సాహిల్ వస్తాడు గురించి రెండు మాటలు

మమత తప్ప మతం తెలియని పాప ఇచ్చే భరోసా ‘సాహిల్ వస్తాడు’

   వర్తమాన హిందూ సమాజ రాజకీయాలలో స్వదేశంలోనే శత్రుదేశపు మనుషులుగా , ఉగ్రవాదులుగా, నిత్యం అను మానితులుగా  చూడబడుతున్న భారతీయ ముస్లిం యువత ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను హిందూ యువత కోణం నుండి వ్యాఖ్యానించిన గొప్ప కథ ‘సాహిల్ వస్తాడు’. 2013 ఫిబ్రవరి 21 న హైద్రాబాదు లో జరిగిన దిల్ షుక్ నగర్ బాంబు పేలుడు ఘటన తరువాత పరిణామాల నేపథ్యంలో రాయబడిన కథ ఇది.

  ఒకానొక ఆదివారం కనిపించకుండా పోయిన సాహిల్ గురించి వెతుకులాట ఈ కథంతా. వెతుకులాడింది ఎవరు? ఇంటర్మీడియేట్ నాటి నుండి అతనికి అత్యంత ఆత్మీయమిత్రులు రాము , ఫణి. ఉత్తమ పురుషలో కథచెప్పే పాత్ర రాము. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఉద్యోగాలు  ఉన్నాయి. పది పన్నెండేళ్ల వయసు పిల్లలు ఉన్నారు. బాల్య స్నేహాలు కుటుంబ స్నేహాలుగా బలపడ్డాయి. అందరూ కలిసే సందర్భాలు అనేకం ఉన్నా ప్రతి ఆదివారం సాయంత్రం ముగ్గురూ కలిసి చాయ్ మహల్ లో కలిసి కబుర్లు చెప్పుకొంటూ చాయ్ తాగటం వాళ్ళకు అపురూపమైన సందర్భం. ఆ సందర్భం నుండే కథ ప్రారంభం.ఎప్పటిలాగే రావలసిన సాహిల్ ఎందుకు రాలేదా అని అతనికోసం వెతుకులాటలో ఎదురైన అనుభవాలతో నలిగి ,వేదనపడిన రాము కోణం నుండి ఈ కథలో కనబడకుండా పోయిన సాహిల్ పాఠకులకు తెలిసివస్తాడు.రాజ్యస్వభావమూ తెలిసివస్తుంది.

 సాహిల్ ఒక సున్నితమైన మానవుడు. మిత్రులను, భార్య హసీనాను, రాము కూతురు తితిలీ ని  ఎవరిని ప్రేమించినా హృదయమంతా ఇచ్చి ప్రేమించినవాడు. స్నేహాన్ని,అభిమానాన్ని, ఆరాధనను, వాత్సల్యాన్ని సదా తాజాగా నిలుపుకొనేవాడు. ప్రేమతో,బాధ్యతతో జీవించటానికి తన మతధర్మం నుండి విలువలను స్వీకరించినవాడు. ఆలాంటి సాహిల్ ఆ మిత్రులను, ఆ భార్యాపిల్లలలను వదిలిపోయేట్లు వెంట తరిమిన శక్తి ఏమిటి? ముస్లిముల పట్ల భారతీయ సమాజంలో పెరుగుతున్న అసహనం. ప్రతి ముస్లిం ను తీవ్రవాద శక్తులకు ,పాకిస్థాన్ కు అభేదం చేసి చూపే అంతర్జాతీయ రాజకీయ కుట్ర. పనిగట్టుకొని దానిని పెంచి పోషించి ప్రచారం చేసే రాజ్యం. సాహిల్ కనబడటం లేదని రాము ,ఫణి సాహిల్ భార్య హసీనాను తీసుకొని పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవం చెప్పిన సత్యం అది.

  సాహిల్ పేరు వినగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ గొంతులో ప్రతిధ్వనించిన వెటకారం ముస్లిం తో హిందువుకు స్నేహం ఏమిటన్నట్లు చూసిన చూపు ,ముస్లిం కు అతనిచ్చిన నిర్వచనం, చేసిన హెచ్చరికలు – ముస్లిములు అయినందుకు సాహిల్ వంటి యువకులు ఎంతమంది ఎన్ని అనుమానాలకు ,అవమానాలకు గురిఅవుతూ జీవించాల్సి వస్తున్నదో స్పష్టం చేస్తాయి. “ఈ లోకం ఎలాంటిదో ఎంత చెప్పినా నీకు తెలియదు

                     సీతాకోక రెక్కల మీది హరివిల్లుని తుడిచేస్తుంది

                     అవేవో కృత్రిమ రంగుల్ని చెక్కుతుంది

                     పడమటి సంధ్యకు నెత్తురు పూసి రక్తపాతం అంటుంది.

                     అనుమానాలూ అవమానాలూ సందేహాలూ సంశయాలూ

                     దీని ఒంటి నిండా

                     తుడిచెయ్ శుభ్రంగా” — సాహిల్  ఎప్పుడో పాడిన ఈ గజల్ ను రాము గుర్తుచేసుకొంటాడు. ఆ విధమైన హింసలో అతనెంత గిలగిలలాడాడో ,అబద్ధాలతో కలుషితమవుతున్న లోకపు పరిశుద్ధ్తత  కోసం ఎంత తపించాడో సూచిస్తుంది ఇది. ఈ నేపథ్యంలో అతను అనుమానితుల జాబితాలో మాయం చెయ్యబడ్డాడా లేక అనుమానాన్నే నిజం చెయ్యాలన్న కసిని పెంచుకొన్నాడా ? అసలు తిరిగి వస్తాడా? వంటి అనేకానేక ప్రశ్నలు కలుగుతాయి. ఈ క్రమంలో ధ్వంసమయ్యే జీవితాల ,మనస్తత్వాల పునరుజ్జీవనం సాహిల్ ఆకాంక్ష .

  “లోపల ఒక సీతాకోక చిలక ఉంటుంది. అదే తపనతో,అదేప్రయాణంతో

   అది ఇంకో మృతదేహంగా మిగలకుండా కల్మషం లేని ఏ మల్లెపూవు చేతులు కాపాడతాయో

ఏ లోతు గొంతులోని స్వచ్ఛమయినా పదాలతో అది మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకొంటుందో” — సాహిల్ పాడే గజల్స్ లోని విషాద సౌందర్యం ఆ ఆకాంక్షే. మతాలకు అతీతంగా మానవాత్మ పునరుజ్జీవనానికి మనిషి చెయ్యాల్సిన యుద్ధం , దానికి తోటి మనిషి నుండి అందాల్సిన సహాయం ఇందులో ధ్వనిస్తాయి. సీతాకోక చిలక ఈ కథలో ప్రారంభం నుండి ముగింపు వరకు ముస్లిం అస్తిత్వానికి ప్రతీక. ఆ ప్రతీకను మానవరూపం సాహిల్ తితిలీ అని ముద్దుపేరుతో పిలుచుకునే రాము కూతురు. మమత తప్ప మతం తెలియని ఆ పాప ఇచ్చే భరోసా ‘సాహిల్ వస్తాడు’ అని.   

                                                                                           *

https://www.amazon.in/Sahil-Vastadu-other-stories-Afsar/dp/B07NQL4RF2/ref=sr_1_2?keywords=afsar&qid=1555420686&s=books&sr=1-2

కాత్యాయనీ విద్మహే

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • మీరు, రాసిన, రెండు మాటలు, బాగున్నాయి, ma’am !నిజం గా, సాహిల్, రావాలి, వస్తాడు, అనే మేము కోరుకొంటున్నాము !

  • మీరు రాసిన రెండు మాటలూ ఆ పుస్తకాన్ని వెంటనే కొనుక్కొని చదవాలన్న నా నిశ్చయం ఇంకా బలపడింది.

  • సాహిల్ ఎక్కడికో వెళ్లిపోలేదు…మనలోనే…మనతోనే ఉన్నాడేమో…మనమే గుర్తించడం లేదనిపించిందీ కథ చదవగానే. తీతిలీ ఇచ్చిన భరోసా మనలో మిగిలి ఉన్న మానవత్వాన్ని గుర్తుచేస్తుంది. మీరు రాసిన ఈ మాటలకు వందనాలు.

  • సాహిల్ వస్తాడు కథపై కాత్యాయని గారి సమీక్ష వాస్తవానికి ప్రతిబింబం.. ఆ వాస్తవాన్ని చూడలేని వారికి మనం ఎంత చెప్పినా అర్ధం కాదు.. ఈ దేశంలో ముస్లిం అంటే ఓ నేరస్తుడు.. ఓ ఉగ్రవాది.. పిల్లలపైనా అవే ప్రభావాలు రుద్దుతూ.. వాళ్లనో బూచోళ్ళుగా చూపుతున్న సమాజం.. మత రాజకీయాలు మొదలయ్యాక.. మరింత అభద్రతలోకి నెట్టబడ్డారు.. ప్రస్తుతం దేశంలో వర్గ పోరాటాలు జరుగుతున్నప్పుడు పీడితులు ఐక్యంగా పోరాడుతున్నారు.. nrc, caa ఉద్యమంలో ముస్లిమ్స్ కి మద్దతుగా అభ్యుదయవాదులంతా గొంతెత్తారు.. అన్నది ఎవరో గాని.. వాటిని పట్టించుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం.. మరింతగా రాయడమే అవసరం.. అభినందనలు అఫ్సర్ జీ..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు