సాయిబుల అబ్బాయి

వెడల్పాటి మట్టిగోడల మీద
మూడు నిట్టాళ్ళ మీద లేపిన
నాలుగు తడిక గదుల పూరిల్లు.

కప్పు  మీదకి దట్టంగా పాకిన
మూరెడేసి ఆనప కాయలు
జారవిడిచిన సొరపాదు.
దొడ్లో మా బాబాకి రెండింతలు
పొడుగు పెరిగిన మునగ చెట్లు రెండు.

చారల పాముల్లాంటి కాయలు
వేలాడే పచ్చపచ్చటి పొట్ల పందిరి.
ఇంటి మీదకి ఒక వైపు వాలుతూ
ఏపుగా పెరిగిన వేప చెట్టు.

పక్కింటివాళ్ళ పొట్టిగోడకి అవతల
అసూయ గొలిపే అందంతో
అల్లనల్లన తల వూపే సీమచింత చెట్టు .

ఇంటి ముందు మట్టిరోడ్డుకు
ఇరువైపులా పారే వాన పంటకాలువలు.
ఎదురుగా అయిదే నిమిషాల పరుగుతో
అందుకోగలిగే అంతెత్తు కొండ.

అన్నింటినీ మించి ఎప్పుడూ
నా తల మీంచి చెదరని
నా అమ్మ – పెద్దమ్మ చలచల్లని అండ.

2
బేరన్ల నవాబు గాడి సైకిలు,
మేదరి వెంకటేశ్వర్లు విసిరే చేపల వల,
అవధానిగాడి అసింట చూపులు,
పంట కాలవలో వానా కాలం
ఎగిరి తుండుగుడ్డలో దూకే
బేడిస చేప పిల్లలు, చందమామ పక్కెలు.

అమ్మ వండిన చేపల పులుసు ఘుమ ఘుమ.
అమ్మ అల్లిన సేమియా నగిషీల సౌందర్యం.

రోడ్డుకవతల రాయప్ప మాష్టారి
గిలకబావి గరగరలతో కలిసి
ఎగిరి వచ్చే గాబ్రియెల్ అన్నయ్య
బుల్ బుల్ వాద్యరాగ పరిమళాలు.

వద్దన్నా వినకుండా అమ్మ వెంట
వరి మడిలోకి దిగినప్పుడు పట్టి
ఆ జలగ పీల్చిన పిక్కల నెత్తురు.

తియ్యటి కుంట నీటి స్పర్శతో
వడగాలిలో కలిసిపోయిన
కొరివి కారపు పచ్చడి మంట.

3
అంతా  హాయిగా అనిపించేది
కొన్ని కొన్ని అయోమయాలూ ఆశ్చర్యాలూ తప్ప..

నా సావాసగాళ్ళ అమ్మలందరూ
తిరపతమ్మలూ సుశీలమ్మలూ,
రాజమ్మలూ శౌరమ్మలూ ,
పుల్లమ్మలూ లక్ష్మమ్మలూ అయితే
మా అమ్మ ఒక్కతే హలీమా కాకుండా
బూబమ్మ ఎందుకు అయ్యిందో
అప్పుడర్థమయ్యేది కాదు.
నుదుటి మీద ఆ చుక్క ఒక్కటే తక్కువ.,
అదే చీరకట్టు, అదే వాడకట్టు.

4

ఈద్గా నమాజు వరసలో నిలబడినప్పుడు
బాబాతో పాటు బొమ్మలా
నుదురు నేలకి ఆనించినప్పుడు ..
అందరూ ఒక్కటే అంటారు
అక్కడ, అందరూ.

ప్రార్థన ముగిసినాక
ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకుని
ఎవరి పిల్లల్నివాళ్ళు తీసుకుని
ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళినప్పుడు,
కొందరు పిల్లలు మేడలలోకీ, డాబాలలోకీ,
నేనేమో మండుతున్న మట్టిరోడ్డు మీద
నగ్నపాదాలతో, పరుగు పరుగున,
మా బాబాని వెనుక వదిలి, చలువ పందిరిలాంటి
మా పూరింటి అమ్మ-పెద్దమ్మ ఒడిలోకి .
నా బతుకు బడిలోకి!


* మా కుటుంబాలలో నాన్నని బాబా అంటాము.

(నన్ను కడుపులో పెట్టుకుని పెంచి
పెద్ద చేసిన మా పెద్దమ్మ.,
అమ్మ- పెద్దమ్మ హలీమూన్ అమర  స్మృతిలో)

దేవిప్రియ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు