హెల్త్ కంప్లైంట్

“చాలా మంది ఉన్నట్టున్నారు. ఎంతసేపుతుందో?”

“ఎంతా! అరగంటలో అయిపోతుంది.”

కొవిడ్ టెస్ట్ కోసం పొద్దున్నే వచ్చాం. అప్పటికే పెద్ద క్యూ ఉంది. ముప్పై మందే కానీ, ఈ మధ్య ఆ మాత్రం జనాన్ని ఒక చోట చూడటం కూడా జాతరలా ఉంది.

“టైం ఎంతరా?”

“పదిన్నర మమ్మీ”

వచ్చేవాళ్లింకా వస్తూనే ఉన్నారు. సెక్యూరిటీ గార్డులు అందర్నీ దూరం దూరంగా​ నిలబెడుతున్నారు. నర్సులు వివరాలు రాసుకుంటున్నారు. డాక్టర్లు హడావిడిగా​ తిరుగుతున్నారు.

“మీ ఫ్యామిలీ వెళ్లి పేర్లు రిజిష్టర్ చేయించుకోండి సర్!”

సెక్యూరిటీ​ గార్డ్ మాటతో నాన్న రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరకు చేరాడు. వెనకాలే నేనూ, అమ్మ.

“ఫ్యామిలీ అందరికా?”

“అవును”

“ఒక్కొక్కరి పేర్లు చెప్పండి?”

“రాఘవేంద్ర​.. వయసు 48”

నర్స్ వివరాలు రాసుకుంటోంది.

“హెల్త్ కంప్లైంట్స్ ఏమైనా?”

“షుగర్ ఉంది”

“ఇంకా?”

నాన్న ఏదో చెప్పేలోగా అమ్మ అందుకుంది.

“అప్పుడప్పుడూ బీపీ పెరుగుతుంది. గుండెల్లో నొప్పి కూడా వస్తుంటుంది. మైగ్రేన్ కూడా..”

నర్స్ అన్నీ రాసుకుంది.

“తర్వాత పేరు సునీత.. వయసు 45”

“హెల్త్ కంప్లైంట్స్?”

“ఏమీ లేవు.”

అమ్మ ఏమీ​ మాట్లాడలేదు.

నా పేరు, వివరాలు చెప్పాక టెస్ట్ కోసం క్యూలో నిల్చున్నాం. ముందు నాన్న‌, వెనక అమ్మ. వెనక్కి తిరిగి అమ్మను చూశాను. ముఖాన్ని మాస్కు కప్పేసినా కళ్లతో చిన్నపిల్లలా నవ్వుతూ ఉంది.

నాకూ, నాన్నకూ టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం తయారు చేసి, క్యారియర్లు కట్టి పంపుతుంది. ఇంటి పనంతా ఒక్కతే చేస్తుంది. వచ్చీపోయే చుట్టాలకు ఏ లోటూ లేకుండా చూసుకుంటుంది. సాయంత్రాలు తలనొప్పి అంటూ జెండూబామ్‌తో తంటాలు పడుతుంది. కాళ్లనొప్పులంటూ రాత్రుళ్లు నిద్రరాక మంచం మీద అటూఇటూ కదులుతూ సతమతమౌతుంది. రెండు, మూడు సార్లు లోబీపీతో కళ్లు తిరిగి పడిపోయింది.

“హెల్త్ కంప్లైంట్స్??”

“ఏమీ లేవు”

నాన్న గురించి అమ్మకన్నీ తెలుసు. పాపం! అమ్మ గురించే నాన్నకేమీ తెలియదు. నాన్నలంతా ఇంతేనేమో?

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Andhari Nannalu ala undaru ….In fact nannaluku baga telusu ammalu Gurunchi…

  Eppudaina Adigara nannanu. Amma gurunchi EMI telusu…Amma Istalu and Kastalu …Nannaku telusu…
  Nanna okkadike telusu…

 • కొన్ని సందర్భాల్లో ఇలా జరిగి ఉంటుందేమో.. కొందరి జీవితాలలో..
  కొన్ని కుటుంబాలలో నాన్న కు అన్నీ తెలుసు..
  కానీ నాన్న భాద్యతల బరువు మూలంగా కొన్ని మర్చిపోయి ఉండవచ్చు.. కొన్ని చిన్నవే అని లైట్ తీసుకోవచ్చు…
  రెస్పాన్సిబిలిటీ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు, తనకి తెలిసిన వెంటనే.. యాక్షన్ రియాక్షన్ అన్నీ ఉంటాయ్….

  ఇక కథ విషయానికి వస్తె.. చిన్నదే అయినా లోతుగా రాశారు.. అమ్మ బాధను నవ్వులో దాచేసారు..

  భర్త మీద భార్య ప్రేమ, ఆమె భర్తను జాగ్రత్తగా చూసుకునే తత్వం అన్నీ కనిపించాయి..

  ఇలా కూడా ఉంటారేమో “నాన్న”లు.. అది నాకు తెలియ ని విషయం, దానిపై నేను కామెంట్ చేయను..

  కరోనా టెస్ట్ సంఘటనలో మరో కొత్త కోణంలో కథ రాయవచ్చనే విషయం తెలిసింది..

  ధన్యవాదములు అండి.. కథ చదివింప చేసినందుకు

 • ఎందుకో నాన్నల మీద అంత కోపం! చివరికి కరోనా కూడా సాకు అయ్యిందా నాన్న మీద కసి తీర్చుకోవడానికి. కథ రాస్తే కొంచెం స్రుజనాత్మకత ఉండాలి. ఏళ్ళ తరబడి నాన్న లను తప్పుబడుతూనే ఉన్నారు. ఇప్పుడు నాన్న లను పరిశీలించండి. ఎక్కడో ఒక్కళ్ళను చూపి నాన్నలందరూ ఇట్లాగే ఉంటారంటే ఎట్లా!

 • అమ్మ గురించి అన్నీ తెలిసినా నాన్నెందుకో మూగోడిలా ఉంటాడు….ఎందుకో తెలియాలంటే నాన్న అవ్వాల్సిందే నేమో

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు