ఈ మధ్య ఒక వూరు వెల్లాను . ఆ వూరు నాకు పరిచయమైనదే. అక్కడ డైరీ ఫార్మ్ ఉంది. అందులో ఒక 50 గేదెలు 30 ఆవులు ఉన్నాయి.
అందులో పనిచేసే ఒకతనితో చాలాకాలంగా నాకు పరిచయం ఉంది. అతనికీ నాకు వయస్సులో 5 ఏళ్ల తేడా ఉంటుంది. నాకన్నా 5 ఏళ్ళు చిన్న. దళిత కులానికి చెందిన ఆతను చిన్నప్పటినుంచీ పశువుల కాపరి. ఇప్పుడు ఈ ఫారంలో పని చేస్తున్నాడు. అతను అప్పటి నుంచీ గేదెలతో, ఆవులతో మాట్లాడుతూ ఉండేవాడు. వాటిని మనుషులను పిలిచినట్లే పిలిచేవాడు.నేను అప్పడతన్ని కొంచెం వెటకారం చేసేవాణ్ణి. ఇప్పుడూ అదే చనువుతో ‘ఇప్పటికి నీకు మొత్తం వాటి భాష వచ్చి ఉండాలి కదా’ అన్నాను. అతను నా వెటకారాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వచ్చిందని చెప్పాడు.
అప్పుడే రెండు గేదెలు తిండికూడా మానేసి చాలా సీరియస్ గా తలలూపుతూ ఉన్నాయి. నేను హాస్యం మిళాయించి ‘అవి ఇప్పుడు ఏమిటి మాట్లాడుకుంటున్నాయ’ని అడిగాను. భాస్కర్ (అతని పేరు) కొంచెం నవ్వి ఈ ఊరి మట్టి సారం కదా? అవి కూడా మీటింగుల్లో మాట్లాడే విషయాలే మాట్లాడుకుంటున్నాయని చెప్పాడు. ‘ఏమిటవి’ అని కొంచెం ఆసక్తిని పెంచి అడిగాను. దేశంలోకి పాల ఉత్పత్తులను దిగుమతికి అనుమతులిచ్చారట కదా . దాని విషయమై మాట్లాడుకుంటున్నాయని చెప్పాడు. ఆ పాల ఉత్పత్తులు దేశంలోకి వస్తే ఏమిటి జరగబోతోందో ఆ గేదె చెప్తోంది. ఆ ఉత్పత్తులుగనుక వస్తే దేశంలో పాల ఉత్పత్తి దారులకు నష్టాలొస్తాయట. అవి చాలా చౌకగా దొరుకుతాయట. ప్రజలందరూ వాటిని కొనేస్తే మరి మనం ఇచ్చే ఉత్పత్తుల కొనరట. దానివలన మన యజమాని లాంటి వాళ్ళు నష్ట పోతారట. ఇక మన ఫార్ములు లాంటివి మూసేయాల్సి వస్తుందట . ఆ విధంగా దేశమే నాశనమైపోతుందిట . ఇదీ నేను మన యజమాని పేపర్ చదువుతూ ఉంటె విన్నానని చెప్తోంది. ‘అయితే రెండవ గేదె ఏమంటోంద’ని అడిగాను. అది అన్నింటికీ ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్ అంటుంది. దాని మాటలంటేనే నాకు చిర్రెత్తుకొస్తున్నది. ఇక్కడున్న గేదెలు, ఆవుల్లోకూడా అదంటే ఎక్కువమందికి పడదు. అడ్డుసుడి వాదనలు చేస్తే ఎవరికిష్టముంటుంది చెప్పు. అన్నాడు. ‘పరవాలేదు చెప్పు’ అన్నాను. భాస్కర్ చెప్పడం ప్రారంభించాడు.
అది ఏమి చెప్పినా వాల్ల అమ్మమ్మ కి అమ్మ దగ్గర నుంచి మొదలెడుతుంది. నీకిలాంటి కథలిష్టమే కాబట్టి చెప్తాను అని పార్రంభించాడు. వాళ్ళ అమ్మమ్మకి అమ్మ నుంచీ అది ఈ ఊర్లోనే ఉంటుంది. వీళ్ళ అమ్మకి చెప్పిన కథల నుంచి, వీళ్ళ అమ్మ చెప్పిన కథల దాక ఏదీ మరిచిపోదు. అందుకని మొదటి గేదె దగ్గరికెళ్దాం. మొదటి గేదె చూలుతో ఉండేది. ఆ చూలు తో ఉన్న గేదె ఒక ఆడబిడ్డను కంది. . దానికి మాస్టారి కొడుకు అనూరాధ అని పేరుపెట్టారు. . దాని మనుమరాలు ఇది. అని వివరించాడు. ఇక అది చెప్తున్న విషయం వినండి . అది నామీద కూడా ఎన్ని చతుర్లు చెప్తుందో చూడండి అని ప్రారంభించాడు.
” ఇక్కడ మనలను కాపలా కాస్తున్న ఆ ముసిలోడు ఉన్నాడు కదా? అతని పేరు భాస్కర్ . వాల్ళ అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. కూచుని తినడానికి ధనరాశులు లేవుకాబట్టి ఆడు మా అమ్మమ్మ వాళ్ల అమ్మని మేపుకి తీసుకు వెళ్ళేవాడు. ఈ ఊర్లో ఒక మాస్టారుండేవాడు. అతనింట్లో అది ఉండేది. మా అమ్మమ్మ పుట్టినపుడు దానికి అనూరాధ అని పేరుపెట్టి దాని కాలికి మువ్వలు తొడిగి సంబర పడ్డారు. మా అమ్మమ్మ తరువాత ఒక మగవాడు పుట్టాడు. వాడికి ఆ ఇంట్లొవాళ్ళు కొమ్మెర్ల అనిల్కుమార్ అని పేరుపెట్టారు. అదేదో ఊర్లో దళితులను చంపేస్తే దాని మీద పోరాడినందుకు అనిల్ని కూడా చంపేసారట. అందుకని వాడికి అనిల్ కుమార్ అని ఆ మాస్టారు కొడుకు పెట్టాడు. ఆ పేరు పెట్టినందుకు ఏమో వాడూ జబ్బుపడి చచ్చిపోయాడు. అప్ప్పుడు ఆ మాస్టరు గారి కొడుకు ఏడ్చుకుంటూ ఈ కొబ్బరి చెట్టుకిందే దాన్ని పాతి పెట్టాడట. దాని గుర్తుగా ఒక కొబ్బరిమొక్క నాటి దానికి అనిల్ అని పేరుపెట్టాడట. ఇదంతా చూసి మా అమ్మ మ్మ తన తమ్ముడు చనిపోవడం గురించి రోజూ కళ్ల నీరుపెట్టుకునేది. చనిపోయిన వాళ్ల పేరు పెట్టడం వల్లనే తన తమ్ముడు చనిపోయాడని మా అమ్మమ్మ ఎప్పుడూ నిష్ఠూరం చేసేది. ”
అనిల్ కుమార్ అని పేరు పెట్టిన తన అమ్మమ్మ తమ్ముడు చనిపోవడం గురించి ఈ గేదె విచారంకి లోనైంది.దానిని ఊరుకో పెట్టే ప్రయత్నం రెండో గేదె చేస్తోంది. ఆ మూడ్ నుంచి నుంచి బయటకు వచ్చిన కాసేపటికి అది మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది.
” ఆ రోజు ఆ దూడ చనిపోయినపుడు ఆ మాష్టారింట్లో అందరూ దుఃఖం లో మునిగి పోయారట. ఇంట్లో మనిషి పోయినట్లే బాధ పడ్డారట. మా అమ్మ రోజూ ఆ విషయం చెప్పేది. ఇప్పుడు ‘మన’ యజమాని చూడు. గత సంవత్సరం నీకు పుట్టిన మొగ దూడ ఏమైంది.? అంతకుముందు సంవత్సరం నాకు పుట్టిన మొగ దూడ ఏమైంది? అంతెందుకు ఇంత మందిలో ఒక్క మొగ దూడయినా మిగిలిందా? ఇంక మన జాతిలో మొగ దూడలు ఉండవన్నంతగా ఎలా మారిపోయింది.? మనకేదో తెలివి లేనట్లు మన పాలను కొంచెం అయినా వాటి కివ్వ కుండా వాల్ళను చంపేసింది ‘మన’ యజమాని కాదూ. అవి తాగే గుక్కెడు పాలు కూడా వాడి వ్యాపారానికి నష్టమని అమ్మేసుకుంటాడు చూడు. అడ దూడలకయితే కొంచెం ఆయనా పాలు ఇవ్వనిస్తాడు. వాటి ప్రాణాలను మిగులుస్తాడు అదేమైనా మనమీద ప్రేమనా ? మళ్ళీ దాని పాలు కూడా పిండుకోవచ్చనే దురాశ తప్పా వాటిని పోషించడంలో మానవత్వం ఉందంటావా? మన బిడ్దలను వాడు చంపుతుంటే మనం బిడ్డలకోసం ఏడుస్తుంటే వీటికేం బుర్ర ఉంటుందని కదూ చచ్చిన శవంలో గడ్డి కూరి ‘చేటపేయ్య’ను చేసి మన కళ్ళెదురుగా ఆ శవాన్ని పెట్టి మనం మన ప్రేమను కన్నీళ్ళుగా మార్చుకుని వాటిని నిమురుతుంటే మన పాలను కాజేస్తాడు కదా ‘మన’ యజమాని. తిరిగి వెటకారంగా వాటికేమి తెలుసురా? దాని బిడ్డ చచ్చిందో ? బతికిందో? అని మననే వెటకారం చేస్తాడు కదా ‘మన’ యజమాని. దాని బాధను చెప్తున్న భాస్కర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
వాటికి తిండి పెట్టె టైం అయింది అంటూ భాస్కర్ లేచాడు. అతనితో పాటు నేను కూడా వెళ్లాను. ఆ గేదె కొంచెం విషాదం నుంచి తేరుకున్నట్లు అనిపించింది. ఆ రెండు గేదెలు భాస్కర్ పెట్టిన తిండిని ముగించాయి. నెమరువేత లో పడ్డాయి. వాతావరణం తేలికయినట్లుగా ఆ రెండూ మళ్ళీ ముచ్చట్లు మొదలు పెట్టాయి. ‘ఈ ముచ్చట్ల సంగతఏమిట’ని అనడిగాను. ప్రస్తుత తిండి గురించి, వాళ్ల పూర్వీకుల తిండి గురించీ కబుర్లు మొదలు పెట్టిందని భాస్కర్ చెప్పాడు? ఈ తిండి గురించి ఏమంటున్నాయని ఆసక్తిగా అడిగాను. దాని కన్నింటిమీదా అసంతృప్తే. ఇంత చక్కగా మేపినా అదేం మాట్లాతుందో చూడండి. దాని మాటలు చెప్పడం ప్రారంభించాడు.
” ఈ ముసిలోడు ఇప్పుడిలా ఇక్కడే మనల్ని కట్టి, ఇక్కడే విప్పి , ఇక్కడే తిండి పెడుతున్నాడు కానీ మునుపటి రోజులలా ఉండేవి కావు. ఉదయం 9 కల్లా మన పూర్వీకులందరినీ ఇలాంటి ‘ముసిలోళ్లు’( ఇప్పడంటే ముసిలయిపోయేడు గానీ అప్పుడు పిల్లలే కదా) దూరంగా తీసుకుళ్లి మెరకల మీద వదిలేసే వారట. కనీసం మూడుగంటలపాటు ఊర్లో అందరూ కలిసి ఆ మెరకలమీదా తిరుగుతూ, దొరికింది మేస్తూ ఊర్లోని విషయాలనూ కలబోసుకునేవట ఆ మెరక మీదకి మూడూళ్ల మిత్రులు చేరేవి. . అవన్నీ స్నేహితులయిపోయి కొట్టుకునేవి. తిట్టుకునేవి. గ్రూప్ లుగా ఏర్పడేవి. వాటి స్వేచ్ఛను చూడతరమె గానీ వర్ణించలేమట. ఇప్పుడేమైంది. జైలు బతుకే గదా? ఆ తరువాత మనకే కేటాయించిన చెరువులుండేవిట. అందులో ఎంచక్క ఒక గంట పాటు ఈత కొట్టుకునే వాళ్ల ట. ఇప్పడు చూడు. ఆ నూతి లో నీళ్లతో పైప్ ల తో నీళ్లు కొట్టి స్నానం చేయిస్తారు.
సరేలే. ఇక తిండి సంగతికి వద్దాం. మా అమ్మమ్మ వాళ్ల అమ్మ మాష్టారింట్లో ఉండేది కదా? దానికి రాజ భోగం జరిగేది. దానికోసం మెత్తటి తౌడు ఉండాలని ఆ మాస్టారు అనేవాడట. పాపం ఆ గురువమ్మకి గేదెలు, అవి ఏమి తింటాయో తెలిసిన మనిషి కాదు. ఆ మాస్టారు దానికి ఏమి వండాలో , ఎలా వండాలో డైరెక్టన్ లు ఇచ్చేవాడు. చేసిన పనేమీ లేదుగాని ఈ డైరెక్షన్ల గోలోకటీ అని ఆమె విసుక్కునేదట . సరిగ్గా టైం అయ్యేసరికి మా అమ్మమ్మ ఆవిడ కాళ్లకి అడ్డం పడేది . దానికి ఒక గిన్నెలో అన్నం తవుడు కలిపి పెట్టేది. ఇంతలో ముసల్ది కేకవేసేది. ఈ హడావుడిలో దానికి కూడా తిండి పెట్టేది. ఉలవలు, తెలక పిండి పెట్టేది. ‘పుష్టి’ అని ఎదో కంపెనీ ఉండేదట. వాళ్ళు ప్రత్యేకంగా మనకోసం ఏదో తయారుచేసేవారట. దానిని కూడా పెట్టే వారట.ఇన్ని పెట్టినా ఆ ముసలి గేదెకి ( ముసలి అని అంటున్నాను గానీ అది అప్పటికీ చాల చిన్నదే ) ఒక ఆహరం మీద మనసుండేదట . అది పెడితేనే పాలు సరిగ్గా ఇచ్చేది. తృప్తిగా తలాడించేది. దాని తృప్తిపడిన ముఖాన్ని చూస్తేగానీ ఆ మాస్టారికి నిద్ర పట్టేదికాదు. అది తృప్తిగా లేకపోతె ఆ గురువమ్మ మీదా రురుస లాడేవాడు.
” ఇంతకీ ఆ ఆహారం ఏమిటీ “అని రెండవ గేదె అడిగింది.
ఈ గొప్ప విషయం తనకే తెలుసన్నట్లుగా అది ముఖం పెట్టి ఇలా చెప్పింది. ” ఆ రోజుల్లో ఆ మాస్టారి కొడుక్కి మాస్టరుద్యోగమే వచ్చింది. అతనికి అక్కడెక్కడో కొండల్లో ఉద్యోగం. సోమవారం ఉదయాన్నే బయల్దేరి వెళ్లి శనివారం రాత్రికి తిరిగి వచ్చేవాడు. వాడొచ్చినపుడు కొండల్లో పండే ‘గంటెలు’ తెచ్చేవాడు. వాటిని పిండి చేసి తౌడులో కలిపి ఈ మాస్టారు పెట్టేవాడు. అది పడగానే ఆ ముసిలి గేదె ఆనందంతో గెంతులేసేదట. దానికి అంత ఇష్టం. ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అని ఊరికే ఆన్నారా? అది పడిన ప్రతిరోజూ హుషారుగా ఉండేది. ఏదైనా ఒకమారు ఆ కొండల్లో మాస్టరు ‘గంటెలు’ మరిచిపోయి వచ్చాడా ఇక నింతే సంగతులు. పాలు తీయడానికొచ్చిన సిమ్హాచలంకి చుక్కలు చూపించేది. కొద్ధి పాలు మాత్రం ఇచ్చి తన్నేసేది. దానిని కొట్టడానికి సింహాచలం కర్ర తీస్తే మాస్టారుకి కోపం వచ్చి నీకు మీ అమ్మ తిండి పెట్టక పొతే పనిచేస్తావురా అనడిగేవాడు, కొట్టొద్దు. చాల్లే ఈ పాలు అని గసిరేవాడు. ఆ రోజు మేపుకెళ్లినపుడు మా అమ్మమ్మని దగ్గరికి తీసుకుని మొత్తం పాలు తాగిపించేదట. ఇదిచూసి ఈ ముసిలోడు ( వీడే ఆ ముసల్దాన్ని కాసేవాడు) మాస్టారితో పిర్యాదు చేసేవాడు.
‘ వాళ్లమ్మ పాలు అది తాగింది. నీ బాధేమిటని ‘ మాస్టారుగారి పెద్డబ్బాయి వెటకారం చేసేవాడు.
‘దానికి పెట్టాల్సిన తిండి పెట్టకపోతే దాని పాలు మనకెందుకిస్తుందని మాస్టారు తత్త్వం భోధించేవాడు.’
‘ఆ ఏముందిలే బడాయి. ఇప్పుడంతకన్నా ఎక్కువ తిండి పెడుతున్నారు. . కాళ్ళు పీకేలా అన్ని మెరకలు తిరగడమేమిటి? ఈత కొ ట్టడానికెళ్లి ఛస్తే ఎవరు దిక్కు? ‘ అని మరో గేదె అనగానే
“నీ మట్టి బుర్రకి చెబుతున్నాను చూడు అది నా తప్పు అని కోపం పడింది. తిరిగి కోపం నుంచి తేరుకుని మనకి పెట్టాల్సిన తిండి దొరక్క పోతేనో, లేదూ మనకేదో కాస్త నలతగా ఉండి పాలివ్వలేకపోతేనో , ఇవేవీ లేకపోయినా కూడా వాళ్ళు మనకొక ఇంజక్షన్ ఇస్తున్నారు తెలుసా అనడిగింది.
“నాకుకూడా రోజూ చేస్తున్నారు కదా అని చెప్పింది. . దాని గురించి ‘మన ‘ యజమాని పేపర్లో చదివింది నీకు వినపడలేదా అని గొంతు బిగ్గరగా చేసి అడిగింది.
అది కొంచెం ముఖం చిన్న బుచ్చుకుని ‘అలాంటిదేమీ నాముందు చదవలేదే’ అని దీనంగా చెప్పింది.
“అవును అలాటివి మన దగ్గర చదవరు. మనమే చదువుకోవాలి. నేనీ మధ్య వాళ్ల పేపర్ భాషను, అందులోకూడా మనకోసం వ్రాసే వాళ్ల రాతలను మన భాషలోకి అనువదించడం నేర్చుకున్నాను. ఈ మధ్య నాకెందుకో నొప్పి వచ్చి గిలాగిలాడిపోతున్నానంటే నువ్వు కూడా అన్నావు కదా? అదెందుకో తెలుసా? మన నుంచి పాలు పిండటానికి ఎదో రసాయనాన్ని మన ఒంటిలోకి ఆ సూది నుంచి ఎక్కిస్తున్నారట. మననుంచి ఎక్కువ పాలు అంటే చివరి చుక్క దాక గుంజుకోవచ్చట. దానివలన మనము పడే హింస ‘మన’ యజమానులకి అర్థం కాదనా? ఆ మందు మంచిది కాదని నిషేదించినా దొంగతనంగా తెచ్చి మనకెక్కిస్తున్నాడు ‘మన’ యజమాని. ఇదీ వీళ్ళ సంగతి. దానివలన మన ఆరోగ్యమే కాదు అవి తాగిన ప్రజల ఆరోగ్యంకూడా దుంపనాశనం అని తెలిసినా ‘మన’ యజమాని ఆపడు కదా? ఇదీ సంగతి. పాల వ్యాపారం కోసం మన జాతినే కాదు వాళ్ల జాతిని సహితం నాశనం చేయాలనీ చూసే ‘మన’ యజమానులు ఎవడైనా ఏదైనా నేరం చేస్తే పశువు అని తిడతారు ? మనమెప్పుడైనా అలాంటి నేరాలు చేయగలమా?” అని ప్రశ్నిస్తోందని భాస్కర్ ముగించాడు.
భాస్కర్ చెప్పగానే నిజం కదా! మాట్లాడితే ఎవడు నేరం చేసినా పశువా అని తిట్టడం నాకు కూడా ఒక అలవాటే కదా ననుకుని ఇంక జన్మలో ఒక తిట్టుగా ఉపయోగించకూడదనుకున్నాను . ఇంకా అవి మాట్లాడుతూనే ఉన్నాయి.
‘అవునా . అందుకేనా మనకింత నొప్పి కలుగుతోందని’ ఆ గేదె ప్రశ్నించగానే
“అవును . అందుకనే నిరంతరం చదువుతూ ఉండాలని చెప్పి చదువంటే దొరికినదంతా అని కాదు. మనకోసమని రాసేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మనమే జాగ్రత్తగా ఏరుకుని మనదైన చదువుని చదవాలని హితబోధ చేసిందట. తిండి ఎలాగయితో మంచిదికాకుండా కల్తీది తింటే కడుపునొప్పి లాంటి జబ్బులొస్తాయో సరైన చదువు చదవకపోతే కూడా జ బ్బులొస్తాయని కూడా చెప్పిందట.”
ఇలా చెప్తూనే అది మరో కథలోకి వెళ్ళింది. ” ఇదిగో ఈ ముసిలోడు భాస్కర్ ఉన్నాడు చూడు. ఆడు చిన్నప్పటి నుంచీ గొడ్లు కాసేవాడు కదా. ఒకసారి వాడు కాసే పోతు వాడి కళ్ళు కప్పి పారిపోయింది. అది ఎక్కడైనా పొలంలో పడి మేస్తే దరువులు కాయాల్సి ఉంటుందని వీడు దానిని పట్టుకోవడానికి రోడ్ ఎక్కాడు. అప్పుడే ఒక బస్ రోడ్ మీద వెళ్తోంది. పోతును వేగంగా చేరుకోవాలని మూలమలుపులో నెమ్మది గా వెళుతున్న బస్ ని అందుకుని వెనకనున్న నిచ్చెన ఎక్కాడు. వాడితో పాటు పశువులుకాసే వాళ్ళు వద్దని వారిస్తున్నా వీడు వినలేదు. కొంత దూరం వెళ్లేసరికి వాడికి పోతు కనిపించింది. పోతు కనిపించగానే ఆ ఆనందంలో వీడు నిచ్చెన మీదనుంచి గెంతీసాడు. దానితో రోడ్ మీద పడి బాగా దెబ్బలు తగిలాయి. ముందు పళ్ళు మూడు ఊడిపోయాయి. తీవ్రమైన జ్వరం వచ్చేసింది. ఆ మాస్టారు హాస్పిటల్కి పంపి వైద్యం చేశారు. వీడు కాసిన గేదె పాలు రోజూ ఎన్నోకొన్ని ఆ గురువమ్మ టీ కోసం ఇచ్చేది. ఆ రోజునుంచీ మరికొన్ని పాలు ఎక్కువ ఇచ్చేది . వీడికి తగ్గేవరకూ జాగ్రత్తగా చూసుకోమని వాళ్లమ్మకి చెప్పింది. ఇప్పుడు చూడు. ఇన్ని గేదెలకు ,ఆవులకు కాపలా కాస్తున్న వీడికి జ్వరం వచ్చి వొళ్ళు పేలిపోయి పడి ఉంటే కొంచెం పాలు టీ కోసం కూడా ఇవ్వని ‘మన’ యజమానిని చూసావు కదా. అంతే కాదు మా అమ్మమ్మ మరో విషయం చెప్పేది. ఆ రోజుల్లో కూడా అందరిళ్లలో మనం ఉండేవాళ్ళం కాదు. మనలని మేపడానికి మదుపు కావాలి కదా. కొంచెం డబ్బులున్న వాళ్ళ ఇళ్లల్లోనే మనము ఎప్పుడూ ఉంటాం. .అయితే ఆరోజుల్లో మనం లేని ఇళ్ల వాళ్ళు మనము ఉన్న ఇళ్లలోకి వచ్చేవాళ్లట. అప్పటి మన యజమానులు మన పాలను పెరుగుచేసి పెద్ద పెద్ద కవ్వాలతో మజ్జిగ చేసే వారు. వీళ్ళు తెచ్చిన చెంబులల్లోకి మజ్జిగలు పొసే వాళ్ళు.పెరుగు చిలికిన తరువాత ఆ వెన్నను నెయ్యి చేసే వాళ్ళు. నెయ్యి చేస్తున్నప్పుడు ఆ పాత్రలో తురకలుకట్టి కొంత పదార్థం ఉండిపోయేది. దానిని కరకం అనేవారు. ఇంట్లో పిల్లలు ఆ కరకాన్ని తినడం వలన కొంత పోషకత్వం లభించేది.ఆ కరకం కోసం పిల్లలు భలే దెబ్బలాడుకునేవారు. పెద్దలు దాన్ని పాత్రలో గోకి తలా కొంత ఇచ్చేవారు.నెయ్యితో పండుగలొచ్చినపుడు అరిసెలు చేసేవాళ్ళు. మా గురువమ్మ మా ముసిలిదానికి అరిసెలుకూడా పెట్టేదట.ఆతరువాత ఏమైందో. మా అమ్మమ్మ చెప్పింది.
పాల సేకరణ కేంద్రాలు వచ్చాయట. వాళ్ళు పాలకి డబ్బులిచ్చే వాళ్లు . అది మొదలు పాలకోసం లోన్లు ఇచ్చి గేదెలు కూడా ఇచ్చారు. వాటిని పోషించడమూ. పిలలలకు సహితం చుక్క పాలు మిగల్చకుండా ఆ కేంద్రాలకు పోయడం. డబ్బు తెచ్చు కోవడం ఇదీ వరస. పాలకి బదులుగా డబ్బు అనే సరుకు వచ్చింది. ఇక ఈ డబ్బు కోసమే పాల ఉత్పత్తి ప్రారంభమయింది. . దీనికోసం మేలుజాతి పశువులు అనే పదం ఉనికిలోకి వచ్చింది. సహజమైన పద్ధతుల్లో జరిగే మన ప్రత్యుత్పత్తి కూడా ఒక సరుకు అయిపొయింది.”
“మన దేశంలో మనం సంఖ్య రీత్యా ఎక్కువమందిమి ఉంటామట గానీ మనమిచ్చే పాలు తక్కువ ఉంటాయట. మనం ఎక్కువ లీటర్ల పాలు ఇవ్వలేమట. అందుకని కృత్రిమ పద్ధతుల్లో మనలను తయారు చేసి పాలు ఎక్కువిచ్చేలా తయారు చేశారు. అయితే ఈ పాలు ఇక్కడుంటాయా? ఉండవు. అన్నీ కూడా ఇక్కడనుంచి పాల శీతలకేంద్రాలకు పోయి అందులోనుంచి వెన్నను తీసివేసి పిప్పి పాలు అమ్ముతారు.ఆ ప్యాకెట్లుకొని టీ అమ్మే అంగళ్ల దగ్గరకు ఈ కాసులకు పాలు అమ్ముకున్న వాళ్ళు చేరతారు. తమ దొడ్డిలో ఉన్న గేదెల పాలు కూడా వీళ్ళు తాగరు. తాము తాగుతున్న టీ ఎక్కడి గేదె పాలో కూడా వీళ్లకు తెలీదు. మా అమ్మమ్మ చెప్పేది. పాల వాసన చూసి ఏ గేదె పాలో కూడా ఆ మాస్టారు చెప్పేవాడట. ఈరోజున ఆ మాస్టారు ఉంటే ఏమనేవాడో కదా ? గ్రామాలలో మనలను పెంచే వాళ్ళు మనం ఇస్తున్న పాలకే కాదు వాటినుంచి వచ్చే పెరుగు, మీగడ, వెన్న , నెయ్యి ఇలా అన్నింటికీ దూరమైపోయారు. దేశంలో అర్థ శాస్త్ర వేత్తలుంటారు. వాళ్ళు అన్నీ తలసరి అందుబాటు, తలసరి ఉత్పత్తి ఇలా లెక్కలు వేస్తారు. పలానా కాలంలో పాల ఉత్పత్తి తలసరి ఇంత ఉంటె ఈ రోజు ఈ విప్లవం వలన తలసరి ఉత్పత్తి పెరిగిపోయింది. తలసరి లభ్యత పెరిగిపోయింది అని ‘లెక్కల తాబేళ్ల’ మాదిరిగా లెక్కలు చెప్తారు.
‘తలసరి అంటే ఏమిట?’ని మరో గేదె ప్రశ్నించింది.
“అదా. మన ఫారంలో మనము 50 మందిమున్నాం కదా? ఈ ఫార్మ్ పక్కన ఒక రైతు దగ్గర 2 గేదెలు ఉన్నాయనుకో . వీళ్లిద్దరి దగ్గరా తలసరిన 26 గేదెలున్నాయని చెప్తారు.”
‘అదెలాగా? ఇక్కడ 50. అక్కడ రెండు ఉంటె ఇద్దరిదగ్గరా తలా 26 గేదెలున్నాయని చెప్పడం అదేమీ లెక్క’ అని ఆశ్చ్యర్యంగా అడిగింది.
“అందుకే సరైన చదువు చదవాలని చెప్పాను.
అలాగే దేశంలో రోజుకు 10 లీటర్ల పాలు వాడేవాడిని అసలు పాల ముఖమే చూడని ఇంటిని కలిపి సగటున ఈ దేశంలో ప్రతీ ఇంట్లో 5 లీటర్ల పాలు వాడుతునాన్రని లెక్కలు గడతారు. ఈ లెక్కన ఈ దేశంలో 375 గ్రాముల పాలు ప్రతి ఒక్కరూ తాగుతున్నారని లెక్కలు కట్టారు. మరో రెండేళ్లు పొతే అది 592 గ్రాములకి కూడా పోతుందట. 50 గేదెలను, 20 ఆవులనూ కాస్తున్న ఈ ముసిలోడు పాల చుక్క ముట్టి ఎన్ని సంవత్సరాలయిందో మనం చూస్తూనే ఉన్నాం కదా? అదీ ఈ పాల విప్లవం.
‘దేశం లోపల ఉత్పత్తి పెరిగిన మాట నిజమే గానీ పాల అందుబాటు సామాన్య ప్రజలకు పోయిందికదా? దీనికేమంటార’ని ఆ పాల విప్లవాన్ని కలగన్న మహానుభావుడిని ఒక మనిషి అడిగాడట.
“దానికతనేమన్నాడో తెలుసా” అడిగింది.
‘ఏమని ఉంటాడు. అందరికీ పాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తామ’ని ఉంటాడు అని ఆ మరో గేదె అంది.
” నీ ముఖం నీకదే అర్థమయింది.గ్రామీణ ప్రాంతాలనుంచి ఊడ్చివేయబడిన ప్రజలలో నేకమంది ఈ రోజున పట్నాలలో ఇల్లు కట్టే పనిలో ఉన్నారు. వాళ్లు 30 అంతస్థుల ఇల్లుకూడా కడతారట. ఇంకా పెద్దవే కడతారని కూడా అంటున్నారు. ఆ ఇల్లు కట్టిన కూలీలకు ఆ ఇల్లు వచ్చేస్తాయా? అలాగే గేదెలను మేపినంత మాత్రాన మేపిన వాళ్లకు పాలు వచ్చేస్తాయా ? అని ప్రశ్నించి తన తెలివికి తానే మురిసి పోయాడట. అదీ సంగతి. సరుకుని అహర్నిశలూ కష్టించి తయారు చేసి ఆ సరుకుని పరుల పాలు చేయడమే వర్తమాన ఆర్ధిక నీతి అని చెప్పింది.
ఇక మనమూ , మన సంతానం అనాదిగా ఎలా సేవ చేసామో తెలుసా అనడిగింది ఆ గేదె.
‘ఆ ఏవుందీ మనలాంటి జీవితాలే కదా మన బిడ్డలవీ? ఏమంత మార్పులు మన జీవితంలో ఏడ్చాయి గనక’ అంది నిరాసక్తంగా ఆ గేదె.
“లేదు లేదు చాల మార్పులు వచ్చాయి. మన జాతిలో మొగ బిడ్డల జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పింది. ఏమంత గొప్ప మార్పులు అని కొంచెం నీరసంగా ఆ గేదె అడిగింది. మన మగబిడ్డలను ఇక్కడి భాషలో ‘పోతు’ అంటారు. అదిగో అక్కడున్న ఆవుల బిడ్దలను ‘ఎద్దు’లంటారు. చెప్పొద్దూ మన మగబిడ్డల కన్నా వాటి మగబిడ్డలకి మంచి విలువ సమాజంలో ఉండేది.
ఎక్కువ డబ్బులున్నవాళ్ళు వాటి బిడ్డలను కొనుక్కుంటే వాళ్ళకన్నా కొంచెం తక్కువ డబ్బులున్న రైతులు మన మగబిడ్డలని కొనుక్కునేవాళ్ళు.ఈదేశంలో రైతుకన్నా ఎద్దుకే విలువ ఎక్కువని ఈదేశం గురించి తెలుసుకున్న విదేశాలలోని ఒక పెద్దమనిషి చెప్పాడట ఈ దేశంలో రైతు బక్కచిక్కిపోయి ఉన్నాగానీ ఎద్దు బలిష్టంగా ఉండేదని చెప్పాడట. కవుల ఆ బంధం మీద పద్యాలే వ్రాసారు. కవిత్వాలు చెప్పారు. మనకోసం ఒక పండుగను కూడా పెట్టారు. అలాగే మనం , ఈ మనుషులు అన్నదమ్ములమని కూడా నమ్మబలికారు. మనము కూడా వాళ్ల మాటలు నమ్మి ఆహా ! వీళ్లకు మన మీద ఎంత ప్రేమ అని మురిసిపోయాము. కానీ ఇప్పుడేమైంది. రైతు-ఎద్దు వేర్వేరుకాదనుకున్న దేశంలో రైతుకి ఎద్దుమీద ఎందుకు ప్రేమ పోయింది?ప్రజకు విశ్వాసం లేదని అర్థమా? వ్యవసాయంలోకి యంత్రం రాగానే మనవాళ్లకు నిరుద్యోగం వచ్చింది.అందునా ఆ వ్యవసాయపు పనులు కాలమంతా ఉండవు. మనవాల్ళకు కనీసం ఆరునెలలు విశ్రాంతి ఉంటుంది. ఎప్పుడయితో ఆ యంత్రం వచ్చిందో మనవాల్ళను ఊరికే ఆరునెలలు మేపాల్సిన అవసరం ఆ రైతులకు పోయింది.
‘మరి ఏమి చేశారు’ అని మరో గేదె అడిగింది.
ఇంతవరకూ ఈ సంభాషణకు దూరంగా ఉన్న ఆవులు కూడా కొంచెం ఇటువైపు మోరలు చాచాయి.
అప్పుడు ఆ గేదే ఇలా చెప్పింది.” నిన్నటి వరకూ మన మొక విప్లవం గురించి కలకన్న మనిషి గురించి అనుకున్నాం కదా. ఇప్పుడు మరో విప్లవం వచ్చింది. ఇక పనికి అవసరం లేని పశువులను మేపడం ఎందుకు. రోజల్లా దున్నితే జత ఎడ్లు పావు ఎకరం దున్నుతాయి. అదే ఆ ట్రాక్టర్ 75 నిమిషాలకి ఎకరా దున్నేస్తుంది. ఇక మనమెందుకు వాళ్ళకి. అందువలన కొత్త విప్లవం వచ్చింది. అదేమిటంటే మనల్నే మాంసం గా మార్చి తినేయడం. కొంచెం ఈ మధ్య మన భాషలోకి వాళ్ల ఆర్థిక శాస్త్రం అనువదించానుకదా. మనల్ని తినేస్తే అది ముడిపదార్థమన్నమాట . మన చేత పనిచేయిస్తే అది యంత్రంగా ఉండటమట.ఇక యంత్రంగా పనికి రాము కాబట్టి మనల్ను తినేయడం ప్రారంభించారు. దేశంలో మన మాంసం తినడం తక్కువే కాబట్టి విదేశాలకు మనలని ఖైమా కొట్టి అమ్మేస్తున్నారు. దానికి ‘గులాబీ విప్లవం’ అని పేరు పెట్టారు. దానిలో ఎక్కువ డబ్బులొస్తున్నాయి కాబట్టి ఈ ముసిలోడికి ఇంకా ఆ మాంసం కూడా ఖరీదు అయిపోతోందని అంటున్నారు”
ఇది ఇలా చెప్పఁగానే
ఒక ఆవు ‘మా మగపెయ్యలకి మారాజు భోగం ఉండేదని మా మామ్మ కూడా చెప్పేది. ఆఖరికి మహారాజు భోగం ఇలా ముగిసిందన్నమాట ?’ అని కళ్ళొత్తుకుంది.
‘ఇంత సోది చెప్పావు గానీ అసలు విషయంలోకి రావటం లేద’ని ఆ పేపర్ లో చదివిన విషయం గురించి మళ్ళీ ఎత్తింది ఆ గేదె.
‘అంటే అన్నానంటావ్ గానీ అర్వాలు గురించి అడిగితె పూర్వాల్ చెప్పడం నీకలవాటు. చదివి చదివి నీ మతి చెడిపోయింది. చక్కగా ఎందరెందరో ఎన్నో చదివి పేపర్లలో ఇస్తారు. అవి కూడా మనం చదవక్కరలేదు. ‘మన’ యజమాని చదివి వినిపిస్తాడు. అవి తెలుసుకుంటే చాలు. ఇలా బుర్ర పిచ్చి అయిపోనక్కరలేదు. ఇలా అంటూనే ఇంతకీ ఆ విషయం తేల్చేవ్ కాదు. అసలు విషయం తేల్చు. మన యిజమానులకు నష్టమా ? కదా? మన యజమానికి నష్టం వస్తే మన దేశానికి నష్టమా కాదా ?మన దేశానికి నష్టం వస్తే మనకు నష్టమా కదా? తేల్చు ఇప్పుడే?’ అని అడిగింది.
పై ప్రశ్నలను విన్న తరువాత భాస్కర్ ఇలా అన్నాడు “మంచిగా అడిగింది. ఊరికే ప్రేలాపనలే గానీ ఏదో ఈ షెడ్ లో పెట్టి ఏపూటకాపూట తిండి పెడుతుంటే దీనికి పోయేకాలమండీ ? నాక్కూడా బస్సులెక్కి పళ్ళు ఊడగొట్టుకోవాల్సిన బాధ లేకుండా ఇక్కడే ఇలాగ కూర్చుని గడుస్తోంది కదండీ? ఇతగాడు ఇంత ముద్ద పెడుతుంటే అతనికేదో నష్టం వస్తాదని ఆ గేదె చెప్తే చూడండి అలాగ చంపేస్తోంది. అందుకే దీనికి అడ్డుసుడి అని పేరు పెట్టాను”. ఇది చెప్తూనే ఆ మాస్టారు అని చెప్తోంది కదండీ . అతన్ని కూడా మా ఊర్లో వాళ్ళు అడ్డుసుడి మాస్టరు అనేవాళ్ళు. అయితే మరొకటుంది. అ మాస్టరుని మా వాడలో వాళ్ళు మాత్రం అలగనీవోల్లు కాదు.అలా అంటూనే తన జీవితంలోని జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు . ” మా నాన్న గుర్తే కదా నీకు. ఆడి పనేంటో నాకూ, మీకూ తెలీదు గానీ వినడమే కదా ? ఆ రోజుల్లో ఇలాపింటి ఫోన్లు లేవు కదండీ. ఊర్లో ఎవరింట్లో చావు వచ్చినా ఆ విషయాన్ని ఆఘమేఘాలమీదా వెళ్లిపోయి ముఖ్యమైన బంధువులకి చేరవేయడమే మా నాన్న పని.
ఇప్పుడంటే ఇన్ని బస్సులు గానీ అప్పుడు ఎక్కువగా నడకే. ఈ ఊర్లో చావు జరిగితే అది చెప్పడానికి మా నాన్న బయలుదేరేవాడు. మా నాన్న వెళ్ళగానే ఆయా ఊర్లలో ఉన్నోళ్లకి యమ దూత వచ్చినట్లు లెక్క. ఏ చావు కబురు తెస్తున్నాడా అని ఒకటే భయం. అప్పటికే జబ్బు పడి తీసుకుంటున్న ముసిలోళ్ళ పని అయిపోతే పెద్ద బాధుండదు గానీ కళ్ళ ముందు తిరగాల్సిన పిల్లలు చనిపోతే బాధ గదా. అలంటి వార్త చెప్పాల్సి వస్తే వాళ్ల బాధని ముందు మా నాన్న మీదకే అరుపుల రూపంలో వచ్చేవట. శుభకార్యం చెప్పడానికి మమ్మల్ని పంపరు కాబట్టి మేమే అశుభంలా కనపడేవాళ్లమట.ఈ మాట చెప్పేటప్పుడు మాత్రం మా నాన్న గొంతు వణికి పొయేది. చావు వార్త చెప్పాల్సిన బాధతోనో, లేకుంటే తిట్ల భారం తగ్గించుకోవడానికో మా నాన్న తాగేవాడు. ఈ ఫోన్లూ రావడంతో ఆ వృత్తి నాకు రాకుండా పోయింది. లేకపోతె నేనుకూడా చావు కబుర్లు చెప్పి చీవాట్లు తినేవాణ్ణేమో? ఎవరికి తెల్సు? ” ఇలా అంటూనే వాళ్ల నాన్న గురించి అసలు విషాదం చెప్పాడు. ” చావు కబుర్లు చెప్పేవాడికి చావు రాకుండా ఉంటాదా? నాకప్పుడు 15 ఏళ్ళు. మా నాన్న కూడా చనిపోయాడు. ఆడు చనిపోయేటప్పుడు ఊరంతా వరద ముంచేసింది మావాళ్ళ స్మశానం వేరు కదా. దానికోసం వెళ్లేదారి అంతా బురద అయిపొయింది. ఆడ్ని కడసారి తీసుకెళ్ళటానికి ఆ దారి పనికి రాలేదు. కానీ వేసవి కాలంలోనే చావు రమ్మంటే రాదు కదా? అందుకని ఊర్లోనుంచి వాడిని తీసుకెళ్ళాలనుకున్నాం. ఇంక చూడు. ఊరోళ్లంతా తయారై పోయారు. మీవోడి శవం మావీధిలోనుంచా అని దుడ్లు తీశారు. అదుగో అప్పుడు ఆ మాస్టారు వచ్చి మన చావు కబుర్లు చెప్పడానికి అయనమన వీధుల్లో తిరిగినప్పుడు లేని పిర్యాదు. విధిలేక వాడి చివరి ప్రయాణం మన వీధి నుంచి చేస్తే అడ్డుకోవడం ఏమి మానవత్వం అన్నాడు. ఇలా అడ్డుకుంటేనో వాళ్ల మీద దౌర్జన్యం చేస్తేనో పోలీసుల వరకూ వెల్లాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పుడంటే నాయుళ్లు అయిపోయేరు గానీ ఈ ఊర్లో బుగతల దగ్గరే భూమీ మొత్తం ఉన్నప్పుడు మీ తండ్రుల స్థితి కూడా ఇంత కన్నా గొప్పదేమీ కాదని గుర్తు చేసాడు. ఏకళ నున్నారో ఏటో గానీ ఇంకా పెద్ద గొడవలేమీ పెట్టకుండానే ఈ అడ్డుసుడి మాస్టారి వళ్ళ ఊరు అరాచకమయిపోతోందని గొణుక్కుంటూ వెళ్లారు. దానితో మా నాన్న చివరి ప్రయాణం పూర్తయింది. ” అని చేస్తూ భాస్కర్ విషాదంలో మునిగిపోయాడు.
భాస్కర్ విషాదాన్ని చూసి ఆ గేదెకి కూడా దుఃఖం వచ్చింది.
రెండో గేదె ‘ఎందుకు విచారంగా ఉన్నావ’ని అడిగితె భాస్కర్ చెప్పిన విషయం దాని చెవిలో వేసింది. అదికూడా బాధపడి, తన మొదటి ప్రశ్నలని మరో సారి గుర్తుకు తెచ్చింది. దానికి ఈ గేదె చెప్పడం ప్రారంభించింది. ” ఒకప్పటి సమాజంలో మన పాలు కేవలం మనపిల్లలకే ఉండేవట . ఇప్పటికీ అలాంటి సమాజం ఉనికిలో కొన్నిచోట్ల ఉందట. అయితే అలాంటి సమాజంని అనాగరిక సమాజమని అంటారు. వ్యవసాయంలోకి మనమొక యంత్ర శక్తిగా రానప్పుడు మనపాలు మన బిడ్డలకు ఆహారంగానూ మన మగబిడ్డలు వాళ్ళకు ఆహారంగానూ ఉండేవాళ్ళం. అయితే మన బిడ్డలను యంత్రంగా ఉపయోంచే సమాజం వచ్చిన తరువాత మన మగబిడ్డలు దేవుళ్లయ్యారు. మనబిడ్డల శక్తికి మించిన యంత్రం వచ్చాక మనం యంత్రంగా కూడా పనికిరాలేదని తెలుసుకున్నాం కదా. మళ్ళీ పురాతన సమాజం మాదిరిగా మన బిడ్డలు ఆహారంగా మారారు. తేడా ఏమిటంటే అప్పుడు స్థానిక ప్రజలే మనలను బోంచేస్తే ఇప్పుడు ప్రపంచమంతా మనం భోజనంగా వెళ్తున్నాం.
అలాగే మన పాలు, దానినుంచి వచ్చే అనేక పదార్థాలు కూడా . ఆ ఏమన్నావ్ ? ఇతర దేశాల పదార్థాలు వచ్చేస్తే మన యజమానికి నష్టమనా? మొత్తంగా మనమెన్ని పాలు అంటే ఈ ఫారంలో కాదు మనజాతి ఈ దేశంలో ఎన్ని పాలుఇస్తుందో నీకు తెలుసా” అని అడుగుతూ లెక్కల తాబేల్లా లెక్కలు ప్రారంభించిందట. “పాల ఉత్పత్తి విషయంలో మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల పరిశ్రమను కలిగి ఉంది; గత సంవత్సరం 146.31 మిలియన్ టన్నుల పాలను ఇచ్చాము. ఇది అమెరికా కంటే 50% ఎక్కువ. చైనా కంటే మూడు రెట్లు ఎక్కువ పాలను మనమే ఇస్తున్నాం. ఈదేశంలోనే మన పాలను, మన పాల ఉత్పత్తులను మన యజమానులు అమ్ముతున్నారనుకుంటున్నావా? 2700 కోట్ల రూపాయల విలువైన మన ఉత్పత్తులను విదేశాలకు సహితం గత సంవత్సరం అమ్మారు. టర్కీ , బాంగ్లాదేశ్,ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,భూటాన్ లకి మన ఉత్పత్తులను ఎక్కువగా అమ్ముతున్నారు . ‘ఒక సరుకుని ఎగుమతి చేయడం అంటే ఆ దేశంలో ఆ సరుకు ని అక్కడి ప్రజలకి అందకుండా చేయడమేన’ని నేనింతకుముందు చెప్పిన పెద్దమనిషే చెప్పాడు. కాబట్టి ఇంతవరకూ నా సోది ప్రకారం నీకేమర్థమయిందో నాకు తెలీదు గానీ సూక్ష్మగా చెప్పాలంటే సరుకుగా మారిన ఆతర్వాత భూగోళం మీద ఎక్కడైనా అమ్ముకుంటారు. ‘మన’ యాజమానులూ ఆపని చేస్తారు. ఇతరదేశాలలోని వాళ్ళ యజమానులూ ఆ పనే చేస్తారు. ఎవరు తక్కువకి అమ్మితే వాళ్ళు నిలబడతారు. లేని వాళ్ళు పోతారు. మన పాల కోసం మనకి తిండి పెడతారు. ఆలా పెట్టడమే అనవసరం అనుకుంటే మనల్ని కోసుకుని తింటారు. ఒకేవేళ నిజంగానే ఇతర దేశాల పాలు వచ్చేసి ఈ దేశాన్ని ముంచెత్తేసి పాలు చవక అయిపోతే ఒక వేళ ఈ భాస్కర్ కూడా పాలు తాగగలడేమో చూద్దాం. ఒక వస్తువు సరుకు అయిన తరువాత ఆ సరుకుల యజమానులు సరుకుల అమ్మక యుద్ధంలో మునిగి తేలతారు. ఆ యుద్ధం గురించి మనకు చీకూ చింతా ఏల ? ” ఆని చిద్విలాసంగా చెప్పి మేత మేయడం ప్రారంభించింది.
“చూసావా? మొదట్లోనే దీనిని అడ్డుసుడి అని ఎందుకన్నానో నీకు తెలిసిందా? అడ్డుసుడా? కాదు ఆడ్డుసుడికి తొలిచూలు లాంటిది ఆ మాస్టరు చెప్పిన అడ్డుసుడి తనమంతా దీనికొచ్చేసింది. దీని అమ్మమ్మ వాళ్ల అమ్మకి రావాల్సిన ఈ అడ్డుసుడితనమంతా నాల్గో తరంలోపుట్టిన దీనికొచ్చింది..అంతా నా ప్రారబ్దం. రోజూ దీని నస వినలేక చస్తన్నాను. అనవసరంగా ఈ గేదెల భాష నేర్చుకున్నాననుకో”. అని చెప్పాడు. నాకు కూడా బస్సు టైం అయిపోయి తిరిగి వచ్చేసాను.
ఊరంతా ఒకటంటే – తాను ఇంకొకటి అనేవాడిని ఉత్తరాంధ్రలో “అడ్డసుడి” గాడంటారు.
An excellent story as told by buffellows about the so called free trade. Very well narrated story.
“ఆ ఉత్పత్తులుగనుక వస్తే దేశంలో పాల ఉత్పత్తి దారులకు నష్టాలొస్తాయట. అవి చాలా చౌకగా దొరుకుతాయట. ప్రజలందరూ వాటిని కొనేస్తే మరి మనం ఇచ్చే ఉత్పత్తుల కొనరట”
అని మాత్రమే అనరు.
ఒక్కసారి “దేశీయ” పరిశ్రమలు ఆ పోటీలో మూతపడ్డాక వాళ్ళు ధరలు పెంచేస్తారు. మోనోపోలీ అవుతుంది అంటారు. ఇంకా ఇక్కడ నుంచీ వచ్చిన లాభాలను వేరే దేశాలకు తరలిస్తారు. మన వాళ్లయితే ఇక్కడే మళ్లీ పెట్టుబడి పెడతారు. అలా మన వాళ్ల వల్ల మాత్రమే మరిన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటారు.
ఈ వాదనకి అడ్డుసుడి గేదె ఏం సమాధానం చెప్తుంది ?
“కనీసం మూడుగంటలపాటు ఊర్లో అందరూ కలిసి ఆ మెరకలమీదా తిరుగుతూ, దొరికింది మేస్తూ ఊర్లోని విషయాలనూ కలబోసుకునేవట”
బంజర్లలో మేత గురించి అడ్డుసుడి గేదెకి రొమాంటిక్ ఉహలున్నట్టు అర్ధమవుతోంది. అసలు మనుషులు గేదెల్ని బంధించని కాలమొకటుందని అదింకా నయమనీ అడ్డుసుడి గేదె అమ్మమ్మ కి ముందు మూడొందల తరాల అవతల అనుకున్న కథలు చేరినట్టు లేవు.
” పాల విప్లవాన్ని కలగన్న మహానుభావుడిని”
నాకూ ఒక కల ఉంది అన్న పుస్తకం రాసిన కురియన్ గురించేనా ? అందాకా కేవలం వ్యవసాయ ఉత్పత్తి మీద ఆధారపడిన అనేక కుటుంబాలకు పాల ద్వారా “రెండో ఆదాయ మార్గాన్ని ” చూపించటం మంచిది కాదా? నామిని కథ “పాల పొదుగు ” అదే కదా?
కథ ఇంకొంచెం తేలిగ్గా ఉండొచ్చేమో అనిపించింది.
ఇది కథో కాదో చెప్పే expertise నాకు లేదు.
రాజకీయ విషయాలను సెటైర్ గా చెప్పడం బాగుంది.
సరుకు గా మారిన ‘పశువు‘ స్థానంలో ‘మనిషిని’ ఉంచితే అదొక భయానక భీభత్స దృశ్యమే. అవసరాన్ని బట్టి అది ‘యంత్రమా‘ లేక ‘ఆహారమా‘ అనేది నిర్ణయించబడుతుంది.
పశువులను, మనుషులను సంత(మార్కెట్) లో అమ్మవచ్చు లేదా కొనుక్కోవచ్చు కదా? మనిషిని, పశువుని export/import చెయ్యొచ్చు కదా. మనిషిని అలంకరించినట్లు పశువుని కూడా అలంకరిస్తారు కదా. మనిషి పశువు కలిసి పని చేయడమేకాదు, ఆడుకుంటారు కూడా కదా. మనిషికి, పశువుకి దాణా (ఆహారం) అవసరాన్ని బట్టి ఉంటుంది. అది పోటీ, అవసరం మీద ఆధార పడుతుంది.
మనిషి కూడా సరుకేగా కదా. వలస కార్మికులకు, పశువులకు తేడా చెదిరిపోయిన వర్తమానంలో ‘కథ’ కు ‘వాస్తవ జీవితానికి‘ మధ్య గీత చెరిగి పోయింది అనుకుంటాను.
సురేష్ గారు ఉదహరించిన ‘పాల పొదుగు’ కథ నేను చదవలేదు. ‘రెండో ఆదాయం’ అనే టైటిల్ తో మీరొక పెద్ద కథ రాయొచ్చేమో కదా?
సమాచారం సందేశం రెండూ వున్న కథ. బాగుంది.