అతడి కథలు విషాద శాకుంతలాలు

వెంకట్రామయ్య గారు ఇకలేరు అనగానే నా మనసులో కదలాడిన కథలు పాత్రలు ఇవి!

పాతికేళ్ల క్రితం అనుకోకుండా ఒక పాత పుస్తకాల షాప్ లో దొరికిన ఆంధ్రప్రభ వార పత్రికలో  చదివిన ” విషాద శాకుంతలం ” కథ  చదివిన తరువాత ఆ రచయత తో మాట్లాడాలని చాలా అనుకున్నాను . మాట్లాడటానికి ఒకటి రెండు విఫల యత్నాలు చేశాను కూడా . అనుకోకుండా రెండు నెలలక్రితం నేను ఆంధ్రజ్యోతి వివిధ లో రాసిన ఒక కవిత్వ వ్యాసం చూసి ఆయనే నాకు ఫోన్ చేసారు . ఆయన తాను ఫలానా అని పరిచయం చేసుకోగానే , ఆయన మాటలు పూర్తి కాకముందే నేను ” విషాద శాకుంతలం ” కథ  గురించి ప్రస్తావించాను . ఆయన నవ్వి ” ఆ కథలో  ఏముంది ? చాలా సాధారణమైన కథ . మీకు ఇంతకాలం గుర్తుందా ?” అన్నారు . ఆ రోజు ఆయన చాలాసేపు మాట్లాడారు . ” నేను కృష్ణా జిల్లా ముదినేపల్లి లో పని చేస్తున్నాను ” అని చెప్పగానే ఆయన ” మాది గుడివాడ పక్కనే ఉన్న  దొండపాడు ” అని చెప్పారు . దొండపాడు , గుడివాడ , హైదరాబాద్ చాలా విషయాలు ఆరోజు చెప్పారు ఆయన

ఆ తరువాత రెండు మూడు సార్లు మాట్లాడారు . మా ఇద్దరికీ కామన్  ఆసక్తులు రెండు . ఒకటి కథలు . రెండు సినిమాలు . నేను 25th  ఫ్రేమ్ పేరుతొ ఒక సినిమా వ్యాసాల పుస్తకం పబ్లిష్ చేశాను అని , దానికే నంది అవార్డు వచ్చిందని చెప్తే , ఆయన తన సినిమా అనుభవాలు అన్నీ చెప్పారు . నవత  కృష్ణం రాజు నిర్మించిన ” “పంతులమ్మ ” సినిమాకు తాను  పనిచేసినట్లు స్క్రీన్ మొదటి సారి తన పేరు ఆ సినిమాకే పడినట్టు చెప్పారు . మొన్న సోమవారం నాడు అంటే 13-01-2020 నాడు తన మనవళ్ల తో కలసి రెండు సినిమాలు ఒకేసారి చూడాలని ప్లాన్ చేసుకుని , ఒక సినిమా చూసాక రెండో సినిమా కి వెళ్లే వ్యవధిలో గుండె పోటు  తో ఆయన మరణించారన్న విషయం  విన్నాక నా మనసంతా మూగపోయింది . ఒక్కక్షణం పాటు నోట  మాట రాలేదు . ఆయనతో నా పరిచయం వయసు కేవలం రెండు నెలలే కావచ్చు , కానీ ఒక విడదీయరాని అనుబంధం, ఏదో  ఉన్నట్టు ఒక చిన్న అలజడి

ఆయన డి . వెంకట్రామయ్య . ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మూడు దశాబ్దాలకు పైగా తన ధీర గంభీర  స్వరం తో వార్తలను చదివి తెలుగునేల నలు చెరగులా లెక్కలేనంత  మంది అభిమానులను సొంతం చేసుకున్న అద్వితీయమైన వ్యక్తి . నలభైకి పైగా కథలు  రాసి  బుచ్చిబాబు , రావిశాస్త్రి కథా  పురస్కారాలు పొందిన ఉత్తమ కథారచయత . పంతులమ్మ తో సహా మరికొన్ని సినిమాలకు జ్ఞాతంగా , అజ్ఞాతంగా పనిచేసి ఆ సినిమాలకు ఒక స్థాయిని తీసుకుని వచ్చిన సినిమా  మేధావి . బుచ్చిబాబు , స్థానం నరసింహా రావు , బాలాంత్రపు రజినీకాంత రావు , గొల్లపూడి మారుతీరావు , దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాంటి ఉద్దండులతో పనిచేసి , వాళ్ళ వారసత్వాన్ని మరింత ముందుకు నిబద్దత తో తీసుకునిపోయిన ఆకాశవాణి కళాకారుడు . అన్ని రంగాలతో పాటు ఆకాశవాణి  లో కూడా విలువలు పడిపోతున్నాయి అని చివరి రోజులలో బాధపడిన రేడియో ప్రేమికుడు . అన్నిటినీ మించి మంచి మనిషి.

2

రేడియో లో అనౌన్సర్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేసినవారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కూడా ఉన్నారట . డి . వెంకట్రామయ్య  అన్న పేరు చూసి ”  డి  అంటే ఏమిటి ? దేవులపల్లా ?” అని కృష్ణశాస్త్రి ప్రశ్నించారట . ” దేవులపల్లి కాదు . డి  అంటే దివి ” అని వెంకట్రామయ్య చెప్పగానే ” ఓహో ! దివి నుండి భువికి దిగివచ్చారన్నమాట ” కృష్ణ శాస్త్రి చమత్కరించారట . కృష్ణ శాస్త్రి చమత్కారానికేమి కానీ ఆయన కధలు ఏవీ దివి నుండి భువికి దిగి రాలేదు . తన చుట్టూ ఉన్న  అధోజగత్ సహోదరుల జీవితాలలో సైతం కనిపించని కోణాలకి ఒక సజీవ రూపాన్ని ఇచ్చిన కథలు  డి వెంకట్రామయ్య కథలు . కథా  రచనలో ఆయనది ఒక ప్రత్యేకమైన ముద్ర . ఎక్కువగా థర్డ్ పర్సన్ లో కథ  చెప్పడానికి ఇష్టపడే ఆయన కధలన్నీ అనూహ్యమైన ముగింపులతో పాఠకుడిని సంభ్రమాశ్చర్య చకితుడిని చేస్తాయి . కథ  చివరలో తిప్పే చిన్న మలుపు , ఒక చిన్న ట్విస్ట్ కథకి  అనూహ్యంగా ఒక స్థాయి ని ఇస్తుంది . కథ  చదువుతున్న పాఠకుడు చివరిదాకా తానొక సాధారణ , సాదా సీదా కథ చదువుతున్నాను అనుకుంటాడు కానీ చివరి రెండు మూడు వాక్యాలు దగ్గరికి వచ్చేసరికి అతడి అంచనా తప్పుతుంది . చివరకు ఒక మంచి కథ  చదివాను అన్న అనుభూతి తో కథను ముగిస్తాడు . ” ఆవు గాండ్రించును , నిద్ర రావడం లేదు , ఒక మరణం -ఒక చావు , భోజన రాజు , విషాద శాకుంతలం ” ఇలా ఏ కథ  చదివినా ఒక ప్రత్యేకమైన ముగింపు కనిపించి పాఠకుడు ఆశ్చర్య పడతాడు

నేను ”  భోజన రాజు ” కథ  చదువుతున్నంత సేపు సత్యం శంకర మంచి అమరావతి కథలు  లోని భోజన చక్రవర్తి  కథను గుర్తుచేసుకుంటూనే వున్నాను . భోజన చక్రవర్తి నాకు ఇష్టమైన కధలలో ఒకటి . ఆ కధలో  అప్పంభొట్లు అనే పాత్ర కడుపునిండా పుష్టిగా తిని ఆయాసపడుతూ నేల  మీద పడి  దొర్లే సన్నివేశాన్ని సత్యం శంకర మంచి చాలా హిలేరియస్ గా రాస్తాడు . నేను చాలా పూర్ ఈటర్  ని . కనుక నాకు ఆ కథ  చాలా నచ్చింది . కానీ వెంకట్రామయ్య  భోజన రాజు కథ  చివరలో గుండెను పిండేస్తుంది . కధలో ఆనంద మూర్తి  మంచి భోజన ప్రియడు . ఎప్పుడు ఎవరు భోజనానికి పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు . ఎవరూ పిలవకపోయినా  తానే అడిగి మరీ పిలిపించు కుంటాడు . లేదంటే శనివారమో , ఆదివారమో  తెలిసిన ఎవరిదో ఒకరి ఇంటికి వెళ్లి భోజనం సమయం దాకా అక్కడే ఉండి వాళ్లకు భోజనం పెట్టక తప్పని పరిస్థితి కలిపిస్తాడు .ఆనంద మూర్తి వెనుక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వుంటారు . అవన్నీ తెలిసినా తెలియనట్లే అతడు ఉంటాడు . ఒకరోజు భోజనరాజు  కథ  చెప్తున్న  కథానాయకుడు ఆనంద మూర్తి ను భోజనానికి పిలుస్తాడు . అతడికోసం రకరకాల వంటలు చేయిస్తాడు . కానీ ఎందుకో కానీ ఆనంద మూర్తి భోజనానికి రాడు . అతడు భోజనానికి ఎందుకు రాలేదు అన్నది కథానాయకుడితో పాటు పాఠకుడికి కూడా ప్రశ్న గానే ఉంటుంది . మరునాడు ఆఫీస్ లో కధానాయకుడు ఆనంద మూర్తిను భోజనానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు . అతడు జవాబు చెప్పడు ? ఎవరు ఫ్రీగా టిఫిన్ పెట్టిస్తారా అని ఎదురుచూసే ఆనంద మూర్తి ఆరోజు టిఫిన్ ఆఫర్ చేసినా తినకుండా కేవలం టీ తో సరిపెట్టుకుంటాడు . కధానాయకుడు తరచి తరచి అడుగగా అసలు విషయం చెప్తాడు ఆనంద మూర్తి     ఆ రాత్రి ఆనంద మూర్తి భోజనానికి అని బయలుదేరుతుంటే  .అతడి ఐదుగురు పిల్లల్లో ఆఖరి వాడొచ్చి ” నాన్నా అన్నానికి నన్నెప్పుడూ తీసుకెళ్ళవే . నేనూ వస్తా ” అంటాడు  . ఆ మాటకి ఆనంద మూర్తి కి గుండె గుడ్డు చితికినట్టు చితికి పోతుంది . అతడి ఇంట్లో నెలకి కనీసం వారం రోజులు పస్తులు వుంటారు . అతడి సంపాదన అతనికీ , అతని భార్యకీ , ఐదుగురు పిల్లలలకీ , పెళ్ళీడొచ్చిన ఇద్దరు చెల్లెళ్ళకీ , ముసలితల్లికీ చాలదు . పస్తులున్నపుడల్లా ఆనందమూర్తి దేశమ్మీద  పడతాడు . . అతడు అంతగా తినడం భోజన ప్రియత్వం వలన కాదు . అవసరమిత మరునాడు పస్తు  ఉండటానికి . ఇంట్లో అందరి సంగతీ బలవంతాన  మర్చిపోయి ఇన్నాళ్లు పొట్టనింపుకుంటున్నాడు . ఇప్పుడు కొడుకు ప్రశ్న కళ్ళు తెరిపిస్తుంది . ” పెట్టగలిగితే అందరికీ పెడతాను . లేకపోతే అందరితో పాటు నేనూ పస్తులుంటాను  అని నిర్ణయం తీసుకుంటాడు . కథ  చివరలో వెంకట్రామయ్య ఒక మాట అంటాడు . ” భోజన రాజు  కడుపునిండా తినే వాళ్ళ కథ  కాదు . సగం కడుపు ఖాళీగా  సగం సగం బతికే వాళ్ళ కథ  అని .  ఆ ఒక్క మాటతో కథ కుడు  కథ  సాధించవలసిన గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తుంది . ఈ కథ  చదివాకా నేను ఎవరైనా భోజనం చేస్తుంటే  సరిగా తింటున్నారా ? లేక సగం సగం తింటున్నారా ? అని కడుపు వెనుక చూడటం అలవాటు చేసుకున్నాను

విషాద శాకుంతలం కధలో కూడా అంతే . శకుంతల అందమైనది . ఆ అందం వెనుక ఒక పెద్దకుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఒక పెద్ద కొండలా నిలబడి ఉంటుంది . చదువుకున్నదే  కానీ ఆమె చదువుకు ఏఉద్యోగమూ రాలేదు. తప్పని సరి అయి ఆమె పడుపువృత్తిలోకి వెళుతుంది . కధానాయకుడు తరచూ ఆమె దగ్గరకు వెళుతూ ఉంటాడు . ఆమె మీద అతడికి అంతరంగం లో ఎక్కడో ఒక ప్రేమ భావం చిగురిస్తుంది . వాళ్ళిద్దరిమధ్యా వేశ్యా , విటుడు సంబంధాన్ని మించిన బంధం ఏదో  మొగ్గ తొడుగుతుంది

ఆమె తన చెల్లెలు పెళ్లికోసం డబ్బు దాచిపెడుతూ ఉంటుంది . ఒక్కక్క సారి ఒక్కపూట భోజనం చేస్తుంది . నాలుగువేల కూడపెట్టడం ఆమె లక్ష్యం . చివరకు ఆ లక్ష్యం  చేరుకుంటుంది . అతడొచ్చినప్పుడు ఆ సంగతి మరింత ఆనందంగా పంచుకుంటుంది . చెల్లెలి పెళ్లి రోజున పట్టు చీర కట్టుకోవాలని వున్నది , డబ్బు సరిపోతుందో లేదో , నాకొక పట్టు చీర తీసుకుని రావా ? అని అడుగుతుంది . అతడు సరే అంటాడు . ఒక వారం రోజుల గ్యాప్ తరువాత మూడువందల రూపాయలలో ఒక మంచి చీర తీసుకుని శకుంతల దగ్గరకు వెళ్తాడు . అతడు వెళ్లేసరికి ఇల్లు తాళం వేసి ఉంటుంది . ఎంక్వైరీ  చేస్తే ఆమె రెండు రోజుల ముందు నల్లుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాదని తెలుస్తుంది . అతడు ఒక్క క్షణం మౌనంగా ఉండి  వెళ్ళిపోతాడు . ఆ తరువాత కొన్ని రోజులకు అతడు మరొకసారి వైశ్యావాటికకి వెళ్ళినప్పుడు అతడికి ఒక కొత్త అమ్మాయి కనిపిస్తుంది . ఆ అమ్మాయి అచ్చు శకుంతల లానే ఉంటుంది . అతడు నిలదీస్తే ఆమె శకుంతల తన అక్క అని , తానూ కూడా తప్పని స్థితిలో అక్క మార్గం లోకి వచ్చాను అని అది తెలిసి అక్క తట్టుకోలేక అక్క ప్రాణం తీసుకున్నది అని చెప్తుంది . కథ  లో అసలు ట్విస్ట్ ఇది కాదు

ఆ తరువాత నాలుగురోజులు కధానాయకుడు పనిచేసే ఆఫిస్ బాస్ కూతురు పెళ్లి జరుగుతుంది . బాస్ కూతురుకి  అప్పటికే నాలుగు అబార్షన్లు జరుగుతాయి . ఆ పెళ్ళికి అతడి భార్య శకుంతల కోసం కొన్న మూడువందల రూపాయల చీర కట్టుకుని వెళుతుంది

వెంకట్రామయ్య తన కధలలో ఎక్కడా తీర్పులు చెప్పడు . వ్యాఖ్యానాలు చేయడు . కేవలం కథ  చెప్పి , ఒక చిన్న వాక్యం రాసి తప్పుకుంటాడు . ఆ ఒక్క వాక్యమూ  పాఠకుడిలో గొప్ప ఆలోచనకు దారి తీస్తుంది

ఒక మరణం  ఒక చావు లో కూడా అంతే . మరణం , చావు , దేహ యాత్ర చాలించడం , చచ్చిపోవడం ,కీర్తిశేషులు  ఇవన్నీ ఒకే భావాన్ని వెలువరించే పదాలు . శవం , పార్థివశరీరం  ఇవి కూడా అలంటి పదాలే . కానీ వీటిని అందరికీ ఒకేలాగా వాడము . మనిషి భౌతిక స్థాయిని బట్టి , సామాజిక స్థాయిని బట్టి పదాలను  అలవోకగా ప్రయోగిస్తూవుంటాము . ఒక మరణం , ఒక చావు కధలో  ఒక మంత్రిగారి బామ్మ  చనిపోతుంది . అదే సమయం లో బంగాళా దగ్గరలో వున్న ఒక కూలివాడి  భార్య చనిపోతుంది . మంత్రిగారి బామ్మది  మరణం . కూలివాడి భార్యది చావు . మంత్రిగారి బామ్మది  పార్థివ శరీరం . కూలివాడి  భార్యది శవం . మంత్రిగారిది దుఃఖం . కూలివాడిది ఏడుపు . మరునాడు మంత్రిగారి బామ్మ , కూలివాడి  భార్య ఒకేసారి స్మశానానికి చేరుకుంటారు . బామ్మ కేమో  చందన  శ్రీగంధాది  చెక్కలతో చితి పేరుస్తారు . కూలివాడేమో అక్కడక్కడా ఏరుకొచ్చిన కట్టెపుల్లల  తో చితి పేరుస్తాడు . ఇద్దరూ ఒకేసారి చితి వెలిగిస్తారు . మంత్రిగారి వెంటవచ్చిన వాళ్లంతా చితి పూర్తిగా అంటుకోకుండానే వెళ్ళిపోతూ ఇద్దరిని కాపలాగా ఉంచి వెళతారు . ఈలోగా ఆకాశం మేఘావృతం అవుతుంది . వాన  ఇప్పుడా ?ఇంకాసేపటికా అని భయపెడుతూ ఉంటుంది . కాపలా ఉంచిన వాళ్ళుకూడా వానకి భయపడి  పార్థివ శరీరం పూర్తిగా కాలకుండానే వెళ్ళిపోతారు . ఈలోగా సన్నటి చినుకులు మొదలు అవుతాయి . అటు పక్క కూలివాడు పేర్చిన చితిమీద వాన  చినుకులు పడి  ఆరిపోతుంది . కూలివాడు అటూ ఇటూ చూస్తాడు . ఎవరూ లేరు . సగం కాలిన భార్య శవాన్ని భుజాన వేసుకుని  మంత్రిగారి బామ్మ  చితి దగ్గరకు తీసుకుని వచ్చి భార్య శవాన్ని ఆ చితి మీదే ఉంచి మరికొన్ని కట్టెలు తీసి అగ్ని రగిలిస్తాడు

కొద్దీ రోజుల తరువాత మంత్రిగారి బామ్మ  గారి చితాభస్మాన్ని పుణ్య నదులలో కలపడానికి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో కూలివాడు కూడా ఆనందంగా పాల్గొంటాడు . ఏదిమరణం ? ఏది చావు  ?  పాఠకుడి మదిలో ఎన్నెనో ప్రశ్నలు

3

వెంకట్రామయ్య గారు ఇకలేరు అనగానే నా మనసులో కదలాడిన కథలు  పాత్రలు ఇవి . నేలవిడిచి సాము చేయని కథలు  ఆయనవి . ఆయన సినిమా రచన సిరియాయ్స్ గా తీసుకుంటే  మరిన్ని గొప్ప సినిమాలు వచ్చేవి . కథా  రచన ను సీరియస్ గా తీసుకుంటే మరిన్ని మంచి కధలు వచ్చేవి . రాసిన ప్రతి కథా  ఒక విషాద శాకుంతలమే

వెంకట్రామయ్య గారూ! ఆలస్యంగా పరిచయం అయ్యారు . అంతలోనే వెళ్లిపోయారు . ఐ మిస్ యు

*

వంశీ కృష్ణ

4 comments

Leave a Reply to Ramakrishna Salapaka Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ ఈ వ్యాసం( అనవచ్చా) చదివేక ఆయన
    ద్రోణంరాజు వేంకటరామయ్యగారని తెలిసింది .
    మన మీడియా కవరేజ్ ( నేనేమయినా మిస్ అయి ఉండవచ్చు ) కొన్ని విషయాలలో మనస్ఫూర్తిగా ఉండదు … ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వరు.
    మంచి వ్యసం. ధన్యవాదాలు .
    శుభాకాంక్షలు.
    రామకృష్ణ శలపాక

  • ఆలస్యంగా, మాకు వారిగురించి తెలిసింది.. మీవల్ల,, నివాళి వారికి!ధన్యవాదాలు సర్ మీకు,మంచి కథలు నుపరిచయం చేసినందుకు..!

  • మనసును హత్తుకునే కథలండి. ఎవరూ ఊహించని ముగింపులు కథకు.!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు