‘కారణాలు బోలెడు చెప్పచ్చు. కొంతకాలము తరువాత ఆమెకు ఆ బంధం ‘తనది’ గా అనిపించిక పోయి ఉండొచ్చు లేదా మళ్లీ తను అలాగే ఉండాలేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా కావచ్చు. బయటి నుంచి చూసేవాళ్లకు వాళ్ళదేమిటి చక్కటి సంసారం అనిపించినా, బరువు, బాధ్యత తరగని పనులతో పాటు ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి ఆలోచించడము తో పాటు సర్దుకుపోవడమే ఈ సంసారం అనిపించి విసుగుపుట్టి కూడా ఉండొచ్చు. ఆ శృంఖలాలు తెంచుకుని బైటపడదామని అనుకున్నప్పుడు, అవకాశం కనిపించనప్పుడు ఒక్కోసారి నేనే లేకపోతే అనే మొండితనం కావచ్చు.’
ఆ మాటలు పదే పదే మనసును మెలి తిప్పుతున్నాయి.
కథ లాంటి జీవితం గురించి చెప్పిన లాలస, తన గురించి తనే వెతుక్కున్న దుఃఖిత లాలస నన్ను వదలటం లేదు.
బడ బడ తను వాగడమే కానీ ఒక్క ఇంచి కూడా అతని మనసులోకి ప్రవేశించటము లేదే, అనే ఉక్రోషం, నిలదీయలేని సంకోచం ఇవన్నీ లాలస మనసులో గూడుకట్టుకున్నవి.
‘ఒక్క లాలస కేనా? నువ్వు ఆమెతో పోల్చుకోవటము లేదా?’ నా మనసు నిలదీసింది.
***
మంచం మీద పడుకుని జరిగినవన్నీ నెమరేసుకుంటే, చిన్నప్పుడు నాన్నమ్మ అనే మాటలు గుర్తొచ్చాయి. ‘ఒళ్ళు హునమయ్యేంత పని చేసినా కంటి మీదకు కునుకు రావటం లేదు’ అనేది.
అప్పుడు వాటిని అర్థం చేసుకునేంత తెలివి, జ్ఞానం లేవు. అయితే తనలో తను చాలా నిక్కచ్చిగా అనుకున్న మాటలు ఎవరైనా వినేస్తారేమో అని వాటిని దాచిపెట్టడం కోసం చేసే ఆ ప్రయత్నం నిజంగా అదో మాయా జలతారు!
***
‘‘నాకెందుకో ఒక్కదాన్ని కొన్ని రోజులు ఎటైనా వెళ్ళాలనిపిస్తోంది!” అన్నప్పుడు “అవునా సరే, ఎక్కడకి వెళతావో చెబితే ఏర్పాట్లు చేస్తా” అన్న ఆ మనిషిని ఏం చేసినా పాపం లేదనిపించింది. ‘నా మనసు కోరేది ఏమిటి? ఇక్కడ జరిగేదేమిటి?’ ఒళ్ళు మండిపోతోంది.
ఇంత క్యాజువల్ గా ఉంటారా? అసలు ఎక్కడికి వెళ్తావు? ఎందుకు వెళ్తావు? అన్న ప్రశ్నలు లేకుండా తను మనసులో ఏమనుకుంటాడో అస్సలు బయటపడడా! అడిగితే ఏదీ లేదని అనేస్తాడు,
అయినా ఒకసారి అనుకున్నాకా… ఇన్ని ఆలోచనలు ఎందుకు?
లోపల పెద్ద బరువు ఏదో బరువు నన్ను నొక్కేస్తున్నట్టు, ఊపిరి ఆడనట్టు, నీటిలో అదిమి నొక్కిపట్టినట్టు… ఈ ఫీలింగ్ రోజుకు ఐదారుసార్లు రావడం ప్రారంభించిన తరువాతే కదా ఇక్కడకి వచ్చాను.
రకరకాల మనుషులు, విభిన్న నేపథ్యాలు, దృక్కోణాలు కలిగిన వ్యక్తులు కనిపిస్తున్నారు.
***
ట్విన్ షేరింగ్ రూమ్ కావటం వల్ల, ఇంకో మంచం మీద పడుకున్నారు మరో వ్యక్తి. ఆమెకి నిద్రాభంగం కాకుండా అతి జాగ్రత్తగా, శబ్దం లేకుండా పక్కకు తిరిగాను. ఒరుసుకుంటూ ప్రవహించే ఝరి ఉత్తుంగ తరంగ గంగతో పాటుగా ఎత్తైన హిమాలయాలు, అద్భుతం గా ఉంది . ‘ఏ కౌన్ చిత్ర కార్ హై’ అప్రయత్నంగా పెదాల పై పలికింది.
అయినా ఏదో మారుమూల తను కూడా తోడుగా ఉంటే బాగుండును! ఈ చక్కటి దృశ్యాలు, అందమైన ప్రకృతిని తను మిస్ అయిపోతున్నాడని బాధపడే మనసు. మళ్ళీ ‘ఉహూ… హూ… వద్దు. కోరి వచ్చిన ఏకాంతం. కొన్ని రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి, తనతో సహా.
పూర్తిగా డిజిటల్ డీటాక్స్ కోసము రాలేదు, కాబట్టి ఫోన్ ఒక్కటే చాలా మితంగా వాడుతున్నాను.
ఆ కథ ఎప్పటిదో, అసలు అది ఎందుకు వ్రాసారో? వింటుంటే నా మనసుని నాకే చెబుతున్నట్లుగా అసలు ఇంత పోలికగా ఎలా రాసి ఉంటారు? చదివే ఆవిడ, ఎవరో గానీ లాలస తానే అయిపోతోంది. మొదటి సారి విన్నప్పుడే గుండె బరువెక్కి ఏడుపొచ్చేసింది. కొన్నిసార్లు అంతే!
ఇంత బాగా, అదే నా మనసు లోపల, మడత పెట్టి దాచిన పొరలను విప్పుతున్న ఆ వ్యక్తిని ఒక్కసారి కలిస్తే, మళ్ళీ అంతలోనే ఓ సంశయం ఎంతో బాగా వ్రాసేవాళ్ళు అస్సలు సరిగా మాట్లాడలేరని, అసలు వాళ్ళే వ్రాసారా అన్నంత అనుమానం వచ్చేస్తుందని, ఎంతగానో ఊహించుకుని వెళ్లి నిరాశ పడాలా? అనే డోలాయమాన స్థితిలో ఉన్నాను. .
నిద్ర రాలేదు, రూపు తెలియని లాలసని నా కళ్ళలో నింపుకున్నాను, ‘ప్రేమ వల్ల విజ్ఞానము, ఆపైన శాంతి’ అన్న మాటలు మననం చేసుకుంటూ తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను.
***
మూడు రోజులు గడిచాయి. రిట్రీట్ బాగానే గడిచిపోతోంది. నా రూమ్ మేట్ తో కాస్త సాన్నిహిత్యం పెరిగింది. కలిసి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి వెళ్ళడంతో పాటుగా మాట్లాడుకుంటున్నాము. ఆవిడ చాలా మితభాషి, అడిగితేనే సమాధానం వస్తుంది. అప్పుడు తెలిసిన కొద్ది విషయాల లో, ఆమె భర్త ఐదేళ్ల క్రితం చనిపోయారు, పిల్లలు ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవిడ ఒంటరిగా ఉంటున్నారు. “అయినా బానే దుక్కలా ఉన్నాను” అన్నారు ఆ మొహం లో ఏ భావము లేకుండా!
రాత్రి డిన్నర్ అయ్యాకా ఆవిడ వచ్చి ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని తదేకంగా గంగా ప్రవాహాన్ని చూస్తుంటారు
ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలా బయట బెంచ్ మీద కూర్చొని గంగా ప్రవాహపు హోరు వింటున్న ఆవిడ పక్కన కూర్చొన్నాను. అలికిడికి పక్కకు తిరిగి చూసారు. నేను పలకరింపుగా నవ్వాను,
ఉన్నట్లుండి ఆవిడ “అంతా తీరికే, ఇప్పటికి ధోరణి అర్థమయింది. నిజమిదని తెలిసింది. ఆడవాళ్ళం కదా! అవునూ, లాలస అంటే అంత ఇష్టమా?”
“అరె భలే ఆశర్యంగా ఉందే! మీకు ఎలా తెలుసు?”
“గత మూడు రాత్రులుగా మీరు ఆ పేరుని చాలాసార్లు అన్నారు.”
నిజం చెప్పద్దూ, నాకు కాస్త చిన్నతనంగా అనిపించింది. ‘నా ఆలోచనలు ఇలా బయటపడి పోతున్నాయా?’
కాసేపు ఇద్దరి మధ్యా మౌనం. తరువాత లేచి మా రూమ్ కి వచ్చేసాము.
***
“ఈ బంధాలు చాలా క్లిష్టమైనవి. అయితే ఒకోసారి వీటిలో బాధ్యతే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ప్రేమ కన్నా కూడా ఇదే మనిషిని నడిపిస్తుంది. బంధాలు ఉన్నచోట్ల చిన్న చిన్న గొడవలు సహజాతాలే కదా ! అనుకోవచ్చు, అయినా సర్దుకుపోలేకపోయాను, అది నా లోపమా? ఏమో! అయినా అందరిలా ఉండకుండా నా కెందుకు ఇన్ని ఆలోచనలు” అంటున్న లాలస మాటలు మళ్ళీ నన్ను ఉలిక్కిపడేలా చేసాయి.
అసలు ఈ లాలస ఎవరూ నన్ను ఇంతలా ప్రభావితం చేస్తోంది అనుకుంటూ ఆ పాడ్ కాస్ట్ వాళ్ళ వెబ్ సైట్ చూద్దామని ప్రయత్నం చేశాను. నా మొబైల్ డేటా తో ఓపెన్ అవటము లేదు, ఇక్కడ వైఫై, పాస్ వర్డ్ గురించి రిసెప్షన్ లో అడిగి తీసుకోవాలి. కానీ, ఇప్పుడు అంత అవసరమా?. ఒకసారి వద్దనుకున్నప్పుడు దాని మీదే నిలబడాలి అని నాకు నేనే చెప్పుకున్నాను.
ఆ రోజు కూడా ఆవిడ ఆ గంగా ప్రవాహాన్ని కాసేపు చూసి వచ్చి తన మంచమీద పడుకోబోతూ నా వైపు ఓ సారి చూసారు. ఆ చూపు లో ఎన్నో అర్థాలు వెతకచ్చు. అంత లోతులు కనిపించాయి.
***
“ఈ రిట్రీట్ ఉరుకుల పరుగుల జీవితం నుండి అన్‌ప్లగ్ చేయడానికి, లైఫ్ లో బాలన్స్ పెంచుకోవటం, ముఖ్యంగా ఇన్నర్ పీస్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. అదొక్కటే కాదు, మీ ఆలోచనలు, జీవితం పట్ల మీ దృక్పథం కూడా మారుతాయి. మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. దేన్నైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది” అని మొదటి రోజు మాటలే చివరి రోజున లెక్చర్ లో మరోసారి చెప్పారు.
వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఒక కొత్త ఉత్సాహం అయితే ఉంది. ఇంక వీడ్కోలు చెప్పుకునే సమయం వచ్చేసింది.
ఇన్ని రోజులు కలిసి ఉన్నాము కదా, ఆవిడ ఫోన్ నెంబర్ అడిగి తీసుకుందామని అనుకుంటూ ఉండగా,గ్రూప్ ఫోటోకి రావాలని పిలిస్తే అటు వెళ్ళాను. తరువాత రూమ్ కి వచ్చి సామాను సర్దుతూ, ఆవిడ బెడ్ వైపు చూసాను . ఖాళీ గా ఉంది. టేబుల్ మీద బాగ్ కూడా లేదు. ‘అరె, ఏరీ ఈవిడ? వెళ్ళిపోయారా? భలే చిత్రమయిన మనిషి!’ అనుకున్నాను.
పేరు కూడా తెలియకుండా వారం రోజులు ఎలా ఉన్నారు అనుకుంటారు. ఆ అవసరము రాకుండానే సమయం గడిచిపోయింది.
***
అన్నీ మాములే ! as usual! routine life.
“ఓ వచ్చేసావా! సరే, రెస్ట్ తీసుకో” అన్న శివా మాటలకి మునుపులాగా గింజుకోలేదు, పైగా ఆ రోజు ఆవిడన్న “మూసపోసినట్లు” అన్న దాని అంతరార్థం ఇప్పుడు బోధ పడింది.
శివ మరో మాట అన్నాడు “ఎక్కువ సేపు లాలస గురించి ఆలోచించకు” అంటే… తనకు కూడా తెలుసా! విన్నాడా? ఏమో! అంటే తనకి అర్థం అయిందా? తెలిసే ఇలా…
మెదడులో ఆలోచనల తుట్ట కదులుతోంది. అప్పుడు గుర్తుకొచ్చింది వింటున్న పాడ్ కాస్ట్(Pod Cast)వివరాలు చూడాలని, వెంటనే లాప్ టాప్ ఓపెన్ చేసి, సైట్ లోపలికి వెళ్ళాను. తెలుగు ఐకాన్ మీద నొక్కగానే బోలెడు వచ్చాయి. కొంత సెర్చ్ తరువాత, నేను వెతికేది కనిపించింది.
ఒక్కోసారి భలేగా జరుగుతాయి, వింతో, కో ఇన్సిడెన్సో పేరు ఏదైనా కానీ. నాకు మటుకు పెద్ద షాక్… ఆ ఫోటో చూసి, అంత విస్మయానికి గురిచేసిన ఆ రచయిత, కథ చదివిన ఆవిడ, నాతో పాటు వారం రోజులు కలిసి ఉన్న వ్యక్తి ఒక్కరే అవటం.
బహుశా! అందుకే నేను లాలస గురించి ఏమనుకుంటున్నానో అని ఆవిడ అంత ఆరాటపడింది.
నాకు ఏదో తెర తీసేసినట్లు గాఉంది, కొన్ని మాటలు పెదవి దాటి రాకపోయినా అర్థమయి పోతాయి. అదే జరిగింది ఇప్పుడు, రూపం తెలిసిన ఆవిడ, రూపం తెలియని లాలస ఒక్కరే అని.
***
మథన పడిన మనసు పరిస్థితి అలాగే ఉంటుంది మణీ… కథ బాగుంది.
ధన్యవాదాలు అండి, కథ నచ్చినందుకు
అణువంత కథలో సముద్రమంత మధనం.
చాలా బాగుంది మణి గారూ! ఎంత చక్కని భావ వ్యక్తీకరణ
అభినందనలు మీకు
చాలా బాగుంది. రచయిత్రికి అభినందనలు
Simply superb akka 🙏❤️👍
మనసు యొక్క మథనం, అంతర్దర్శనం చాలా బాగా వివరించావు మణీ. మంచి కథ, అభినందనలు.
కథ బాగుంది మణిగారూ!
‘మూసపోసినట్టు’ కాకపోవడం కథకు బలం. మరో లాలస తారసపడితే పేరు అడగడం మర్చిపోకండి.
ప్రభాకర్ గారు మీకు కథ నచ్చింది అంటే, ఒక శిఖరం ఎక్కినట్లే,
ధన్యవాదాలు
Crisp yet never devoid of emotional depth. Sophisticated yet grounded. A relationship acts as a mirror that never lies and ceaselessly reflects our true selves.
Wonderful story, mani garu💐
Thank you so much Sriram
సింప్లీ సూపర్బ్… చాలా బాగుందండి…