అందమైన పాటలా ఆమె ప్రయాణం!

ఇంతలో తలుపు కొట్టిన శబ్దం అయ్యింది. రాణీ”కౌన్ కౌన్”అని అరిచిందట. “మై హూ లత” తలుపు అవతలనుండి సమాధానం వినగానే లేడిపిల్లలా చంగునా ఎగిరి గంతేసి తలుపు తీసింది రాణి.

మెదేమన్నా మధురమైన గాత్రమా, ఆవిడదేమన్నా కవ్వించే గొంతుకా..కాదే..మరి అందరూ ఆవిడ పాటలను ఎందుకు మర్చిపోలేకపోతున్నారు…అదేకదా ఆవిడ ప్రత్యేకత.. అదో గమ్మత్తైన గొంతు..!

ఆవిడ సంగీతం నేర్చుకోలేదు. స్వరజ్ఞానం, సంగీతజ్ఞానం రెండూ లేవు. ఏదైనా రాగం వినిపించి అడిగితే ఆ రాగం ఏమిటో చెప్పలేదు.

ఇవేవి ఆవిడను గాయనిగా చేయలేదు. లక్కపిడతలతో బొమ్మలపెళ్ళిళ్ళు చేయవలసిన చిన్న వయసులోనే స్టేజ్ మీద సరదాగా పాటలు పాడేది. అది హాబీ కూడా కాదు. విన్నపాటను విన్నట్టుగా-వున్నపాటను వున్నట్టుగా పాడటమే ఆవిడలోని ప్రతిభ. అసాధారణమైన ధారణాశక్తి ఆమెకు భగవంతుడిచ్చిన వరం. చిన్న పిల్లలకు పాడితే అచ్చం వాళ్ళు పాడినట్టే వుంటుంది, ఒక మెలొడి పాడితే దానికి తగ్గట్టుగానే ఆ గొంతు మృదువుగా సాగి పోతుంది, క్లబ్ సాంగ్ పాడితే గిలిగంతలు పెట్టి కవ్విస్తుంది. అదే ఆవిడ గాత్రం ప్రత్యేకత. ఆవిడది చాల విశిష్టస్వరం.

అందులో ప్రేమా ధ్వనిస్తుంది, పసితనం ధ్వనిస్తుంది, చిలిపితనం ధ్వనిస్తుంది. వెరసి..ఆమె గాత్రం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది మనకు. ఆవిడలోని ప్రతిభను గమనించిన చాలామంది ప్రత్యేక కార్యక్రమాలకి, సభలుసమావేశాల్లోను చిన్నారి రాణితో స్టేజ్ మీద పాడించేవారు. అలా మొదలైన రాణీ స్వరప్రస్థానం పెద్దవాళ్ళ దృష్టిలో పడింది. అదృష్టం ఆవిడ ముంగిట రంగవల్లులేసింది.

ప్రఖ్యాత నటి,నర్తకి వైజయంతిమాల మద్రాసులోని అన్నామలై మన్రాంలో చేసిన నృత్యప్రదర్శన కార్యక్రమంలో చిన్నారి రాణి “హృదయ్ సే పూజా కరో” అనే మీరాభజన్ పాడింది. ఆనాటి ఆకార్యక్రమానికి వచ్చిన ప్రఖ్యాత సంగీతదర్శకులు సుబ్బురామన్ రాణీ పాటవిని మర్నాడే తబలా, హార్మోనియంతో వెళ్ళి రాణిని శృతిలయలతో ఒక పాట పాడమని అడిగారు. మనరాణీ అవేమిటో నాకు తెలియవనేసింది. అయినాసరే సుబ్బురామన్ ఒక పాట పాడమని అడిగారు. అప్పుడు రాణీ ఒక విషాద గీతం ఆలపించింది. ఆపాట విని ముగ్ధుడైన సుబ్బురామన్ “సరే రేపు కారు పంపిస్తాను వచ్చేయ్” అని వెళ్ళిపోయారు. మర్నాడు రాణీకి విషమ పరీక్ష..పాడటానికి వెళ్ళిన రాణీకి తమిళపాట ఇచ్చారు. ఆమెకు తమిళం రాదు. కాని వాళ్ళు రాసి ఇచ్చినదాన్ని యధాతధంగా జిక్కితో కలిసి పాడేసింది. ఆచిత్రంపేరు”పారిజాతం”. ఆమె మీద నమ్మకంతో మర్నాడే ఆమెతో మరో పాట పాడించారు సుబ్బురామన్. అప్పుడు ఆమె వయసు కేవలం 8 సంవత్సరాలు.

ఆ తరువాత ఆయన సంగీత దర్శకత్వంలోనే “ధర్మదేవత” ఈచిత్రానికిగాను రాణీతో 4 పాటలు పాడించారు. వాస్తవానికి ఆపాటలు వేరే గాయనీమణీతో పాడించారు సుబ్బురామన్. ఆవిడ గొంతులో ఆయన ఊహించిన హుషారు, చురుకుదనం లేకపోయేసరికి తిరిగి అవే పాటలను చిరంజీవి రాణీతో పాడించారు.(ఆవిడే స్వయంగా చెప్పారు)..

ఇక “ధర్మదేవత” చిత్రంలో రాణీ పాడిన పాట “లంబాడి లంబాడి లంబ ” పాట (లలితపై చిత్రీకరణ) రికార్డింగు జరుగుతుండగా విన్న విజయ పిక్చర్స్ అధినేత నాగిరెడ్డి ప్రత్యేకంగా “ఆ అమ్మాయితో పెళ్ళిచేసి చూడు చిత్రంలో  పాడించమని ఆర్డర్ వేసారు. అలా పిల్లలకు రాణీ ఎన్నో పాటలు పాడారు..చిరంజీవులు,తోడికోడళ్ళు మరెన్నో–

రాణీకి వరుసగా అవకాశాలు రావటంతో ఇంటిదగ్గరే ట్యూటర్ ని పెట్టుకోని తమిళం, కన్నడం,

తెలుగు, హింది, మలయాళం, ఇంగ్లీష్ మొదలైన భాషలు నేర్చుకొన్నారు. ఏకసంథాగ్రాహి కావటంతో త్వరత్వరగానే అన్నిభాషల మీద పట్టు ఏర్పడింది..

ఆరోజుల్లో పాటల రికార్డింగు గురించి  చెప్తూ “ఆరోజుల్లో ఉదయం 9 గంటలకల్లా కారు వచ్చేది వెళ్ళగానే మాకు ఓస్వీటు, హాటు పెట్టేవారు. పాలు అలాంటివి ఇచ్చేవారు. రోజూ ఒక్కలైను నేర్పించేవారు. స్కూల్ పిల్లలలాగే వెళ్ళి సరదాగా పాట నేర్చుకుండేవాళ్ళం. ఒక్కోసారి 15 టేకులు, 16 టేకులు కూడా తీసుకున్నరోజులున్నాయి” అన్నారు రాణీ ఆరోజుల్లోని జ్ఞాపకాలను తలుచుకుంటూ–

మిగతా సింగర్స్ అందరూ తనకంటే పెద్దవారే అవటంవల్ల చిన్నపిల్లని కొందరు పట్టించుకోకపోవటం, కొందరు ముద్దు చేయటం గురించి చెబుతూ -తనని చిన్నపిల్లని చిన్నచూపు చూసేవాళ్ళని బాగా ఏడ్పించేదాన్నని, చాలా అల్లరి చేసే దాన్నని చెప్పారు.

ఆ తరువాత చరిత్ర సృష్టించిన  “దేవదాసు” ఆవిడ స్వర ప్రస్థానంలోనే ఎంతో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాకు శ్రీకారం చుట్టినప్పటినుండి పరిశ్రమలో ఎందరో ఆచిత్ర యూనిట్ ని ఎగతాళి చేయటం, ఈసినిమా తప్పనిసరిగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని జ్యోతిష్యం చెప్పటం….ఇన్ని బాలారిష్టాలమధ్య సినిమా తయారవుతోంది. మన సుబ్బురామన్ ఉన్నాడే మహాఘటికుడు పార్వతికి రాణీ తోటి పాడిస్తానన్నాడు. వేదాంతం రాఘవయ్యగారికి ఇష్టంలేదు. ఎవ్వరైనా ప్రొఫెషనల్స్ పాడించాలని ఆయన అభీష్ఠం. కాని సుబ్బురామన్ నిర్ణయానికి డి.ఎల్.నారాయణ మద్దత్తు పలికారు. విషాదంతో గుండె బరువెక్కి పాడే ఈ పాటలు ఈ బుడ్డపిల్లతోనా అని కొందరు ముక్కున వేలేసుకొన్నవాళ్ళు కూడా లేకపోలేదు. మరికొందరైతే లోలోపలే ఈసినిమా పోవటానికి వాళ్ళగొయ్యివాళ్ళే తవ్వుకుంటున్నారని సంతోషపడ్డవాళ్ళు లేకపోలేదు.

మొత్తానికి పాట రికార్డింగ్ మనచిట్టితల్లి రాణీ ఘంటసాల గారితో పాడాలి. గొంతు పెగలదే…ఘంటసాలగారి గంభీరమైన విగ్రహాన్ని చూసి రాణి భయపడి  పోయింది. ఎంతనచ్చచెప్పినా ససేమిరా మామూలు పరిస్తితికి రాలేదు. మన సంగీత దేవుడి (ఘంటసాల)`సంగతి తెలుసుగా ఆయన ఎంతో సహనంగా ఎదురుచూస్తున్నారు ఆ అమ్మాయి మామూలు పరిస్తితికి వస్తే పాటపాడి వెళ్ళిపోదామని– చూసీ చూసీ సుబ్బురామన్ ఘట్టిగా అరిచేసాడు.  “ఏం ఘంటసాల ఏమన్నా పులా..నువ్వు ఇప్పుడు కనుక పాడకపోయావో పైన ఫాన్ ఊడదీసి నీనెత్తిమీద పడేస్తా” అనటంతో దెబ్బకి పాడేసింది రాణీ. అక్కడ జరుగుతున్న ఈ గందరగోళం చూసి”ఆ అమ్మాయి పాడలేదు వేరేవాళ్ళతో పాడిద్దాం” అని అక్కడున్నవారు కామెంట్ చేస్తే మన సుబ్బురామన్ ఈగో హర్ట్ అయింది. కాదేంటి మరి..సంగీత దర్శకుడిగా ఆయన నమ్మకం ఆయనది. ఆసినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు. దేవదాసు అంటే అక్కినేని-పార్వతి అంటే సావిత్రి. అలాంటి అద్భుతమైన సినిమాలో పాడే అవకాశం రావటం రాణీకి ఆ దేవుడు ఇచ్చిన వరం.

సుబ్బురామన్ మీద ఎంత నమ్మకమున్నా అంత చిన్నపిల్లని చూసే సరికి ఘంటసాల గారికి సందేహం వచ్చే వుంటుంది. ఆ పిల్ల సత్తా తెలిసిన ఘంటసాల గారు ఆ తరువాతికాలంలో తాను సంగీతదర్శకత్వం నెరిపిన ఎన్నో చిత్రాల్లో రాణీకి అవకాశాలిచ్చారు. ఇక సావిత్రి సంగతి చెప్పనఖ్ఖర్లేదు. సావిత్రి కూడా నివ్వెర పోయిందటా రాణీని చూసి..ఇంతచిన్నపిల్లా నాకు పాడేది..అని ఎగాదిగా చూసిందట. ఈ చిత్రానికి సంబంధించిన ఓ గమ్మత్తైన సంఘటన రాణీ చెప్పారు.

“దేవదాసు”ప్రీవ్యూ వేసారట..సినిమా అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు..రాణీ ఒక్కతే కూర్చోని ఏడుస్తోందిటా..వెళ్ళబోతున్న అక్కినేని వెనక్కివచ్చి “ఏయ్ పిల్ల ఏమిటి ఇక్కడ కూచోని ఏడుస్తున్నావ్” అని అడిగారట. దేవదాసులో నాగేశ్వరరావు చచ్చిపోయాడండీ అని బిగ్గరగా మళ్ళీ ఏడ్చిందట. అప్పుడు అక్కినేని “నేనే ఆ దేవదాసు బతికేవున్నాను ముందు కళ్ళు తుడుచుకో” అన్నారట. మళ్ళీ అచిన్ని బుఱ్ఱలో ఓ సందేహం..”ఇప్పుడేగా తెరమీద చూసాను.అందులో నుండి ఎలా వచ్చారు?” అని అడిగింది మన అమాయక రాణి. ఆయన రాణీ నెత్తిమీద చిన్నగా ఒక్కటేసి “పదా ఇంటికి” అని ఇంటికి పంపించారట.

అలాగే మరో సారి  అక్కినేని, సావిత్రి దగ్గరకి వెళ్ళి ఆటో గ్రాఫ్ అడిగిందిటా. కాయితమేది అనడిగారట. తనదగ్గర రూపాయి నోటు వుంటే అది ఇచ్చిందట. సావిత్రి ఎడమచేత్తో సంతకం చేసేసిందిటా. అక్కినేని మాత్రం రాణీ చేయి లాక్కోని “ఐ లవ్..” అని రాసారట. దానితో రాణీ హడలిపోయి అమ్మో నాగేశ్వరరావ్ నన్ను లవ్ చేస్తున్నాడు అనుకుందిట. వెంటనే దానిపక్కనే “ఆర్ట్” అని రాసి “ఏం పిల్లా భయపడ్డావా”అని నవ్వేసారట. తనకు మరపురాని అత్యంత ప్రియమైన జ్ఞాపకాల్లో ఇదొకటి అని చెప్పారు. “దేవదాసు” సృష్టించిన చరిత్ర మాపేర్లను తెలుగు సినిమా చరిత్రలోను, అటు ప్రేక్షకులలోను శాశ్వతం చేసింది. కానీ నాకు ఇంత పేరిచ్చిన సుబ్బురామన్ గారు లేకపోవటం నాకు ఎంతో బాధను కలిగించే విషయం అన్నారు రాణీ. అలాగే సుబ్బురామన్ గారి తరువాత ఎన్నో అవకాశాలిచ్చిన ఘంటసాలగారు “దేవదాసు” 1975 లో విడుదలై హైదరాబాద్ లో శతదినోత్సవం జరుపుకున్నప్పుడు ఆ సభలో ఘంటసాల గారు లేకపోవటం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు.

ఘంటశాల గారి మాతృమూర్తి

నిప్పులు కడిగే సదాచార సంపన్నులైన ఘంటసాల గారి కుటుంబంలో తానూ ఒక పిల్లలా మెలిగానని వారిపిల్లలందరితో పాటు అన్నం కలిపి ఘంటసాలగారి తల్లి అన్నం నోట్లో పెట్టటం “ఆ తల్లి హృదయ సంస్కారానికి నిదర్శనం” అన్నారు. తనజీవితంలో మరచిపోలేని కుటుంబం ఘంటసాలగారి కుటుంబం అన్నారు.

ప్రముఖ హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఘంటసాల ఇంట్లో బస చేసినప్పుడు రాణీ పాటను విని “నువ్వు మంచిగాయకురాలివి అవుతావు. నీకు మంచి భవిష్యత్తు వుంది” అని  ఆశీర్వదించారని, అటువంటి పెద్దలెందరి దీవెనలే తన గానానికి రక్ష అనిచెప్పారు రాణీ.

పి.లీల గారిని అక్కా అక్కా అని పిలిచేవారట రాణి. “నువ్వు బాగా పాడుతున్నావు సంగీతం నేర్చుకోకూడదా” అని సలహా ఇచ్చి ప్రోత్సహించడంతో లీల దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకొంది రాణి.

కాని ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాకే తనకు పాటలు పాడటమంటే భయం మొదలయిందట. అంతకుముందు ఎటువంటి సంకోచంలేకుండా పాడమనటం ఆలశ్యం హాయిగా పాడేసేదాన్ని…కానీ కాలక్రమేణా లీలగారి ప్రోత్సాహంతో, సహకారంతో కచేరీలు కూడా చేసే స్థాయికి ఎదిగాను. కచేరీలు కూడా చేసాను” అన్నారు రాణీ.  ఎవరైనా గాయనీ, గాయకులు తమలోని ప్రావీణ్యానికి ఈశాస్త్రీయ సంగీతంతో సాన పెట్టటం వల్ల చాలా ఉపయోగం వుంటుంది”  అని అన్నారు రాణీ. 

అసలు రాణీకి పాట అంటే ఇష్టం ఏర్పడటం కేవలం లతాజీ వల్లనే– గాయని లత అంటే రాణీకి పిచ్చి..ఎంతంటే..”She is my mother, Guru everything” అంటూ కళ్ళు మూసుకోని ఒక తన్మయావస్థలోకి వెళ్ళి ఒక సంఘటన గురించి చెప్పారు..1958లో లతాజీ మద్రాస్ వచ్చి ఉడ్ లాండ్స్ హోటెల్ లో బస చేసినప్పుడు రాణీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకోని”మా `ఇంటికివస్తారా”అని ముద్దుగా అడిగింది మనరాణి. “అలాగే వస్తానని”అన్నారట లతాజీ. అంతే గాల్లో తేలి తేలిపోయింది రాణీ. మర్నాడు ఇంటిదగ్గర ఎదురు చూస్తూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. సాయంత్రం 7 అవుతోంది లతాజి రాలేదు. ఎదురుచూస్తున్న రాణీని ఇంట్లో అందరూ ఆట పట్టించసాగారు. ఇంత చిన్నపిల్లవి నువ్వు పిలవగానే అంత పెద్ద సింగర్ వచ్చేస్తుందని ఎలా అనుకున్నావ్….అంటూ ఎగతాళి చేయసాగారు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం అయ్యింది. రాణీ”కౌన్ కౌన్”అని అరిచిందట. “మై హూ లత” తలుపు అవతలనుండి సమాధానం వినగానే లేడిపిల్ల చంగునా ఎగిరి గంతేసి తలుపు తీసిందిటా .నిజంగానే ఎదురుగుండా శ్వేతవస్త్రధారిణి లత సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవే నన్ను ఆశీర్వదించటానికి వచ్చిందా అన్నట్లు చిఱునవ్వుతో నిలబడి వుంది. నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను ఆవిడ లోపలికి అడుగుపెట్టగానే ఆవిడ కాళ్ళమీద పడిపోయి భోరునా ఏడ్చాను.”ఏంటది..పిచ్చిపిల్లా రాననుకున్నావ్” అని దగ్గరగా తీసుకున్నారు. ఇంకా నేను ఆవిడను కావలించుకోని వెక్కిళ్ళుపుట్టేలా ఏడుస్తుంటే’ముందు వెళ్ళి మొహం కడుక్కురా ఇలా ఏడ్చేటట్లయితే నిన్ను కూడా నాతో తీసుకెళ్తా” అన్నారట లతా జీ. వాళ్ళకుటుంబ సభ్యులతో పాటే కింద కూర్చొని వారి ఆతిధ్యాన్ని స్వీకరించి శెలవు తీసుకున్నారట. లతా మంగేష్కర్ తో పాటు సంగీతదర్శకులు మదన్ మోహన్ కూడా వున్నారట. లతాజీకి వెండి కృష్ణుడి విగ్రహం, కలకత్తా కాటన్ చీరె బహూకరించారట రాణీ. ఇది ఇప్పటికీ తన మనసులో అలా ముద్రించుకుపోయిన మహాద్భుత సంఘటన “ అని చెప్పారు రాణీ.

రాణీ ఖచ్చితంగా కారణజన్మురాలనే అనుకోవాలి. దానికి తార్కాణం ఈ సంఘటనలే. భారత రాష్ట్రపతి డా: సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు రాష్ట్రపతి భవన్ లో పాడి ఆయన ప్రశంసలతోపాటూ ఆయన ఆశీసులు పొందిన భాగ్యశాలి. 1955 లో ఆనాటి మదరాసు రాష్ట్ర(తమిళనాడు)ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ రాణీకి బంగారుకృష్ణుడు వున్న బంగారు గొలుసును బహూకరించటమే కాక”మెల్లిసై రాణి”అనే బిరుదు ప్రదానం చేశారు.

రాజగోపాలాచారి-రాజాజీ సమక్షంలో పాడి ఆయన మెప్పు పొందారు. ఆయన రాణీని “నీకు చాలా ఉజ్జ్వలమైన భవిష్యత్తు వుంది” అని ఆశీర్వదించారట.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య శతజయంతి ఉత్సవాలు బెంగళూరులో జరిగినప్పుడు కర్ణాటక ప్రభుత్వంవారు ఏర్ఫాటు చేసిన ప్రత్యేకప్రత్యేక విమానంలో ఘంటసాల, ముఖేష్, ప్రముఖ కథక్ కళాకారులు గోపీ కృష్ణ, జెమిని గణేశన్, సావిత్రి, ఇక సంగీత విభావరికి ఎస్.జానకి నేను వెళ్ళాం. నాకంటే ఎందరో సీనియర్ సింగర్స్ వున్నా ఆదృష్టం నన్నే వరించటం ఓకలలా వుంటుంది“ అనేవారు రాణీ.

సింహళ భాషలో దాదాపు 15 చిత్రాలకు పాడిన రాణీ. శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించిన భారతీయ వనితగా తనపేరు తొలివరసలో వుండటం తనకెంతో ఆనందం కలిగించే విషయం అనేవారు. ఈజాతీయగీతాన్ని పాడించినవారు ప్రముఖ సినిమా సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి.  ఉజ్బెక్ భాషలో పాడిన తొలి భారతీయ మహిళగా కూడా గౌరవం రాణీకే దక్కింది.

మదరాసులో షిప్పింగ్ వ్యాపారంలో వున్న తమిళ ముస్లీములు హనీఫా వారు ఏర్పాటు చేసిన ఎన్నో కార్యక్రమాల్లో ముఖేష్, తలత్ మొహమ్మద్ మొదలైన ప్రముఖగాయకులతో ఎన్నో హిందీ పాటలు పాడేవారు.  వరంగల్ మెడికల్ కాలేజ్ ఆర్ధిక సహాయం కోసం ఘంటసాల, రాణీ, స్వర్ణలత సంగీత కార్యక్రమాలు చేసేవారు. కడపలో రాణీ, ఘంటసాల ప్రోగ్రాంస్ చేసారు. మద్రాస్ ఇంజనీరింగ్ కళాశాల ధన సహాయార్ధం రాణీ ఒక పాటల ప్రోగ్రాం చేసారు. మదరాసులో ఒక పాటల ప్రోగ్రాంలో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, నర్గీస్, ముఖేష్ ప్రముఖులు పాల్గొన్నారు. రాణీ “జిస్ దెస్ మే గంగా బెహతీహై”చిత్రంలో “ఓ మైనే ప్యార్ కియా”…రాజ్ కపూర్ సంగం చిత్రంలో “మై క్యాకరు రాం ముఝే బుడ్డ మిల్ గయా” పాటలు పాడినప్పుడు రాజ్ కపూర్ రిథంస్ వాయించారు.

మరో సందర్భంలో మదరాస్ వాహినీ స్టూడియోలో రాణీ, ఘంటసాల కార్యక్రమానికి రాజ్ కపూర్ హాజరయ్యారు. “దీదార్”చిత్రంలో రాణీ పాడిన “ఓఓ బచపన్ కి రులా న దేనా” అన్న పాటకు ముగ్ధుడై రాజ్ కపూర్ రాణీ మెళ్ళో పూలమాల వేయబొతే ఆవిడ భయపడి పారిపోయింది. “అలా పరాయివాళ్ళతో పూలదండ వేయించుకోవటం తప్పు” అన్న రాణీ మాటలకు అందరూ నవ్వేసారట.

ఇక ఆవిడకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు. రాణి అసలు పేరు ఉషారాణి. మైసూర్ దగ్గరలోని తుముకూరు పట్టణంలో 1942 లో జన్మించారు. తండ్రి పేరు కిషన్ రైల్వే ఉద్యోగి. తల్లిపేరు లలిత. ఉత్తరభారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. రాణి అప్పచెల్లెళ్ళు నలుగురు రాణి ఆఖరు పిల్ల..ఒక అన్న.

రాణీని తనరాణీని చేసుకోవటానికి సీతారామరెడ్డిగారు కొంచెం శ్రమపడ్డారు. రాణిగారి బావగారి స్నేహితులు రెడ్డి గారు. అందుకని ఆవిడ బావగారి కోసం వచ్చినట్టు రోజు రాణీగారిని చూడటానికి వచ్చేవారట. ఒకసారి తనమనసులోని మాట చెప్పారట. రాణీగారు ఒప్పుకోలేదు. మొత్తానికి మద్యవర్తిత్వం నెరిపి చివరికి బావగారే వీళ్ళిద్దరిపెళ్ళి ఖాయం చేసారట. ఈవిషయాన్ని ఆవిడ సిగ్గుపడుతూ, మురిసిపోతూ, ముసిముసినవ్వులు నవ్వుతూ` చెప్పారు.

అలా సంగీత సామ్రాజ్యంలో కొన్ని ప్రత్యేక పాటలకు రాణీ 1966 లో సీతారామరెడ్డిగారి జీవన రాణి అయ్యింది. సీతారామరెడ్డిగారి తండ్రి రావు బహదూర్ (ఆఫ్ బొబ్బిలి) జి.సుబ్బారెడ్డి, తల్లి ఓబులమ్మ. సుబ్బారెడ్డిగారు కలెక్టరుగా పని చేసారు. సీతారామరెడ్డిగారికి హైదరాబాద్ లో సదరన్ మూవీటోన్ స్టూడియో వుంది. నిర్మాతగా”సతీ అరుంధతి”-“నిజం చెబితే నమ్మరు” చిత్రాలను నిర్మించారు.

పెళ్ళయ్యాక “వస్తాడే మాబావ”చిత్రంలో పాడటానికి ఘంటసాలగారు రాణీకి కబురుపెట్టారు. ఆమె భర్త సీతారామరెడ్డిగారు అభ్యంతరం చెప్పారు. “ఇంకా సినిమాలు గినిమాలు ఏమీవద్దు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ కాలక్షేపం చేయి చాలు” అని. భర్త మాటకు ఎదురు చెప్పలేదు రాణీ. ఇంతలో కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్టు రెడ్డిగారు “సతీ అరుంధతి” సినిమా తీసేటప్పుడు రాణీగారిని పాడమని అడిగారట..అప్పుడు రాణీగారు మొహమాటం లేకుండా అడిగేసిందిట. “కేవలం ఇల్లలిబాధ్యతలు మాత్రమే చూసుకోమన్నారుగా..నేను పాడను” అని..”కాదురా ఈసినిమాలో చిన్నపిల్లకు సరిపడ Voice దొరకలేదు. మనసినిమానే కదరా పాడరా” అని బ్రతిమాలారట.  అందుకని సతీ అరుంధతి లో రెండు  పాటలు పాడారు.

ఆ తరువాత ఆఖరుగా పాడిన పాట “వస్తాడే మా బావ” చిత్రంలో జిక్కితో కలసి “తినబోతూ రుచి అడగకు-తీయని కోర్కెలు దాచకు” అనే పాట. నాకు తెలిసినంతవరకు రాణీగారి ఆఖరు పాట ఇదేననుకుంటా. ఇంకేదైనా సమాచారం వుంటే ఎవరిదగ్గరైనా వుంటే తెలియజేయవచ్చు.

ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి-మరో ఉన్నతకుటుంబంలో మెట్టి-స్వర ప్రపంచపు హద్దుల్ని చెరిపేసి ప్రతిచోటా తనదైన ముద్రవేసిన”రాణి నిజంగా రాణీయే”

జనవరిలో ఆమెను కలసినప్పుడు ఆమె పాడే స్థితిలో లేరు వస్తుంటే నెమ్మదిగా నడచి తన బెడ్ రూం కిటికీ దగ్గర నిలబడి నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ ఆవిడ పలికిన వీడ్కోలు హృదయాన్ని కలచివేసింది.

“అప్పుడు ఆమె వుంది పాడ లేదు-ఇప్పుడు పాట వుంది ఆమె లేదు”

“అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా”

రాణికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విజయ. భర్త ధనంజయ్. ఆమెకు ఇద్దరు మగపిల్లలు సిద్ధార్ధ్, భరత్. రెండో కుమార్తె కవిత భర్త ప్రసాద్. ఒక పాప పేరు సునయని, ఒక బాబు పేరు కృషి.

ఫోటోలు: విజయదుర్గ 

  *

రాణి గారి జీవన ప్రయాణం: కొన్ని దృశ్యాలు

 

పురాణం విజయ దుర్గ

5 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాటి గాయనీమణి రాణీ గారి గురించి ఆద్యంతం ఆసక్తితో చదివేటట్లుగా విజయదుర్గ గారి వ్యాసం చాలా బావుంది..
    ఈ వ్యాసాన్ని ప్రచురించి సారంగ ఆ మధురగాయనికి సమున్నత నివాళి సమర్పించింది.

  • ఆవిడ ధారణాశక్తి అబ్బురపరిచింది. వస్తాడే మాబావ చిత్రం (1977) అంటే రమారమి నలభై ఏళ్ళ క్రితం ఆవిడ చివరి పాట పాడినా ఇప్పడికీ ఆవిడ స్వరం వినబడుతూనే ఉంది. త్వరగా మరుపురానిదీ స్వరమాధుర్యం. సున్నితంగా , లలితంగా వినిపించే గాత్రం వెనుకనున్న వివరాలను చక్కగా అందించినందుకు ధన్యవాదాలు .

  • రాణి గారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలిపిన విజయదుర్గ గారి వ్యాసం చాలా బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు