సాంకేతిక పరాయితనం

ర్థరాత్రి
నిద్ర దగ్గరకు రానీయడం లేదు
కమ్మటి కలలు కనక
అదృశ్య అస్పష్ట
దృశ్య శకలాలు గోచరిస్తున్నాయి!
పురాతన పాత రాతి యుగం
నాగరికత నాజూకుతనం లేని
పక్క మోటు మనుషులు వాళ్లు
నన్ను చూసి వికృతంగా
నవ్వడం ప్రారంభించారు
వాళ్ళ ముఖాలు
పాత హిందీ సినిమాల్లోని
విలన్స్ లాగా ఉన్నాయి!
దౌర్జన్యంగా సగం కొరికిన
నా ఆపిల్ ఫోను లాక్కొని
అవతల పడేశారు
నాకు కోపం నడి నెత్తి కెక్కింది
ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు తిట్టాను
అయినా వాళ్లలో చలనం లేదు
బహుశా చెవిటివారేమో
లేదా ఇతర గ్రహం నుండి
భూమిపైకి పొరపాటున వచ్చారేమో?
ఇంట్లో ఉన్న
టీవీలు కంప్యూటర్లు వాషింగ్ మిషన్
లాంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు
ధ్వంసం చేశారు
ఇప్పుడు వాళ్లంతా ప్రశాంతంగా నవ్వుకుంటున్నారు!
వాడిలో ఒకడు ఇలా అంటున్నాడు
నీ జీవితాన్ని నీకు కాకుండా చేసింది
నీ బతుకును తాకట్టు పెట్టింది
నీవు మానవత్వాన్ని మరిచి
వీటివల్ల యంత్రంలా తయారయ్యావు
పక్కవాడిని పట్టించుకోకుండా
కష్టసుఖాలు పంచుకోకుండా
కనీసం తల ఎత్తి నిటారుగా నిలవకుండా
మీరు హృదయం లేని కఠిన శిలల లాగా
తయారయ్యారు!
ఇప్పటికైనా కండ్లు తెరవండి
ఇప్పటికైనా కండ్లు తెరవండి
చివరికి అతి కష్టం మీద
కండ్లు తెరిచాను
మగత నిద్రలో ఏదో పీడకల
ఉలిక్కిపడి లేచాను
పక్కన ఫోన్ రింగ్ అవుతుంది! !
*

నిశాచరుడు

అర్ధరాత్రి అపరాత్రి
తేడా లేకుండా
అక్షరాలను శిల్పిలా అందంగా చెక్కి
రస హృదయంతో ప్రాణం పోసి మురిసిపోయేవాడు
బందీలుగా ఉన్న వాక్యాలను
స్వేచ్ఛగా పదిమందికి
గర్వంగా పరిచయం చేసేవాడు.
అతడు ఒట్టి వ్యసనపరుడు
అచ్చులను,హల్లులను
కలుపుకొని
కవిత్వాన్ని తాగుబోతుల
రోజు పేజీలకు పేజీలు లాగిస్తాడు.
బాల్యం నుండి చావు వరకు
అతడు ముట్టని వస్తువు లేదు
పచ్చి పసి బాలుడు
మనిషిని దేవుడిలా నమ్మే
అమాయకుడు.
తన రాతల ద్వారా
సమాజాన్ని ఉద్ధరించాలని
అతనికి ఏ కోశానా లేదు
ఎందుకంటే సమాజం
వినే స్థాయిని ఎప్పుడో దాటేసింది.
కవిత్వం కూడు పెడుతుందా
అనే కుక్కల అరుపులకు
కవిత్వం అనే దుడ్డు కర్రతో
సమాధానం ఇచ్చేవాడు.
కవిత్వం
జీవితంలో తడిని పెంచుతుంది
మనిషిలో మానవత్వాన్ని నింపుతుంది
రసాయనాల మిశ్రమం కాదు కవిత్వం
ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తే
పుట్టేది కాదు కవిత్వం.
నడి సంద్రపు అంతర్గత కల్లోలాల
కన్నీటి సిరాతో అంతర్ మదన యుద్ధం
శరీరంతో మనసు చేసే శృంగారం
కవిత్వం అంటే
జ్ఞాన మార్గం చూపే అక్షర కౌముది.
పాపం అమాయకుడు
పెన్ను పేపర్లు వాటితో ఉత్పన్నమయ్యే కవిత్వం
వజ్రా వైడుర్యాల కంటే గొప్పవి
అనుకునేవాడు.
పుస్తకాలే జ్ఞాన దీపికలు
మస్తకాలలో ఉండే అజ్ఞానాన్ని
పారద్రోలి
సముద్రమంత విజ్ఞాన సారాన్ని
తనలో దాచుకొని
అగ్నిపర్వతం లాగా ఒద్దికగా ఉండేవాడు.
*
చిత్రం: సృజన్ రాజ్

ఈ వెంకటేష్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు