సాము

సుందరమ్మకి ఆచ్చేసు నుంచేగాక వూర్లో కుర్రోళ్ళ నుంచి కూడా స్వేచ్ఛ దొరికినట్టయింది. ఆమ నాకు వరసకి అప్పే గదా!

వేసవి కాలం యెండలు మండిపోతున్నాయి. వడగాడ్పుకి యెక్కడి వాళ్లక్కడే యిళ్ళల్లోనే నక్కుతున్నారు. వాకిలి ముందు తాటాకు పందిళ్ళు వేసుకుని పిల్లా జెల్లా చేరి పచ్చీసులు, అచ్చం గిల్లాలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు మంచం వాల్చుకుని కునుకు తీస్తున్నారు. మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. సత్యాలుకి యెంత యెండైనా యింటిపట్టున వుండడం అలవాటు లేదు. అసలే యెండల్లో గొడ్డు మేతకి యిబ్బందిగా వుంది. అవి చావిట్లో మేకులకు వేలాడుతూ వుసూరుమని తనవైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. పొలం తోలుకుపోతే అక్కడక్కడ గట్లు గనుమలకి పట్టిన గరిక మేస్తాయి కదా! అని అంత యెండలోనూ గొడ్డుని విప్పుతూనే వున్నాడు సత్యాలు.

సత్యాలుకి యిప్పుడు సుమారు యెనభై యేళ్ళుంటాయి. భార్య కమలమ్మ చనిపోయి చాలా కాలం అయ్యింది. ఒక కొడుకు, యిద్దరు కూతుళ్ళు. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొడుకు రాజారావు  తెనాలిలో బ్యాంకు ఉద్యోగి. రోజూ యింటినుంచే బండిమీద ఆఫీసుకి వెళ్లి వస్తాడు. అతనికి యిద్దరు ఆడపిల్లలు. కోడలు, మనవరాళ్ళు సత్యాలుని బాగా చూసుకుంటారు. అయినా అతనిది ఆరుబైలు జీవితం. యెక్కువ సమయం బైటనే గడుపుతాడు.

సత్యాలు వయసులో పొడగరే కాని వృద్ధాప్యంతో యెముకలు కుదించుకుపోయి కొంచెం మధ్యస్తంగా కనిపిస్తున్నాడు. అయినా నిటారుగానే నడుస్తున్నాడు. వొంట్లో  హుషారు తగ్గలేదు. నల్లగా, బక్క పల్చగా వుండే సత్యాలు నీరుకావి పంచె బిళ్ళగోచి పెడతాడు. కోరాగుడ్డ చేతుల బన్నీ వేసి పైపంచెని తలకి చుడతాడు. చేతిలో యెప్పుడూ కర్ర వుంటుంది. కాదు, తానే చేవ తేలిన కర్రలా వుంటాడు సత్యాలు. రబ్బరు చెప్పులేసుకుని హుషారుగా నడిచే సత్యాలు వేగాన్ని యువకులు సైతం అందుకోలేరు.

సత్యాలు పరంగా చూస్తే  కర్రసామే తన చదువు. తను వయసులో వున్నప్పుడు కర్రసాము విద్యలో బాగా ఆరితేరాడు. అతడు కర్ర తిప్పుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవంటారు. వేగంగా కర్ర తిప్పడంలో సత్యాలు తర్వాతే యెవరైనా అని పేరు. తర్వాత తరం యువకులను ఖాళీ సమయంలో డొంకలోకి తీసుకెళ్ళి కర్ర తిప్పడం నేర్పించేవాడు. కర్ర సాము మన కులవిద్య అని, శరీరం, కర్ర మన ఆయుధాలని తను తర్ఫీదిచ్చే యువకులకు పదేపదే చెప్పేవాడు. వాళ్ళంతా యిప్పుడు నడి వయసుకొచ్చారు. కొందరు చదువుకుని వుద్యోగాలలో స్థిరపడితే  మరికొందరు వూర్లోనే కొద్దిగా పొలం కొనుక్కుని లేదా కౌలుకి భూములు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. కర్రసాము సత్యాలుని తనకంటే చిన్నవాళ్ళకి దగ్గర చేసింది. వాళ్ళతో స్నేహంగా అరమరికలు లేకుండా అన్ని విషయాలు మాట్లాడుతూ అప్పుడప్పుడు గతంలో వూరిలో జరిగిన విషయాలు చెబుతూ వుండేవాడు. సత్యాలు వారికి ఒక కవిలె కట్ట, చరిత్ర భాండాగారం మాదిరి కనిపిస్తాడు.

యెండకి గొడుగు వేసుకుని గొడ్డు మేసే దగ్గర నిలబడుతూ అటూ యిటూ వాటిని మళ్ళించే సరికి మధ్యాహం అన్నం వేళ అయింది. సత్యాలు అన్నం తినడానికి చెట్టు నీడకొచ్చాడు. పక్కనే సమాధుల దొడ్డి, దానికి ఆనుకుని డొంక రోడ్డు వున్నాయి. అన్నం తిన్నాక సమాధుల దొడ్డిలో చెట్టునీడ పడే సమాధి చూసుకుని దానిమీద కాసేపు నడుం వాల్చి కునుకు తీయడం అలవాటు సత్యాలుకి. అన్నం తిని పడుకుని చిన్నగా కూనిరాగం తీయడం మొదలు పెట్టాడు. సత్య హరిచ్చంద్ర నాటకంలో కాటిసీను పద్యం ‘ఎన్నో ఏండ్లు గతించి పోయినవీ, కానీ, …..ఇటా… అస్పృస్యత సంచరించుటకు తావే లేదూ…’ అంటూ రాగం తీస్తుండగా పక్కనే డొంకరోడ్డు నుంచి యెవరో పిల్చినట్టు అనిపించి తలెత్తి చూశాడు. అశోక్…పిల్లి అశోక్ తన కొడుకు వయసు వాడు. పక్కూర్లో ప్రభుత్వ స్కూలు టీచర్, అతని భార్య ‘విజయ’  కూడా టీచరే, యిద్దరు పిల్లలు వాళ్లకి. యిద్దరూ రోజూ యింటి నుంచి డ్యూటీకి బండిమీద వెళ్లి వస్తుంటారు. అశోక్ పుస్తకాలు బాగా చదువుతాడు. పేద పిల్లలకి పుస్తకాలు కొనిచ్చి ఫీజులు కడుతుంటాడు.  వీధి బడిలో చదివే పిల్లలని కూర్చోబెట్టుకుని అర్ధం కాని పాఠాలు విడమరిచి చెబుతాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైనా కష్టం చేసి చదువుకున్నాడు, కష్టజీవిని గౌరవించే మనస్తత్వం తనది. అశోక్ యిప్పటికీ పొలం పనులు చేస్తుంటాడు.

‘సత్యాలు కక్కాయ్!’ అంటూ సైకిల్ దిగి నడిపించుకుంటూ సమాధుల దొడ్డిలోకి వస్తున్నాడు అశోక్

‘యారబ్బాయ్, యీ యాలపపుడొచ్చేవు, యేంది? యామన్నా పని బడిందా నాతో?’ అడిగాడు సత్యాలు.

‘లేదు కక్కాయ్, యెండాకాలం సెలవులే కదా! యేమీ తోచక వూరికే యిట్టా వొచ్చా, అంతలో నీ గానం చెవిన బడింది. అన్నం తిన్నావా? కూరేంది?’ అడిగాడు

‘యేదో వంకాయ, వుప్పుచాప చేసినట్టుంది కోడలు, అదే గాత్తి తిని మజ్జిగ తాగా’ అన్నాడు సత్యాలు

‘సంగతులేంది కక్కాయ్? యెవురి సమాధి మీద పడుకున్నావో చూసేవా? ఆయనకి చాతబడి చేస్తే చచ్చిపోయాడు అనుకునేవోళ్ళు మా చిన్నప్పుడు’ అన్నాడు సమాధి మీద ‘దాసరి ఏసురత్నం’ అనేపేరు చూపిస్తూ

‘మరేరా! చాతబడా! నా బొ…! మనకా నమ్మకాలేమీ లేవ్, తెల్సుగా నీకు! యెవురుదైతేమి గానీ, గాత్తి నీడ  పడతది కదా! అనుకున్నా’ అన్నాడు నవ్వుతూ.

అశోక్ కూడా ‘నిజమే కదా’ అని నవ్వాడు.

అశోక్ యెదురుగా వున్న మరో సమాధి మీద చేరగిలబడి

‘కక్కాయ్, అప్పట్లో మనూరు, ముఖ్యంగా మన మాలపల్లె చెరిత్ర సృష్టించింది కదా! నేను చిన్నప్పటినుంచి ఆనోటా యీనోటా కధలు కధలుగా యినడమే గానీ సరీగా యివరం తెలీదు నాకు.

‘ఏసురత్నం తాత అంత మనగోడు కదా! అదాటుగా యెందుకు చచ్చిపోయినట్టూ? తాతకి చాతబడి చేపిచ్చింది యెవురింతకీ?’ అడిగాడు

సత్యాలుకి అరవై డెబ్బై యేళ్ళనాటి తన చిన్నతనంలో జరిగిన విషయాలు, తర్వాత ఆనోటా, యీనోటా ఒక జానపద కధ మాదిరి విన్న సంగతులు వొక్కొక్కటే తెరలు తెరలుగా కళ్ళముందు కదులాడినయ్.

ఆ సంఘటన జరిగినప్పుడు తనకి వూహ తెలీదు. తన గ్రామం గుంటూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు. కులం, భూస్వామ్యం బాగా కలగలసిపోయి బీదా బిక్కీ జనాన్ని వుక్కుపాదాల కింద నలిపే కమ్మటూరు. కమ్మ, కాపు ప్రధాన భూస్వామ్య కులాలు. వూరిలో యాభై యెకరాల వ్యవసాయ భూములున్న కుటుంబాలు చాలా వున్నాయి. వారి చెప్పుచేతల్లో పౌరోహిత్యం, వ్యాపారం చేసుకునే బ్రాహ్మణ, వైశ్య కులాలు కొద్దిగా వుండేవి. పొలం, పుట్ర లేకపోయినా భూస్వామ్య కులాలకు దగ్గరగా వారి అడుగులకు మడుగులొత్తుతూ గౌండ్లు, గొల్లలు, చాకలి, మంగలి కుమ్మరి, కమ్మరి కులాలవాళ్ళు వున్నారు. యిక పొలం, పుట్ర పరపతి లేని మాల, మాదిగ కులాలు వూరికి కాస్త యెడంగా వుంటే యెరుకల, యానాది తెగల వాళ్ళు వూరి సరిహద్దుల్లో గుడిసెలు వేసుకుని పందులు మేపుకుంటూ, పొలాలకు కాపలా కాస్తూ వుంటారు.

సత్యాలు ఒక్కొక్క విషయం చెప్పుకొస్తున్నాడు

గ్యామంలో కులం పట్టింపులు యెక్కువే, వూళ్ళో ఆసాముల ముందు మాల మాదిగలు చెప్పులేసుకుని నడవకూడదు. మంచి పేర్లు పెట్టుకోకూడదు, కొత్త బట్టలు నీళ్ళల్లో పిండి తొడుక్కోవాలి. దివిసీమ తుఫాను వచ్చేనాటికి కూడా వూర్లో వుండే ‘ఆర్య వైశ్య కాఫీ హోటల్’ లో రొండు గ్లాసుల పద్ధతి వుంది. మాచిన్నతనంలో మనోళ్ళు యెవురన్నా పొతే కొబ్బరి చిప్పలో కాఫీ పోసేవోళ్ళు. రామాలయంలో మాలా మాదిగలు పూజలు చెయ్యటానికి వీల్లేదు. ఆ సంఘటన జరిగే నాటికే యిక్కడ కమీనిస్టు పార్టీ వచ్చింది. వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాల పేరున పార్టీ పనిచేస్తా  వుండేది. పార్టీలో  మామూలు కార్యకర్తలంతా మనోళ్ళేగానీ నాయకులు కమ్మ, కాపు కులపోళ్ళే! ఆళ్ళ కులపోళ్ల ఆమినీ, దుర్మార్గాన్నీఆనాయకులు యీసమెత్తు కూడా కట్టడి చెయ్యలేకపోయేరు. నాయకులు తప్ప మిగిలినోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో, జనతా పార్టీలో తర్వాత వచ్చిన తెలుగు దేశం పార్టీలో వుండారు, తెలుసుగా నీకు…’

సత్యాలు చెప్పుకుంటూ పోతున్నాడు

‘వూరిలో మనోళ్ళు మంచి నీళ్ళ బాయి నీళ్ళు చేదుకోటానికి యీల్లేదు. యెవురన్నా సూద్రులొచ్చి దయతలిచి కడవడు నీళ్ళు పోసేదాకా మనోళ్ళు ఆడ పడిగాపులు పడేవోళ్ళు. వాడుకునే నీళ్ళకోసం చెరువుంది. చెరువుకి నాలుగేపులా నాలుగు రేవులుండేయి. ఒకరేవుని బాపన, కోమటోళ్ళు వాడుకుంటే, ఒకటి కమ్మా, కాపు కులపోళ్లు, మూడోది గౌండ్ల, గొల్ల, చాకలి, మంగలి కులపోళ్లు, నాలుగోది మాల, మాదిగలు వాడుకునే యేర్పాటు జరిగింది. పొరపాట్న మనం గాని యితర్ల రేవులో దిగామంటే తలకాయలు పగిలి పోవాల్సిందే. నీళ్ళకోసం యెన్ని తగువులు జరిగినయ్యో చెప్పలేం. వూళ్ళో ఆళ్ళ దగ్గర పాలేర్లుగా జీతముండేవోళ్ళు, యిళ్ళల్లో పాచిపని చేసే ఆడోళ్ళు తప్ప మిగిలినోళ్ళు కమ్మ, కాపులుండే బజారుల్లోకి పోస్టాఫీసు పనిమీదో, దేనికో పోయేరంటే  కర్రలు తీసుకుని తరిమి తరిమి కొట్టేవోళ్ళు’.

‘ఆ… పాలేర్లు, పనిమనుషులు మాలోళ్ళే గదా! ఆళ్ళు పోవచ్చా మరి! అదేం మినహాయింపు?’ అడిగాడు అశోక్

‘ఆళ్ళే లేకపోతే ఆసాముల పనులెట్టవుతయ్? అందుకే గామాలి మినహాయించేరు. ఆళ్ళని కూడా మా తుస్కారంగా చూసేవోళ్ళు. యాడాది కోమారు తిండి గింజలు దొరుకుతయ్యని, పాత గుడ్డలు, చద్దన్నం దొరుకుద్దని  ఆరోజుల్లో పోయేవోళ్ళు గానీ తర్వాత మనోళ్ళు మానేసేరులేరా!’

‘అయినా అంటూ సొంటూ అనుకుంటా నీలిగే నాయాళ్ళకి తెలీదా! ఆవూరబాయి, చెరువు తవ్వింది మనమేనని! మన చెమటతో తడిసినాకేగా బాయిలో, చెరువులో నీరు చేరింది, పిచ్చి నాకొడుకులు…

వూరిలో ఆవిషయం జరిగేనాటికే ఏసయ్య మతం వచ్చింది. పల్లెలో సెర్చీ, బడి కట్టేరు. మనోళ్ళు అంతకుముందు అంకమ్మకి పూజలు చేసి యాడాదికోసారి పండగ చేసుకునేవోళ్ళు. తర్వాత ఒక్కొక్కరే మతం పుచ్చుకుని పేర్లు మార్చుకున్నారు. మాఅయ్య ‘ఎంకయ్య’కి బాప్తీసం యిచ్చి ‘యోహాను’ అని మతం పేరు పెట్టేరంట. అమ్మ ‘అంకమ్మ’ తర్వాత ‘మార్తమ్మ’ అయ్యింది. పల్లిల్లో పిల్లలు చిన్నగా చదువుకుంటన్నారు.

అయితే ఆసాముల్లో కులం, ధనం బాగా తలకెక్కిన ‘ఆచ్చేసు’ అనే ఒక తెగబలిసిన ఆంభోతు అసుమంటోడివల్లే యిదంతా జరిగింది.

‘ఆదిశేషు’ పోలీసు రికార్డుల్లో నమోదైన ఒక క్రూర మృగం పేరు. అతని పేరింటే పల్లెకి వొళ్ళు జలదరిచ్చేది. అతని స్వరం వింటే పిల్లలు యేడుపు లంకించుకుంటారు. అతని నీడ కనబడితే ఆడోళ్ళు యెక్కడికక్కడ లోపలకెళ్లి దాక్కుంటారు. యెంత ధైర్యవంతులైనా ఆదిశేషు కనిపిస్తే సుమారు పదిగజాల దూరం జరుగుతారని అతని దౌర్జన్యాల గురించి వూర్లో చెప్పుకుంటుంటే విన్నాడు అశోక్.

‘ఆడిని చూసేవా కక్కాయ్ నువ్వు?’ అడిగాడు అశోక్

‘నాకు పెద్దగా వూహ తెలీదప్పుడు, పెద్ద ఆంభోతు మాదిరి వుండేవోడని ఆడి భయంకమైన రూపం గురించి చెప్పుకుంటుంటే యినటమే. ‘వీరయ్య సౌదరి’ గారి చిన్న కొడుకు. ఆళ్ళకి బాడవలో సుమారు అరవై యెకరాల పొలం వుంది. ఆడి అన్న ‘రాంప్రసాదు’ గుంటూరులో చదువుకుంటుంటే ఆళ్ళయ్య పొలం పనులు చేపిచ్చే బాజ్జిత్తోపాటు పాలేర్లమీద పెత్తనం కూడా యీడికే అప్పగించేడు. ఆచ్చేసు కుల దురాగతానికి యిగ్రిం యేపిస్తే యెట్టుంటదో అచ్చం అట్టే వుండేవోడు. కమ్మోళ్ళ మొత్తానికి ఆడే పెతినిది. పని మానేసిన పాలేర్లని రేక్కంపతో కొట్టి జుట్టుపట్టుకుని యీడ్చుకేల్లేవోడు. ఆడోళ్ళని కాలితో యెక్కడ బడితే అక్కడ తన్ని అమ్మ నా బూతులు తిట్టేవోడు. ఆడి నోటికి అద్దూ అదుపూ వుండేది కాదు. ఆబూతులకి చెవులు పుచ్చిపోయేయి. కొత్త కోడళ్ళు బేటికి వొచ్చేవోళ్ళు కాదు. ఆళ్ళ మాటకి పనోళ్ళు యెవురన్నా యెదురు చెప్పేరంటే నెత్తురు కారేట్టు కొట్టటమో లేకపోతే గెడ్డిలో చుట్టి కాలవ తూముల్లో కుక్కటమో చేస్తారని పాలేర్లు బిక్కుబిక్కుమనుకుంటా తలొంచుకుని పని చేసేవోళ్ళు.

ఆచ్చేసు తినడం మొదలుబెడితే వంద అరిసెలు, వంద గారెలు తింటాడని కమ్మోళ్ళు రోజుకో యింటి చొప్పున తిండిపెట్టి ఆడిని మేపేవోళ్ళని చెప్పుకుంటారు. ఆడికి పెళ్లయ్యిందో లేదో మరి, నాకు సరీగా తెలవదు.

పల్లెలో మనుషుల చేత ఆసాముల పొలాల్లో పనులు చేపిచ్చే ముఠా మేస్త్రి ‘బేతాళ దాసు’, అతని భార్య ‘వజ్రమ్మ’ అని వుండేవోళ్ళు, మాకు అయినోళ్ళే! కక్కాయి, చిన్నమ్మ అవుతారు. ఆళ్ళకి ఒక్కతే కూతురు ‘సుందరమ్మ’. దాసు సైదగ్గు వచ్చి చిన్న వయిసులోనే చచ్చిపోయేడు. పాపం వజ్రమ్మ బాధలు దిగమింగుకుని పిల్లకోసం బతికింది. రొండు, మూడు తరగతులు చదవేసింతర్వాత బడి మానిపిచ్చి  పిల్లని కూడా యెమ్మటే పెట్టుకుని కూలిపని, పాచిపని చేసుకు బతికింది. యేమాటకామాటే చెప్పాలిరా అశోకూ, తల్లీ కూతుళ్ళు ఒకళ్ళని చెయ్యి చాపలా, ఒకళ్ళచేత మాట పడేవోళ్ళు కాదు. మాయప్ప సుందరమ్మ పేరుకి తగ్గట్టే చక్కని చుక్క, చెయ్యెత్తు మనిషి. వయసొచ్చినాక నిగనిగలాడతా అందరి కళ్ళల్లో పడింది. పనికిపోతే ఆసాముల చూపులన్నీ దానిమీదే! యిద్దరు మొగోళ్ళ పని చులాగ్గా చేసి అవతల పడేసేది.

సుందరమ్మ మీద కన్నుబడిన ఆచ్చేసు పిడకలు చేద్దువురమ్మని పిలిచి గొడ్డు చావిడిలో ఆపిల్లని పాడుచేసి బైటబెడితే చంపేస్తానని, పల్లిని తగలబెడతానని బెదిరించేడు. ఆడి బెదిరింపులకి రానురాను ఆపిల్ల ఆడికి లోబడిపోయింది. నలుగురూ నాలుగు మాటలన్నారు. తల్లి యేమీ చెయ్యలేక దిగులుతో మంచానబడి తీసుకు తీసుకు చచ్చిపోయింది. సుందరమ్మ యింటికి చీకట్లో వచ్చిపోయే ఆచ్చేసుని చూసి మన కుర్రోళ్ళకి నెత్తురుడికినా ఆడి శక్తికి భయపడి వూరుకునేవోళ్ళు. ఆడి పేరింటే తెలియకుండానే రేక్కంపతో చీరుకు పోయిన యీపులు గుర్తుకొచ్చి చేత్తో తడుముకుంటారు. అయినా లోపల నెత్తురు కుతకుతమని వుడుకుతానే వుంది.

రోజులెప్పుడూ ఒక్క మాదిరిగా వుండవు కదా! బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కే రోజు రానే వచ్చింది. మన కుర్రోళ్ళు కర్ర సాములో ఆరితేరేరు. ఆళ్ళకి కర్రే ఆయుధం, వొ్ళ్ళే ఆస్తి అనుకునేవోళ్ళు. అప్పుడప్పుడే నాలుగచ్చరాలు నాలికకి అంటుకుని కళ్ళలోకి మెరుపల్లే పారడం మొదలయ్యింది. కర్రసాము మన కుర్రోళ్ళ రోషాన్ని ధైర్యాన్ని తట్టి లేపింది. గ్రామ దేవత పండగలో తర్వాత జనవరి పండగలో చేసే మన కర్రసాము చూట్టానికి పొరుగూర్ల నుంచి జనం తరిలి వచ్చేవోళ్ళు. మనోళ్ళు కర్ర వుసీగా తిప్పుతుంటే మబ్బులోంచి జారిపడిన వాన చినుకు నేలమీద రాలేది కాదని చెప్పుకుంటారు. యిది మనకి పెద్దలనుంచి వారసత్వంగా వచ్చిన యుద్ధవిద్య, యిలువగలిగిన ఆస్తి. దీనికితోడు కమీనిస్టు పార్టీ, ఆది ఆంధ్ర వుజ్జమాలు జనాన్ని తిరుగుబాటు బాట పట్టిస్తున్నాయ్. యీటన్నిటినీ చదువుకుంటున్న మన కుర్రోళ్ళు వంట బట్టిచ్చుకున్నారు. సుమారు యేడెనిమిది మంది కుర్రోళ్ళు ఒక జట్టుకట్టి ఆ మదించిన జంతువుని మట్టుబెట్టాలని పతకం యేసేరు.

యెప్పుడు మాదిరే ఆచ్చేసు రాత్రి పోద్దుపోయి జనం మాట మనిగినాక సుందరమ్మ యింటికొచ్చేడు. దాసరి ఏసురత్నం, మత్తే యాకోబు, నూకతోటి జయరావు, పిల్లి సంగీతరావు, జాలాది సంసోను, కొండ్రు పేతురు యింకొంతమంది కలిసి సుందరమ్మ యింటిముందే ఆడిని కర్రలు, బండరాళ్ళతో కొట్టి పడేసేరు. తాగి వుండాడేమో ఆడు అటూ యిటూ మసల్లేక యెయ్యి గొడ్డుని తిన్న రాబందు ఒక్క గాలీవానకే కూలినట్టు ఆచ్చేసు కూలిపోయేడు.

సుందరమ్మ కూడా ఆచ్చేసుని యేసెయ్యటంలో కుర్రోళ్ళకి సాయపడింది. యెందుకంటే ఆమెని ఆడు బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి యెవురూ ముందుకి రాలేదు. తల్లి దిగులుతో మంచం పట్టి చచ్చిపోయింది ఆడి మూలానే. ఆమకి ఆడిమీద వుండేది భయం తప్ప మొహం కాదు, ప్రేమ అసలే కాదు. ఆడి పీడ నుంచి తనకి, తనోళ్ళకీ యిరగడ దొరకొచ్చు అనుకుంది సుందరమ్మ.

ఆచ్చేసుని మాల కుర్రోళ్ళు చంపేసేరనే వార్త తెల్లారేసరికల్లా వూరూ, వాడా దాటి పొరుగూర్లకి కూడా పాకింది. పోలీసులు వచ్చే లోపల కుర్రోళ్ళు పారిపోయేరు. పేపర్ల  నిండా ఆ వార్తలే!  ఆళ్ళు దొరికేదాకా పల్లె పల్లెంతా పోలీసు గస్తీలో వుంది. ఆళ్ళ కుటంబాలతో స్నేహంగా వుండే కొంతమంది పోలీసుల నిఘా తట్టుకోలేక వూరిడిసిపెట్టి పారిపోయి యెక్కడో తలదాచుకున్నారు.  కొన్ని నెలల తర్వాత ఆళ్ళ ఆచూకీ మీద యెవురో వుప్పందిస్తే గాని దొరకలేదు.

ఆసాములు  ఆచ్చేసు చావుని చూసి హడలెత్తి పోయేరు. ఆళ్ళ కంటిమీద కునుకు లేకుండా పోయింది. మాలోళ్ళని పనికి రానీయకుండా యెలేసేరు. యితర కులాలు కూడా మాలోళ్ళతో మాట్లాడకుండా ఆళ్లకి మంచినీళ్ళు పుట్టకుండా కట్టడి చేసేరు. పనిలేక, తిండికి జరగక చానా కుటంబాలు పొరుగూర్లకి వలసెల్లి పోయినయ్. ఆళ్ళు పనికి పిలవకపోటం వల్ల తాత్కాలికంగా యిబ్బంది అనిపించినా క్రమంగా అది మనకి  మంచే చేసింది. పెద్దోళ్ళు కొందరు బైటకెళ్లి పని యెదుక్కుంటే పిల్లలు చదువుకోసం హాస్టళ్ళు యెదుక్కుని చేరేరు. బాగా చదివి తర్వాత వుద్యోగాలలో కుదురుకున్నారు.

ఆచ్చేసుని చంపి జైలుకెళ్ళటం మన కుర్రోళ్ళకి నామర్దాగా లేదు. యెందుకంటే యిన్నాళ్ళూ అయినదానికీ, కానిదానికీ మాలపల్లి మీద యిరుసుకు పడి యేవొస్తువు పోయినా మనకే దొంగతనం అంటగట్టేవోళ్ళు. యిప్పుడు ఆస్తితి లేదు. ఆచ్చేసు అసమంటి మృగం చేతిలో దెబ్బలు, తిట్లు తప్పినయ్. మన కురోళ్ళు అతన్ని చంపినాక  మనని యేమన్నా అనాలంటే అందరూ ఆలోచిస్తున్నారు. నిజానికి యిది బలమైన సింహం మీద మేకపిల్ల  తిరగబడటమే!

వింటున్న అశోక్ కి వళ్ళు గగుర్పొడిచింది. నోటమాట రాలేదు. తమవాళ్ళ చరిత్ర తెలుసుకుని వుక్కిరిబిక్కిరై చాలాసేపు సత్యాలుని చూస్తూ వుండిపోయాడు. యేపుస్తకాలూ రాయని  అరుదైన చరిత్ర చదివినట్టుంది తనకి

‘తర్వాత యేమయ్యింది కక్కాయ్! మనోళ్ళ పరిస్తితి యేమిటి ? సుందరమ్మ యేమయ్యింది?’ అడిగాడు

ఆ కేసులో ముద్దాయిలకి పదేళ్ళు ఖైదు పడింది. జైలులో వుండే చదువుకున్నారు. తర్వాత మిలట్రీలో  సైనికుల అవసరం యేర్పడి బ్రిటీషోళ్ళు మనోళ్ళని సైన్యంలో చేర్చుకున్నారు. తర్వాత వుద్యోగం, పెళ్లి, పిల్లలు… మామూలు జీవితం గడిపేరు. ఆళ్ళలో ముఖ్య నాయకుడైన ‘దాసరి ఏసురత్నం’ చచ్చిపోయినప్పుడు అతనికి ఆసాములు చాతబడి చేపిచ్చేరు, అందుకే చెట్టంత మనిషి అదాటుగా చచ్చిపోయేడు అనుకున్నారు, గొడవయయ్యింది కానీ ఏసురత్నం కొడుకు భాస్కర్ రావు డాక్టర్ కదా! ‘చాతబడా! పాడా! మానానకి ఏదో లోపల తెలీని రోగం వుండి వుంటది, వొదిలెయ్యండిరా! యెల్లకాలం గొడవలెందుకు?’ అని మనోళ్ళకి సర్ది చెప్పినట్టు గుర్తు. భాస్కర్ రావులాంటోళ్ళు దెయ్యాలూ, బూతాలూ లేవని మూఢనమ్మకాలు వదిలేసి చదూకోమని చెబుతా వుండేవోళ్ళు, అది మన పిల్లలు బాగా చదువుకోటానికి పనికొచ్చింది.

యేది జరిగినా మేమంతా కలసికట్టుగా వుండేవోళ్ళం, పల్లిలో మొగోళ్ళు కర్రసాము మానలేదు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న విద్యని తర్వాత మన యూత్ కుర్రోళ్ళకి నేర్పించేను. అది మన బతుకులో బాగమైపోయింది.

కమ్మ కుటుంబాలు వొక్కొక్కటీ పిల్లల చదువులనీ, వుద్యోగం, యాపారం అనీ కారణం యేదైతేనేం, వూరు ఖాళీ చేసి పోయేరు. యిప్పుడు ముసలోళ్ళు పెద్దపెద్ద మండవా లోగిళ్ళలో బిక్కుబిక్కుమంటా కాలం గడుపుతున్నారు. మనల్ని రానీయని ఆబజారుల్లో పల్లేర్లు మొలుచుకొచ్చినాయ్, యెవసాయం చేసే దిక్కులేక పొలాలు అమ్ముకోటం, కౌలుకి యియ్యటం తప్పలేదు. కౌలు రైతులంతా మనోళ్ళే ! పిల్లా జెల్లా అంతా కలిసి పొలంలో చాకిరీ చెయ్యటం వల్ల కౌలు పోను పండిన గింజలు కొన్ని మిగులుతున్నాయి. యిప్పుడు తలో యింత పొలం కొనుక్కోగలిగారు. రొండు, మూడు యెకరాల పొలం అందరికీ వుంది. ఒకప్పుడు ఆసాములు దయదలిచి కాసిన్ని మినుములు పెడితే పండక్కో పబ్బానికో గారెలు వొండుకునేవోళ్ళం. యిప్పుడు ఆళ్ళ ముసలోళ్ళకి యిన్ని మినప్పప్పు మనమే పెడతన్నాం’

సుందరమ్మకి ఆచ్చేసు నుంచేగాక వూర్లో కుర్రోళ్ళ నుంచి కూడా స్వేచ్ఛ దొరికినట్టయింది. ఆమ నాకు వరసకి అప్పే గదా!. అప్పా తమ్ముళ్ళం అప్పుడప్పుడూ కూచ్చుని మంచీ సెబ్బరా మాట్టాడుకునేవోళ్ళం. పొలం పనిలో సుందరమ్మే నాకు సాయం చేసేది. మాయప్ప సుందరమ్మ నుప్పు. తనెట్టా ఆడికి లొంగిందో తెలవదు గానీ సుందరమ్మని పలకరిచ్చాలంటే యెంతోడికైనా వుచ్చే! ఆచ్చేసు యేనాడూ ఆమకి రూపాయి యిచ్చినోడు కాదు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కష్టజీవి సుందరమ్మ. తర్వాత ఆమని యెంతోమంది పెళ్లి చేసుకుంటామని, వుంచుకుంటామని అడిగినా వొప్పుకోలేదు. యిద్దరు అనాధ పిల్లల్ని చేరదీసి పెంచింది. పిల్లలు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకొచ్చేరు. తనకి చాతనైన సాయం చేస్తా అందరికీ తల్లో నాలికలా వుండే సుందరమ్మని యెవురు కాదనుకుంటారు చెప్పు! సెర్చీ పక్కనే అంబేద్కర్ బొమ్మ రాటానికి ఆమ కృషి కూడా వుంది! యిప్పుడు మన పల్లిలో సుమారు వందమంది దాకా వుద్యోగాలలో వుండారంటే ఆనాడు సుందరమ్మ తోడుపాటుతో మనోళ్ళు చేసిన సాహసమే కారణం’ చెప్పడం ముగించాడు సత్యాలు.

అశోక్ అవునన్నట్టు తలూపాడు.

సత్యాలు, అశోక్ కల్సి సమాధుల దొడ్డి కలదిరిగి చూశారు  ఓపక్క సుందరమ్మ సమాధి హుందాగా నవ్వుతుంది. ముందు వరసలో బతుకు సాము చేసిన వీరుల సమాధులు పొగరుగా కనిపించాయి వాళ్లకి.  ఔను, అవి  సున్నం కొట్టిన సమాధులు కావు, లొంగుబాటు యెరగని, యుద్ధాన్ని శ్వాసించే మనుషుల మొహంలో కనిపించే పొగరది. లోపల నిద్రిస్తున్నది బతుకు పోరులో వోడి గెలిచిన  సైనికులు.

‘మంచి పోరాటం పోరాడితిని, నాపరుగు తుద ముట్టించితిని…’ ఏసురత్నం సమాధి మీద రాసి వుంది.

*

చల్లపల్లి స్వరూప రాణి

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఒకప్పుడు దళిత కథలంటే సానుభూతి కథలని, బాధలతో, అవమానాలతో, తిట్లతో నిండిన కథలని, అపోహలతో, విమర్శలతో ఉండేవి…వాటికి భిన్నంగా ఆ విమర్శలను బద్దలు కొడుతు ఇలాంటి తిరుగుబాటు కథలు రాయడం బహుశా ఇదే మొదటి సారెమో..ఇదే మొదటి కథ కావొచ్చు. చల్లపల్లి స్వరూప గారు కవిత రాసినా, కథ రాసినా ఉన్నది ఉన్నట్ట్లుగా వాస్తవాన్ని అద్దం ముందు నిలబెట్టి చెప్పినట్లు ఉంటుంది…చాలా మందికి నచ్చక పోవచ్చు కానీ వాస్తవం అదే…దానిని కాదనడానికి ఇంకో మాట గాని, ఇంకో ఆలోచన గానీ ఉండవు. నిజాన్ని గుప్పెట్లొ దాచి, మూసి, పరదా వేసి చెప్పే అలవాటు అమెకు, ఆమె రచనలకు ఉండదు. ఈ కథ దళిత కథా సాహిత్యం లో ఒక కొత్త ఒరవడిని సృష్టించ వచ్చు. ఇక నుండి దళిత సాహిత్యంలొ ఇలాంటి తిరుగుబాటు కథలే ఇప్పుడున్న బానిసత్వానికి ప్రేరణగా నిలుస్తాయి. ఇక నుండి చంపబడ్డ దళితుల సమాధులె తిరుగుబాటు కథలుగా వాస్తవాలను మాట్లాడతాయి. దోపిడి కులాల ముసుగులను ఒక్కొక్కటిగా పొరలుపొరలు గా విప్పే తిరుగుబాటు కథలు ఇంకా రావాలని…సాహిత్యం సమాజం, సంస్కృతి దోపిడి కులాల గుప్పెట్లో ఎలా బందీ అయ్యిందో చెప్పే కథలు రావాలని కోరుకుందాము…ఈ కథను తొలి అడుగుగా భావించి ఈ అడుగులు అంగలు వేసుకుంటూ, పరుగులు పెట్టాలని ఆశిద్దాము. తిరుగుబాటు కథలనుండె కులం కుట్రలు బద్దలు కొట్టి బానిస బ్రతుకులను విముక్తి చేసుకుంటూ పోవాలి. దళితులకు సంబంధించి ఏ అనుభవమైనా బాధితులకు పచ్చి గాయాలను మిగిల్చి, (ఇక్కడ గాయాల నుండి కుడా ధైర్యం స్రవిస్తునే ఉంటుందని గమనించాలి) నిందితులకు మింగుడుపడని గరళాంలా ఉంచటమే ….కదా వాస్తవమంటే….ఆ వాస్తవాన్నె ఆమె ఇక్కడ నిర్భయంగా చెప్పడం అభినందనీయం..

 • మరుగున పడేయబడిన ఆనాటి సాహసోపేతమైన చారిత్రక వాస్తవాలు.ఎన్ని పరిమితులతోనైనా కమ్యూనిస్టు పార్టీలు ఆ సమూహాలతోనే ఉన్నాయి.

 • అక్క…కథ చదువుటన్నంత సేపూ ఒక ఉద్వేగంతో,ఊపిరి సపలని ఉక్కపోతతో కదిలిపోయాను..మా తరం చదవాల్సిన కథ,ఆలోచనల్ని రగిల్చే కథ ఇది.మన ముందటి తరాల్లోని ఆ తిరుగుబాటు, చైతన్యం ఒక చారిత్రక,సామాజిక సంఘట నేపథ్యంగా కళ్ళకు కట్టినారు.ఒక దృశ్యకావ్యం చదువుకున్న అనుభూతి కలిగింది అక్క…జైభీంలు లు..
  కథలో ‘కొత్తబట్టల్ని నీళ్లలో పిండేసుకోవాల్సిన కుళ్లు కతంతా వినిపిస్తూ ఉంది.”పిచ్చినాకొడులు” చెవుల్లో మొగుతూనే ఉంది.కథలో సత్యాలు మనందరి తాతల కనిపించాడు..అశోక్ నా తొడబుట్టులా మాట్లాడినాడు.. సుందరమ్మ మా మేనత్తలా కనబడుతోంది.. నేను కథ చదివాను అనడం కంటే..మన కుటుంబాలతో మాట్లాడినానానిపించింది..కథ ఎన్నో ఆలోచనల్ని కదిపింది.కదిపింది.అక్క..థాంక్యూ

 • కధ చదివించింది. కధనం చాలా ఆసక్తిగా ఉంది. స్వరూప గారికి అభినందనలు.

 • అద్భుతమైన కథ మేడం! ప్రతీ మాలపల్లి లో ఇలాంటి కథలు ఉన్నాయి! 💙 జై భిమ్!

 • చాలా బాగా రాశారు
  భాష కష్టంగా ఉంది
  సరళమైన తెలుగులో రాయగలరు

  మరిన్ని తిరుగుబాటు కథలు రాసి
  అజేయుల కథలు రాస్తారు అని భావిస్తున్నాను

 • నాకు ఈ కధ చదువుతుంటే మా ఇంటి వద్ద ఉన్న సమాధుల తోటలో మేము ఆడుకున్న రోజులు, యెకువ జామున రాలి పడిన విప్ప కాయలు ఎరుకుని వాటిని మధ్యలోకి కోసి వాటి ని వెళ్లకు పెట్టుకుని పులి గోర్లు అంటూ ఆడుకున్న రోజులు గుర్తు వచ్చాయి.

  సెలవుల్లో సొంత ఊరు పల్లె కు పోయినప్పుడు కర్ర సాము, కోలాటం నేర్చుకునే మా ముందు తరం. నాయడు గారి మేడ లో పాలేరు అయిన మా వెనకటి తరం పెద్దలు గుర్తుకు వచ్చారు.

  ఒకప్పుడు కొన్ని గ్రామాల్లో మాల పల్లె అంటే హడల్. పట్టణాల్లో మాలోళ్లు ఉన్న పేటలు అంటే హడల్. నేడు అవి అన్నీ పోయాయి. అస్తిత్వ ఉద్యమాల్లో ఇంటికొక పార్టీ కమ్మ, రెడ్డి, కాపు నాయకుల చుట్టూ తిరుగుతూ వారిని పల్లెలోకి ఆహ్వానిస్తూ బలహీనంగా కనిపిస్తుంది పల్లె.

  ఏది ఏమైనా మీరు రాసిన కథ పరాజితులమే కాదు మనకూ విజయగాధలున్నాయని తెలియజేస్తుంది.

  సింపుల్ గా చాలా చక్కగా రాసారు.
  జై భీమ్ మేడం.

 • కథ చాలా బావుంది స్వరూపా . కొత్త తరానికి ఆశనూ, ధైర్యాన్ని అందించే ఇలాంటి గాథలు ఇప్పుడు అవసరం .

 • తిరుగుబాటు కథ, వాస్తవిక జీవితాల వెతల బ్రతుకుల పోరాట కథ. నాటి నుండి నేటి వరకు కాలంతో పాటు దళిత జీవితాలలో మార్పు ఎలా వచ్చిందో ముత్యాలు చెప్పిన నిజమైన కథ . చాలా బాగా రాశారు మేడమ్ కథని..

 • ఇట్లాటి కథలు రావాలి…దళితుల బాధలు కాదు…వాళ్ళ ధైర్యం, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళు ఏమి చేయ గలరు అనేది చెప్పే కథలు…స్వరూప రాణి గారికి salute

 • చాలా గొప్ప కధ. దళిత వివక్షణ తిరుగు బాటుతోనే అణచి వేయడం అన్న విషయాన్ని స్వరూప రాణి గారు బాగా చెప్పారు.

 • నగర జీవితానికి అలవాటు పడి సుమారు రెండున్నర దశాబ్దాలు గడిచాయి. ఏ రెండేళ్ళకో ఒకసారి ఊరుకెళ్ళినా అనుబంధాల విషయంలో నగర జీవితాలకంటే పది అడుగుల ముందుకే వున్నారు పల్లెవాసులు. కానీ మీ కధలో జీవితాలు వ్యక్తులు పరిస్థితులు సంఘటనలు నా బాల్య జీవితంలో మా గ్రామమో, ప్రక్క ఊరిలోనో ఎదురైనవి, కొన్ని పెద్దవాళ్ళ నుండి కధలుగా విన్నవి. కధ చదువుతూనే నా మనసు కధలోని పాత్రలతో, మా పల్లె లోని అప్పటి మనుష్యులను పోల్చుకోవడం మొదలు పెట్టింది. నాకు బాగా తెలిసిన మనుష్యులు నాచుట్టూ గుమిగూడి ఉన్న భావన, బయట పడటానికి చాలా సమయమే పట్టింది. దళిత జీవితాలంటే పరాజిత కధలే అనే మూస భావానకు కనీసం కామా పెట్టిన మీ కధకు జైభీములు. విజేతల కధలతో అప్పుడప్పుడు మీరు చైతన్య స్పృహను ఆరకుండా వెలిగిస్తూనే వుంటారు. జాతి మీకు అప్పు పడుతుంది అక్క.

 • మేమ్! కథ బాగుంది. మంచి కథ నిచ్చేరు. కక్కాయ్ అంటే అక్కా అనే అర్థమేనా?

 • ధన్యవాదాలు మేడం గారు, అప్పట్లో ఉన్న ఏసురత్నం పై చేతబడి, అచ్చేసు లాంటి అంబోతుని చంపి గ్రామానికి మేలుచేయటం, కష్టపడి జైల్లో చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవడం, కౌలు రైతులు యజమానులు కావటం, మూఢనమ్మకాలను పార ద్రోలెందుకు భాస్కర్ గారు కృషి చేయటం.గత
  పల్లె గొప్పలు మాల మాదిగ జీవితాలు చాలా చక్కగా వివరించారు.

  • ‘పల్లె గొప్పలు’ అనడంలోనే మీరు యెంత గొప్పవారో తెలుస్తుందిలెండి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు