‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’

సాహిత్యరంగంలో మనముందు ఎందరో గొప్ప రచయితలున్నారు. అయితే రచయితలంతా మనసున్నవారే కానీ అందరూ మేధావులు కారు. వనమాలి లాంటి నిరంతర తాదాత్మ్యం గల, హృదయమున్న మేధావి రచయిత నా ఆదర్శం.

 కవిత్వం ఇష్టం. కథ మరీ ఇష్టం. విమర్శ కష్టమైన ఇష్టం. ఇంతా జేస్తే ఇన్నేళ్ళుగా సుమారు 50 కథలు మాత్రమే రాసి ఉంటా. అందులో హింస రచన, మట్టి గుండె, సగం తెరిచిన తలుపు, మనుషులు వదులవుతారు, చివరి పిచ్చిక, పిరమిడ్‌ లాంటివి పేరెన్నిక గన్నాయి. ‘మట్టి గుండె’ నూరేళ్ల కథాచరిత్రలో నూరు ఉత్తమ కథల్లో ఒకటిగా గుర్తించబడింది. వాటన్నిటికి భిన్నంగా పాఠకులకి, విమర్శకులకి, నాకూ బాగా నచ్చిన విలక్షణ ప్రయోగం ‘సముద్రం’.

ఒక మేధావి సంచిత జ్ఞానసంపద అతనితోనే అంతరించి పోవటమేమిటనే ఆలోచనే ‘సముద్రం’. ‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’ అనే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ రూపక వాక్యాన్ని (metaphorical sentence) ఇప్పటికీ చాలమంది సాహితీమిత్రులు ఉదాహరిస్తుంటారు. It is an intellectual story about an intellecual అని విమర్శకులన్న మాట.

సముద్రం అంటే జ్ఞాన సముద్రమే. అది ఒక మేధావి జీవితకాలపు తదేక సాధనకి ప్రతీక. ఆ జ్ఞాన సముపార్జనలో అంతర్మథనం ఉంటుంది. ఆచరణతో సంఘర్షణ ఉంటుంది. సాహిత్యరంగంలో నాకు తెలిసిన మా గురువర్యులు మొదలు ఎందరో మహా పండితులున్నారు. గొప్ప రచయితలున్నారు. (వివిధ శాస్త్రాల్లో ప్రపంచ ప్రఖ్యాత మేధావులున్నారు.) వాళ్ళందరి వ్యక్త ఆవిష్కరణలతో పాటు అవ్యక్తంగా మిగిలిపోయిన, తమ జీవితకాలంలో సముపార్జించిన జ్ఞానసంపద మరెంతో వారి మనస్సులో నిక్షిప్తమై ఉండి ఉంటుంది. అది వారితోనే అంతం అవుతున్నది. దానికి మానసికంగాను, భౌతికంగానూ కొనసాగింపు ఉండటం లేదు. ఆ మేధాసంపన్నుల మెదళ్ళలోని అవ్యక్త, నిగూఢ జ్ఞానసంపదను నమోదు చేసి, క్రోడీకరించగలమా అని ఒక ఆలోచన. కృత్రిమ మేధ దాకా వచ్చాం. అసలు మేధాసంపద రహస్యాలు ముందు ముందు రికార్డు కాగలవేమో. (అన్నట్టు మేధోసంపద, మేధోమథనం లాంటి మాటలు భాషాదోషాలు.)

కాగా వ్యక్తిగతంగా ఆ సాధన వారసత్వాన్ని వాళ్ళ సంతానమైనా అందిపుచ్చుకొని ఆ దారిలో నడవటం లేదు. వాళ్ళ దృష్టిలో ఆ పెద్దవాళ్ళది (ఆర్థిక ప్రయోజనం లేని) పనికిమాలిన చాదస్తం. కనీసం ఆ జ్ఞానసంపదకు మూలమైన గ్రంథసంపదనూ వాళ్ళు నిలుపుకోవటం లేదు. ఇదీ ఈ కథారచన వెనక నా తపన.

అట్లా జీవితకాలమంతా పుస్తక ప్రపంచంలో మునిగి తేలి సముపార్జించిన జ్ఞానానికి, లోక ప్రవృత్తికి ఉన్న వైరుధ్యంలో ఆవేదన చెందే మేధావే వనమాలి. అయితే కథలో ఆ మేధావి తానుగా తన ఆంతరిక సాధనని, సంక్షోభాన్ని వ్యక్తీకరించడు. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న వనమాలికి అతని స్నేహితుడు గతాన్ని గుర్తు చేసే క్రమంలో అతను ఎలాంటి మథనానికి గురయ్యాడో అర్థమవుతుంది.

ఈ కథను నడపటానికి అసాధారణమైన మధ్యమ పురుష కథనాన్ని (second person narration) ఎన్నుకున్నాను. (తెలుగు కథల్లో సిసలైన మధ్యమ పురుష కథనంతో వచ్చిన కథల్లో ఇదే మొదటిదని విమర్శకుల మాట.) ఎందుకంటే ముఖ్యంగా ఆ సెకండ్‌ పర్సన్‌కి కథలో, కథతో సంబంధం ఉండాలి. అతనికి, ఫస్ట్‌ పర్సన్‌కి ఉండే సంబంధం అంతర్గతంగా స్థాపించబడాలి. అతడు వక్తే కాదు, పాత్ర కూడా అయ్యుండాలి. లేకపోతే ఆ చెపుతున్న రెండో మనిషి ఎవరు, అతనే ఎందుకు చెప్పాలి అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో మొదటి మనిషి సరిగా చెప్పలేడు కనుక మిత్రుడైన రెండో మనిషి చెపుతాడు. కష్టమైన కథనం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కథనశిల్పం దెబ్బతింటుంది. ఇదే కథ ప్రథమ, లేదా ఉత్తమ పురుషలో చెపితే రాణించదనుకుంటా. ఏ కథకు తగిన ప్రత్యేక అభివ్యక్తి ఆ కథకు ఉండాలి కదా.

అల్జీమర్స్‌ ఉన్నవాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకాలమధ్య క్రమత్వం పోయి, అవి శకలాలు శకలాలుగా మిగులుతాయి. కనుక వాటిని అలాగే ఉప శీర్షికల్తో జ్ఞాపక శకలాలుగా కూర్చాను. వాటిని పరిశోధన వ్యాసపద్ధతిలో సంఖ్యాపూర్వకంగా (numbering method) విడివిడిగా తెలిపాను.

కథానిర్మాణంలో ఏక ముఖీనత గాక బహు ముఖీనత (multifacetedness) నాకిష్టం. కథ చదివిన పాఠకుడు ఒకే దారిలో ఒకే అంశం గాక అనేకాంశాలు తెలుసుకుంటాడు. అట్లా ఈ కథలో మేధావి బాల్యం, భార్యాభర్తల అనుబంధం, తండ్రీ బిడ్డల అసంబంధం, అనేక పుస్తక పరిచయాలు, సంగీత విశేషాలు, సామాజిక, పర్యావరణ స్పృహ, భారతీయ సంస్కృతి విశేషాలు దొర్లుతాయి. (ఆ దొర్లటంలో నా వ్యక్తిగత ఆసక్తులు కూడా ఉన్నాయి. ‘వనవాసి’తో పాటు నేను చదివిన ఎన్నెన్నో పుస్తకాల ప్రసక్తులు, అధ్యాపక వృత్తి ఆదర్శాలు  కథలో వస్తాయి. వనమాలే కాదు, ప్రేమమయి కమలిని కూడా నాకెంతో ఇష్టమైన మనిషి. ప్రధాన పాత్రనే కాదు, పక్క పాత్రల్నీ తీర్చి దిద్దాలి రచయిత.

సాహిత్యరంగంలో మనముందు ఎందరో గొప్ప రచయితలున్నారు. అయితే రచయితలంతా మనసున్నవారే కానీ అందరూ మేధావులు కారు. వనమాలి లాంటి నిరంతర తాదాత్మ్యం గల, హృదయమున్న మేధావి రచయిత నా ఆదర్శం.

ఈ కథ నూరేళ్ళ మేలిమి తెలుగు కథల్లో చోటు చేసుకుంది. ఇతర భాషల్లోకీ వెళ్లింది. నా కథారచనకు సంబంధించి రెండు మెచ్చుకోళ్ళు, రెండు విమర్శలు ఇలా నమోదు చేద్దామనిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఒకసారి మా యింటికి అతిథిగా వచ్చిన వరవరరావు ‘హింస రచన’ కథ చదివారు. సాలోచనగా ఒక్క నిముషం ఆగి, ‘నేనిప్పటిదాకా మేటి కవులు మేటి కథకులు కాలేరని అనుకొనేవాణ్ణి. ఈ సాయంత్రం నా అభిప్రాయం మార్చుకుంటున్నా’ అన్నారు. అలాగే కథాసాహితి ఆవిష్కరణ సభలో మృణాళిని మాట్లాడుతూ, ‘తిలక్‌ తర్వాత ఆ స్థాయిలో కథ, కవిత్వం – రెండూ సాగిస్తున్న రచయిత శివశంకర్‌’ అన్నారు. కాగా, ‘అపరాధి’ లాంటి కథల్లో వదులుతనం (loose-knit),  ‘జీవితం అంచున’ లాంటి కథల్లో పాత్రచిత్రణ లోపాలు ఉన్నాయని మిత్రులన్న మాటా నిజమే అని తర్వాత గ్రహించాను. నా అనుభవంలో, కవిత్వాన్ని సవరించేకొద్దీ నిసర్గత (spontaneity) లోపించి, మాసిపోతుంటుంది. కథని సవరించేకొద్దీ మెరుగులీనుతుంది. అలా కొన్నిటిలో చెయ్యలేకపోయాను.

కథారచనలో కవితాత్మకత, గాఢత, తాత్త్వికత నాకిష్టం. వస్తు వైవిధ్యం కూడా. ‘చింతల తోపు’ లాంటి పెద్ద కథలు, హాస్య, వ్యంగ్య కథలు ఎక్కువ రాయలేకపోయాను. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం. ఎప్పటికప్పుడు నన్ను నేను అధిగమించే ప్రయత్నం చెయ్యటం. ప్రపంచాన్వేషణలో సాహిత్యం మేలైన సాధనం కదా.

ఎవరి రచనల గురించి వాళ్లే చెప్పుకోవటం ఇబ్బందే. (ఎంత కాదనుకున్నా స్వీయ ప్రేమ, అంతో ఇంతో అత్యుక్తీ తప్పవేమో.) అయినా ఏడాదిన్నర  నుంచి నా వెంట బడి, ఈ పరిచయం రాయించిన మిత్రుడు అఫ్సర్‌. నా తొలి కవితాసంపుటి ‘స్తబ్ధత-చలనం’ మీద తొలి (విలువైన) సమీక్ష తనే చేశాడు. అందుకూ ఇందుకూ కృతజ్ఞతలు.

—–

 

  సముద్రం

                                                                       – పాపినేని శివశంకర్

 

‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’

నా ముందున్న ప్రశ్న ఇది. ప్రశ్న నాది కాదు. సమాధానం కూడా నా దగ్గర లేదు. నేను కేవలం ఒకానొక పెనుహోరుని చాలకాలం నుంచి సన్నిహితంగా గమనిస్తున్న మనిషిని మాత్రమే.

మర్చిపోతున్న గతమంతా గుర్తుచెయ్యమన్నావు. ఇది అల్జీమర్స్‌ వ్యాధి లక్షణం.

ఇప్పుడు నా జ్ఞాపకాలే చెపుతున్నా, విను.

( పుస్తక మాలి) :                                                           

  1. వనమాలీ! ఏ చదువుకునే రోజుల్లో కలిశాయో మన ఆలోచనలు! కొద్దికాలంలోనే స్నేహితులమయ్యాం. క్లాసులో లెక్చరర్లు ఊహించని ప్రశ్నలెన్నో అడిగివాడివి. లైబ్రరీలో పుస్తకాలు తెచ్చి, సందేహాలు తీర్చుకునేవాడివి. క్లాస్‌మేట్స్‌ నీకు పెట్టిన పేరు పుస్తకాల పురుగు. అయితే ఇది పుస్తకాల్ని అదే పనిగా నమిలే పురుగు కాదు. సముద్రాన్ని సైతం పుక్కిట బట్టదల్చుకున్న పురుగు. నేను మాత్రం నిన్ను ‘పుస్తక మాలి’ అని పిలిచేవాడిని. ఎప్పుడూ నాలుగైదు పుస్తకాలు నీతోపాటే ఉండేవి కదా! నీ ద్వారానే నాకు శ్రీశ్రీ, శ్రీపాద, తిలక్‌ పరిచయం. నీవల్లే నేను సమాజాన్ని కొంత హేతుబద్ధంగా చూడటం నేర్చుకున్నాను. చాలా రోజులు నీచేతుల్లో రంగనాయకమ్మ ‘రామాయణ విషవృక్షం’ ఉండేది. ఒకోసారి దోస్తొయెవ్‌స్కీ ‘క్రైం అండ్‌ పనిష్‌మెంట్‌’.
  2. షేక్‌స్పియర్‌ నాటకాలంటే నీకెంతో ఇష్టం. ముఖ్యంగా ‘మాక్బెత్‌’.

It is a tale told by an idiot                                                           Full of sound and fury                                                        Signifying nothing…’

అని మాక్బెత్‌ జీవితవ్యాఖ్యానం నువ్వు పొయెటిక్‌ యాక్సెంట్‌తో చదువుతుంటే తదేకంగా వినబుద్ధి అయ్యేది. మన ప్రిన్సిపల్‌కి మిల్టన్‌ ఇష్టం. షేక్స్‌పియర్‌ కన్న మిల్టనే గొప్పవాడని ఆయన చెప్తుంటే, క్లాసులో నువ్వు నిలబడి షేక్స్‌పియర్‌ పక్షాన వాదించటం – ఆయన సర్దుకుంటుంటే ఆడపిల్లలు నీ వంక ఆరాధనగా చూడటం నాకింకా గుర్తే. విజ్ఞానానికి విలువున్న రోజులవి.

 

(వృత్తిలో మనిషి) :

  1. చదువు పూర్తి కావటంతోనే విడిపోయాం. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరినట్టు రాశావు. ఉత్తరాల్లో నీ అక్షరాలు స్ఫుటంగా, నీ మనసు గ్రహించి, కాగితంమీద కుదురుగా, తొణుకు బెణుకు లేకుండా, అచ్చంగా నీ మనస్సు మల్లేనే.
  2. వృత్తికి, ప్రవృత్తికి అంతా సంబంధం తెంచేసుకుంటున్న కాలంలో, షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ కార్యక్రమాలకి అధ్యాపకులు అంకితమైపోతున్న రోజుల్లో, నువ్వు వృత్తికి అంటుకుపొయ్యావు. పాఠంలో నువ్వు లీనమై, విద్యార్థుల్ని లీనంచేసే తీరు, పాఠానికే పరిమితం గాక దాని చుట్టూ అనేక సామాజిక విశేషాలు విపులీకరించే తీరు, ప్రశాంతతలో ఉద్వేగం కలిసిన ఉపన్యాసశైలి విద్యార్థుల్నివిశేషంగా ఆకట్టుకునేది. వాళ్లకి నువ్వు ఆదర్శానివి. సమాచారం గాక వాళ్లల్లో సృజనాత్మకత పెంచటమే నీ ఆశయం. నీకు మల్లే బోధనారంగంలో గాకుండా అడ్మినిస్ట్రేటివ్‌ రంగంలో స్థిరపడినందుకు విచారం కలిగేది.
  3. ఉద్యోగంతోనో, పెళ్లితోనో చాలమంది విస్తరణ ఆగిపోతుంది. అక్కడినుంచి తమని తాము నెరువుకొనేవాళ్లు ఏ కొద్దిమందో. అటువంటివాడివి నువ్వు. నిన్ను నువ్వు పుస్తకాల పుటల్లో విస్తరించుకున్నావు. నీ సామాజిక వ్యాసాలు పత్రికల్లో చదువుతూ వచ్చాను. మారుతున్న కాలాన్ని మారుతూ నువ్వు అవగాహన చేసుకున్న తీరు వాటిల్లో కన్పించేది. ప్రజాసమస్యల పట్ల, ఉద్యమాల పట్ల మౌలిక స్పందన కన్పించేది.
  4. చాల కాలానికి మీ యింటికి వచ్చినపుడు గదులనిండా పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయాను. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవటం వల్ల కలిగిన ఒంటరితనం పుస్తక పఠనంలో మరుగుపడిందేమో.

అప్పుడు ఇరావతి కర్వే ‘యుగాంత’ గురించి మాట్లాడుకున్నాం. అస్తిత్వవాద ప్రాతిపదిక మీద భారతం గురించి ఆమె చేసిన విశ్లేషణ అద్భుతం అని వివరించావు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘ఓల్గా సే గంగా’ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ్‌చంద్‌ ‘రంగభూమి’ గురించి మాట్లాడుకున్నాం. శరత్‌, కిషన్‌చందర్‌, భైరప్ప, తక్కళి శివశంకర పిళ్లె, గోపీనాథ మహంతి,  క్రిస్టొఫర్‌ కాడ్వెల్‌, పాబ్లో నెరూడా, టి.ఎస్‌. ఇలియట్‌ – ఎంతమంది రచయితలు నీ మాటల్లో మళ్లీ బతికారు!

ఆ సాయంత్రం నేను నిజంగా జీవించిన రోజుల్లో ఒకటి.

  1. We are the hollow men                                     We are the stuffed men …,’                                                                   – ఇలియట్‌  వేదన, నీ వేదన ఒకటేనా వనమాలీ? జీవనసారాంశం కోల్పోయి, డొల్లలుగా మారుతున్న మనుషులగురించేనా?

మన సంభాషణ ప్రపంచమంతా తిరిగి విభూతి భూషణ వంద్యోపాధ్యాయ ‘వనవాసి’ దగ్గర ఆగింది.

 

(వనవాసి) :

  1. గొప్ప నవల. ఒక యువకుడు – సత్యచరణ్‌ – ఉద్యోగం కోసం తన స్నేహితుడి ఎస్టేట్‌లో మేనేజర్‌గా కుదురుతాడు. బెంగాల్‌లో ఎక్కడో దూర ప్రాంతాన ఎస్టేట్‌కి సంబంధించిన అడవుల్ని కొట్టేయించి, సాగులోకి తేవటం అతని పని. మొట్టమొదట కలకత్తా జన సమ్మర్దానికి దూరమై మారుమూల నిర్జనప్రాంతానికి వెళ్లినందుకు విచారించినా మెల్లమెల్లగా ఆ ప్రకృతి అతడిని ఆకర్షిస్తుంది. అడవి అతణ్ణి ఆవహిస్తుంది. నాఢా, లవటులియా, మోహన్‌పురా అడవుల సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఆ అడవుల్లో భానుమతిలాంటి అందగత్తెలు, కుంత లాంటి నిర్భాగ్యులు, సంతాల్‌, గోండ్‌, గంగోతా తెగల నిష్ఠ దరిద్రులు అతనికి తారసపడతారు. వాళ్ల నిసర్గ జీవిత విధానానికి పరవశిస్తాడు. అయితే ఆ మహాటవీ సౌందర్యమంతా తన చేతులమీదగానే ధ్వంసమవుతుంది. ‘ఓ అరణ్యానీ! ఆదిదేవతా! నన్ను క్షమించు’ అన్నది నవలలో ఆ యువకుడి చివరి వీడ్కోలు మాట.

‘నాకెంతో నచ్చిన పుస్తకం. ఒక అద్భుతం’ అన్నావు. నచ్చినవన్నీ నీకు అద్భుతాలే.

  1. ‘ఈయనలోని జ్ఞానదాహమే నాకు నచ్చిందన్నయ్యా! నిజమైన జ్ఞానదాహం గలవాడు మంచివాడనే నమ్మకంతో ఈయన్ని పెళ్లాడాను. అందుకు పశ్చాత్తాపం లేదు. కానీ పిల్లల పెంపకం కూడా నేనే చూసుకోవాలి. ఆయనకి పట్టదు. రోజుకి పది, పన్నెండు గంటలు పుస్తకాల్లోనే. ఆరోగ్యం ఏమవుతుందో అని నా భయం’ అంది కమలిని నీ పరోక్షంలో. ఇంట్లో పుస్తకాలమధ్య, లేదా లైబ్రరీలో కాలమంతా గడపటంవల్ల ఆత్మీయులకి దూరమవుతుండటం గమనించింది కమలిని. నీ కోసం ఆమె చాలా త్యాగం చేసిందనుకుంటా. నువ్వు రాసే వ్యాసాలు సాఫు రాసి, పత్రికలకి పంపించటం తన పని. పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లి, తీసుకురావటం తన బాధ్యతే.
  2. రోజులు తరబడి బయటికి రావు. పరిగెత్తే మనుషుల్ని పట్టించుకోవు. కార్లలో తిరగాలనే కోరిక లేదు. కొండలు, వాగులు, సంధ్యాకాశాలు చూసి పరవశిస్తావు. ఆడంబరానికి దూరం. ఎప్పుడూ ఒకే రకం తెల్ల దుస్తులు, నిర్మలంగా. నిలువెత్తు రూపం. వనమాలీ! ఆధునిక సన్యాసివి నువ్వు.

(పుస్తకాలు – మనుషులు) :

  1. ‘నువ్వు పుస్తకాల్ని ఎక్కువ ప్రేమిస్తావా? లేక మనుషుల్నా?’ అడిగానొక రోజు.

కొత్తగా కొన్న పుస్తకానికి నువ్వు అట్టవేస్తుంటే చూస్తున్నా. బహుశః పసిపిల్లకి తల్లి అట్లాగే దుస్తులు తొడుగుతుంది. అట్ట చిరిగిపోతే బాధపడతావు. పుస్తకం తీసుకొన్న స్నేహితుడు తిరిగి ఇవ్వకపోతే విచారిస్తావు, పెద్ద సంపదేదో కోల్పోయినట్టు.

‘రెండిరటినీ’ అని నీ జవాబు. ‘రెండిటికీ వైరుధ్యమేం లేదు. పుస్తకాల్ని ప్రేమించేవాడు మరింతగా మనుషుల్ని ప్రేమించగలడు. నిజానికి మనుషుల్ని ప్రేమించగలగటమే గొప్ప పుస్తకాలు నేర్పాయి’.

  1. ఒకేపు అన్ని ఇళ్లల్లో బుక్‌షెల్ఫ్‌ల స్థానంలో షోకేసులు ఏర్పడుతుంటే మీ ఇంట్లో పుస్తకాల అరలు పెరిగిపోతున్నాయి.

వారానికొకసారి పుస్తకాల షాపులకు వెళతావు. ఆదివారం వస్తే పాతపుస్తకాల వీధికి వెళ్తావు. కొన్న పుస్తకాలు, ఎవరెవరో పంపించే పుస్తకాలు – చరిత్ర, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, సాహిత్యం – ఎన్నెన్ని పుస్తకాలో – బొత్తులు బొత్తులుగా.

సముద్రంలో అలల్లా పుస్తకాలే పుస్తకాలు. చదివే పుస్తకాలనిండా అండర్‌లైన్లే. నోట్స్‌ రాసుకోవటం, వ్యాసాలు రాయటం. రిఫరెన్స్‌ కోసం పుస్తకాల దొంతర్లు విప్పటం. అవసరమైన విషయం మీద మరింత సమాచారం కోసం మళ్లీ  పుస్తకాలు కొనటం. రీజినల్‌ లైబ్రరీకి వెళ్లి, పుస్తకాలు తిరగెయ్యటం – నువ్వు మనుషుల్లో మెలుగుతున్నావో, పుస్తకాలతో  మెలుగుతున్నావో అర్థం గాని సంగతి.

  1. ‘రాత్రి కలచ్చింది. గోరా కనబడ్డాడు, తెల్లగా’ అన్నావు.

‘అదేమిటి?’

‘రవీంద్రనాథ ఠాకూర్‌ నవల్లో నాయకుడు. అహమ్మదాబాద్‌, గుజరాత్‌ – మతకలహాలు చూస్తున్నాంగా.  రేపు మాట్లాడాలి, ‘చేతన’ కార్యక్రమంలో. ‘గోరా’ నవల మళ్లీ చదివాను. మానవత్వమే తప్ప మతం జీవితప్రాతిపదిక కాదని ఠాకూర్‌ చెప్తున్నాడు. ‘గోరా’ ఎంతటి        శక్తిమంతమైన పాత్రో! కానీ నాకు ‘ఆనందమయి’ అంటేనే ఇష్టం. నిజానికి ఆమె దయామయి. అమ్మతనానికి అంతకన్న గొప్ప ఉదాహరణ ఉంటుందా!… గోర్కీ ‘నీలోవ్‌నా’ ఉందనుకో’.

  1. శ్రీకాంత్‌, గోరా, హోరి, ధనియా, సూరదాసు, రామదాసు, పావెల్‌, రాస్కొల్నికోవ్‌, సోనియా, జాన్‌ క్రిష్టొఫ్‌, శాంటియాగో, బజరోవ్‌, ఫిలిప్‌, – ఎక్కడెక్కడి పుస్తకమానవులంతా కళ్లముందు కనబడటం – మామూలు చాదస్తం కాదు. తిండి తిప్పలు మానేసి, గంటల తరబడి పుస్తకాల్లో మునిగి తేలటం లోకం దృష్టిలో అచ్చమైన పిచ్చితనమే.

(నీలో సగం) :

  1. వనమాలీ! నిన్ను రెండుగా విడగొడితే ఒక సగంలో పుస్తకం కనపడుతుంది. రెండో సగంలో కమలిని. పెళ్లిచూపుల్లో అరగంటసేపు ‘అన్నా కరీనినా’ గురించి మాట్లాడావని కమలిని చెప్పినప్పుడు అందరం నవ్వుకొన్నాం.
  2. ‘జీతంలో సగం పుస్తకాలకే అయిపోతుందన్నయ్యా!’ ఫిర్యాదు చేస్తుంది కమలిని. నువ్వు నవ్వుతావు. తను మూతి విరుస్తుంది. పొదుపరితనం తెలుసు తనకి.
  3. పుస్తకాలు తరగతులవారీగా సర్దేది కమలిని. పిల్లలని తాకనిచ్చేది కాదు. కావాలన్న పుస్తకం నీకు దొరక్కపోతే వెంటనే తీసిచ్చేది. పుస్తకాలు చదవటంలో ఆమెకంత ఆసక్తి లేదు. బహుశః ఆమె నిన్ను ప్రేమించటం చేత నీ పుస్తకపఠనాన్నీ ప్రేమించి ఉండాలి. గొప్ప మేధావిగా సమాజంలో నీకు గుర్తింపు రావటటం కూడా తనకి సంతోషమే.

పైకేమో ‘ఏదో నామీద జాలితో ఈ వంటింటిని మాత్రం పుస్తకాల్తో నింపకుండా వదిలేశారన్నయ్యా!’ అంటుంది. ‘ఏ రోజూ రాత్రి పన్నెండు గంటలు కావాల్సిందే పడుకొనేపాటికి. రెండ్రోజులకో పుస్తకం తినేస్తారు. ఏదడుగుదామన్నా పరాకే. ఆబ్సెంట్‌ మైండెడ్‌ ప్రొఫెసర్‌ గారు’ అని ఫిర్యాదు చేస్తుంది.

  1. నవంబర్‌ 19 రాత్రి తుపాను వచ్చి పోయిన సంగతి కూడా నువ్వు గమనించలేదని కమలిని చెపితే నాకెంతో ఆశ్చర్యం వేసింది. సముద్ర తీరప్రాంతమంతా అల్లకల్లోలమై కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయిన రాత్రి అది. ఏ లోకంలో ఉన్నావు నువ్వు?

(బుద్ధిజీవులు కార్యవాదులేనా?) :                                                                      

  1. దేశంలో The Great Gegeneration మొదలైంది. గాంధీ, నెహ్రూల ఆదర్శాలకు కాలం చెల్లింది. అన్ని రంగాల్లో విలువలు దిగజారుతున్నాయి. అవినీతి అందలమెక్కుతూ వెర్రిజనానికి నీతులు చెపుతుంది. అధికారగణం చేసిందే చట్టంగా చెల్లుబాటవుతుంది. అటువంటి సమయంలో దేశమంతా తిరిగావు.

‘ప్రజల్లో అజ్ఞానం ఉంది. స్వార్థం ఉంది. సహనం ఉంది. సహజీవనం ఉంది. దేశమంతా దారిద్ర్యం ఉంది. దాన్ని పోగొట్టాల్సిన రాజకీయ రంగంలో మానసిక దారిద్ర్యం ఉంది’ అనే అవగాహన వెల్లడించావు.

  1. ‘జ్ఞానం దేనికి?’ అనే నీ ప్రశ్ననుంచి రాష్టంలో ‘చేతన’ సంస్థ ఆవిర్భవించింది. అది నీ మూడో బిడ్డ. ప్రజల హక్కులు, కులమతాలు, స్త్రీల సమస్యలు – రకరకాల అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్గించటం దాని లక్ష్యం. ‘నర్మదా బచావో’ ఆందోళనలో మేధా పాట్కర్‌తో పాటు అరెస్టయ్యావు. ‘చిప్కో’ ఉద్యమ నేతను కలిశావు.
  2. పర్యావరణ పరిరక్షణ గురించి నీ కృషి నాకు తెలుసు. కొల్లేటి సరస్సు గురించి, వలసపక్షుల గురించి నువ్వు రాసినవ్యాసాలు అపురూపమైనవి. అయితే కొల్లేరు పొంగి, ఊళ్లన్నీ మునిగిపోయిందాకా ఎవరికీ చీమ కుట్టలేదు. ‘చేతన’ పరిస్థితిని అధ్యయనంచేసింది. అందులో సభ్యుడుగా నువ్వు కొల్లేరు ప్రవాహానికి అటు ఇటు ఉన్న గ్రామాలు తిరిగావు. వేల ఎకరాలు ఆక్రమణల పాలై – చేపల చెరువులై – కొల్లేరు సహజ ప్రవాహం భంగం కావటం – వానలు ముదిరినప్పుడల్లా గ్రామాలు మునిగిపోవటం – వివరాలన్నీ నివేదికలో చేర్చావు. పరిష్కారమార్గం సూచించావు. ఆ విధంగా విషయం కోర్టుకెక్కటం, సుప్రీంకోర్టు తీర్పు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన పనికి ‘చేతన’ ఊతమిచ్చింది.

ఇవాళ కొల్లేరు ప్రక్షాళన జరిగి, వలసపక్షుల కిలకిలలు మళ్లీ అక్కడ విన్పించినందుకు వనమాలీ! నిన్ను కూడా తప్పకుండా మెచ్చుకోవాలి.

(తొలి చారిత్రక వ్యక్తి – ఒక జాతర) :

  1. ‘మనం మర్చిపోయిన తొలి చారిత్రక వ్యక్తి బుద్ధుడు. ప్రాణుల ఆనందం కోసం అష్టాంగ మార్గం కనుక్కున్నాడు. ఆ మార్గంనుంచి తప్పుకున్నాం. సమ్యక్‌ దృష్టి లేదు. సమ్యక్‌ ఆలోచన లేదు.’

కాలచక్ర ఉత్సవాలు. కృష్ణానదీ తీరం వేలమంది బౌద్ధభిక్షువుల్తో కళకళలాడుతోంది. అమరావతిలో కలిశాం, నువ్వు, నేను, సతీష్‌. అతనికదే తొలిసారి అమరావతి రావటం. మ్యూజియంలో స్తూపం శిథిలాలు, ముఖ్యంగా ఎద్దు బొమ్మ చూసి మురిసిపొయ్యాడు సతీష్‌. కృష్ణానది ఒడ్డున మనం ముగ్గురం. దూరంగా టిబెటన్‌ భాషలో దలైలామా బోధన మార్మికంగా, సమ్మోహనంగా వినపడుతుంది.

‘మర్చిపోవటమేమిటి? ఇటువంటి సందర్భాల్లో మళ్లీ తల్చుకోవటం లేదా? ఎంత జనం వచ్చారో చూడండి.’ అన్నాడు సతీష్‌.

‘ఇదంతా జాతర. కాదంటే వేడుక. బుద్ధుణ్ణి నిజంగా మనస్సుల్లోకి ఇంకించుకున్నామా? ఇంకించుకుంటే మన కళ్లముందు ఇంత హింస ఎందుకుంటుంది?’ ఎదురు ప్రశ్న వేశావు. ‘అసలైన సంస్కృతికి, మనకీ బంధం తెగిపోయింది. సంస్కృతిలోని పద్ధతులు, తంతులు మాత్రమే మిగిలి, సారాంశం అంతరించిపోతున్న దశలో ఉన్నాం’ అన్నావు. సాంస్కృతిక నేపథ్యంలేని రాజకీయ నాయకుల వల్లనే క్రమక్రమంగా దేశపతనం ప్రారంభమైందని అన్నావు.

ఆ సాయంత్రం రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘ఋగ్వేద ఆర్యులు’ దగ్గర్నుంచి, ధర్మానంద కొశాంబి ‘బుద్ధ భగవానుడు’, రొమిలా థాపర్‌ ‘ప్రాచీన భారతదేశం’ దాకా భారతీయ సంస్కృతి గురించి ఎన్నెన్నో వ్యాఖ్యలు వివరించావు. మేమిద్దరం మౌనంగా విన్నాం. కృష్ణానది విన్నది. కనుచీకట్లో చుక్కల ఆకాశం విన్నది.

(వారసత్వం) :

  1. కమలిని టి.బి.తో పోవటం నీ జీవితంలో గొప్ప దు:ఖం. ఎంతో ప్రయత్నం చేసీ బతికించుకోలేకపొయ్యావు. తోడు లేకుండా ఎట్లా బతకాలో తెలియని వాడివి. అందుకే కావాలి, పోతూ పోతూ నిన్నెప్పుడూ వదిలిపెట్టొద్దని నాకు చెప్పింది.

నువ్వు చిన్న పిల్లాడివని చెప్పింది.

  1. ‘లోపల పెద్ద అగాధం ఏర్పడినట్టనిపిస్తుంది. దేంతోనూ పూడ్చలేను. ఇప్పటిదాకా నా బతుకు ఎంతగా ఆమెమీద ఆధారపడి ఉందో తెలిసింది. నేనింకా ఎక్కువకాలం బతకలేకపోవచ్చు. అయితే నా జీవితం కన్న కమలిని మరణంగురించే ఎక్కువ విచారంగా ఉంది.’ నీ కళ్లల్లో నీళ్లు. ఓదార్చలేకపొయ్యాను.

చాలాసేపు విషాదమౌనం తర్వాత ‘తెగిపోయింది’ అన్నావు. నాకర్థం కాలేదు. ఏదో లోకంలోనుండి మాట్లాడటం  నీకు మామూలే. ‘ పిల్లలకీ నాకూ మధ్య బంధమేదో తెగిపొయ్యింది. కమలిని ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని ముడేస్తుండేది. ఇప్పుడు ముడేసే తెలివి లేదు నాకు. నా అభిరుచులు, వాళ్ల పద్ధతులు వేరై పోయాయి. ఆలోచనల్లో దూరం పెరిగింది. ఎప్పుడన్నా వాళ్లు మాట్లాడినా ఏదో ముక్తసరిగా, పొడిగా ఉంటున్నాయి మాటలు’.

కావలసిన మనుషుల మధ్య సమానస్థాయిలో భావప్రసారం లేనప్పుడు కలిగే వేదనను అర్థం చేసుకున్నాను.

  1. దేశమంతా పర్యటిస్తూ సాహిత్య, సామాజిక అంశాల మీద ప్రసంగిస్తున్నావు. ‘చేతన’ కార్యకలాపాలు తక్కువగానే సాగుతున్నా నీ పేరు మాత్రం మారు మోగిపోయింది. ‘ఇండియా టుడే’ దేశంలో అన్ని రంగాల్లో నూరుమంది మేధావుల్ని ఎన్నిక చేసింది. అందులో నీది పదకొండో స్థానం. ఎంత సంతోషం! ఇప్పుడు కమలినే గనక ఉంటే?
  2. హైదరాబాద్‌ ‘రవీంద్రభారతి’లో నీకు సన్మానం చేస్తూ, నువ్వు ‘నడిచే విజ్ఞాన కోశాని’వని అందరూ ప్రశంసిస్తుంటే ఈ విజ్ఞానకోశానికి మేధా వారసత్వం ఏమిటి? అనే సందేహం కలిగింది. నీ జ్ఞానమంతా నీతో ముగిసిపోవటమేనా?
  3. కూతురు రాసిన ఉత్తరం చదవమని నా చేతికిచ్చావు.

 ‘డాడీ!

నువ్వు గొప్పవాడివి కావచ్చు. కానీ పిల్లల్ని గొప్పవాళ్లని చెయ్యాలి గదా? సాటివాళ్లంతా ఆర్థికంగా మెట్టుమెట్టుగా పైకెదిగిపోతుంటే నువ్వు అప్పటికీ ఇప్పటికీ అదే మెట్టుమీద కూలబడి దిక్కులు చూస్తున్నావు. అదే మెట్టు మీదున్న వాళ్లకే నన్నిచ్చి చేశావు. ఏం సుఖపడ్డాను? చాలీ చాలని బతుకు. ఏ కోరికలూ తీరవు. ఎన్నటికీ పై మెట్టు ఎక్కలేని నిస్సహాయత. నిన్నిప్పుడు ద్వేషించలేను. అలాగని ప్రేమించనూ లేను.

                                                                        మీ కూతురు, విమల.’

‘మెట్టంటే ఏమిటి?’ అనడిగావు, ఉత్తరం నేను చదవగానే. ‘ఆర్థిక సోపానాలు తప్ప ఇంకే మెట్లూ లేవా మనకి?’

ఎంతోమంది దృష్టిలో మెట్లంటే అవే. అవి ఎక్కటానికే నిరంతరం మన ప్రయత్నం. విజ్ఞానం, వివేకం, సామాజిక పాత్ర – ఇటువంటి మెట్లెక్కటానికి పూనుకునే వాళ్లు వెర్రివాళ్ల కిందే లెక్క. అయితే అందరి మాదిరిగా కళ్లు మూసి తెరిచేలోగా ఆ మెట్లేవో ఎక్కలేనందుకు నువ్వు విచారపడుతున్నట్టు లేదు.

‘నేనున్న మెట్టుమీద, నన్ను నన్నుగా నా కన్నకూతురు ఆమోదించలేకపోయింది’ అన్నావు దిగులుగా.

  1. కొడుకును గురించి ఇంకో విచారం. ‘వాడు ఖండాలు దాటి వెళ్లిపోయాడు. కమలిని వాణ్ణి బాగా ముద్దు చేసేది. ఇవాళ ‘యాహూ’ సామ్రాజ్యంలో వాడొక బంటు. బోలెడు సంపాదన. కానీ వాడికి అమ్మతోనూ తనివిదీర మాట్లాడే తీరిక లేదు. ఉన్నంతకాలం కమలినికదే దిగులు. అనంతదూరంలో ఉన్నా మనసుల్ని తాకుతూ మాట్లాడొచ్చు. దూరంకావటమే మనకు తెలుసు. దూరమయ్యీ దగ్గర కావటం తెలియదు’.

కావచ్చు. కానీ నీ వారసత్వం నీ సంతానం స్వీకరించలేకపోవటం పెద్ద విషాదం వనమాలీ! వారసత్వమంటే సంపద మాత్రమే కాదు. జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయం – ఇవన్నీ అందులో భాగమే గదా?

(అంతిమ అనివార్యత) :                                             

  1. జీవితంలో అంతిమ అనివార్యత మృత్యువు. దాన్ని నువ్వు ఆమోదించిన తీరు గొప్పది.

వరసగా కొన్ని రోజులు ‘మార్నింగ్‌ వాక్‌’కి నువ్వు రాకపోయేటప్పటికి నాకనుమానం వేసి ఫోన్‌ చేశాను. పనిపిల్ల ఆందోళనగా చెప్పింది, నీ అనారోగ్యం సంగతి. తెల్లారే నిన్ను కలిశాను. ఒకవంక నీకిష్టమైన పాట వింటున్నావు.

యహా పూరా ఖేల్‌ అభీ జీవన్‌ కా                                                          తూనే కహా హై ఖేలా                                                                                   చల్‌ అకేలాచల్‌ అకేలా, చల్‌ అకేలా…

– ముఖేష్‌ గొంతు విషాదాన్ని వొంపుతుంది. మూత్ర విసర్జనలో బాధ, డాక్టర్ల పరీక్షల గూర్చి చెప్పావు. ప్రొస్టేట్‌ గ్రంథి సమస్య. ‘కమలిని లేని లోటు ఇప్పుడు బాగా తెలుస్తుంది’ అన్నావు. నిజం. ఆ చల్లని ప్రశాంతమూర్తి ఇప్పుడుంటే నీ జబ్బు సగం తగ్గిపోయేది.

  1. కాలిఫోర్నియా నుంచి కొడుకు పరామర్శ. ఏలూరు నుంచి కూతురు. ఎవరూ వెంటనే వచ్చే వీలులేదు.
  2. జబ్బు తీవ్రమైందని తెలుసు. అయినా నువ్వే మాత్రం భయపడకపోవటం ఆశ్చర్యం. P.S.A. పరీక్షలో ప్రొస్టేట్‌ గ్రంథి పూర్తిగా వ్యాధిగ్రస్తమైందని తేలింది. సర్జరీ జరిగింది. అయినా జబ్బు ముందుగానే ముదరటం వల్ల సర్జరీతో పెద్దగా ఉపయోగం ఉండదని డాక్టర్లు నీ ముందే చెప్పారు.
  3. స్నేహితులు, అభిమానులు, పాత విద్యార్థులు వచ్చి పరామర్శిస్తున్నారు. ‘చేతన’ కొనసాగిస్తామని మిత్రుల దగ్గర మాట తీసుకొన్నావు. పైకి నిమ్మళంగానే ఉన్నా, లోపల్లోపల దేనిగురించో ఆందోళన పడుతున్నట్టు తోచింది. రెండు మూడు రోజుల్లో కూతురు వస్తున్నట్టు కబురు.
  4. సాయంత్రం నీ దగ్గరికొచ్చాను.

‘స్టీఫెన్‌ హాకింగ్‌ పేరు విన్నావా?’ అనడిగావు.                                                                      ‘పెద్ద సైంటిస్టు గదా!’                                                                                          ‘స్ట్రింగ్‌ థియరీని అతను వివరించిన తీరు సరిగ్గా అర్థం గాలేదు. Black Holes and Small Universes కూడా ఈ మధ్యే చదివాను. అతను ఐన్‌స్టీన్‌ కన్నా గొప్పవాడంటావా?’

నువ్వున్న పరిస్థితేమిటో, నువ్వు ఆలోచిస్తున్నదేమిటో నీకర్థమైందా వనమాలీ! నిర్లిప్తుడా!

‘Confessions of an Economic Hit Man’ పుస్తకం ఎక్కడన్నా దొరికితే తెచ్చిపెడుదూ?’ అడిగావు.

సామ్రాజ్యవాద రథాశ్వం జాన్‌ పెర్కిన్స్‌. అమెరికా ప్రయోజనాల కోసం దేశదేశాల్లో ఎన్నో తప్పుడు పనులు చేసి, పశ్చాత్తాపం పొందిన బ్యూరోక్రాట్‌. అతని పుస్తకం.

  1. పక్కనెవరూ లేరు. తీవ్రమైన అనారోగ్యం. నీ మొహంలో అదే నిర్లిప్తత. కాలిఫోర్నియా నుంచి నీ కొడుకు వస్తున్నట్టు ఫోన్‌. ఈ దేశంలో ఉన్నా కూతురింకా రాలేదు. కమలిని గుర్తొస్తుందన్నావు. తలగడ పక్కనే పెర్కిన్స్‌ పుస్తకం, బోర్లా తెరిచిపెట్టి-
  2. నీ నా స్నేహంలో కొన్ని గుర్తులివి.

నా జ్ఞాపకాలన్నీ విన్న తర్వాత కదిలీ కదలని పెదాల్తో ఇప్పుడీ ప్రశ్న వేశావు.

‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’

నాకర్థం గాలేదు. గదంతా కలియజూస్తున్నా. అన్ని వైపులా పుస్తకాల దొంతర్లు. రాక్స్‌, బీరువాలు – ఎటుచూసినా పుస్తకాలే – అలలు అలలుగా ….

అంతకు మించి నీ లోపలనుంచి ఏదో ఉత్తుంగ తరంగాల హోరు…..

వనమాలీ! ఇప్పటికి నీ ప్రశ్న అర్థమైంది.

కానీ జవాబు మాత్రం నా దగ్గర లేదు.

(ఆకాశవాణి, విజయవాడ, 2007; ఆదివారం ఆంధ్రజ్యోతి, 04 ఫిబ్రవరి 2007; కథ-2007; నూరేండ్ల తెలుగు కథలు సంకలనం, 2011)

—-

 

పాపినేని శివశంకర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వనమాలి నిజంగానే ఆధునిక సన్యాసి. ఇప్పటి ప్రపంచంలో ఉంటూ కూడా ఒక కాల్పనికజగత్తులో తిరుగుతూ సత్యాన్వేషణ చేస్తున్న మీ వనమాలికి, ఆయనతో సహా పాఠకులకు కూడా ఆ ఆదర్శ ప్రపంచం చూసే భాగ్యం కలిగించిన శంకర్ గారికి నాఅభినందనలు!ఆ సముద్రాన్ని ఎక్కడ పోయగలం! ధన్యవాదములు

  • తెలుగు కథల్లో నాకు బాగా నచ్చిన కథ ‘సముద్రం’. ఇలా మరొకరు రాయలేరేమో అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కథను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు