చైతన్యం రేపిన ఆ చిరునవ్వు
సాయం పట్టి నడిపిన ఆ చేయి
పోరాటం పక్కనే నడిచిన ఆ కాళ్ళు
ఎప్పుడూ..జ్ఞానం తొణికిసలాడుతూ
ఉద్వేగాలలో మునకలేస్తూ
ధైర్యాన్ని అలంకరించుకుని
సున్నితాన్ని సుగంధం లా రాసుకున్న
ఆ సౌందర్యం
దగ్గరికొస్తే మానవతా పరిమళాలు గుబాళించేవి
స్పూర్తి బాణాలను
వనితల పైకి వొడుపుగా విసిరేది
ఆశ్రితులను..అణగారిన తనాలను
విజ్ఞానపు తివాచీ పై నడిపించేది
అంత పరిణితి వెనకున్న ఆ పసిపాప
బంధనాల మాయా జలతారుల్లో ఎలాగో
చిక్కుబడిపోయింది
సందడి మాటున ఎలాగో నిర్లిప్తత పోగుపడింది
నెమ్మది పంచలో పడుకోక ఎన్నాళ్ళో అయింది
అలసిపోయిందేమో..
కొంచెం అనురాగం..పిడికెడు ప్రేమ
కాస్త బరోసా..వెచ్చని ఒడి..మన్నించే మమత
కోసం చేయిచాచింది
ఎందుకనో
పావులు కదుపుతున్న వైనాన్ని..మాటల వలలు
విసిరే ఒడుపును కనిపెట్టలేకపోయింది
ఎగుడు దిగుడు సమాజం లో
ఎక్కడో..ఆ స్వేచ్ఛ అడుగు తడబడింది
ఎలా జరిగిందో..
పితృస్వామ్య లోగిలిలో పురుషాహాంకార వాడికి
గాయపడి విలవిలలాడింది
జీవన ప్రయాణం లో..తోడు కోసం అన్వేషణలో..
అడుగడుగునా ఆవేదనే.. బహుమతి గా
పొందిందేమో..బాధ కు ‘కామా’ లనే పెట్టిందేమో
ఎవరో ఒకరం
తోడున్నామని ఎరుక పరచాల్సింది
ఆ జతలో కాస్త దూరం నడవాల్సింది
బాధల బరువు భుజం మార్చుకోమని
కాస్త చెప్పాల్సింది
కాస్సేపలా మనసును నెమ్మది నీడన
కూచోబెట్టాల్సింది
కాసింత ఓదార్పు దాహం తీర్చాల్సింది
కానీ ఎందుకిలా జరిగిందో..?
వేగిరబడడం లో ఆలస్యం అయింది..
మనుస్మృతి చాటున
మగాధిపత్యం..ఆడిన ఆటలో గెలుపు
ఏకపక్షమైంది
అసహాయతా తీగను స్వేచ్ఛ గొంతుకు
బిగించబడింది
ఎటు బోవాలో తెలియక
ఎక్కడ దాక్కోవాలో తెలియక
మరణం మడుగులో తనను దాచుకుంది…!
(స్వేచ్ఛ స్మృతి లో)
ఆద్యంతం స్వేచ్ఛ కళ్ళ ముందు మెదిలింది