సరిహద్దులు చెరిపేస్తున్న సరికొత్త కథలు!

కథలపొద్దు శీర్షిక గురించి విశీ నాలుగు మాటలు!

కాలాలు మారుతూ ఉంటాయి. రుతుచక్రం తిరుగుతూ ఉంటుంది. నదికి కొత్త నీరు వస్తుంది. పాత నీరు కొట్టుకుపోతుంది. అది ప్రకృతి పెట్టిన నియమం. సాహిత్యమనే జీవనదిలో మాత్రం కొత్త నీరు పాతనీటికి చేర్పు అవుతుంది. గతకాలపు సారాన్ని ఒడిసిపట్టి నూతన ఒరవడిని తన వెంట తెస్తుంది. గుప్పిట్లో ఒడుపుగా ఒదిగి, కోరిన వారి దాహం తీరుస్తుంది. సాహిత్యం పాతకొత్తల మేలు కలయిక. నిన్నటి రచనను ఆకళింపు చేసుకుని, వర్తమానపు రాత మరింత పదునై, భవిష్యత్తు ప్రయాణానికి మరిన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఒకే ఒరలో, ఒకే మూసలో సాహిత్యం ఎప్పుడూ ఇమడలేదు. అలా ఇమిడిన సాహిత్యం ఎన్నడూ నిలవలేదు.

‘కథలపొద్దు’ శీర్షిక ప్రారంభిస్తున్నప్పుడు కొత్త రచయితల్ని పరిచయం చేసి వాళ్ల కథల్ని అందరి ముందూ ఉంచితే చాలనేది ఆలోచన. అదొక అవసరంగా తోచింది. రాసేవారు కరువౌతున్నారన్న మాటను అసత్యం చేస్తూ రాయగలిగిన వారు ఉన్నారని చెప్పడం, వారి కథల్ని అందరి ముందుకు తేవడం ముఖ్యం అనిపించింది. అంతమంది ఉన్నారా అన్నది నాకు నేను వేసుకున్న మొదటి ప్రశ్న. రాసేవారు లెక్కకు మిక్కిలి ఉండొచ్చు. కానీ వారిలోని దృక్పథాన్ని, అనుభవాన్ని జాగ్రత్తగా ఎంచి చూసి బయటకు తేవడం సాధ్యమా అనిపించింది. సమస్య విమర్శలు కాదు. అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటికి సమాధానం ఇవ్వగల కథకుల్ని వెతికి పట్టుకోగలనా అనేదే సవాలు. అన్వేషణ మొదలైంది. దొరికారు. ఇంకా దొరుకుతూనే ఉన్నారు. స్పందిస్తున్నారు. రాస్తున్నారు.

జనవరి నుంచి మొదలైన ఈ శీర్షికలో ఇప్పటికి ఆరుగురు కథకుల్ని పరిచయం చేసి, ఆరు కథల్ని ప్రచురించాం. వీళ్లంతా రకరకాల వయసులు, ప్రాంతాలు, వృత్తుల్లో ఉన్నవారు. రకరకాల భావాలతో కథారచన చేస్తున్నవారు. శ్రద్ధగా సాహిత్యాన్ని చదువుతూ ఆ జ్ఞానానికి తమ జీవనసారాన్ని అద్ది కథలుగా మలుస్తున్నవారు. రాసిన కథల్లో తప్పొప్పులు గ్రహించి మరిన్ని మేలైన కథలు రాయాలన్న ఉత్సాహంతో ఉన్నవారు. వీళ్ల నేపథ్యాలు వేరు. జీవన విధానాలు వేరు. చేయాలనుకున్న ప్రయాణం ఒకటే! చేరాలనుకున్న గమ్యం ఒకటే!

ఇప్పటిదాకా ప్రచురించిన ఆరు కథలూ ఆరు విభిన్న కోణాలను స్పృశించాయి. చరణ్ పరిమి రాసిన ‘పొగ’ కథ దిల్లీలో జరిగిన రైతు ఉద్యమం నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటివి సూటిగా చెప్తే బాగుంటుంది కానీ, అందులోని గాఢత గుండెను తాకదు. అందుకే కొంత మార్మికత, కొంత అధివాస్తవిక ధోరణిలో నడుపుతూ తను ఈ కథను రాశారు. పశ్చాత్తాపం పొగ రూపంలో ఒక మనిషిని వెంటాడటం చూస్తే మనలోని అనేక మలినాలు, మనం చేసిన అనేక తప్పులు జ్ఞాపకానికి వచ్చి ఉలిక్కిపడతాం. ఈ సంవత్సరం ఇప్పటిదాకా నేను చదివిన కథల్లో ఉత్తమమైన కథల్లో ఇదీ ఒకటి.

మహమ్మద్ గౌస్ రాసిన ‘స్కూల్ ఫస్టు’ అనంతపురం మాండలికంలో సాగిన తీరైన కథ. చిన్నగా అనిపించినా ఇందులో అతను తడిమిన అంశాలు చాలా బలమైనవి. కుటుంబ లేమి కారణంగా ఒక విద్యార్థి చదువుకు దూరం కావడం, బాధ్యతలు తలకెత్తుకోవడం, చివరకు మళ్లీ సార్వత్రిక విద్యలో చేరడం ఇందులో అంశాలు. ఇది చదవగానే చాలా మంది గుర్తొస్తారు. పేద, మధ్యతరగతి కుటుంబాల అవస్థలు కళ్ల ముందు కదలాడుతాయి. నేటి యుగంధర్ రాసిన ‘రోబో న్యూ వర్షన్’ హాస్య ధోరణిలో సాగుతూ సీరియస్ అంశాన్ని చర్చించిన కథ. మరో వందేళ్ల తర్వాత స్త్రీ జనాభా తగ్గి మరోసారి ‘కన్యాశుల్కం’ అనే అంశం తెరమీదకు రావడం, అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క రోబోలను పెళ్లి చేసుకోవడం ఇందులో గమనిస్తాం. భ్రూణ హత్యల వల్ల మనం ఎదుర్కొనే భవిష్యత్ పరిణామాల గురించి హెచ్చరించే కథ ఇది.

శ్రీనివాస్ సూఫీ రాసిన ‘బ్లాక్ పెయింటింగ్స్’ కథలో దళిత జీవితాన్ని చిత్రించిన తీరు భిన్నంగా అనిపిస్తుంది. కొంత వరకు మార్మికంగా సాగుతూ, రచయిత చెప్పాలనుకున్నది పాఠకులకు నిగూఢంగా తెలిపేలా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రను మలిచిన తీరు నాకు నచ్చింది. కొంత నాటకీయ ధోరణిలో సాగినా పట్టు తప్పకుండా చివరి దాకా చదివిస్తుంది. వేముగంటి ధీరజ్ కశ్యప్ రాసిన ‘దత్తుగాడి బాల్యం’ నేను చదివిన భిన్నమైన కథల్లో ఒకటి. దీన్ని కథగా వర్ణించడం కంటే చక్కటి వచనం అనేందుకు ఇష్టపడతాను. కథంటే గొప్ప ప్రారంభం, భారీ సంభాషణలు, ఊహించని ముగింపు.. అనే ధోరణికి భిన్నంగా ఒకరి తాలూకు జ్ఞాపకాల దారిలా సాగే ఈ కథ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. లోపలి ఆలోచనల్ని యథాతథంగా కాగితంపైన చేర్చి కూర్చిన కథ ఇది.

కర్నాటి భానుప్రకాశ్ రాసిన ‘చెంపదెబ్బ’ పరువు హత్యల నేపథ్యంలో సాగుతుంది. తల్లి మీద కొడుకు ప్రేమ, కొడుకు పట్ల తల్లి బాధ్యత.. వెరసి ‌సముద్రంతో వారి అనుబంధం, సునామీ వారి జీవితాల్లో మిగిల్సిన గురుతు.. ఇవన్నీ ఈ కథలో అంశాలు. కథ చివర్లో తల్లి చేత కొడుకు కొట్టించిన చెంపదెబ్బ కుల వ్యవస్థ మీద తిరుగుబాటు. ఇలా ప్రతి కథా భిన్న అంశాల సమాహారంగా మారింది. ఇవి నేను అడగ్గా వాళ్లు రాసిచ్చిన కథలు కావు. వాళ్ల చేత తామే రాయించుకున్న కథలు. జీవం తొణికిసలాడే కథలు.

అసలు కొత్త కథకులు వస్తున్నారా? కొత్తగా ఎవరైనా రాస్తున్నారా? అనేవి చాలా మందిని ప్రస్తుతం వెంటాడుతున్న సందేహాలు. వాటికి సమాధానం అందించే ప్రయత్నంలో ‘కథలపొద్దు’ గట్టి ప్రయత్నం చేస్తోంది. మేలైన నూతన కథకులకు చేదోడుగా నిలుస్తుంది. మరింత మంది కథకుల అంతరంగాన్ని అందరి ముందుకు తెచ్చేందుకు సిద్ధంగా ఉంది.

‘పరిగెత్తిన కొద్దీ పెరిగేది ఏది?’ అని యక్షుడు అడిగినప్పుడు ధర్మరాజు ‘నది’ అని సమాధానం ఇచ్చాడు. కథానది కూడా అలాంటిదే! కాలం గడిచే కొద్దీ కొత్త రచయితలు వస్తూనే ఉన్నారు. సరికొత్త అంశాలకు తమ కథల్లో చోటిస్తూనే ఉన్నారు. పాతతరానికి నెనరులు తెలిపి, ఆ అనుభవాన్ని గ్రహిస్తూ తమదైన మార్గంలో సాగిపోతున్నారు. తెలుగు కథ కోరుకునేది అదే! తెలుగు కథ జీవం, భావం అదే!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • సాహిత్యమనే జీవనదిలో మాత్రం కొత్త నీరు పాతనీటికి చేర్పు అవుతుంది…..baagundi.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు