సురాజలాలన్నీ వేస్ట్..తిలక్ కవిత్వం ముందు!

“మదిర” స్మృతులు-1

  ఏళ్ల క్రితం గతం. విజయవాడలో వున్నప్పుడు స్నేహితులతో సాహిత్య సమావేశాల కోసం ప్రాణం పెట్టే మిత్రుడు యమ్వీయల్ వోసారి రావుగోపాలరావు గారినీ, నన్నూ నూజివీడు రమ్మని పిలిచాడు. ఏమిటీ విశేషం అనడిగాను. ‘ఏవుందయ్యా, కలుసుకుని కమ్మని తెలుగు సాహిత్యం గురించి కబుర్లు పంచుకోడం, ఆత్మస్తుతి, పరనింద చేసుకోడం, రొండు గుండ్రాలేసుకుని ఆనందోబ్రహ్మ అనుకోడం’ అని విడమర్చి చెప్పారు తెలుగు సాహిత్యాన్ని మనసారా ఆస్వాదించే రావుగోపాలరావు గారు. ఆయనెప్పుడూ రౌండ్ వేసుకుందాం అనరు, తెలుగు మీద ప్రేమతో గుండ్రం అనే అంటారు.

నూజివీడు వెళ్లాక యమ్వీయల్ ‘మనవిక్కడ రెండు హాల్స్ లో సమావేశాలు జరుపుకుంటాం. ఒకటి పెద్ద హాలు, మరోటి చిన్నహాలు. పెద్ద హాలు పేరు మీటింగ్ హాల్ – అక్కడ కొద్దిమంది జనంతో మినీ సభ. చిన్నహాలు పేరు ఆల్కహాల్ – మీటింగ్ తర్వాత అక్కడ మన మిగతా కార్యక్రమం’ అని వివరించాడు.

తర్వాత పెద్ద హాల్లో మీటింగ్ జరిగింది. వర్తమాన సాహిత్యం గురించి తమ తమ అభిప్రాయాలు ప్రకటిస్తూ, పంచుకుంటూ హాజరైన కొద్ది మందీ బాగా ఆనందించారు. ముఖ్యంగా తిలక్ కవితల్నీ, కథల్నీ బాగా తల్చుకుని తన్మయించారు.

అంతా వెళ్లి పోయాక యమ్వీయల్, రావుగోపాలరావు గారు, మరొకాయన – పేరు గుర్తు లేదు, నేను ఆల్కహాల్ అనబడే చిన్న హాల్లో టేబుల్ చుట్టూ వున్న కుర్చీల్లోకి చేరాం.

‘గుండ్రాలు పంచండయ్యా’ అన్నారు రా.గో.రా. హోస్టు యమ్వీయల్ సెర్వ్ చేస్తున్నాడు. గ్లాసుల్లో తేలియాడుతున్న ఐస్ క్యూబ్స్ సుడులు తిరుగుతూ సురాపారావతాల్లా అనిపిస్తున్నాయి. జోకులూ, జోవియల్ టాకులతో జోరుగా మాటలు సాగుతున్నాయి. ఎప్పుడో వదిలేసిన మావూరు తణుకు, మనల్ని వదిలేసిన మరపురాని కవి తిలక్ వాత్సల్యం నాకు బాగా గుర్తుకు రాసాగాయి.

– ఎవరెస్టు యెత్తుగా వుంటుందనీ, ఎవాన్ విలియమ్స్ బర్బన్ మత్తుగా వుంటుందనీ, సైబీరియా చల్లగా వుంటుందనీ, అరేబియాలో అసూర్యం పశ్యలుండరనీ అందరికీ తెలుసు.

మరి మా వూరు తణుకు తియ్యగా వుంటుందని యెందరికి తెలుసు. అఫ్ కోర్స్, తెలుగు సాహితీ ప్రియులందరికీ తెలుసు. ఆ తీపి తణుకులో షుగర్ ఫ్యాక్టరీలు మేటవేసే పంచదార తీపి కాదు. సాహిత్యం నా జన్మహక్కు అనే సారస్వత లోకమాన్యుడు శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితా ఝరిది.

– నాకప్పుడు బాగా చిన్నతనం. మా వీధి దగ్గర వీధే తిలక్ గారుండే దేవరకొండ వారి వీధి. వారి పెద్దబ్బాయి సత్యన్నారాయణ మూర్తి అంటే సత్యం, నేనూ క్లాస్ మేట్స్. వాళ్లింట్లో ఆడుకునే వాళ్లం. హైస్కూలు చదువులోకొచ్చాక నేను తెలుగుకి రుచి మరిగాను. తణుకు హైస్కూల్ తిలక్ గారింటికి బహు దగ్గర. నా కాళ్లు యెప్పుడూ తిలక్ గారి వీధి వైపు లాగేసేవి. ఎందుకని చెప్పగలను – వీధి బలీయం!

తిలక్ గారిది బాగా సంపన్న కుటుంబం. ఆయనెప్పుడూ తళతళా మెరిసే పంచె, లాల్చీలో ధవళకాంతులు ప్రసరిస్తూ కనిపించేవారు. అప్పట్లో తణుకులో కార్లు వొకటో రెండో యెప్పుడేనా కనిపించేవి. ఆయన రిక్షా యెక్కి వెళ్తుంటే దర్జా గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు అనిపించేది. వాళ్లింటికి ఆనాటి ప్రముఖ సినిమా నటులు ఆయన అతిథులుగా వచ్చి వెళ్తుండే వారు. ఒక సారి హీరో రామశర్మ వాళ్లింటికొస్తే నేను కిటికీ యెక్కి చూశాను. ‘పడి పోతావురా – యిలా లోపలికొచ్చి చూడు’ అని తిలక్ గారు నన్ను లోపలికి తీసుకెళ్లి హీరో రామశర్మని చూపించారు.

ఓ సారి ఆయన ‘ఇంకా ఏం చదవాలనుకుంటున్నావ్? నీకే సబ్జక్టు యిష్టం!’ అని నన్నడిగారు. ‘నాకు తెలుగు యిష్టం’ అని చెప్పాను. వాళ్లింట్లో పుస్తకాలు చూపించారు. ఎన్ని పుస్తకాలో అని ఆశ్చర్యపోయాను. ఆయన రాసిన ‘నల్లజర్ల రోడ్డు’ కథ, యింకా కవితలు చూపించారు. నేను కూడా యిలా రాయొచ్చా – అని అడిగాను. ‘తప్పకుండా రాయొచ్చు. ఈ వేసవి సెలవుల్లో లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువు ముందు’ అన్నారు. ‘ఏం పుస్తకాలు’ అని అడిగితే, ‘ముందు చదవడం మొదలెడితే, నెమ్మదిగా నీకే తెలుస్తుంది’ అని ప్రోత్సహించి నా చేత యెన్నో తెలుగు పుస్తకాలు చదివించారు.

స్కూలు వార్షికోత్సవాలకు నేను నాటికల్లో నటించే వాడిని. తిలక్ గారు జడ్జిగా వచ్చి నాకు బహుమతులిప్పించారు. ‘నువ్వు తెలుసని కాదురా. బాగా చేశావు కాబట్టి’ అని నవ్వుతూ చెప్పేవారు. తిలక్ గారు గొప్ప రచయితనీ, కవి అనీ నాకప్పుడు తెలియదు. ఆ మాటకొస్తే ఆయనకీ తెలియదేమో.

ఒక రోజు తిలక్ గారు నన్ను పిలిచి, ‘ఒరే వివేకం! మద్రాసులో నాకు తెలిసిన వాళ్లు ఆలివర్ ట్విస్ట్ కథను తెలుగులో సినిమాగా తీద్దావనుకుంటున్నారు. ఆలివర్ వేషానికి నువ్వు సరిపోతావు. మద్రాసు వెళ్దాం. ఇంట్లో అడిగి చెప్పు’ అన్నారు. మా యింట్లో అందరికీ తిలక్ గారంటే యెంతో గౌరవం. సరే అన్నారు. తిలక్ గారికి చెప్పాను. ‘సరే, ఎప్పుడు బైల్దేరేది వాళ్ల దగ్గర్నుంచి కబురు రాగానే చెబుతాను’ అన్నారు. ఇక నాలో మొదలైన రచన మీది ఆసక్తిని, సినిమా వేషం దురద కప్పేసింది. రోడ్డు మీద తిలక్ గారు రిక్షాలో కనిపిస్తే, పరుగెత్తుకు వెళ్లి, రిక్షా ఆపు చేసి అడిగేవాణ్ని- ‘మద్రాసు యెప్పుడు వెళ్తున్నావండీ’ అంటూ.  ‘వెళ్దాంరా- చెబుతాను’ అనే వారు ఆయన. తర్వాత ‘మద్రాసులో యెక్కడ దిగుతావండీ’, ‘అక్కడ యెన్ని రోజులుండాలండీ’, ‘ఎన్ని బట్టలు సర్దుకోవాలండీ’ – యిలా స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ జె.వి.సోమయాజులు గారి ప్రాణం తీసినట్టు రోజూ తిలక్ గారిని వేధించాను. అయినా ఆయన యెప్పుడూ విసుక్కోలేదు. రిక్షాలో కూర్చుని నా జుట్టు నిమురుతూ చిరునవ్వుతో ‘మద్రాసు తప్పకుండా వెళ్దాంరా’ అనే వారు.

ఆలివర్ ట్విస్ట్ తెలుగు సినిమాలో నటించడానికి మద్రాసు వెళ్లకుండానే హైస్కూల్లో నా చదువు పూర్తయింది. విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేరాను. వాళ్ల పెద్దబ్బాయి సత్యం గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. ఓ రోజు వైజాగ్ లో వొక సినిమా వాల్ పోస్టర్ కనబడింది. ఆలివర్ ట్విస్ట్ (పేద బాలుడు) మార్నింగ్ షో చూసి, వేషం మిస్సయిన ఆ పేద బాలుడిని నేనే కదా అనుకున్నాను.

సెలవులకి తణుకు వెళ్లినప్పుడు తిలక్ గారిని కలిసే వాడిని. సంవత్సరాలు గడుస్తున్నాయి.

ఒక రోజు తిలక్ గారి దగ్గర్నుంచి వుత్తరం వచ్చింది – వాళ్లమ్మాయి చంద్రలేఖ పెళ్లకి రమ్మని. తర్వాత నా కథ ‘చరిత్ర శిధిలం’ బాగా రాశానని. పొంగిపోయాను. ఆ వుత్తరం భ.రా.గో కి చూపించాను. బాగా సంతోషించారు. చదువు, పరీక్షల కారణంగా తణుకు పెళ్లికి వెళ్ల లేక పోయాను. కొన్నాళ్ల తర్వాత వాళ్లబ్బాయి సత్యం చెప్పాడు – ‘మా ఫాదర్ పోయార్రా’ అని. బాగా క్రుంగి పోయాను.

– తిలక్ గారి ఆలోచనల్తో రాత్రంతా గడిచింది. తర్వాత మళ్లీ నేను నూజివీడు వెళ్లలేదు.

విజయవాడ వచ్చాక పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు అడిగారు – ‘ఏవిటలా డల్ గా వున్నారు?’ అని.

ఏం చెప్పాలో తోచక ‘ఈ బెజవాడ నీళ్లు నాకు పడట్లేదనిపిస్తోందండి’ అన్నాను.

‘బెజవాడొచ్చాక అసలు మీరు నీళ్లెప్పుడు తాగారు?’ అన్నారు శర్మ గారు సైలెంట్ గా జోకు పేలుస్తూ.

‘అసలు నీళ్లెందుకు తాగడం మానేశారు’ అనడిగారు యన్నార్ గారు–అంటే నండూరి రామమోహన రావుగారు!

‘ఏం చెప్పమంటారు- విస్కీలో నీళ్లు కలిపి తాగితే మత్తొచ్చేస్తోంది. బ్రాందీలో నీళ్లు కలిపి తాగితే మత్తొచ్చేస్తోంది. రమ్ములో నీళ్లు కలిపి తాగితే మత్తొచ్చేస్తోంది. ఓడ్కాలో నీళ్లు కలిపి తాగినా, జిన్నులో నీళ్లు కలిపి తాగినా మత్తొచ్చేస్తోంది. అంచేత యింక నీళ్లు ముట్టుకోకూడదనుకున్నాను’- అన్నాను.

– తిలక్ గారు, యన్నార్ గారు, పురాణం శర్మ గారు, యమ్వీయల్, రావుగోపాలరావు గారు అందరూ యిప్పుడు కీర్తిశేషులు. నేను అవశేషాన్ని.

ఇప్పుడనిపిస్తోంది. తిలక్ గారి అక్షరామృత ధారల్లో తడిశాక సుజలాలూ, సురాజలాలూ శుద్ధ వేస్టని.

*

డాక్టర్. కె. వివేకానందమూర్తి

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావుంది. అనుభవాలూ, జ్ఞాపకాలూ రాస్తూవుంటే బావుంటుంది. రాస్తూవుండండి.
    శ్యామ్

  • గుర్తుకొచ్చే ఆ ప్రతీ ఙ్ఞాపకం అజరామరమే

    అభివాదములండీ

  • Unforgettable childhood memories about Dr. Tilak garu his street and our School. Fortunate enough to spend most of my school time in Tanuku . Thank you V. Murthy garu for awakening my memory lane . Looking forward for some more Rain drops writings from your Life Book 📚🙏🏻

  • చాలా గొప్ప అనుభూతులు మెమరేసుకున్నారు వివేకానందమూర్తిగారూ… నేను కూడా తిలక్ పై వ్యాసాలు రాసాను. తిలక్ గారితో పరిచయ భాగ్యం మామూలు విషయం కాదు.ఆయన కవిత్వం ఇప్పటికీ ఎప్పటికీ ఓ తరగని గని.రసాస్వాదనీయం.

  • సాహితీశిఖరమైన రచయితగా రచయిత వేరు.మన ఇంటి పక్క వ్యక్తిగా రచయిత వేరు.ఆ ఇద్దరి సహచర్యం మీకు లభించింది.మీ అనుభవాలు,వాటిల్లో మీ పద ప్రయోగాలు,సాహితీ మెరుపులను పాఠకులకు పరిచయం చేస్తున్నాయి.అనుభవైకవేద్యం మీ రచనల్లో ఆస్వాదిస్తున్నాము.
    -రచన

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు