దూరాన తూర్పున
సంద్రంలోంచి
ఉదయం ఉబికొస్తున్నట్టుగా ఉంది.
కాళ్ళు అందని పిల్లాడు
నిదానంగా
కాంచి తొక్కుతున్నట్టు
కిరణాల్ని పట్టుకొని నింపాదిగా
కాలాన్ని
నడిపిస్తున్నాడు సూర్యుడు.
సూర్యుడంటే
వట్టి రసాయన గోళం కాదు
ప్రకృతిని పత్రహరిత నర్తన
చేయించే రసవత్ తాళం.
మధ్యాహ్న వేళ
ఉజ్జ్వల నేత్రమై
ప్రకాశించే మిత్రుడు
సంధ్యాసమయాన పశ్చిమం చేరుకుంటాడు.
మీరు పొరబడకండి
అది వొట్టి పొర కాదు
పడమర
సూర్యుడి దినచర్యకి తెర.
తనతో పాటు
పడమర పొలిమేర దాకా వెళ్ళాక
తూరుపు తలుపు తెరుచుకున్నది.
అప్పుడనిపించింది
భూమి
గుండ్రంగానే ఉంది సుమీ!
2
ఆకాశం మేఘావృత మైనప్పుడు
నేను బాల్యంలోకి వెళ్లిపోతాను.ఓ మూల గదిలో
నిద్రపోతున్న
నా ఛత్రి దోస్తును
బయటికి తీసుకొస్తాను.
వరండాలో
చిన్న కుర్చీ వేసుకొని
తెరిచిన గొడుగంత కళ్ళేసుకొని
నల్లని మబ్బులను
తదేకంగా చూస్తుంటాను
ఎప్పుడు
వాటి గుండె బరువు దింపుకుంటాయా అని.
చిన్నగా మొదలైన వానలో
గొడుగుని తిరగేసి
చినుకులని పట్టే దొన్నెగా మారుస్తా.
సగం వాన నీటితో
నిండిన ఆ గొడుగులో
నిన్న కవిత్వం కుదరని కాగితాల్ని
సున్నితంగా మడతపెట్టి
పడవలుగా చేసి వదులుతాను.
కాస్సేపు
పసిపిల్లాడిలా నేను ఆనందిస్తాను.
నానుతున్న ఆ కాగితాలపై
సిరా చుక్కలు కరుగుతూ
నాట్యం చేస్తుంటే
నీటిలో
నీలమణులు పోగైన భావన.
అప్పుడే
సరిగ్గా ఆ ముహూర్తాన
ఒక అమూర్త దీవెన
తాజా కవిత్వానికి ఊపిరి పోస్తుంది.
Add comment