ఆరోజు సాయంత్రం ఇలాగే రోడ్డు మీద తిరుగుతూ ఉంటే కనిపించిన ఒక ఇంటికి కట్టిన చిన్న చిన్న దీపావళి లైట్లను చూసి ఆగిపోతాను. మొన్న దీపావళి పండుగరోజు బజార్‌కి పోయి నేను, అన్న కలిసి ఒక లైట్ సెట్ కొన్నాం. ఐదు వందలది, రెండొందలది ఉన్నాయి. ఐదొందలు జేబులో లేవని రెండొందలది కొన్నాం.
అది ఇంటి ముందు చిన్న చిన్న వెలుగులు ఇస్తే సంబరపడ్డాడు ఆయన. “ఈ లైట్లు ఉంటేనే పండగరా!” అన్నాడు. కాకపోతే ఐదొందలది కొనలేదన్న బాధ ఎందుకో చూపించాడు. దీపావళి అయిపోయింది. తిరిగి హైదరాబాద్ వచ్చేశా. రోజులు గడుస్తున్నాయి.
అప్పుడు ఆ ఎవరిదో ఇంటికి కట్టిన లైట్లను చూసి అది నువ్వనుకుంటాను. నాకేం నిన్ను నాతోనే ఉంచుకోవాలని ఉండదని చెప్పను. నువ్వు మొత్తంగా నా దానివే అని నేనే అనుకుంటాను. నువ్వు ఒప్పుకోకున్నా, నాకది అనిపించిన విషయమైనా చెప్పుకోబుద్ధి కాదు. నా కథొస్తే అది నీకు మాత్రమే చెప్పుకున్నా చాలనిపిస్తుంది. ఆ కథ చదివి వందమంది దాకా ఫోన్ చేశారనీ నీకే చెప్పుకోవాలని ఉంటుంది.
ఇవన్నీ నిన్నెదురుగా కూర్చోబెట్టుకొని ఒక్కొక్కటిగా నీకు చెప్పాలనుకుంటా.
ఫ్రెండ్స్‌తో శ్రీశైలం వెళ్తున్న రోజు రాత్రి మెహదీపట్నం దగ్గర ఆగి ఒక రెస్టారెంట్‌లో తిన్నప్పుడు ఆ ప్లేస్‌కి నిన్ను తీసుకెళ్లాలనిపించింది. ఎయిర్‌పోర్ట్ దార్లో వెళ్లినప్పుడు, ఈ ప్రాంతానికి ఇంతవరకూ రాలేదెందుకని నిన్ను తల్చుకుంటా. ఆ రాత్రి ఆకాశం చంద్రుడి వెలుగులో చల్లగా నక్షత్రాలు పరుచుకుంటూ వెళ్లిందని ఒక వంద కిలోమీటర్లు నీకే చెప్పాలనుకుంటా.
చీకటి అయిపోతుందని, మా ముగ్గురిలో ఒకతని సొంత ఊర్లో ఆగి ఆ రాత్రికి అక్కడే పడుకొని, తెల్లారకముందే తిరిగెళ్లేటప్పుడు, “మా అమ్మ చూడనేలేదు నన్ను” అని అతనంటుంటే ఆ ఒక్కటే విషయాన్ని నీకింకో కథ చెప్పాలనుకుంటా.
అంత పొద్దున్నే శ్రీశైలం వెళ్లే దార్లోని అడవంతటినీ ఈ దారంతా అర్థం చేసుకుంటూ ఉంటాను. అది మన ప్రేమ అనిపిస్తుంది. నేను ఆ ప్రేమ లోతుల్లోకి వెతుక్కుంటూ పోయి ఒక దగ్గర నీ నవ్వుని, ఒక దగ్గర నిన్ను, ఒక దగ్గర నీ దేహాన్ని వెతికి పట్టుకుంటాననిపిస్తుంది. ఇంత అడవిలో నిన్నలా వెతికి పట్టుకున్నాక నాకింక తిరిగి రావాలనిపించదు.
కొండల మధ్యలోంచి సూర్యుడు రావడం, అలాంటివి కొండల మధ్యలోంచే వెళ్లిపోవడం నువ్వు, నేను ఆడుకున్నట్టు అనిపిస్తుంది.
నీకు ఫొటో తీసి పంపిన రోడ్డు చుట్టుపక్కల ఒకరోజు, ఆ లోపల ఇంకో రోజు, అడవంతా ఒక్కో రోజును వెతుక్కుంటూ బతికేయాలి మనం.
కోతులను చూసి, “వాటికి పాపం అని మనం ఫుడ్ ఇస్తం కానీ, ఇవ్వకూడదు” అని నేనంటే, “ఈ అడవిలో అవి ఏం వెతుక్కుంటయో” అన్నాడు ఫ్రెండ్. “మనం సార్వీ రెస్టారెంట్ వెతుక్కున్నట్టు అవీ వెతుక్కుంటయ్” అని నేనంటే గట్టిగా నవ్వాడతను.
అడవంత జీవితంలో నేను నిన్ను వెతుక్కున్నానని నాకనిపిస్తుంది. ఇదే అడవంత జీవితంలో ఈ కోతికి కొబ్బరి చిప్పలు వెయ్యకూడదని, అడవంతా ఉన్న పోస్టర్లు నేను నిన్ను వెతుక్కున్నానని చెప్పడానికే అనిపిస్తుంది. వచ్చే దార్లో.. ఏ కల్వకుర్తి దగ్గరో ఇంకో దగ్గరో.. ఎండపూట ఒకతను ఎర్రమట్టి మీద నిండుగా పరుచుకున్న చెట్టు నీడలో పడుకోవడం నీకే చూపించాలనుకుంటాను. అతనితో మనిద్దరికీ ఏమాత్రం సంబంధం లేకున్నా నువ్వు గుర్తొస్తావు.
“చూడు గడ్డం లేకుండా నువ్వెలా ఉన్నావో..” అని నువ్వంటే,
“నీకు గుచ్చుకోకుండా..” అని చెప్పాలనుకుంటా.
ఇదే అడవిలో, లేదా ఇదే దారిలో ఆగిపోయి, దిగిపోయి అక్కడ నిలబడి కొన్ని సంవత్సరాలు నీకోసం ఎదురుచూడాలనుకుంటా.
నన్ను నువ్వే మర్చిపోయాక, ఎందుకెళ్తున్నావో తెలియకుండా, ఈ దార్లో వెళ్తూ నన్ను చూసి ఆగిపోవాలి.
“ఆకలేస్తోంది. తినడానికి దగ్గర్లో ఏమున్నాయి?”అని అడగాలి నువ్వు. రాంచీ, సార్వీ, సెంట్రల్ పిజ్జాహట్, సాయిదర్శిని.. నేను ఒక్కొక్క పేరు చెప్పాక,
“పిచ్చోడా! నువ్వు అలిగి దిగిపోయి గంటే అయ్యింది” అని చెప్పు. తర్వాత ఒక గంటకు అదే అడవిని నీకు పరిచయం చేస్తా.
బేబీ, ఎప్పుడు పోదాం!
*
Add comment