సిలకం డబ్బా

వేరే మనిషితో పెళ్లి అనగానే నాగరత్నంకి ఊపిరాడలేదు.

రాత్రి ముత్తయ్య వంతు. అసలైతే వాళ్ళ నాన్న చేయాల్సిన పని ఇది. పొట్టనిండా సారా తాగి సోయలేకుండా పడున్న నాన్నని తిట్టుకుంటూ ఇటొచ్చాడు. ఆ తొందరలో లాంతరు తెచ్చుకోవడం మర్చిపోయాడు. కళ్ళు కుట్టుకున్నా కనిపించనంత చిక్కటి చీకటి. ఆదరా బాదరా నడక. కుమ్మరోళ్ల మూలమలుపు దగ్గర ఎదుర్రాయి కొట్టుకుంది కుడికాలి రెండో వేలుకి. తెల్లతెల్లారి కుప్పనూర్పులకి పోయినప్పుడు కూడా తెలియని చలిసెగ ఇప్పుడు తెలిసొచ్చింది ముత్తయ్యకి. గత్తరపడుతూ ఎడంచేత్తో గట్టిగా నొక్కాడు దెబ్బ తగిలిన చోట. చేతినిండా వెచ్చని రక్తం చిమ్మింది. కింద కూర్చొని, లుంగీ పక్కకి జరిపి, లోన నిక్కర్ గుండీలు తీసాడు. కట కట మని పళ్ళు కొరుకుతూ, బొట్లు బొట్లు ఉచ్చ పోసాడు దెబ్బతగిలిన వేలి మీద. రోట్లో నూరిన ఎల్లిపాయ కారంలాంటి మంట. దీనికంతటికీ కారణమయిన వాళ్ల నాన్నని, కసితీరా అమ్మానాబూతులు తిట్టుకున్నాడు కొద్దిసేపు.

కర్ర పోటేస్తూ మెల్లగా నడిచాడు. చేతి పంపు పక్కనున్న డాబానే కరణం ఇల్లు. వసారా పక్క కిటికీలో గుడ్డి దీపం. అలజడి లేదు. ఎప్పుడో తలుపులేసుకొని పడుకున్నట్లున్నారు. వెంట తెచ్చుకున్న గోనె బస్తా పక్కలా వేసి చతికిలబడ్డాడు వడ్లు గుమ్ము పక్కన. చేతికందేంత దూరంలో పోటు కర్ర పెట్టి, ఇంటి నుండి మోసుకొచ్చిన రగ్గు కప్పుకున్నాడు.

తమది కాని సంపదకి ఎందుకు కాపలా ఉండాలో అర్థం కాదు. ఇప్పటిసంది కాదు, తన చిన్నప్పటినుంచి ఇదే తతంగం. రోజూ రాత్రి ఇంటికొకళ్ళు ఆ సొత్తునంతా కాపాడాలి. తను ముళ్లుగర్ర పట్టుకొని కమ్మోరింట్లో జీతం కుదిరిన మొదటి సంవత్సరం అమ్మమ్మని అడిగినట్టు గుర్తు “ఎందుకు గూడేపోళ్ళు కరణం వడ్లు గుమ్ములకి కాపలా కాయాలి?” అని. అప్పుడు అమ్మమ్మ ముత్తయ్య ఇంకా పుట్టనప్పటి కథొకటి తనకి చెప్పింది.

అప్పట్లో గూడెంలో ఏడంటే ఏడే ఇళ్లట- మూడు మొండితోకోళ్లవి, రెండు వేల్పులోళ్ళవి, ఒకటి మోదుగోల్లది, ఇంకొకటి గద్దలోళ్ళది. ఇప్పుడుమల్లే రోజూ వరన్నం దొరికేది కాదట. ఏ అమావాస్యకో పున్నమికో కమ్మోరింట్లో రెండు గింజలు తెచ్చుకొని వండటమో లేక పొరుగూరులో ఎవరిదయినా పెళ్లైతే ఆ బంతిలో కూర్చొని తినడమో. జొన్నకంకులు లేతగా కాల్చుకొని, వాటిని బంకమట్టితో ముద్దలుగా కలుపుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయట. మొక్కజొన్న చేనుకి పెట్టిన కరెంట్ తీగలకు తగిలిన గేద, గులకలు వేసిన పత్తిచేలో గడ్డితిన్న దూడ, గూడేనికి పండగ వాతావరణం మోసుకొచ్చేవట. చనిపోయిన వాటిని కోసుకుని, మాంసాన్ని ఎండబెట్టి ఇంటిల్లిపాది నెలరోజుల వరకు తినేవారట.

ముసలిదానికి బాగాగుర్తట, ముత్తయ్యవోళ్ళ నాన్న పుట్టిన ఏడు వర్షాల్లేవట. తిండిలేక బాలింతల పాలు ఎండిపోయేంత కరువట. ప్రభుత్వం గూడెపోల్లకిచ్చిన బీడు భూముల్లోవేసిన జొన్నలు, సూర్యుడి ఎండ పొడ పడకుండానే భూమిలోనే కుళ్ళిపోయాయట. కూలికి పోదామంటే రైతుల పొలాల్లో కూడా కాపు అంతంతమాత్రమేనట. రెండువారాలు తినకపోయేసరికి పిల్లలడొక్కలు లోపలికి ఈడ్సుకు పొయ్యాయి. చేసేదేమీలేక ఆడాళ్ళంతా ఒక మాటకొచ్చారు.

ఊరంతటిలో కరణం పొలమే పండింది. పాతవాటిలో వడ్లు పొయ్యడం ఇష్టంలేక, కొత్త వెదురుగుమ్ములు కొనుక్కొని వచ్చాడాయన. కుప్ప నూర్పులకి గూడెపోల్లని పిలిచాడు. ఆరోజు కుప్పకొట్లయ్యేసరికి చీకటిపడింది. కొంగుల్లో పట్టినంత వడ్లు మూటగట్టుకొని, ఒకరి తరువాత ఒకరు మధ్యమధ్యలో చెట్లుచాటుకి ఉచ్చపోసుకోడానికని వెళ్లారు ఆడోళ్లు. గడ్డి తోలేసరికల్లా నాలుగు కుండల వడ్లు పోగయ్యాయక్కడ. పనంతా అయిన తరువాత ఏమీ మాట్లాడకుండా, కూలికొచ్చినందుకొచ్చే మూడుసోల్ల వడ్లు తీసుకొని ఇంటికెళ్లారందరూ. రాత్రిపూట పెద్ద మాదిగ పొలానికి వెళ్లి దాచిన వడ్లు తీసుకొచ్చాడు. సమానంగా పంచుకున్న వాటితో నెలరోజులు సరిపుచ్చారు.

కరువైనా ఆ ఏడు కరణం, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసాడు. బంతిలో తీరొక్క కూర. పెళ్లి తంతు అందరూ చూసేలాగా ఊరి సెంటర్ లో తెర కట్టించాడు. ఈ చివర నుండి ఆ చివర వరకు మెయిన్ రోడ్డు రెండువైపులా చిచ్చుబుడ్డి లైట్లు వెలిగించాడు. తాగినోడికి తాగినంత. అదిగో ఆ రందిలో పెద్దమాదిగ బాగా తాగి నోటికొచ్చినట్టు తిట్టాడట. పనిలో పనిగా కరణాన్ని ఆడాళ్ళంతా ఎలా మోసంచేశారో చెప్పేశాడు. తెల్లారే ఊరంతా పంచాయితీ పెట్టారు. ‘బరితెగించిన ముండల మదం తగ్గించాలని’ కమ్మోళ్ళు కూడా కరణంతో జతకట్టారు. కొరడా దెబ్బలైతే, వంటిమీద గాయాలన్నీ నెలరోజుల్లో తగ్గిపోతాయని, ఎన్నడూ వినని శిక్ష విధించారు- ఆడాళ్ళంతా పదేళ్లు కరణం ఇంట్లో ఒట్టిగా పనిచేసేట్టు, మగోళ్లంతా ఆయన సంపదని ఎల్లకాలం కాపలా కాసేట్టని తీర్పు.

అదిగో ఆ తరం నుండి ఈ తరం దాకా తాము అనుభవించలేని సంపదని బహు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు గూడెపోళ్ళంతా.

ముత్తయ్యకి ఇదంతా చేయని తప్పుకి మోస్తున్న శాపమల్లే తోచింది. ఏమాత్రం అక్కరకిరాని ఈ కాపలా పని ఇంకా చేయిస్తున్నందుకు పెద్దోళ్లని కోప్పడ్డాడు మనసులో. నిద్ర కాచి కాచి అలసిపోయాడు.

ఊరంతా కమ్మేసిన నిద్రా మేఘం ముత్తయ్యని కూడా తన ముసుగులోకి లాక్కుంటూంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కొట్టంలోనుండి దూడల మెడలో కట్టిన గంటల శబ్దం లీలగా వినపడుతుంది. రెప్పవాల్చి తెరచేలోగా, రెండు పొద్దుల జామును ఎవరో తినేసినట్టు అనిపించింది ముత్తయ్యకి. అంతకమునుపు లయబద్ధంగా వినిపించిన గంటల శబ్దం కాస్తా, శృతి తప్పినట్లయింది. పశువుల పాకనుండి శబ్దంలేని అడుగులు. కొద్దిక్షణాల మౌనం. వెనువెంటనే, రెండు బక్కపలచటి రూపాలు గోడదూకి చీకట్లో కలిసిపోయాయి. ‘ఇదంతా కల కాబోలు’ అని, ముత్తయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

తెల్లారుజామున కొట్టంలోనుండి కరణం అరుపు. తోకమీద వాల్తున్న ఈగలను అదిరేయకుండా, కదలకుండా పడుంది ఓ బర్రె దూడ. కళ్ళన్నీ ముత్తయ్యవైపే. ‘గులకలు పెట్టి చంపేశాడనే’ అభియోగం నెత్తినేశారు. తన మాట చెప్పుకోడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిర్దోషిత్వం నిరూపణకి కాగే వేడి నూనె సిద్ధం చేశారెవరో. ముత్తయ్యని పదిమంది రాళ్లపొయ్యి దగ్గరికి నెట్టారు. నూనెలో చెయ్యి పెట్టగానే, పూర్తిగా నీళ్లు వడవని పిచ్చిరొట్టె పొయ్యిలో పెడితే వచ్చే వింత శబ్దం వచ్చింది. సచ్చిన బర్రెలను కూడా తినే గూడెంలో పుట్టినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. చెయ్యనితప్పుకి దెబ్బలు తిన్న మూగజీవల్లే ఇంటిబాట పట్టాడు.

గూడెంలో పండగ సందడి. గొడ్డుమాంసం పచ్చివాసన. కరణమోళ్ళ ఇంట్లో సచ్చిన దూడ, ఇప్పుడు కుప్పలు కుప్పలుగా తాటాకుల మీద నిద్రపోతుంది. మెడ కోసిన చిలుంపట్టిన కత్తిని తాటాకు మూలకి విసిరేశారు. బేసిన్లో పట్టిన రక్తం గడ్డకట్టి చిన్ని చిన్ని ముక్కలుగా విరిగిపోతుంది. పోగులేసిందే తడవుగా చిల్లులుపడ్డ తపేలాలు, సొట్లు పడ్డ కూర సట్టెలు ఒకటే గోల. ముడుసుబొక్కల పంపకం దగ్గర ఎప్పటిలాగే గొడవ. అది నెమ్మదించిన తరువాత ఎవరి వాటా వాళ్ళు తీసుకొని, పొయ్యిగడ్డల వేడి మంటల దగ్గరకి గుమికుడారు, నిప్పులమీద పేగులు పెట్టి కాల్చుకోడానికి.

ఇదంతా ఏమీ తెలియని ముత్తయ్య, కుడిచేతికి కండువ కప్పుకొని, మూలుగుతూ ఇంటికెళ్లాడు. చేతి కట్టు చుట్టూ ఈగల గోల. ఇంట్లో ఎవరూ లేరు. తడిక దడివాలుకి ఆనించిన నులకమంచం వాల్చి పాకకింద నడుంవాల్చాడు. అప్పటికే బొబ్బలెత్తింది చెయ్యి. నొప్పి భరించలేక ఏడ్చాడు. ఎంతసేపున్నాడో తెలీదు కానీ, కన్ను వాలింది. మెలుకువ వచ్చేసరికి నాగరత్నం కొంగుతో చెంపలమీద ఎండిపోయిన నీటిచారికలను తుడుస్తుంది. చేతికి ఎదో పసర రాసినట్టుంది, చల్లగా ఉంది. వీపువెనకాల చెయ్యేసి కూర్చోబెట్టింది. ఇంటిదగ్గరనుండి తెచ్చిన మాంసంతో ముద్దలు కలిపి తినిపిస్తుంది. పళ్ళెంలో తెచ్చిన అన్నం పెడ్డలు అయ్యేంతవరకు తలదించుకుని మౌనంగా ఉంది. కంట్లో నిండి కారిన కన్నీటి చుక్క ముక్కు పుడకమీద పడి మెరిసింది. ముత్తయ్య తన కుడిచేతివేళ్ళ మధ్య నాగరత్నం ఉబ్బిన మొహాన్ని తీసుకొని తల పైకెత్తడానికి ప్రయత్నించాడు. వద్దన్నట్టుగా చేయ్యితో వారించి, ముత్తయ్య వళ్ళో తల పెట్టుకొని ఎక్కిళ్ళు పెట్టుకుంది. “నాకేం కాలేదే పిచ్చిదానా ఎందుకేడుస్తున్నావని” నాగరత్నంని ఊరడిస్తూ, ఆమె తలమీద ఇంకో చేత్తో నిమిరాడు, చెయ్యిమంటని మౌనంగా లోలోపలే భరిస్తూ.

***

నాగరత్నం మనుషుల్ని అంతతేలిగ్గా నమ్మే వ్యక్తి కాదు. కానీ ముత్తయ్యంటే ప్రాణం. కొవ్వొత్తి వెలుగులో మెరిసే వంటిరంగు, పంటిబిగువున అణుచుకున్నట్టుండే సన్నటి నవ్వు. మధ్య పాపిడి నుదుటి దగ్గర నెలవంకలాంటి సిలకం బొట్టు. దోవెంట నడుస్తుంటే, పట్టీల చప్పుడు సందడితో తన రూపం ముందుగానే అందరికి తెలిసిపోయ్యేది. గౌను లోంచి ఓణీలలోకి వచ్చేదాకా నాగరత్నం ఏ పొరుగూరూ పొయ్యింది లేదు. ఊహతెలిసిన దగ్గరనుండి ఇంటిదగ్గర ఉన్నట్టు జ్ఞాపకం కూడా లేదు తనకి. పత్తిచేను కలుపుల్లో దోస్తులతో వానగుంటలాడుకుంది. పాలమొక్కజొన్న బంగారు తీగలతో జడలు అలంకరించుకుంది. నారుమడి బురదలో సమర్తాడింది. తన వయస్సు పిల్లల్లో అందం పట్ల ఉండే శ్రద్ధ తనకి బొత్తిగా లేదు. తీరొక్క బట్ట కట్టుకుని మురిసిపోయ్యే స్తోమతా లేదు. అదేంటో కానీ, తను ఏమి కట్టినా బట్టకే అందమొచ్చినట్టుండేదని గూడెమంతా చెప్పుకునేది.

చీముడుకారే ప్రాయం నుండి చూసినోడే కాబట్టి ముత్తయ్యకి నాగరత్నం ఏమంత ఆకర్షణీయమైన మనిషిలా ఎప్పుడూ కనిపించలేదు. ఉప్పుబిర్రలాటలో వీపుమీద ఒక్కటేసినా, ఐసిరాటలో ఒకరి శ్వాస వేడిగాలి ఇంకొకరికి తగిలేంతలా దగ్గరగా మసులుకున్నా, ఇష్టం అనే తలంపు ఎప్పుడూ కలగలేదు. కానీ, మొన్నొక రోజు, పసుప్పచ్చటి రంగు చీరకట్టుకొని పెద్దమాదిగ కూతురి పెళ్ళికి వచ్చింది. ఎప్పటిలానే నూలుపోగోడా అని వెక్కిరించింది (ఇరవై సంవత్సరాలు వచ్చినా ఇంకా మీసం కూడా రాలేదని ముత్తయ్యకి తిరపమ్మమ్మ పెట్టిన పేరది). అన్నం బంతిలో ముత్తయ్య బగారా వడ్డిస్తుంటే, కూరగిన్నె తీసుకోమని చెయ్యిసాచింది. గరిటె వేడికి చెయ్యంతా చెమటపోసి, ముత్తయ్య చెయ్యి పట్టుతప్పి గిన్నె పడబోయింది. అది కిందపడకుండా చేస్తున్న ప్రయత్నంలో నాగరత్నం ఎడంచెయ్యి గాజు ముత్తయ్య చేతికి చిక్కింది. ఆ క్షణం ముత్తయ్యని మాటల్లో చెప్పలేని భావమేదో ఆవహించింది. ఇంతలో గబుక్కున తేరుకొని, రెండు చేతులతో గిన్నెని పట్టుకొని, నెత్తిమీద ఒక్కటి కొట్టింది నాగరత్నం. రెండడుగులు ముందుకేసి వెనక్కితిరిగి శబ్దంలేకుండా నవ్వింది. అదిగో అప్పటినుండి ముత్తయ్యకి మనస్సు ఉండబట్టడం లేదు. ఆ రాత్రి వంటిమీద కాసిన్ని నీళ్లు చల్లుకుని, నులకమంచంలో వాలి, చుక్కలు కప్పుకున్న మబ్బుల వైపు చూశాడు. ఇంతకిమునుపు వాళ్లిద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ తనకిప్పుడు కొత్తగా కనిపించాయి. వాటికన్నింటికి ప్రేమ అనే పేరు పెట్టుకున్నాడు.

ఇదివరకు తనంటే ఇష్టమని గౌల్లోళ్ళ నాగులయ్య మనమడు వాగు దగ్గర నాగరత్నం చెయ్యి పట్టుకున్నాడు. అరిచి గోల చేసింది. పోయినేడాది ఎండాకాలంలో పెద్దబళ్ళో నాటకాలు చూట్టానికి రాత్రిళ్ళు పోతుంటే, పెద్ద కమ్మోరోళ్ల అబ్బాయి గోడపక్కకి లాగాలని చూసాడు. రాయిచ్చుక్కొట్టింది. అంతెందుకు, ఆఖరికి ఆర్.యమ్.పి డాక్టరోల్ల పత్తికి పోతే, మంచినీళ్లు తీసుకురావాలనే నెపంతో గది దగ్గరికి రమ్మని తలుపు గొళ్ళెం పెట్టాడాయన. వాడి భార్య ముఖం చూసి చేతికందిన కత్తితో చీరేయకుండా వదిలిపెట్టింది.

కానీ, ముత్తయ్య సంగతి వేరు. చాలామందిలా తన మీద మనసుపడి పిచ్చి పిచ్చి వేషాల జోలికి వెళ్లకపోవడంతో వెంటనే నచ్చేసాడు. ఆపైన వరస కూడా. అప్పటినుండి బాహాటంగానే ఇద్దరిమధ్య ఏదో ఉన్నట్టు తెలిసేలా నడుచుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే, ఇద్దరు ఒక్కదగ్గర ఉన్నప్పుడు లోకం గురించి వాళ్ళకి పట్టేది కాదు. ఆడదిక్కులేకుండా బోసిగా మూలుగుతుండే ముత్తయ్య ఇంటిముందు, కల్లేపు చల్లి ముగ్గులు పెట్టేది. ముత్తయ్యోళ్ళ నాన్న నోటినుండి కోడలుపిల్లా అని అనిపించుకోడానికి ఇంట్లోపనులు మచ్చటంగా చేసేది. “మా ముత్తిగాడికి ఎర్రగుండె పిల్లని చూసి పెళ్ళి చెయ్యాలిరా” అని ఆయన పరాచికంగా ఎప్పుడైనా ఎవరితోనైనా అంటే, అప్పుడుదాకా పాట పాడుకుంటూ ఊడ్చి కసువు కుప్పేస్తున్నదల్లా, ఎర్రగా ఒక చూపుచూసి, చీపురు ఆయన మీదకి విసిరేసి వెళ్ళిపొయ్యేది. ముత్తయ్యతో జరిగింది చెప్పుకొని అలక నటించేది.

ముత్తయ్య కనకాంబరాల మాల ఇస్తే, తననే జడలో గుచ్చమని వెనక్కి తిరిగి నుంచునేది. పూలు పెడుతుంటే, తనకి దగ్గరగా ఉండాలని కాళ్లవేళ్ళ మీద నిక్కుంటూ, వెనక్కి జరిగేది. కూలికిపోయినపుడు మాపటేల అన్నం దగ్గర, ముద్దలు కలిపి క్యారేజీ గిన్నెలో పెట్టి, ముత్తయ్యకి తినమని ఇచ్చేది. ప్రేమ ఎక్కువై ఎప్పుడన్నా ముత్తయ్య కౌగిలించుకోవాలని చూస్తే, రెండు చేతుల మధ్యలో దూరి, జుట్టుపట్టుకొని తలవంచి, మెత్తని చెవి భాగాన్ని కొరికి పారిపొయ్యేది. ముత్తయ్య పొద్దస్తమానం వళ్ళు ఆగమయ్యేలా కష్టపడినా, రాత్రిళ్ళు నాగరత్నం వళ్ళో పడుకున్నపుడు మాత్రం, ఆ కష్టమంతా ఇట్టే మరచిపొయ్యేవాడు.

పసర ఎండిపోయినట్టుంది. చెయ్యిమంట ఎక్కువవుతుంటే, ముత్తయ్య నొప్పి భరించలేక మెలికలు తిరుగుతున్నాడు. నాగరత్నం పసర పిండాలని ఇంకొన్ని బెల్లపాకుల కోసం వెతుకుతుంది. నాగరత్నంని వెతుక్కుంటూ వచ్చిన జానకమ్మ ముత్తయ్య ఇంటి దగ్గర ఆగింది. కూతురి గొంతులా అనిపించేసరికి, మెల్లగా ఆ మాటలు విందామని తడికమాటున దాక్కుంది. ముత్తయ్యతో తన కూతురు ఇలా చనువుగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఇదివరకు ఓ రెండుసార్లు నాగరత్నంకి భయంచెప్పినా తన తీరు ఏమి మారలేదు. ఎవరు చెప్తే నాగరత్నం మాట వింటుందో, వాళ్ళదగ్గరికే వెళ్ళింది జానకమ్మ.

 2

చిన కమ్మోరు జానకమ్మ చెప్పింది విని, నాగరత్నం బాగుకోరే వాడిగా ఒక ఇల్లరికం సంబంధం తెచ్చాడు. ఆ మనిషి మెతకగా కనిపించినా, సంబంధం కమ్మోరు తేవడంతో ఏమనలేకపోయింది జానకమ్మ. రెండురోజుల్లో పప్పన్నం, వారంలో పెళ్లిని ఖాయం చేశారు.

వేరే మనిషితో పెళ్లి అనగానే నాగరత్నంకి ఊపిరాడలేదు. ఉన్నపాటుగా ముత్తయ్యతో పారిపోవాలనిపించింది. తీరా రెండురోజులకే పెళ్లిపీటల మీద కొత్త మనిషిలా కూర్చుంది. పెళ్ళైన కొత్తల్లో “ఒరే… ముత్తయ్యో” అని ఎవరు ఎవరిని పిలిచినా గుండె దడగా ఉండేది నాగరత్నంకి. అలా పిలుపు వినపడిన ప్రతిసారి కాళ్ళు ఇంట్లో నిలవకపొయ్యేవి. ఏదో ఒక సాకుతో పాక బయటకొచ్చి రోడ్డెంట వెళ్లే మనిషిలో తనకి తెలిసిన ముత్తయ్య కనిపిస్తాడేమోనని ఆశపడేది.

ముత్తయ్య చివరిసారిగా నాగరత్నంని ఎదురింట్లో నలుగేసేటపుడు చూసాడు. ఆమె ముఖంలో తను ఊహించిన బాధ కనిపించలేదు. అలా అని ఆనందం కూడా లేదు ఆ ముఖంలో. పసుపు రాసేది తనకి కాదన్నట్టు నేల చూపులు చూస్తూ మిన్నుకుండిపోయి కూర్చుంది. దగ్గరకెళ్ళి ఏ విషయమో తేల్చుకునేటంత తెగువ లేదు ముత్తయ్యకి. అసలు తనలోపలి భావాలు బయటకి చెప్పడం తెలీదు. కొన్నిసార్లు చెప్పాలని ఉన్నా, మాటలు కూర్చడానికి తడబాటు పడతాడు. ఈ రోజు మాత్రం అణచుకోలేంత దిగులు, మింగుడుపడని కోపం బయటకొచ్చేశాయి. సంచిలో గుడ్డలు పెట్టుకొని ఇంట్లో నుండి వచ్చేసాడు. ఎటు వైపు వెళ్తున్నాడని వాళ్ల నాన్నకి కూడా ఏ మాట చెప్పలేదు. అదే చివరిసారి, ఆ ఊరి గాలి పీల్చడం. తనదికానిదేదో పోగొట్టుకొని, ఆత్రంగా వెతుక్కునే పిచ్చోడికిమల్లే, పట్నం పారిపొయ్యాడు.

బతుకుతెరువనే నెపంతో తనకి దూరంగా ఎన్నో మైళ్ళు వచ్చేశాడు. రెండురోజులు పనికెళ్ళి, ఐదురోజులు నిషా మత్తులో ఉండేవాడు. డబ్బులు కూడబెట్టుకోవడం చేతకాక మేస్త్రీ దగ్గర మోసపోయాడు. ఊరికి, జీవితానికి దూరంగావచ్చేసి ఏడెనిమిది సంవత్సరాలయ్యాయి. ఈ ఎడబాటు కాలంలో, తన ప్రమేయం లేకుండానే తనవి కాని ఆలోచనలన్నీ తన మనస్సుమీద పేరుకుపొయ్యాయి. చుక్కల పమిటల్లో, ముడతలుపడిన చీరల్లో నాగరత్నంని ఎన్నోసార్లు వెతుక్కున్నాడు. రోడ్డుపక్క టిఫిన్ బండ్లలో అన్నం తింటున్నప్పుడో, రూంలో మిగిలిపోయిన పచ్చడిమెతుకులు తింటునప్పుడో, నిండు పున్నమి రోజుల్లో అన్నం తినమని బ్రతిమిలాడిన నాగరత్నం మొహం ఒక్కోసారి గుర్తొచ్చేది. అలా తను మదికొచ్చినప్పుడల్లా, అప్పటిదాకా భారంగా ఏరుకున్న బ్రతుకు జ్ఞాపకాలన్నీ ఖాళీగా తోచేవి ముత్తయ్యకి.

ఓ రోజు మూడో అంతస్తు పిట్టగోడకి సెంట్రింగ్ పెడుతున్నాడు. గోడ మూడు పక్కలయిపోయి, ఇంకో పక్కే ఇనుప షీట్లు కొట్టే పనుంది. అందుకే సూర్యుడు నెత్తిమీదకొచ్చినా అన్నానికి లేవకుండా పని పూర్తి చేయాలనుకున్నాడు. కిందనుండి ఇంకో మనిషి ఇనుప షీట్లు పైకి అందిస్తుంటే, వాటిని పట్టుకున్నప్పుడు, ఎండ వేడికి సుర సుర మని మండిపోతున్నాయవి. మేకుల డబ్బా పెట్టుకోడానికి జాగా లేకపోయేసరికి ఓ పదిమేకులు నోట్లో పెట్టుకొని, సుత్తితో షీట్ల మీద కొడుతున్నాడు. ఆ రేకుల శబ్దంలో కిందనుండి ఎంత పిలిచినా వినపడక పలక్కపోయేసరికి, చిన్న ఇటుకపెడ్డ తీసుకోని ముత్తయ్య వీపుకి తగిలేలా విసిరేశాడు మేస్త్రి. ఏంటి అని బదులిచ్చేసరికి మేకులన్నీ నోట్లోనుండి జారిపడ్డాయి. తొందరగా కిందకి దిగమని సైగ చేస్తున్నాడు మేస్త్రి. సుత్తి కింద పడేసి మెట్ల నుండి కిందకి దిగుతుంటే, తలపాగా పెట్టుకున్న చిన్నాన్న కనిపించాడు. పొద్దునెప్పుడో వచ్చాడట సిటీకి వెతుక్కుంటూ, రూంకి వెళ్లి అడిగితే ఇక్కడికి పంపారని ముత్తయ్యకి చెప్పాడు.

కంకర మీదున్న ప్లాస్క్ నుండి టీ వంపుతుంటే, “నాన్న చనిపొయ్యాడురా ముత్తిగా” అని వాటేసుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు. ఊర్లో బయలుదేరిన దగ్గరనుండి అణుచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయకొచ్చేసింది వాళ్ళ చిన్నాన్నకి. ముత్తయ్యకి ఏం జరుగుతున్నదో అర్ధమయ్యేలోపు మేస్త్రి వచ్చి రావాల్సిన కూలిడబ్బులని కొన్ని నోట్లు జేబులో పెట్టాడు. తలకొరివి పెట్టాల్సిన ముత్తయ్య కోసం గూడెం జనం ఎదురుచూస్తున్నారు. ఇంటికి చేరుకునేలోగా పొద్దుపోతుందని ముత్తయ్య చెయ్యి పట్టుకొని వాళ్ళ చిన్నాన్న వడి వడిగా నడుస్తున్నాడు. ఊరికి పొయ్యే బస్సెక్కి రెండు టిక్కెట్లు తీసుకొని వెనక కూర్చున్నారు. రోడ్డు ఎగుడు దిగుడులకి బస్సు ఊగుతుంది. ఇవేమి ముత్తయ్య అనుభవంలోకి రావడంలేదు. కంటిరెప్ప కొట్టకుండా తదేకంగా దేనినో చూస్తున్నట్లుంది చూపు. ఊరు దగ్గర పడుతోంది. పక్కనుండి మెల్లగా చిన్నాన్న చలి వణుకులాంటి ఏడుపు. ముత్తయ్యకి మాత్రం తను ఇంటినుండి వచ్చేటప్పుడు నులక మంచంలో కూర్చుని తన వైపే చూస్తున్న వాళ్ళ నాన్న మొహం పదే పదే గుర్తొస్తోంది. ముత్తయ్య ఆయన్ని చూసింది అదే చివరిసారి. “ఇక్కడే ఉండరా” అని వాళ్ళ నాన్న ఎందుకు తనని అప్పుడు ఆపలేదని ఆలోచించాడు చాలాసేపు.

బొందలగడ్డకి ఎలా వెళ్ళాడో, పాస్టర్ గారు మట్టేసేటప్పుడు ఏమి చెప్పమన్నారో, దింపుడు కళ్లెం దగ్గర ‘నాన్న…నాన్న’ అని పిలిచాడో, లేదో, అసలు ఏమీ గుర్తులేదు ముత్తయ్యకి. కడుపు మాడినా నోరు తెరిచి ఎవరినీ అడగాలని కూడా అనిపించలేదు. ఇంటిముందు ఇసుకకుప్ప మీద పడుకున్న తను, పొద్దున్నే ఎండపొడకి లేచాడు. చెదలు పట్టిన తాటాకుల కప్పు, నెర్లిచ్చిన పందిరి గుంజలు, వాళ్ళ నాన్న చివరి రోజుల ఆనవాలుగా మిగిలిపోయాయి.

తెల్లారి పొద్దున్నే ఎర్రమట్టి తెచ్చి ఇల్లు అలకడం మొదలెట్టాడు, కూలిపోయిన జీవితానికి మళ్ళీ రంగులద్దుతున్నట్టు. వెనకనుండి ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించింది. తిరిగి చూస్తే, పూలగౌను పిల్ల. గాలికి మోహమ్మీద పడిన జుట్టుని సవరించుకుంటుంటే, కనిపించింది కుడిపక్క పన్నుమీద పన్ను, అచ్చం నాగరత్నం కి ఉన్నట్టే. సాయం చేసేదానిలా మట్టితీసుకొని, పలక చెరుపుతున్నట్టుగా, నేలమీద చేత్తో మట్టి రాస్తుంది. దగ్గరికి రమ్మని మట్టిచేత్తో సైగ చేసాడు. నవ్వుకుంటూ దూరంగా పారిపోయింది. ముత్తయ్యకి మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టింది.

***

పెళ్ళైన సంవత్సరానికే కడుపులో ఒక బిడ్డ. దాని మొహమన్నా చూడకముందే భర్త పురుగుల మందు కొడుతూ చనిపోయాడు. కమ్మోరు నోట్ల వెలుగులో, కల్తీ సారా మరణాల జాబితాలో ఇంకొక పేరు ఎక్కిందప్పుడు. అప్పటినుండి ఒక్కదాని రెక్కల మీద ముగ్గురు నెట్టుకురావటం. బ్రతుకు బాగుపడుతుందనే ఆశతో ఉన్న ఏ తోవని వదిలిపెట్టలేదు నాగరత్నం. ఆ దారిలో గాయాలు, వంటికి కొన్ని, మనసుకి ఇంకొన్ని. వెనక్కి రాలేనంత దూరంగా వేరే మార్గంలో వచ్చేసింది తను. అందుకే మళ్ళీ ఇంత కాలం తరువాత ముత్తయ్యని చూసినా కానీ “ఇన్ని రోజులు ఎక్కడున్నావ్” అని కళ్ళతో పలకరింపే గానీ, మునుపటి జ్ఞాపకాలు తనముందు ఏమి పరచలేదు.

ముత్తయ్య నాగరత్నం గురించి కొన్ని మాటలు విన్నాడు. విన్నవన్నీ నిజం కాకపోతే బాగుండు అని మొదట్లో అనుకునేవాడు. పట్నంలో గడిపిన సంధికాలంలో తను ఊహించుకున్న ఆమె రూపం ఇప్పుడు మాయమవుతుంటే యాతన పడ్డాడు. మాటలు ఎలా కలపాలి అని వేదనపడ్డాడు. జీవితంలో ప్రేమ తెలియని దారులనుండి, ఊహించని మలుపుల నుండి పలకరిస్తుంది. ఈసారి అది ముత్తయ్యకి నాగరత్నం కూతురి రూపంలో తారసపడింది. రెండురోజుల మాటల్లోనే ఏదో పాత మనిషితో ఉన్నట్టే, అల్లరిగా ఉండేది ముత్తయ్య దగ్గర ఆ చిన్ని పాప. తనవల్ల ముత్తయ్య, నాగరత్నం, ఇద్దరూ పాత మనుషులైయ్యారు కొద్దికాలానికే.

చిన కమ్మోరుకి ఈ కలయిక నచ్చలేదు. నాగరత్నం ధిక్కారం ఏ మాత్రం రుచించలేదు. తన అధికారం చూపే రోజు కోసం ఎదురుచూశాడు.

తెల్లారిగట్ట కిట్టయ్యని, ముత్తయ్యని, ఇంకా దొంగాదం ని కమ్మోరోల్లు, సవిటి పొలం దగ్గర టేకు దుంగలు ఎత్తుకెళ్లారని లాక్కెళ్లారు. ఆనవాయితీగా వస్తున్న, వాళ్లకు తెలిసిన న్యాయం అమలుపరచడానికి సిద్ధమయ్యారు. పెద్ద మాదిగలు ఇద్దరూ సర్ది చెప్పడానికి ప్రయతించినా వాళ్ళ మాట ఏ మాత్రం పడనియ్యలేదు.

భుజాలంత ఎత్తుగా చుట్టూరా ప్రహరీ గోడ. మిరపకాయ కళ్లమంత ఇంటిముందు ఖాళీ స్థలం. మధ్యలో ఏనుగంత లావుగా ఓ వేపచెట్టు. కొబ్బరి తాడుతో ముగ్గురునీ కట్టేశారు. సిగ్గుదాచుకోడానికి వంటిమీద కడ్రాయర్ తప్ప ఏమీ లేదు. గోడచుట్టూ గూడెం అమ్మలక్కలు, చిన్న పిల్లలు. కిందకి వేలాడుతూ వడలిన ముగ్గురి మొహాలు. ఎంత కొట్టినా వాళ్ళకి కావాల్సిన నిజం చెప్పకపోయేసరికి, పెద్ద కమ్మోరి భార్య దొడ్లో ఉన్న వరిగడ్డి మోకుని పట్టుకురమ్మన్నారు.

వెనక దారిన ఇంట్లోకి దూరి, చిన కమ్మోరికి సైగ చేసింది నాగరత్నం. “మాయ్యా, నీకు పసి పిల్లలున్నారు. కొడితే ఈ ఉసురు వాళ్లకు చుట్టుకుంటుంది. నువ్వు కొట్టొద్దు మాయ్యా ” అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. గడ్డం పట్టుకొని బ్రతిమిలాడినా ఎంతసేపటికి తనవైపు చూడకపోయేసరికి మోకాళ్ళమీద పడింది. గుండెలమీద కొట్టుకుంటూ గట్టిగా ఏడ్చింది. ఇదేమి పట్టనట్టు గుమ్మంకేసి నడిచాడు. గచ్చుమీద దొర్లుతూ కాళ్ళు పట్టుకుంది. రెండు చేతుల్తో కాళ్ళ చుట్టూ దండవేసేసరికి కదలలేకపోయాడు. చిన కమ్మోరికి, నాగరత్నం ముత్తయ్యతో మాట్లాడటం ఇష్టంలేదు. ఆ కోపమే ఇలా బయటకు వస్తుందనుకుంది ఆమె. ఇక ముత్తయ్య ఊసు ఎత్తనని, ఈ సారికి దయ ఉంచి వాడిని వదిలేయమంది నాగరత్నం.

కోపం అణుచుకోలేక గుప్పిళ్ళు మూసి వీపు మీద గుద్దాడు. జుట్టు పట్టుకుని పైకి లేపి, బుసలు కొడుతూ ఇంకో చేత్తో కుతిక పట్టుకున్నాడు.” మాదిగ లంజముండా, నాకే నీతులు చెప్పేంతదానివా? నీకు ఈ మధ్య బాగా బలిసిందే” అని చేతి వేళ్ళు అచ్చు పడేలాగా బలంగా కొట్టాడు చెంపలమీద. ఊహించని దెబ్బతట్టుకోలేక తూలి కిందపడిపోతుంటే, జాకెట్ దొరకపుచ్చుకొని బయటకు లాక్కెళ్లాడు. ఒక్క ఉదుటున కుడికాలితో రొమ్ములమీద తన్నేసరికి, వంటగది గుమ్మం గుద్దుకొని, తలుపు బయటున్న కుడితి తొట్టె దగ్గర పడింది. పక్కనున్న రోకలిబండ తీసుకొని కొట్టబోతుండగా, “అయ్యా మీకు దండం పెడతా, దాన్ని వదిలిపెట్టండయ్యా” అని జానకమ్మ కూతురిమీద పడింది దెబ్బకాయడానికి.

రోకలితో కొడితే ముసల్ది చనిపోతుందని జానకమ్మని కూడా కాలితో తన్ని, అంతే ఆవేశంగా రోకలిబండ పట్టుకొని వేపచెట్టు దగ్గరకు వెళ్ళాడు. ముత్తయ్య వంటిమీద రోకలి దెబ్బ పడినప్పుడల్లా గోడ చుట్టూ ఉన్న జనం ఊపిర్లో తడి తగిలింది. ఇంటిముందు మోకు దెబ్బలు ముగ్గురి వంటిమీద చేస్తున్న శబ్దానికి, నాగరత్నం మెల్లగా మూలిగింది. గాలి పీల్చుకుంటున్న శబ్దం రాకపోవడంతో, ముత్తయ్యని కొట్టడం ఆపేసి, చిన కమ్మోరు ఇంట్లోకి వెళ్లిపోయారు. టేకు దుంగలు దొంగాదం ఇంట్లో దొరికాయని సాయంత్రం కట్లు విప్పారు ముగ్గురుకి.

***

ముత్తయ్య వీపుమీద ఉబ్బిన వరిగడ్డి మోకు వాతలు తగ్గిపోవడానికి ఓ మూడు నెలలు పట్టింది. కానీ, నాగరత్నం మంచానపడి మళ్ళీ కోలుకోలేదు. తలకి తగిలిన దెబ్బ, జాకెట్ గుండీలు దగ్గర పడిన వేళ్ళ అచ్చులు తొందరగానే తగ్గిపోయాయి. తగ్గడంతోపాటు ఇన్నిరోజులు చిన్న కమ్మోరుకి కేవలం తన వంటితోనే అవసరం అనే నిజంకూడా తెలిసొచ్చింది. కొంత బలం వచ్చి తన పని తాను చేసుకొనేలోపు, దగ్గు ఎక్కువయింది. 10 రోజుల తరువాత డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే, టీబీ అని కట్టల కట్టల మందులిచ్చాడు. చివరి రోజులంతా మంచం చుట్టూ మందు బిళ్ళల వాసన.

నాగరత్నం మర్నాడే కోలుకుంటుదని, ఇద్దరూ మళ్ళీ కూతురితో కలిసి ఆడుకుంటారని అందరికీ చెప్పేవాడు ముత్తయ్య. రోజులు గడిచేకొద్దీ, తనకి కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. ఓ రోజు పొద్దున్నే వచ్చి నాగరత్నం మొహాన్ని తడిగుడ్డతో తుడిచి, సిలకం బొట్టు పెట్టాడు. కూలిపోతున్న గుడిసెమీద సూర్యుని సన్న వెలుగులా, మిణుకు మిణుకుమంటుంది ఆ చుక్క బొట్టు. ఓపికలేక నిద్రపోతుంది నాగరత్నం. మళ్ళీ ఊర్లో కొచ్చిన ఇన్నాళ్లకు తనని చెంప మీద ముద్దుపెట్టుకున్నాడు.

ఇది జరిగిన రెండు రోజులకి, పొద్దు పొడవని చీకట్లో నాగరత్నం కలిసిపోయింది. “తల్లి చేసిన పాపం చుట్టుకొని పోయిందని” అందరన్నారు. మాయదారి రోగమొచ్చి, గట్టిగా లాగితే చెయ్యి ఊడి వచ్చేటంత బక్కగయ్యింది. ఎంత బక్కగానంటే, బొందలకాడికి తీసుకొని పొయ్యేముందు స్నానం చేయించి పాడె మీద పడుకోపెట్టినపుడు , ఇంకా ఎదగని చిన్నపిల్ల శరీరంలా అగుపించింది నాగరత్నం. “తల్లే అలవాటయ్యి, పిల్లని కూడా అలవాటు చేసింది అదే మనిషికి. మాయ రోగం రాదా మరి” అని దీర్ఘాలు తీశారు కొందరు. ముత్తయ్య ఇంటికొచ్చిన కొత్తలో విన్న మాటలన్నీ మళ్ళీ రెండోసారి విన్నాడు. ఈసారి బిగ్గరగా.

దినం ఐన మరుసటిరోజు నుండే పొద్దున్నే పనికెళ్లేవాడు ముత్తయ్య. సాయంత్రం ఇంటికొచ్చి కూతురిని ఆడించేవాడు. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న తనని పెంచడంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఇప్పుడు తెలుస్తోంది ముత్తయ్యకి. అప్పుడు వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ నేర్చుకున్న పనులు- బూడిదతో బొచ్చలు రుద్దటం, కట్టెలతో కూరలు వండటం, చేతివేళ్ళ తోలూడొచ్చేలా బట్టలు ఉతకటం- ఇప్పుడు అక్కరకొచ్చాయి.

కారణం ఏంటో గానీ, ఓ రెండేళ్లు ముత్తయ్య జుట్టు కత్తిరించుకోలేదు. వీపుదగ్గర వరకు వెంట్రుకలు పెరిగిన తరువాత ముడేసుకోవడం మొదలెట్టాడు. నాగరత్నం కోసం తెచ్చిన సిలకం బొట్టు ఇప్పుడు తను వాడటం మొదలెట్టాడు. మొదట్లో వింతగా చూసినా తరువాత అందరూ పట్టించుకోవడం మానేశారు. ఊరి చిన్నబడిలో కూతురి చదువైన తరువాత హాస్టల్ లో చేర్పించాడు.

చిన కమ్మోరికి కూడా మాయ రోగం వచ్చిందని, మందులు, మంచి మాంసం తిని కొద్దిగా కోలుకున్నాడని గూడెంలో మాట. ఒకటి రెండు సార్లు నాగరత్నం పిల్లని దగ్గరికి తీసుకోవాలని చూసాడు కూడా ఆయన. ఆ వెంటనే తన చేతులకి అంటిన రక్తం గుర్తొచ్చి దూరంగా పొయ్యేవాడు. ముత్తయ్య దారెంట కనిపించినప్పుడల్లా మాత్రం చిన కమ్మోరి కళ్ళు ఎర్రగయ్యేవి.

కూతురు హాస్టల్ లోకి పోయిన కొత్తల్లో మనుషులెవరు లేనట్టుగా ఉండేది ముత్తయ్య ఇల్లు. పొద్దున గంజి తాగటం, ఆ తర్వాత వెలితి గురించి ఆలోచించుకోడానికి కూడా క్షణం తీరికలేని పనిలో కూరుకుపోవడం. రాత్రిళ్ళు నీళ్లు పోసుకొని ఆరుబయట పడుకునేవాడు. ఊహసరిగా లేని వయసులో నాటేసిన పొలం దగ్గర పంచుకున్న కొబ్బరి ముక్కని, ఇంటికి తెచ్చిచ్చిన అమ్మ; తను చనిపోయిన తరువాత “ఆకలి…ఆకలి..” అని ఏడ్చినప్పుడు, తడిసిన కట్టెలు సరిగా మండక కళ్ళల్లో పొగ దూరినా, లెక్కచేయకుండా ఉడుకుబువ్వ వండి తినిపించిన నాన్న, చావుకెదురెళ్ళి దాచుకోలేనంత ప్రేమ కురిపించిన నాగరత్నం, వీళ్ళందరూ గుర్తొచ్చినప్పుడల్లా, ఎడం పక్కన కొద్దిగా నొప్పిగా ఉండేది తనకి. సంక్రాంతి సెలవులకు కూతురు ఇంటికొచ్చినపుడు, బొద్దుగా ముద్దుగా ఉందని సంతోషపడ్డాడు. బెంగపడకుండా అక్కడే ఉండి మంచిగా చదువుకోమని రాత్రుళ్ళు నిద్ర జోకొట్టేవాడు.

కూతురు హాస్టల్ కి వెళ్లిన రాత్రి, ముత్తయ్య పెద్ద మాదిగతో కలిసి తాగాడు. అది కూడా ఐదేళ్ల తరువాత. పళ్ళు సలపరిస్తున్న చలి. వంట్లోకి వెళ్తున్న మందుకు తోడుగా బయట మంటసెగ. మంచుకు తడిసిన కట్టెలనుండి ముదురు గోరింటాకు రంగు నీళ్ల బురుజు పొగలు. మందుచుక్క లోపల పడటంతో, ఇద్దరి మధ్య మాటలు తేలికయ్యాయి. వెలిగించిన చుట్ట ఆరిపోవడంతో నిప్పు తీసుకొని, కాళ్ళు బార్లా చాపుకున్నాడు. “పిల్లని బడికి పంపినావ్ రా” అని పెద్ద మాదిగ అడగ్గానే, పళ్ళు కనబడేలా తలూపాడు ముత్తయ్య. మిగిలిన మందుని కళ్ళు మూసుకుని ఒక్క గుక్కలో తాగి, ఏదో ముఖ్యమైనది చెప్పాలన్నట్టు దగ్గరికి రమ్మని సైగ చేశాడు ముత్తయ్యని- అరే ముత్తిగా ఈ రోజు పొద్దున్నే, పిల్లా, ముసల్ది ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నార్రా మా ఇంట్లో. “మనవరాలు, అమ్మమ్మ గుసగుసలు ఏంటే అని అడిగితే”, “ఆడోళ్ల యవ్వరాలు నీకెందుకయ్యా” అని మా ముసల్ది కసిరేసింది అని చుట్ట నోట్లో పెట్టుకొన్నాడు పెద్దమాదిగ. ఈ మధ్య కొన్ని రోజులుగా ముత్తయ్యని ఒక బాధ వెంటాడుతుంది. తన కూతురికి ఆడాళ్ళతో మాత్రమే చెప్పుకునే విషయాలు ఉంటాయి కదా. బాగోగులు చూసుకోడానికి ఇంట్లో ఒక ఆడ మనిషి లేకుండా పోయిందే అని తెగ కలవరపడ్డాడు. పెద్దమాదిగ మాటలకి తాగింది దిగిపోయినట్టయింది ముత్తయ్యకి. ఆరిపోయిన మంట ఎగదోస్తూ, “మామ, నా పిల్లని ఒక కంట కని పెట్టుకుండవే” అని సన్నగా మాట్లాడాడు. అప్పటిదాకా పిల్ల పెళ్లికని కూర్చిన డబ్బు ఎక్కడుందో చెప్పాడు పెద్దమాదిగకి. ఆ తరువాత మంటసెగ సాక్షిగా వాళ్ళిద్దరికే అర్థమయ్యే బాషలో ఏదో మాట్లాడుకున్నారిద్దరు. నాగరత్నం ఇచ్చిన బాధ్యత బరువు దింపేసుకుని, ముత్తయ్య తను ఇంకా చెయ్యాల్సిన పనేదో మిగిలిపోయిందని నిశ్చయంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు, సూర్యుడు ఉదయించే దిక్కువైపు.

నారుమడి దగ్గర చినకమ్మోరు చచ్చిపోయాడని జనం గుమిగూడారు. కుడికాలు మనిషితో సంబంధం లేనట్టుగా పక్కన పడుంది. ఆ దగ్గరలో చిలుం పట్టిన కత్తి. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న చావు, ఊహించని విధంగా పలకరిస్తే, బ్రతుకు చెట్టు కాండం పట్టుకొని ఉధృతిగా పెనుగులాడినట్టుంది ఆయన మొహం. ఘర్షణ జరిగిందనడానికి గుర్తుగా శవం పక్కన ఓ మూలంతా వేసంగి వరినారంతా చెల్లా చెదురయింది. రాత్రంతా కాలువలో పారిన రక్తానికి పొలమంతా ఎర్రబారింది.

ఆరోజు ముత్తయ్య జుట్టంతా కత్తిరించుకున్నాడు. దువ్వెనతో తలదువ్వి, సిలకం బొట్టు పెట్టుకున్నాడు. ఇంట్లోనుండి బయటకొస్తుంటే పెద్దమాదిగ ఎదురొచ్చాడు. అప్పుడు ముత్తయ్య ‘రాత్రి చెప్పింది మర్చిపోవద్దన్నట్టుగా’ బాధగా పెద్దమాదిగ వైపు చూశాడు . ఒప్పుకోలుగా తల ఆడించేసరికి కుదుటపడ్డాడు. ఖాళీ అయిన సిలకం డబ్బా జేబులో అదుముకున్నాడు. సరిగ్గా అప్పుడే గూడెంలోకి పోలీసు జీపు వచ్చిందని ఎవరో కేకేశారు.

*

మేడి చైతన్య

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బతుకు నదిలో
    ఈదినప్పుడు మాత్రమే
    కథ కండ పుష్టితో
    జివ జీవలాడుతుంది.

    మిత్రులారా,
    సోదరులారా,
    ఇవాళ ఇటువంటి కథ
    చదివినందున బతికిపోయాను.
    ఇంత మంచి కథ రాసిన రచయితకు అభినందనలు
    సారంగ సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు