అక్షర యాత్రికుడూ, రేఖా చిత్రకారుడూ

ప్రసిద్ధ రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు పురస్కారం అందుకుంటున్న అన్వర్ కి శుభాకాంక్షలు.

తని రేఖ బలమైనది,అతని వాక్యం శక్తివంతమైనది,అతని ఇష్టానిష్టాలు తీవ్రమైనవి.

అతని రేఖల గురించి విశ్లేషించేంత చిత్రకళా పరిజ్ఞానం నాకులేదుగానీ,అతని రేఖా చిత్రాలలో లోతైన అర్ధముంటుంది.అతను మంచి చదువరి అందుచేతనే తను బొమ్మ వేయాలిసిన ప్రతికథా,కవితా చదివి తనదైన తీరులోవిశ్లేషించి బొమ్మ రూపంలొ స్పందిస్తాడు.అందుకే అతని బొమ్మలు ప్రత్యేకంగా వుంటాయి ,ఆయా రచనలకు అతను చేసే వ్యాఖ్యానాల్లా  వుంటాయి.

సున్నితమైన హాస్యాన్ని పండించే అతని కార్టూన్ల గురించి చెప్పేకంటే చూస్తేనే  బాగుంటుంది.

అతని వాక్యాలు పచ్చిపసుపు కొమ్ముల్లాగా, స్వఛ్ఛమైనవి. అతను రాసేవి అక్షరాలు కాదు అతని హృదయస్పందనలు అందుకే అతని వాక్యాలు వ్యాకరణానికి లొంగవు,అనుకరణకు సాధ్యపడవు.

అతని రాత బాగుంటుందా?అతని గీత బాగుంటుందా? అంటే చెప్పలేము రెండూ బలంగా ఆకర్షించేవే.

తనను ప్రభావితం చేసిన గురువుల గురించి వారి రేఖా విన్యాసాల గురించీ అతను రాస్తుంటే నోరు తెరుచుకుని చదవి ఆశ్చర్యపోవాలిసిందే అతని లోతైన విషయ పరిజ్ఞానానికి.

ఒక మనిషిని ఇష్టపడి తన ఆంతరంగిక వలయం లోకి తీసుకున్నాడంటే అతను చూపే ప్రేమకు హద్దులుండవు.

అతని ప్రేమను తట్టుకోవడం యెంత కష్టమో ,అతనితో తగాదా వస్తే తట్టుకోవడం కూడా అంత కష్టం  తనకు నచ్చని మనిషిని ఆమడ దూరం పెట్టడమే కాదు ఆ మనిషి పేరైనా తలవడానికి ఇష్టపడడు.

ఈ ఉపోద్ఘాతమంతా యెవరి గురించి అంటే బొమ్మని,అమ్మనీ సమానంగా ప్రాణాధికంగా  ప్రేమించే చిత్రకారుడు అన్వర్ గురించే!

ఈ సంగతులన్నీ నాకు తెలియడానికి కారణం గత కొంతకాలంగా అతను నన్ను తన అమ్మగా పెంచుకోవడమే.

ఎన్నికైన చిత్రకారులూ,మన్నికైన రచయితా శ్రీ శీలా వీర్రాజు గారి అవార్డు ను వారి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారి చేతులమీదుగా అందుకుంటున్న శుభసందర్భంలో, అక్షర యాత్రికుడూ, రేఖా చిత్రకారుడూ అన్వర్ కి శుభాభినందనలు

*

 

సందర్భంగా అన్వర్ స్వయంగా రాసుకున్న చిన్న నేపథ్య రచనని కూడా మీకు అందిస్తున్నాం. 

అనగనగా ఒక అనేక చందమామలు


“తుంజో కెహ్ దోతో ఆజ్ కి రాత్ చాంద్ డూబేగా నహి! రాత్ కో రోక్ లో” అని అన్నాడు కదాని చంద్రుని కేసి చూశా. తెలుసా ఏవయిందో ? ఉన్నపళాన అయిదేళ్ళ పిల్లాణ్ణి అయిపోయా. ఇప్పుడు నేను మా జేజి చేయి పట్టుకుని టెక్కె లో నడుస్తున్నా. మా అన్నకు పసిరికలు పోసినాయి దానికి మందు కోసం వచ్చిఉంటిమి, వెనక్కి ఇంటి వైపు నడక అప్పటికి నంద్యాలలో పూర్తి స్థాయి కరెంటు దీపాలు లేవు. వీధి లైట్లు అక్కడో ఎక్కడో చిన్న బల్బులు… కరెంటు లేని రోజులు చూసిన పిల్లాడిని నేను. లాంతరు గాజు భద్రంగా తీసి మసిని శుభ్రంగా తుడిచి తళ తళ మెరుపు చూసిన థళుకు జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. మా ఇంటికి కరెంటు వేయించినపుడు సంగతి , కరెంట్ వైర్లు కలుపుతూ చిన్న స్టీల్ ప్లేట్ చుడతారు. నా బొమ్మలేసే కళ్ళకు అవి జానపద రాజకుమారుడి ఖడ్గాలా తోచేవి. క్రింద పడ్డవి ఎవరూ చూడనప్పుడు తీసి దాచుకునేవాణ్ణి.

సరే! అలా మా జేజితో మా అన్నతో కలిసి నడుస్తూ తల పైకెత్తి చూస్తే చందమామ. నాకు ఎరిక కలిగి అది మా తొలి పరిచయం. అరే! బలే ఉన్నాడు. పైగా ఎవరితో లేడు. కేవలం నా వెంటే వస్తున్నాడు. నేనంటే ఇష్టమేమో! తనని పరిక్ష చేద్దామని చటుక్కున ఆగిపోయా. తను ఆగిపోయాడు. బ్బా!! నాకెంత సంబరం. బహుశా అది నా ఫస్ట్ లవ్. నాకోసం ఒకరు. నాతో ఒకరు. ఇంకా నాకు చెట్టు ఇష్టం, ఏదైనా ఊరికి వెడుతుంటే కిటికీలోంచి నన్ను చూసే చెట్లు ఇలా అనేవి “నువ్వు వెళ్ళి మా ఊరు చూసిరా ,ఆ లోగా మేం వెళ్ళి మీ ఊరు చూసొస్తాం . చెట్లు ఎప్పుడు నాతో లేవు , దొంగ ముండలు ఎప్పుడు నాతో రాక వెనక్కి వెళ్ళిపోయేవి.

మా ఆవిడ కడుపులో ఉన్న శిశువుకు చందమామ అని పేరు పెట్టుకున్నాం. దానికి అప్పుడు ప్రేమ లేఖలు కూడా వ్రాసుకున్నా. ఇప్పటికీ మా ఆవిడ దాచుకుంది 🙂 నా ఫ్రెండ్స్ పుస్తకాల్లో ఇలా ఇన్ స్కైబ్ చేసేవాళ్ళు అన్వర్ వాళ్ళ చందమామకు ప్రేమతో… చందమామ పుస్తకాలు 60 ల నుంచి 80 ల వరకు వి దాచుకున్నా. ఇక పుస్తకాలు భరించేంత ఇల్లు లేక ఒక నేస్తుడికి ఇచ్చేశా. పాపం ఆయన మంచివాడు ” వీటికి ఎంత అయిందో చెప్పండి డబ్బులు ఇస్తాన”న్నారు. అయ్యో! నామీద నాకెంత జాలి వేసిందొ. పుస్తకాలు కొనడానికి , వాటిని వెతకడానికి, వాటి మోహంలో ములిగి చావడానికి సిద్దంగా ఒక టైం కూడ వచ్చి పోయింది. పుస్తకాల కన్నా ఏదీ ప్రయారిటి కాదు అనుకుని యవ్వనాన్ని, సమయాన్ని, ప్రేమని ఆ చందమామలకు వ్రాసి ఇచ్చేశానే! ముగ్గురు మాత్రికులు, తోక చుక్క, రాకాసి లోయ, రాతి రథం, మాయా సరోవరం, కంచుకోట, అరేబియా కథలు…… ఆ కథల్లోని గంధర్వరాజు కూతురితో నేను ప్రేమలో పడి చిక్కి శల్యమైన రోజులు ఉన్నాయే! అప్పుడు నేను మాయ కుళ్ళాయి ధరించి పరుల కంట పడేవాణ్ణి కాను, రెక్కల గుర్రం ఎక్కి పింగళుడిని కూడా కాదని పద్మ పాదుడితో కలిసి పర్వతాల మీద గులకరాళ్ళు దొర్ల జల్లి పులులను తోడేల్లను సృష్టించేవాడిని. అగస్త్యుడు ఎక్కడికెడితే కూడా అక్కడికి వెళ్ళి వాతాపిని తిన్న వాడిని కానా? వెడుతూ వెడుతూ ఇల్వలుడిని వ్వే వ్వే అని వెక్కిరించిన రోజులవి. అప్పుడు నేనసలు భయమే ఎరుగను.

ఇంకా శారదా విద్యా విహార్ జీవితాన్నిఒక ఖడ్గ చాలనంతో ఎగ్గోట్టి ఖడ్గవర్మ ,జీవదత్తుడు, విక్రమకేసరి, శిఖిముఖి ల సావాసంతో బాల్యాన్నంతా పరువళ్ళ తెరచాపలెత్తించి పేరు తెలియని సముద్రాల్లో విశృంఖల విహారం చేసిన ఆ బంగారు రోజులని ఎంతకని అమ్మను? బొమ్మ వేస్తే వచ్చే ఏభై రూపాయల్లో బియ్యం , ఉప్పు , పప్పు లెక్కలు ఏమో గానీ బడ్జెట్ కాగితంలో మాత్రం చందమామకు చేయించాల్సిన బైండింగ్ ఖర్చు తప్పనిసరి. ఆ గట్టి అట్ట నన్ను చెత్తా బజార్ లో పరిచయం చేసిన పేద పెద్ద కుటుంబపు బడేమియా చిన్న కళ్ళ నవ్వుని ఎంతకని అమ్మ మంటారు?

ఓ చందమామ నిన్ను త్రాపి నాతో ఇవాళ ఏమేం కక్కిస్తున్నావు చందమామ? సూర్యుడు చంద్రుడు వాళ్ళ అమ్మకి పలావు పెట్టిన కథ తెలుసా మీకు? అది చెప్పడానికి నా జేజి వంటి జేజి ఉండేదా మీకు ? ముసల్మానులము మేము. మా జేజి చేతిలో తస్బిన్(జపమాల) లా ఇలాహి ఇల్లాలాహ్ అని నిత్యం తిరిగేది. చదువు రాని నా జేజి పలక మీద నాతో వ్రాయించిన అక్షరాలు ఏవో తెలుసా “ఓనామహ, శీవాయహ, సిద్దం నమహా” హిందూ ముస్లీం లెక్కల పాఠం ఎరుగని ఆ సరస్వతీ దేవి మా జేజిగా పుట్టి నన్ను ఒళ్ళొ కూర్చో పెట్టి దిద్దించి పెట్టిన ఈ భిక్ష ఈ రోజు ఈ రాతలు గానీ ఈ గీతలు కానీ. ఎట్లా ఏం చేసి నా జేజి రుణం తీర్చుకునేది ఓ చాంద్ మామూ? మా బంగారు జేజమ్మ బీబీ జాన్ ని తలుచుకుంటుంటే ఇవాళ చంద్రుడు మామూలు కన్నా పెద్దగా ఉన్నాడు, నా హృదయంలా. ఎప్పట్లాగే నాతోనే వస్తున్నాడు నా నీడలా.
*

రొంపిచర్ల భార్గవి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మతిపోయి,గతితప్పే వాక్యం ఎవురిది? అన్వర్ గారిదే…
    వ్రాత,గీత, ల మాంత్రికుడికి శుభాకాంక్షలు.

  • తనను ప్రభావితం చేసిన గురువుల గురించి వారి రేఖా విన్యాసాల గురించీ అతను రాస్తుంటే నోరు తెరుచుకుని చదవి ఆశ్చర్యపోవాలిసిందే అతని లోతైన విషయ పరిజ్ఞానానికి.

    congratulations to Anwar

  • మెట్రో నగరంలో కళ( చిత్రకళ , కథ ) కోసం భుజాన ఒక సంచీ వేసుకొని తిరిగే సంచారి Anwar.

    రచయిత, చిత్రకారులు, సినిమాల గురుంచి అతని అన్వేషణ, పరిచయం నెన్నెప్పుడూ

    ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

    ఇదే మొదటి సారి, అతను అవార్డు తీసుకోవడం గురుంచి వినడం. ( వాటికి చాలా దూరంగా ఉంటాడని కవి భావన )

    అన్వర్ కి అభినందనలు.

  • అతని రేఖ బలమైనది,అతని వాక్యం శక్తివంతమైనది,అతని ఇష్టానిష్టాలు తీవ్రమైనవి.ఎంత మంచి మాటలు, ప్రభావపూరితమైన మాటలు రాశారు మీరు అన్వర్ గురించి.
    అంతే చందమామంత అందంగా రాశారు అన్వర్. అభినందనలు మీ ఇద్దరికి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు