సాహిత్య చరిత్రలో ఇదొక ఘట్టం!

రాయలసీమ నుంచి వచ్చిన మరో కథా సంకలనం “చోంగారోటీ’’. 22 మంది ముస్లిం కథారచయితలు రాసిన కథలు ఇందులో ఉన్నాయి. కథకుడు వేంపల్లె షరీఫ్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ సంకలనంలోని కొంతమంది రచయితల అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం.

– సారంగ

 

కొత్త రచయితలకు స్ఫూర్తి “చోంగారోటీ’’

– డా॥ ఎస్‌. షాజిద, కథకురాలు

కథ: అజ్ఞానపు రైలు

‘చోంగా రోటి’ కథా సంకలనంలో రాయసీమ ప్రాంతానికి చెందిన ఈ కథల్లో ముస్లిం జీవితాలను చక్కగా చిత్రీకరించారు. రాయలసీమ ముస్లిం సంస్కృతి స్థానిక సంస్కృతిచే ప్రభావితమై ఎంతో విలక్షణంగా ఉంటుంది. అలాంటి సంస్కృతిని మనం ‘చోంగా రోటి’లో చూడవచ్చు. హిందూ ముస్లిం మధ్య ఉండే సఖ్యత,  కొంతమంది మతవాదులు ముస్లింలపై చూపే వివక్షత, ముస్లింపై ఉండే అపోహలు, ముస్లింలకు ఉన్న అభద్రతాభావం ఇవన్నీ కథల్లో కనిపిస్తాయి.

ముస్లింలలో చాలామంది పేదవారే. వారు పేదరికాన్ని జయించడానికి చేసే ప్రయత్నాలు, తామంతా సమానం అని చెప్పుకునే ముస్లింలలో ఉన్న కుల వివక్ష మొదలైన అంశాలు కూడా ఈ ‘చోంగా రోటి’ కథల్లో  ఉన్నాయి.

ఈ సంకలనంలో ముస్లిం స్త్రీకి సంబంధించిన విషయాలున్నాయి. తలాఖ్‌ సంబంధిత కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇస్లాంలో ఉండే ఆచారాలను వక్రీకరించడం ద్వారా ముస్లిం స్త్రీ ఎదుర్కొనే సమస్యలతో కూడిన కథలున్నాయి. ముస్లిం స్త్రీ చైతన్యాన్ని కూడా మనం ‘చోంగా రోటి’లో చూడవచ్చు. ఈ సంకలనంలో నా కథ “అజ్ఞానపు రైలు’’ ప్రచురితమైంది. వీలుంటే చదివి సూచనలు చేయలగలరు. అయితే ఈ ‘చోంగా రోటి’ని స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో కథలు రాసే ప్రయత్నం చేస్తాను.

2

అస్తిత్వ వక్రీకరణను అడ్డుకుంటున్న రాయలసీమ ముస్లిం కథ

-అక్కం పేట ఇబ్రహీం, ప్రముఖ కథారచయిత

కథ : జైతూన్‌

ఏ ప్రజారాశికైనా తనదైన స్వంత, సహజసిద్ధ అస్తిత్వం ఉంటుంది.శతాబ్దాల తరబడి సాగించిన ప్రస్థానంలో ఆ జాతి ఎదుర్కొన్న అంతర్- బహిర్ సంఘర్షణల, అనుభవాల పర్యవసానంగా ఆ అస్తిత్వం రూపుదిద్దుకొని, విశాలప్రపంచంలో ఒక ఆమోదయోగ్యతను పొంది, జాతిని నిలబెట్టే వెన్నెముక గా రూపాంతరం చెంది ఉంటుంది. అది మైనారిటీ సమూహాలకు మరింత ప్రాణప్రదంగానూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకొనితీరవలసిన ఒక విలువగానూ తయారవుతుంది.

ఒక జాతి అస్తిత్వంపై దాడి చేయడం, నిరంతరం నిందారోపణలు చేయడం, పూర్తిగా వక్రీకరించి ప్రచారం చేయడం వల్ల రాజ్యాధికారానికి చేరువయ్యే/పొందే/ పదిలపరచుకునే ప్రయత్నం నిరంతరంగా సాగే క్రమం ఒకటి నడుస్తు న్నప్పుడు ఆ జాతి ఒక నిత్య అగ్నిపరీక్ష ను ఎదుర్కొంటూనే ఉంటుంది.

రోజువారీ జీవనపోరాటంలో కష్టనష్టాలకు గురిఅవుతూ అసలు- ఆరోపిత అస్తిత్వాల మధ్య నిత్య సంఘర్షణకు గురి అవుతూ, సమాజంలోని వివిధ సమూహాల దొంతరలో ఒద్దికగా సర్దుకుపోతూ, ఒక మానవీయ పరిమళాన్ని, సామరస్య జీవనతాత్వికతను కాపాడుకొంటూ వస్తున్న రాయలసీమ ముస్లిం జీవితాలకు “చోంగారోటీ’’ అద్దం పడుతోంది. భారతీయ సమాజంలో ఎంత భిన్నత్వం ఉందో… భారతీయ ముస్లింల సమాజంలోకూడా అంతే భిన్నత్వం ఉందని చాటుతోంది. ఈ భిన్నత్వం పరస్పరం ద్వేషానికి ప్రాతిపదికగా మారకుండా పరస్పర అవగాహన కు తోడ్పడాలని ఆశిస్తోంది.

చోంగారోటీల్లోని తీపి,ఆత్మీయత ఎల్లెడలా విస్తరించాలని కోరుకొంటూ ,దానికి ఒక మచ్చుతునకగా తన్నుతాను పరిచయం చేసుకుంటోంది ఈ ముస్లిం జీవితాల కథా సంకలనం. కాదంటారేమో ఒకసారి రుచిచూసి చెప్పండి ఈ రోటీల్ని. ….

 

3

నవల రాయడానికి స్ఫూర్తి నిచ్చిన చోంగారోటీ

  • యస్.డి.వి.అజీజ్, రచయిత, చారిత్రక పరిశోధకుడు

చోంగారోటీలో కథ పేరు : కాఫిర్‌

ముస్లిం సమాజంపై ఇతర సామాన్య ప్రజానీకానికే కాదు , మేధావి వర్గంలో కూడా కొందరికి కొన్ని అపోహలు వున్నాయి . అందుకు కారణం ముస్లిం జీవితాల గురించి లోతుగా అధ్యయనం చేయకపోవడం ! తెలంగాణా , కోస్తా , ముస్లిం జీవితాల కంటే రాయలసీమలోని ముస్లింల జీవితాలు కొంత భిన్న ధోరణిలో అగుపిస్తాయి . అందుకు కారణం ప్రాంతీయంగా వుండే సంస్కృతి కొంత, కరువు ప్రాంతం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు కొంత.

వేంపల్లి షరీఫ్ రాయలసీమలోని ముస్లిం జీవితాలను , ఇతరులకు పరిచయం చేయడానికి , 22 మంది రాయలసీమ ముస్లిం కథకులతో ‘ చోంగా రోటీ ‘ పేర ఓ కథల సంకలనం వేయడం ముదావహం.

ఇప్పుడిది అస్థిత్వాల కాలం. ఎవరి వ్యధను వారు చెప్పుకోక తప్పదు . ఈ కథాసంపుటిలో నా కథను కూడా చేర్చినందుకు కృతజ్ఞతలు. ముస్లిం జీవితాలపై కథలేకాక నవలలు కూడా విరివిగా రావలసిన , రాయవలసిన అవసరం ఎంతైనా వుంది . భవిష్యత్తులో ఓ నవల రాసే ప్రయత్నం తప్పక చేస్తాను.

4.

ముస్లిం కథ చారిత్రక నేపథ్యాన్ని చెప్పిన “చోంగారోటీ’’

షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని

తొలితెలుగు ముస్లిం కథా రచయిత

చోంగారోటీలో కథ పేరు : పాచికలు

ఇటీవల వేంపల్లె షరీప్‌ వెలువరించిన రాయలసీమ ముస్లిం కథ సంకలనం “చోంగారోటీ’ గతంలో వచ్చిన సంకలనాలకు కొంత భిన్నంగా ఉంది. ఈ కథల వల్ల ముస్లిం కథ చారిత్రక నేపథ్యం దాని పరిణామ క్రమం అవగతమవుతోంది.

ముస్లిం కథకు సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. కొందరు మేధావులు ప్రాంతీయ దురభిమానంతో చరిత్రను వక్రీకరిస్తే, మరికొందరు ఔత్సాహికులైన రచయితలు ఆధార రహిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఏమైనా అనేక అపోహలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్తితుల్లో ఈ సంకలనం అనేక వాస్తవాలను బహిర్గతం చేస్తోంది.

ముస్లిమే రాసిన తొలి తెలుగు ముస్లిం కథ రాయలసీమలో పుట్టింది అనడం నిర్వివాదాంశం. ఆ విషయాన్ని నేను రాసిన పాచికలు కథ దృవీకరిస్తూ ఉంది. నేనీ కథను 1987లోనే రాశాను కానీ అది 1988 అక్టోబరు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది.

నేను ముస్లిం కథలు రాయడానికి కారణం ఆనాటి లబ్ధ ప్రతిష్టులైన ఇద్దరు రచయితలు వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం. వారి ప్రోత్సాహమే నన్ను ఈ పనికి పురమాయించింది.

షరీప్‌ కృషి వల్ల మరొక నిజం వెలుగు చూసింది. 1996లో అనంతపురం జిల్లా రచయిత్రి షహనాజ్‌ రాసిన “మానవత్వం మకాం వేసిన చోట’ అనే కథ. దీన్ని బట్టి ముస్లిం తొలి, మలి కథలు కూడా రాయలసీమలోనే ఆవిర్భవించినట్టు నొక్కి వొక్కానించవచ్చు.

బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ లో జరిగిన మారణకాండ, ఔత్సాహికులైన ముస్లి రచయితల మీద చాలా ప్రభావం చూపింది. కాల క్రమేణా ముస్లిం కథల్లో దైనందిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు బలంగా చోటుచేసుకుంటున్నాయి.

ఈ సంకలనంలో 22 మంది రచయితల కథలు ఉన్నాయి. ఇంకా కొందరు ఉన్నప్పటికీ సమయానికి వాళ్ల కథలు అందివ్వలేకపోయి ఉండొచ్చు. ఈ సంకలనం ప్రభావంతో చాలామంది ముస్లిం రచయితలు పుట్టుకొస్తారని నా అభిప్రాయం.

ఈ సంకలనాన్ని వెలువరించిన వేంపల్లె షరీఫ్‌ ముస్లిం కథను చరితార్థం చేసినాడు. దానికి ఒక రూపమిచ్చి ముందుకు సాగిపొమ్మన్నాడు. అతని కృషి సఫలీకృతమవుతుందని భావిస్తున్నాను. అందుకే ఆయన రాసిన ముందుమాట చదివి మా ఫాతిమా (నా జీవిత భాగస్వామికి) కు వినిపిస్తే మన షరీఫ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగినాడండి.. అల్లా దయ వల్ల ఇంకా ముందుకు పోవాలని దువా చేస్తున్నాను’’ అంది.  అతనికి శుభాకాంక్షలు.

5.

రెండు వెనుకబడ్డ అస్తిత్వాల సంఘర్షణ “చోంగారోటీ’’

-వేంపల్లె షరీఫ్‌, కథా రచయిత, చోంగారోటీ సంపాదకుడు

కథ : పత్తి గింజలు

ఈ దేశంలో రాయలసీమని,  ముస్లిం సమాజాన్ని ఎదురెదురుగా నిలబెడితే ఇద్దరిదీ ఒకటే వెనకబడ్డ అస్తిత్వం. పేరుకు పాలకులు రాయలసీమవాళ్లే కానీ ఈ ప్రాంతానికి వాళ్లు పొడిసిందేమి లేదు. పేరుకు సాయిబూలు ఈ దేశాన్ని ఏలిన నవాబులే కానీ ఇప్పుడు మింగడానికి మెతుకు లేదు. పైగా రాయలసీమ వాళ్లు కఠినాత్ములని, కన్నబిడ్డలను చంపుకుంటారని, మొరటు నాయాళ్లని ఇంకా ఏవేవో ప్రచారాలు. ఇటు సాయిబూలు కూడా టెర్రరిస్టులని, దేశద్రోహులని, పరాయివాళ్లని రకరకాల ప్రచారాలు. ఎక్కడో చదివాను.. ఒక సమూహాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కూడా వారికి ప్రజామద్దతు లేకుండా చేయాలంటే వారిమీద లేనిపోని అభాండాలు వరుసగా వేస్తుండాలని. రాయలసీమ మీద ముస్లిముల మీద ఇప్పటిదాక ఇదే విజయవంతంగా జరిగింది.

కానీ ఇప్పుడు రాయలసీమ మేల్కొంటోంది. ఇటు ముస్లిములు కూడా జాగృతమవుతున్నారు.

ముస్లిములు ఒకవైపు రోజుకురోజుకూ ప్రశ్నార్థకమవుతున్న తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతూనే మరోవైపు తమ ఆర్థిక వెనుకబాటుకు కారణాల్లో ఒకటైన తమ ప్రాంత వెనుకబాటుతనం మీద కూడా గొంతు విప్పడానికి సిద్ధమవుతున్నారు. ఆ స్పష్టత మనకు ఈ “చోంగా రోటీ’’ పుస్తకంలో కనబడుతుంది.  అయితే ఎంత కఠిన సమస్య మీదైనా మొదట సామరస్య గొంతుతోనే మాట్లాడ్డం ఇక్కడి ముస్లిములకు పుట్టుకతో వచ్చిన అలవాటు.  ఆ గొంతును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఇక మిగతా పీడనకు గురి చేస్తున్న సమాజానిదే.

ఒక చారిత్రక, భౌగోళిక ప్రయోజనం ఈ పుస్తకానికి ఉంది కాబట్టి నేను ఈ పని చేసినందుకు ఒక రాయలసీమ వాసిగా గర్వపడుతున్నాను.

6.

ఇప్పటి భారతీయ సమాజానికి ఒక చారిత్రక అవసరం “చోంగా రోటీ’’

-ఎన్నెస్‌ ఖలందర్‌, ప్రముఖ కథా రచయిత

కథ: మున్నీ బేగం

తెలుగులో తొలి ముస్లిం కథ రాయలసీమ ప్రాంతం నుంచి అందులోనూ కడపజిల్లా నుంచి రావడం ఓ విశేషం. “వతన్‌’’ ముస్లిం కథా సంకలనం తర్వాత ఏ భేషజాలు లేకుండా వచ్చిన కథా సంకలనం “చోంగారోటీ’’. ఇందులో నా కథ “మున్నీబేగం’’ వేయడం అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన దాదా హయాత్‌, మహమూద్‌ కథలతోపాటు నా కథ రావడం ముఖ్యంగా నాకెంతో ఆత్మీయురాలైన శశిశ్రీ గారి కథ కూడా ఇందులో ఉండటం ఓ మధురానుభూతికి చెందిన సందర్భమనే చెప్పాలి.

యువకుడైన వేంపల్లె షరీఫ్‌ చిత్తశుద్ధితో బాధ్యతతో శ్రమకోర్చి ఈ చోంగారోటీని ఎంతో అందంగా తీర్చిదిద్ది పాఠకుల ముందుకు తీసుకునిరావడం ఎంతో అభినందనీయం. నా కథను చిగురంపజేసి దానికి మరింత సజీవంగా తెలుగు పాఠకుల ముందు నిలబెట్టిన కథా సంకలనమే “చోంగారోటీ’’. ఇందులో నా కథకింత చోటు కల్పించిన తమ్ముడు వేంపల్లె షరీఫ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు. “చోంగారోటీ’’ కథా సంకలనం ప్రస్తుత భారతీయ సమాజానికి ఓ చారిత్రక అవసరం.

7.

వివక్షతో నలిగిపోయే ముస్లిముల జీవితం “చోంగరోటీ’’

– ఎస్‌. షబ్బీర్‌ హుస్సేన్, కథారచయిత

కథ పేరు : బూచి

భిన్నత్వంలో ఏకత్వానికి మనదేశం నిదర్శనం. ఆ ‘ఏకత’ను చీల్చడానికి రాజకీయ దుష్టశక్తులు ఎన్ని కుట్రలు పన్నినా.. కుతంత్రాలు చేసినా జనం ‘ఏకతా’టిగా నిలబడి వాటిని ఛేదిస్తారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ముఖ్యంగా రాయలసీమలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంతోమంది రచయితలు రాయలసీమ ముస్లింల జీవితాల్లోకి తొంగిచూస్తూ వారి మధ్య ప్రేమానురాగాల్ని.. ఎక్కిరిస్తున్న పేదరికాన్ని స్పర్శిస్తూ తమ కలానికి పదునుపెట్టారు. వివక్షతో నలిగిపోయే ముస్లింల జీవితాన్ని హృద్యంగా అక్షరీకరించారు. వీటన్నింటిని ఒడిసిపట్టి.. ఒక్కటిగా చేర్చి.. చక్కగా కూర్చి.. అందంగా పేర్చి ‘చోంగారోటీ’గా ఆవిష్కరించారు వేంపల్లె షరీఫ్‌. ఇంతటి గొప్ప పుస్తకంలో నా కథ ‘బూచి’కి చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.

కరో‘నాగు’లా బుసలు కొడుతున్న సమయంలో కొందరు పని గట్టుకుని ఒక సమూహంపైనే విషం చిమ్ముతుండడం కలచివేసింది. ఆ  సమయంలో వివక్షకు గురైన కొందరు నాతో ఆవేదన పంచుకున్నారు.  దీంతో వారి ఆవేదనను ‘బూచి’ రూపంలో అక్షర రూపం ఇచ్చాను. ఈ కథ పబ్లిష్‌ అయిన మరుసటి రోజు ఒక హిందూ సోదరుడు చేసిన కామెంట్‌ నన్ను అమితంగా ఆకర్షిస్తుంది. అదేంటంటే ‘కథలో నీతి.. కథకుడిలో నిజాయితీ  రెండూ నాకు నచ్చాయి… ఎవడో చెప్పేది కాకుండా.. నీ మనసు చెప్పేది వింటే నీ దేశానికి మించిన స్వర్గం లేదు.. హిందువుగానో.. ముస్లింగానో కాకుండా ఇండియన్‌గా ఆలోచించాలి’ అని.

8.

ఇవి మతకథలు కాదు జీవిత కథలు

-మహమూద్‌, కవి, కథకుడు

కథ పేరు: కాసింత నీడ

ఇదో చారిత్రక పుస్తకం అవుతుందని తెలిసే కాబోలు శిల్పం చెక్కినట్టు చెక్కాడు వేంపల్లె షరీఫ్ ఈ పుస్తకాన్ని. పుస్తకం నిండా పరుచుకున్న రాయలసీమ ముస్లీం జీవితం ప్రత్యేకమైనదవడం ఒకటైతే, రాయలసీమ అస్థిత్వంలో భాగమైపోయిన వెనుకబాటుతనంలో తమ అస్థిత్వాన్ని తడుముకోవడం ఈ కథకులు చేసిన ప్రత్యేకమైన పని. ఇందులో ఒక మైనారిటీ తమ మత కథలను చెప్పుకోలేదు. దళితుల కంటే దయనీయమైన జీవిత అనుభవాలని మాత్రమే ఆవిష్కరించారు. కాబట్టి ఒక మతమైనారిటీ సమూహం గురించిన నిబధ్ధత తమ రాయలసీమ అస్థిత్వాన్ని మాత్రమే ఇందులో వ్యక్తీకరించింది. బహుశా ఇందుకు ఇది ఒక చారిత్రక పుస్తకం..ఇంత ఘనకార్యాన్ని సాధ్యం చేసిన వేంపల్లే షరీఫ్ కు వందనాలు. నా కథ “కాసింతనీడ” తీసుకొని నన్నా చరిత్రలో భాగం చేసినందుకు కృతజ్ఞతలు అతడికి..

9.

సాహిత్య సచార్‌ కమిటీ రిపోర్టు “చోంగారోటీ

  • ఇనయతుల్లా, ప్రముఖ కథారచయిత

కథ పేరు : పురుడు

అలనాడు రాయలేలిన సీమ. రాజనాలు పండించిన సీమ. రతనాలు అమ్మిన సీమ.  రాజ భోగం అలరారిన సీమ. కాని నేడు ఆ వైభవం హారతి కర్పూరంలా కరిగి పోయిన సీమ. కరువు రక్కసి కోరలు చాచి కరాళ నృత్యం చేస్తుంటే  చెంపల నిండా కన్నీరై మిగిలిన సీమ మన కళ్ళ ముందు దీనంగా నిలబడి వుంది. అలాంటి  కరువు సీమ లో  ప్రేమాభిమానాలకు కరువు లేదని అందరితో అలాయి బలాయి చేసుకుంటూ ప్రేమైక జీవనం గడుపుతున్నారు రాయల సీమముస్లింలు.

పచ్చి కరువు, ఒట్టి కరువు ఏటేటా ఆ చెంపా ఈ చెంపా వాయిస్తున్న ఘోర కలి కాలం లోనూ చెలిమి కలిమి బలిమిని ప్రదర్శిస్తున్నారు సీమ ముస్లింలు. నవ్యాంధ్ర లో ఎక్కువ సంఖ్య లో ముస్లింలున్న ప్రాంతం రాయల సీమే. సీమ నాలుగు జిల్లాలలోని ముస్లింల దయనీయ వాస్తవ జీవితాల దృశ్య చిత్రాలే చోంగా రోటీ కధలు.

మిశ్రమ జీవితంలోని సౌందర్యాన్ని. శ్రమ జీవితం లోని కాఠిన్యాన్ని  కళ్ళ ముందు నిలబెట్టిన నికార్సైన నిజ జీవన దర్పణం చోంగా రోటీ. యువ రచయిత వేంపల్లె షరీఫ్ ఈ అరుదైన ప్రయత్నంతో తెలుగు సాహిత్య చరిత్ర లోకల కాలం నిలిచి పోతాడు. ముస్లిం జీవితాలను అర్ధం చేసు కోవడానికి ఈ సంకలనం ఒక ఎన్ సైక్లో పీడియా లా ఉపయోగ పడుతుంది. నిజానికి ఇది ముస్లిం జీవితాల సాహిత్య సచార్ కమిటీ నివేదిక లాంటిది.

ఇందులోని  నా కధ పురుడు  గుజరాత్ లో ముస్లింల పై జరిగిన దాష్టీకాన్ని తెలియజేస్తోంది. గుజరాత్ లో కౌసర్ బానో అనే గర్భవతి గర్భంలో త్రిశూలం గుచ్చి శిశువు ను చంపిన దుర్ఘటన  పశుత్వానికి పరాకాష్ట. ప్రపంచం మొత్తం నివ్వెర పోయిన ఈ నికృష్ట సంఘటన కధలో రికార్డ్ కావాలని నేను చేసిన ప్రయత్నం పురుడు .

రాయల సీమలో హిందూ ముస్లిం కుటుంబాలు  చిన్నాన్న, పెద నాన్న, మామా అంటూ వరుసలు కలుపుకోని ఆత్మ బంధువుల్లా  జీవిస్తాయి. అవసరం వస్తే చేలల్లో పని చేస్తున్నప్పుడు నొప్పులు వస్తే కులం, మతం చూడ కుండా తలా ఓ చేయి వేసి పురుడు పోస్తారు. నాకధ లో బాపనయ్య నరసింహయ్య పొలానికి పనికోచ్చిన జబీన్ కు పొలం లోనే పురుడు పోస్తుంది నరసింహయ్య భార్య. గుజరాత్ వలస వెళ్ళిన జబీన్ చెల్లెలు కౌసర్ బానో మాత్రం ముదనష్టపు మూకల బారిన పడి గర్భమే కోల్పోతుంది . ఇదీ విషాదం.

కధ చివర్లో కౌసర్ శవాన్ని తీసుకెళ్ళే దారిలో రామాలయాన్ని కడుతుంటారు ముస్లిం బేల్దార్లు. రాయల సీమలో నేను చూసిన హిందూ ముస్లిం ప్రేమైక జీవనం  గుజరాత్ లోని ఈద్వేష పూరిత జీవనం చూపించడమే ఈ కధ లోని నా లక్ష్యం.

10.

ఉత్తరాది పరిస్థితులు ఇక్కడ ఉండవని భరోసా ఇస్తున్న పుస్తకం “చోంగారోటీ’’

షేక్‌ అహ్మద్‌ బాషా, కథకుడు, నవలా రచయిత

కథ: చిన్నయ్య

చోంగా రోటీ కథలు చక్కగా ఒకదానికి మించి మరొకటి వచ్చాయి. ఒక కథ చదివిన తర్వాత మరొకటి  ‘అరె ఈ కథ ఇంకా బాగుందే ‘ అనేంతగా ఉన్నాయి.

మన దేశంలో, ముఖ్యంగా గుజరాత్ , యుపిలలో మత విధ్వేషాలు రేగడం, మతాల మధ్య అనవసర దూరం సృష్టించి విభజించడం చూస్తే భయమేస్తుంది. కానీ మన రాయలసీమలో అలాంటి సంఘటనలు జరగవు. ఎందుకంటే ఈ రెండు మతస్థుల మధ్య చక్కటి స్నేహం , సహాయసహకారాలు ఉన్నాయి. నాకు ముస్లిం స్నేహితులు ఎంతమంది ఉన్నారో అంతమందీ హిందూ స్నేహితులు కూడా ఉన్నారు. మా ఇండ్లలో జరిగే పండగలు , శుభకార్యాలు అందరూ కలిసి మెలిసి చేసుకుంటాం.

మనమంతా భారతీయులం , మనల్ని ఎవరూ విడదీయలేరు. మా నాన్న గారు ఒక ఉపాధ్యాయులు, ఆయన అనేక పల్లెల్లో పనిచేసారు. ఆయన బతికి ఉన్నంతవరకు అంటే తొంభై సంవత్సరాల వరకు ఆయన శిష్యులు, వారు కూడా అరవై దాటిన వారే వచ్చి ఆయన దర్శనం చేసుకుని పోయేవారే.

ఆ రోజుల్లోనే మా నాన్న గారు స్కూళ్ళలో పద్యాలతో కూడిన నాటికలు పిల్లలతో వేయించేవారు. మన రాష్ట్రంలోని రెండు మతస్థుల మధ్య ఉత్తరభారతం సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో నేను ” సాయిబుసారు ”  అనే కథ కూడా గతంలో నేను రాసి ఉన్నాను. ఇప్పుడు చిన్నయ్య కథను షరీఫ్‌ ఈ సంకలనంలో వేయడం సంతోషం కలిగించింది.

*

పుస్తకం ఇక్కడ దొరుకుతోంది!

Buy CHONGA ROTI (రాయలసీమ కథలు) Book Online at Low Prices in India | CHONGA ROTI (రాయలసీమ కథలు) Reviews & Ratings – Amazon.in

వేంపల్లె షరీఫ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు