స్త్రీ స్వేచ్చ కోసం మిడ్కో ‘భావుకత’

క వైపు విప్లవ కథలను, మరో వైపు స్త్రీవాద కథలను జమిలీగా రాసిన రచయిత్రి మిడ్కో. మిడ్కో’ అనేది కలం పేరు. అసలు పేరు రేణుకాదేవి. ఈమె రాసిన ప్రశ్నల కొడవళ్ళలాంటి 18 కథల్ని 2007లో విప్లవ రచయితల సంఘం ‘మెట్ల మీద’ పేరుతో ప్రచురించింది. ‘మిడ్కో’ అంటే ‘మిణుగురు’ అని అర్థం. మిణుగురులాగే ఈమె కథలు కూడా మన చుట్టూ పర్చుకున్న చీకటిని కాస్తైనా తొలగించి ఏదో సన్నని వెలుతురును మన గుండె కవాటాల్లో నింపి పోతాయి. చిత్తడి చిత్తడి అయిపోయిన తెలంగాణ జీవితాన్ని, స్త్రీల జీవితాన్ని చాలా బలంగా కథీకరించడంలో రచయిత్రి కలం చాలా బలంగా సాగిపోతుంది. వీరు రాసిన ‘మెట్ల మీద’, ‘బొందజూడనైతి’, ‘ప్రవాహం’, ‘ఇద్దరు తల్లులు’, ‘తుపాకులు గుంజుకోండ్రి బిడ్డా’… తదితర కథలు ఆ రోజుల్లో సంచలనం కలిగించాయి. ఇప్పటికీ ఆమె కథల ప్రాసంగికత తగ్గలేదనే అనిపిస్తుంది. ఇందుకు మరో ఉదాహరణ ఈమె రాసిన ‘భావుకత.’

ఓ శీతాకాలపు వేకుజామున నిద్ర నుంచి మేల్కొన్న ప్రదీప్ భుజాల నిండా శాలువా కప్పుకొని కిటికీ వారగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ మైమర్చిపోతుంటాడు. “కాఫీ తీస్కోండి” అనే భార్య మాటతో బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. “రాధా ఈ కిటికీలోంచి చూడు ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో! ఆ చెట్ల ఆకులపై రాత్రి కురిసిన మంచు బిందువులు ఎంత అందంగా ఉన్నాయో చూడు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. బాలభానుడి కిరణాలు ప్రసరించగానే మంచు బిందువులు కిందికి జారుతూ ఎంత అందంగా మెరుస్తాయో చూద్దువుగాని. అసలు ప్రకృతిలోని అందాలు కనిపించేది శీతాకాలంలోనే. నాకందుకే శీతాకాలమంటే ఇష్టం.” అంటూ తన్మయంగా చెప్పుకుపోతుంటాడు. భర్త చెప్పాడు కాబట్టి రాధ కిటికీ నుండి చూపు సారిస్తుంది కానీ ఆమె దృష్టి అంతా పిల్లల మీది నుండి జారిపోతున్న దుప్పటి మీదా, వంటింట్లో స్టౌ మీద పొంగి పోతున్న పాల మీదా ఉంటుంది.

“బావుందండీ! నేనిక్కడ ప్రకృతి అందాలను చూస్తూ కూర్చుంటే ఇంట్లో పనెవరు చేస్తారు?” అంటుంది.

“అబ్బా! ఎప్పుడూ పని పని అంటావు. కాస్త ప్రకృతిని ఆరాధించడం నేర్చుకో” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భర్త మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భర్తకు ఆఫీస్ టైమ్ అవుతుండడంతో హడావుడిగా వంట చేసి క్యారేజీ కట్టి ఆఫీస్ కు పంపించి ఊపిరి పీల్చుకుంటుంది. ఈ లోపల్నే చిన్న పిల్లవాడు లేవగానే వాడి దగ్గరికి పరుగెత్తుతుంది.

ఆ రోజు హాఫ్ డే కావడంతో మూడు గంటలకల్లా ఇంటికి వస్తాడు ప్రదీప్. అతడు వచ్చేటప్పుడు ఎండగా ఉన్నా కొద్ది సేపటికి వర్షం మొదలవుతుంది. వెంటనే రాధ డాబా పై ఎండబెట్టిన పప్పులు, బట్టలు తీసుకురావడానికి వేగంగా పరుగెత్తుతుంది. భర్తను సాయం రమ్మంటుంది. “అబ్బా! ఆపవోయి నీ సొద. ఎండా వాన ఎంత అద్భుతమైన సీను. ఆ ఎండలో వర్షపు చినుకులు ఎంత అందంగా మెరుస్తున్నాయో చూడు” అంటూ తన లోకంలోకి వెళ్ళిపోతాడు. డాబా పైకి వెళ్ళి తడిసి ముద్దైన రాధ వర్షాన్ని తిడుతూ తడిసిన బట్టల్ని ఇంట్లో ఆరేస్తుంది. వర్షాన్ని ఎందుకు తిడుతావు? అంటూనే “వర్షాన్ని చూస్తూ వేడి వేడిగా ఏమన్నా తింటే ఎంత బావుంటుందో తెల్సా? అవునూ తినడానికి ఏమన్నా చేయకూడదూ? అని భార్యని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తాడు. రాధ కనీసం తడిసిన బట్టలు కూడా మార్చుకోకుండానే వంట గదిలోకి వెళ్తుంది. సాయంత్రం కూడా తెల్ల లుంగీ బదులు కలర్ లుంగీ ఎందుకిస్తున్నావంటూ భార్య మీద చిరాకు పడుతాడు ప్రదీప్.

రాత్రి పది గంటలకు పొద్దుట్నుంచి ఇంటి పనుల్లో అలసి పోయి పిల్లవాడ్ని భుజం మీద వేసుకొని జోకొట్టి పడుకోబెడుతుంది. తనకు కూడా నిద్ర ముంచుకొస్తుండడంతో వెళ్ళి పడుకోవాలనుకుంటుంది. అంత దాకా ప్రదీప్ పౌర్ణమి నాటి వెన్నెలను కిటికీ గుండా చూస్తూ రాధను పిలిచి వెన్నెల అందాల్ని వర్ణిస్తుంటాడు. కానీ ఆమె దేహం విశ్రాంతిని కోరుకుంటోంది. కను రెప్పలు మూసుకుపోతుంటాయి. “నా లాంటి భావుకుడికి నీలాంటి ఏ అభిరుచి లేని మనిషి భార్యగా దొరికింది. ఏం చేస్తాను నా కర్మ!” అంటాడు. కానీ ఆ మాటలేవీ ఆమె చెవికెక్కవు. “ఆమెకు అర్థమవుతుందొక్కటే తన నిద్రనిప్పుడు నిర్ధాక్షిణ్యంగా లాగేస్తాడనీ… ‘నిద్రపోవడం’ అనే కనీస అవసరాన్ని కూడా తను స్వేచ్చగా తీర్చుకోలేక పోతుందని ఆమెకు బాగా అర్థమవుతోంది.” అయినా నిద్రస్తుందండి అంటూ వెళ్ళి పడుకుంటుంది. అయిదు నిమిషాల్లో నిద్రలోకి, నిద్ర నుండి కలలోకి జారుకుంటుంది. కలలో పుచ్చ పువ్వులా పర్చుకున్న వెన్నెల్లో ఏకాంతంగా ఆనందంగా ఉంటుంది. ఉన్నట్టుండి నడుము చుట్టూ పాములా ఏదో స్పర్శ. మెలకువ తెచ్చుకొని చూస్తే ఆ పాము ఎవరో కాదు తన భర్తే. కనురెప్పలు తెర్చుకోవడం లేదు. అవి ఇంకా నిద్రనే కోరుకుంటున్నాయి. “ఆమె మానసిక, శారీరక స్థితుల్నేమీ పట్టించుకోకుండా, ఆమె ఇష్టాయిష్టాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా తనకు కావాల్సిందేదో తీసుకొని హాయిగా నిద్రలోకి జారుతుండగా పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తాడు. భర్త నిద్రకు ఎక్కడ భంగం కల్గుతుందోనని వెంటనే లేచి పిల్లవాడి నోటికి రొమ్ము అందిస్తుంది. నిద్ర మత్తు మొత్తం వదిలి పోయింది. కాసేపు పాలు తాగి నిద్ర పోయిన కొడుకును పడుకోబెట్టి తన భర్త రోజు మైమర్చి పోయి చూసే కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. “ఎటు చూసినా అంధకారమే తప్ప మరేమీ కనిపించడం లేదు.” ఉన్నట్టుండి తన బాల్యం, యౌవనం, పెళ్లి, పిల్లలూ అన్నీ ఒక్కొక్కటి వరుసగా జ్ఞప్తికి వస్తుంటాయి.

“ప్రకృతిని చూడటం, మానసికోల్లాసాన్ని పొందటంలో కూడా ఆడ, మగ మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించసాగింది. ఓ అయిదు నిమిషాలు తన ఇష్టానుసారంగా చల్లగాలిని పీల్చుకోవడం కూడా చాలా మంది ఆడవాళ్ళకి సాధ్యం కాదనిపించింది.. తన భర్త తనను తాను ఎప్పుడూ ‘భావుకుడు’ అని అభివర్ణించుకోవడం గుర్తొచ్చింది. నేను సరిగ్గా ఆరు గంటలకు వేడి వేడి కాఫీ ఇవ్వకపోతే తనలోని ‘భావుకుడు’ కిటికీ దగ్గరే పడి చచ్చి పోడూ” అని అనుకుంటుంది. ఆ కిటికీ దగ్గర నిలబడ్డ ప్రతిసారి తన భర్త తనకు ఏదో చెప్పాలని ప్రయత్నించడం గుర్తుకొస్తుందామెకు. సరిగ్గా తనకు కూడా అలాగే అనిపిస్తుంది. నిద్ర పోతున్న భర్త మొహం చూస్తూ ఇలా చెప్తుంది…

“మీరు సూర్యోదయాల్ని చూస్తూ పరవశించే వేళ

మీ కోసం మేం కాఫీలు కలుపుతూ ఉంటాం

మీరు వర్షాన్ని చూసి పులకరించే వేళ

మీ కొసం మేం వేడి వేడి పకోడీలు వేస్తూ ఉంటాం

మీరు చల్లని వెన్నెల్లో విహరించే వేళ

మీ కోసం మేం వంటింటి వేడిలో వంటలు చేస్తూ ఉంటాం

మీరు హాయిగా ఆదమర్చి నిద్ర పోయే వేళ

మీ పిల్లలకు మేం పాలిస్తూ జోకొడుతూ ఉంటాం”

అప్పటికే రాత్రి పన్నెడు గంటలవుతుంది. బాబోయ్ తొందరగా పడుకోవాలి. లేదంటే రేపు ఉదయమే అయిదు గంటలకు లేవలేను. రేపు అయిదు గంటలకు నిద్ర లేవకపోతే అమ్మో! ఏమైనా ఉందా కాల చక్రం స్తంభించి పోదూ అనుకుని నిద్ర రాక పోయినా పడుకుంటుంది. “తనలోని భావుకతను చంపుకొని భర్త లోని భావుకతను పెంచుతున్న ఆమెలో ఏదో తీవ్రమైన అశాంతి బయలుదేరింది. ఆ అశాంతిలో నుండే ఆమె ఖచ్చితంగా తన మార్గాన్ని ఎన్నుకుంటుంది.”

తెల్లవారుజామున మొదలైన కథ ఎప్పుడో అర్ధరాత్రి ముగుస్తుంది. ఈ ఒక్క రోజులోని స్త్రీ జీవితాన్ని ఎత్తి చూపిన రచయిత్రి అడక్కుండానే ఈ వ్యవస్థను అనేక ప్రశ్నలడుగుతుంది. భర్త సుఖం కోసం, భర్త సంతోషం కోసం, భర్త అభిరుచుల కోసం, భర్త సరదాల కోసం తన జీవితం ఎంతగా నలిగి పోతుందో చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా చెప్తుంది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్తుంటారు. కానీ ఈ కథలో తన భర్త కోసం తాను ఎన్ని సార్లు ఓడిపోతుందో చదివితే గుండె రగిలిపోతుంది. కుటుంబం కోసం మర యంత్రంలా పని చేస్తూ కనీసం స్వేచ్చగా ఊపిరి కూడా పీల్చే వెసులుబాటు దొరకకుండానే జీవితాలు ముగిసిపోవడాన్ని రచయిత్రి చాలా గొప్పగా చిత్రించింది. యుగాలుగా పురుషుడు స్త్రీని శారీరకంగా, మానసికంగా ఎలా దోపిడీకి గురిచేస్తున్నాడో ఈ కథ చాలా సున్నితంగా చెప్తుంది. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు ప్రభువు – బానిస సంబంధాలు కాదు స్నేహితుల్లా ఉండాలని చెప్తుంది. కుటుంబం కోసం సర్వం ధార పోసినా చివరికి గుప్పెడు ప్రశాంతత కూడా మిగలనితనాన్ని మన హృదయాలు కదిలిపోయేలా చెప్పిన నేర్పు అమోఘం. ఎంతో సున్నిత మనస్కురాలైన స్త్రీ సంసారపు ఇరుసులో పడి సూర్యోదయాల్ని, సూర్యాస్తమయాల్ని, వెన్నెల కుప్పల్ని, పరిసరాలను, వానా వానా వల్లప్పా ఆటల్ని, పాటల్ని అన్నింటినీ మెల్ల మెల్లగా మర్చిపోతుంది. రోజు కొంచెం తను కరిగి పోతూ కుటుంబానికి వెళ్తురు పంచుతుంది. తాను సమిధగా మారిపోయి కుటుంబ దీపాన్ని వెల్గించడానికి చమురుగా మారుతుంది. ఇన్ని చేసినా చివరికి ఏ అభిరుచిలేని మనిషిగా మిగిలిపోతుంది. పురుషాధిపత్యం, భారతీయ కౌటుంబిక ధర్మం మాటున సర్వం కోల్పోతున్న సగటు ఇల్లాలి మనో వేదన పర్చుకుంది ఈ కథ నిండా.

కథలో ప్రధాన పాత్రలు రెండే. ఒకటి భర్త ప్రదీప్. రెండు భార్య రాధ. కథంతా ఈ రెండు పాత్రల చుట్టే తిరుగుతుంది. కానీ ఒక స్త్రీ జీవితంలోని చీకటంతా కనిపిస్తుంది. కథ తెల్లవారు జామున మంచు తెరలు విడిపోతూ, ప్రభాతపు వెళ్తురు కిటికీ గుండా ఇంట్లోకి రావడంతో మొదలవుతుంది. కథ ముగింపుకొచ్చేసరికి రాధ తన జీవితంలో పర్చుకున్న అశాంతి నుండి స్పష్టమన తనదైన మార్గాన్ని ఎన్నుకుంటుంది. ఇలా ప్రారంభ, ముగింపుల మధ్య ఒక ప్రత్యేకత ప్రదర్శించిన రచయిత్రి శిల్ప దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ఇప్పటికీ కొన్ని కోట్ల జీవితాలు జీవితంలోని ఆ ‘భావుకత’ ఏంటో తెలియకుండానే ముగిసిపోతున్నాయి. అంటే ఈ కథ అవసరం ఇంకా ఉంది. ఏ రచయితైనా తాను తన కథల్లో చిత్రించిన ప్రపంచం మారి తన కథ ప్రాసంగికత పోవాలనుకుంటాడు. కాని అలా జరగక పోతే అంతకంటే దుర్భరమైన సామాజిక విషాదం మరొకటుండదు. పురుషులకే కాదు స్త్రీలకు కూడా ‘భావుకత’ ఉంటుందని అయితే అది వికసించే పరిస్థితులు కల్పించాల్సింది పురుష ప్రపంచమేనని, లేదంటే చైతన్యం నిండిన వాళ్ళు వాళ్ళ మార్గంలో అడుగు వేయడానికి వెనుకాడరనే ఒక హెచ్చరికతో ముగుస్తుందీ కథ.

 

 

 

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు