కవిత్వానికుండాల్సిన ప్రాథమిక లక్షణాలంటూ కొన్నింటిని ఊహిస్తే, ‘చెప్పే విషయం ఎలాంటిదైనా చెప్పిన విధానం ప్రభావంతంగా ఉండడం’ అన్నది ముఖ్యమైనదిగా తోస్తుంది. ఆ లక్షణం మెండుగా ఉండడం వల్లనేనేమో ఈ కవిత నన్నంతగా ఆకట్టుకుంది. ఏం పెద్ద మెటఫర్లు లేవుగానీ మనసును సూటిగా తాకింది. ఏమంత కఠినమైన పదబంధాలు లేవుగానీ కంట నీరు తెప్పించింది. ఏ ఆబ్స్ట్రాక్ట్ దృశ్య చిత్రీకరణా లేదుగానీ ఇన్నాళ్లయినా అలా మనసులో ముద్రించుకుపోయింది. పోనీ చెప్పిన విషయమేమైనా ఎవరూ చెప్పనిదా ఎప్పుడూ చూడనిదా అంటే కాదు. కానీ ఏదో కొత్తదనం ఉంది. అది పెర్సెప్షన్ డిఫరెన్స్ వల్ల కూడా అయ్యుండొచ్చు అని ఎవరైనా అంటే అయ్యుండొచ్చంటాను. మొలకేత్తేటందుకు తయారుగా ఉన్న విత్తనపు పైపొర సున్నితత్వమే కారణమంటే కావొచ్చంటాను.
లోపల నిశ్శబ్దంగా సుడులు తిరిగే ఎమోషన్స్ ని కంపింపజేయగల సంగీతాన్ని విన్నప్పుడు హృదయం కరిగి కన్నీరై ప్రవహిస్తుందే, అట్లాంటి ఒక అనుభవాన్నించిదీ కవిత. చుట్టూ ఉండే లోకంలోనే యింకో లోకాన్ని దర్శింపజేసి, ఆ యింకో లోకంలోని సుఖదుఃఖాలకు – అంటే నా చుట్టూ ఉండే లోకం లోని సుఖదుఃఖాలకు నేనెట్లా కారణమవగలనో చెప్పింది. స్వాభావికమైనా లోపలెక్కడో ఏ మూలలోకో దాగిపోయిన ‘కరుణ’ను ఒకింత మార్మికంగా, ఒకింత సూటిగా పలకరించిందీ కవిత. మొదట ఒక అందమైన, ఆనందకరమైన వాతావరణం లోకి, ఆకాశం అవతలికి రెక్కలపై తీసుకుపోయీ మెల్లిమెల్లిగా ఒక మోయలేని దిగులును కలిగించింది. నిరాశ కాదు.. దిగులు. ‘అరరె’ అనిపించే దిగులు. ‘అవునుగదా’ అనిపించే దిగులు. ఆఖరిపాదం చదివేటప్పటికి హృదయం కరిగేంతటి దిగులు. కన్నీళ్లు. నిలువలేకపోయాను. ఏదో ఒకటి చేద్దామని లేవబోయాను గానీ ఏం చేయాలో తోచలేదు. కవిత ముందు మళ్లీ ఒకసారి మోకరిల్లాను. కొన్నిక్షణాల మౌనం తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి వీధిలోకి నడిచాను. నడిచాను. నడిచాను. నాకెదురుపడిన మొదటి మనిషి కళ్ళలోకి చూసి పెదాలు అప్రయత్నంగానే విచ్చుకున్నాయి. చేతుల్లో చల్లని చలనం. హృదయంలో మెత్తని సంచలనం.
మీరూ చదవండి. 2017 అక్టోబర్ రెండున ఆంధ్రజ్యోతి వివిధ లో “అంత దూరం ఎంత దగ్గర” అన్న శీర్షికతో అచ్చయిన భగవంతం కవిత.
అంత దూరం ఎంత దగ్గర
ఆకాశానికవతల ఎవ్వరికీ కనిపించని
ఒక ఊరుంది
ఇక్కడ పసిపిల్లలు నవ్వినపుడు
అక్కడ పూలు పూస్తాయి
ఇక్కడ సంతోషం పట్టలేక
స్త్రీలు నాట్యం చేసినపుడు
అక్కడ పక్షులు ఎగురుతాయి
ఇక్కడ వృద్ధులు ఆనందభాష్పాలు రాలిస్తే
అక్కడ వానలు కురుస్తాయి
ఇక్కడ ఒకరి పాదాలు మరొకరివైపు
కొంచెం దయగా కదిలినా
అక్కడి చీకట్లలో వేలదీపాలు వెలుగుతాయి
ఇక్కడ ఒక్క చీమ ఆనందంగా ఉన్నా
అక్కడి మట్టిలో పది పంటలు పండుతాయి
******
ఒకటీ అరా వానచినుకుల తుంపర మినహాయిస్తే
చాలా రోజుల్నుండి ఆ ఊళ్లో వర్షాలు లేవు.
నాలుగో ఐదో దీపాలు తప్ప
ఊరంతా నిరంతర కటిక చీకటి.
నిద్రలేచింది మొదలు
ఒక్క పువ్వూలేని చెట్టుకొమ్మల మీద కూర్చొని
ఆ ఊళ్లోని పక్షులు అంత చీకట్లోనూ
సుదూర దేశమైన
భూగోళం ఉండే దిశవైపు
రోజంతా ఆశతో చూస్తూ ఉంటాయి.
చాలా బాగుంది అన్న… నిజమే ఇక్కడ పసి పిల్లలు నవ్వినప్పుడు అక్కడ పువ్వులు పూస్తాయి👌👌👌
Thank you Ramu
Analysis bagundanna..
Thank you Harish
నిజమే
నవీన్ కుమార్ గారూ..
భగవంతం గారి సృజన
గుండెను పిండి
మనసును వెలిగించింది.
మంచి కవితను మించినది
ఖచ్చితంగా ఇది ఒక గొప్ప కవిత.