సాఫ్ట్ వేర్ ఇంజినీర్ – జీవితం, సినిమా

ప్రస్తుతం వచ్చే తెలుగు సినిమాలు పది నిముషాలు చూడగానే హీరో ఎనిమిది అడుగుల లోతున భూమిలో పాతిన నీళ్ల పైపుని వఠ్ఠి చేతులని భూమిలోకి దింపి సునాయాసంగా పీకిపారేయడం, దాంతో పదిహేనుమంది కారు నలుపు విలన్లని చితక్కొట్టడం; లేదా ఆహ్, ఊహ్ అని చేతులు ఊపగానే సదరు విలన్ గారు మూడు మొగ్గలు వేయడం, లేదా మూడు బిల్డింగులు ఊగి, ఊగి కూలిపోవడం – అదీ స్లో మోషన్ లో, అనేవి జగమెరిగిన సత్యాలు అయినా ఈ సన్నివేశాలు రోజురోజుకీ మితిమీరడం కనిపిస్తూందే తప్ప తగ్గేదేలే. ఈ ‘అతి’  తెలుగు తమిళ సినిమాలలో కనిపించినంత మరే బాషలోను లేదు. అదీ తెలుగులో మరింత ఘోరం. ఎందుకిలా, మరింకెంతకాలం ఇలా సాగదీస్తారో అనేది ఎవరికీ తెలియని చిదంబర రహస్యం. మీరు చూస్తున్నారు కనకే మేము అలా తీస్తున్నాం అంటారు అడిగితే. నిజ జీవితం లో సాఫ్ట్ వేర్ యింజనీర్ కీ, సినిమాలో చూపించే అసలు పోలికలే లేని సాఫ్ట్ వేర్ యింజినీర్ కి తేడాలు నేను గమనించినవి. కొంచెం కూడా ఆలోచించకుండా, రీసెర్చ్ చేయకుండా ఈ సీన్లు ఎలా పెడతారో మన ఊహకి అందదు. ఈ కాంట్రాస్ట్ అండ్ కాంపేరిజన్ చదివే ముందుగా మరో విషయం చెప్పనివ్వండి. నా సినిమా పరిజ్ఞానం దాదాపు సున్నా. ఎప్పుడోగానీ సినిమా చూసే సమయం, ఓపికా, తీరికా, కోరికా లేవు. మీకు ఆరాధనా భావం ఉన్న హీరోని గానీ హీరోయిన్ ని గానీ, ఏ విధమైన సినిమా కళాకారులని కానీ, మీ మనోభావాలని గానీ కించపరచాలని కాదు. ఈ విషయం ఎవరితోనో మాట్లాడుతుంటే ఆయన అన్న మాట ‘సినిమా మన కల్చర్.’ ఆ మాట నేను ఒప్పుకోలేను ఎందుకంటే మన కల్చర్ ని సినిమా ప్రతిబంబించాలి కానీ సినిమాయే మన కల్చర్ కాదు అని నమ్మేవాళ్ళలో నేను ఒకణ్ణి. ఆ సోది వదినేసి ముందుకి పోదాం.

ఇండియాలో సాఫ్ట్ వేరు ఉద్యోగం రావాలంటే ఓ టెస్టూ, రెండో మూడో ముఖాముఖి పరీక్షలూ, కొండొకచో మరో లేబ్ లాంటి పనీ అన్నీ పూర్తికావాలి. అంతకుముందు మరో కంపెనీలో పనిచేసి ఉన్నా సరే. ఉద్యోగం ఇచ్చే ఆసామీ కూడా సవాలక్ష ప్రశ్నలు వేసి విసిగించి మనం వేసారాక మరో సారి పిల్చి తిక్క ప్రశ్నలన్నీ అడిగి ఏవోవో బేక్ గ్రౌండ్ టెస్టులూ అవీ చేసాక ఉద్యోగం ఇస్తారు. మరి సినిమానో? మన జీరోగారు ఇంటర్వ్యూకి వెళ్తారు గానీ వెళ్ళేటపుడు తనకూడా తాను రాసిన ఒక ఆపరేటింగ్ సిస్టం డిస్కు పట్టుకెళ్తారు. అది చూసి డంగైపోయిన అధికార్లు ఆ డిస్కులో ఏముందో కూడా చూడకుండా ఒక్క ప్రశ్న వేయరు కదా, ఎంత జీతం కావాలని అని కూడా అడగరు. పది కోట్లు గుమ్మరించేసి ఆయన ఇచ్చిన డిస్కు ముట్టుకోగానే షాక్ తగిలి మూర్ఛ పోతే జీరోగారు తన దగ్గిర తాగగా మిగిలిపోయిన నీళ్లబాటిల్లో నీళ్ళు వాళ్ల మొహాలమీద జల్లి ‘నా సంగతి తెల్సింది కదా ఇంక లేవండిరా’ అని విజయ గర్వంతో బయటకి పోతారు నోళ్ళు వెళ్లబెట్టిన అధికారులని అలా వాళ్ళ మానాన వాళ్లని వదిలేసి. ఆ డిస్కూ ఆ ఆపరేటింగ్ సిస్టం ఏవిటో మరోసారి మనకి కనబడదు సినిమాలో కానీ మరో పార్ట్ లో కానీ. నీళ్ళ బాటిల్ చూపించడం ఎందుకంటే మన జీరోగారికి మామూలు కుళాయి నీళ్ళు తాగే అలవాటు లేదు బతికేది ఇండియాలో అయినా సరే. మరో ముఖ్యమైన విషయం – ఈ ఆపరేటింగ్ సిస్టం లో ఆయన రాసిన కోడ్ మనకి బోర్డు మీద పాఠాలు చెప్తూ కనిపిస్తారు కూడా జీరోగారు ఉత్తరోత్తరా. కానీ ఆ బోర్డు మీద ఆయన రాసేది కోడి గిలికినట్టు ఏవో మూడు లైన్లూ, డబ్బా బ్రేకెట్లూ, దాని కిందన ఒక అతి పురాతనమైన సి-ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో ఉన్న ‘printf’ అనే స్టేట్ మెంటూను. ఆ స్టేట్ మెంట్ కూడా పూర్తిగా ఉండదు, కనిపించదు.

సరే ఉద్యోగం వచ్చేసింది కదా, నిజజీవితంలో సాఫ్ట్ వేర్ యింజినీర్ (నిజీసాయి) గారు రోజుకి పదహారు నుంచి ఇరవై గంటల్దాకా పనిచేయకపోతే మేనేజర్ గారు దాదాపు ఇంటికొచ్చేసి పీకనొక్కేస్తారు ఇండియాలో – అదీ అచ్చులో రాయలేని పదజాలంతో తిడుతూను. జీవితంలో కనబడిన – బోండా, సమోసా, చైనీస్ నూడిల్స్  లాంటివి – తినడం, వ్యాయామం చేయడానికి సమయం దొరక్కపోవడం, అతి బరువూ, ప్రీ డయాబెటిస్సో, డయాబెటిస్సో తెచ్చుకోవడం, పెళ్ళాం కూడా ఏదో ఉద్యోగంలో పనిచేస్తుంది కనక ఇంట్లో వంటా గింటా జాంతా నహీ.  వంట ఎవరు చేస్తారు? డోర్ డేష్, జొమాటో అన్నీ ఉండగా దేనికీ సమయం లేదు గాక లేదు. నలభై ఏళ్ళకే మిలియన్ డాలర్లు రానందుకు అప్పు చేసి ఆన్లైన్ లో గేమ్స్ ఆడ్డం, అప్పుకట్టుకోలేక ఉరి, లేదా ఆత్మహత్య. లేదంటే పెళ్ళాం మీద అరుపులు, ఆవిడ తో విడాకులు లేదా ఆవిడ ఆత్మహత్య – వీడి మూలానే నేను ఛస్తున్నా అని కాయితం రాసిపెట్టి. లేదా తాము విధిగా దర్శించే బార్ లోనో పబ్ లోనో గొడవలు. ఏడాదికోసారి వచ్చే రివ్యూలో మేజేజర్ ఏం రాస్తాడో అనే చింత. కంపెనీ బయట మాత్రం తానో కోట్లు తెచ్చే సాయి – అనగా సాఫ్ట్ వేర్ యింజినీర్. సినిమా జీరో గారు వేరు. ఆయన ఆఫీసుకెప్పుడొస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియదు. వస్తే డైరక్ట్ గా తలుపు తీసుకుని సీఈఓ గదిలోకి వెళ్ళిపోతాడు/గలడు. అలా వెళ్ళడమే కాదు, వెళ్లగానే సీఈఓ సీట్లోంచి లేచి జరుగుతున్న మీటింగ్ అక్కడికక్కడే ఆపి ఈయన్ని మిగతావారికి పరిచయం చేసేస్తాడు. ‘printf’ ఆపరేటింగ్ సిస్టం మహిమా, మజాకా?

ఇంకా ఉంది ఈ ఆఫీసు తతంగం. నిజీసాయి గారు ఏం బట్టలు కట్టుకున్నారా, ఎక్కడ కూర్చున్నారా, ఆయన జీన్ పేంట్ ఉతికి ఎన్ని రోజులైందా అనేది ఎవరూ గమనించరు. ఆయన ఎప్పుడు ఆఫీసుకి వస్తాడో, పోతాడో మాత్రం మేనేజర్ చూస్తూ ఉంటాడు. టై కట్టాడా? గెడ్డం గీసుకున్నాడా? బూట్లేసుకున్నాడా? ఏమీ అక్కర్లేదు. ఆయన రాసిన కోడ్ ఎలా పనిచేస్తోంది, ఎంత పని(కిమాలిన పని – అంటే ఇంటర్నెట్ చూసుకోవడం) చేస్తున్నాడు, సీనియారిటీలో ఉంచుదామా, లేకపోతే ఓ తాపు తన్ని వచ్చేఏడు పొమ్మందామా? అనేవి మేనేజర్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి జీరో గారు? ఆయన ఆఫీసుకి ఎప్పుడూ కూడా టై కట్టుకుని వస్తారు అదీ కూడా లూజ్ గా. చొక్కా పై బొత్తం లేదా రెండు బొత్తాలు ఎప్పుడూ పెట్టుకోరు – వక్షం మీద వెంట్రుకలు హుందాగా (?) కనిపించవద్దూ? ఆయన ఆఫీసులోకి రాగానే అదో రకం వెలుగు ప్రసరిస్తుంది ఆఫీసులో. అందరూ లేచి నుంచుంటారు. అమ్మాయిలైతే ఇంక చెప్పడం దేనికీ? మెరిసే కళ్ళతో చూస్తూంటారు; అంతటి ఆరాధన ఈయనంటే; పెళ్లైపోయిన ఆడపడుచులు వాళ్లాయిన్ని ఈ జీరోగారితో పోల్చి చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు రోజూను. బూట్లు లేకుండా ఆయన ఎప్పుడూ ఆఫీసుకు రారు. ఈయనకి ఆఫీసులో క్యూబూ, రూమూ, కంప్యూటరూ ఉండనే ఉండవు. ఈయన ఆఫీసులోకి వస్తూనే ఎవరో కోడ్ రాస్తున్న బచ్చా లేదా బచ్చమ్మ దగ్గిరకి వెళ్ళి వాళ్ళు మూడు రోజులనుంచీ తన్నుకుంటున్న ప్రోబ్లెం కి – అసలు ఆ ప్రోబ్లెం ఏమిటో తెలియకుండానే, ఆ కోడ్ పైనా కిందా చూడకుండానే – ఒక ‘printf’ స్టేట్ మెంట్ కిందన పెట్టి అంతా ఫిక్స్ చేసి పారేస్తాడు. వార్నీ వీడెంత మంచివాడు, మనకి ఎంత సహాయం చేసాడు – ఔను, ఒక ‘printf’ గురించే – అని వాళ్ళందరూ గుర్తుంచుకుని వాడి బూట్లు నాకుతూ ఉంటారు జన్మాంతరం – అదే సినిమాంతరం.

నిజీసాయిలనీ, సాఫ్ట్ వేర్ లో పనిచేసేవాళ్లనీ ప్రపంచంలో ఎక్కడికైనా పంపుతారు ఇండియానుంచి – అంటే జింబాబ్వే, జపాన్, ఆస్ట్రేలియా, టాంజేనియా వగైరా. దాని కోసం నిజీసాయిలు సీనియారిటీ సంపాదించడానికీ, కోడ్ బాగారాసి మేనేజర్ ని ఇంప్రెస్ చేయడానికీ అష్టకష్టాలు పడుతూ ఉంటారు. చివరికి అవకాశం వచ్చేసరికి వీసా రావచ్చు రాకపోవచ్చు అనేకానేక కారణాలవల్ల. దానిక్కూడా ఓ తతంగం, మానవ వనరుల ద్వారా చెకింగ్, వగైరా వగైరాలు  ఉన్నాయి. నిజీసాయిగారు ఎకానమీ క్లాసులో మాత్రమే ఎగిరి వెళ్తారు. జీరోగారి ఈ ప్రశ్నే లేదు. ఆయన ఉద్యోగం వచ్చిన మూడో రోజున అమెరికాలో “మాత్రమే” తేల్తాడు. వీసా గీసా జాంతా నై. పాస్ పోర్ట్ కూడా ఎయిర్ పోర్ట్ లో ఎవరూ అడగరూ; ఈయన చూపించడూ. ఆయన కాన్సులేట్ కి వెళ్ళే పద్ధతే లేదు. మరీ అంతగా వీసా అదీ చూపించాలంటే వీసా వారే ఆయనింటికి వచ్చి మరీ వీసా స్టాంపులు ఈయన పాస్ పోర్ట్ మీద వేసి “దయచేసి అమెరికాని మీ ‘printf’ ఆపరేటింగ్ సిస్టం’ తో ఉద్ధరించండి ప్రస్తుతానికి అమెరికాకి మీరు తప్పమరో అతీ గతీ లేదు” అని చెప్తారు.  జీరో గారు ఎప్పుడూ కూడా వెళ్ళేది ఎయిర్ లైన్ వారి ఫస్ట్ క్లాస్ లో  – బిజినెస్ క్లాసు కూడా కాదు –  ఎత్తైన బిల్డింగులున్న న్యూ యార్క్, సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ అనే చోటకి మా-త్ర-మే. అందులోనూ డౌన్ టౌన్ లో ఉన్న ఆ ఎత్తు భవనాలలో నూట పదో అంతస్థులో పనిచేస్తారు; ఆ భవనంలోనే మరో అంతస్థులో ఆయన నివాసం. ‘printf’ స్టేట్ మెంట్స్ తో  రాసిన ఆపరేటింగ్ సిస్టం అంటే ఏవిటనుకుంటున్నారు?

ని.జీ.సా.యి. గారికి పాపం అమెరికా లేదా వేరే దేశం వెళ్ళినప్పట్నుండీ అన్నీ కష్టాలే. న్యూయార్క్ వెళ్తే ఎక్కడ ఉండడం? వచ్చే డబ్బులకీ తన ఖర్చులకి కారు కొనుక్కోగలడా? లేకపోతే న్యూ జెర్సీ లో మకాం పెట్టి రోజూ ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఆఫీసులో ఎవరు తనకి మిత్రులు, శత్రువులు? అందర్నీ నమ్మొచ్చా? ఆకలేస్తే బయట తినడానికి ఎక్కడైనా కుదుర్తుందా? ఆఫీసు దగ్గిర్లో రోజూవారీ తినాలంటే డబ్బులు సరిపోతాయా? సరిపోయినా తన ఆరోగ్యం ఫర్వాలేదా? తిండిలో ఫలానా ఫలానా మనం తినం కనక అది తినేదో తినకూడనిదో ఎలా తెల్సుకోవడం? ఇంటినుండి ఆఫీసుకి వచ్చే వెళ్ళేదారిలో ఎవరైనా గన్ తో కాలిస్తే? ఆఫీసులో తాను తినే తిండి గురించీ తాను చేసే పనిగురించీ ఎవరు ఎలా వెక్కిరిస్తున్నారో? ఎవరు తన చర్మం రంగు గురించి మాట్లాడుతున్నారో ఎవరు తన ఉద్యోగం దొబ్బేస్తున్నాడని అనుకుంటున్నాడో అని వ్యధ. తనవల్ల ఎవరికైనా ఉద్యోగం పోతే ఉద్యోగం పోయిన వాడు గన్ పట్టుకొచ్చి తనని కాలుస్తాడో అని మరో తలనెప్పి. బయట షాపింగ్ కి వెళ్తే తనకేసి ఇతరులు చూసే చూపులో – వీడు లీగల్ ఇమిగ్రెంటా, లేదా అంటారేమో అనే కనీకనపడని అర్ధాలు. ఆఫీసులో మహిళల్తో మాటల్లో చేతల్లో వ్యవహారం ఏమాత్రం తేడా వచ్చినా వెళ్ళేది తిన్నగా శ్రీకృష్ణ  జన్మస్థానానికే అని మరింత బెంగ. తనతో ఎవరూ మాట్లాడరేమని చింత. ఒక్కడే కొత్తగా అమెరికా వచ్చి ఉంటే వీకెండ్ ఏం చేయాలి? పక్కనున్న అపార్ట్ మెంట్ వారి తలుపు కొట్టి ‘ఓ సారి న్యూస్ పేపర్ ఇస్తారా?’ అని అడగొచ్చా? లేదా అక్కడున్న ఒక మంచి తెల్ల అమ్మడు, తలుపు తట్టాగానే తనని వాటేసుకుని “ఓ మై, నీ గురించి నేనెంతకాలం నుంచి చూస్తున్నాను?” అంటుందనుకుని తడితే ఓ పెద్దాయన పిస్టల్ చేత్తో పట్టుకుని తలుపు తీశాడా? లేదా ఓ నడి వయసు ముత్తైదువు శాపనార్ధాలు పెడుతూ ‘ఎవడవురా నువ్వు ఇటకేల వచ్చినావు?’ అంటుందా? తాను మాట్లాడే ఇంగ్లీషు ఏక్సెంట్ అవతలి వారికి అర్ధం అవదేమో అనే చింత.

జీరో గారి వరసే వేరు. ఆయన వస్తూంటే సరిగ్గా ఎత్తు బిల్డింగుల ముందు పది తెల్లమ్మాయిలూ మరో పాతిక గోధుమ రంగులూ ఒకే రంగు అతి చిన్న బట్టలు – ఎంత మంచు పడుతున్నా సరే – వేసుకుని వరసలో నించుని ‘రండి రండి దయచేయండి, వచ్చి వచ్చి వళ్ళో కూర్చోండి, మేము మేము ఆగలేమండి, రారా వలపుకాడా వచ్చి వచ్చి వాటేసుకోరా, ఐ కాన్ట్ వెయిట్, వెయిట్ నో మోర్; టచ్ మీ, కిస్ మీ, పుట్ హేండ్ ఆన్ మై ఫ్రంట్ అండ్ బాక్, నేనమనుకోనూ” అని పాడతారు. ఈయన కూడా తక్కువ తిన్నాడా? “వస్తా  వస్తా డార్లింగూ నా రొమాన్స్ చూడరండీ అమ్మాయిలూ, అది పూలు నింపిన పిస్తోలూ…విప్పేసా నా చొక్కా బొత్తాలూ … యా యా బాస్ ఈస్ బేక్, తీసుకోండి సింహంతో సెల్ఫీలు” అంటూ తానూ వంత కలుపుతాడు. తెలుగు సినిమా కనక మధ్యలో అలా థేంక్స్, ఐ హేట్ యూ, యు ఆర్ వెల్కం , వెయిటింగ్ నో మోర్ అనే ఇంగ్లీషు పదాలు విధిగా వచ్చి తీరాలి. అలా జీరోగారు ఆ తెల్ల, గోధుమలనందర్నీ వాటేసుకుని ముద్దులు పెట్టేసి లోపలకి వెళ్ళేసరికి అద్భుతం జరడానికి సిద్ధంగా ఉంది – లోపల రూములో ఉన్నది ఎవరు? బాలీవుడ్ నుంచి ఎత్తుకొచ్చిన “తెలుగంటే, ఐద్రాబాద్ అంటే నా కెంత ఇష్టమో” అంటూ టిట్టర్ లో రోజూ చెప్పే, మిల మిల మెరిసే – రవళీ పటాన్కర్! తెలుగంటే, ఐద్రాబాద్ ఆవిడకెందుకండీ అంత ఇష్టం? బాలీవుడ్లో ఏమీ అవకాశాలు రాక ఇక్కడ టాలీవుడ్ సినిమాల్లో కోక విప్పేస్తే చాలు కోట్లు వస్తూంటే ఇష్టం కాదుటండీ మరీ? అప్పుడు హీరో పాట పటాన్కర్ తో – ర ర రా రా రవళీ రవళీ నిన్ను చూస్తే మనసే ఎక్కేస్తుందే రైలు పట్టాలు అంటూ. సాయంత్రం పటాన్కర్ జీరో కల్సి ఓ రెస్టారెంట్ కి వెళ్తారు – అవును జీరోనే డ్రైవ్ చేస్తాడు. ఆయన ఎక్కడైనా జేమ్స్ బాండ్ లాగా ఏ కారైనా డ్రైవ్ చేయగలడు కదా? ఆ కారు కూడా ఆ రోజే అమెరికాలో దిగిన – ఎటువంటి జెట్ లాగ్ లేని జీరోగారిదే. హీరో గారు ఎవరితోనైనా తెలుగీషులో అనర్గళంగా మాట్లాడేయగలరు. ఆయన భాష, ఏక్సెంట్ అర్ధం కాకపోవడం అనే ప్రశ్నే ఉదయించదు. ఆయన ఉండేది కూడా డౌన్టౌన్ నూట ఇరవై అంతస్తుల బిల్డింగులో తొంభై ఎనిమిదో అంతస్తులో అతి విశాలమైన పెంట్ హౌస్ లోపల. అబ్బో అందులో ఆయన పడుకునే మంచమే మన మాస్టర్ బెడ్రూం అంత ఉంటుంది.

మరో విషయం చెప్పుకుని తీరాలి. నిజీసాయి గారికి కారు కొనాలంటే ఎలా? ఫోర్డ్ మంచిదా, టయోటా, హోండా మంచిదా? మనవాళ్ళందరూ – అంతే ఇండియా, చైనా వాళ్ళు, ఎప్పుడూ టయోటా, హోండా కొంటారు కదా? కొంటే నెలకి ఎంత కట్టాలి. ఇన్స్యూరెన్స్ ఎలా, ఎక్కడ? గేస్ రేట్లు పెరిగితే ఏది మానేయాలి కొనడానికి, ఎక్కడికైనా వెళ్లడానికీ? బండి ట్రబుల్ ఇస్తే ఎవరు మంచి మెకానిక్ దగ్గిర్లో, వగైరా తలనెప్పులు. జీరో గారికివేం లేవు; అబ్బో ఆయన ఉండేది ఆకాశంలో కదా? అందువల్ల ఆయన డ్రైవ్ చేసే కారు ఎప్పుడు ఫెరారీ, లేదా ముప్ఫై ఆరు అడుగుల లిమో మాత్రమే. జీతం గురించి చెప్పుకోవాలంటే నిజీసాయిగారికి ఇరవై లక్షలు ఇస్తారు మొదట్లో – సాధారణంగా అందరికీ ఇచ్చినట్టే – మెల్లిగా పెంచుతారు చేసే పని తీరు బట్టి. ఏవరేజ్ గా ముప్ఫై ఇచ్చినా ఇచ్చొవ్వు. పెంచడం అంతా ఆయన చేసే పనిమీదా, ఏడాదంతా చేసిన గొడ్డుచాకిరీ మీదా ఆధారపడి ఉంటుంది.  ఎప్పుడైతే ‘printf’ లాంటివి ఆయన కోడ్ లో కనిపించాయో ఆరోజే ఇంటికి పంపుతారు. మ్యూజియం లో పెట్టుకునే కప్పుల్తో రోజూవారీ టీ తాగడం కుదరనట్టే పాతవాసన వేసే కోడ్ వాడితే అంతే.  అయితే జీరోగారి రూటే వేరు. ఆయన మొదటి జీతంలో సగంతో  ఫెరారీ కారు కొనగలడు. మిగతా జీతం అలా బేంక్ లోనో మరోచోటో  మూలుగుతూ ఉంటుంది. మన ఖర్మ కాలి కారు బేరం చేయడానికి వెళ్ళాడా మరింక చూసుకోండి. వెళ్లగానే  సేల్స్ మాన్ కి తన క్రెడిట్ కార్డు ఇచ్చేసి “ఫలనా కారు నా ఇంటికి తోలించండి. నేను అన్నీ  ఇంతకుముందు ఆన్ లైన్లో చూస్సేను. మీరేం చెప్పక్కర్లేదు – నాకసలే టైమ్ లేదు, నేను ‘printf’ తో ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తున్నా కదా అసలే” అంటూ అందర్నీ మూర్ఛ పోగొట్టగలడు. మళ్ళీ నీళ్ల బాటిల్ లో నీళ్ళు మొహం మీద జల్లి… ఎందుకులెండి మనకి తెల్సిందే కదా ముందు చెప్పుకున్న ఈ డ్రిల్ అంతా?

నిజీసాయి కి పాపం గ్రీన్ కార్డుకీ వీసాకి అతి కష్టం; ఎన్నేళ్ళు ఆగాలో అసలు వస్తుందో, రాదో, ఏ రాజకీయనాయకుడు ఎలా రూల్స్ మారుస్తాడో అంటూ చింత. తీరా గ్రీన్ కార్డ్ వచ్చాక ఇండియానీ వదులుకోలేక ఇక్కడా ఇమడ లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ లోపుల ఇద్దరో ముగ్గురో పిల్లలు పుడితే సమస్య మరింత జటిలం. ఈ శ్లేష్మం లో పడ్డ ఈగలాంటి జీవితంలో వ్యాయామం చేయడానికీ ఆరోగ్యం కోసం టైమేదీ? అమ్మాయికానీ అబ్బాయికానీ పెరిగి పెద్దయ్యాక నేను ఫలానా నల్ల/తెల్ల/గోధుమ వాణ్ణి డేట్ చేస్తున్నా అంటే ఎలా? మనం ఏవిటీ మన కల్చర్ ఏవిటీ అనే చింత. చివరకి ఎవరు ఎలా పోతే నాకేం అనే వైరాగ్యం, అలాగే వయసు వచ్చేసి ముసలితనంలో బాల్చీ తన్నుట వగైరా. హీరోగారు మాత్రం అలా దేనికీ పరిమితులు గారు. ఆయనకి వీసా, గ్రీన్ కార్దుల సమస్యే లేదు. ఆయనో స్వతంత్రపు పక్షి. ఎక్కడికైనా ఏ రోజైనా సరే ఝామ్మంటూ ఎగురుకుంటూ – అవును ఫస్ట్ క్లాసులోనే వెళ్ళిపోగలడు.

ఇన్ని చెప్పుకున్నాక మన జీరోగారి గురించి అత్యంత మంచి విషయం చెప్పుకుని తీరాలి చివరగా. నిజీసాయి అమెరికాలో వెళ్ళి ఉండడానికీ, గ్రీన్ కార్డ్ రావడానికీ అక్కడే స్థిరపడ్డానికీ చెప్పలేనన్ని కష్టాలు పడతాడని చెప్పుకున్నాం కదా. జీరోమాత్రం ఎప్పుడూ అమెరికాలో స్థిరపడడు. తప్పకుండా ఇండియా వెనక్కి వచ్చేస్తాడు. వీసా కోసం వెళ్ళినప్పుడు అమెరికా కాన్సులేట్ లో నువ్వెందుకు అమెరికా వెళ్తున్నావు అని అడిగితే, “చదువు కోసం అది అయిపోగానే నేను తప్పకుండా వెనక్కి వచ్చేస్తా’ అని ట్రూ లైస్ (నిజమైన అబధ్ధాలు) చెప్తూ ఉంటారు అందరూ. చెప్పేవాడికీ వినేవాడికీ కూడా ఇది శుద్ధ అబద్ధం అని తెల్సిన విషయమే. కానీ తెలుగు హీరోమాత్రం ఈ విషయంలో అత్యంత నిజాయితీ పరుడు, సత్య హరిశ్చంద్రుడే. రవళీ పటాన్కర్ కూడా వెనక్కి వచ్చేస్తుంది – పెళ్ళి కూడా ఇండియన్ పద్ధతిలో “మాంగల్యం తంతునానేనా ..” అంటూ మంత్రాలు చదువుతున్నప్పుడు జరుగుతుంది. అప్పుడు శుభం కార్డు.

హాలీవుడ్ సినిమాల్లో లో కూడా సాఫ్ట్ వేర్, కంప్యూటర్లూ చూపిస్తారు కానీ అవి ఎప్పూడూ కూడా మనకి ఏనాడూ జీవితంలో “సాధారణంగా” కనబడనివి. వాళ్ళుట్టి వెధవాయలోయ్, ఉన్న విండోస్, లేదా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టం లో ఏదో కొత్త ప్రోగ్రాం రాసి చూపిస్తారు కానీ ఆపరేటింగ్ సిస్టం మార్చరు. తెలుగు సినిమా హీరో ముందు వీళ్ళెందుకూ పనికిరారు. మన హీరో ఏనాటికీ వాడుకలో ఉన్న విండోస్, కంప్యూటర్ వాడనేవాడడు; కొత్తది కనిపెట్టవల్సిందే ‘printf’ స్టేట్ మెంట్ వాడుతూ. ప్లస్ మన జీరో ఇండియా వచ్చేసి వందే మాతరం అంటూ దేశభక్తి చాటి చెప్తాడు కదా? వంటి చేత్తో మూడు బిల్డింగులని కూలగొట్టి, నలభై మంది విలన్లని చంపి మూడు వందల తెలుగీషు పదాలు వాడాడు కదా సిన్మాలో? బేసిగ్గా సెట్టింగ్ ప్రకారం తెలుగు సిన్మాకి ఉండాల్సినవి ఇవే. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఓ బాలీవుడ్ తెలుగు రాని/తానేం మాట్లాడుతోందో అర్ధంగాని భామ రవళీ పటాన్కర్. కట్ చేస్తే న్యూయార్కులో మూడు పాటలు. మళ్ళీ కట్.  స్లో మోషన్ లో ఒక ఫైట్; అందులో నలభై మంది ఖతం, జీరో వంటిమీద మరక పడకుండా. కట్. వాట్సాప్ మీదా ఇంటర్నెట్ మీదా తిరిగే జోకులతో ఓ బ్రహ్మానందం లాంటి కేరక్టర్. కట్. జీరో, జీరోయిన్ గార్ల పెళ్ళి సందడి అంతే. పెట్టుబడి ఇరవై ఆరు కోట్లు;  టీజర్ కి ముప్ఫై లక్షల వ్యూలు, రాబడి అరవై కోట్లు. సమయం – రెండేళ్ళు మాత్రమే. సూపర్ హిట్ కాదుటండీ మన బొమ్మ? రవళీ పటాన్కర్ ఏమీ దాచుకోకుండా వొళ్ళంతా బాగా చూపించిందిగా? జీరో అదిరిపోయే స్టెప్పులేసాడు. దీన్నే తెలుగీషులో ‘అదుర్స్’ అని అంటున్నాం కదా? ఇంతకీ సినిమాలో కధ ఏవిటని అడుగుతున్నారా? పిచ్చి ప్రశ్నలు వేయకండి. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుంది అన్నాట్ట వెనకటికి ఎవరో. పాత సినిమాల్లో ఐతే జ్యోతి లక్ష్మో, జయమాలినో వంటినిండా చీర బొడ్డు కిందకి కట్టి ఎప్పుడైనా తళుక్కుమని అక్కడ అంటించిన రంగు బిళ్ల చూపిస్తే డంగై పోయేవార్ట జనం. ఇప్పుడు వేరు, వళ్ళంతా కనిపించి ఎప్పుడైనా బట్టముక్క కనిపిస్తే అదీ అందం. చెప్పడం మర్చిపోయాం – మా సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే బావోదు. బయట థియేటర్లోనే చూడండి. అలా మీరు ఇంట్లో కుటుంబంతో చూడలేని సీన్లు ఇక్కడ చీకట్లో కూర్చుని చూడొచ్చు.  రండి బాబూ రండి. మా ఈరోయిన్ పటాన్కర్ గారి వంటి మీద కనబడని బట్టల్ని చూసి తరించి మమ్మల్నీ తరింపజేయండి. దాని ఉల్లిపొరల బట్టల్, భుజాలమీద లేనే లేనీ రవికల్, మెరిసే మెరిసే వళ్ళూ. అది చిక్కీ చిక్కని రవళీ; మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదురా.. రాదురా.. రాదు… రాదు… రా…  రా…  థేంక్స్ అండ్ జైహింద్!!

*

ఆర్. శర్మ దంతుర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు