“నేను పెద్ద హాలోవీన్ ఫ్యాను ని,”
సన్నగా బాదం పప్పులాగ తెల్లగా, పేలవంగ వున్న ఫ్రాంక్ నుదురు మీద పడిన తెలుపు, రాగి రంగులతొ కలగలసిన జుట్టును చేత్తో పైకి తోస్తూ అన్నాడు. హాలోవీన్ పార్టీ ప్లాన్ చేయటానికి నా ఆధ్వర్యంలో ఉత్సాహవంతులు కొంత మందిమి మా కమ్యూనిటీ గార్డెన్లో సమావేశమయ్యాము. అది సాయంకాలమైనా సూర్యుడు ఇంకా బలంగా వెలిగిపోతూ చుట్టూ ఉన్న చెట్ల కొమ్మల మీద నుంచి మావైపు ఆసక్తిగా చూస్తున్నాడు.
అరవై పైబడ్డ ఫ్రాంక్ మొఖంలో మాములుగా ఉత్సాహం కన్నా నీరసమే కనిపిస్తుంది. కానీ హాలోవీన్ పేరెత్తగానే అతని మొహం వెలగటం సూర్య కాంతి మహిమా లేక హాలోవీన్ మహిమా అనుకుంటుండగా మళ్ళీ అతనే మూడేళ్ల పసి వాడికి పీచు మిఠాయి దొరికినట్లుగా మెరిసే కళ్ళతో అరచేతులు రుద్దుతూ,
“నా దగ్గర సాలె పురుగులు, గబ్బిలాలు, అస్తి పంజరాలు, బూజు, ఒకటేమిటి చాలా డెకరేషన్స్ ఉన్నాయి. ఈ ఏడు బహుమతులు మాత్రం పిల్లలకి బాగా నచ్చేవి కొనాలి. మన పార్టీకి తిరుగుండకూడదు!” అన్నాడు.
మరి అతను పుట్టి పెరిగింది ఈ సంస్కృతి లోనే కదామరి! చిన్నప్పట్నుంచీ హాలోవీన్ కు వేషాలు వేసుకొని ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం ఇంటింటికీ పోయి ఎవరెంత చాకొలెట్లు తెచ్చుకుంటారో అని మిగతా పిల్లలతో పోటీ పడుతూ, పిల్లలను దడిపించే ట్రిక్స్ ని చూసి ఉబ్బి తబ్బిబ్బవుతూ గడిపిన రోజుల నెవరు మరిచి పోవాలనుకుంటారు? ఫ్రాంక్ లాంటి వాళ్లు వాటిని మళ్ళీ పునరావృతం చేసుకుంటూ వాటిని మిగతా పిల్లలతో పంచుకోవాలనే తపనను కాదనేదెవరు?
ఇంతింతై వటుడింతై అన్నట్లు యూరోప్ నుంచి వచ్చిన హలోవీన్ పెట్టుబడి దారీ అమెరికా పుణ్యమా అని జనాన్ని ఉత్సాహంతో ఖర్చు పెట్టించే పండుగగా మారింది. హాలోవీన్ అభిమానులు వీర లెవెల్లో ఎంతో ఖర్చు, ప్రయాసతో వారి ఇళ్లను అద్భుత ప్రపంచంగా తయారు చేయటంతో పోలిస్తే పాపం ఫ్రాంక్ అమెరికా షాపింగ్ మతానికి చిన్న ప్రతినిధి మాత్రమే.
ఇటువంటి పండుగల పుణ్యమా అని గ్రీటింగ్ కార్డులు, పూలు, చాక్లేట్లు నుంచి కొత్తగా మార్కెట్లో వచ్చే అతి ఖరీదయిన వస్తువుల దాక ఎంత కొనుగోలు జరిగితే ఆర్ధిక యంత్రం అంత బాగా తిరుగుతుందనేదే అమెరికా మతం. ఈ యంత్రానికి గ్రీసు వేసే పండుగల్లో హాలోవీన్, క్రిస్మస్ సూపర్ బౌల్ లాంటివనుకోవచ్చు.
ఫ్రాంక్ మాటలకు ఎర్ర జుట్టు స్టెఫనీ ఉత్సాహంగా తల ఎగురేసి చేతులాడిస్తూ, “తప్పకుండా! పెద్ద వాళ్లకు హాలోవీన్ వేషాల పోటీలు పెడదాం. ఈ సారి కుక్కలకు వేసే వేషాలకు కూడా బహుమతులిద్దాం. నేను ఫ్రాంక్స్టెయిన్ కుకీలు బేక్ చేస్తాను.”
వేషం లేకపోతె హాలోవీన్ పార్టీ పార్టీయే కాదుకదా మరి! అందరి కంటే ముందు వచ్చి సాయం చేసేది కూడా స్టెఫనీ నే మరి.
“పోటీలు పెట్టటం బావుంది. అలాగయితే శ్రద్ధతో వేషాలు వేసుకొస్తారు.” టీచర్ గా పని చేసే పొడవాటి జుట్టున్న జోసెలైన్ మద్దతు పలికింది. “నేను రంగు పెన్సిళ్లు, డ్రాయింగ్ పేపర్ పట్టుకొస్తాను. ఓ, ఇంకా తినడానికి సాలె పురుగు ఆకారాలున్న కుకీలు బేక్ చేస్తాను.”
దీపపు సెమ్మెలాగా నిటారుగా ఉండి, యోగ పాఠాలు చెప్పే కరోలిన్ చేయెత్తి, అందరం తన వైపు చూసే వరకు ఆగి అప్పుడు మాట్లాడింది. ” పార్టీ కి నేను, యాడం రాలేము. మా స్నేహితులు చాల దూరం నుంచి వస్తున్నారు. మేము లంచ్ కి వెళ్తున్నాము. కానీ ముందుగా వచ్చి చాకొలెట్లు, కార్న్ హోల్ గేమ్ ఇచ్చి వెళ్తాను.”
నా చేయెత్తి, “నేను గుమ్మడికాయలు తీసుకు వస్తాను.” అని, నా ఇంటి ప్రక్కనే ఉండే లూయిస్ వైపు తిరిగి “నువ్వు ఆర్టిస్టివి కదా? ఫేస్ పెయింటింగ్ చేస్తావా?” అన్నాను.
అసలే సిగ్గుగా ఉండే లూయిస్ ఒక్కసారిగా తనను ప్లేన్ నుంచి బయటకు తోసినట్లుగా ఉలిక్కి పడి కను రెప్పలు టప టప లాడించింది. ఒక నిమిషమాగి తేరుకొని చిన్న గొంతు తో అంది, “నేనెప్పుడూ మొహాలకి పెయింట్ వేయ లేదు మరి.” కొద్దిగా అలోచించి, “కిట్ తెప్పించి ప్రయత్నం చేస్తా” అన్నది.
అమ్మయ్య ఆనుకొని, “నాకు తెలుసు, నువ్వు చేయగలవ్ ” అన్నాను.
ఐలైనర్ ఎప్పుడు చెరగకుండా ఉండే ఎమిలీ చేయెత్తి, “నేను రంగు చాక్ తెచ్చి పిల్లలచేత నేల మీద డ్రాయింగ్స్ వేయిస్తాను. గుమ్మడికాయలను తొలవటం కూడా చేయిస్తాను కానీ నాకు మంచి తొలిచే పనిముట్లు మాత్రం కావాలి ” అంది.
“సమస్యేమీ లేదు. అది నేను చూసుకుంటాను.” అని హామీ ఇఛ్చాను.
అన్నీ వింటున్న ఫ్రాంక్ తొలిచిన గుమ్మడికాయ పళ్ళు కొవ్వొత్తి కాంతిలో మెరిసినట్లుగా పళ్ళన్నీ బయట పెట్టి విప్పారిన మొహంతో “అద్భుతం!” అంటూ చేయి పైకెత్తాడు. “నేను డాలర్ ట్రీ కి వెళ్తున్నాను. నాతో ఎవరయినా షాపింగ్ కు వస్తారా?”
ఉన్న డెకొరేషన్స్ చాలక ఇంకా కొనటం అవసరమా అనుకున్నా. కానీ పండుగ వాతావరణాన్ని చెడగొట్టటం పద్దతి కాదు కనుక, “నేను వస్తాన్లే కానీ వీలయినంతవరకు ప్లాస్టిక్ వస్తువులు కొనకుండా జాగ్రత్త పడదామా మరి? ఇంకొకటేమంటే, మన దగ్గర పోయిన ఏడాది వాడకుండా మిగిలి పోయిన డెకొరేషన్స్ ఉన్నాయని మరిచి పోవద్దు.”
ఫ్రాంక్ ఒప్పుదలగా తల ఊపాడు. కానీ వాడినవే వాడె నా సంస్కృతికీ ఎప్పటికప్పుడు పారేసి కొత్తవి కొనుక్కునే అమెరికన్ సంస్కృతికీ ఉన్న పెద్ద అగాథాన్ని కలపటం తేలిక కాదని తెలుసు.
విచిత్రమేమంటే ఫ్రాంక్ తో నా మొదటి అనుభవం చిటపటలు, చిందులే. కోవిడ్ తర్వాత మళ్ళీ సామజిక కార్యక్రమాలు జరిపే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన కమిటీకి అధ్యక్షురాలిగా మొట్ట మొదటి వేడుక గురించి ఆహ్వానాలను నా మెంబర్లతో కలిసి అన్ని అపార్ట్మెంట్ లకు వెళ్లి మరీ పంచాము. ఇంటికి ఆహ్వానాలు తీసుకువచ్చి జనాల శాంతికి భంగం కలిగించటం అవసరమా? అని ఫ్రాంక్ నుంచి ఇమెయిల్. ఇది విని ఎంతో కష్టపడి పంచిన మా కమిటీ మెంబర్లకు నోట మాట రాలేదు. లోపల ఎంత తిట్టుకున్నారో చెప్ప నవసరం లేదనుకోండి.
ఫ్రాంక్ ఏ వేడుకలకు హాజరు కాలేదు. హాలోవీన్ ఎవరిని కలుపుకొని జరిపితే ఎక్కువమంది వస్తారా అని విచారిస్తే, ఫ్రాంక్ కు హాలోవీన్ పార్టీలకు విడదీయరాని అనుబంధమని తెలిసింది. ఏదయితే అయిందని ఇలా ఒక ఇమెయిల్ పంపానో లేదో ఫ్రాంక్ నుంచి ఆలా టక్కున సమాధానం – నేను రెడీ అని. వెను వెంటనే రెండవ ఇమెయిల్ లో తాను కాన్సర్ కు మందులు వాడటం వల్ల ఇదివరలో ఓపిక లేక కోపంతో అన్న మాటలు మరిచి పొమ్మనీను. చెప్పొద్దూ, నామనసు వెన్నలా కరిగిపోయింది.
అనుకున్న విధంగా ఫ్రాంక్ తో నేనే కాకుండా, స్టెఫనీతో కూడా డాలర్ స్టోర్ కెళ్ళాము. దారిలో స్టెఫెని అన్నది, “ఇవ్వాళ నా కాలీగ్ కు పుట్టిన రోజు పార్టీ జరిపాము. తనకు గులాబి రంగు ఇష్టమని కేకు, కొవ్వుత్తులు, ప్లేట్లు, స్పూన్లు, నాప్కిన్లు ఒకటేమిటి అన్నీ పార్టీ అలంకారాలు గులాబీ రంగువే! ఇక రూంలో అడుగు పెడుతున్నప్పుడు నా ఫ్రెండ్ మొహం చూడాలి! ఎంత సంతోషంతో వెలిగిపోయిందో మీరు నమ్మరు!”
“నీ పార్టీ డెకొరేషన్స్ కు తిరుగేముంది? అన్నాడు ఫ్రాంక్.
“అవును కదా!” అన్నాను. నా మెదడు మాత్రం పుట్టిన రోజు పార్టీ నుంచి వచ్చిన ప్లాస్టిక్ చెత్తను బేరీజు వెయ్యటంలో బిజీ అయిపొయింది.
స్టోర్ ముందు కారు పార్క్ చేస్తూ, ఫ్రాంక్ ” హ, హ, హ చౌక చైనా దుకాణానికి రెడీయేనా?” అన్నాడు. అది ప్రశ్నను కోండి, వెర్రి ఆనందమనుకోండి అది మీ ఇష్టం. స్టెఫనీ మాత్రం చప్పట్లు చరిచి “హాలోవీన్ షాపింగ్ కన్నా మజా ఏముంది” అన్నది. వీళ్ళ ఆనందం ఆపటానికి ఎంత కఠినమైన మనసుండాలా అని తీవ్రంగా అలోచించి, నేను పెట్టిన షరతును పూర్తిగా మరిచిపోవటమే మేలని తీర్మానించుకుని, షాపింగ్ లో సంతోషాన్ని పంచుకోవటనికి వాళ్ళిద్దరితో వడివడిగా అడుగులు కలిపాను.
ఫ్రాంక్ ముందున్న నాలుగు వరుసలు చూపి, “ఇవి జాక్ పాట్. అన్నీ కూడా పరమ చవక.” చక చక మొదటి వరసలో ఉన్న రక రకాల హాలోవీన్ సైన్ లు తిరగేస్తూ “ఎన్ని రకాలున్నాయో! ఈ “బూ” సైన్ చూసారా?” స్టెఫనీ ఒక్క అంగలో అక్కడకు చేరి, ” వావ్! అద్భుతం!” అని నా వైపు చూసింది. దగ్గరకొచ్చి ఆ ప్లాస్టిక్ మహాసముద్రంలో ప్రెస్ చేసిన చెక్కతో చేసిన వాటిని చూసి ప్రసన్న వదనంతో తలూపాను. అది చాలదన్నట్లు, నా మద్దతుగా అందులో ఒక సైన్ ను సెలెక్ట్ చేసి షాపింగ్ బండిలో పెట్టాను.
అది అవసరమా అని అడగకండి. సాన్నిహిత్యమంటే అదే మరి. మడి కట్టుకు కూర్చుంటే కుదరదు. ఆ పాటికి, ఫ్రాంక్, స్టెఫనీ ఒక నాలుగు సైన్లు బండిలో పెట్టేసి వేగంగా వాళ్ళను ఆకట్టుకొనే ఇతర వస్తువుల వైపు పరుగులు తీసారు. “అబ్బో ఇది ఎంత బాగుందో కదా!” అని ఒకరు “ఇది తప్పకుండ ఉండాల్సిందే మన పార్టీకి” అని ఇంకొకరు మొత్తం మీద రెండు బండ్లకు సరిపడా ప్లాస్టిక్ సామాను నింపారు.
తిరుగు దారిలో చూయింగ్ గం అందరికి పంచి ఒకటి తన నోట్లో పెట్టుకొని, ఫ్రాంక్ అన్నాడు “స్టెఫనీ, రేపు శని వారం. పొద్దున్న రోడ్ క్లీన్ -అప్ కు వస్తున్నావా?”
“ఎందుకు రాను? మాములే, ట్రాష్ బ్యాగులు సిద్ధంగా ఉంటాయి. తొమ్మిదింటికి కలుద్దాం.” స్టెఫనీ దిగిపోతూ అంది.
గమ్ ఇంకా నా నోట్లో కొంచెం తియ్యగా, తిమ్మిరిగా తగులుతుంటే వాళ్ళిప్పటి వరకు చేసిన షాపింగ్ కు రేపు చేసే క్లీన్ -అప్ కు పొంతన ఎక్కడా అని ఆలోచనలో పడ్డాను.
*
వినియోగదారుల సంస్కృతి అంటేనే ప్లాస్టిక్ చెత్త; భూమినీ, సముద్రాలను శాశ్వతంగా నాశనం చెయ్యడం; అనవసర కొనుగోళ్లు. ముఖ్యంగా సంప్రదాయం పేరిట ప్రదర్శన. ఈ సంస్కృతిని భద్రంగా ముందుతరాలకు అందజేస్తున్నాం. అన్ని దేశాలలోనూ ఇదే తంతు.