అక్షరమే ఆయన ఆలయం!

–        కీ.శే. డాక్టర్ పి.వి. రమణ, నాటక రంగ పరిశోధక ప్రముఖుడు

(రెంటాల గోపాలకృష్ణతో సన్నిహిత పరిచయం ఉన్న నాటక రంగ పరిశోధకుడు, కళాజీవి డాక్టర్ పి.వి. రమణ. రెంటాల నాటక రంగ కృషి మీద, అనువాద సేద్యం మీద అవగాహనతో పాటు ‘ఆంధ్రప్రభ’ సంపాదక వర్గంలో రెంటాల పనితీరును చూశారు పి.వి. రమణ. స్వయంగా రెంటాల నాటకంలో ప్రధాన పాత్ర ధరించారు. ఆ సాన్నిహిత్యంతో రెంటాల ప్రథమ వర్ధంతికి ముందు ఆయన రాసిన వ్యాసం ఇది. అప్పట్లో ‘ఆంధ్రభూమి’ దినపత్రిక, 1996 జూలై 15వ తేదీ సోమవారం సంచికలోని సాహిత్యం పేజీలో ఇది ప్రచురితమైంది).

“వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠల కోసం కాక, స్వీయ సుఖ సంతోషాల కోసం కాక సాటి మానవ సమాజ ప్రగతినీ, చైతన్యాన్నీ దృష్టిలో పెట్టుకొని రచనలు చేసిన బహు కొద్దిమంది రచయితలలో అగ్రస్థానంలో నిలవగలిగినవారు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ గారు.

కవిగా, నాటక రచయితగా, పరిశోధకునిగా, సిద్ధాంతకర్తగా, అనువాదకునిగా, విమర్శకునిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన సాహితీ తపస్వి రెంటాల. నిరంతర గ్రంథ అధ్యయనంతో పాటుగా నిశితమైన పరిశీలన, స్వచ్ఛమైన అవగాహన, నిజాయతీతో సమ్మిళితమైన నిబద్ధత – ఇవన్నీ కూడా జీవం పోసుకున్నందు వల్లనే ఆయన గొప్ప రచనలు చేయగలిగారు. పుంఖానుపుంఖాలుగా రచనలు చేసినా వైవిధ్యంలో దేని విశిష్టత దానిదే! అన్నీ ప్రాణస్పర్శతో తొణికిసలాడేవే! మానవ కల్యాణానికి కార్యోన్ముఖం చేసేవే! రెంటాల ప్రాపంచిక దృక్పథం, మానవ శ్రేయోభిలాష ఎంత బలవత్తరమైనవో ఆయన రచనలు వెల్లడిస్తాయి. రెంటాల స్వాప్నికుడు కాదు… ఉజ్జ్వల భావుకుడు. అనుచరుడు కాదు… మార్గదర్శకుడు. సిద్ధాంత నినాదకుడు కాదు… ఆచరణాత్మక అనుభవీకుడు. ఆయన సృష్టించిన అనంత సాహిత్యంలో ఈ సత్యాన్ని మనం గమనించవచ్చు.

అందుకే… రష్యన్ సాహిత్యం వైపు!

భారతీయ సాహిత్యం ఆయన్ని ఎంతగా పరవశింపజేసిందో, రష్యన్ సాహిత్యం అంత ఉద్వేగభరితం చేసింది. రెంటాల భావ ప్రపంచానికి రష్యన్ సాహిత్యం కొత్త ఊపిరి పోసింది. అధ్యయన పరిధిని విస్తృతం చేసింది. ఆది శంకరాచార్యుల అద్వైతాన్నీ, టాల్‌స్టాయ్ మానవతావాదాన్నీ, మాగ్జిమ్ గోర్కీ ప్రగతిశీలదృష్టినీ తనలో సమ్మిళితం చేసుకున్న సాహితీమూర్తి రెంటాల.

‘‘Books guide me through life which I know fairly well, but they always have a way of telling me something new, which I did not previously known or notice in a man’’ అన్న గోర్కీ పలుకులు రెంటాల విషయంలో అన్వర్థమైనంతగా మరొకరికి కావు. అవధులు లేని గ్రంథ అధ్యయనం వల్లనే రెంటాల అవగాహన పదునుదేరింది. విశ్వమానవ భావనతో పరివ్యాప్తమైంది. రెంటాలను రష్యన్ సాహిత్యం ఇంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ఆయనలో సహజసిద్ధంగా ఉన్న సమతా, మానవతా చింతనలే!

తొలిదశలో… చిన్ననాటి రోజుల్లో ‘పార్వతీశ శతకం’, ‘కిరాతార్జునీయం’ వంటి రచనలతో తృప్తిపడినా, తరువాత సరిహద్దులు, సముద్రాలను అధిగమిస్తూ పురోగమిస్తున్న భావతీవ్రతను మరింత ఉజ్జ్వలవంతం చేసుకుంటూ వచ్చారు. మధ్యదశలో రష్యన్ రచయితల సందేశాత్మక రచనల్నీ, సమసమాజ భావనా స్వభావాన్నీ తెలుగు లోగిళ్ళలో పరవళ్ళు తొక్కించారు. ‘‘రష్యా, భారతీయ ప్రజల జీవితాలలో ఎన్నో సారూప్యాలున్నాయి’’ అని గాంధీ కూడా ఓ సందర్భంలో ప్రకటించారు! ‘బోల్షివిక్ విప్లవం’ గాంధీపై ఎంతో ప్రభావం చూపిన విషయం మనకు తెలిసిందే. బహుశా, ఈ ఇరుదేశాల ప్రజల జీవనసరళిలోని సారూప్యతే రెంటాలను రష్యన్ సాహిత్యం వైపు ఆకర్షించి ఉంటుంది.

అనువాదంలో రెంటాల ప్రత్యేకత అదే!

విదేశ సాహిత్యాన్ని స్వీకరించినా, దాన్ని తెలుగు జీవనానికి సన్నహితంగా తీసుకువచ్చి, తెలుగు నుడికారాలతో, జాతీయాలతో సుసంపన్నం చేయడంలో రెంటాల ప్రజ్ఞ అపురూపమైనది. సామాజిక ప్రయోజనాకాంక్షే ప్రతి రచనలోనూ మణిపూసలా భాసిస్తూంటుంది. మానవ ప్రవృత్తుల్నీ, వ్యవస్థా స్వభావాన్నీ కాచివడపోయగల అంతర్ దృష్టి ఉన్న రచయితకే పరభాషా స్వరూపాన్ని మాతృభాషా సంపదగా పరిణమింపజేయగల శక్తి చేకూరుతుంది. రెంటాల ఏ సాహిత్యాన్ని సృజించినా, ఏ ప్రక్రియను చేపట్టినా, దానికి పరిణతినీ, పరిపక్వతనూ చేకూర్చి పెట్టడంలోని రహస్యం ఇదే!

మలిదశలో మళ్ళీ ‘రఘువంశం’, ‘కుమార సంభవం’, ‘మేఘసందేశం’, ‘దశకుమార చరిత్ర’, ‘మొల్ల రామాయణం’, ‘మృచ్ఛకటికం’, ‘కళాపూర్ణోదయం’, ‘వాల్మీకి రామాయణం’, ‘మహాభారతం’ వంటి ప్రాచీన భారతీయ ఇతిహాస, కావ్యాలను తెలుగువారికి తనదైన వివేచనతో అందజేసి, తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు రెంటాల. తెలుగు సాహిత్యంలో ఈ విధంగా అజరామరమైన స్థానాన్ని అలంకరించిన సుప్రసిద్ధ రచయిత, సునిశిత మేధావి, అవిశ్రాంత అధ్యయనశీలి, జిజ్ఞాసాదక్షుడు రెంటాల. ‘వాత్స్యాయన కామసూత్రాలు’ అనువాదం రెంటాల ప్రజ్ఞకు నికషోపలం వంటిది.

నా డిగ్రీ రోజుల్లో… ఇన్‌స్పెక్టర్ జనరల్ వేసినప్పుడు….

నాటక రచయితగా రెంటాల గోపాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. గొగోల్ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకాన్ని ఆయన అనువదించిన తీరు అద్భుతం. అనువాదంగా కాక స్వీయ రచనలా ఆయన దాన్ని తీర్చిదిద్దారు. తెలుగుదనంతో, సహజ గంభీరంగా సాగిపోతుంది ఈ నాటకం. ఈ నాటకంలో నేను ప్రధాన పాత్ర ధరించాను. ఆ సందర్భంలోనే 1962లో రెంటాలను కలుసుకొనే అదృష్టం కలిగింది. ఒక సౌమ్య సౌజన్యమూర్తితో పాటు, పరోపకార చింతన, సహృదయత రూపుకట్టిన ఒక గొప్ప వ్యక్తిని కలుసుకొన్న అనుభూతి కలిగింది నాకు. ఆ నాటకంలోని నా పాత్ర స్వరూప స్వభావాలే కాక, మిగతా పాత్రలు, వాటి ప్రవృత్తులు అన్నింటినీ ఆయన విశదంగా తెలియజేశారు. ఆ స్ఫూర్తితో ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించాం కాలేజీలో! నేను బి.ఎ. చదివిన రోజులవి!! ఆ తరువాత ‘తెలుగు సాంఘిక నాటకం’ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్న రోజుల్లో (1974 – 1979), విజయవాడకు వెళ్ళి, తరచూ రెంటాలను కలుస్తుండేవాణ్ణి. వివిధ దేశాల నాటకరంగం గురించి, ముఖ్యంగా రష్యా నాటకరంగం గురించి ఎన్నో విలువైన విశేషాలను ఎంతో ఓపికగా చెప్పేవారు. ఉత్తరోత్తరా ప్రపంచ నాటక రంగంపై నేను అధ్యయనం చేయడానికి రెంటాల అందించిన ప్రోత్సాహం ఎంతగానో తోడ్పడింది నాకు!

హ్యూమనిస్టు..! ఎంతో హ్యూమరిస్టు..!!

జర్నలిస్టుగా వృత్తిలో ఉన్నా, ప్రవృత్తి రీత్యా రెంటాల హ్యూమనిస్టు. మంచి హ్యూమరిస్టు కూడా! గంభీరమైన విషయాలను చర్చిస్తూ ఉన్నప్పుడు సునిశితమైన హాస్యంతో వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చేవారు రెంటాల. ఒక గొప్ప సాహితీవేత్తగా ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాలను ఆపోశన పట్టిన అగస్త్య మహర్షిగా, మానవ చైతన్యానికి సర్వసంపన్నమైన తన సాహితీ జీవితాన్నంతా ముడుపుకట్టిన కర్తవ్యదక్షునిగా, ఇంచుమించు సమస్త సాహితీ ప్రక్రియల్ని చేపట్టి, వాటికి సార్థకతనూ, సమగ్రతనూ చేకూర్చిపెట్టిన మహా విజ్ఞానమూర్తిగా జీవితాంతం కృషి సల్పిన ఋషి రెంటాల.

అందుకే, నా దృష్టిలో తెలుగు సాహిత్యానికీ, తెలుగు జాతికీ ఆయన చేసిన కృషి నిరుపమానం. ముందు తరాలకు ఆదర్శవంతం. స్థూలంగా చెప్పాలంటే… అనంత భావుకుడు, ఉన్నతాశయ ఆరాధకుడు, స్థిరసంకల్ప సాత్వికుడు, వినూత్న తాత్త్వికుడు రెంటాల గోపాలకృష్ణ. తెలుగు సాహిత్య పరిణామ వికాసంలో ఆయన స్థానం ప్రత్యేకమైనది.

*

రెంటాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెన్టాల గోపాలకృష్ణ గారి గురించి స్వర్గీయ డా.పి.వి.రమణ గారు రాసిన వ్యాసం, నాకు పితృసమానులైన మితృలు రమణ గారిని గుర్తు చేసింది.
    నేను మహబూబాబాద్ లో పనిచేసినప్పుడు, ఆయన మహబూబాబాద్, బయ్యారం లలో పని చేసారు.రచయిత గా నన్ను ఎంతగానో ప్రోత్సహించే వారు.ఎన్దరో సాహిత్య కారుల గురించి, వారి రచనల గురించి చెబుతుండేవారు. వారి రచనలు కొన్ని నాకు బహుకరించారు.
    అఫ్సర్, ప్రసేన్,శ్రీనివాస్, అయిలయ్య, గార్ల గురించి ఎప్పుడూ
    చెబుతుండేవారు .
    ఒక ప్రత్యేక మైన వ్యక్తిత్వం వున్న గొప్ప సాహిత్య కారుడు ఆయన..రెంటాల అనువాద ప్రక్రియ ను రుచిచూసిన వాళ్లలో నేనూ ఒకణ్ణి.
    ఈ… ఇద్దరికీ నా అక్షర కుసుమాన్జలి.
    డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ _506004

    • డాక్టర్ ప్రసాద్ గారు,

      మీరు మా నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ గారు రాసిన పుస్తకాలు చదివి ఆయనను గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు.

      పీవీ రమణ , రెంటాల లాంటి రచయితలూ, వారి సాహిత్య కృషి, వారి వ్యక్తిత్వం ఈ తరానికి ఆదర్శప్రాయం. 

      రెంటాల శత  జయంతి సందర్భంగా మేము ప్రచురిస్తున్న ఈ వ్యాసాలూ చదువుతున్న వాళ్ళు రెంటాల గారితో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా వారి రచనల ద్వారా గాని తమ పరిచయాల్ని, లేదా ఆ పుస్తకాల గురించి కానీ రాస్తే బావుంటుంది. 

      కల్పనారెంటాల 

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు