సూరేగ్యానం

ఒరేయ్ ఈ టీవీ లు ఫోన్లు వచ్చిసీమ సిటిక్కు మన్న దేశమంతా గబ్బయ్ పోతా ఉంది.

నిద్దర లేసి సితుకులు దోసుకొని బోకి బాలి కడిగి, నీళ్లు బట్టి, అన్నం కూరచేసిన.నా కొడుకొచ్చి అమ్మా ఈపొద్దు గ్యానం అంట పద కొండున్నరవరకు అన్నం తిన కూడదంట,అన్నం వండకూడదంట అనే. నాకు కడుపులో బెరాయిచ్చినట్లు అయిపాయ.నిన్న ఇంట్లో కూరకు ఏమీ లేకపోతే వొట్టి ఉలవలు ఏంచి ఊరిబిండి నూరి ఆపొద్దంతా  రావిటాల మావిటాల మూడు పూట్లు దిక్కపోయినా గెతిలేక  బలవంతంగా అదే తిన్నాము. నిన్న సరిగ్గా సంగటి దిగలేదని ఈపూట కూర అరువుగా చేసుకుందామని ఇంట్లో అన్నీ బీజారి  ఎబ్బుటివో  దోసిడు అనప బ్యాలు అవికూడా పులుగు ఆడింటే అవిచాటలో ఏసి  చెరిగి పుచ్చులన్నీ ఏరేసి కడిగి బ్యాలు పొయినేసిన .ఈ సీజన్లో టెమటకాయి అరకవ. టౌన్కిపోయి తెచ్చుకుంటేనే గతి. ఇక్కనపక్కనవాళ్ళు టమటకాయలు నన్ను అడిగితే  వాళ్ళకి లేవు అని చెప్పి రెండే రెండు కాయలు ఎత్తి పెట్టుకోనుండిన.అవి,ఇంగా తెల్లగడ్డ ఎర్రగడ్డ అంటారా ధర ఎక్కువని నెల నుండి పండగ దేవరకు తప్ప కొనేదే సాలించేసినాము.అవి కూడా పొట్లులోపాయి,అరబాయి,ఎతికిలాడి ఏసి పుల్లగూర దుద్ది  తిరగబాత ఏసినా.అప్పటికి ఎనిమిదన్నర అయింది. నా మొగుడు వచ్చి మే ఇంట్లో అన్నం కూర చేయకూడదుఅంట. పద కొండున్నర పైన నీళ్లు పోసుకుని అబ్బుడు చేసుకుని తినాలంట అనే.ఆ మాటిని నాకు పితాలం రేగింది. మే ముందుగా చేసినవి ఏమన్నా ఉంటే పారేయల్లంట అనే . యానాబట్టే నీకు చెప్పింది. నోటి కాడ కూడు బారేమని. ఈపొద్దు గడిస్తే సాలు స్వామి అనినేను చేస్తే పారేమంటావా. పారేసి మొన్నుతింటావా అంటే కాదంట మే అందురు అంటా ఉండారు ఇదిసాన సెడ్డ గ్యానం అంట అనే.ఆయాలకు  నా కొడుకు ఊరుతిరుక్కొని వచ్చినాడు.అమా  పదకొండున్నర  వరకు అన్నం తినకూడదనే. సాల్లే ఎవరురా మీకుఈ పుకారు రేపిందిఅంటే లేదమ్మా ఊరంతా పస్తుండారు చూడు నేను మొకం  కడుక్కుని కూడా తినలేదు అంటే అర్థం చేసుకో అనే. ఒరేయ్ ఈ టీవీ లు ఫోన్లు వచ్చిసీమ సిటిక్కు మన్న  దేశమంతా గబ్బయ్ పోతా ఉంది.”ఇచిత్రానికి ఇద్దరు చస్తే వాళ్ళనీడ్చ లేక నలుగురు చచ్చిరంట అన్నా ”
 
                      ఇబ్బుడు ఎన్నో ఏళ్ల నుండి గ్యానం పడతా ఉంది యా పొద్దే గాని ఇంత పుకార్లే లేసిండే ఏం జరగతాఉంది కనుక్కుందాం అని బజార్లోకి పోతి . మాతోడికోడలు ఏమన్నంటే మే ఈ పొద్దు ఏందో చెడ్డ గ్యానం అంట. ఇండ్లు,వాకిండ్లు,కడిగి నీళ్లు పోసుకుని శివుని గుడికి  పోతే మంచిదట నువ్వురా పదాం అనే. నేను ఉండుకొని యవరే యమ్మ మీకీ ఊదర గొట్టింది. మనం చిన్నబిడ్డలప్పటి  నుండి గ్యానాలు పడతానే ఉండాయి యాపొద్దే గాని గ్యానం అన్నోలు లేరు అంటి .ఆయమ్మ ఏమో మే టీవీలో అంటుండారు అనే . అయినా నేను డేట్ ఉండా, ఈ పొద్దు ఏం పని చేయను అంటి .
 
                     ఆయాలకు మాతాత వచ్చే. తాతా  ఈపొద్దు గ్యానంపట్టి ఇడిసి దంక అన్నంతినకూడదంటనే, నిజమేనా అంటే మాతాత”నాయనా నాకు ఇబుటికి ఎనబై ఎండ్లున్టాయి. నేను బుద్ధి ఎరిగినప్పుడు నుండి ఏడు ఎనిమిది కల్లా తినేది ఆలవాటు.ఉన్నిందో లేందో ఆ టయానికి  తినేయల్ల.  నా కోడలు తినొద్దనే .అమ్మ నేను సచ్చిపోతే పానీలే పెట్టమ్మా అంటి .తినేసి ఇట్లా వస్తా ఉండా. కాదమ్మా మేము చిన్నప్పుడు ఇట్లాటివి ఏంటివి లేవు. ముపై ఏండ్లు నుండి మటుకే గ్యానం బడితే నిండు మనసులు గా ఉండేవాళ్లను బయట తిరగనీయకుండా గ్యానం ఇడస్తానే కోళ్లు కోసి ఆ రగతం తో బొట్టు పెడతా ఉండిరి. అంతకుముందు యాది లేదు.అయినా అప్పుడు నెలకు రెండు వాన్లు  పడేవి. ఇప్పుడు లేని చిన్నెలన్ని చేసినా  సంవత్సరానికి కూడా వాన కురసల. అయినా పోయే పానానికి ఏది అడ్డపళ్ళేందు. బాపనోడు జంజం తాడు మెడలో ఏసుకొని నొస్ట్నఇబూది రాసుకుని కుసున్నతావన లేయకుండా మనసులను మేపే సుద్దులు చెప్తా ఉంటే అవన్నీ ఇంటే మనం బతికేనా. ” కలిగినోని సిన్నిల్చూసి లేనోని పానంపాయి నంట”  “వినేవాడు ఎర్రిముండ అయితే చెప్పే వానికి లగువంట” .గ్యానం పట్టేది ఇడిసేది మామూలే.చెప్పే మాటలన్నీ మనుషులు కలగరూప కోనుండేటివి మా  అనేసి పాయ!
 
                        తొమ్మిది కంతా మా పెద్దమ్మ మడి కోయను కూలోల్ల కోసం వచ్చె .ఇరవై మంది కూలోల్లు ఆయాలకే ఉంది లేంది తిని పనికి బాయిరి .ఇంగా ఇండ్ల కాడ పనిపాట లేని ఆడమగ ఈ పనులు చేసుకుంటున్నారు. గ్యానం ఇడస్తానే కోళ్లు కోసి టెంకాయ కొట్టి నిండు మన్సులుగా ఉండే ఆవులకి  ఆడోళ్లకి బొట్లు  పెట్టిరి .
                      కిట్టడు నాకు తమ్మునివరసవతాడు. ఫుల్లు తాగుబోతు. వాని పెండ్లాము నిండుమన్పి . కోడ్ని కోయాలని కనిపించి నోన్నల్లా  అప్పడగతా ఉండాడు.కోడికి దాంట్లోకి నంజు మందుకి ఐదు నూర్లు ఇస్తేనే అని నాకాడ కుసున్నా డు.నువ్వు ఐదు నూర్లు ఇస్తావా సస్తావా అని పట్టుకున్నాడు.ఇచ్చిందంకా నన్నిడగలే . దాంతో ఐదున్నూర్లు ఇస్తి . అదొక ఒట్టం నాకు. 
 
                      ఈ పొద్దు మా ఊర్లో ఏ ఇంట్లో చూసినా తునకలకూర గమ,గమ వాసనతో ఉడకతా ఉండాయి. సాయంత్రంగా మా ఈర్నాయన మాఇంటి కాడికి వచ్చె .  ఏం నాయనా నువ్వు చేయలేదా తునకల చారు అనే. లేదు నాయనా మా ఇంట్లో నిండుమన్సు లు ఎవరు లేరు అంటే గ్యానం మింద సొట్టుతో కోల్లన్న కోసుకొని తిన్నీలే అనే!   మాకాలాన ఇప్పటి సదువులు క్యాలెండర్లులేవు . టీవీలు ఫోన్లు లేవు, ఎన్నెల మలిచేది ఎన్నెల గుంకేది చూసి నెల లెక్క గట్టే వాళ్ళం . మనకు తెలిసిన దేవుల్లు భూదేవితల్లి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గంగాదేవి, అగ్గిదేవుడు, గాలి దేవుడు.  ఎవరెన్ని చెప్పినా వాల్లకే  మనం మొక్కల్ల  అని పాట  పాడుకుంటా పాయ!
 
“తాలే లిల్లాయలో  శివ తాలే  లిల్లాయలో ,
చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనురా,
సిందు తొక్కే ఈరబాబు నేనే నురా
తాలే లిల్లాయలో శివ తాలే లిల్లాయలో
చంద్ర గ్యానం  నాడు చేపిస్తా నా కత్తి
సూరే గ్యానం  నాడు చూపిస్తా నా కత్తి
తాలే లిల్లాయలో శివతాలే లిల్లాయలో 
 
ఆ సాయంత్రం మా తోడికోడలు తునకలకూర తెచిచ్చా.మేము తిని పొనుకుంటిమి .
 
 
అర్థాలు
 
సూరేగ్యానం-సూర్యగ్రహణం
నొస్ట్న-నొసటన
సొట్టుతో=సాకుతో 
బెరాయిచ్చినట్లు= దేవినట్టు
రావిటాల=పొద్దున్నే
దిక్కపోయినా= దిగక పోయినా
అరకవ= దొరకవు
పితాలం =పిచ్చి
ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి లో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. రచనలు : ముప్పై కథలతో 'ఎదారి బతుకులు ' కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. లఘుచిత్రాలు : మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుందండీ మీ కథ. సూరే గ్యానం (సూర్య గ్రహణం) వెతలు బలే చెప్పారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు