అంబేద్కరిజానికి ఆచరణరూపం ‘అవతలి గుడిసె’

దళిత సాహిత్యమంటే కాలక్షేపం కోసమో, కేవలం రసానుభూతికోసమో రాసే రచన కాదు. ఈ నేపథ్యంలో హిందీ దళిత సాహిత్యంలో మొదటి నవలగా చరిత్రను సృష్టించింది ‘చప్పర్‌’ నవల. దీని రచయిత జయప్రకాశ్‌ కర్దమ్‌. దీనిని తెలుగులో ‘అవతలి గుడిసె’ పేరుతో డా.వి.కృష్ణ అనువదించి అందించారు.

వేలయేండ్ల అణిచివేతను అనుభవించిన జాతులు సృజించే అక్షరాలకు పదునే కాదు, తాత్విక చింతన కూడా ఎక్కువే. గతాన్ని వర్తమానంతో సంభాషిస్తూ ముందుకు సాగుతాయి ఈ రచనలు. విశాలమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఈ రచనల్లోని అక్షరాలు పుట్టుకువస్తాయి. అందుకే దళిత సాహిత్యమంటే కాలక్షేపం కోసమో, కేవలం రసానుభూతికోసమో రాసే రచన కాదు. ఈ నేపథ్యంలో హిందీ దళిత సాహిత్యంలో మొదటి నవలగా చరిత్రను సృష్టించింది ‘చప్పర్‌’ నవల. దీని రచయిత జయప్రకాశ్‌ కర్దమ్‌. దీనిని తెలుగులో ‘అవతలి గుడిసె’ పేరుతో డా.వి.కృష్ణ అనువదించి అందించారు. స్వాతంత్య్రానంతర భారతంలో అక్షరాల బాటపట్టిన తొలితరం ప్రతినిధులకు ఉండే సంఘర్షణను ఆద్యంతం రక్తికట్టించింది ఈ నవల. గ్రామీణ కుల ఆధిపత్యాల నడుమ దళితుల జీవితం ఎంతటి దుర్భర దారిద్య్రాన్ని, కుల అవమానాలను భరించాల్సి ఉంటుందో కళ్లకు కట్టిందీ నవల. అదే సమయంలో చదువు వల్ల మాత్రమే దళిత జాతికి విముక్తి లభిస్తుందనే విషయాన్ని ఈ నవల చెప్పకనే చెబుతుంది. ఆ చదువు కూడా కేవలం వ్యక్తిగతమైంది కాదు. సామాజిక ప్రయోజనాన్ని కోరి ఒక మార్పు కోసం తమ చదువును వినియోగించాలనే సందేశాన్ని కూడా అందించింది ఈ నవల.

ఈ నవలలో కథా నాయకుడు చందన్‌. ఆ ప్రాత ద్వారా రచయిత ఈ విధంగా పలికిస్తాడు. ‘‘మనతో పాటు సమాజ ఉద్దరణ మరియు అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించడం జీవిత లక్ష్యంగా ఉన్నప్పుడే మన చదువుకు సార్ధకత ఉంటుందని అంటున్నాను. తరతరాలుగా మన సమాజం దాస్య బంధనాలలో మగ్గుతోంది. ఖాళీ కడుపులు, నగ్న శరీరాలు, పూరిగుడిసెలలో జీవనం గడిపే దుస్థితి. ఇదే మన సమాజం యొక్క వందలు వేల సంవత్సరాల యథార్థం. మనం చదువుకున్నాం. కానీ, మన సమాజం, చుట్టాలు, బంధువులు అందరు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. వారందిరి చూపులు మన వైపే ఉన్నాయి. మనమే వారి గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు’’అంటాడు. ఈ నవలలో ఇలాంటి వెంటాడే వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కాలాతీతమైన ప్రబోధకాలు. ప్రతీ దళితుడు తనను తాను ఈ నవలలో చూసుకునే ఇతివృత్తంతో ఇది రచించబడింది.

స్వాతంత్య్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేండ్ల తరువాత కూడా మన దేశ అక్షరాస్యత ఇంకా అరవై ఐదుగానే ఉంది. మరి ఇందులో దళితుల అక్షరాస్యతను తీసుకుంటే కనీసం యాభై కూడా దాటదు. ఇలాంటి జాతులు బాగుపడడానికి ఉన్న అవకాశాలు చాలా పరిమితం. పేదరికానికి తోడు దళితులను నిత్యం వెంటాడే కులవివక్ష ఈ నవలలో పలు సందర్భాల్లో రచయిత స్పష్టంగా చిత్రించాడు. అసమ విలువలకు, అన్యాయాలకు, కుల ఆధిపత్యాలకు కేంద్రమైన గ్రామీణ భారతంలో దళితులు చదువుకొని ఎదగడాన్ని అగ్రవర్ణాలు సహజంగానే హర్షించరు. ఏదో ఒక విధంగా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడతారు. ఈ అవతలి గుడిసె నవలలో కూడా కథా నాయకుడైన యువకుడు చందన్‌ తల్లిదండ్రులు సుఖ్ఖా, రమియాలు. వీరికున్న ఏకైక సంతానం చందన్‌ చదువుకోవడానికి పట్నానికి వెళుతున్నాడని తెలిసి ఆ ఊరి అగ్రవర్ణాలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతాయి. తమ పిల్లలు కూడా చదవని చదవులు ఒక అంటరాని మాదిగవాడి కొడుకు చదవడం ఏమిటని ఆ ఊరి పూజారి, భూస్వామి చందన్‌ తండ్రిని సూటిపోటి మాటలతో వేధిస్తారు. అయినా సరే చదువుతోనే తమ బతుకులు మారుతాయన్న అచంచల విశ్వాసం చందన్‌ తండ్రిది. అందుకే కడుపేదరికంతో ఆకలితో సహవాసం చేస్తూనే చందన్‌ను మాత్రం పై చదువులకు పట్నానికి పంపించడం ఆదర్శనీయం. ఈ రకమైన నేపథ్యం చాలా మంది దళిత కుటుంబాల్లో ఉన్నదే. ఎన్నో కష్టాలున్నా సరే చదువే ప్రపంచంగా ఎదిగిరావడం తప్ప దళితులకు మరో మార్గం లేదు. ఆ విధంగా పట్నం చేరుకున్న కొడుకు తన కుటుంబం తన మీద పెట్టుకున్న ఆశలనుగానీ, తన సామాజిక బాధ్యతను గానీ ఏనాడు పక్కన పెట్టింది లేదు.

ఇక్కడే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన బోధించు, సమీకరించు, పోరాడమన్న ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది. పేద తల్లిదండ్రుల కష్టాలు దూరం చేయడం కోసం చదువుల బాటపట్టిన కథానాయకుడు తాను చదవడమే కాదు, తన చుట్టు ఉన్న వారందరికీ చదువు చెప్పే పనిని విజయవంతంగా చేస్తాడు. అట్లా సమాజంలో పేదల బతుకుల్లో చదువు ద్వారా నే మార్పు లభిస్తుందని, తాను ఒక టీమ్‌ను తయారు చేసుకొని బసీల్లో అక్షరాల వెలుగులు పంచుతుంటాడు. ఇది ప్రతీ దళితుడు చేయాల్సిన పని. దీనినే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ‘‘పే బ్యాక్‌ టు ది సొసైటీ’’అని చెప్పాడు. అంటే తమ జ్ఞానాన్ని, సమయాన్ని, డబ్బును తమను అందించిన సమాజానికి తిరిగి చెల్లించాలనే మాట ఈ నవలలో కథానాయకుడు ఆచరించి చూపిస్తాడు. ఈ విధంగా ఈ నవల దళిత విద్యావంతులకు కర్తవ్యబోధ చేసింది. తాము చేయాల్సిన పని ఏమిటి. ఏ విధంగా తమను నమ్ముకున్న జాతులు సామాజిక వివక్షతల నుండి బయటపడగలుగుతుందనే విషయాన్ని రచయిత ప్రతీకాత్మకంగా వర్ణించాడు.

తరాలుగా పీడనను అనుభవించిన జాతులు విద్యావంతులయ్యి, ఉద్యోగాల్లో చేరిన తరువాత తమ స్వార్థం తాము చూసుకుంటారు. దీనికి కారణం తమ సామాజిక బాధ్యతను విస్మరించడమే. అందుకే ఇలాంటి నవలలు కేవలం అలరింపజేయడం వరకే ఆగిపోవు. ఆలోచింపజేస్తాయి. తమ ముందున్న విధి నిర్వహణను, బాధ్యతను విడమరిచి చెప్తాయి. అంతటి శక్తి ఈ నవలలోని వస్తువుకు, ఇతివృత్తానికి ఉంది. గౌతమ బుద్ధుడు చెప్పిన మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘపరివర్తన సాధ్యమవుతుందన్న మాట ఈ నవలలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. వేలయేండ్లుగా గూడుకట్టుకున్న కులాధిపత్య భావనలను బద్ధలుకొట్టడానికి చదువును మించిన ఆయుధం లేదని నిరూపించింది ఈ నవల.

ఈ నవలలో కథానాయకుడు చందన్‌ తన గ్రామాన్ని వదిలి పైచదువుల కోసం పట్టణానికి తరలి వెళ్లడం కూడా అంబేద్కర్‌ మహాశయుడు ఇచ్చిన పిలుపును అందుకోవడమే. గ్రామం మనల్ని ఎదగనివ్వదు. దళితులు, క్రిందికులాలు పట్టణాలకు తరలినప్పుడు మాత్రమే వారికి అనేక అవకాశాలు లభించి విముక్తి లభిస్తుందన్న బాబా సాహెబ్‌ మాటల్ని ఇట్లా చందన్‌ పాత్ర రూపంలో చిత్రించడం కూడా రచయిత యొక్క చారిత్రిక జ్ఞానానికి నిదర్శనం. ఈ నవలలోని పాత్రల పేర్లు తప్ప మిగిలిన వర్ణనలు, సన్నివేశాలన్నీ తెలుగు నవలగానే పాఠకుల మనసులకు స్ఫురింపజేస్తాయి. అంత చక్కగా ఈ నవలను తెలుగీకరించిన డా.వి.కృష్ణ గారి అనువాదశైలి పఠనసౌలభ్యాన్ని పెంచింది. సాధారణంగా అనువాద నవలలతో ఇతర భాషా పాఠకులు మమేకం కావాలంటే అది అనువాదకుని యొక్క నైపుణ్యం, చేయితిరిగినతనం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే అనువాదకుడు మూలరచనలోని వస్తువుతో ఎంత వరకు మమేకమయ్యాడు అనేది కూడా అనువాదం తేటతెల్లం చేస్తుంది. ఆ విధంగా ఈ అవతలి గుడిసె నవలకు జవజీవాలను అందించారు అనువాదకుడు. అంబేద్కరైట్‌ దృక్పథం కలిగిన దృష్టికోణంతో నవల యొక్క మూలాలను పట్టుకోగలిగారు. అందుకే తెలుగు దళిత్‌ నేటివిటీకి అనుగుణంగా అనువదించి సఫలీకృతులయ్యారు. ఇంతటి మంచి నవలలను ప్రచురించి పాఠకులకు చేరువ చేసిన ఛాయా  పబ్లిషర్స్‌ కూడా అభినందనీయులు. ఈ నవల ప్రతీ దళితుడు, దళితేతరులూ చదవాలి. తమ మీద ఉన్న సామాజిక బాధ్యతను గుర్తించాలి. అందుకు ఈ నవల ఎంతగానో ఉపయోగపడుతుంది.

*

పసునూరి రవీందర్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్సలెంట్ విశ్లేషణ తమ్ముడు ,హిందీ మూలానికి తెలుగు అనువాదం చేసిన ఆచార్య కృష్ణగారు.
    అనువాదానికి తగిన విశ్లేషణ అద్భుతంగా రాశావు తమ్ముడు దళితులకు చదువు ఎంత అవసరమో వివరించిన విధానం సూపర్భ్ ,చక్కని విశ్లేషణను పబ్లిష్ చేసిన తరంగా అంతర్జామాసపత్రికకు అభినందనలు

  • Writings comes from heart that’s why it’s motivate Many Very Grateful and Thank full to you Bavagaru Jai Bhim this is Ellandula Anil

  • Great effectively towards responsible community……for
    “Pay back to the Society”-
    The Strong Community…….

  • మంచి పుస్తకాన్ని అనువదించిన క్రుష్ణ గారికి సమీక్షించిన మీకు అభినందనలు సార్

  • చాలా బాగుంది మీ వ్యాఖ్యానం . కృష్ణ గారు ఎంచుకున్న టైటిల్ హైలైట్.కథలోకి తొంగి చూడకనే పరమార్థం తెలుపుతుంది.కాలం చేసిన గాయాలకు కట్లుకట్టి ఈకాలం అంబేద్కర్ లకు వెలుగు దివిటీలై నిలుస్తాయి మీ అక్షరాలు. సూపర్ అన్నా.

    • థాంక్యూ డియర్ చిట్టియ బ్రదర్.

  • అధికారులుగా, పాలనలో భాగస్వాములుగా, విద్యా వంతులైన అనగారిన వర్గాలకు చెందిన, ప్రగతిశీల భావాలు కలిగిన ప్రతి ఒక్కరు చదివి ఆచరణలో పెట్టవలసిన నవల.

  • ఎక్సలెంట్ ఆర్టికల్ తమ్ముడు ,మూల కథా రచయితకు ,అనువాదకులు ఆచార్య కృష్ణా సర్
    కు ,నీకు జై భీమ్ ,విలువైన విశ్లేషణను పబ్లిష్ చేసిన సారంగ వెబ్ పత్రికకు ధన్యవాదాలు

    • అన్నగారు ధన్యవాదాలు. ఇష్టమైన రచయిత స్పందన మరింత సంతోషాన్ని ఇస్తుంది.

  • అన్నా బాగుంది అవతలి గుడిసె విశ్లేషణ. ఇతివృత్తం కొంచెం వేరయినా చందన్ పుట్టి పెరిగిన వాతావరణం , ఊరి పెద్దమనుషుల మనస్తత్వాలు అన్నీ మీ “తురుంఖాన్’ కథని తలపిస్తున్నాయి.
    ఒక మంచి నవలని పరిచయం చేశారు , ధన్యవాదములు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు