2013లో ప్రచురింపబడిన ‘వార్తాహరులు’ కథని నా మొదటి రచనగా భావిస్తాను.
1857నాటి విఫల తిరుగుబాటుపై మార్క్సు మహాశయుడు పాత్రికేయుడి పాత్రలో (‘న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్’ కోసం) విస్తారంగా రాశాడు. ఏంగెల్స్ రాసిన మరికొన్ని వ్యాసాలను జోడించి ‘భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామం 1857-1859’ పుస్తకంగా సోవియట్ ప్రచురణ సంస్థలు తీసుకొచ్చాయి. ఎక్కడో లండన్‌లో కూర్చొని, సమాచార వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్న రోజుల్లో, ఆ స్నేహితులిరువురూ భారతదేశ స్థితిగతులను అంత లోతుగా, సమగ్రంగా విశ్లేషించడం నన్ను అబ్బురపరచింది.
2007నాటికి తిరుగుబాటు జరిగి 150 ఏళ్లు గడచిపోయాయి. ఆ సందర్భంగా 1857నాటి సంఘటనలపై మార్క్స్, ఏంగెల్స్‌ల అభిప్రాయాలను తెలుగు పాఠకుల పరిచయంచేస్తూ, ముఖ్యంగా తదనంతర పరిణామాలకూ, వర్తమానానికీ అన్వయిస్తూ ఒక వ్యాసం రాయాలని అనుకున్నాను. నోట్సు రాసుకున్నాను. ఇది మూడు నాలుగేళ్లపాటు సాగాక అసలీ ప్రయత్నం నిరర్థకం అనిపించింది. వ్యాసాలు ఎంతమంది చదువుతారు? మేధావులకు, పరిశోధకులకు, చరిత్రకారులకు నేను కొత్తగా చెప్పేదేమీలేదు. ‘సామాన్య’ పాఠకులను చేరుకోవాలంటే, ఆనాటి పరిణామాలపై ఆసక్తిని రేకెత్తించాలంటే కథారూపమే ఉత్తమం అనిపించింది.
వృత్తి రీత్యా ఇంజినీరుని కావడంవల్ల, కొత్త టెక్నాలజీని పైనుండి (అభివృద్ధి చెందిన దేశాల నుండి) ప్రవేశపెట్టినపుడు సమాజం ఏవిధంగా స్పందిస్తుంది? ఎవరు బాగుపడతారు? ఎవరు నష్టపోతారు?…ఇటువంటి ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడం నాకు ఆసక్తికరంగా ఉండేది.
ఈ అంశాలపై ప్రొ.ఆర్.ఎస్. రావుగారితో చర్చించే అవకాశం నాకు లభించింది. సుదీర్ఘంగా సాగిన ఆ చర్చ, ఈ సూత్రీకరణను చేరుకుంది: ‘కొత్త టెక్నాలజీ పాలకవర్గాలకు ఉపయోగపడుతుంది; పెట్టుబడిని అది పోషిస్తుంది; శ్రమదోపిడికి, ప్రజాపోరాటాల అణచివేతకూ తోడ్పడుతుంది. కొత్త టెక్నాలజీలు ఫ్యూడల్ సంప్రదాయాలను రూపుమాపే ప్రయత్నం చెయ్యవు సరికదా, వాటి కొనసాగింపును ఆధునీకరణగా భ్రమింపజేస్తాయి.’
1857నాటికి సరికొత్త టెక్నాలజీ అయిన టెలిగ్రఫీ ఆధారంగా కథని నడిపించాలని అనుకున్నాను. భారతదేశం వంటి సువిశాల ప్రదేశంలో వలసపాలన కొనసాగింపుకు, పరిమిత సైనికదళాల కదలికకు అత్యవసరమైన సాధనం. అందుచేత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అఫీసర్‌ని, ఆనాటి సైనిక వ్యవస్థని కథలో చేర్చాను.
బ్రిటిష్ ఆఫీసర్‌లకు వంటవాళ్లుగా దళితులను నియమించే సంప్రదాయం ఉండేది. ఎందుకంటే అటు గొడ్డు మాంసంగానీ, ఇటు పంది మాంసంగానీ వండేందుకు వారికి అభ్యంతరం ఉండదు. ఇది నా బాల్యంలో, మాస్కూల్లో అమెరికన్ పీస్ కోర్ వాలంటీర్‌లకై వంటపుట్టిని వెతుక్కొనేటప్పుడు మా టీచర్లు కొంతమంది మాకు వెటకారంగా తెలిపిన విషయం.
ఆ విధంగా కథా నాయకుడు దళిత వంటవాడు కాలియా దొరికాడు. 1857 తిరుగుబాటులో హిందూ, ముసల్మాన్ సైనికులు కలసికట్టుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్న వైనాన్ని ఎత్తిపట్టేందుకై కథానాయకగా ముస్లిం యువతి ఉండాలని భావించాను. మరియం కథలోకి ప్రవేశించింది. వారిద్దరి మధ్యా ప్రేమ చిగురించడం సహజంగా జరిగిపోవాలని భావించాను.
కథ యావత్తూ ‘సామాన్యుల సాహసమెట్టిది?’ అన్న ప్రశ్నకు జవాబుగా నిలిచి ఉండాలనుకున్నాను. అందుచేత నానాసాహేబు ప్రసక్తిని ఒకే ఒక్క వాక్యంతో ముగించాను. ప్రముఖులైన తిరుగుబాటు నాయకుల పేర్లేవీ కథలో కనబడవు. కథ చివరిలో మాత్రం అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ ప్రస్తావన వస్తుంది. తన నిర్ణయాలను తానే తీసుకోగల సాధికారతను సంతరించుకున్న మరియం, అంగరక్షకదళ సభ్యురాలిగా బేగంవెంట వెళ్లిపోతుంది.
ఆనాటి చర్చలో భాగంగా ప్రొ. రావు మరికొన్ని పరిశీలనలను చేశారు. ‘కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టగానే, దాని వెనుకనున్న సైన్సు, పాత సమాజాలకు తక్షణమే అవగతంకాదు. రూపకల్పన, తయారీ, వారికి అందుబాటులో ఉండవు. తక్కువ ఖర్చుతో సాధనాల వినియోగాన్ని పొడిగించగల మరమ్మత్తులను చేబట్టడంలో మాత్రం వారు ప్రవీణులవుతారు. అలాగే ఉత్పత్తిదార్లు ఊహించని దారులలో టెక్నాలజీని వినియోగిస్తారు. మన్నికకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ‘వెనుకబడ్డ’ సమాజాల మార్కెట్లలో విదేశీ ఉత్పత్తిదార్లు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య – పాత సాధనాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టడం. అతి స్వల్ప కాలంలోనే పాత సాధనాలు నిరుపయోగంగా మారిపోయేందుకై ఉత్పత్తి చేసే పెట్టుబడిదారులు నక్క జిత్తులు పన్నుతారు.’
కొత్త టెక్నాలజీ వినియోగాన్ని, ఉపయోగాన్ని పాతతరం ఏ విధంగా అంచనా కడుతుంది? ఈ అంశాన్ని కథలోని స్థానిక ముస్లిం పెద్దమనిషి అమీనుద్దీన్ నోట చెప్పించాను. ‘టెలిగ్రఫీ సైతాను కనిపెట్టిన సాధనం; సమాచారం అందించేవరకే అయితే తన పావురాల ముందు ఇవేవీ పనికి రావు’ అని అతడి అభిప్రాయం. మరియం పెదనాన్న కొడుకు బషీర్‌భాయ్ బాగా ముందుచూపు ఉన్నవాడు. తిరుగుబాటుదారులకు అప్పటికే ఎన్నో నష్టాలను కలిగిస్తూన్న టెలిగ్రఫీ, రాబోయే రోజుల్లో మరింత ప్రముఖ పాత్ర వహిస్తుందని అతడు గ్రహిస్తాడు. ఆ పరికరాల వ్యాప్తిని అడ్డుకోవాలని అనుకుంటాడు. అయితే అతడు కథలో ప్రత్యక్షంగా కనిపించడు. అదృశ్య శక్తిగానే ఉండిపోతాడు. నిజానికి ఈ కథకు దార్శనికుడు, వైతాళికుడు అతడే.
‘దిగువస్థాయి’ వినియోగదారులు, లేక సామాన్యులు ఏవిధంగా చూస్తారు? “టెలిగ్రాఫు తీగెలకి రంధ్రం ఉంటుందా? లేకుంటే మరి వాటిల్లోంచి మాటలు ఎలా ప్రయాణిస్తాయి?…ఎక్కడో ఓచోట ఆతీగెల్ని కత్తిరిస్తే మనకికూడా ఆమాటలు వినబడాలి కదా?” వెనుకనున్న సైన్సు అర్థం కాకపోతే, ఈ సందేహాలకు నివృత్తి దొరకదు; రావిశాస్త్రి మాటల్లో ‘తెల్లోడి మాయ’గా మిగిలిపోతుంది
‘Surrealism is reality as it appears before you understand it.’ అని ఆంద్రే బ్రెటన్ అన్నాడంటారు. అర్థం కానంతకాలమే సంక్లిష్టత, గందరగోళం. ఒకసారి అర్థం అయిపోతే ప్రతీదీ సరళమే. కొత్త టెక్నాలజీ కూడా అటువంటిదే. సైన్సుని ముందు గ్రహించాల్సి ఉంటుంది. అంతవరకూ సంక్లిష్టంగా, గందరగోళంగా, సర్రియలిస్టుగా తోస్తుంది. ఈ అంశాన్ని పరోక్షంగానైనా కథలో ప్రవేశపెట్టాలని అనుకున్నాను. నిజానికి సామాజిక గతిసూత్రాలని అర్థం చేసుకోవాలంటే మార్క్సిజం అనే సైన్సు తెలిసి ఉండాలి.
ఈ కథలోని బాహ్య సందర్భాలన్నీ చారిత్రక ఆధారాలున్నవే. పాత్రలు, సంభాషణలు మాత్రమే కల్పితాలు, కథ ముగింపులో – తిరుగుబాటు సైనికులను చెట్లకు ఉరితీయడం, శవాలను రాబందులు పీక్కు తినడం, చనిపోయినది హిందువులో, లేక ముస్లింలో తెలియకపోవడం ఇవన్నీ వాస్తవాలే. అలాగే ఉరితీతకు కొద్ది క్షణాలముందు, ఒక సైనికుడు టెలిగ్రాఫ్ తీగెలను చూపిస్తూ ‘ఈ ముదనష్టపు తీగెలే మాకు యమపాశాలయ్యాయి,’ అనడం ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులలోంచి తీసుకున్నది. ఛిన్నాభిన్నం అయిన సామాన్యుల జీవితాలను విశాలమైన చారిత్రక పరిణామాల కేన్వాస్‌తో సంధించడంతో కథ ముగుస్తుంది.
ఈ కథాంశానికిగల ప్రాసంగికతను గుర్తించేందుకై ఈ ప్రస్తావన అవసరం. సైన్సు, టెక్నాలజీల అభివృద్ధి సంక్షేమ, ప్రజాహిత రాజ్యాల ఎదుగుదలలో భాగంగా జరగాలి తప్ప విడిగా, కృతకంగా జరిగితే అది అరిష్టదాయకమే అవుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అతిస్వల్ప కాలంలో సోవియట్ యూనియన్ సాధించిన విజయం అద్వితీయం, అపూర్వం. అయితే ఆ సంచలనాత్మక ముందంజకు తగిన గుర్తింపు రాలేదు.
‘వార్తాహరులు’ కథను పూర్తి చేయడానికి సుమారు ఏడాదిన్నర పట్టింది. అయితే ఈ కథకు వివిధ వర్గాలనుండి వచ్చిన విశేషమైన స్పందన నన్ను చారిత్రక రచనలవైపు మళ్లించింది. మరోకథ (‘ఒక వీడ్కోలు సాయంత్రం’, ‘సారంగ’, 13 జనవరి 2016)కు పరిశోధన ఉపయోగపడింది.
అయితే ‘వార్తాహరులు’ కథను రాసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇది తెలుగు కథ అయినప్పటికీ పాత్రలు తెలుగు మాట్లాడే అవకాశమే లేదు. మరియం మాట్లాడేటప్పుడు ఉర్దూ ధ్వనించాలని భావించాను. ఆ దిశలో ప్రయత్నం చేశాను. తరువాత రాసిన కథలన్నీ కళింగాంధ్ర ప్రాంతానివే. అందుచేత భాషాపరమైన ఇబ్బంది ఎదుర్కోలేదు.
భారతదేశంలో టెలిగ్రఫీ వ్యవస్థ అంతమొందిన దినం, 15 జులై, 2013. తరువాతి ఆదివారం (21 జూలై 2013) ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘వార్తాహరులు’ కథ ప్రచురింపబడింది.
చారిత్రక కథా రచనకై సూచనలు చెయ్యమని కొంతమంది అడుగుతూంటారు. ముగ్గురు పెద్దలు చెప్పిన మూడు విషయాలను గుర్తుంచుకోమని చెబుతాను.
శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ – మళ్లీమళ్లీ చదవండి.
‘చరిత్ర అనేది, గతానికీ, వర్తమానానికీ నిరంతరంగా జరిగే సంభాషణ’ – ఈ.ఎచ్. కార్.
‘మంచికి హానీ, చెడుకి మేలూ చేయరాదు’ – రావిశాస్త్రి.
*
ఈ కథను వినడానికి: https://www.youtube.com/watch?v=0od4-_wS9wk
చిత్రం: తల్లావఝ్ఝుల శివాజీ
ప్రొ.ఆర్.ఎస్.రావు (1937-2011)
Image Courtesy: The Indian Express
వార్తాహరులు కథా నేపథ్యంతో పాటు
కొత్త టెక్నాలజీ నుంచి సమాజం ఎలా చూస్తుందో బాగా వివరించారు.. ధన్యవాదాలు సర్
కథ ఎంత బావుందో కథని ప్రేరేపించిన చారిత్రక సందర్భం పంచుకోవడం అంత బావుంది. “సైన్సు టెక్నాలజిీల అభివృద్ధి సంక్షేమ, ప్రజాహిత రాజ్యాల ఎదుగుదలలో భాగంగా జరగాలి తప్ప విడిగా, కృతకంగా జరిగితే అది అరిష్టదాయకమే అవుతుంది” అన్న భావన అక్షర సత్యం. చరిత్ర నిరూపించింది కూడ యెన్నో విషయాలలో. ఇక artificial intelligence technology సరిగ్గా వినియోగం కాకపోతే యెంత విధ్వంసం స్రుష్ఠిస్తుందో కాలమే చెప్తుంది.
కథ ఎంత బావుందో కథని ప్రేరేపించిన చారిత్రక సందర్భం పంచుకోవడం అంత బావుంది. “సైన్సు టెక్నాలజిీల అభివృద్ధి సంక్షేమ, ప్రజాహిత రాజ్యాల ఎదుగుదలలో భాగంగా జరగాలి తప్ప విడిగా, కృతకంగా జరిగితే అది అరిష్టదాయకమే అవుతుంది” అన్న భావన అక్షర సత్యం. చరిత్ర నిరూపించింది కూడ యెన్నో విషయాలలో. ఇక artificial intelligence technology సరిగ్గా వినియోగం కాకపోతే యెంత విధ్వంసం స్రుష్ఠిస్తుందో కాలమే చెప్తుంది.
It is not an easy job to tell the history in a story form through created characters. But you have proved it can be done so efficiently in your East Wind.
“సైన్సు, టెక్నాలజీల అభివృద్ధి సంక్షేమ, ప్రజాహిత రాజ్యాల ఎదుగుదలలో భాగంగా జరగాలి తప్ప విడిగా, కృతకంగా జరిగితే అది అరిష్టదాయకమే అవుతుంది”
Yes….