ఒకపక్కన ఊపిరి లాగేస్తున్నట్టుండాది. నరాలు జివ్వుమంటున్నాయి. యింకోపక్కన సుత్తులతో మోదినట్టు బుర్ర పోటెత్తిపోతా ఉంది. ఒక బాధతో- వేళ్లు అసలు కీబోర్డు మీద కదలడానికే మొరాయిస్తున్నాయి. యింకో బాధతో- వేళ్లు కదిలినా అక్కడ వండి వార్చడానికి తగిన విషయమేమీ లేదని చిరాకు పుడుతోంది. మొదటి బాధకు కాసేపట్లో నివారణ దొరుకుతుంది. రెండోదే మహా సలపరంగా ఉంది.
వారంలో ఇట్టాంటి ముదనష్టపు రోజులు ఒకటో రెండో తగల్తానే ఉంటాయి. జిల్లాలో ఎక్కడా ఏమీ మహాద్భుతం జరగనేలేదు. కొండమీద యెంకటేశులికి పెద్ద ఉత్సవాలేం జరగలేదు. మంత్రి లాంటివోడెవుడు జిల్లాలో కాలు పెట్టలేదు. తిరపతి రామాంజనేయులూ, చిత్తూరు క్రిష్ణయ్యా ఏం రాయలేదు. ఓ పదిమందిని మింగిన యాక్సిడెంటు లేదు. కడాకి ఒక మర్డరు గూడా లేదు. కొత్తల్లో పొద్దెరగనట్టుగా సీఎం అయిపోగానే సెంద్రబాబు స్టార్ట్ జేసిన జన్మభూమి కింద ఏదైనా కొత్త సంగతి ఉన్నా, ఎంతో కొంత రంగులు పూసి అందంగా పెట్టేయొచ్చు అదీ లేదు.
ఇంక ఏం బెట్టి నింపాల ఫస్టు పేజీ!
ములకలచెరువు బాయిల్లో మైలు దిగవన ఉండే నీళ్లు తోడి తెచ్చుకుంటున్న ఆడోళ్ల కష్టాలు, దామల్ చెరువు మేంగో నగర్లో రేటు పలకడం లేదని ట్రాక్టర్లలో లోడుని రోడ్లమీదే తిరగేసి వెళ్లిపోతున్న రైతులు, యెంకన్న దర్శనానికి ఎమ్మెల్యే సిఫారసు లెటర్లని జెప్పి, లాడ్జీల్లో నకిలీ ఉత్తరాలు వేలరూపాయలకి అమ్ముకునే దళారీలు, కాళాస్తి- పిచ్చాటూరు ఏరియాల్లో ఏళ్ల నుంచి బిల్లులు రాక రోడ్డెక్కిన చెరుకు రైతుల ఏడుపులు.. యిట్టాంటివి రెడీగా ఉంటాయి. కానీ మొదుటి పేజీ మొత్తం ఇయ్యే నింపేస్తే.. తెల్లార్లేసిన్తర్వాత మన మొహాన ఉమ్మేస్తారు.
జనం గాదులే! మన అయిద్రాబాదు పెద్దోళ్లే. ఎంత తిండిపోతు మనిసైనా దినామ్మూ బిరియానీ గావాలంటాడా? లేదు గదా! కానీ మామీద సవారీ జేసేటోళ్లు మాత్రం.. ప్రతిరోజూ ఎంతో కొంత మసాలా వాసన పడాల్సిందేనంటారు. ‘ఇంట్రెస్టింగ్, బంబార్డింగ్ ఎలిమెంట్- ఒక్కరోజు మిస్సయినా.. అక్కడితో పేపర్ని చంపేసినట్టే’ నంటారు. వార్తల్ని ‘కనిపెట్టాల, పంచిపెట్టాల’ అన్నంతదాకా ఓకే. కానీ.. ‘పుట్టించాల గూడా’ అంటేనే కొంచిం కస్టం. ఎక్స్‌క్లూజివ్, స్కోర్ ఐటెమ్‌లు ఉంటే మనకి మగతనం ఉన్నట్టు లెక్క అంటారు! అది గూడా ఓకే. కానీ, దినామ్మూ మగతనం చూపించుకోవాలంటే వల్లయ్యేదేనా? అన్నీ కలిసి రావాల గదా!
కొండ పద్మనాభానికి ఫోన్జేసినా! ‘కరువొచ్చింది సామీ’ అన్నా. ‘మీకెప్పుడు కరువొచ్చినా నాకు ఫోను గొట్టండి సార్.. నేనుండా గదా..’ అనే రొటీను డైలాగుని కంటిన్యూ జేస్తానే.. స్టోరీ సమాచారం అందుకున్నాడు. లడ్డూ తయారీలో నాణ్యతలేని నెయ్యి యేస్తండారని.. శాంపిల్స్‌కి పంపింది వేరే.. కాంట్రాక్టర్లూ, ఆఫీసర్లూ కలిసి తమ తమ వాటాలు కాజేసిన తర్వాత.. లారీల్లో వచ్చిన నెయ్యి వేరే.. అంటూ విపులంగా జెప్పినాడు. యీ సంగతి క్వాలిటీ చెకింగులో తేలినట్టుగా రిపోర్టులు గూడా మాదగ్గర ఉండాయని రాయండి సార్. ఎవురైనా నిలదీసేలోగా వాటిని నేను పుట్టిస్తాను గదా అని భరోసా యిచ్చినాడు. అంతా కలిపి ఏడాది తిరిగేసరికి కోట్లల్లో కుంభకోణం జరిగి పోతాదన్నట్టుగా లెక్క తేల్చినాడు. మొత్తానికి, ఒక సుదీర్ఘమైన కథ చెప్పేశాడు. అది న్యూస్ స్టోరీ గనక, కథ అని అంటున్నాను గానీ.. అందులోని సమాచారం కల్పితం గాదు! ఇతడింతే, బుర్రలో పుట్టెడు వార్తలు పెట్టుకోనుంటాడు. ఎప్పుడైనా అడిగితే ఒకటి విదిలిస్తాడు. రాసి పంపడు- ఫోన్లోచెప్తాడు. మనం రాసుకోవాల!
ఆ కతంతా ఎందుగ్గానీ.. ఇయ్యాళ్టికి ఫస్ట్ పేజీకి ఒక స్టోరీ వచ్చేసింది. కొంచిం నిమ్మళం. ఈలోగా, అంత గతుకు తిని రాడానికి రేణిగుంటకి పొయిన పీరు సాయిబు రానే వొచ్చినాడు. వోడి రాకకోసమే గంటనించీ నిలువుగుడ్లేసుకోని జూస్తాండా. ప్రాణం లేచొచ్చింది. పెట్టి నా ఎదుట పెట్టి, ‘గుడ్డు దోసె కింద పెట్టినా’ అన్నాడు. దాన్దేముందిలే సల్లారిపొయినాక గూడా యెళ్లి తినొచ్చు అనుకుని, పెట్టి అందుకుని ఒకటి ముట్టించినా. గుండెలంతా మబ్బుల్లా కమ్మేసే మాదిరిగా బాగా లోపలకి లాగి, కళ్లు మూసుకుని ముక్కుల్లోంచి నెమ్మదిగా బయటికి వదిలిపెట్టినాక ఒళ్లు కొంచిం నెమ్మదించింది. ఊపిరి నిదానించి, నరాలు సమ్మగవుతున్న ఫీలింగు. బుర్ర గూడా కొంచిం మామూలుగా పనిజేస్తండాది. ‘కొండనెయ్యి ఘుమఘుమల్లో కేడీగాళ్లు’ అని హెడ్డింగు జోడించి.. వాడు జెప్పిందంతా వండి వార్చాననుకో, స్కోర్ ఐటెమ్- పేలిపోతుంది.
ఇయ్యాళ స్కూటరు కిక్కు గొట్టేముందు ప్యాంటు జేబు తడుముకోలేదు. లేపోతే ఈ పాటు వచ్చేదే గాదు. దార్లోనైనా ఓ పెట్టి పట్టుకు వచ్చే వాడినే! ఈ ఆఫీసులో పొగ ముట్టించగల వాళ్లంతా గంట ఆరుకొట్టేసరికి జారుకుంటారు. ఆ తర్వాతగానీ మనం యేతెంచం. అలా ఇవాళ కరువొచ్చి పడిపోయింది. ఆఫీసులో యెవరినీ కాల్చనివ్వరు. బయటికెళ్లాల. నాకు మటుకు ఎగ్జెంప్షను. షిఫ్టు టైములో పెట్టి మొత్తం కాల్చడానికి నేను పదిసార్లూ బయటికెళ్లానంటే, ఎడిషను మునిగిపోద్దని భయం. అలాగని, కాల్చనివ్వకుండా మూతికుట్టేసినా, వెళ్లనివ్వకుండా కాలు కట్టేసినా యింకా ముంచుతానని అనుమానం. అందుకే నా ఒక్కడికీ మటుకు సీట్లో కూర్చునే ధూపం వేసే పర్మిషనుంది.
ఊదేశాక, గబగబ కొండనెయ్యి గోలంతా రాసి పారేశాను. ఘాటుగానే వచ్చింది. బంబార్డింగ్ ఐటెం అంటే ఇదీ. రేపు తెల్లారేపాటికి.. కొండదొంగల కూసాలు కదలాల. రేపంతా మన స్టోరీ గురించే మాట్లాడుకోవాల. లోపల్లోపల బుజం తట్టుకున్నాను. నెమ్మదిగా కిందికెళ్లి ఎండిపోయిన గుడ్డుదోసె తినేసి.. ఇంకో దమ్ముకొట్టేసి వచ్చి కూచున్నా.
నైట్‌డ్యూటీలో ఉన్న ఫోటోగ్రాఫరు రమేషొచ్చాడు. మనోడికి చతుర్లెక్కువ. ‘మన రిపోర్టరు సెకండ్ హ్యాండ్ బండి కొన్నాడన్నా’ అన్నాడు. బాగుందా అని అడిగా. ‘చాలా బాగుందన్నా. కాపోతే.. బండెనకాల నెంబర్ ప్లేటు మీద ‘ప్రెస్’ అని కాకుండా ‘పుష్’ అని రాయిస్తే బెమ్మాండంగా పరిగెడ్తంది. పాతబండి కదా’ అన్నాడు. యిద్దరం నవ్వుకున్నాం.
‘ఇంక నిష్క్రమిస్తానన్నా’ అన్నాడు, కాసేపు ఊర్లోని చిల్లర కబుర్లు పంచుకున్నాక! ‘చేసేదేముండాది గానీ లాగించు సామీ’ అన్నా. బ్యాగు బుజానికి తగిలించుకోని వెళ్లిపోయాడు.
రొటీన్ పనిలో పడిపోయాను. నెయ్యిస్టోరీ కోసం కొండలడ్డూలు, నెయ్యిడబ్బాలూ కలిపి గ్రాఫిక్స్ చేయమన్నాను. ఫస్ట్ పేజీకి పనికొచ్చే స్టోరీలు ఇంకా ఏమున్నాయో.. నలుగుర్నీ అడిగి తీసుకున్నాను. వాటికి కొంచెం తలస్నానం చేయించి, పద్దతిగా పట్టూ జార్జెట్టూ కాస్ట్‌లీ చీరలు చుట్టి, అవసరమైన ఇంట్రోలు గట్రా రాసుకుని, పదునుగా రెండు మూడు హెడింగులు కూడా పెట్టి రెడీ చేసుకున్నాను.
డెస్కులో వోళ్లంతా చేతిలో ఐటెమ్స్ కట్టలు పట్టుకోని.. లేసి పేజీలు పెట్టుకోడానికి వెళ్లిపోయినారు. నేనూ నా ఫస్ట్ పేజీ మిగిల్నాం. కడాకి పెట్టాల్సిన తిరపతి జోన్ పేజీ చూసే రాజగోపాలు గూడా డెస్కులోనే కూర్చుని వార్తలు దిద్దుకుంటా ఉండాడు.
అప్పుడొచ్చినాడు రమేషు మళ్లీ. వగర్చుకుంటా.
‘ఏం సామీ.. ఇప్పుడేగదా పొయినావు.. అప్పుడే తిరిగొచ్చినావే.. ఏమైంది రోడ్డుమీద ఏమైనా యాక్సిడెంటా..’ అనడిగినా. యిడదల్లేకుండా.
‘ఆఫీసుకాడ లారీ యెక్కి పోతావుండాన్నా. చిత్తానూరు చీలురోడ్డు దాటి కొంచెం పొయినామో లేదో, రోడ్డు పక్కన ఒకడు పడిపోయుండాడు. ఏమైందిరాబ్బా అని లారీ ఆపించి దిగిచూస్తే.. ఏదో బండి గుద్దేసుండాది. ఒళ్లంతా దెబ్బలు. రోడ్డుమీదే అంచులో పడుండాడు. ఏం జరిగిందో ఏమో అనుకుంటానే నాలుగు ఫోటోలు దీస్కున్నా. కొంచిం దూరం నడిసి ముందుకు పొయ్యేసరికి ఎదురుగా ఇద్దరు బీటు కానిస్టేబుళ్లు వొస్తావుణ్నారు. వాళ్లకి విషయం జెప్పితే ‘మేం అలిపిరి పోలీసులబ్బా.. నువ్వు జెప్పిన ఏరియా రేణిగుంట లిమిట్సులోకి గదా వొస్తాది. మేమేం జేసేది’ అని యిదిలించుకోని సక్కా బొయినారు. నేను మాత్రం జేసేది ఏముందని, యింకో లారీ పట్టుకోని యెనక్కి తిరిగి ఆఫీసుకొచ్చేసినా..’ అన్నాడు ఆత్రంగా.
‘బుద్దుందా లేదా సామీ.. వోణ్ని ఆస్పత్రికి యేస్కోని బోవాల గదా’ అన్నా.
‘బలే జెప్పినావులేనా’ అన్నాడు యెగాదిగా చూసి.
‘వోర్నీ! వోడెవుడో బతికుండాడా లేదా?’ అనడిగినా.
‘బతికే ఉండాడ్లే. ఫస్ట్ పేజీగాదు, జోన్ పేజీకే’ అన్నాడు. నన్ను జూసి నవ్వు సగంలో ఆపి.
‘ఛఛ అందుగ్గాదులే గానీ, ఆ మనిసి కాడ్నేకాసేపు నిలబడి ఏదో ఒక బండి కనిపిస్తే ఎత్తి రుయాకి యేస్కోని పొయ్యుండాల గద సామీ. ఫోటోలు తీస్కోని పరిగెత్తుకుంటా యిట్టొచ్చినావా. యిప్పుడా ఫోటోలు యెయ్యకపోతే కొంపలేమన్నా అంటకపోతాయా’ అని కసురుకున్నా.
‘అనా. రోజుకిట్టా వంద గనిపిస్తా ఉంటాయి. అన్నీ నెత్తిన పులుముకుంటే.. రుయాస్పత్రికి షటిల్ సర్వీస్ ఆటో నడుపుకోవాల’ అన్నాడు. వాడి మాటలు పూర్తిగా చెవిలోకెళ్లడం లే. యింకో ఆలోచనేదో నడస్తాండాది లోపల.
ఎవుర్ని తరమాల? అప్పుటికి ఎవరు ఖాళీగా ఉండారు? వోడెవుడో రోడ్డుమీద ఒంటినిండా దెబ్బల్తో పడుంటే మనం ఏం జెయ్యబోతాము? అప్పుటికింకా ఆఫీసు కాడికి పేపరు జీపులు కూడా వచ్చుండవు. అయ్యొచ్చేకాడికి గంట రెండవతాది. అప్పటిదాకా ‘ప్రెస్’ అని బోర్డేసుకుని.. అయ్యన్నీ పార్టీల్ని తోలుకుంటా ఉంటాయి!
రాజగోపాల్నే కేకేసినా? మా వోళ్లలో వాడికి అప్పుటికే మోటరు సైకిలుగూడా ఉండాది. రమేష్ ని వాడికి జతగా అప్పగించినా. ‘ఇద్దరూ గబాన పోండి. స్పాట్లోకి పొయినాక, ఏదైనా బండో, ఆటోనో, బస్సో ఆపండి. ఆ దెబ్బలు తగిలినోడిని రమేష్ దాంట్లో యేస్కోని రుయాకి తీస్కోనిపోతాడు. నువ్వాడ సంగతేందో జూస్కోని, గబాన ఆఫీసుకి తిరిగొచ్చేయ్..’ అని యింకా వొంద జాగర్తలు చెప్పి పంపించినా.
వోళ్లని అంత ఉన్నపళాన బయల్దేరదీశాను గానీ, ఆ తొందర్లో గూడా- రమేష్ నుంచి వోడి ఫోటోలు ఉండే రీలు తీస్కోవడం మాత్రం మర్చిపోలా! ‘యింకో రీలుండాదా’ అని హెచ్చరించడం గూడా మర్చిపోలా.
వోళ్లలా పోగానే, బాబురాజుని పిలిచి ‘యిదిగో ఈ రీలు అర్జంటుగా డెవలప్ జెయ్యి.. ప్రింట్లు ఎయ్యబళ్లేదులే.. నెగటివ్ స్కానింగు జేయించుకుంటా.. అర్జంటు, ఫస్ట్ పేజీలో వాడాల’ అని పురమాయించినా. ‘పని కాగానే అయ్యన్నీ ఆపెయ్యబోక. యింకో రీలు గూడా వస్తాదిప్పుడు’ అని జాగ్రత్త చెప్పినా. పెట్టిలోంచి సిగరెట్టు తీసినా.
బుర్ర దిమ్మెక్కి పోయుంది. గుండె దడదడ కొట్టుకునేది నాకే తెలస్తా ఉంది. ఏందో టెన్షనుగా ఉంది. ఈ సిగరెట్టుతో అది నెమ్మదించేట్టుగా లేదు. ఒళ్లంతా సోదీనంలో లేకుండా ఉంటే నేను పేజీ ఏం పెట్టబోతాను? డీబీని పిలిచి, లడ్డూ స్టోరీ, ఇంకో రెండు వార్తలూ, వాటి ఫోటోలు ఎక్కడుండాయో చెప్పేసి.. ‘ఫస్ట్ పేజీలో అవి పెట్టేయిసామీ.. ఈలోగా వొస్తా. కొంచిం పనుండాది’ అని పంపేసినా.
చిత్తానూరు చీలురోడ్డు అంటే యీడకి అయిదు నిమిసాల దూరమే గదా. ఈ రాజగోపాలింకా రాడేంది? రోడ్డు పక్కన పడుండే వోడెవుడో యింకా బతికుండాడా? లేదా? అన్నీ ప్రశ్నలే.
అందరికీ షిఫ్టులు పూర్తయిపోయిన టైమది. అన్ని జిల్లాల డెస్కులూ కలిపితే ఈ కొస నుంచి ఆ కొసకి ఒక కల్యాణ మండపమంత పెద్దదుంటాది హాలు. అంత పెద్ద హాల్లో నేనొక్కడినే గూర్చోనుండా.. సిగరెట్టు ఊదుకుంటా. పక్కన అద్దాలగదిలో అందరూ పేజీలు పెట్టే హడావుడిలో ఉండారు. ఆ టైములో దినామూ అక్కడొక జాతర జరగతా ఉంటంది. టైముకి ప్రింటింగు స్టార్టు కావాలంటే, పేజీల్ని పూర్తి చేసే జాతర. నా బుర్రలో అంతకంటె పెద్ద జాతర జరగతా ఉండాదిప్పుడు.
ఓపాలి యిదేమాదిరిగా కోడూరులో జాతర జరిగితే మురళి వాళ్లింటికి పొయ్యి నడిరేత్రి యేళలో బస్సులో తిరిగొస్తన్నా. బస్సులో సీట్లు లేవు. డ్రైవరు పక్కనే బోయ్‌నెట్టు మీద గూచోని తూగు రాకుండా.. కళ్లు చికిలించుకోని రోడ్డు మీదికి జూస్తావుండా. మామండూరు అడవుల కాడ రోడ్డు పక్కనే కనిపిచ్చింది అది. జింకపిల్ల! ‘అనా అనా’ అనే నా కేకలకి, దాన్ని తప్పించి వెళ్తున్నవాడల్లా డ్రైవరు యే కళనుండాడో రోడ్డు వారగా ఆపినాడు. గబ గబ దిగేసరికి, బస్సులోంచి యింకో యిద్దరు గూడా దిగొచ్చినారు. యేదో బండి గుద్దేసినట్టుండాది జింకని. నెత్తురు కారతా ఉండాది. కడుపు ఎగిరెగిరి పడతా వుండాది. యింతింత పెద్ద కళ్లు భయంభయంగా జూస్తండాయి. ఇద్దరు ముగ్గురం దాన్ని పట్టి బస్సులోకి యేసినాం.
‘యిదంతా పెద్ద తలకాయ నొప్పి సార్.. పోలీసులో ఫారెస్టోళ్లో మా పేణాలు తోడతారు.. మేమే గుద్దేసినామని’ డ్రైవరు యిసుక్కుంటన్నాడు. ‘నీ మీదకి మాట రానీకుండా పోలీసులకి నేను చెప్తాను పద నా’ అంటూ దైర్నం జెప్పినా. రేణిగుంట పేపరాఫీసు కాడ దిగేసేటప్పుడు గూడా యింకోపారి జెప్పినా.. ‘పోలీసులకి ఇప్పుడే నేను ఫోన్జేస్తా.. నీకేం గాదు దైర్నంగా వుండు, జాగర్తగా తీస్కోనిబో’ అని!
ఆఫీసులోంచి.. ఈస్టు స్టేషనుకు ఫోన్జేసి సంగతి జెప్పగానే.. బస్సు తిరపతి బస్టాండుకు యెళ్లేసరికి ఇద్దరు కానిస్టేబుళ్లు గూడా వొచ్చారంట అక్కడికి. ఆ జింకని తీస్కోని బొయి యెంకటేశ్వరా జూ వోళ్లకి అప్పగించినారు.
డెవలప్ జేసి బాబురాజు నా చేతిలో పెట్టిన ఫిల్ముని, పైకెత్తి ట్యూబులైటు ఎదురుగా పెట్టుకుని జూస్తాంటే ఆ జింక పిల్లే గెమనానికొస్తండాది నాకు. దాని మాదిరిగానే, రోడ్డు అంచులో పడిపోయుండాడు ఎవుడో పాపం! ఈ పాటికి ఏమైనాడో? ఇద్దర్ని పంపితే ఇప్పటిదాకా తిరిగి రాలేదేంది? యీ చీకట్లో, ఆత్రంగా పొయ్యే స్పీడులో యీళ్ల బండికేం కాలేదు గద!
బాత్రూం కాడ నిల్చోని బాబురాజూ నేను యిద్దరమూ సిగరెట్లు ఊదతాండాం గానీ.. నాకు టెన్షను మాత్రం తగ్గడం లే.
అప్పుడొచ్చినాడు రాజగోపాలు. పరుగెత్తినట్టే. చేతిలో ఒక రీలు పట్టుకోని.
దాన్ని లాక్కుని బాబురాజు చేతికిచ్చి.. ‘రెణ్నిమిషాల్లో డెవలప్ జేసి ఫిల్ము తేవాల’ అని డార్క్ రూములోకి తరిమినా. నా మాట పూర్తిగాకుండానే.. మనోడు సగం కూడా కాలని సిగరెట్‌ని కింద పారేసి యెళ్లిపోయాడు.
రాజగోపాల్ని నాతో తీస్కోనిపొయినా. యేం జరిగిందో తెలుసుకుని, రాసుకోడానికి!
* * *
ఆనక చెప్పడానికి యింకేం పెద్దగా లేదు.
మిషన్లోకి ప్లేట్లు యెక్కిచేసి, యింకు లెవళ్లు జూస్కోని, పేపర్ రీళ్లెక్కిచేంసి, ప్లేట్ల మీద లైట్ గా వాటర్ స్ప్రేజేసి.. స్విచ్చు నొక్కితే పేపర్లు ఏ మాదిరిగా అయితే ఒకదానెమ్మట ఒకటి వేలకు వేలు వచ్చి పడిపోతాయో ఆ మాదిరిగా, మెషిను మాదిరిగా, అంతా చకచకా జరిగిపోయింది.
రమేష్ ముందే చెప్పిన సమాచారాన్ని బట్టి, అదివరకే రాసిపెట్టుకున్న వార్తకి, కొత్తగా రాజగోపాలు జత చేసిన సంగతులు కలిపి రాసుకుని, మాంచి హెడ్డింగు కూడా పెట్టేపాటికి బాబురాజు ఫిల్ముతో వచ్చేసినాడు. దాన్ని స్కానింగుకిచ్చేసి ఫస్టు పేజీ డిజైనింగు పూర్తిజెయ్యడానికి మ్యాక్ ముందర నేనే గూర్చున్నా! అప్పుటికే నేనిచ్చిన వార్తలు సర్దేసి, ముందే నేన్జెప్పినట్టుగా ఒక డీసీ ఖాళీ వదిలిపెట్టుండాడు డీబీ. గబగబా ఈ వార్తను ఫోటోల్ని అందులో సర్దేశాను. మేకప్ కూడా చాలా అందంగా చేశాను. తెల్లార్తో ఎవుడైనా సరే.. పేపరట్టా చేతిలోకి అందుకోగానే.. కొట్టొచ్చినట్టు కనపడాల.. యింకో పేపర్లో యెక్కడా అది కనిపించగూడదు. జనమంతా ‘అరె’ అనుకోవాల. ‘యీళ్లతో సమానం లేదబ్బా’ అని గూడా అనుకోవాల. యిప్పుడు పడ్డ కష్టానికంతా అదీ మజా!
పేజీ నెగటివ్‌ల్ని ప్లేట్లకి పంపేముందు ‘ఏం సార్ ఓసారి చూస్తారా’ అన్నాడు రంగారావు. ‘తోసేయ్’ అన్నా చాలా ధీమాగా.
రాజగోపాలు వొచ్చేదాకా ఎంత టెన్షను పడ్డాను? అదేం రవ్వంత గూడా లేదిప్పుడు! ‘వోడికేమయ్యిందో యేమో?’ అనే మాట- ముల్లు మాదిరిగా బుర్రని గుచ్చినంతవరకే ఆ టెన్షను. యిప్పుడది లేదు.
ఆ మాటకొస్తే.. ఈ రోజు మొదలయ్యేయేళకి.. అదేలే డ్యూటీ మొదలయ్యే యేళకి, అసలు అమ్మా అబ్బకి పుట్టిన నికార్సయిన వార్త ఒకటైనా లేదే- అని యెంత టెన్షను పడ్డాను. ఆ టెన్షను గూడా లేదిప్పుడు. నిమ్మళంగా పని పూర్తయింది. బుర్ర కూడా కుదురుగా ఉంది.
ప్లేట్లు మిషన్లోకి వెళ్లిపోయాయి. కలర్ అలైన్‌మెంట్ చెక్ చేసుకుంటండారు. స్టార్ట్ కూడా అయింది. మామూలుగా అయితే, ఫస్ట్ కాపీ బయటకి రాగానే అందుకుని, తప్పులేమైనా వొచ్చాయేమో చూస్కోవాల. ఆ పని నాకు అలవాటు లేదు. పొగరు. మా వాళ్లలోనే, ఆ పని యింకొకరు చేస్తారు. స్థిమితంగా ఉన్నాననే అనుకున్నా, బయల్దేరే ముందు కాల్చే అలవాటు లేకపోయినా, ఒక సిగరెట్టు వెలిగించుకుని.
* * *
మేం ఆడికి చేరుకునే పాటికి గంట రెండున్నరయ్యింది.
తిరపతి బస్టాండుకు దివారాత్రాల వార ఉండదు. యెంకన్నని మొక్కిపోదామని యే వేళలోనైనా జనం పోటెత్తతానే ఉంటారక్కడకి. దానికి తగ్గట్టుగా కాపీ టిఫన్ల యాపారం కూడా నిత్యాగ్నిహోత్రంగా నడుస్తూనే ఉంటంది. బస్టాండు గోడనానుకుని పొద్దుగుంకినాక మాత్తరం తెరిసి, పొద్దుపొడవగానే తోలుకుని యెలిపోయే బండిమీద వడివేలు టిఫినంగడి మాకు నడిరేతిరి అడ్డా. ఆడికి చేరంగానే.. ఉండే నాలుగు ప్లాస్టికు స్టూళ్ల మీద గూసునేది, ముందర ఓ తూటా ముట్టించేది, గుప్పుగుప్పమని ఊదడం పూర్తయ్యేసరికి తలా ఒక టీ జెప్పేది, అది పూర్తయ్యేలోగా ప్లేటు ఇడ్లీ జెప్పేది, అదీ పూర్తయినాక ఈ పెపంచికాన్ని మన బుజాల మీదనే ఏ మాదిరి మోస్తండామో- మనమిక్కడ పేపరాఫీసులో పేపర్ని అచ్చొత్తించకపోతే దేశం ఏ రీతిగా అగచాట్ల పాలైపోతందో- ఆ రకంగా యిష్ణుమూర్తిలాగా యేసు ప్రబువు లాగా మనం ఏ రకమైన అవతార పురుషులమో- కాసేపు మాట్టాడుకునేది! ఈ రోజువారీ కోలాటం తప్పదు. ఈలోగా ఆఫీసులో మేం ఉద్దరించిన పేపరు అచ్చుసింగారం ముగించుకోని జీపులో రయ్యిన ఆడికి వచ్చేస్తంది. ఆటిని సక్కంగా సర్దుకోని ఊరిమీదకి పంచడానికి పేపరు ఏజెంటు, వాడి మందీమార్బలం సహా సిద్దంగా ఉంటాడు. వాడినుంచి ఓ పేపరు పుచ్చుకుని, ఆఫీసులో మేం బెట్టిన వార్తల్నే మళ్లీ ఓసారి చదువుకుని, మా బుజాలు మేం చరుచుకుని, మా కుచాలు మేం మర్దించుకుని, మామూలు జనానికి చీదర పుట్టించే లోకంలోని రాజకీయాలన్నీ మా ఒళ్లంతా పులుముకుని, బా-గా లోతుకు వెళ్లి మాట్లాడుకోవడం- ఆనక వదరడానికి యే చెత్తా లేదని ఖరారైపొయినాక, తలా యింకో టీ లాగించేసి ఎవుడి కొంపకు ఆడు వెళ్లిపోవడం ఇదీ మా దినచర్య.
ఆ రాత్రి మేం బండ్లు స్టాండ్లేసే టయానికి ఇడ్లీ గుండాం మూత తీస్తండాడు వడివేలు. అప్పటికి బండిచుట్టూ కస్టమర్లు ముసురుకోలేదు. అక్కడుండే ప్లాస్టికు స్టూళ్లన్నీ ఆక్రమించి కూచున్నాం. వాయ దిగింది. ఇడ్లీ తట్ట బయటకి తీసి కాసిని నీళ్లు చిలకరించి.. దాని మీదున్న గుడ్డతో సహా, పొగలు కక్కుతున్న ఇడ్లీల్ని స్టీలు డీసులోకి బోర్లిస్తూ ‘సారూ తొలీత తలా ఒక ప్లేటు ఇచ్చేయమందురా’ అన్నాడు వడివేలు. చూడబోతే, ఆ డీసు పక్కన సాంబారు డేగిశా గూడా పొగలు గక్కతానే ఉంది. ‘సరే కానీ’ అన్నా.
‘సాంబారు మట్రుం సారూ.. చెట్నీ ఇంకా రుబ్బనేలేదు..’ అన్నాడు ప్లేట్లు అందిస్తూ. మాకు కావాల్సిందీ అదే. వడివేలు సాంబారు టేస్టు, శరవణా భవన్లో గూడా ఉండదు. అందుకే ‘యెన్నాప్పా వడివేలూ, ఆ మాత్తరం సర్దుకోమా’ అంటూ ప్లేట్లు అందుకున్నాం. వేడివేడి యిడ్లీ, సాంబారుతో. ఆ ప్లేట్లు ఖాళీ అయ్యేదాకా ఎవురూ కూతెత్తలా! ఆనక నిమ్మళంగా ఒక సిగరెట్టు ముట్టించి మొదలెట్టినా.
‘ఇయాళ మన పేపరు జూసి మిగిలినోళ్లంతా పిసుక్కుని చచ్చిపోవాల’ అంటా.
‘అంత లావు పనేం జేసినావు దొరా’ అన్నాడు బాబురాజు.
‘ఫస్టు పేజీలో మనం యేసిన స్టోరీ వుంది జూశావా. దిమ్మ తిరిగే స్కోరు’
‘నేను చదవలేదులే దొరా. అదేందో జెప్పరాదా’
‘నువు డెవలప్ జేసిన ఫోటోలు అవే గదా. బంబార్డ్ అయిపోతందంతే..’
‘డెవలప్ జేస్తే యేంది? ఆటి చెరిత్రంతా నాకు తెలస్తాదా?’ ఎదురు ప్రశ్నేసినాడు.
‘వోడెవుడో యాక్సిడెంటయి రోడ్డు పక్కన దెబ్బల్తో పడుండినాడు సామీ. ముందర ఆ ఫోటోలే గదా వొచ్చినాయి. రెండోసారి మనోళ్లని తరిమి తోలినా గదా’
‘యింతకీ బతికిచ్చినావా? సంపేసినావా?’
‘ఆ చాన్సు మనకెక్కడ మిగిలింది సామీ. ఈలోగా ఎన్ని బండ్లు తొక్కేసినాయో ఏమో? నుజ్జునుజ్జయి పొయినాడంట.’
‘రామచంద్రా..’ షాకులో ఆ మాటనేసరికి బాబురాజు నోట్లో సిగరెట్టు గూడా కిందపడిపోయింది. నా పాటికి నేను చెప్పుకుంటా పొయినా..
‘తొలీత అట్టే అనిపించిందిలే నాగ్గూడా. ఆ సంగతి యిడిసిపెట్టి, ఫస్టుపేజీలో స్టోరీ వాయించేశాన్లే! ‘మావోడు జెప్పినప్పుడే పోలీసోళ్లు కదిలుంటే వోడెవుడో గానీ యిట్టా సచ్చేవోడేనా? పోలీసోళ్లంత ఎదవలు యింకెవురూ ఉండరు. మా లిమిటు యీడదాకనే, అది దాటినాక బూమి బద్దలైపోయినా మాకు అక్కర్లేదని గిరిగీసుకుని పన్జేస్తే యెట్టా?’ అని ఉతికారేసాన్లే’
బాబురాజు ఏం మాటాళ్లేదు. చేతిలో టీ సల్లారిపోయింది. దాన్నట్టా కలతిప్పి ఒక గుక్కలో అరవోళ్ల మాదిరిగా ఎత్తి నోట్లో పోసేసుకున్నాడు. నన్నడిగే యింకో సిగరెట్టు తీస్కోని అంటిచ్చుకున్నాడు. లోపల ఏం మంట మండతా ఉండాదో ఏమో. ఒక నిమిషం సేపు ఈ పొగని దానిమీద కప్పెట్టినాడు.
‘మీ రమేషుని మెట్టుతో గొట్టాల’ అన్నాడు పొగ బయటికి వొదల్తా వొదల్తా!
పొగ తెపరాయించుకోలేక దగ్గొచ్చింది. ‘ఏం సామీ’ అన్నా.
‘తొలీత జూసినప్పుడే.. ఆడ్ని కొంచిం రోడ్డు పక్కకి లాగేసునుంటే బతికుండును గదా.. అన్నేయంగా జంపేస్తిరే’ అన్నాడు.
నేను పెద్దగా నవ్వాను. ‘అదేందో మేమే మర్డరు జేసినట్టు మాటాడతండావే బాబురాజూ. కొంచెం తాళుకో. అట్టాజేసుంటే యిట్టాజేసుంటే అనుకుంటా గూసుంటే కుదర్దు. అదెట్టో ఒకట్టా జరిగిపోయింది. కానీ మనం పేపర్లో బీభత్సంగా స్కోరు జేసినామా లేదా? నడిరేత్రి కాడ సీమ సిటుక్కుమన్నా గూడా యీళ్లకి యెట్నో ఒకట్ట తెలిసిపోతందబ్బా.. అని మిగిలిన పేపరోళ్లంతా పిసుక్కు చస్తారా లేదా’ నా తీర్మానం నేను జెప్పినాను.
బాబురాజు మాటాళ్లేదు.
‘సచ్చినోడు యెటూ సచ్చినాడు. మనం మాత్తరం సెరిత్రలో మిగిలిపోయే స్కోరు గొట్టినాం. యాక్సిడెంటయి గాయాల్తో పడుండే ఫోటో ముందే వొచ్చింది గదా, మనం మళ్లీ మనోళ్లని ఆడికి పంపబట్టి, బండ్లు తొక్కించేసి నుజ్జయిపోయిన ఫోటో కూడా వొచ్చింది. ఆ రెండు ఫోటోలూ పక్కపక్కనే యేసినాం. పోలీసుల్ని యెక్కి దిగేసినాం. ‘ఎవరూ పట్టించుకోక’ అని కత్తిలాంటి హెడ్డింగు పెట్టినాం’ చెప్పుకుంటా పొయినాను.
అందరూ గమ్మునే అయిపొయినారు. బాబురాజు యింకో రెండు సార్లు బిర్రుగా ఊదాడు. వడివేలు నోరు తెరుచుకుని నా మాటల్నే యింటా ఉండాడు. వాడి తోపుడుబండి మీద చేత్తో గ్యాసు కొట్టే కిరసనాయిలు పొయ్యి బుగబుగ మండతా ఉండాది.
‘నువు జెప్పిన ‘యెవురూ’లో మన సిగ్గులేని బతుకులు కూడా ఉండాయి దొరా’ అన్నాడు బాబురాజు బరువుగా.
‘సర్సర్లే పోయిన పేణాన్ని యెనక్కి లాక్కోనొస్తామా యెట్టా. వాడితోపాటు పోతామా లేక, పని మానేసి కూచుంటామా? మనం జేసింది మామూలు స్కోరు ఐటెమ్ అనుకున్నావా? రేపు సాయంత్రానికి అయిద్రాబాదు నుంచి యెన్ని సెబాసులు కురస్తాయో జూస్కో’ అన్నా.
బాబురాజు మాటాళ్లేదు. మాటాడ్డానికేం లేదన్నట్టుగా ఉండిపోయాడు.
‘ఖ్వా.. క్’ మని గట్టిగా కాండ్రించి.. బండిపక్కన సైడు కాలవలోకి ఉమ్మినాడు వడివేలు. ఉలిక్కిపడి అటు జూసినా.
‘నోట్లో దోమ దూరింది సారూ’ అన్నాడు సర్దుకుంటున్నట్టుగా, మొహం అటుతప్పి!
పర్లేదు. ఉమ్మింది నా మొహాన కాదు! అనుమానంగానే, సంబాళించుకున్నాను నన్ను నేను.
*
చిత్రం: సురేష్ పిళ్లే
నమస్తే అండి. స్కోర్ ఐటెమ్ కథ ఇప్పుడే చదివాను. కథ రాస్తే మీరే రాయాలి అనిపించింది. ఏ సంచలన వార్తలు లేకున్నా పత్రిక మనుగడ, స్వీయ మనుగడ కోసం విలేఖరులు వార్తల కోసం పడే అగచాట్లు కంటి ముందు దృశ్యమానం అయినాయి. ఎన్ని ఎత్తులు వేసినా రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని వార్తల కోసం వాడుకోవటం విచారకరం. ఏం కథలో అయినా సరే కాళాస్తి కనపడాల్సిందే. వ్యవస్థ లోని లోపాలను (ఆథ్యాత్మిక, రక్షణ, రాజకీయ, సాంఘిక వ్యవస్థ లు) ఎత్తి చూపాల్సిందే. అర్థరాత్రి వడివేలు బండి మీద వేడివేడి ఇడ్లీ,సాంబార్లు మాత్రం నోరూరించాయి. సురేష్ పిళ్ళై గారు ఏ కథ రాసినా తిరుగుండదు. అభినందనలు అండి
వాళ్లకేం దొర…..వాళ్ళు అట్టే ఉస్తారు. మనమీద ఉండేవోళు మనల్ని ఎట్టా తొక్కి నారా తీస్తారో వూశేవాళ్ళకేం ఎరుక. దమ్మిడీ కోసం ఆత్ర పడి ఎత్తబడితే అట్ట రాస్తారా…? అనికూడా అంటారు. నరం లేని నాలికి ఎట్టైనా వాగతాది. పనోడ్ని ఆస్పత్రికి మనకాడి ఉండే డొక్కు మోటారు బండి మీద నరమానవుడి సాయం లేకుండా ఎట్టా మీదేశు కెల్లేదని వుసినోల్లు అనుకోరులే. రమేసన్న పోటోలు తే కుంటే మీరే ఆయన్ని మెట్టుతో కొట్టకుండా విడిచి పెట్టింటారా.???. అట్ట గాదని పని వదిలేసి మీరే ఆడకి వెళ్లి పడిపోయిందని ఆస్పత్రికి వేసుకెల్లుంటే నీ మీదోళ్లు నిన్ను గమ్మనే విడిసుంటారా?. భూబారాన్నంతా మోసే వెంకన్నే ఏమిచేయకుండా గమ్మనైబోతే…. తుకాడా ….పైన అడ్రస్ కింద సంతకం లేకుండా, తుమ్మితే ఊడిపోయే మనమెంత. భాద పడమాక సామీ!. అయినా ఈ మారిగా ఏ నర మానవుడి కి ఇట్టా మాళ్లి జరగకూడదు అనే కదా నువ్వు అందర్నీ ఏకి పారేశినావు.ఏమైనా మనం నిమిత్త మాత్రులమే సామీ. జరిగింది వదిలేసి నిబ్బరంగా ఉండు. ఆ నిబ్బరమే కదా మన బోటోళ్ళ కి తోడుందేది. ఉంటాను సామీ.
మనసు మెలిపెట్టింది కధ
Baagundi, katha, journalisistula batuku vyadha. Roddu pakkaku laagi vunte baagundedi
మన పనితీరునా చక్కగా కళ్ళ ముందుంచావు
పద్మనాభాన్ని , రమేశ్ ని కళ్ళ ముందుచావు
ఒక్క మాటలో నన్ను తిరుపతి ఎడిషన్ లోకి తీసుకెళ్లావు
సజీవ చిత్రం … మాటలే్లవు