సాలీడు… చినుకుపూలు

దో విరహాగ్ని పీడిస్తున్నట్లుగా చంద్రుడు చీకట్లో చిక్కుకుపోయాడు. నల్లని మేఘాల్ని పిండినట్లు కురుస్తోంది వాన. ఊరు నిద్రావస్థ నుంచి జాగృదావస్థను పెనవేసుకోటానికి సిద్ధమవుతోంది. శీతలంలో చలికి గాలులు నిట్టూర్పు విడిస్తూ ఆనందంగా సుఖిస్తున్నాయి. దారాల్లా కురుస్తున్న చినుకులు ముత్యాల్లా రాలుతున్న శబ్దాన్ని మోస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య చూపు మౌనంగానే మాయమవుతోంది. వీధి దీపాలు సౌఖ్యం నుంచి విడివడ్డ శరీరాల్లా వెలుగుతున్నాయి. సాలీడు బంధీ అయిన పచ్చని కొమ్మలు అక్కడక్కడ, అప్పుడప్పుడు నెమ్మదిగా చినుకు పూలతో ఊగుతున్నాయి. పూసీ పూయని మొగ్గలు వాన బిందువుల్తో తాదాత్మ్యం చెందుతూ నవ్వుతున్నాయి.

వేకువజాము… చెరువుకట్ట అవతల బస్సు దిగి అప్పటికి కిలో మీటరు పైనే నడిచాడు సురేష్. మట్టిరోడ్డు. వానతో కలిసిన మట్టివాసన… ఊరు దగ్గరకొస్తుందన్న భావన… నడుస్తున్న కాళ్లు… సెగతో అలమటిస్తున్న మనస్థితి… పరిస్థితి… పరమైక్యం.. పరాయణత్వం… పరస్పరం… ప్రపంచం… నీదా… నాదా… ఇద్దరిది… సుఖం.. అబ్బా ఎన్ని రోజులు?! ఇరవై నాలుగేళ్లు… మౌనం. సీక్రెట్… కాంక్రీట్… బాక్స్ ను మూసెయ్యాలి.. బద్దలు కొట్టినా రాకూడదు. ఎవరూ తెరిచే ప్రయత్నం చెయ్యకూడదు. ఎప్పుడన్నా తనకు తానే తెరుచుకుని… చూసుకుని.. నెమరు వేసుకుని… తృప్తికని.. కని… కలలు కని.. నిజం చేసుకుని… అంతే… తృప్తి… తుత్తి… లోలోపలి జీవితం. లో జీవితం. వితం… వితం… తం… మనిషి తంత్రం.. తత్త్వం… త్వమేవాహం.

****               ****               ****

కాలేజ్ లో శిరీష. ఎం. ఎఫ్. ఎ. చేరినప్పుడు పరిచయం. తొలి పరిచయం. క్లాస్‌లో “ఆర్ట్ ఇన్ ఈస్థటిక్స్” మీద సార్ లెక్చర్ ఇస్తున్నప్పుడు గుచ్చుకున్న కొన చూపు. మోనాలిసా నవ్వుపై నర్మగర్భితంగా ప్రెండ్స్ తో జోక్ చేస్తున్నప్పుడు చాటుగా తగిలిన నవ్వు. తర్వాత కొన్ని మాటలు. మరికొన్ని అవసరాలు. వెరసి పరిచయం. అసలు పరిచయం ప్రేమగా ఎలా మారింది…? మౌనం విప్పితే..!? మాట పెదవి దాటితే…!!? సరే.. కానివ్వు. నాకు నేనేగా… ఈ టైంలో… జ్ఞాపకాలు దాహార్తిని తీరుస్తాయా?!

తను తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో పొగడ్తల మధ్య కొన్ని విమర్శలు. శిరీష హెల్ప్… పెయింటిగ్స్ బాగానే అమ్ముడయ్యాయి. “కళ కొనడం. కళ అమ్మడం”. “కళ కళకోసమే”. “కళ ప్రజ కోసం”. ఎన్ని అద్భుతమైన వాక్యాలు. ఆ వాక్యాలలో తను ఎక్కడ? ఏమో..!!. ఎక్కడ?? కడ!। కట్టకడ?! అథమం… థం… థం… మనసు అమ్మడం. మనసు కొనడం. శరీరం అమ్మడం. శరీరం కొనడం. టూత్ పేస్ట్. అ… కొ. సోప్… అ… కొ. టి.వి, కారు, బైక్, బుక్, డ్రెస్… అన్నీ… కొనడం… అమ్మడం. పెళ్లి… కొనడం, అమ్మడం. పుట్టుక కొనడం, చావు అమ్మడం. అంటే జీవితం. సెక్స్ కొనడం. అమ్మడం. సుఖం కొనడం… అమ్మడం.. అప్పటి చీకట్లో… క్యాండిల్ వెలుగుతోంది. ఆరిపోతోంది. చీకటైపోయింది. క్యాండిల్… క్యా… డిల్… పొడుగ్గా… కొద్దిగా లావుగా…

దారికి అటు ఇటు… పొడుగ్గా తాటిచెట్లు. వానకు తడుస్తూ… గాలికి శబ్దిస్తున్నాయి. ఆ శబ్దంతో నడక. శబ్దం మధ్య నడక. శబ్దంగా నడక. శబ్దం, నేను… నేను, శబ్దం.. నేనే శబ్దం. అద్వైతం. తం. తందనానా భళా తందనానా!! నానా.. నా.. నాన్న ఎలా ఉంటాడు.!? ఏమో?! సరిగా గుర్తు లేదు.

ఇంతకీ శిరీష. నా శిరీష. అందమైన శరీష. నా లవ్ శిరీష. ఎగ్జిబిషన్, పబ్లిసిటీల మధ్య ఓ రోజు. ఓ అద్భుతమైన రోజు. ఆనందం శరీరాలైన రోజు. సెగలైన రోజు. మనసు అదుపు తప్పని రోజు. నిశ్శబ్దంగా.. నిశ్శబ్దమే శబ్దంగా… ఒక… పన్నెండు గంటలకు పది నిముషాల ముందు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన హోటల్ రూమ్ లో…

“సరేష్…!!”

“ఉఁ”

“నేనంటే నీకు ఇష్టం లేదా”

“ఎందుకు లేదు”

“ఇష్టమంటే… లవ్ చేసే అంత ఇష్టం!”

“లవ్..!”

“కొన్ని సుఖాలు సమాజ నియమాల్ని తొలగించీ, తొలగించక సందిగ్ధంలోనే సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించడానికా పేరు”

“సురేష్!??”

“అవును నే చెప్పేది నిజం. పురాణకాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న నిజం.”

“కానీ, నేను అలా కాదు”

“అంతా అంతే.! ప్రారంభం ఎలా అయినా ముగింపు అక్కడికే”

“పెళ్లి చేసుకుందాం”

“అప్పటి వరకూ…”

“ప్రేమికులమే!! బెస్ట్ ఫ్రెండ్స్ ను మించి!”

“అంటే.. ముద్దులు, హగ్గీస్, ఇలా… అలా… అలా… కొన్ని. శరీరం కోసం, దాన్ని ఓలలాడించే మనసు కోసం”

“ఛా…!!”

“ప్రేమ= స్నేహం + సెక్స్. ఇదే అప్పటికీ, ఇప్పటికీ”

“అదంతా కాదు. నన్ను ప్రేమిస్తున్నావా!? లేదా!! నేనంటే ఇష్టమా…!? కాదా!!?”

“ముందు ప్రేమ అంటే ఎలానో చెప్పు?”

“… …”

“సరే నువ్వంటే నాకు అన్ని విధాలా ఇష్టమే. ప్రేమ, స్నేహం. సొసైటీ అనుకునే…?!!”

అలా రెండు గుండెలు తెగని సంభాషణతో వాదులాడుకున్నాక… ప్రేమకు నిర్వచనం ఇవ్వలేక పోయాక.. నాలుగు పెదాల కలయికతో నేను, శిరీష ఒక్కటయ్యాం… అంతకు మించి…

****               ****               ****

నడక… రెండు కాళ్ల నడక. పడక… నాలుగు కాళ్ల పడక… కన్ను తెరిస్తే ఉయ్యాల. కన్ను మూస్తే మొయ్యాల. ఆ నలుగురు… ఆది… అంతం. నడక.. నడక… శబ్దం.. నిశ్శబ్దం. నిశీధి… థి.. త్రి.. త్రిష… అంత అందంగా ఉంటుందా!! త్రిశ్రీ… సాదాసీదా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు.. ఎవరో కట్టిపడేస్తే ఎగురుతా ఉండు… రహస్యోద్యమం. హో..!. చలనం. సంచలనం. అరుపు… కేక… పెనుకేక. కోక… అవును అచ్చమైన తెలుగువారి కోక. అందీ అందని ద్రాక్షలా… కనిపించీ కనిపించని అందాల… కో… కోక.

ఊరు దగ్గరగా వచ్చింది. కంటికి పల్చపల్చగా కనిపించేంత దగ్గరగా. వాన తగ్గి పొడిపొడిగా… పుప్పొడగా మారింది వాతావరణం. కోకలో లేడీ… కోకలో ఆమె… కోకలో స్త్రీ… స్త్రీ… ఆమె పక్కన ఎవరు? నడకలో జెంట్ లా ఉన్నాడే. జెంట్… జెండర్… అవును మగతనే. మగతనే… మగ అతనే.. మగత… మగ… మగ…

చూడాలి. వాళ్లను చూడాలి. నడక స్పీడ్.. కాళ్లకు మనసెప్పుడు చెప్పిందో..!! ఏమో…! నడక… స్పీడ్.. ఫాస్ట్.. స్ట్.. స్టుపిడ్.

పీచు పీచుగా కనిపిస్తున్నారు. మసక మసకగా కనిపిస్తున్నారు. అయినా ఈ టైంలో… వీళ్లకేం పని ఇక్కడ? ఇలా.. ఇద్దరే…  ఇతరులు లేకుండా… వలలతో… వాన వెలసిన తర్వాత. అవును ఏదో బంధం. క్రమ బంధమా…!? అక్రమ సంబంధమా..!!? బంధం శారీరకమా? మానసికమా!!. అవసరమా! సర్వస్వమా!! రెండూనా… నాలుగూనా..!!??

అవును శిరీష నాకులా. సుఖం… సంతోషం… తరతరాల సుఖం. ఆది అంతం లేని సుఖం. అనంతమైన సుఖం. అనంతం. శ్రీశ్రీ అనంతం రాయకుంటే కొన్ని విర్శలకు దూరం అయ్యేవాడేమో!!. హుస్సేన్ సరస్వతీ బొమ్మ గీయకుంటే… కాదుకదా!! ఏది కాదో ఎలా నిర్ణయం? ఏది అవునో ఎలా నిర్ధారించడం??. కళాకారుల లోపలి మనిషిని!. మనిష్షి. మనస్వి, మనో… స్వి.. స్విమ్… సిమ్ కార్డ్… చాటింగ్… శిరీషతో ఆ రకమైన చాట్… ఛీ…

ఆ నడక చూస్తే తెలిసిన వాళ్లలాగే ఉంది. ఆమె ఎవరో!? తెలిసినట్లే ఉంది. ఇంకొంత స్పీడ్ గా నడిస్తే…! చూడొచ్చు. చూసి… ఇద్దరినీ చూసి… చూసి…  తన ఇగో తృప్తి పడొచ్చు. అంతా చూడొచ్చు. ఏదో జరుగుతోంది.. అవును జరుగుతోంది.. తోంది.. తోంది… పదపదా…

ఇంటి పక్కనుండే రాధికా అక్కా..!? అమ్మో ఎంత బరితెగించింది!? తనతో ఎంత సౌమ్యంగా మాట్లాడుతుంది నాట్లో నాలుక లేనట్లు!! మొగుడిపై ఎంత ప్రేమ ఒలకబోస్తుంది!!!. దీనికి మొగుడిచ్చే సుఖం చాలట్లేదా!! అసలు ఒక స్త్రీ ఒక రిలేషన్ లో ఉండి, మరొక పురుషుడి శరీరాన్ని ఎందుకు కోరుకుంటుంది? ఒక పురుషుడు ఎందుకు కావాలనుకుంటాడు? సర్వే చేయాలేమో!! చేస్తే నిజం చెప్తారా!! కాపురాలు కూలవూ!!. భయం… అంతా వలయం… లయం… పరిరక్షణా వలయం… భద్రతా వలయం. కుటుంబం… మాయదారి కుటుంబం.

అమ్మో సొసైటీ బతకనిస్తుందా?? పిడికిలి బిగిస్తేనే.. తెరిస్తే అంతా… అంతే…! రాధిక గురించి అందరికీ చెప్పాలా? అవును, చెప్పి పరువు తీయాలి? దీని వ్యవహారం తేల్చాలి? లం… కొంప ముంచుతుంది. మరి ఆ మగోడి గురించి ఎందుకు చెప్పకూడదు. చెప్పాలి. చెప్పినా ఊళ్లో వాళ్లు అంతగా పట్టించుకోరు.. కోరు… ఎందుకు? తరతరాలుగా… ఇంతే…! మగ… పురుషాధిక్యత… నేను మగే… మగాడ్ని… సో… గప్ చుప్..

అవును. రాధిక అక్క తప్పేముంది?. తన శరీరం తనిష్టం. తప్పు లేదు. ఆమె మనసిష్టం. మన “సిస్టం”. ఆమెకు ఏది అనిపిస్తే అదే చేస్తుంది? ఈ తొక్కలో కట్లుబాట్లు, విలువలు అని ఆమె సుఖాన్ని, కోరికల్ని వదులుకోవాలా? రాధిక కరెక్టే. మరి కుటుంబం. బం.. భం. బాంబ్.. బాం… భయం… పేలుతుంది. తుంది. పేలుతూనే ఉంది… దొంగచాటుగా… సమాజం… నీతులు… విలువలు.. కట్టుబాట్లు… వ్యక్తిగతం.. వ్యక్తి… వ్యక్తి వర్సెస్ వ్యవస్థ.

మరి, శిరీష తనది. తనది… ఏ రిలేషన్??. ఎన్నో హద్దులు చెరిపేసిన సుఖాలు!! దుఃఖాలు… పెళ్లి చేసుకోవాలి. శిరీషను పెళ్లి చేసుకోవాలి!! చేసుకుంటే హద్దులు పోతాయా!!… సెక్స్ కు పెళ్లి లైసెన్సా… సెన్సా… లివింగ్ టుగెదర్… అవును శిరీషతో ఇప్పుడు చేస్తుంది లివింగే… సెన్సా… న్యూ సెన్స్.. సెన్సార్… జీవితకాలం సెన్సార్… కాదు… అవును.. ఏమో!!?

భారతీయ ఆత్మ… పవిత్రత… భార్యాభర్తల బంధం. నిబద్ధత… ద్ధత… తత… లేదు… నిజంగా లేదు. కొంత ఉంది. ఉంది… లేదు… ఉంది… లేదు… మాయమవుతోంది… మారాలి.

దగ్గరగా… వాళ్లు నాకు మరింత దగ్గరగా… చూపులు గుచ్చుకున్నాయి. చీకటి విడివడి… శరీరాలు కళ్ల ముందు… చూశాను.. పరిపూర్ణంగా చూశాను. రసకార్యం… చీకటి, వెలుగుల మధ్య సుఖ తృప్తుల కార్యం.

అంతే.!! కళ్లు ప్రజ్వరిల్లేలా చూశా. అంతే… గుండె ఆగిపోయింది. జ్వలించినంత.. ప్రజ్వరిల్లినంత… కన్నీటి పొర గుండెను కోసినంత.. చుట్టూ ఉన్న చెట్లు తగలబడినంత. చెమటతో మనసు తడిసినంత… భయం… బాధ… కోపం… కసి… కట్టలు తెంచుకున్న ఉక్రోషం.

నిశ్చేష్ఠుడునై… నిశ్చలుడనై… విచలుడనై… విహలుడనై… హలుడనై.. డై… డై… చచ్చిపో… పో… నడకలాంటి నిశ్శబ్ద పరుగుతో… నేను… నై.. నహీ… క్యా కర్నా…??

****               ****               ****

అమ్మ.. తనమ్మ.  అమ్మ… మ్మ… మా… అరుపు… సృష్టిలో శిశువు తొలి అరుపు. మాతృత్వం… త్వం. ఇలా… ఛీ… రోత… పాపపు ముండ… పాపిష్టిది.. చీకటిది. చించెయ్యాలి… చంపెయ్యాలి… చించి ఆరెయ్యాలి… ఈ వయసులో ఇలా… బరితెగించింది. బజారు మనిషి… చెట్ల చాటున. ఇంకొకడితో… సంభోగం.. భోగం.. గం.. గుట్టుగా…

అమ్మ… ఇక అమ్మేకాదు.. అమ్మే… అమ్మను చంపెయ్యాలి… నో… అవమానంతో తనే చచ్చిపోవాలి. వేరే వాళ్లతో పడుకున్న అమ్మను చంపెయ్యాలి? యాలి?! నేనే చచ్చిపోవాలి!? పోవాలి?? వాలి… ఆలోచన… తలను మింగేస్తున్న ఆలోచన… లోచన… తెగక… లో… చన. తెగని ఆలోచన… గతం… జ్ఞాపకాలు తెగని ఆలోచన…

నాన్న తనకు ఏడాదప్పుడే చనిపోతే… తన కోసం జీవితాన్నే కూలిగా మార్చుకున్న అమ్మ. తన చదువే లక్ష్యంగా చేసుకున్న అమ్మ… అప్పటి నుంచి ఇప్పటికి… ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది?? ఎలా…? ఇలా…!? తప్పు… ప్పు.. ప్… స్… తనకోసం… రెండో పెళ్లి చేసుకోమని బంధువులెంత బతిమాలినా వద్దన్నమ్మ. ఇప్పుడు ఎలా.. ఇలా..!!

నీతి నియమాలకు… విలువలకు… వలువలు విప్పుతున్న అమ్మ. తీస్తున్న అమ్మ… తీసిన అమ్మ… దీనెమ్మ… తనమ్మ… తన తండ్రి కాకుండా వేరే వాడితో… సుఖం కోసం.. కోర్కె కోసం.. బరితెగించిన అమ్మ… బజారున పడిన అమ్మ… తనమ్మా… ! తల పగులుతున్న శబ్దం.

నరికెయ్యాల్సిందే… చంపెయ్యాలి.. యాలి… ఆలి.. భార్య… మరి శిరీష!!. ప్రేమ… ప్రేయసి.. నుసి. తనదీ అదే రిలేషన్… అంతేగా.. అంతే… తప్పు.. అంతా తప్పే… అందరిదీ తప్పే. తప్పే… తప్పే… !!?

అవును అసలు తప్పు అంటే ఏంటి? నిర్వచనం కావాలి. కొత్తగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబానికి నిర్వచనం కావాలి!. రాధికక్కకైనా… అమ్మకైనా… నాకైనా… ఇష్టా ఇష్టాలను నిర్బంధించే చట్రాన్ని బద్దలు కొట్టే నిర్వచనం కావాలి? స్వేచ్ఛ కావాలి?.. ప్రతి రిలేషన్ కు ఓ నిర్వచనం కావాలి!!. ఇష్టం శాశ్వతమా!? తప్పదన్నట్లు పడి ఉండటం శాశ్వతమా?! నలిగిపోతూ, నిట్ట నిలువునా రోజూ చీలిపోతూ కలిసుండటం అవసరమా!? త్యాగం పేరుతో… మరొకరికోసం… అమ్మలా… ఇలా…! లేక, అణచివేతల శరీర తమకాలతో…!? తప్పొప్పుల తక్కెడను తెంచేసే పునర్నిర్వచనం కావాలి. సమాజాన్ని సరికొత్తగా అధ్యయనం చేసి… కనిపెట్టాలి. పెట్టాలి. పట్టాలి. ఎవరి బతుకూ మరొకరు కట్టేస్తే ఎగిరీ ఎగరలేని జెండా కాదు.

అమ్మ… మాతృమూర్తి… కోర్కెలుండవా!! ఉంటాయ్… ఉన్నాయ్.. మాతృత్వం, పతివ్రత… పడికట్టు మాటల బంధీ కాదు. కాకూడదు. ఇరవై ఐదేళ్ల వయసులో నాన్న చనిపోతే… నియమాలు, సంఘం ఆమెను ఆమెగా అణిచేస్తే.. కొత్తవాళ్లను నమ్మలేక నాకోసం పెళ్లి మానుకుంది. మరి శరీరం… మాటలు చెప్పే మనసు… ఊరట… నాకో న్యాయం…! తల్లికో న్యాయమా…?!

ముసుగు… అంతా ముసుగు.. విప్పకు.. తొలగించకు… పిడికిలి బిగించు.. ఇంకా బిగించు. మూసుకో… ఎప్పటికీ కళ్లు తెరవకు. మూసుకో… పో… వెళ్లిపో… పో… ఎడ్గార్ ఎలన్ పో… అవును.. పో… మిస్టిక్… స్టిక్.

ఇప్పుడు అమ్మ జీవితానికో పరిష్కారం ఆలోచించాలి…

సొసైటీకి లోబడా…!! లోబడకుండానా!!

ఏమో…!

అమ్మ ఇష్టం..!? అమ్మకేదిష్టం!?

నిర్ణయించడానికి నే… నెవర్ని?!!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

ఎ.రవీంద్రబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు