ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మని అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయడం, ఆ తర్వాత అదే విషయంపై తనతో చర్చించడం నాకు అలవాటు. ఫలానా విషయం నేను ఇలా ఆలోచిస్తున్నానుగా, మరి ఆ విషయంపై అమ్మ వివరణేంటో తెలుసుకుందామన్న కుతూహలం నాది.
మొన్నామధ్య అమ్మకి, నాకు ఓ విషయంలో పొంతన కుదరలేదు. “నాకు చిన్నప్పటి నుండి అమ్మమ్మ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, తాత, మామయ్య అంటూ మీ వైపు చుట్టాలందరూ తెలుసు. కానీ నాన్న వైపు చుట్టాల్లో తెలిసింది చాలా కొద్దిమంది. వాళ్ళని కూడా వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకలా?” అని అడిగాను. “ఏమో! అదలా జరిగిపోయింది. మీ నాన్న వైపు చుట్టాలు ఎక్కువగా మనింటికి వచ్చేవాళ్ళు కాదు, ఒక్క మీ అత్తమ్మ మినహా. మనమూ ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు” అంది అమ్మ.
నాకిప్పటికీ గుర్తు, చిన్నప్పటి నుండి మాకు ఏ సెలవులున్నా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. కాదు.. కాదు.. అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేది. ఈ పుస్తకంలోని ‘చినుకులు’ కథ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఒక స్త్రీ పెళ్ళయిన తర్వాత తన పుట్టింటికి వెళ్ళడానికి ఎందుకంత ఇష్టపడుతుందో చెప్తుంది.
ఈ ఒక్క కథే కాదు, ఈ ‘మైక్రో కథలు’ పుస్తకంలోని చాలా కథలు నేను ప్రత్యక్షంగా చూసినవి, ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నవి. అవన్నీ ఇలా పుస్తక రూపంలో చూడటం ఒకలాంటి ఆనందం. ఇందులోని ప్రతి కథా ఏదో ఒక సమయంలో మనకు అనుభవంలోకి రావడం ఖాయం. ‘అండర్‌వేర్’ కథే చూడండి! నాకు తెలిసిన ఒక చుట్టాలతను ఉన్నాడు. వయసులో నాకంటే చాలా పెద్ద. చిన్నప్పుడు వాళ్ళింటికి వెళ్ళా. అతను బయటే నీటి గోళెం దగ్గర స్నానం చేస్తున్నాడు. ఒంటి మీద అండర్‌వేర్ మాత్రమే ఉంది. అదే స్థితిలో మూత్రవిసర్జన చేస్తున్నాడు. అప్పటికి నేను పిల్లాణ్ని. ‘ఛీఛీ! ఏంటిది?’ అన్నాను. అతను నవ్వుతూ “ఆ.. మనం పిండేదేమైనా ఉందా? మీ ఆంటీనేగా ఉతికేది” అన్నాడు. ఆరోజు ఆ సంఘటన సాధారణంగా తోచినా ‘అండర్‌వేర్’ కథ చదివాక తెలిసింది ఆ పరిస్థితుల్లో ఆడవాళ్ళ బాధ ఏమిటో! వాళ్ల మనసు ఎంత క్షోభ పడుతుందో!
ఈ పుస్తకంలోని అంశాలన్నీ నిత్యజీవితంలో మనకు చాలా చిన్నగా తోచే విషయాలే! ఈ కథల పరిణామం లాగే మైక్రోగా అనిపిస్తాయి. వాటిని కథలుగా చదివి చూశాక, ఆ ప్రభావం మనపై పెద్ద స్థాయిలో పడుతుంది.
ఇందులోని ప్రతి కథా మనకొక షాకింగ్ మూమెంట్ లాంటిది. ‘నవ్వుతున్న దెయ్యం’ కథ మనల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. మన పిల్లల్ని కొత్త వ్యక్తుల దగ్గరికి పంపాలంటే మనసొప్పదు. పెళ్లి తర్వాత మంచితనపు ముసుగులో మగవారు ఆడవాళ్ళని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ‘ఎర్రరంగు గుర్తులు’, ‘దేహ రాజకీయం’ కథలు చదివితే తెలుస్తుంది.
అమ్మలు అవసరాన్ని బట్టి అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. చిన్నప్పుడు మనకు చదువు చెప్పే టీచర్, వంట చేస్తున్నప్పుడు చెఫ్, బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే స్నేహితురాలు, జబ్బు చేస్తే డాక్టర్.. ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు. ఇంట్లోని అందరి బాగోగులు చూస్తుంది అమ్మ. మరి ఆ అమ్మ బాగోగులు చూసేదెవరు? ఎప్పుడైనా ఆలోచించామా? మనలో ఈ ప్రశ్నలు రేకెత్తించే కథలు ‘హెల్త్ కంప్లైంట్’, ‘ఆడయంత్రం’, ‘పిల్లలున్న తల్లి’.
మన చుట్టూ సమాజం, చుట్టాలు, ఇరుగుపొరుగు వాళ్ళు ఆడవాళ్ల జీవితాలని నియంత్రించాలనుకోవడం మనకు తెలిసిందే! ఆ పరిస్థితిపై నిరసన తెలిపే కథలు ఇందులో ఉన్నాయి. ‘ఛాయిస్’, ‘పెళ్ళికాని మనిషి’, ‘కటింగ్ షాప్’ కథలు చదవండి. స్త్రీకి చుట్టూ ఎన్ని గీతలు గీయబడ్డాయో, వాటిని దాటడానికి తనెంత పోరాడాలో అర్థమవుతుంది.
కొన్ని విషయాలు స్త్రీలకు తప్ప ఇతరులకు అర్థం కావు. అలాంటి విషయాలని చర్చిస్తాయి ఈ పుస్తకంలోని ‘టీపొడి’, ‘అనుమానం’, ‘దాహం’, ‘ఇన్‌సెక్యూర్డ్ మెస్కులినిటీ’, ‘కొత్త రుచి’ కథలు. ‘పుట్టింటి పేరు’, ‘అమ్మకూతురు’ కథలు భవిష్యత్తు హెచ్చరికలు. ఆడవాళ్లు గడప దాటి బయటికి వచ్చిన ప్రతిసారీ ఎదుర్కొనే సమస్యను అందరికీ తెలిసేలా చేసిన కథ ‘ఉగ్గబట్టుకున్న అంకెలు’.
పెళ్లయిన తర్వాత స్త్రీకి తను అనుకున్న జీవితం దొరకకపోతే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో , ఆమె ఆలోచనల అంతరంగం ఏ తీరాన్ని తాకుతుందో వివరించే కథలు ‘రాయని రాతలు’, ‘వర్షాసమయం’, ‘ప్రేమంటే ఏమిటంటే’, ‘స్విఛాఫ్’. మగవాళ్ళ తరఫున రాసిన రెండు, మూడు కథలు ఇందులో ఉన్నాయి. అవీ తెలుసుకోదగిన విషయాలే! ‘జెంటిల్‌మెన్ లవ్’ మన అమ్మానాన్నల ప్రేమకథ. నేడు మన చుట్టూ ఉన్న ప్రేమికులని, ప్రేమికులం అని అనుకుంటున్న వాళ్లందర్నీ ఆలోచింపజేసే కథ ఇది.
ఈ పుస్తక ముఖచిత్రంపై ఒక స్త్రీ మౌనంగా, దీర్ఘాలోచనలో ఉంటుంది, మా గురించి మీరు కాస్త ఆలోచించరూ అన్నట్టు. ప్రతి కథకు మొదట్లో ఉన్న బొమ్మలోనే కథ అంతా ఉందంటే నమ్ముతారా!? కథ పూర్తయ్యాక మరొకసారి ఆ బొమ్మ చూడండి. ఏ బొమ్మకూ స్పష్టమైన ముఖం ఉండదు. కథల్లో ఏ పాత్రకూ పేరు ఉండకపోవడం మరో విశేషం! ఈ కథలు ఏ ఒక్క స్త్రీ గురించో కాదు. స్త్రీలందరి గురించి. అలాంటప్పుడు ఒక పేరు, ఒక మొహం ఇవ్వడం కుదరని పని.
రచయిత విశీ(సాయివంశీ) ఈ కథలు రాసేటప్పుడు ఏమనుకుని రాశాడో గానీ, ఇవి చదివాక ప్రతీ స్త్రీ తనని తాను చూసుకుంటుంది ఆ కథల్లో. ఒక అబ్బాయి దృష్టికి వచ్చిన విషయాలే ఇన్ని ఉంటే, ఒక స్త్రీ తన సమస్యలు, అంతరంగాన్ని చెప్తే ఇంకెన్ని విషయాలు మనకు తెలుస్తాయో!
ప్రతీ స్త్రీ గొంతెత్తి తన సమస్యలు చెప్పగలిగే అలాంటి ఒక రోజు వస్తే బాగుండు! అలా రావాలని కోరుతున్నాను.
*
Add comment