అటు రోణంకి వారు …ఇటు ఢిల్లీ శర్మ గారు!

రోడ్డు మీద నుంచి మన పనిమీద మనం వెళ్తూ ఉంటాం. అటూ ఇటూ మనలాగే ఎవరి పనిమీద వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు.

మనం ఎవరినీ పట్టించుకోం. మన ధ్యాసలో మనం ఉంటాం. ఎవరినీ సరిగ్గా చూడం.

కొంత మంది వ్యక్తులు వాళ్ళరూపురేఖల, వేషభాషల, వ్యక్తిత్వంతో మన దృష్టిని వాళ్ళవేపు తిప్పక తప్పదన్నట్టు మన ఎదురుగానో, మన పక్క గానో నడుస్తూ వస్తారు. నిలబడిపోతాం. నమస్కారం అంటాం. పలకరింపు మాటలతో రోడ్డు వార నిల్చుని వాళ్ళు మనతో మాట్లాడతారు. వీళ్ళు విలక్షణ వ్యక్తులు! సామాన్యులుగా, సామాన్యులతో కలిసిపోతూ, అసామాన్యంగా జీవించి తమదైన ఏదో ఒక వరవడిని మనముందు ఉంచి వెళ్లిపోతారు. వాళ్లు పెట్టిన వరవడిని అందుకున్న వాళ్లు అందుకుంటారు, లేని వాళ్లులేదు!!

మొన్నమొన్నటివరకూ ఇలాంటి విలక్షణ వ్యక్తులూ, వారికి నమస్కరిస్తూ, రోడ్డువార నిలబడే వాళ్ళూ ఉండే వారు . ఇప్పుడు నడక మానేసాం. సైకిళ్లూ పోయి , బైకుల ,కార్ల యుగంలో బతుకుతున్నాం. అలాంటి  వ్యక్తులు కనబడ్డమూ తగ్గిపోతోంది.

విజయనగరం లో  అలాంటి వ్యక్తుల్లో ఒకరు తెల్లటి గుండ్ర మొహంతో , నెత్తిని దొర టోపీతో ,  చేత్తో  ఓ పుస్తకం పట్టుకొని  ఎదురు పడేవారు .

దొర టోపీతో అలా కనిపించే ఈయన రెండో వారు.  మొదటి వారు ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు. రెండో వారిని పూర్తి పేరుతో ఎప్పుడూ చేప్పేవారు కాదు. ఢిల్లీ శర్మ అనే పేరు ఖాయం చేసి మాట్లాడేవారు.

ఆయన నాకు  ఢిల్లీ శర్మగారిగానే తెలుసు.  70ల్లో   మధ్య మధ్య   సెలవులకి ఒడిశా నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఈయనని చూడ్డం, రెండు ముక్కలు మాట్లాడ్డం జరుగుతూ ఉండేది.  అదీ ఆయన మా ఇంటికి వచ్సినప్పుడు మాత్రమే . అయితే వారి పెద్దబ్బాయి  శ్యాం మా ఇంటికి  తరచు కుర్రాడిగా  వచ్ఛేవాడు. ఢిల్లీ శర్మగారి అబ్బాయిగా !! మా శంకర్ కన్నా కాస్త చిన్నవాడు. అందుకే శంకిరిగాడు  అంటున్నట్టు గానే శ్యాం గాడు  వచ్చేడర్రా  అంటూ ఇంట్లో చెప్పుకొనే  వాళ్లం.

ఇప్పటికీ  మాలో మేం మాట్లాడుకునేటప్పుడు శ్యాంగాడు అనే – అలవాటుకి  చెప్పు కుంటూ ఉంటాం .

ఆ    ఢిల్లీ శర్మగారి పేరు  చిర్రావూరి సర్వేశ్వర  శర్మ అని తర్వాతెప్పుడో నాకు తెలిసింది

వీరింట్లోనూ మా ఇంట్లోలాగానే   చదవవలసిన పుస్తకాల లైబ్రరీ ఉందనీ, శర్మగారు  రోణంకి వారి లాగా కొత్త పుస్తకం వచ్చిందని తెలిసీతెలియగానే  ఉరుకులు పరుగుల మీద విశాఖపట్నం వెళ్ళి కొనుక్కువఛ్చి  చదివేదాకా నిద్రపోయేవారు  కాదనీ తెలిసింది.  చాసో అయితే తన పుస్తకాలనీ లైబ్రరీని చదివేసిన తర్వాత పట్టించుకునేవాడు కాదు. కొత్తపుస్తకాలు రావడం చదవడం అంతే! అందుకే తన పుస్తకాలు పరహస్తగతాలు  అయ్యాయి. తన కథలనే సరిగా దాచుకోలేదు!

శర్మ గారికీ, రోణంకి వారికి కూడా ఈ పుస్తక సేకరణ లో  వ్యత్యాసం  ఉంది.  రోణంకి  కేవలం తాను నేర్చిన బాషల్లోని  సాహిత్యాన్ని భద్రపరచుకునేవారు. శర్మ గారు  అన్ని కళల గొప్ప పుస్తకాలను, పత్రికలతో పాటు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎప్పటికప్పుడు తాజాగా కొనుక్కుని  పదిలపరచుకునేవారు! ఇద్దరూ అధ్యయనప్రియులు. చర్చలు, విశ్లేషణలు, చదివిన కావ్యాన్నే తిరిగితిరిగి  పాడుకుంటూ  ఆనందానుభూతితో  పరవశులవడాలు ఈ ఇద్దరి సామాన్య లక్షణాలు !

పుస్తకపరిజ్ఞానం కన్నా ఎక్కువకెక్కువ శ్రుత జ్ఞానాన్ని   శ్యాం తన చిన్నతనంలో  ఆర్జించాడని నొక్కి చెప్పొచ్చు . ఆ తర్వాత తర్వాత పుస్తక పఠన జ్ఞానంతో  పాటు డాక్టర్ గా ఆర్జించిన  జ్ఞానం తోడు అయింది. తనకున్న అద్భుతమైన జ్ఞాపకశక్తీ , తెలివితేటలతో పాటూ  తర్కంతో, ఒక  విషయాన్ని మరొకవిషయాన్ని  జతచేసి, పరికించి నిగ్గు తేల్చుకుని సారాంశాన్ని ఒంట పట్టించుకోవడం , మనుష్యుల ప్రవర్తనల, స్వభావాల పరిశీలన అన్నిటికి అన్నీ శర్మ గారి జ్ఞానగరిమ నుండి అబ్బినవే !!

కామాలూ, ఫుల్ స్టాపులు లేకుండా ఒకే ధారగా ఆపకుండా, గడగడా మాట్లాడుతాడు శ్యాం!! చాలా క్లుప్తంగా మాట్లాడే వ్యక్తిగానే  శర్మగారిని నాకు తెలుసు. తన మిత్రుల దగ్గర ఆయనా అలా మాట్లాడే వారేమో

నాకైతే తెలియదు!!

ఒక్క  శ్యాం తప్ప వారి మిగతా సంతానంతోనూ, వారి భార్యతోనూ  నాకు దగ్గరి పరిచయం  లేదు.

ఆయన సునాబేడాలో వున్న రోజుల్లో మా ఇంటికి వచ్చినప్పుడు  తన కవిత్వ రచనానుభవాన్ని నాతో పంచుకున్నారు .

ఒడియా నాకు తెలుసు కాబట్టి నాకు చెప్పాలని ఆయనకి అనిపించి ఉంటుంది !

“గమ్మత్తుగా ఒడియాలో కవితాపంక్తులు వాటంతటవే నా నోట వచ్చాయి”   అంటూ మొదలుపెట్టి –

తిన్తి జిబి తిన్తి జిబి

కిమ్తి  జిబి  కిమ్తి  జిబి  ?

మూ  కిమ్తి  జిబి  ?

పాటలా పాడారు! లయకి అనుగుణంగా ఆ భావం మొహంనిండా నిండుకొని వచ్చింది !!

వాన పడ్తోన్దిట! ఆయన ఆవేఫు నుండి ఈ వేపుకి వెళ్లాలిట! గొడుగు లేదు. వెళ్లక తప్పదు. దాంతో  ఈ పాట నోట వచ్చిందన్నారు!

తడిసిపోతా      తడిసిపోతా !

ఎలా వెళ్ళను ?   ఎలా వెళ్ళను ?

నే  ఎలా వెళ్ళను ?

అన్నది ఆ పంక్తుల అర్ధం !

కవిత్వం ప్రయత్న సాధ్యం కాకూడదు.  స్వతః స్ఫూర్తితో తన్నుకు వచ్ఛేదే కవిత్వం !

ప్రయత్న సాధ్యం  అయిన దాంట్లో కవిత్వం ఎక్కడ ఉంటుందీ?  “తింతి కిమ్తి జిబి” వాటంతటవి రాకుండా ఎలా ఉంటాయి? నిత్యం కవిత్వాన్ని ఆస్వాదించే రస హృదయానికి !!

ఇవే మాటలు ఆయనతో అన్నాను. ఆయన నవ్వుతూ తల ఊపేరు .

ఆయన నాతో సాహిత్య విషయాలు ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. కానీ ఒకసారి ఆయన సాలోచనగా నేను రాసిన ‘తగవు ‘ నాటిక గురించి ప్రశ్నించారు. ఆ నాటిక ఆంధ్రజ్యోతి

వారపత్రికలో నాలుగు వారాలు ధారావాహికగా వచ్చింది. బరంపురంలోనూ, ఢిల్లీలోనూ మహిళా క్లబ్ ల వాళ్లు వారి వారి వేదికల  మీద ప్రదర్శించి  ప్రశంసలు పొందారు.

చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న ఆదర్శవంతులైన యువజంట నీవేపువారు, నా వేపు వారు మన ఇద్దరికీ సమానమే అని అటు  తల్లీ చెల్లినీ, ఇటు తల్లీ చెల్లెల్ని తమతోపాటు ఒకే కుటుంబంగా  ఉండాలనుకొంటారు.  అయితే  ఇంటి పనుల దగ్గర నుండీ  అన్నిటికీ  వంతులూ పంతాలుపోయి  నా కూతురి సంపాదనతో ఉన్నాం అంటే నా కొడుకు సంపాదనతో  ఉన్నాం అనే తగవులతో  ప్రతీరోజూ  నరకప్రాయమై యువజంట  ఇబ్బందుల్లో పడతారు . వారికి పాలుపోసే  ‘అమ్మన్న’ అనే ఆవిడ తగవుకి తీర్పుగా వేరువేరు కాపురాలు పెట్టేయమని యువజంటకి చెపుతుంది.

ఈ తీర్పు కాళీపట్నం రామారావు గారికి నచ్చి ‘అమ్మన్న’ పాత్ర ద్వారా చెప్పించడం మరీ సహజంగా బాగుందని మెచ్చుకుంటూ  తమ అభిప్రాయాన్ని తెలియచేశారు!

శర్మగారు నన్ను అడిగిన ప్రశ్న అదే ! “అదే పరిష్కారమా?” అని ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టారు.

కింది తరగతి అమ్మన్నలాంటి వాళ్లకి ఇది మామ్మూలు సంగతే! వాళ్లు ఒకే ఇంట్లో వేరు పొయ్యిలు పెట్టుకుని ఉంటారు.  కష్టాల్లో మళ్ళీ తమలో తాము ఒకరిని ఒకరు ఆదుకోవడమూ ఉంటుంది. ఇదే నేను రాసిన విషయం! కారా గారికి నచ్చిన విషయం!

“అంతేకద!”  అన్న నా సమాధానం ఆయనకి  సంపూర్తిగా నచ్చలేదు. తలపంకిస్తూ  వెళ్ళిపోయారు.  తాను అనుకునే పరిష్కారం ఏమిటో చెప్పనూ లేదు.  దీనిని  ఖండించనూ లేదు!!

శర్మగారిని విజయనగరంలోనే  కాక పై ఊళ్లలోనూ  కలుసుకోవడం జరిగింది.

 సాహిత్య అకాడమీ  వారు ఇచ్చిన రచయితల గ్రాంటుతో  1982 జూన్లో  హిందీ రచయితలను కలవడానికి  ఉత్తరభారతంలోని  ప్రధాన పట్టణాలు వెళ్ళేను.  లక్నో 1982 జూన్ 13న వెళ్లాను.  ఆరోజుల్లో శర్మగారు లక్నోలో తమ చిన్నకూతురు వల్లీ శ్యామలతో  ఉన్నారు. నేను భరాగో తమ్ముడు (కజిన్) బి. టి. తమ్మయ్యశాస్త్రిగారి ఇంట్లో (భరాగో చెప్పగా) ఉన్నాను. తమ్మయ్యశాస్త్రిగారు రైల్వేలో సివిల్ ఇంజనీరు. నందివాడ భీమారావుగారు ఏ. జి . ఆఫీసు జి. ఎం . గా అక్కడే ఉన్నారు.  నేనూ, శర్మగారూ కలిసి  ఏ.జి. ఆఫీసుకి వెళ్లాం. భీమారావుగారు సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి తర్వాత వారింటికి రమ్మన్నారు . భీమారావుగారు నాతోపాటు అమృత్ లాల్  నాగర్ ఇంటికి వచ్చారు. శర్మగారు లైబ్రరీలో పని ఉందని మాతో రాలేకపోయారు.

రాత్రి శాస్త్రిగారి డాబా మీద లక్నోలోని  తెలుగు పెద్దలు మీటింగ్ పెట్టారు. భీమారావుగారు , శర్మగారు, తదితరులు అందరూ నా కథాసాహిత్యరచన గురించి మాట్లాడాలన్నారు. ఆ సభలో శర్మగారూ చర్చలో పాల్గొన్నారు. ఆయనకి నేను రాసిన ‘బామ్మ రూపాయి ‘ కథ నచ్చింది. ఆ కథని చదివి వినిపించమన్నారు!  భీమారావుగారికి శర్మగారు నా ‘యాత్ర’  నవలికను  కూడా ఇష్టంగా చెప్పారు. భీమారావుగారికి  దాంట్లో ముసలమ్మ  పాత్ర యువతతో కలిసి జీవనోత్సాహం తో  “ఛల్  మో హాన్ రంగా నీకు నాకు జోడు కుదిరెను కదరా” అనే పాటని తనకి తెలియకుండానే తను పాడడం, సిగ్గుపడ్డం చాలా నచ్చింది !

ఒడిశా – కటక్ నేపథ్యంలో ఒడియా, తెలుగువారి కథ కాబట్టి శర్మగారికి ఎక్కువ నచ్చిందనుకుంటాను!

ఇలా నా రచనల మీద కాస్తో కూస్తో అప్పటా అప్పటా ఆయన మాట్లాడారు. కానీ ఆయనతో ఎక్కువకెక్కువ కూర్చుని ఆయన చదివిన వివిధ కళారంగాల పుస్తకాల గురించి విని చర్చించే అవకాశం  నాకు కలగలేదు! కారణం, నేను విజయనగరంలో లేకపోవడమే!!

ఉత్తరభారత యాత్రకు బయల్దేరే ముందు “ఏమన్నా ఇక్కడ నుండి తెచ్చిపెట్టనా? ” అని అడిగితే   ‘వక్కపొడి’ తెమ్మన్నారు.  తీసుకువెళ్ళాను!!

రోణంకి మాస్టారిని బరంపురంలో ఉపన్యసించడానికి పిలిపించాను, అక్కడి సాహితీసంస్థలకి!! రోణంకీ, చాసో ఇద్దరూ వచ్చారు. శర్మగారు ఆ సమయానికి బరంపురంలోనే ఉన్నారు. సభకి వచ్చారు. మర్నాడు రోణంకిని, చాసోని కలవడానికి రాగా ముగ్గురినీ అన్నపూర్ణా మార్కెట్కి దగ్గరగా ఉన్న ఫోటో స్టూడియోకి  తీసుకువెళ్లి ఫోటో తీయించుకోవాలనుకున్నాను.  శర్మగారు, నేనెందుకు? నాకెందుకు? అంటూ వద్దంటూనే ఉన్నారు.  ” రావయ్యా! వచ్చి కూచో ! తాను కావాలంటోందిగా!” అన్నాడు   రోణంకి . అలాగ్గా ఆ ముగ్గురి ఫోటో జ్ఞాపకంగా మిగుల్చుకున్నాను!! అపూర్వ వ్యక్తుల జ్ఞాపకాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యతని తీర్చుకునే సదవకాశాన్ని ఎలా వదులుకుంటానూ??

2002 సంవత్సరాంతంలో శర్మగారింటికి నా స్నేహితురాలు నడిమింటి విజయలక్ష్మితో కలిసి వెళ్లేను. ఆయన తన పుస్తకాల లైబ్రరీ గురించి , నాతో  మాట్లాడాలన్నారు.   ఆ పుస్తకాలు ఉన్న చిన్నగదికి తీసుకువెళ్లి చూపెట్టేరు! ఆ జ్ఞానసంపదని కాపాడాలి. ‘తప్పకుండా చేద్దాం, చూస్తాం’ అని ఇద్దరమూ మాట ఇచ్చాం. మీకే పుస్తకమన్నా  కావాలంటే తీసుకోండి అన్నారాయన. “అన్నీ చదవవలసినవే! ఏర్పాటు చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చదువుతాం” అన్నాం.   ఆ నవంబరులో నేను జర్మనీ వెళ్లాను. నేను తిరిగి రాకుండానే శర్మగారు డిసెంబరులో శాశ్వతంగా, తెలియని చోటుకి  వెళ్లిపోయారు. ఆ జ్ఞానసంపదని కాపాడడానికి  నా వంతు సాయం నేను చేయలేకపోయాను. ఇటువంటి సంపదని ఆర్జించడమూ కష్టసాధ్యమే! ఈ సంపదే ముఖ్యం జాతికి!

శర్మగారిని తలుచుకోవడం అంటే  ఆయన వరవడిని తలుచుకోవడం. శత జయంతి    సందర్బంగా  ఆ వరవడి గురించి నేటి యువతకు అందించడం భావ్యం. బాధ్యత కూడా! ఆ మహత్తర కార్యాన్ని తలకెత్తుకున్న వారందరికీ నా శుభాభివందనలు. శుభాకాంక్షలు.

*

 

చాగంటి తులసి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తులసి గారూ,

    మీ జ్ఞాపకాలు ఉత్త జ్ఞాపకాలే కాదు, చరిత్ర కూడా. నేనూ విజయనగరం

    వాడినే గాని, నాకు ఢిల్లీ శర్మగారి గురించి నాకు తెలియదు. బహుశా

    నాకు కోటకి దగ్గరగా ఉన్న ప్రదేశాలు తప్ప పాత బస్ స్టాండు వైపు ఉన్న

    ప్రదేశాలు తెలియకపోవడం, ఆయన టీచరు కాకపోవడం కారణం

    కావచ్చు.

    కానీ భవదీయుడు 1966-1968 మధ్య రోణంకి అప్పలస్వామి మాష్టారి

    శిష్యుడు. ఆయన షేక్స్పియర్ నాటకం కింగ్ లియర్ చెబుతున్నప్పుడు

    నిజంగా పాఠంలా ఉండేది కాదు. స్వయంగా బహుపాత్రాభినయం

    చేసేవారు. నాకు బాగా గుర్తున్నది కార్డీలియా భర్త తర్వాతే తండ్రి అని

    లియర్ కి చెప్పి అంతకుమించి మరేమీ కాదు అన్నప్పుడు, “Nothing!”

    అన్న మాటని హతాసుడై తిరిగి చెబుతూ, నిరాశనుండి వచ్చిన కోపంతో

    “Then, Nothing comes out of nothing!” అని అంటాడు. ఇది

    మాష్టారు పరమ అద్భుతంగా నటించి చూపించారు. అప్పుడప్పుడు

    ఆయన రాసిన కవితలు వినిపించేవారు విద్యార్థులకి. నిజం చెప్పొద్దూ!

    తెలుగుమీడియంలో 12 తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి డిగ్రీ మొదటి

    రెండు సంవత్సరాల్లో కవిత్వం అర్థం చేసుకోగలిగిన శక్తి వెంటనే

    ఎక్కడనుండి వస్తుంది? Gibbous Moon అన్న కవిత ఆయన చదివి

    వినిపించి, వీళ్ళకి అర్థం కాలేదని తెలిసి, Gibbous moon అంటే ఏమిటో,

    ఎలా ఉంటుందో చెబుతూ, ఉదాహరణగా ‘పందిమూతి’ చెప్పి, పౌర్ణమికి

    ముందు త్రయోదశినాడు ఉండే చంద్రబింబంలా ఉంటుందని తెలుగులో

    చెప్పారు.

    గురువుగారిని గుర్తుచేసుకునే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.

  • పలువురి హృదయాలలో, జ్ఞాపకాలలో ఒక అపూర్వ వ్యక్తి గ నిలిచిపోయిన ఢిల్లీ శర్మ గారి ని ఒక విలక్షణ వ్యక్తిగా అభివర్ణిస్తూ, వారి సాహిత్య పిపాస ని మరోసారి అందరికి గుర్తు చేసిన చాగంటి తులసి గారికి ధన్యవాదాలు..గత నెల ఫిబ్రవరి 17 వ తేదీన జరిగిన “నడచిన పుస్తకం: చిర్రావూరి సర్వేశ్వర శర్మ” పుస్తకావిష్కరణ వేడుకని ఈ లింక్ ద్వారా తిలకించగలరు.
    https://www.youtube.com/watch?v=C9CD1ybt9HY

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు