సెంద్రెయ్య స్వప్నం

నాలుగు రోజులు నువ్వు కనపడకపోతే గొడ్డుకూడా బాధపడుతది. నువ్వెప్పుడూ సేదతీరే యాపచెట్టు కూడా నిన్ను పలకరిత్తది

కంది సేను మునుపటి కన్న బాగుంది. చీడలేవీ పట్టలేదు. అక్కడక్కడా సేను మధ్యలో గడ్డి మొలిచింది.  దంతె కొట్టి సాఫు చేసే పనిలో సెంద్రెయ్య వుండు. కోడి కుయ్యంగానే తండ్రి నర్సయ్య కేకేసిండు. కొడుకులు ముగ్గుర్ని నిద్ర లేవమన్నడు. బాయికాడికి పోయి ఎవరేం పనులు చెయ్యాలో పురమాయించిండు. కళ్లు నలుపుకుంటా సెంద్రెయ్య, యెంకటయ్య, సోమయ్యలు బాయికాడికి బయల్దేరి వొచ్చిండ్లు. సెంద్రెయ్య దంతెగట్టి కంది సేనులో దున్నుతుండు.

యెంకటయ్య పొలాలకు నీళ్లు పెట్టాలని మోట గొడుతున్నాడు. జీతగాడు గంగారపు మల్లయ్య రాగానే తనకు పని అప్ప చెప్పి పొలాలలో నీళ్లు మలుపేందుకు వెళ్లాడు. సోమయ్య గొడ్ల కొట్టంలో చేరి సాపు చేస్తున్నాడు. ముగ్గురు ఎవరి పనిని వాళ్లు లీనమై చేస్తున్నారు.

నెత్తి మీదికి ఎండ చేరగానే సెంద్రెయ్య దంతె యిడిసి గొడ్లను కంచెలకు తోలిండు.

సోమయ్య అప్పటికే గొడ్లు, బర్రెలను కంచెలో తోలి ఒక చెట్టు కింద కూసున్నడు.

చిలుకమ్మ, సరోజన, ఎల్లమ్మ ముగ్గురు నెత్తి మీద   బరువులు మోస్తూ  బాయికాడికి వొచ్చిండ్లు. చిలుకమ్మ నెత్తి మీది గంపలో గట్క వొండిన కుండలు, కూర మూకుళ్లు, పెరుగు ముంతలు ఉన్నాయి.

ఎలమ్మ నెత్తి మీద పల్లికాయ మూట వున్నది. పక్కనే వున్న దర్దేపల్లిలో గానుగాడించి నూనే తేవాలని మోసుకొచ్చింది.

సరోజన నెత్తి మీద బట్టల మూట వుంది. బాయికాడ ఉతికడానికి తీస్కొచ్చింది.

యెంకటయ్య కాళ్లు చేతులు కడుక్కొని తినడానికి కూసున్నడు.

దూరంగా సెంద్రెయ్య, సోమయ్యలు నడుచుకుంటా వొస్తున్నరు.

ఆకలి అయితంది అంటే ఇంకా జాము మీద నడుస్తున్నరు అనుకున్నడు యెంకటయ్య.

అటికెలు, మూకుల్లు తీసి బయట పెడుతున్నది చిలుకమ్మ.

మామిడి సెట్టు మీద ఉడుతలు లేత ఆకులు తినడానికి అటూ యిటూ ఉరుకుతున్నయి. యెంకటయ్య కడుపులో ఎలుకలు ఉరుకుతున్నయి.

“ఏందీ నీ సర్దుడు. ఇంకో జాముకు రాకపోయిండ్లు. మనుషులకు ఆకలనే సంగతి యాదికున్నదా?” అని కసిరిండు.

చిలుకమ్మ ఏమీ అనలేదు.

 

ను ఎప్పుడూ తినే మట్టి కంచంలో గట్కయేసి పెరుగు పోసి యిచ్చింది. అందులో అంచుకు యింత మామిడికాయ పచ్చడి యేసింది.

ఆకలితో వున్న యెంకటయ్య మామిడి ఆకులు తింటున్న ఉడుతలా టకాటకా తింటున్నడు.

సెంద్రెయ్య, సోమయ్య లిద్దరూ వొచ్చి కూసున్నరు. చిలుకమ్మ వాళ్లిద్దరికీ గటుక పెట్టింది.

జీతగాడు మల్లయ్య వొచ్చి కూసున్నడు. తనకు కూడా పెట్టింది.

గట్క తిన్న తర్వాత మళ్లీ పొలం పనుల్లో  అంతా మునిగి పోయారు.

మిట్ట మధ్యాహ్నం కాస్తా రికాం తీసుకున్నారు.

సెంద్రెయ్య గొడ్లను సోమయ్య కు అప్పచెప్పి యాప చెట్టు కిందికి చేరిండు.

ముడ్డి కింద తువ్వాలేసుకొని కాసేపు కూసున్నడు.

కునుకు వస్తంది. గాలికి ఒళ్లు నిద్రను ఆశపడుతుంది.

అట్లాగే పచ్చటి గడ్డిపరకల మీద ఒరిగి ఒళ్లు ఎరుగకుండా పడుకున్నడు.

దవళ వస్త్రాలు ధరించిన ఒక మహానుభావుడు వజ్రాలు వైడుర్యాలు మణి మాణిక్యాలు పొదిగిన పైడి రథంలో కూచున్నాడు. ఏడు తెల్లగుర్రాలు ఆ రథాన్ని మోస్తూ ఎగిరి పోతున్నాయి.  అనంతమైన దివ్య  కాంతిలోకి ఆ బంగారు కచ్చురం వేగంగా పరిగెత్తుంది. పితాంబరమో శ్వేతాంబరమో తెలియట్లేదు.  లీలగా ఆ మహానుభావుని మొహం కనపడుతుంది. కానీ ఆ దివ్య పురుషుడెవరో గుర్తించడం తనకు వీలు కావడం లేదు.

అయ్యా మీరెవరూ అని అడగాలని నోరు తెరిచాడు. కానీ మాట బయటికి రాట్లేదు.

గొంతు చించుకొని గట్టిగా పిలవాలని అనుకున్నాడు. కానీ గొంతు పెకలట్లే.

తను గాలిలోకి ఎగరాలని రెక్కలు విప్పాడు. కానీ కొద్ది దూరమే ఎగిరి దబీమని బొండు మల్లెల దిబ్బ మీద పడిపోయాడు.

ఆ దవళాంబర దివ్య స్వరూపుడు తన వేపు చూస్తూ కాస్తా దిగులు కళ్లతో వెళ్లిపోతున్నాడు.

ఆ కళ్లు తనకు బాగా గురుతు.

ఆ కళ్లు ఎవరివి? ఎవరివి?

సెంద్రెయ్య తండ్లాడుతున్నడు. తనకు తెలిసిన కళ్లు అవి. ఏదో అపశకునం కొడుతుంది.

ఏమీ తోచక బావురుమని పొగిలి పొగిలి ఏడుస్తుండు.

అదిగో అప్పుడు ఎవరో చెంపల మీద కారుతున్న కన్నీటి కాల్వలను చెరిపేస్తూన్నారు.

కళ్లు నెమ్మదిగా తెరిచిండు.

యెల్ల యెద్దు సెంద్రెయ్య కన్నీటి చెంపలను తన నాలుకతో తుడిచేస్తుంది.

లేచి కూచున్నడు.

దాని తల మీద అరచేతితో నిమిరాడు.

దాని కళ్లు జలజలా నీళ్లు రాల్చాయి.

సెంద్రెయ్యకు గుబులు పట్టుకున్నది. ఏదో కీడు జరుగబోతందా? అసలు ఈ కలకు అర్థమేందో అంతు చిక్కక తల బరువెక్కింది.

యెల్ల యెద్దు సెంద్రెయ్య కాణ్ణించి నెమ్మదిగా నడుచుకుంటా పోయింది.  యెంకటయ్య పడుకొని సేద తీరుతున్న చెట్టు కిందికి చేరింది. యెంకటయ్య కాళ్లకు గజం దూరంలో అది పడుకొన్నది.

యెంకటయ్యకు మేల్క వొచ్చేసరికి యెల్ల యెద్దు తననే చూస్తన్నది.

అక్కడికి అది యెందుకొచ్చిందో తనకు అర్థం కాలే.

మిగతా గొడ్లు, బర్లు కంచెలో వుంటే ఒక్క యెల్ల యెద్దు మాత్రమే తన దగ్గరికి ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో అర్థం కాలే.

రాత్రి ఇంటికొచ్చిండు సెంద్రెయ్య.

ఆ కళ్లను తననింకా మర్చిపోలేక పోతున్నాడు.

నాయిన నర్సయ్య అప్పటికే తిని మంచంలో పడుకున్నడు.

ఇంట్లో దీపం గాలికి అటూయిటూ వూగుతంది.

నాయినా అని పిలిచిండు సెంద్రెయ్య.

కళ్లు తెరువకుండానే ఊ అని గట్టిగా అన్నడు నర్సయ్య.

మంచం పట్టె మీద కూచోని తనకు వొచ్చిన కల గురించి చెప్పిండు.

“పగటి కలలకు అర్థం వుంటదారా? పో. పొయి తిని పండుకో పో” అని ఎడమ పక్కకు తిరిగి పడుకున్నడు సెంద్రెయ్య.

సెంద్రెయ్యను ఆ సమాధానం సముదాయించ లేకపోయింది.

అట్లా అని నాయినను మళ్లీ అడిగి విసిగించ లేక పోయిండు.

లేచి యింట్లకు పోయిండు.

రామవ్వ అటికెల కోడి కూరతో గట్క పెట్టింది.

ఆ రాత్రి అట్లా ఆలోచిస్తూనే వున్నడు. ఎప్పుడో నిద్ర పట్టింది.

 

ఎంత ఆలోచించినా కలలు ఎందుకొస్తున్నాయో, వాటి మర్మమేందో తనకు తోయట్లే.

చానా రోజుల తరువాత కలల గురించి మల్లా నర్సయ్యను అడిగిండు.

కందిచేను విరివిగా కాసింది.

కాయల బరువుకు చేను తూర్పు దిక్కుకు కొద్దిగా ఒరిగిపోయింది.

ఆ చేను వాసన పీలుస్తూ మోత్కు కొమ్మ కింద కూచున్నడు నర్సయ్య.

సెంద్రెయ్యతో యిలా అన్నాడు.

“తీరని కోర్కెలు దయ్యాలవుతాయంటరు గానీ అది అబద్ధం. కానీ అవి కలలుగా వస్తయి బిడ్డా. అయితే అన్ని కలలూ అట్లనే వుండవు. కొన్ని దైవికం. మనకేవో ఈ సృష్టి చెప్పాలనుకుంటది. అవి మనకు కొన్ని పవిత్రమైన గడియల్లోనే కలలుగా వస్తయి. కానీ కొంతమంది పుట్టిన గడియల వల్ల పగలు కూడా కొన్ని వస్తయి. అవి భ్రమలు కావొచ్చు. లేకపోతే నిజం గూడా గావొచ్చు. అది యేదని అనుభవమే చెప్పాలే” అని చెప్పిండు.

ఆ మాటలు విన్న దూరంగా చెట్టు మీది గొర్రెంకలు హాయిగా  గాల్లోకి ఎగిరినయి.

ఆ మాటల తర్వాత నర్సయ్య రావి చెట్టుకింద కళ్లు మూసుకొని కూచున్నడు. నాయిన ధ్యానంలో కూసున్నడని గమనించిన సెంద్రెయ్య పొలాలలోకి వెళ్లిపోయిండు.

అటు నుంచి సీతాఫలం పొదలకు పోయిండు. బాగా పండిన ఒక పండు రాలి కిందపడ్డది.

నెల రోజుల తరువాత కూడా ఆ కల మళ్లీ వస్తూనే వున్నది.

ఒకరోజు సుక్కపొద్దు యాళ్ల నిద్ర లేసిండు నర్సయ్య.

వారీ యెంకటయ్య ఎంతసేపు పంటర్రా? ఓరి సెంద్రెయ్య లేవరా అని కేకేసిండు.

అది వాళ్లకు అలవాటే. తెల్లారక ముందే నిద్రలేపి బాయికాడికి పొమ్మని కేకేసుడు.

సోమయ్య కూడా లేచిండు.

ముగ్గురు యింట్లోంచి బయిటికి వొచ్చిండ్లు. చెప్పులు యేసుకుంటుంటే నర్సయ్య అన్నడు.

 

సెంద్రెయ్య, సోమయ్య ఇద్దరూ బాయికాడికి పోండ్లి. బండి కట్టుకోండ్లి. అందులో మెత్తగా గడ్డియేసి, పైన బస్తాబోరేం పరువుండ్లి. ఆణ్సించి అట్లనే మద్దిరాల బాట పట్టుండ్లి. మీకు మధ్యల్నే చెల్లే అచ్చమ్మ ఎదురైతది. సీదా పాలకుర్తి తీస్కరాండ్లి అన్నడు.

ఆ మాటలు వింటూనే ఓ బిడ్డ అచ్చవ్వో అని ఏడ్పందుకున్నది శాంతమ్మ.

ఏమైందే నాయనా అని సోమయ్య బావురుమన్నడు.

సెంద్రెయ్యకు నెత్తి మీద పిడుగు పడ్డట్టయ్యింది.

యెంకటయ్య నాయిన కాడికి వురుకొచ్చిండు.

ఏమైంది‌ నాయిన. చెల్లెకు ఏమైందట? ఎవరు చెప్పిండ్లు నీకు అని కన్నీళ్లు పెట్టుకున్నడు.

అన్నీ తర్వాత చెప్తా. ముందు సెంద్రెయ్య, సోమయ్య ఇద్దరు బండి కట్కపోండ్లి అని గద్దించిండు.

లేదు. నేనే పోతా. సెంద్రన్నతోటి అన్నడు యెంకటయ్య.

సరే అట్నే గాని. సోమయ్య నువ్వు కాసేపు బాయికాడ పని చూడు అన్నడు నర్సయ్య.

యింట్లోని ఆడోళ్లు లేచి శోకాలు పెడుతున్నరు.

ఆ ఏడ్పుకు వూరిజనం అంతా నిద్ర లేసిండ్లు. నర్సయ్య యింటికి ఒక్కరొక్కరు చేరుకున్నరు.

అచ్చమ్మకు బాలేదని తెలుసుకున్నరు. కానీ ఆ వార్త ఎవరు తెచ్చిండ్లో తెల్వక అంతా గుసగసులు పెట్టుకుంటండ్లు.

బండిని సెంద్రెయ్య వేగంగా నడుపుతండు. యెంకటయ్య దిగులుగా కూచున్నడు బండిల.

అచ్చమ్మ తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లె.

ఒక్కతే కాబట్టి అందరికీ పాణం.

సెంద్రెయ్యకు చెల్లె అంటే చెప్పలేనంత పావురం. అచ్చమ్మ బాగా బక్కపల్చగా వుంటది. చామన చాయ. లేడిపిల్లలా గంతులేసేది.

అన్నల భుజాల మీద ఎక్కి గావురం చేసేది. తప్పు చేస్తే అన్న అని చూడకుండా తిట్టేది. కానీ పెద్ద గుండె. క్షమించే గుణం ఎక్కువ.

నాలుగో తరగతి దాకా చదువుకున్నది.

పదిహేనేళ్లకే మంచి సంబంధమని మద్దిరాలకిచ్చి పెళ్లి చేసిండు నర్సయ్య.

అడిగిన కట్నం యిచ్చిండు.

ఒకసారి నవ్వులాటకు ఆలు మొగలు కీచు లాడుకున్నరు.  భర్త రెండు దెబ్బలేసిండు.

నా మీద చెయ్యియేస్తవా. నీతో వుండను అని తల్లిగారింటికి వొచ్చింది.

అన్నా వొదినల మీద పడి యెక్కియెక్కి యేడ్చింది.

సోమయ్య అగ్గిలం మీద గుగ్గిలం అయ్యిండు.

సెంద్రెయ్య ఏమీ మాట్లాడ లేదు.

యెంకటయ్య రగిలిపోయిండు. కానీ నాయిన నర్సయ్య శాంతింప చేసిండు.

సంసారమన్నాక కీచులాటలు ఉంటయి. మీరంతా ఆవేశపడితే యెట్లా. ఆ పిలగాడికి భయం చెప్దాములే బిడ్డా. నువ్వు నాలుగు రోజులు వుండు అని బుజ్జగించిండు.

ఆ రాత్రి తల్లిగారింటిలో హాయిగా నిద్రపోయింది అచ్చమ్మ.

కానీ ఆ రాత్రి నడిజాము వరకు సెంద్రెయ్య, యెంకటయ్య యిద్దరూ అచ్చమ్మ అత్తగారింటికి చేరుకున్నరు.

తలుపుకొట్టి బావను నిద్రలేపిండ్లు.

అంత రేతిరి ఆ ఇద్దరినీ చూడగానే ఉచ్చబడ్డది తనకు.

సెంద్రెయ్య సంగతి తనకు బాగా తెలుసు.

మాట్లాడుదామని బయటికి తీసుకొచ్చిండ్లు. సప్పుడు రాకుండా ఇద్దరు మెత్తగా కుమ్మిండ్లు బావను.  మళ్లా తెలతెల్లవారంగ మల్లంపల్లి చేరుకున్నరు అన్నదమ్ములు.

ఏం భయం చెప్పిండ్లో తెల్వదు గానీ రెండో రోజు బావ అచ్చమ్మను తీస్కపోను యింటికొచ్చిండు.

నర్సయ్య అల్లుణ్ణి ఏమీ అనలేదు.

సెంద్రెయ్య బావకు కల్లుదాపించడానికి తాళ్లలోకి తీస్కపోయిండు.

వెంకటయ్య కోన్ని కోసిండు.

సోమయ్య బావను గుర్రుగ చూసిండు. తిడుదామని నోరు తెరిచేలోపే నర్సయ్య వొద్దని కళ్లతో సైగ చేసిండు.

తనను కొట్టినందుకు అందరూ కలిసి తిడుతరేమోనని ఎదురు చూస్తున్న అచ్చమ్మకు నిరాశ ఎదురైంది.

ఆ రాత్రి అచ్చమ్మకు ఇంకోసారి ఎప్పుడూ కోపం చేయనని, తనతో తెల్లారే ఇంటికి రావాలని బతిమాలుకున్నడు.

అదే సంగతి మామ నర్సయ్యకు చెప్పిండు. రెండు రోజులుండి పోయ్యా అని మర్యాదగా చెప్పిండు.

అల్లుడు కాదనలేక పోయిండు.

రెండు రోజుల తర్వాత అచ్చమ్మను మద్దిరాలలో దించడానికి బండికట్టిండు సోమయ్య.

యింటోళ్లంతా జాగ్రత్తలు చెప్తూ వీడ్కోలు పలికిండ్లు.

అన్నల మీద పడి మళ్లా ఏడ్చింది అచ్చమ్మ. బరువైన గుండెతో బండెక్కింది.

ఆ రాత్తిరి అచ్చమను పట్టుకొని బావురుమన్నడు భర్త.

ఏం జరిగిందో తెలువక గాబరాపడ్డది అచ్చమ్మ.

మీ అన్నలిద్దరు నన్ను గొడ్డును కొట్టినట్టు కొట్టిండ్లు. నువ్వంటే వాళ్లకు ఎంత పావురమో ఎర్కయింది. యిగ నిన్నెప్పుడూ బాధపెట్టా. ఎప్పుడన్నా ఏమన్నా అంటే మాత్రం మీవోళ్లకు చెప్పకు అని బతిమాలుకున్నడు.

అచ్చమ్మకు జాలేసింది.

బోలెడంత దైర్యం వొచ్చింది. అన్నలు, వొదినెలు, గంపెడంత కుటుంబం యాదొచ్చింది తనకు.

వాళ్ల ప్రేమ యాదికొచ్చి కంటనీరు పెట్టుకుంది.

ఆ తర్వాత ఏ చిన్న జవుడం జరగలేదు.

ఇద్దరు కడుపుల పడి మధ్యల్నే జారిపోయిండ్లు.

ఏమైందో తెల్వదు గానీ అచ్చమ్మ ఒంట్లో బావుంటలేదు.

బిడ్డ కడుపున ఒక గుడ్డన్నా పండకపాయే అనే బాధ నర్సయ్యకు వుంది.

చెల్లె ఆరోగ్యం బావుంటలేదని తెలిసి దుఃఖపడ్డరు అన్నలు.

సెంద్రెయ్య ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే బయిల్దేరి అచ్చమ్మను చూడ బయిలెల్లి పోయేటోడు.

వెంకటయ్య నెలకోపాలి పోయి చూసి వొచ్చేటోడు.

చెల్లెను మంచి డాక్టరుకు చూపించాలని వరంగల్లుకు తీస్కపోయిండు వెంకటయ్య.

రొమ్ముల గడ్డ వుందని డాక్టరు చెప్పిండు. మందులు రాసిచ్చిండు.

అచ్చమ్మ ధైర్యంగా నాకేవీ కాదులే అని అందరికీ ధైర్నం చెప్పింది.

ఈసారి నవ్వుతూ అత్తగారింటికి పోయింది.

ఆర్నెళ్లలో అచ్చమ్మ మరింత ఎండిపోయింది.

రొమ్ముల గడ్డ పెరిగింది. బీమారీ పెరుగుతున్న సంగతి తల్లిగారికి చెప్పొద్దని మొగనితో ఒట్టేయించుకున్నది.

కానీ అచ్చమ్మ రాత్తిరి చావుదరికి చేరింది.

లేగదూడ అంబాని ఏడిస్తూ సచ్చిపోతున్న ట్టు కలొచ్చింది.  అది తననే చూస్తూ విలవిలలాడుతూన్నట్టు స్పష్టంగా కనిపించింది.

దిగ్గున లేచి కొడుకులను ఉరికిచ్చిండు.

సెంద్రెయ్య, యెంకటయ్య లకు బాటలో  అచ్చమ్మను పండుకోబెట్టిన యెడ్ల బండి ఎదురుపడ్డది.

అచ్చమ్మ పక్కన్నే కూసోని ఏడుస్తూన్నాడు భర్త.

చెల్లెను కొనూపిరితో చూసిన యెంకటయ్య పసిపిల్లాడిలా విలపించాడు.

నెత్తి నోరు కొట్టుకుంటూ చెల్లె కాళ్ల మీద పడి సెంద్రెయ్య ఏడుస్తున్నాడు.

అన్నలిద్దరూ వొచ్చిండ్లని అచ్చమ్మకు అర్థమైంది.

రామె కళ్ల కొనల నుండి ధారగా నీళ్లు కారుతున్నాయి.

తనకు బతుకాలని ఆశగా వుంది. ఏదోశక్తి ఆవరించినట్టు కొద్దిగా కదిలింది.

చెల్లకు తామొచ్చిన సంగతి అర్థమైందని యెంకటయ్య గ్రహించిండు.

చెల్లే నువ్వు భయపడకు. నీకేం కాదు. మేమంతా వున్నాం. మనం పెద్ద డాక్టర్ కాడికి పోదాం అని అరిచాడు.

చెల్లెను చేతులలో ఎత్తుకొని తమ బండిలోకి మార్చిండ్లు.

ఆ యెడ్లబండిని యెన్కకే పొమ్మని చెప్పిండ్లు.

బావను ఎక్కించుకొని బండిని తరిమిండ్లు.

సెంద్రెయ్య గొడ్లను గెదుముతూనే వున్నడు. అవి బలమంతా కూడగట్టుకొని ఉరుకుతూనే వున్నయి. వాటికి వీళ్ల కొచ్చిన కష్టం ఎర్కైనట్టు వుంది.

సెంద్రెయ్యకు బాయికాడ వొచ్చిన కల గుర్తొచ్చింది. ఆ కళ్లు గుర్తొచ్చినయి.

అవి చెల్లె అచ్చమ్మ కళ్లేనా అనే అనుమానం వొచ్చింది.

చెల్లె మొక్కం చూసిండు. అచ్చమ్మ కళ్లు మూసుకొని వుంది.

ఆ కళ్లు తెరిస్తే తప్పా తను గుర్తు పట్టలేడు.

బండి నేరుగా పాలకుర్తి కి మిట్టమధ్యాహ్నం యాల్లకు చేరుకుంది.

అప్పటికే అక్కడ నర్సయ్య, సోమయ్య, ఆడోళ్తంతా చేరుకుండ్లు.

అచ్చమ్మను చూసి అంతా మీదపడి యెక్కియెక్కి యేడ్చిండ్లు.

డాక్టర్ వొచ్చి చూసిండు.

యింటికే దీస్కపోండ్లి. ఎక్కువ సేపు బతుకది అన్నడు.

ఆ మాటకు అందరి గుండే పగిలినంత పనైంది.

పాలకుర్తి వూరు వీళ్ల దుఃఖం చూసి కరిగి పోయింది.

నర్సయ్య బండెక్కి అచ్చమ్మ పక్కనే కూసున్నడు.

చెయ్యి చేతిలోకి తీస్కోని ముద్దాడిండు. నాయిన పెదాల తడి అచ్చమ్మకు  అర్థమైంది.

కన్నతల్లి శాంతమ్మ పెడబొబ్బలు పెడుతంది. రావమ్మ దేవుని మీద మన్నెత్తి పోస్తంది.

మల్లంపల్లి చేరుకునేపాటికి వూరువూరంతా ఎదురు చూస్తంది.

అచ్చమ్మను మంచంలో పడుకొబెట్టిండ్లు. చుట్టూ చేరి అంతా ఏడుస్తున్నరు.

గర్వందుల నర్సయ్య వొచ్చి మీ ఏడ్పుకే సచ్చేటట్టుంది. ఆపుండ్లి అని కేకలేసిండు.

అంతా ఏడ్పు ఆపిండ్లు.

ఎక్కడి నుంచి వొచ్చిందో బలం తెల్వదు.

కళ్లు నెమ్మదిగా తెరిచింది.

సెంద్రెయ్య అదిరి పడ్డడు. తనకు కలలో కనపడ్డ కళ్లు చెల్లె అచ్చమ్మ కళ్లు ఒకటే.

అయితే చెల్లెకు ఏమీ కాదని ఆశపడ్డడు.

దేవుని దయతో బతికితే యాకసాయన్నకు పోతును కోస్తా అని మనసులో మొక్కిండు.

అచ్చమ్మ అందరినీ కలియ చూసింది.

ఆమె కళ్ల నుంచి కారుతున్న నీళ్లతో తలకింది మెత్త తడిసిపోతంది.

అన్న సెంద్రెయ్యను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసింది.

అది చూసి మళ్లా అందరూ గొల్లుమని ఏడ్చిండ్లు.

సెంద్రెయ్య చెల్లె కాడికొచ్చి చెయ్యి పట్టుకొన్నడు.

అచ్చమ్మ  పొగిలి ఏడ్చింది.

యెంకటయ్య కోసం అటూయిటూ చూసింది. ఏడుస్తూ చెల్లెను చేరుకున్నడు తను. ఆమె ఏదో చెప్పాలని అనుకుంటందని తనకు అర్థమైంది.

యెంకటయ్య చెవిని తనకు దగ్గరగా పెట్టిండు.

సెంద్రన్న జాగ్రత్త అని గొణిగింది. అది సెంద్రెయ్యకు కూడా వినపడ్డది.

తల్లి ఆవులాగా రోధించిండు సెంద్రెయ్య.

 

అందరినీ మళ్లీ ఒకసారి చూసింది. కళ్లు మూసుకుంది.

ఆ మంచానికి కొద్ది దూరంలో వేలాడుతున్మ దీపం గాలికి ఆరిపోయింది.

అందరి మీదా దుఃఖపు చీకటి కమ్ముకుంది.

గుడ్లగూబ సప్పుడుతో ఆ చీకటి మరింత భయంకరంగా మారిపోయింది.

చెల్లె మీద ప్రేమతో ఆమె అంత్యక్రియలు బ్రహ్మాండంగా చేసిండ్లు అన్నలు.

బాయికాడ బొందపెట్టి గోరి కట్టిండ్లు.

ఆ సమాధి బాయికాడ వుంది. రోజూ అచ్చమ్మను చూస్తున్నట్టే వుంది వాళ్లకు.

ఆ గోరికాడ కూసోని చాలాసార్లు సెంద్రెయ్య ఏడ్చిండు.

బాయికాడి చింతచెట్టు కింద కూచోని యెంకటయ్య చెల్లెను యాది చేసుకున్నడు. ఆ రోజు తన దగ్గరికి వొచ్చి పడుకున్న యెద్దు గుర్తొచ్చింది.

కొడుకులు ముగ్గరూ అచ్చమ్మ జరిగిపోయినంక చాలా దిగులుగా వుంటున్నరు. వాళ్లలో సంతోషం లేదు. చెప్పలేని దుఃఖముంది. ఇది నర్సయ్య గమనించిండు.

యాడాది మాషికం అయిపోయింది.

ఒకరోజు నిండు పున్నమి. వెన్నెల చల్లగా కమ్మగా వుంది.

అంతా వాకిట్ల మంచాల మీద కూసున్నరు. ఇంకా తినలేదు.

అప్పుడు నర్సయ్య మాట్లాడాలని అనుకున్నడు.

“ఉన్నవానమ్మా. కొన్ని నీళ్లు దే” అన్నడు. రావమ్మ సిటెంల నీళ్లు తెచ్చి ఇచ్చింది. అవి తాగిండు.

“ఓరి పిలగాండ్లు, ఏందిరా మీ బాధ. భూమ్మీద సావకుండ అట్టనే బతికుంటార్రా? బ్రహ్మంగారు యేమన్నడు. యెవ్వలైనా మట్టిల కలవాల్సిందే. అదేదో పద్యంలో అన్నట్టు భస్మసింహాసనం మీద ఎవడైనా కూచోక తప్పదు. నువ్వైనా నేనైనా ఈ మట్టిల, ఈ గాలిల కలిసి కరిగిపోవాల్సిందే. అదే సృష్టి ధర్మం.

సెంద్రెయ్యంటే ఉడుకుతనం గల్లోడు. నీకేమైందిరా యెంకటయ్య. చదువుకున్నవు గదా. తెల్వదా. దేని మీదా ప్రీతి, మమకారం పెంచుకోవద్దు. నువ్వు దేన్ని కాయిష్ చేస్తవో, దాని కోసం దుఃఖపడుతవు బిడ్డా.

మనిషైనా జీవైనా చెట్టయినా చేమయినా ఎండి యీ విశ్వంలో కలిసిపోవాల్సిందే” అన్నాడు నర్సయ్య.

సెంద్రెయ్యకు ఆ మాటలు కొత్తగా అనిపించాయి. నాయినకు ఇంత గ్యానం ఎట్లా వొచ్చిందో అని అచ్చెరువొందాడు.

కానీ యెంకటయ్య నాయినకు ఏదో చెప్పాలనుకున్నడు.

“బాధపడకుండా వుండటానికి మనమేవన్నా రాళ్లమా గుట్టలమా. చెట్లమానే. మనుషులం. చెల్లె జరిగిపోయింది. బంగారం కన్న ఎక్కువ నా తల్లి. ఈ కష్టం ఎవ్వలికీ రావొద్దు” అన్నడు.

“నీకొక్కనికే వుందారా చెల్లే. లోకం మీద ఎవలి చెల్లే సచ్చిపోలేదా? వాళ్లంతా మీ లెక్కనే ఏడుస్తా తూడుస్తా కూచున్నరా?

చెట్టు చేమలకే కాదురా. జీవమున్న ప్రతి దానికీ మమకారం ఉంటది. నాలుగు రోజులు నువ్వు కనపడకపోతే గొడ్డుకూడా బాధపడుతది. నువ్వెప్పుడూ సేదతీరే యాపచెట్టు కూడా నిన్ను పలకరిత్తది. కానీ ఆ బంధాలు, మమకారాలు అన్నీ బలహీనున్ని చేస్తయి. అవి వొదులుకోవాలి. మన పని చెయ్యాలే. నీలో వున్న జీవమే అన్నిట్ల వున్నది. ఈ సృష్టిలో వున్నయన్నీ నీలో నాలో వుంటయి. సచ్చినంక యాడికిపోతం? యెవ్వలు చూసిండ్లు? నా చిన్నప్పుడే మా నాయిన సచ్చిపోయిండు. ఆయన సచ్చిపోయిండని నేను ఏనాడూ అనుకోలే. కష్టమొచ్చినప్పుడు నాయిన వుంటే బావుండు అనుకుంటా. ఆయన వొచ్చి నా పక్కనే వున్నట్టు నా ఒళ్లుకు నా మనసుకు తెలిసేది. ధైర్యం వొచ్చేది. మీ చెల్లె యాడికిపోద్ది. మీ సుట్టూ తిరుగుతంది. నీ కడుపుల్నే పుడుతదేమో మల్లా. చావు, పుట్టుక ఒక బండి చక్రంరా సెంద్రెయ్య. నువ్వేదో చెయ్యడానికే పుడుతావు. ఆ పని కాగానే పోతావు. ఆ పని కాకుండానే పోతే మల్లా జన్నెత్తుతావు. అంతే” అని లేచిండు.

రేపటి నుండి ఎవలన్నా రోగమొచ్చిన కోడిలెక్క కనపడితే ముడ్డిమీదికేలి తంతా అని హెచ్చరించిండు.

సెంద్రెయ్య చావు, పుట్టుకల గురించి చానా ఆలోచించిండు. నాయిన చెప్పింది నిజమే అనుకున్నడు.

నిమ్మలంగా మామూలు మనుషులయ్యిండ్లు.

యెంకటయ్య భార్య మరో యాడిదికి ఆడపిల్లను కన్నది.

చెల్లె పేరు పెడుదామన్నడు యెంకటయ్య.

చెల్లే అచ్చవ్వా. మల్లా నీయింటికి వొవ్చినవా అని మనుసులనే అనుకుండు సెంద్రెయ్య.

యింటి వాకిట్లో వున్న చింత చెట్టు మీద అవునంటూ కోయిల కమ్మగా పాడుతంది.

ఆ యింట మల్లా పండుగ మొదలైంది.

*

జిలుకర శ్రీనివాస్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలంగాణ దళిత మనుషులు, వాళ్ళ మధ్య అనుబంధాలు… చెల్లెలు ని అపురూపంగా చూసుకునే తీరు…. చాలా చక్కగా కథగా మలిచినరు సార్. బాగుంది కథ.

  • కండ్ల నీల్లు పెట్టించినవ్ జిలుకరా!
    చెల్లె కలె తిరుగుతుంది..
    బైండ్ల సెంద్రయ్య కతలు బాగుంటున్నై.. ఇంకొక కత కోసం చూస్తా💙

  • అన్న, కథ చాలా బాగుంది. కథ చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు చూడులు తిరిగాయి. అన్న, చెల్లెళ్ళ అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు రూపు కట్టించావు. చావు,పుట్టుకల తత్వాన్ని చాలా సులువుగా విడమరిచి చెప్పావు.
    – డా. రవి పొనుగోటి

  • అన్నా చెల్లెల అనుబంధాన్ని ఆద్భుతంగా చిత్రించావు.కథ చాలా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు