏమో, రావాలేమో ..
    మతం మాటున ఇంకిపోయిన మానవత్వాన్ని తట్టిలేపడానికో,
    మనిషిత్వానికో రూపం గా మిగులున్న తిత్లీ లు, ‘నీరూ’పాంతరం చెందకుండా అపడానికో
    రావాలేమో..
    సాహిల్ రావాలేమో…
    ఏమో ,
    మనిషి ఉనికి ని నింపుకున్న ఆ ముగ్గురొక సమూహం గా మిగిలుండడానికి,
    సంద్రాకాశాలంత స్వచ్ఛమైన సాహిల్ కావాలేమో ..

    # రచయిత ఎంత బాగా రాసారో అంతే బాగా narrate చేశారు. పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ సార్.

  • కధ చవడం ద్వారా కలిగే అనుభూతికి, ఇనడం ద్వారా కలిగే అనుభూతికీ.. స్పష్టమైన తేడాలున్నాయి. అసలు చదవడం కంటే నిన్నమొన్నటి వరకూ వినడమే కదా పం(ఉం)డింది. హృదయాన్ని ద్రవింపజేసేలా సాహిల్ని రాసిన అఫ్సర్ సాబ్ కి, అంతే స్థాయిలో హృదయానికి హత్తుకొనేలా వినిపించిన శ్రీనివాస్ బందా గారికి ధన్యవాదాలు.

  • Saahil aayegaa
    Jaroor aayegaa
    Circle kuchh bhee nahee karegaa
    Saahil ko doosraa Ghar nahee hai
    Muslim haitho kyaa
    Manmei haseena bachpan se
    Aayegaa jaisaa thithalee bolanaa jaisaa
    Math ronaa bhaayi

  • మనమొక సత్యాన్వేషణ చేయాలంంటే ఆ విషయంంపైై పూర్వ జ్ఞానాన్ని వదిలి ఆలోచింంచాలంంటారు జిడ్డు కృృష్ణమూర్తి.భారతదేశంంలో అంందరూ భారతీయులే,ముస్లింంలు తప్ప.ఈ ధోరణి ప్రబలంంగా ఉన్న నేటికాలంంలో పోలీసు,గృృహిణి,పసిమనసు ఒకే విషయాన్ని దర్శింంచిన కోణాన్ని చాలా అద్భుతంంగా చెప్పాడు.జెన్ కథలా ఇచ్చిన ముగింంపు చాలా బాగుంంది అఫ్సర్ సార్ .

  • చిన్నప్పుడు కడప రేడియో అలవరసలపై “మధురాంతకం రాజారాం”గారి కథానికలు చిన్నక్క, ఏకాంబరం గార్ల సంభాషణల్ని వినేవాళ్ళం. వారి వాచక చమత్కారం తో శ్రవణం కాస్తా కళ్లముందు దృశ్యామానమయ్యేది. ఇప్పుడు మీరు ఎంచుకున్న మాధ్యమంలో దృశ్యాన్ని చూపిస్తూ కథను వినిపించడం వినూత్నంగా ఆకట్టుకుంది. అఫ్సర్ గారికి శ్రీనివాస్ గారికి అభినందనలు💐💐💐💐

    • ధన్యవాదాలు బసవరాజుగారూ. మరిన్ని కథలు వినిపించేందుకు మీ అందరి ప్రోత్సాహం బలాన్నిస్తోంది.

  • మనిషి జీవితం ఎక్కడ మొదలైంది?…ఎటు పోతుంది…?
    మనిషి మనిషికీ మధ్య తెలియని శత్రుత్వం ఎలా వస్తుంది…? ఎవరో చేసే వికృతి చేష్టలకు మతంని ఎందుకు జోడించి నిందించడం…అలా అనుకుంటే యావత్ మానవ జాతినే కదా నిందించాల్సింది!!
    రంగుల కలలను పూర్తిగా కనకముందే స్వేచ్ఛా రెక్కల్ని విరిచేస్తే ఎగరడం ఎలా ??
    …అఫ్సర్ గారి ‘సాహిల్ వస్తాడు’ కథ చదివాకా నాలో రేగిన ప్రశ్నలు ఎన్నెన్నో . ఆయన ఖండాంతరలు దాటున్న, కథ మాత్రం పక్కకుండి చెప్పినట్టుంది. కథను వినడం కొత్త అనుభూతినిచ్చింది.

    • ధన్యవాదాలు మన్‌ప్రీతమ్‌గారూ. చిన్నప్పుడు అమ్మ మెయిన్ బజార్లో ధన్యవాదాలు మన్‌ప్రీతమ్‌గారూ. చిన్నప్పుడు అమ్మ మెయిన్ బజార్లో మసీదుకి తీసుకెళ్లి కట్టించిన తాయెత్తు, అక్కడి సాంబ్రాణి వాసనల ముద్రలింకా తాజాగానే ఉన్నాయి. హిందూ-ముస్లిమ్‌ల మధ్యన మొలిచిన ఈ అగాథాలన్నీ ఈ మధ్యకాలంలోవే.. మీ మాటలు చదివిన తర్వాత, అఫ్సర్‌గారి కథలోని బాధని, ఆత్మీయతనీ సరిగ్గానే పలికించానననిపిస్తోంది.. మరోసారి ధన్యవాదాలు.

  • మీ గాత్రం బాగుంది..సర్. అభివందనలు.. త్వరలో మీ కవితలు చదువుకోవాలని, ఆశ పడుతునన్నాం.

    • ధన్యవాదాలు పద్మగారూ. ఈ నెల ‘ఈమాట లో కెహర్వా అనే కవిత వచ్చింది. చదివి చెప్పండి.

  • కథ చదివినప్పటికంటే శ్రీనివాస్ గారి మ్యూజికల్ టోన్ లో కథను మంద్రస్థాయిలో వింటున్నప్పుడు – ఆ వినిపిస్తున్న తీరు ఎంతైనా ప్రశంసనీయం! తితలీ-సాహిల్ ల అనుబంధం గురించి చెప్పే పద్ధతి పరవశం కలిగించింది. సర్కిల్ గొంతులో దశాబ్దాలుగా అల్లిన, అల్లుతున్న కుట్ర కథలు వినిపించాయి! 2002 గుజరాత్ సంఘటనలు, రాణా అయ్యూబ్ పరిశోధనలు, షాహీన్ బాగ్ శిబిరాలు, అరెస్టుల పాలైన మహిళలు గుర్తొచ్చి వణుకొచ్చింది! తితలీ తల్లి చల్లని హాయినిచ్చే పసి గొంతు “సాహిల్ వస్తాడు” అని చెప్పి నమ్మకం కలిగించి, సేద తీర్చి, మురిపించింది!
    నమ్మ శక్యం గాని పనితనంతో హాలీవుడ్ నుంచి రూపొందించిన గొప్ప చిత్రం “ది షావ్‌శాంక్ రిడంప్షన్”(The Shashank Redemption). జీవిత ఖైదు ననుభవిస్తున్న ఇద్దరు స్నేహితుల కథ ఇది. వారిద్దరూ సమవయస్కులు కూడా కాదు. ప్రొటాగనిస్ట్ అయిన “ఆండీ డుఫ్రెస్నే” అనే తన స్నేహితుడినీ, జైలు జీవితాన్నీ 20 సంవత్సరాల పాటు గమనిస్తూ “మోర్గాన్ ఫ్రీమాన్” అనే ప్రఖ్యాత నటుడు తన గొప్ప స్వరంతో సినిమా కథనాన్ని ప్రేక్షకులకు అందిస్తాడు. ప్రపంచ సినీ విమర్శకులందరూ ఈ సినిమా ‘మోర్గాన్ ఫ్రీమాన్’ గొంతువల్లే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మెచ్చుకున్నారు. అలాగే ఆండీకి మోర్గాన్ లాగా, అఫ్సర్ కథను ప్రశాంతమైన అప్రమత్తంగా గమనించే స్వరంతో శ్రీనివాస్ సుసంపన్నం చేశారు. ఇద్దరికీ అభినందనలు! ఈ కథనం విన్నాక నాకు ఆ సినిమా గుర్తొచ్చింది!

    • అనేక ధన్యవాదాలు శివలక్ష్మిగారూ. నిజానికి బలమంతా అఫ్సర్‌గారి కథలోదే. మీ మాటలిచ్చిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.

  • ఈ కొత్త ప్రయోగం బాగుంది సార్

    • ధన్యవాదాలండి. మరిన్ని కథలు వినిపిస్తాను, అది నా అదృష్టంగా భావిస్తూ..

  • సాహి ల్ రాగానే ఒక phone message పెట్టండి. మేము ఖంగారు పడకుండా వుంటాం.

  • సాహిల్ వస్తాడు నేనూ చదివాను విశ్లేషణ కూడా ఎఫ్‌బి లో రాశాను. కానీ మిత్రులు బందా శ్రీనివాస్ గారు ఆ కధ చెప్పిన తన పద్ధతి లో చాలా బావుంది. ఒక నాటకం చూస్తున్న భావనా కలిగింది

  • అద్భుతమైన ప్రయోగం… మనసును హత్తుకునే అఫ్సర్ గారి కథను శ్రీనివాస్ గారి మెత్తని స్వరంలో చక్కని మాడ్యులేషన్స్ తో వినసొంపుగా వినిపించారు… రాసిన, వినిపించిన ఇద్దరికీ అభినందనలు💐💐💐

  • Superb sir .
    సాహిల్ ఇప్పుడుండే పరిస్థితుల్లో రాడు. భవిష్యత్తులోనూ రాలేడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు