సురేష్ పిళ్లె చెప్పిన మరణ రహస్యం!

కొత్త కథల శిల్ప రహస్యం విప్పే శీర్షిక ఇది! నిర్వహణ: రవీంద్ర బాబు

 కథల్లో పాత్రలు మాట్లాడతాయి. ప్రవర్తిస్తాయి. ఆ మాటల్లో, చేతల్లో ఆ పాత్రల స్వభావం, వ్యక్తిత్వం, ఫిలాసఫీ, అనుభవాలు తొంగిచూస్తాయి. ఒక్కోసారి నేరుగా ప్రతిబింబిస్తాయి. కథను ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? కథా నేపథ్యాన్ని ఎలా చూడాలి? రచయిత రాసిన వాటిలోంచి మాట్లాడాలా? వదిలేసిన వాటిలోకి తొంగి చూడాలా? రచయిత పరిధి, పరిమితిని ఏ కోణం నుంచి పరిశీలించాలి? కథ వెనుక మరో కథ ఉందా? పాత్రలో మరో పాత్ర దాగి ఉందా? కథా నిర్మాణంలో పాఠకుడ్ని కట్టిపడేసింది ఏంటి? ఇలాంటివి ఎన్నో అవగతం చేసుకోవాలి. వాటి లోతుల్లోంచి కథను విశ్లేషించుకోవాలి. ఇలాంటప్పుడు ఎవరి దృష్టికోణం వాళ్లదే. సార్వకాలిక సత్యాలు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. కానీ పాత్రల ఆలోచనల్లోంచి వాటి అంతరంగాన్ని, సామాజిక సాంస్కృతిక పరిణామాల్ని పరిశీలిస్తే… కథా లోతులను కొంతవరకైనా పట్టుకోవచ్చు. పూర్ణాన్ని, నిరంతరాన్ని గమనించొచ్చు.

మునిసురేష్ పిళ్లె పాతికేళ్లకు పైగా పాత్రికేయవృత్తితో పాటు, రచనా ప్రవృత్తిలోనూ కొనసాగుతున్నారు. భారతీయ మూలాల్లోని తాత్వికత, వర్తమాన ప్రాపంచిక దృక్పథం, స్వాభావికమైన సాహిత్య సౌందర్యం, సూటిగా స్పష్టంగా అవలోకించే సమస్యలు… వాటి తాలూకు అనుభవాలు, పరిష్కారాల్లోంచి మాట్లాడగల రచయిత. హృదయాన్ని కదిలించి, ద్రవింపజేసే ప్రశ్నలను, వాటి సమాధానాలను పాఠకుల మెదళ్లలోకి నేరుగానో, అన్యాపథంగానో చొప్పించగల కథలు రాశాడు. అలాంటి వాటిలో మరణం తర్వాత వైరాగ్యాన్ని చర్చించిన కథ “పూర్ణమూ… నిరంతరమూ”.

ఈ కథలో సురేష్ పిళ్లై భావ, భౌతిక సంఘర్షణల మధ్య తచ్చాడే పాత్రలను.. లౌకిక, అలౌకిక బంధాల మధ్య కొట్టుమిట్టాడే సాంస్కృతిక వారసత్వాలను.. గతానికి వర్తమానానికి వచ్చే వైజ్ఞానిక, సామాజిక మార్పులను చెప్పే ప్రయత్నం చేశాడు. సామాజిక మార్పులు తెచ్చే వైయక్తిక అనుభవాలను చర్చిస్తూనే, పాత్రల నిర్ణయాల వెనుక దాగిన వాస్తవాలను వివరించాడు. రెండుతరాల మధ్య సాంస్కృతికంగా వచ్చిన తేడాను గమనిస్తూనే, అనుభవాల కంటే మానవ సంబంధాల్లో సూక్ష్మంగా దాగిన హృదయ స్పందనలను వినిపించాడు. ఆ సవ్వడుల్లోని మానవీయతను.. ఎదలను తడిపేలా పాత్రల ప్రవర్తనలో, మాటల్లో వివరించాడు.

పాత్రల పరంగా కథలోని వస్తు, రూప విశ్లేషణ సాగిస్తే… మరణం చుట్టూ కథా నేపథ్య అల్లిక, సజీవత, పాత్రల ఆలోచనలు, వైవిధ్యమైన భావ, భౌతిక సంఘర్షణలు కథకు జీవం పోశాయి. తండ్రీ కొడుకుల సంభాషణ, ప్రవర్తన కథలో ప్రధానంగా కనిపిస్తుంది. తండ్రి పాత్ర రాసిన వీలునామా అతడి స్నేహితుడు సేతురాముడు చదవడంతో కథ మొదలవుతుంది. ఈ వీలునామా అందరూ రాసేది కాదు. అసలు కొందరు కూడా రాసేది కాదు. ఆస్తులకు, అప్పులకు సంబంధించింది అసలు కాదు. ఎందుకంటే… ‘తన ఆస్తులు.. మిత్రులు, తను బాగుండాలని హితైషులు కానుకలుగా ఇచ్చిన బిచ్చం అని, వృత్తి అనుమతించిన మేరకు ఎవరికైనా ఎలాంటి వాడికైనా మేలు చేకూర్చడానికైనా కక్కుర్తిపడి వారు కక్కిన కూటికి కతికి సమకూర్చుకున్నవని నిజాయితీగా చెప్పేస్తాడు తండ్రి. అందువల్లే ఆస్తి తనదికాదనుకుంటాడు. దేహం ఒక్కటే తనదని భావించి ఆత్మవాదులను సైతం కాదని దాని గురించి మాత్రమే వీలునామా రాస్తాడు. తను చనిపోయిన తర్వాత శవాన్ని ఉస్మానియా వైద్యకళాశాలకు పరీక్షల నిమిత్తం ఇవ్వమంటాడు. అక్కడి విద్యార్థుల ప్రయోగాలకు తన శరీరాన్ని వాడుకోనివ్వమంటాడు. ఇంతవరకు అభ్యుదయవాదిగా కనిపించిన ఆ పాత్ర తర్వాతే వింతగా, సరికొత్తగా అనిపిస్తుంది.

“నేను చస్తే మెడికల్ కాలేజీ వారికి మినహా ఎవ్వరికీ కబురు చెయవద్దు. దేశాలు పట్టిపోయిన పిల్లలక్కూడా. ‘చివరిచూపు’ అనే కాన్సెప్ట్ మీద నాకు నమ్మకం లేదు. చచ్చిపోయాక ప్రాణం లేని దేహాన్ని చివరిగా చూడడమేమిటి… ట్రాష్! అదివరలో వారు నన్ను ఎప్పుడెపుడు చివరిసారి కలిశారో ఓసారి గుర్తుచేసుకుంటారు, సజీవమైన అదే చివరిచూపు. అదేదో వేడుకలాగా… పూలమాలలూ, మేళాలూ ఈ గోలంతా నాకు కిట్టవు. ప్రాణం మాయమైతే చాలు ఆశవం అప్పుడే దేవుడై పోయినట్లుగా అంతా వచ్చి కాళ్లు మొక్కడాలు,,, ఇలాంటివి నాకు అసహ్యం. అందుకే నా మట్టుకు అలాంటివి లేకుండా చూడగలరు” ఈ విధంగా రాయడానికి ఆ తండ్రిపాత్ర చాలా ఆలోచించి ఉంటుంది. సమకాలీన ప్రపంచంలోని ఒడిదుడుకులు, టెక్నాలజీ, మానవసంబంధాలు, ఆర్థిక స్థితిగతులు, నయా వ్యాపారా సూత్రాలు, ఉరుకుల పరుగుల జీవితాల్లోని ప్రపంచీకరణలాంటిలి ఎన్నో..

“ప్రపంచం గుప్పిట్లో ఇమిడిపోతుంది… యూఎస్ లో ఉన్న కొడుకు ఇండియాలో ఉన్న తండ్రి చనిపోతే, ఆయన్ని ఎలక్ట్రిక్ క్రెమేషన్ బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత యూఎస్ లో తన ఆఫీసు పని చేసుకుంటూ క్రెమేషన్ తాలూకు వెబ్ సైట్ ఓపెన్ చేసుకుని ఓ ‘మౌస్ క్లిక్’ తో తగలెట్టేసే టెక్నిక్ కనుక్కుంటారేమోగానీ, అసలు ఈ తగలబెట్టడం అవసరమా.. అనే ఆలోచన మాత్రం చేయరనుకుంటా..! … మనం మాత్రం శవాలకు దండలేసి, పార్టీ జెండాలుకప్పి దేవుళ్లను చేస్తుంటాం… హైదరాబాదు లాంటి ఊళ్లలో ఆరడుగుల స్థలం కావాలంటే మూడు లక్షలవుతుంది. అయిడియా, సర్కారు స్మశానంలో స్థలాలని తేరగా పంచేయకుండా… రియల్ ఎస్టేట్ వ్యాపారులకిస్తే సరి. ఇక ఎవరు చచ్చినా వాటి జోలికెళ్లరు..” ఇలాంటి సరికొత్త సామాజిక అవసరాలకు అంగీకారయోగ్యమైన అత్యాధునిక భావాలతో ఆ వీలునామా రాస్తాడు. ఈ వీలునామా అతడి భార్యకు కూడా పైత్యంగా తోస్తుంది.

అతడి ఒక్కగానొక్క కొడుకు ఇంట్రావర్టర్. ఎవరితోనూ పెద్దగా కలవడు. ఏకాకి. కానీ కిరణ్మయి వాళ్ల కుటుంబంతో గట్టి సంబంధం ఏర్పడుతుంది. కిరణ్మయి వాళ్లు ముగ్గురు అక్కాచెళ్లెళ్లు. కిరణ్మయి వాళ్ల అమ్మ ఇతడి కొడుకును సొంత బిడ్డలా చూసుకొంటుంది. ఆమె హఠాత్తుగా చనిపోతే, హాస్పిటల్ కు వెళ్లిన కొడుకు, వాళ్ల సొంతూరు శ్రీకాళహస్తికి కూడా వెళ్లొస్తానని చెప్పి, ఇంటికి కూడా రాకుండా అటునుంచి అటే శ్రీకాళహస్తి వెళ్లిపోతాడు. “చివరి చూపులు అయ్యాయి కదా, మళ్లీ అక్కడ దాకా ఎందుకు?” అని తండ్రి అడిగినా వెళ్తే “ఏమిటి నష్టం?” అని ప్రశ్నవేసి మరీ వెళ్తాడు. డప్పులు, పూలమాలలు, హంగామా… ఈ ఇంట్రావర్టర్ వెధవకి భోరున ఏడ్చే స్వభావం, ఏడ్చేవాళ్లను పరామర్శించే గుణం కూడా లేదని ఆలోచిస్తాడు తండ్రి. అదంతా స్మశాన వైరాగ్య చింతనలా భావిస్తాడు అతడు.

పాతికేళ్ల కొడుకు, నలభై ఐదేళ్ల తండ్రి స్నేహితుల్లా ఉంటారు. ఇతడు పురోగామిగా కనిపిస్తాడు, కొడుకు తిరోగామిగా చావులు, బంధాలు, ఆత్మీయతలు అంటూ ఉంటాడు. మారుతున్న సమాజానికి అనుకూలంగా తండ్రి పాత్ర మారినట్లుతోస్తుంది. కొడుకు మాత్రం తండ్రి దృష్టిలో పాతకాలం మనిషి. అందుకే ఏకాయెకిన చావుకు వెళ్లిపోయాడు. కొడుకు తిరిగి వచ్చాక తను రాసిన వీలునామా ఇస్తాడు తండ్రి. కొడుకు చదివి చనిపోయాక “ఎవరినీ పిలవొద్దనీ, ఎవరూ రావొద్దనీ ఆదేశించడానికి నీకేం హక్కు ఉందసలు” అంటూ కటువుగా, సుతిమెత్తగా, విరుపులతో ప్రశ్నిస్తాడు.

ఇద్దరి మధ్యా చర్చ మొదలవుతుంది.. కిరణ్మయి వాళ్ల అమ్మ చావు దగ్గర జరిగిన సన్నివేశాలతో… ఎవరి వాదనను వాళ్లు బలంగా వినిపిస్తారు. జీవుని వేదనకు, చావుకు, ఓదార్పుకు, కర్మకాండకు, మానవీయతకు, మానవ సంబంధాలకు, సాంప్రదాయానికి, మనిషి వ్యక్తిత్వానికి… ఓ తాత్వికమైన రూపకల్పన చేసేదిగా వారి వాదన సాగుతుంది. అర్థం కానీ ప్రశ్నలకు హృదయాన్ని ద్రవీభవించజేసే సమాధానాలు పాఠకులకూ ఆ వాదనలో దొరుకుతాయి.

“నువ్వు ఏడ్చావా..?”

“చావు ఒక విముక్తి. దానికి ఏడవడం ఎందుకు?”

“ఎవరినైనా ఊరడించావా?”

“ఏడుపును మించిన ఊరడింపు ఉంటుందా? మధ్యలో నేనెందుకు?”

“పూల మాలలూ, కాళ్లు మొక్కడాలు…”

“నాన్నా ట్రాష్ మాట్లాడకు. శవానికి మొక్కితే, దండలేస్తే గౌరవించడం కాదు. ఆ మనిషి వ్యక్తిత్వం, మంచితనం గుర్తుంచుకుని మన జీవితంలో ఆచరిస్తే, అదే గౌరవించడం.”

“అందుకోసం నువ్వు హైదరాబాదు నుండి యెకాయెకిన శ్రీకాళహస్తి వెళ్లాల్సిన అవసరమేమిటి?”

“రిలేషన్స్ లాజికల్ గా ఉండవు నాన్నా”

“పలాయిన వాదంను ఆశ్రయించేటప్పుడు వచ్చే మొదటి సమాధానం ఇది.”

చివరికి కొడుకు కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిన కొడుకు సాయంత్రం లాజిక్ తో తిరిగి వచ్చి తండ్రికి సమాధానం చెప్తాడు. దాంతో ఆ తండ్రి కొడుకు ముందు మరగుజ్జుగా మారిపోతాడు. ఏదైనా చెప్పడానికి జీవితానుభవం కాదు, మనసుతో ఆలోచించే గుణం ఉండాలని తెలుసుకుంటాడు.

“ఎవరైనా చనిపోతే మనం వెళ్లడం, పోయిన వారికోసం కాదు నాన్నా మిగిలిపోయిన వారికోసం. రేపు నువ్వు చనిపోతే ఎవ్వరూ రావొద్దని మహా రాసేశావ్. కానీ నీ శవాన్ని మెడికల్ కాలేజీ వ్యాన్ ఎక్కించే వరకూ దాని ముందు కూర్చుని ఉండే నేను ఏడవకపోవచ్చు. కానీ లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది నాన్నా. కోల్పోయిన ఫీలింగ్. మన నుంచి ఏదో, ఎవరో తీసుకెళ్లిపోతున్న ఫీలింగ్. ఎదురుగా వచ్చిన వాళ్లు కనిపించారనుకో.. వాళ్లు ఊరడించకపోవచ్చు. కానీ ‘ఒకరిని కోల్పోయాను, నా కింకా ఇందరున్నారు’ అనే భరోసా అందుతుంది హృదయానికి.

నువ్వు చదువుకున్నావ్ గా నాన్నా… వేదాల్ని. “పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే” అని! దాని అర్థం ఏమిటో ఎవరికైనా చెబితే మన మొహాన్నే నవ్విపోరూ…! మొత్తంలోంచి మొత్తం తీసేస్తే – మొత్తం మిగిలి ఉంటుంది. దేవుడిలో అది ఉంటుందో లేదో నాకు తెలీదు. కానీ అది మానవ అనుబంధాలో ఉంటుంది నాన్నా. పూర్ణమైన ఒక అనుబంధం తెగిపోయింది.. అయితే అనేక అనుబంధాలు ఇంకా పూర్ణంగానే ఉన్నాయి. దాన్ని అనుభూతింపజేయడానికే నాన్నా..” అని చెప్పి తండ్రి మెడచుట్టూ చేతులేసి బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు కొడుకు. తండ్రికి కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లు ఎందుకు వచ్చాయో.. దానికీ లాజిక్ లేదేమో అనే తండ్రి ఆలోచనతో కథ ముగుస్తుంది.

కథంతా మరణం తర్వాత జరిగే తంతు చుట్టూ తిరుగుతుంది. రెండు పాత్రల ఆలోచనల మీద నడుస్తుంది. రెండు తరాల మధ్య పరిధిని, ప్రాపంచిక జ్ఞానాన్ని, మానవీయతను నిలదీస్తూనే, సమాధానాలూ చెప్తుంది. మానవీయవిలువల్లో మరగుజ్జులుగా మారిపోతున్న తరానికి తండ్రి పాత్ర చిహ్నంగా నిలుస్తుంది. మనసుకు, అనుబంధాలకు కొడుకు పాత్ర ప్రతీక. నిజానికి తండ్రి పాత్రలో కొడుకు, కొడుకు ఆలోచనల్లో తండ్రి కనిపించాలి. కానీ రచయిత యువతను ఆదర్శంగా, దార్శనీయతతో నింపి కొడుకు పాత్రను చిత్రించాడు. అలాగని తండ్రిపాత్రలోని నిజాయితీని వదల్లేదు.. భౌతికమై, విలువలు తప్పి సంపాదించిన ఆస్తులకు వీలునామాలో స్థానం కల్పించలేదతను. తనను తాను కేవలం దేహిగా మాత్రమే చూసుకున్నాడు. పెనవేసుకున్న బంధాలను కూడా చివరినిమిషంలో వద్దనుకొని, పరోపకారమే తన లక్ష్యంగా ఆలోచన చేశాడు. చివరకు తన శరీరం కూడా వృధా కాకుండా వీలునామా రాసుకున్నాడు. ఈ భూమిమీదకు దేహంతో వచ్చాడు కాబట్టి, ఆ దేహాన్ని ఇతరుల ప్రయోజనానికే ఇవ్వాలనుకున్నాడు. కానీ వీలునామాలోని తన భావాలు ఇతరుల స్వేచ్ఛకు, ఆలోచనలకు అడ్డుపడుతున్నాయని కొడుకు ప్రశ్నించే వరకు తెలుసుకోలేదు. చనిపోయిన తర్వాత చూడడానికి ఎవ్వరూ రావద్దని చెప్పాడు. అది ఇతరుల హక్కుకు, స్వేచ్ఛకు భంగం కలిగించే కోణం. మరణించాక అతడిని ప్రేమించిన, అతడిని అభిమానించిన వారి హృదయాల్లో ఘనీభవించిన అనుభూతులను శాసించే మాట అది.. అందుకే ఇరకాటంలో పడ్డాడు. టక్కును సమాధానం చెప్పలేకపోయాడు. అతనిలో కించిత్ గర్వం ఉంది. అనుభవాల్లోంచి మాట్లాగడల జ్ఞానిని అన్న అహం ఉంది.

కొడుకు పాత్ర సార్వకాలిక జీవన తాత్విక మూలాలను అందించేది. తండ్రికి గౌరవంతోపాటు, స్నేహాన్ని పంచగల ఔదార్యం, నేర్పు ఉన్నది. వర్తమానానికి, సంప్రదాయాల్లోని మానవీయతను అందించగల నేర్పరితనంతో ప్రవర్తించింది. కిరణ్మయి తల్లి చనిపోతే నేరుగా శ్రీకాళహస్తి వెళ్లింది. తండ్రి అడిగిన ఎన్నో చావుకర్మల వెనుక దాగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, అంగీకరింపజేసింది. మెదుడుకు, మనసుకు ఉన్న లాజిక్ ను బద్దలు కొట్టి, మనసుతో మాత్రమే మానవ సంబంధాలను చూడాలని, మెదడుతో కాదని తండ్రికి అర్థమయ్యేలా వివరించింది. భౌతిక, మానసిక బంధాలు చావుతో ముడిపడి ఉన్న విధానాన్ని హృదయనేత్రాలతో చూడాలంది.

శిల్పపరంగా ఈ కథ పాత్రల సంభాషణ, ప్రవర్తనల మధ్యసాగుతూ పాఠకుల మనోలోతుల్లోకి సన్నటి వర్షపుదారలా జారుతుంది. స్నేహితుడి పాత్ర వీలునామా చదువుతూ దాన్ని వ్యంగ్యంగా, పిచ్చిగా భావిస్తుంది. ప్రధాన పాత్ర స్వభావం, ఆలోచనలు ఈ పాత్ర ద్వారానే పాఠకులకు పరిచయం అవుతాయి. భార్య ప్రేక్షకురాలు. అలాగని అతడి దృక్పథాన్ని అంచనా వేయలేనిది కాదు. వీలునామాలోని అతడి భావాలను పైత్యంగా అంచనావేస్తుంది. ఇక మరో పాత్ర కొడుకు. తండ్రి భావాలతో సంఘర్షిస్తాడు. విమర్శిస్తాడు. విశ్లేషిస్తాడు. వివరిస్తాడు. ఆంగీకరింపజేస్తాడు. కొడుకు స్నేహితురాలు తల్లి చావుకు వెళ్తున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో కథలోకి ప్రవేశిస్తాడు. చివరకు అతడిని తన ముందు, తన మనసు ముందు మరగుజ్జును చేస్తాడు. కథలో అప్రధానంగా కనిపించినా ముఖ్య భూమిక పోషించేవి కిరణ్మయి, ఆమె తల్లి పాత్రలు.

కథలో మనిషి చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాల మీద రెండు పాత్రలు మధ్య జరిగే వాదనే ప్రధానం. అవి ఇచ్చే అర్థాలు, సంధించే ప్రశ్నలు, వాటి సమధానాలలో ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి కుంచించికు పోయిన విధానం కనిపిస్తుంది. అదే కథకు ప్రాణం. అయితే కథను అర్థం చేసుకోవడానికి మెదుడుకే కాదు, మనసుకూ పని పెట్టాలి. మరణచింతనావస్థలో దాగిన ఈ కథ నేటి తరానికి అంతగా చేరువవుతుందా అనే ప్రశ్న ఎదురవుతుంది? అయినా సున్నితమైన వ్యంగ్యం కట్టిపడేస్తుంది. పాత్రలూ ప్రత్యేకమైన మతతాత్విక నేపథ్య పరిథిలోంచే ప్రవర్తిస్తాయి. సంభాషిస్తాయి. కానీ చర్చించిన అంశం సామాజికం… స్వాభావికం… వాస్తవం… కథ వైక్తికం నుంచి సార్వజనీనం వైపు పురోగమనదిశలో సాగుతుంది. అందుకే సురేష్ పిళ్లె కథా రచయితగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

*

సురేశ్ పిళ్లై కథ ఇక్కడ చదవండి

ఎ.రవీంద్రబాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Baaga raasaru.
    Nijam. Manamu rendu sandharbhaallo chanipoyina vaarini chusendhuku velthaam.

    1. Manakosam veltham
    Kadasari choopuki (malli vaallani chudalemu anna feeling tho. Aaa sandharbham gaa vallatho manakunna sambandhaalanu gurthuku thecchukunendhu ku>

    2. Chanipoyina vaallla vallakosam veltham
    (Ante chanipoyina vaalla bandhuvulakosam velatham).

    Mottham meeda chanipoyina vaalla kosamaithe mattuku kaadhu.

  • Suresh Pillai garu vraasina kadha enta baagundo daani ardhaanni visleshisthu Ravindra Babu garu vraasina comments ante bagunnaayi. Sri Pillai gaari rachane chala ardhavantamga vunte, Ravindra Babu gaari visleshana aa rachananela ardham chesukovalo, daani loni vishayaani ela gocharam chesukovaalo spasthamga teliyachestundi. Chaala vishayaalanu andamga cheppina Pillai gaari rachananu Ravindra Babu gaari visleshana dwaara lothulanunchi sprusinche anubhavaanni pondavatchu. Iddaru anubhavagnula nunchi saahithi gandhanni anubhavam chesukune avakaasam itchinanduku chaala dhanyavaadaalu.

  • సందేహం లేదు రవీంద్రా .. సమకాలీన కథకుల్లో సురేష్ పిళ్ళె మాదిరి కథలు రాసి చదువరిలో ఆలోచనలు రేకెత్తించే వారు ఒకరో ఇద్దరో . అంతే . ముఖ్యంగా నువ్వు పరిచయానికి ఎంపిక చేసుకున్న కథ నీలో నిత్యం పైకీ కిందకీ ఊగిసలాడే భావసాంద్రతల త్రాసు ని చెప్పకనే చెప్పింది . సురేష్ కథల్లో దాదాపు ఎక్కువ పాత్రలు ఇలాగే ఉంటాయి. పెద్దవాళ్ళ ఆలోచనలు పురోగమించినట్టు చిన్నవాళ్ళ ఆలోచనలు తిరోగమించినట్టు .. ఈ మధ్య రాసిన్ 2.0 వరకు కూడా . నిజమే . చావుకు వెళ్ళాలి . దండలు వేసి కాళ్ళు మొక్కడానికి కాదు. మిగిలిన వారికి మేమంతా మీకు ఉన్నాం అనే భరోసా కల్పించడానికి. చావుమీద తెలుగులో వచ్చిన కథలు చాలా తక్కువ . సతీష్ చందర్ గారు ఒకటి రాసిన గుర్తు. కారా గారు రాసినా ఆ సబ్జెక్ట్ వేరు . కథతో సురెష్ , కథని విశ్లేషించి నువ్వూ మాలో మరోసారి ఆలోచనల తుట్టె కదిలించారు. అభినదనలు.

  • మరణం తర్వాత జరిగే తంతును రెండు పాత్రల ద్వారా చెప్పించి కథను రచయిత పరిపూర్ణం చేస్తే, ఆ కథలోని పాత్రల వెనకున్న భావ, భౌతిక సంఘర్షణను వ్యాసకర్త వివరించారు. కథను అర్థం చేసుకోవడం, ఆ కథలోని పాత్రలతో మమేకమై అందులోని అంతరార్థాన్ని వ్యాసకర్త చెప్పిన తీరు బాగుంది. మనుషులందరూ మరణానికి ఒకేలా స్పందించరు. మరణించిన వ్యక్తితో పాటు మాయమయ్యే అనుబంధాలను తల్చుకుని తల్లడిల్లితే, మరికొందరు ఏమీ పట్టనట్లు ఉదాసీనంగా ఉంటారు. ఏదేమైనా పోయిన వాళ్లను చూడ్డంకంటే, బాధలో ఉన్నవాళ్లకి భరోసా ఇవ్వదానికే వెళతామన్నది నిజం. రచయితకు, వ్యాసకర్త రవీంద్ర గారికి అభినందనలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు