హిస్టరీ, మిస్టరీ రెండూ కలిసిన నవల!

నైజర్ మనదేశంలోని అతి పెద్ద నది బ్రహ్మపుత్ర కన్నా పెద్దది. పశ్చిమ ఆఫ్రికాలోని ముఖ్యనది. కొంత స్వఛ్చమైన నదిగానే చెప్పుకోవచ్చు, అందువల్ల జనావాసాలూ పెరిగాయి. బెనిన్, గినియాల గుండా ప్రవహించినా తనపేరుని నైజీరియా దేశానికి ఇచ్చింది. నైజీరియా కూడా మనదేశంలానే విగ్రహారాధకులు మూలవాసులుగా ఉన్న దేశం. ప్రధాన తెగలు లేదా జాతులు మూడు, అవి ఇగ్బో, యోరుబా, హౌసా. జాతుల మధ్య రకరకాల కారణాలకి వైరాలు అక్కడా సహజం. క్రమంగా ఈ తెగల్లో ఇస్లాం, క్రిస్టియన్ మతావలంబకులు పెరిగారు. భౌగోళిక పరిస్థితులు, సహజ వనరుల మధ్య అసమానతలూ వున్నాయి. 

ఆంగ్లేయులు 1960ల్లో స్వాతంత్రం ఇచ్చి దేశాన్ని విడిచివెళ్లడం మొదలుకాగానే స్థానిక రాజకీయనాయకుల ప్రభావాలు పెరిగి ఈ అసమానతలు పెద్దవిగా కనిపించసాగాయి. వేరు వేరు ప్రాంతాలు సాంస్కృతికత ఉన్న అందర్నీ కలిపి ఒక నైజీరియా ఇవ్వడం ఇష్టపడని ప్రజలూ, వేర్పాటువాదాలూ వున్నాయి. ఇగ్బో జాతి ప్రజలు వ్యక్తిగత శ్రేష్ఠత కోసం తాపత్రయపడే జాతి. మిషనరీలు విద్యకు అవకాశాలు తెరవగానే వాటిని కొంత ఆలస్యంగా అందిపుచ్చుకున్నా వారికున్న తృష్ణ, శ్రమించేతత్వం వల్ల  చదువుసంధ్యల్లో ముందుకు వెళ్లారు. పర్యవసానంగా, అధికారంలోనూ వ్యాపారంలోనూ కళల్లోనూ  యూనివర్సిటీలలోనూ మిగిలిన వారికన్నా సహజంగా దూసుకువెళ్లారు, ఈ పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసింది. 1966 లో చిన్న ఘర్షణలు పెరిగి ఇగ్బో తెగ ప్రజల్ని సామూహికహననం చేయడం మొదలై ఆ అకృత్యాల్ని అడ్డుకోవడం కోసం ఇగ్బో మిలటరీ అధికారులు తిరుగుబాటు చేసి ‘బియాఫ్రా’ అన్న కొత్త దేశం మిలటరీ పాలనలో పుట్టుకురావడానికి కారణమైంది. ఈ దేశం 1967 నుంచి 1970 దాకా మనుగడలో వుంది, ఆ కాలం మొత్తం ఇగ్బో తెగకు మూలకేంద్రమైన తూర్పు నైజీరియా అంతర్యుద్ధాలతో రక్తసిక్తంగానేవుంది. ఈ దారుణమైన మానవహననాన్ని యూదుల జీనోసైడ్ తో పోల్చుతారు చినువా అచేబెతో పాటు ఇంకొందరు రచయితలు. 

ఈ చారిత్రక సందర్భం కేంద్రంగా చిమమాండా గోజీ అడీచే (Chimamanda Ngozi Adichie) రాసిన పుస్తకమే ‘హాఫ్ ఆఫ్ ఎ యెల్లో సన్’ (Half of a yellow Sun). ఈ శీర్షిక బియాఫ్రా జాతీయజెండా పేరు. అడీచే 1977లో నైజీరియా తూర్పు ప్రాంతమైన ఎనుగులో, ఇగ్బో తెగలో పుట్టింది. నైజీరియన్ రచయితగానే కాకుండా తన రోల్ మోడల్ గా ఎంచుకున్న చినువా అచేబె మాదిరిగా ప్రపంచస్థాయి రచయితగా అచిరకాలంలోనే పేరొంది మిలియన్ల కాపీలు అమ్ముతున్న రచయితల్లో ఒకరిగా చేరింది. ఒక కౌమార బాలిక కమ్బిలి కథ ‘Purple Hibiscus’ తో 2003లో తన రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టిన అడీచే రెండవ పుస్తకంగా తన ప్రాంతపు ఘర్షణ కథను ప్రపంచానికి చెప్పడానికి వేదికగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సగం సూరీడి కథని ఎంచుకుంది. ఇప్పటి అడీచే “We should all be Feminists” వంటి పుస్తకాలు రాసి, నిరంతరం ప్రసంగాలు చేస్తూ ఫెమినిస్ట్ ఉద్యమంలో శక్తివంతమైన ప్రభావవంతమైన మహిళగా ఎక్కువగా పేరొందితే ఈ నవలాకాలపు అడీచే తన అస్తిత్వప్రకటనగా తన పుట్టినప్రాంతపు కథను ఎంచుకున్న ఒక ఇగ్బో మహిళగా కనిపిస్తుంది. 

కథాకాలం 1960ల మొదలునుంచి చివరిదాకా. నవలని రెండు కాలాల్లో సమాంతరంగా సాగించే టెక్నిక్ తో నడిపిస్తూ కథలో కావలసిన మిస్టరీని అడీచే సాధించింది. ఈ నవలలోని ముఖ్య పాత్రధారులు ఇద్దరు కవలలైన అక్కచెల్లెళ్ళు ఓలన్నా, కైనేని; వారి భాగస్వాములు ఓడేనిగ్బో, రిచర్డ్ చర్చిల్. మొదటిజంట జీవితంలో ముఖ్యమైన భాగంగా వుంటూ కొన్నిసార్లు కథకుడయ్యేదికూడా ఉగ్వు; ఓలన్న, ఓడేనిగ్బో ల హౌస్ బాయ్. కథ మొదలైనప్పుడు ఎక్కువగా వ్యక్తులమధ్య సంబంధబాంధవ్యాల మీద వాటిలోని చిన్నా పెద్దా ఘర్షణల మీదా దృష్టి పెట్టిన రచయిత్రి నిదానంగా కథకు సంబంధించిన రాజకీయ వాతావరణాన్ని చేర్చుకుంటూ వచ్చి చివరకు యుద్ధ భీభత్సాన్ని కళ్ళముందు కడుతుంది.

కథ సంగ్రహంగా:

ఓలన్న, కైనేని ఇద్దరూ విదేశాలలో ఉన్నతవిద్య అభ్యసించిన యువతులు. తండ్రి ప్రభుత్వంలో మంచి హోదా ఉన్నవ్యక్తి తన వ్యాపారం కాకుండా. ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తులతో చిక్కటి పరిచయాలూ విలాసవంతమైన జీవనవిధానంతో బతికే కుటుంబం. ఓలన్నా లోకజ్ఞానం కొంత తక్కువగా ఆదర్శాల పాళ్ళు ఎక్కువగా కలిసిన సొగసైన మనిషైతే, కైనేని ఆకర్షణ తక్కువగా వ్యాపార, వ్యవహారదక్షత ఎక్కువగా వున్న అమ్మాయి. ఈ వైరుధ్యంతో అక్కచెల్లెళ్ల మధ్య బంధం తటస్థంగానే ఉంటుంది. ఓలన్న న్సుక్కా (Nsukka) యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఓడేనిగ్బో ప్రేమలో వుంటుంది, కథ మొదలయ్యే కాలానికి. కైనేనికి ఇంగ్లాండ్ నుంచి నైజీరియాకు వచ్చి తను చెప్పబోయే కథను వెతుక్కుంటున్న రచయిత రిచర్డ్ చర్చిల్ తో స్నేహం కలుస్తుంది. ఓ రకంగా చూస్తే కైనేని తప్ప మిగిలిన అందరూ కొంత ఆదర్శాల బరువుని నెత్తినమోసే మనుషులే. 

ఉగ్వు  ఓపి గ్రామవాసి. తండ్రీ తల్లులూ బోలెడంతమంది చెల్లెళ్ళూ, తమ్ముళ్లూ. అందరిలో పెద్దచెల్లెలు అనోలికాతో ఎక్కువ స్నేహం ఉగ్వుకి. వాళ్ళ మేనత్త ఆ పిల్లాడిని ఓడేనిగ్బో దగ్గర హౌస్బాయ్ గా చేరుస్తుంది. ఇక్కడి వస్తువులనుంచీ ఇల్లూ పరిసరాలూ తిండీ మాటలూ అన్నీ కొత్తే కానీ తనకు నచ్చుతాయి, ఏదో కొత్తలోకంలోకి వచ్చినట్టు. ప్రొఫెసర్ గారు తన ఆదర్శాల ప్రకారం పెంచడానికి ఒక పిల్లవాడు దొరికాడు అని వీలైనప్పుడల్లా జ్ఞానబోధ చేస్తుంటాడు, స్కూల్లో చేర్చడంతో పాటూ. ఓడేనిగ్బో ఇల్లు తన మిత్రబృందానికంతా ఆలోచనాకేంద్రం, ఎక్కువమంది బియాఫ్రా సానుభూతిపరులు. ప్రతీరోజూ సాయంత్రం అనేకచర్చలు జరుగుతుంటాయి ఉద్యమాల నేపథ్యంలో అనుకూలురు వ్యతిరేకుల మధ్య, ఇవన్నీ ఉగ్వూకి ప్రపంచానికి మధ్య సరికొత్త కిటికీలు. వాళ్ళ మధ్య తిరుగుతూ కావలసినవి అందిస్తూ వాళ్ళు మాట్లాడే మాటలను వింటూ ఏదో కొత్త లోకాలకు వెళ్లడం దినచర్యగా మారింది ఉగ్వూకి. కొన్నాళ్ళకి ఓడేనిగ్బోతో సహజీవనం మొదలుపెట్టి వీటన్నింటిలో కలిసిపోయిన ఓలన్న అంటే ఓడేనిగ్బో అంత అభిమానం. ఒక చిన్న కుటుంబయూనిట్ గా మారతారు వీళ్ళు ముగ్గురూ అతి తక్కువ సమయంలో. పనివాడు అనడం కన్నా వాళ్ళింట్లో పిల్లవాడిలాగే చూసుకుంటారు ఇద్దరూ. ఉగ్వూ కౌమారవయస్కునిగా ఆలోచించే అన్ని రకాల ఆలోచనలనీ ఏమాత్రం వడపోయకుండా పేరుస్తుంది అడీచే. నీసీనాచి అంటే ఒక గొప్ప ఆకర్షణ ఉగ్వూకి, ఇద్దరూ ఒకే ఉమున్నా కి చెందినవారు కాబట్టి పెళ్లి కుదరదు, కానీ తనకి ఒకసారన్నా దగ్గరవ్వాలనే ఆకర్షణ వుంటుంది. 

వ్య్తకిగత ఆకర్షణలూ వ్యక్తుల మధ్య సంబంధాలూ కుటుంబాలమధ్య సంబంధబాంధవ్యాలమీద లోతైన చర్చ చేస్తుంది అడిచే ఈ నేపథ్యంలో. రకరకాల దారితప్పడాలూ పరీక్షలూ దిద్దుబాట్లూ అయ్యాక ఓడేనిగ్బో, ఓలన్నా, ఉగ్వూ, ఓడేనిగ్బో కూతురు బేబీ ఒక కుటుంబంగా కైనేని, రిచర్డ్ మరొక కుటుంబంగా మిగులుతారు అంతర్యుద్ధ ప్రారంభానికి ముందు. వీరందరి మధ్యా వైమనస్యాలు సమసిపోయి ఒక కొలిక్కిరావడం బియాఫ్రా కలలు కలగానే ముగిసిపోయి మళ్ళీ నైజీరియాగా మిగలడంతో కథ ముగుస్తుంది. 

యుద్ధ భీభత్సాన్ని ఏమాత్రం సెన్సార్ చేయకుండా రాస్తుంది అడీచే, వ్యక్తుల ఆలోచనలు visceral గా చూపినట్టే. అందరికన్నా శారీరకంగా మానసికంగా ఉత్థానపతనాలు చూసే పాత్ర ఉగ్వూయే. ఓలన్నామామూలు నాజూకుమనిషిగా పరిచయమైనా తనకు పుట్టని బిడ్డతో పాటూ తన సాంగత్యంలో ఉన్న అందరికీ ఒక దృఢమైన మహిళగా తల్లిగా ఎదిగిన విధానం గుర్తుండిపోతుంది. కైనేని నిడివి తక్కువగా ఉన్నా గుర్తుండిపోయే పాత్ర. రిచర్డ్ పాత్ర పేరు నిజజీవితంలో కూడా బియాఫ్రా గురించి సానుభూతితో రాసిన రిచర్డ్ని గుర్తు చేయడానికే. వీళ్ళు కాక చిన్న పాత్రల్లో కూడా గుర్తుండిపోయే పాత్రలు ఓడేనిగ్బో అమ్మ, అమలా, ఓలన్నా మేనమామ, మేనత్త, ఉగ్వూ చెల్లెలు అనోలికా. స్త్రీ పాత్రల పట్ల అడీచేకి ఉన్న పక్షపాతం మాత్రం గమనించకుండా వుండలేము, ముఖ్యంగా ఓడేనిగ్బో పాత్ర ప్రయాణం దగ్గరగా చూసినప్పుడు. 

ఒక కథగా ఇది గొప్ప కథ అని చదవలేము, అట్లా అని ఒక ప్రాంతపు సాంస్కృతిక మూలాల్ని పట్టివ్వడమూ ఈ కథ చేయదు. ఒక పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు,  మనుషులలోని మంచిచెడులూ, బలహీనతలూ లాంటి అన్ని చిన్న విషయాలనూ పక్కనపెట్టి ఉత్తగా బతికివుండడం కోసం పోరాటం చెయ్యడానికి అందరూ ఏకమవడం, అప్పటివరకూ ఉన్న ఆర్థిక సామజిక అసమానతలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి అందరూ ఆరోజు గడవడానికి సరిపొయ్యే ఆహరం గురించి వెతుకులాడటం, పక్కనే బాంబింగ్ జరుగుతున్నా రెండు బాంబింగ్ ల మధ్య వ్యవధిలో కూడా రేపటిమీద ఆశతో పిల్లలకు కొన్ని పాటలో పాఠాలో నేర్పించడం, ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా రక్తసంబంధాలు మనుషుల్ని చివరికి కలపడం ఇవీ పుస్తకం చదవడానికి కొన్ని కారణాలు. ప్రపంచయుద్ధాల నేపథ్యంలోని కథలెన్నో గుర్తుచేసుకుంటాం. 

ఇదే పేరుతో సినిమాగా కూడా తీశారు. సినిమాగా ఆకట్టుకోదు,  ముఖ్య కథలోని ఒక లైన్ ని మాత్రమే చూపించడం నిడివి కారణంవల్లనైనా. చూపించిన లైన్ లో నైనా కథలో ఉన్న authenticity కనపడదు. 

*

 

సునీతా రత్నాకరం

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పుస్తక పరిచయం చాలా బాగుంది సునీత గారూ. చదవాలన్న కోరిక కలిగింది.

  • Last year అంతా అడిచీ ధ్యానంలో గడిచింది నాకైతే. Notes on grief మాత్రమే కాస్త నిరాశ పరిచింది. Things around neck కథలు అయితే ultimate. Half of a yellow sun గురించి ఎంత చక్కగా రాసారో సునీత గారూ.

    • నేనూ అడీచేని పోయినేడాది దాదాపు పూర్తి చేశాను ఉమా గారూ, ఇప్పటికి రాయడం వీలయింది. ‘నోట్స్ ఆన్ గ్రీఫ్’ చదవాలి ఇంకా. The thing around your neck గురించి నాదీ అదే అనుభవం. అన్నీ మంచి కథలు. మీ స్పందనకు ధన్యవాదాలు.

  • ఆసక్తికరంగా వుంది .చదవగలనో లేదో తెలియదు కానీ ఇలాంటి రచనలూ ,ఆలోచనలు ప్రపంచంలో వున్నాయని తెలియడడమే ఒక సంతృప్తి .చాలాకాలంగా సమాజాన్ని విమర్షించే /విశ్లేషించే రచనలు వ్యంగ్యం ,ప్రతీకలను వాడుకునేవి .
    మీ తెలుగు ఎంత సరళంగా ,స్పష్టంగా ఉందో !

    • బోలెడన్ని ధన్యవాదాలు కల్యాణి గారూ 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు