తుఫాను వేళ ప్రేమయాత్రకు పూనుకున్నావేమి, సఖుడా!
– టాగోర్
1
లోహి నోస్తాల్జియా అనేది ఒక illusion అనేవారు. నేను నా జీవితంలో ఎక్కువ భాగం నోస్తాల్జియాలోనే గడిపాను. నాకది వాస్తవమంత నిజం. నిజం అనిపించేంత వాస్తవం. నిజానికి మనం వాస్తవం అనుకునేది నిజంగా వాస్తవమేనా? అది కూడా illusion యేగా. ఏ illusion లో మనం ఉంటేనేమి, illusion లో ఉండడం తప్పనప్పుడు.
2
గాలి నాడి తుఫానును సూచిస్తోంది. ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరిస్తున్నాయి. ఆరు దినాల నిరంతర వర్షాన్ని వాతావరణ శాఖ వాగ్దానం చేసింది. ఇటువంటి రోజుల కోసం నేను సంవత్సరమంతా ఎదురు చూస్తాను.
పదేళ్ళుగా ఉపయోగించని హోండా బైక్ ని షెడ్ లోంచి బయటకు తీసి సర్వీస్ చేయించి సిద్ధంగా ఉంచాను. Bike rides చేసి ఎనిమిది ఏళ్ళు అయిపోయింది. Bike లో మాత్రమే వెళ్ళగల తూర్పు కనుమల్లోని అత్యంత లోతైన ప్రాంతాలను అన్వేషించడం కోసం మానసికంగా సిద్ధంగా ఉన్నాను.
చిన్నతనంలో నేను గుర్రం మీద తిరిగిన దారుల్లో తిరిగి పయనించాలని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నాను. కానీ ఎందుచేతనో వాటిని సాకారం చేసుకోవడానికి నాకు శక్తి చాలలేదు. టిబెట్ సరిహద్దుల వరకూ వెళ్ళి వచ్చాను. కానీ నా ఇంటికి 50-60 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు వెళ్ళలేకపోయాను. ఎందుకు?
డాబాపై నిలబడి చూస్తుంటే లంబసింగి పర్వతశ్రేణి పైనుండి నా వైపుకి వస్తున్న నల్లని మేఘాలు నన్ను నిలువనివ్వలేదు. ఇంతలోనే సన్నగా వర్షం మొదలైంది. నేను ఉన్నఫళంగా
హెల్మెట్ పెట్టుకుని బయలుదేరాను. వర్షంలో రక్షణ ఎలాగ అని ఆలోచించే వ్యవధీ లేదు, మానసిక స్థితీ లేదు.
నర్సీపట్నం దాటి కొంత దూరం వెళ్ళగానే హఠాత్తుగా వర్షం పెరిగింది. ఆశ్చర్యంగా నిర్మానుష్య ప్రదేశంలో రోడ్డు పక్కన చూస్తే ఒక యువకుడు రెయిన్ కోటులు అమ్ముతూ కనిపించాడు. అతడు ఎంతో ప్రేమగా తన వద్ద ఉన్న వాటిలో మంచి దానిని వెతికి నాకు ఇచ్చాడు. మొహమాటంగా వంద రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఇటువంటి మృదు స్వభావులు కూడా ఏదోలా బ్రతుకగలుగుతున్నారు ఈ కటువైన లోకంలో.
ముందు రోజే విశాఖపట్నంలో decathlon షోరూంలో మంచి రెయిన్ కోటు కోసం వెతకాను. అక్కడ ఉన్న quechua రెయిన్ కోటుల నాణ్యత నాకు నచ్చలేదు. సరే, విదేశాలకు వెళ్ళినప్పుడు నాణ్యమైన రైన్ కోటు తీసుకుందామని అనుకుని వెనక్కి వచ్చేసాను.
జీవితంలో చాలాసార్లు అత్యున్నతమైనవి అని మనం భావించే వాటి కోసం ఉన్నవాటిని వదిలేసుకుంటాం. మనకి నిజంగా అవసరమైనప్పుడు రెండూ లేకుండా పోతాయి. అయితే ఈ సమయంలో ఈ వంద రూపాయల రెయిన్ కోటును ఆనందంతో ప్రకృతి కుట్ర చేసి నాకు ఇచ్చినట్టుగా అనిపించింది. జీవితంలో అద్భుతాలు మనం గుర్తించలేనంత సాదాసీదాగా సంభవిస్తాయి. ఈ కోటు నా అవసరాన్ని చక్కగా తీరుస్తోంది. బహుశా విదేశీ రెయిన్ కోటు అవసరం ఇక లేదేమో! ఇప్పటికిప్పుడైతే లేదు. దీనితో ఈ వర్షాకాలం గడిచిపోతుంది.
ఆ కోటు వేసుకుని హోరున పడుతున్న వర్షంలో లంబసింగి హిల్ స్టేషన్ వైపు సాగిపోయాను. తుఫాను వచ్చినప్పుడు వర్షంలో, SUV లో పర్వతాల్లోకి వెళ్లిపోవడం నాకు అలవాటే. కానీ బైక్ మీద వెళ్లడం ఇదే మొదటిసారి. బైక్ మీద యాత్రకు వెళ్తే కలిగే అనుభూతి కారులో వెళ్తే రాదని అర్థమైంది. వర్షపు చినుకుల ఒత్తిడి, చల్లదనం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే తాజాగాలి, 360° seamless view – బైక్ మీద కలిగే అనుభూతి కారులో ఎప్పటికీ రాదు. కారుకు ఉన్న పరిమితులు కారుకు ఉంటాయి. SUV కి ఉన్న పరిమితులు SUV కి ఉంటాయి. కొన్ని దుర్లభమైన దారుల్లో ప్రయాణించడం బైక్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. నాది off-road బైక్ కాకపోయినా, అద్భుతమైన suspension ఉన్న బైక్. దాని సామర్థ్యం కొన్ని గంటల్లో నిరూపితం కాబోతోంది.
వర్షంలో మేఘాలను చీల్చుకుంటూ లంబసింగి చేరుకున్నాను. ఒక వేడివేడి స్పెషల్ అరకు కాఫీ తాగి చింతపల్లి వైపు ప్రయాణించడం మొదలుపెట్టాను.
చింతపల్లి దాటి మూలపేట నుండి కుడివైపుకు మళ్ళాను. కట్టుపల్లి, లింగవరం మీదుగా, దామనాపల్లి చేరుకున్నాను. ఇప్పుడు తారు రోడ్డు వేశారు. కానీ ఒకప్పుడు ఇది కేవలం
ఇరుకైన కాలిబాట మాత్రమే. ఈ రోడ్డు చాలా దూరం కావడం వల్ల నా చిన్నతనంలో అడ్డదారిలో వేరే కాలిబాటలో ఎన్నో కొండలు ఎక్కి దిగి దట్టమైన అరణ్యం గుండా కాలినడకను వెళ్లేవాళ్ళం. ఒక్కొక్కసారి రాత్రి 12 దాటిన తర్వాత కూడా వెన్నెల్లో అరణ్యంలో టార్చ్ లైట్ కూడా లేకుండా 12 కిలోమీటర్లు నడిచి దావనాపల్లి చేరేవాళ్ళం. పాములు, తేళ్ళు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు ఉండే అడవి అయినా ఏ భయం ఉండేది కాదు. ఏ ప్రమాదం జరిగేది కాదు. మనిషి బాధలన్నీ కేవలం భయం వల్లనే. ప్రకృతిని ప్రేమించేవారికి, ప్రకృతిలో ఒక రక్షణ ఉంటుంది. అది ప్రకృతిలో మమేకం అయితేనే తెలుస్తుంది.
3
దామనాపల్లి సముద్రమట్టానికి సుమారు 4500 అడుగుల ఎత్తులో తూర్పు కనుమల్లో ఉంటుంది. గిరిజన గ్రామం. కొండల మధ్యన ఒక చిన్న లోయ. ఆ లోయలో పది పదిహేను ఇల్లు ఉన్న ఒక చిన్న గ్రామం. దేశంలోనే అత్యంత సుందరమైన ప్రదేశంలా నాకు కనిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవి. సెలయేర్లు. వందల రకాల రంగురంగుల పిచ్చుకలు. అన్ని రకాల పిచ్చుకలని నేను మరెక్కడా చూడలేదు.
నా బాల్యం రెండేళ్లు అక్కడే గడిచింది. పనస చెట్టుకు కట్టిన గుర్రాన్ని రోజూ ఉదయం పూట స్నానం చేయించడం. ఆ తర్వాత దానిపై జీన్ వేయించుకుని నేను పెంచుకున్న నల్ల చిరుతలాంటి అడవి జాతి కుక్కపిల్ల సోనీని వెంటబెట్టుకొని గుర్రాన్ని సెలయేటి వరకు దౌడు తీయించి, కుక్కకు కూడా స్నానం చేయించడం. ఆ తర్వాత ముగ్గురం కొండల్లో రికామిగా తిరగడం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లకుండా చీకటి పడే వేళకు ఇంటికి చేరుకోవడం. వెనుక రెండు కాళ్ళ పై గుర్రాన్ని నిలబెట్టి సకిలించేలా చెయ్యడం. ఎత్తైన ప్రదేశం నుండి కిందకు ఉరికించడం. కొండల అంచుల మీద నడిపించడం. మంచు, వర్షం, పుప్పొడి. గిరిజనులు ప్రేమతో తీసుకుని వచ్చి ఇచ్చే వందల రకాల అడవి మామిడి పండ్లను రుచి చూడటం. మూడు కొండలు ఎక్కి దిగి 12 కిలోమీటర్లు ప్రయాణించి చింతపల్లి లైబ్రరీ నుండి పుస్తకాలను బస్తాల్లో నింపుకొని గుర్రంపై వేసుకొని ఇంటికి తెచ్చుకొని పగలు రాత్రి చదువుతూ గడపడం. ఇలా సాగేది నా దినచర్య. నేను 2,3 తరగతుల్లో గుర్రపు స్వారీ చేస్తూ కొండల్లో ఒంటరిగా ప్రయాణించేవాడినని చెబితే చాలా తక్కువమంది నమ్ముతారు. కానీ అది నిజం.
దామనాపల్లి నాకు ఎంతో ప్రేమాస్పదమైన చోటు. మానసికంగా నాకు అటాచ్మెంట్ ఉన్న ఏకైక ప్రదేశం. ఉద్యోగరీత్యా మా కుటుంబం అక్కడ ఉండాల్సి రావడం నా అదృష్టం.
మీకు తెలుసా? దశాబ్దాలుగా నేను ఆ ఊరికి వెళ్లి – ఆ సెలయేర్లు, ఆ కొండలు – అన్నీ చిన్నతనంలో మాదిరిగా తిరగుతున్నట్టు, అక్కడే వదిలేసి వచ్చిన సింహంలా భారీగా ఎదిగిన అందమైన కుక్క పిల్ల సోనీని కలిసినట్టు, దామనాపల్లి వెళ్ళినట్టు అర్ధరాత్రి కలలు వచ్చి దిగులు కలిగి మేల్కొని కూర్చోవడం నాకు అలవాటే. అయినా మూడవ తరగతి మధ్యలో ఆ ఊరిని వదిలి వచ్చేసిన నేను ఎన్నో దశాబ్దాలు గడిచినా అక్కడికి వెళ్ళలేకపోయాను.
చింగిస్ ఐతమాతోవ్ నవల ‘తొలి ఉపాధ్యాయుడు’ లో Altynai లా నాకెందుకో ఆ గ్రామానికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. అవన్నీ సున్నితమైన సంవేదనలు. Altynai “ఒక రోజు నా గ్రామానికి వెళతాను” అనుకునేది. కానీ చాలా దశాబ్దాలు వెళ్లలేకపోయింది. కారణం ఏమిటనేది వివరించి చెప్పడం చాలా కష్టం.
ఎట్టకేలకు 8 ఏళ్ల క్రితం జయతి, లోహీల వల్ల ఆ ఊరిలోకి అడుగు పెట్టాను. అక్కడి నా candid moments ని కెమెరాలో బంధించిన జయతి లోహితాక్షన్ ఇప్పటికీ ఒక్కొక్క ఫోటో నాకు పంపిస్తూ, నన్ను ఆనందంలోనూ, ఆశ్చర్యలోనూ ముంచుతూ ఉంటారు.
చిన్నప్పుడు చదివిన స్కూలు ముందు నేను ఉన్నప్పుడు ఫోటో తీయడం, పువ్వుల్ని సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నా అరచేతిని ఫోటో తీయడం, ప్రకృతి సౌందర్యంలో నేను మమేకమై ఉన్నప్పుడు కేవలం నా కళ్ళలోని మెరుపును ఫోటో తీయడం…ఫోటోగ్రఫీలో ఆమె శైలి ప్రత్యేకం. మనం గమనించకుండా మన movements ని అందంగా రిజిస్టర్ చేసి మనకు పంపడం ఎంతో అందమైన విషయం.
8 ఏళ్ల క్రితం రోజంతా అనేక పర్వతాలు ఎక్కి దిగి ఎట్టకేలకు సాయంత్రం నేను, జయతి, లోహి, జగదీష్ కుమార్ దామనాపల్లి చేరుకున్నాం. ఆ గ్రామంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నాకు వెన్నుల్లో సన్నగా వణుకు పుట్టింది. భయం కూడా కలిగింది. అదే గ్రామం. అవే ఇళ్ళు. ప్రారంభంలో ఉన్న అదే సంపంగి చెట్టు నుండి రాలుతున్న పూలు.
గుర్రాన్ని కట్టే అదే పనస చెట్టు. అక్కడ గుర్రం నేను రాగానే ఉత్సాహంగా, ఆప్యాయతతో గతంలోలా తల విదిలిస్తున్నట్టు అనిపించింది. “ఎక్కడికైనా సరదాగా వెళదాం పదా!” అని అది దేహ కదలికలను, శ్వాసను, చిన్న చిన్న శబ్దాలను ఉపయోగించి తెలియజేసేది.
“గుర్రాలూ, కుక్కలూ తెలివైనవి. అవి మనుషుల్లా జీవించాలని ఆశపడతాయి” అని గూర్జీఫ్ చెప్పారు. అది నిజం కూడా.
నా మిత్రం, ప్రేమాస్పదమైన ఆ పనస చెట్టు చర్మం నా చిన్నప్పుడు యవ్వనంతో నవనవలాడేది. ఇప్పుడది నల్లబడి ముడుతలు పడింది. పెలుసుబారింది. నేను నా ముఖాన్ని తడిమి చూసుకున్నాను. ఈ ముఖం కూడా ఒకరోజు ఇలాగే ముడతలు పడుతుంది కదా అనుకున్నాను. ఆ చెట్టు ఎందుకో దిగులుగా కనిపించింది. బహుశా ఒంటరితనం. దానిని ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. ప్రేమగా స్పృశించే వారు లేరు. దానికి ఇప్పుడు స్నేహితులు లేరు. బహుశా దాని చేతనలో నా జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. దానిని తెలుసుకునే దారి లేదు. ఆ చెట్టు యొక్క జ్ఞాపకాలు, సంవేదనలు, ప్రేమ, ఆప్యాయత – అది నన్ను చూడగానే వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. కానీ నా జ్ఞానం పరిమితం. “మిత్రమా! నిన్ను అర్థం చేసుకునే శక్తి నాకు లేకపోయినందుకు నన్ను క్షమించు” అని మనసులో క్షమాపణలు చెప్పుకున్నాను.
అచ్ఛం మనిషికి మల్లే అది నా ప్రాణ మిత్రం.
దీర్ఘకాలం జీవించేవారు ఎన్నో మరణాలని, వియోగాలను భరించి చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి ఉంటుంది. అది వరమో, శాపమో చెప్పడం కష్టం.
నేను ఎంతో ఇష్టపడిన గుర్రం చనిపోయింది. నా కుక్క చనిపోయింది. ఈ ఊరి ప్రెసిడెంట్ లింగయ్య చనిపోయారు. నేనూ, ఈ చెట్టూ మాత్రనే జీవించి ఉన్నాం. నేనూ కొంతకాలం తరువాత మరణిస్తాను. ఈ చెట్టు ఒక వంద ఏళ్ళ తరువాతో, రెండు వందల ఏళ్ళ తరువాతో మరణిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? నాకు తెలియదు. బహుశా ఎవరికీ తెలియదనుకుంటాను, ఈ బంధాలకు అర్థం. ఈ సృష్టికి అర్థం.
(సశేషం)
Add comment