ఎప్పుడోసారి
నులకమంచం వదులైపోయినట్టు
జీవితాలు కూడా వదులైపోయి
మనం తాళ్ళు తాళ్ళుగా వేరుపడ్డామని గుర్తిస్తాం
జీవనదుల్లా ఉరకలెత్తిన వాళ్ళం
ఏ పీఠభూమి చీలిక దగ్గరో విడివడి
నువ్వో పాయా నేనో పాయా అయిపోయామని
తెలుసుకుంటాం
మనసులు ఏ మలుపు దగ్గరో విరిగి
బంధాలు నిట్టనిలువునా కూలిపోయాయని గ్రహిస్తాం
చమురున్నట్టే వున్నా
దీపం నుసిబారి
వెలుగులు ప్రవహించడం ఎప్పుడో ఆగిపోయిందనీ
ఒకే చెట్టు నీడలోంచి తప్పుకొని
చెరోవైపూ అడుగులేయడం మొదలెట్టి
ఎన్ని వసంతాలో గడిచిందనీ
ఒక పట్టాన అర్ధం కాదు
అంత సమయమూ మనకుండదు
దొర్లుకుంటూ దొర్లుకుంటూ
విచ్చుకున్న దూరాల అగాధంలోకి పడిపోతాం
మన మధ్య ఇంకా మిగిలేవుందనకున్న
యానకమేదీ మిగిలుండదు
ఆక్టోపస్ లా శూన్యం
ఎనిమిది దిక్కులనుంచీ చుట్టేస్తుంది
అల్పపీడనం కాస్తా ముదిరి
వాయుగుండమై విరుచుకుపడినాక
దరీ దాపూలేని ఎడారికేసి కొట్టుకుపోతూ
ఎప్పుడు ఎదురుపడతామో
అసలు ఎదురుపడతామో లేదో
ఒకవేళ అనుకోకుండా ఎదురుపడ్డా
అపనమ్మకం కొండచలువలా వచ్చి
మనమధ్య కూర్చుంటుందేమో తెలీదు
కుండీలో కొన్ని చిరునవ్వుల్ని నాటి
నీళ్లు పోయకుండా వదిలేసాం
మనసు నట్లు త్రుప్పు పట్టి కిర్రుకిర్రుమంటున్నా
శుభ్రం చేసి తిరిగి బిగించడమో
పాడైపోయిన వాటిస్థానే
కొత్తవి వేయడమో మరిచిపోయాం
కాసింత కందెన పోస్తే పోయేదానికి
చేతివేళ్ళు నరుక్కుని రక్తమోడాం
గుండె తీగలమీద కొన్ని మాటల తడిబట్టల్ని
ఆరేసుకుంటే సరిపోయేదానికి
నీడల్ని నిందిస్తూ కూలబడ్డాం
జీవితపు ప్రతి సందర్భంలోనూ
నటిస్తూ నటిస్తూ
సహజాతాల సేద్యాన్ని గాలికొదిలేసాం
ఇప్పటికైనా
మరీ వెనక్కెళ్లలేనంత దూరంలో అయితే ఏం లేం!
ఒకే లాంతరు చుట్టూ పుస్తకాల పురుగులమై
మసలిన బాల్యంలోకి చేరుకుని
ఒకర్నొకరం శ్రద్ధగా చదువుకుందాం
రంగురంగుల పెన్సిళ్ళతో
మన ఇష్టాయిష్టాల్ని
కలిసిపంచుకున్న కాలాల్ని
ఒకే అనుబంధాల వాక్యంలో
మనం రాసుకున్న పర్యాయపదాల్నీ
అండర్ లైన్ చేసుకుందాం.
*
Add comment