సముద్రతీరంలో… అందమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో…

విడిపోవడం ఎవరినైనా బాధిస్తుంది. కాని సుదీర్ఘ మానవజీవితంలో అది తప్పదు.

 

అనువాదం: అరుణా పప్పు

4

ఆ రోజుల్లో ఎమ్. కృష్ణన్ అనే సుప్రసిద్ధ పాత్రికేయులు ఉండేవారు. ద మెయిల్, ద హిందూ వంటి పత్రికల్లో ఎక్కువగా ప్రకృతి గురించి, ప్రయాణాల గురించి రాసేవారు. ఇప్పుడు అటువంటి వారిని ట్రావెల్ జర్నలిస్టులని అంటున్నారు. కాని అప్పట్లో ఆ మాట అంతగా తెలియదు. (ద మెయిల్ పత్రిక 1960ల్లోనే ఆగిపోయింది) ఇంతకూ కృష్ణన్ తన వ్యాసాల్లో ఒకసారి ఏమని రాశారంటే ‘భారతీయ రైళ్లలో ప్రయాణం చేస్తూ సుందర దృశ్యాలు చూడాలంటే నెల్లూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లడం ఉత్తమం. కనుచూపుమేరా విస్తరించిన వరిచేలు, కొబ్బరితోటలు, అరటితోటలు – మొత్తమ్మీద ప్రకృతి పచ్చని చీర చుట్టుకున్నట్టు ఉంటుంది…’ అంటూ. ఆయన వర్ణించిన అందాలన్నీ నా కంటపడే సమయం ఆసన్నమయ్యింది. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాకు బి.ఎ. ఆనర్స్ చదివేందుకు సీటు దొరికింది.

లార్డ్ క్లైవ్ నేతృత్వంలోని ఈస్టిండియా కంపెనీ పరిపాలన సౌలభ్యం కోసం మన దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. తూర్పున కలకత్తా, పశ్చిమాన బొంబాయి, దక్షిణాన మద్రాసు. వీటిని ప్రెసిడెన్సీ టౌన్లు అనేవారు. బ్రిటిష్ పాలకులు సైతం చాలా ఏళ్ల పాటు ప్రాదేశికంగా అలాగే గుర్తిస్తూ వచ్చారు. ఈ ప్రాంతాల్లో సుస్థిరమైన ఆధిపత్యం కోసం వాళ్లు ఫ్రెంచివాళ్లతో, డచ్ వారితో పోరాడుతూ ఉండేవారు. దక్షిణాదిన మద్రాసు ప్రెసిడెన్సీలో ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలను కర్ణాటక యుద్ధాలు అనేవారు. చివరకు వెల్లెస్లీ కాలంలో నిజామ్ రాజుకు, బ్రిటిష్ వారికి సంధి జరిగింది. యుద్ధం ఆగి, పరిపాలన, అభివృద్ధి మొదలయ్యాయి. మన తెలుగు నేల అంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం. 1953లో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం విడిగా అవతరించింది.

ప్రెసిడెన్సీల్లో విద్యావ్యాప్తి కోసం కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో బ్రిటిష్ వారు కాలేజీలను స్థాపించారు. కాలక్రమంలో అవి విశ్వవిద్యాలయాలుగా రూపొందాయి. ఆయా ప్రాంతాల్లోని కాలేజీలన్నీ వాటి అధీనంలో పనిచేస్తూ ఉండేవి. ఆ ధోరణిలో మద్రాసు మొదలుకొని ఒడిశా వరకూ తూర్పు తీర ప్రాంతమంతటా ఉన్న కాలేజీలన్నీ మద్రాసు విశ్వవిద్యాలయం కనుసన్నల్లో నడిచేవి. దక్షిణాదిన అన్ని సంస్థలకూ అది తల్లివంటిది. అయితే 1926 మద్రాసు చట్టం ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యింది. 1931 జూలై నుంచి నుంచి ఇటు శ్రీకాకుళం మొదలు అటు నెల్లూరు దాకా ఉన్న కాలేజీలన్నీ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి. ఈ సంస్థ ఏర్పాటు కోస్తా, సీడెడ్ ప్రాంతాల విద్యార్థులకు వరమయ్యింది. ఎక్కువ దూరం పోనవసరం లేకుండా వారికి విశ్వవిద్యాలయ విద్య అందుబాటులోకి వచ్చింది.

మొదట్లో దాన్ని ఇంకొంత మధ్య ఆంధ్రలో పెడదామనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే తొలుత దాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు. నేటి మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న విక్టోరియా జూబిలీ మ్యూజియమ్ దాని తొలి భవనం. అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారు దాన్ని అక్కడే ఉంచాలని ప్రయత్నించారు కాని కట్టమంచి రామలింగారెడ్డిగారి పట్టుదల వలన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నానికి తరలిపోయింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన పట్నవాసాల రొద నుంచి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో యూనివర్సిటీ ఉండాలని ఆకాంక్షించారు. ‘బెజవాడలో అగ్రికల్చర్ ఉందిగాని కల్చర్ లేదు’ అన్నారని ప్రతీతి. ముఖ్యంగా అక్కడి ఎండలు, వాతావరణం నచ్చక విద్యాసంస్థ ఏర్పాటుకు తగిన ప్రదేశంగా – మరో ప్రపంచంలా ఉండే వాల్తేరును ఎంపికచేశారాయన. ముందు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ అన్న పేరు అనుకున్నారట కాని, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం అన్న పేరును ఖాయం చేశారు. తొలి వైస్ ఛాన్సలర్ గా దాని రూపురేఖలను నిర్దేశించినవారు సర్ సి.ఆర్.రెడ్డిగారే. ‘ఆయన ఒక చెయ్యి ఊపారు, అక్కడొక విశ్వవిద్యాలయం రూపెత్తింది’ అని సర్ సి.వి.రామన్ అన్నారట.

విశాఖపట్నం అప్పట్లో రెండు భాగాలుగా ఉండేది. సముద్రానికి దగ్గరగా కొండలు, గుట్టలుగా ఉన్న ప్రదేశాన్ని వాల్తేరు, వాల్తేరు అప్ లాండ్స్ అనేవారు. పల్లంలో ఉన్న పెద్ద ఊరు వైజాగపటం – విశాఖపట్నం. అదే వైజాగ్. వాల్తేరు కొండల మీద జీడిమావిడి తోటలు ఎక్కువ. జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టరు, ఎస్పీ, న్యాయమూర్తులు వంటివారి బంగళాలు తప్ప అక్కడ జనావాసాలు ఉండేవి కాదు. అటువంటి తోటల మధ్యలో గుట్టల మీద ఆంధ్ర విశ్వవిద్యాలయ నిర్మాణం జరిగింది. 1926 – 27లో కేవలం కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ మాత్రమే ప్రారంభమైంది. తర్వాత తత్వశాస్త్ర ఆచార్యుడు, (అనంతర కాలంలో మన రాష్ట్రపతి అయిన) శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణగారి చొరవవల్ల యూనివర్సిటీకి నిధులు లభించి, విస్తరణ సాధ్యమయ్యింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, విడిగా సైన్స్ కాలేజీ వచ్చాయి. 1950లో అనుకుంటా, మచిలీపట్నం నుంచి లా కాలేజీని అక్కడికి తరలించి యూనివర్సిటీలో భాగం చేశారు.

*****

మా రెండో అన్నయ్యను నాన్న స్వయంగా తీసుకెళ్లి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్పించారు. ఆంధ్రా యూనివర్సిటీలో చేరడానికి మాత్రం నేనొక్కణ్నే బయల్దేరాను. నేను చూసుకోగలనన్న నమ్మకం ఏదో ఆయనలో బలంగా ఉండేదేమో, మరి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి దాదాపు 217 మైళ్ల ప్రయాణం. అది జూన్ నెలాఖరు కావస్తోంది. రాత్రి తొమ్మిదిన్నరకు పూరీ ఎక్స్ ప్రెస్ కదిలింది. నేనూ నాన్నా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం.

నేనెక్కింది మూడో తరగతి పెట్టెలో. అందులో పడుకునే సదుపాయం ఉండేది కాదు. కూర్చోవడానికి సీటు దొరికితే అదృష్టం, లేదంటే నిలుచునే ప్రయాణం చెయ్యాలి. ఓ గంట ప్రయాణం తర్వాత నాకు కూర్చునేందుకు చోటు దొరికింది. అప్పుడు కృష్ణన్ గారి వ్యాసాలు మననం చేసుకుని బయటకు చూస్తే చిమ్మచీకటి తప్ప మరేమీ కనిపించలేదు. రైలెక్కక ముందు నుంచీ గోదావరి నది, బ్రిడ్జి చూడాలని నాకు బలంగా ఉండేది. కాని ఏం లాభం, నదిని దాటింది రాత్రి పూట కావడంతో ఏమీ కనిపించలేదు. కేవలం బ్రిడ్జి మీద రైలు వెళ్లే ధనధనా శబ్దాలను బట్టి నదిని ఊహించుకున్నానంతే. పూరీ ఎక్స్ ప్రెస్ రాత్రి పేరుకు తగినట్టే ఎక్స్ ప్రెస్ లాగా నడిచిందిగాని, ఉదయం నుంచి దాదాపు ప్రతి ఊళ్లోనూ ఆగుతూ, బొగ్గు, నీళ్లు నింపుకుంటూ ప్రయాణించింది. ప్రతి స్టేషనులోనూ, ఎక్కేవాళ్లు ఎక్కువ, దిగేవాళ్లు తక్కువ అన్నట్టు అనిపించింది నాకు. దారంతా మెలకువగానే ఉన్నాను.

తెల్లవారుతూనే కృష్ణన్ రాసిన అందమంతా సాక్షాత్కరించింది. రాత్రి నిద్ర లేదనే ఇబ్బందిన – ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది. వాల్తేరు స్టేషను చేరడానికి కలకత్తా మెయిన్ లైను నుంచి కాస్త పక్కకు, లోపలకు వెళతాయి ట్రెయిన్లు. స్టేషను రాగానే, నా జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రైలు దిగాను. అక్కడ నుంచి యూనివర్సిటీ మూడు మైళ్ల దూరంలో ఉంటుంది. నాకున్న లగేజీ ఒక హోల్డాలు, ఒక పెట్టె. వాటిని తీసుకుని వెళ్లాలంటే అయితే మనుషులు లాగే రిక్షా ఎక్కాలి, లేదంటే గుర్రాలు లాగే జట్కా ఎక్కాలి. నేను రిక్షా ఎక్కాను. జూన్ నెల మధ్యలోనే అందరు విద్యార్థులు యూనివర్సిటీకి చేరిపోతారు. నాలాగా ఆలస్యంగా వచ్చేవారు తక్కువే. అలా వచ్చిన మరికొందరు విద్యార్థులు జట్కాలు మాట్లాడుకుని వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఉన్న ప్రాంతమంతా కొండలని చెప్పాను కదా, అందువల్ల ఎత్తులో రిక్షా లాగలేక ఇబ్బందిపడేవారు అక్కడివారు. దాంతో కూర్చున్నవాళ్లు దిగి, ఆ కాస్త దూరమూ నడిచి, మళ్లీ పల్లం ప్రారంభమైనప్పుడు ఎక్కేవారు. నేనూ అలాగే చేశాను.

కొండ మీద ఎత్తయిన ప్రాంతానికి చేరేసరికి, మూడు వైపులా విశాలంగా విస్తరించిన సముద్రం కనిపించి ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తేసింది. అప్పటిదాకా సముద్రాన్ని చూడనివారికి అది ఇంకా పెద్ద ఆశ్చర్యంగా ఉండేది. పైన నిర్మలమైన ఆకాశం, కింద నీలి సముద్రం – ప్రకృతిలోని సౌందర్యమంతా రాశిపోసినట్టు అనిపించింది. 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్ ఆ అందానికి అబ్బురపడి ఆ పై ఏడాది వచ్చి, అక్కడ ఉండి కాస్త కవిత్వం రాసుకుని వెళ్లారని చరిత్ర చెబుతోంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొంత కాలం పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గుంటూరుకు తరలించారు. ఆ సమయంలో యూనివర్సిటీ ప్రదేశాన్ని ఆర్మీ బలగాలు తమ స్థావరంగా చేసుకున్నాయి. అప్పుడు వార్ టైమ్ టెంపరరీ కనష్ట్రక్షన్ (డబ్ల్యుటిసి) అని కొన్ని రేకుల షెడ్లు నిర్మించారు. 1950కి కొంత ముందు మళ్లీ యూనివర్సిటీ విశాఖపట్నం వచ్చేసింది,   అప్పుడు ఆ రేకుల నిర్మాణాలు మావంటి మొదటి ఏడాది విద్యార్థులకు వసతి గృహాలుగా మార్చారు. హాస్టలు కోసం మూడేసి అంతస్తులున్న నాలుగు భవనాలుండేవి, మొదట్లో ఒక్కొక్కరికీ ఒక్కో గది ఇచ్చేవారట. కాని తర్వాత ఇద్దరిద్దరికి ఇవ్వడం మొదలుపెట్టారు. వీటిలో కేవలం మగపిల్లలకే వసతి. ఆడపిల్లలకు యూనివర్సిటీ బయట ఒక ప్రైవేటు భవనాన్ని తీసుకున్నారు. వాళ్లు యూనివర్సిటీ బస్సులో క్లాసులకు వచ్చిపోతూ ఉండేవారు.

ఇవిగాక గ్రంధాలయానికి వేరే భవనం, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కార్యాలయానికి మరో చిన్నగది ఉండేవి. (ఇదే తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు బెడ్లు, డాక్టరు, ఓ సహాయకుడు ఉన్న చిన్నపాటి నర్సింగ్ హోమ్ వంటిది ఉండేది. టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి అన్ని ఆటలకూ ప్రత్యేకంగా మైదానాలుండేవి. ప్రతి భవనం ఓ గుట్ట మీద ఉంటుంది కనుక విద్యార్థులకు కొండలెక్కడం దిగడమే పని అన్నట్టుగా ఉండేది. అలాగే యూనివర్సిటీ ఏ మూల నుంచి చూసినా, అంటే తరగతి గదులు, ల్యాబులు, గ్రంధాలయం, ఆస్పత్రి, మైదానాలు, హాస్టలు – ఎక్కణ్నుంచి చూసినా సముద్రం కనిపిస్తూ ఉండేది. మేం చేరిన తర్వాత ఫ్యాకల్టీ క్లబ్, ఆడపిల్లలకు వెయిటింగ్ రూమ్, న్యూక్లియర్ ఫిజిక్స్ భవనాలు వచ్చాయి. ఇంజినీరింగ్ కాలేజీ తర్వాత కొన్నాళ్లకు వచ్చింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇటు బోధన చేసేది, అటు వివిధ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేది. వాటిలో డిగ్రీ, నాన్ డిగ్రీ కాలేజీలుండేవి. వాటిలో రెండేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులుండేవి, కాని యూనివర్సిటీలో మూడేళ్ల ఆనర్స్ కోర్సుండేది. ఇది ఆక్స్ బ్రిడ్జి యూనివర్సిటీల్లోని ట్రిపోస్ కోర్సును ఆధారంగా తీసుకుని రూపొందించినది. అంటే ఏ సబ్జెక్టు తీసుకున్నా, మూడేళ్లు చదవాలి, చివర్లో కఠినమైన పరీక్షలుంటాయి, మొత్తం 8 లేదా 9 పేపర్లు రాయాలి. ప్రతిదీ మూడేసి గంటల వ్యవధి. మొత్తం కోర్సును 4 ఏళ్లలో పూర్తిచెయ్యాలి. అనుకోకుండా మూడో ఏడాది పరీక్ష రాయలేకపోతే, పై ఏడాది రాయాలి తప్ప, మామూలు డిగ్రీ కోర్సులాగా సెప్టెంబరులో సప్లిమెంటరీల్లేవు. పాసైతే పై చదువులకు, లేదంటే ఇంటర్మీడియెట్ స్థాయికి దిగిపోయినట్లే. బ్యాచిలర్ డిగ్రీతో పోలిస్తే, ఇందులో చేరిన విద్యార్థులకు నిరంతరమూ నెత్తి మీద కత్తి వేలాడుతున్నట్టే ఉండేది. ఫెయిలవుతామన్న ఊహను దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవారు కాదు.

ఇదంతా తెలిసే నేను ఆ కోర్సు తీసుకున్నాను. నేను ఇంటర్ సెకెండియర్ లో ఉన్నప్పుడు మా సీనియరైన మాచిరాజు హనుమంతరావు అనే విద్యార్థిని కలిశాను. ఏం చేస్తున్నారని అడిగితే అతను ‘ఆంధ్రా యూనివర్సిటీలో బియ్యే ఎకనమిక్స్ హానర్స్ కోర్సు చదువుతున్నా’ అని ఎంతో ధాటిగా సమాధానమిచ్చాడు. అది నా మీద ఎంత చెరగని ముద్ర వేసిందంటే నేను అక్కడే అదే కోర్సు చదవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అతను తర్వాత అమెరికా వెళ్లాడు, ఇండియానా యూనివర్సిటీలో చదివాడు, తన పేరును హెచ్.ఆర్.మాచిరాజు అని రాసుకోవడం మొదలుపెట్టాడు.

*****

యూనివర్సిటీలో చేరిన కొత్తలో అక్కడి పరిస్థితులకు అలవాటు పడటం కష్టంగానే అనిపించింది. చదువుపరంగా కాదు, జీవనశైలి పరమైన ఇబ్బంది అది. అక్కడ హాస్టల్లో నేను వెళ్లేనాటికి 800మంది విద్యార్థులున్నారు. కేవలం 20 మంది ఉండే చోటి నుంచి 800మంది ఉండే చోటికి వెళ్లడమంటే, బావిలోని కప్పను మహా సముద్రంలో విసిరేసినట్టు అయిపోయింది నా పరిస్థితి.

విజయవాడ కాలేజీలో ఉన్న ఇరవై మందికీ వంటాయన కొసరికొసరి తినమంటూ పెట్టేవారు, ఇక్కడ అంతా కరువు కమ్ముకున్న వేళ. అన్నిటికీ కోత, అన్నిటికీ రేషనే. అసలు విశాఖపట్నమే కరువు జిల్లాగా ఉండేదానాడు. కోస్తా జిల్లాల నుంచి ఆహార దినుసులు వచ్చేవి. అందువల్ల మా భోజనాలకు రాశి తక్కువ, వాసీ తక్కువే. రాత్రి ఓ కప్పు అన్నం, అదీ ముతక బియ్యం, కొన్ని పూరీలు, కూర పెట్టేవారు. ఆంధ్రదేశానికి ధాన్యాగారం అనదగిన జిల్లాల్లో పుట్టిపెరిగిన మాకు ఈ అన్నానికి కరువేంటో అర్థమయ్యేది కాదు. గోధుమ ఆహారంగా ఎందుకో తెలిసేది కాదు. మాకది పడదు. పొద్దున లేస్తే అన్నం ఉంటే చాలు మాకు. అయితే ఎంత మొత్తుకున్నా అక్కడ ఏమీ లాభం లేదు. పూరీలు పడవంటే తిండికి లేక మాడాల్సిందే. దీంతో మొదటిసారి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు రకరకాల జబ్బులు వచ్చేవి. మరీ ముఖ్యంగా డయేరియా సాధారణం. జూన్ నుంచి మూడు నెలలు యూనివర్సిటీ హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉండేది. ఆహారపుటలవాట్లు సర్దుబాటు చేసుకోవడం కుదరక కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ వదిలేసి, తమ ఊళ్లకు దగ్గర్లోని అఫిలియేటెడ్ కాలేజీల్లో బ్యాచిలర్ డిగ్రీల్లో చేరిపోయేవారు. డబ్బులున్నవారు కొందరు యూనివర్సిటీ అవుట్ గేటు దగ్గరున్న హోటల్లో తినేవారు, పళ్లు కొనుక్కునేవారు. ఏవీ అన్నానికి సాటి వచ్చేవి కాదు. (విశాఖపట్నం మంచి అనాసపనస, పనస, అరటి పళ్లకు, జీడిపప్పుకు ప్రసిద్ధి. వాటిని నడివయస్కులైన మహిళలు గంపల్లో పెట్టుకొని అమ్మేవారు. వారితో బేరమాడితే అవమానపరిచేలా మాట్లాడేవారు. )

యూనివర్సిటీలో అన్నానికే కాదు, నీళ్లకూ కరువే. అప్పటికింకా యూనివర్సిటీకి సొంత నీళ్ల స్టోరేజీ ట్యాంకుల్లేవు. ఉదయం, సాయంత్రం నీళ్లు వచ్చేవి. ఆ సమయంలోనే విద్యార్థుల అవసరాలన్నీ తీరిపోవాలి. ఉదయం లెట్రిన్లు, స్నానపు గదుల దగ్గర చేంతాడంత పొడవు క్యూలు కట్టేవారు. వాటి నిర్వహణ ఏమాత్రం బాగుండక, నీటి వసతి లేక అవి పరమ దుర్గంధాన్ని వెదజల్లేవి. పల్లెటూళ్ల నుంచి వచ్చిన నావంటివారికి అదొక కొత్త దురవస్థ. బకెట్లు, తువ్వాలు, సబ్బు, బ్రష్షు, పేస్టు పట్టుకొని కుర్రాళ్లు క్యూల్లో నిలబడేవారు. మాకెవ్వరికీ గడ్డం చేసే అవసరం అంతగా ఉండేది కాదు. నెలకోసారి క్షవరంతోపాటు చేయించుకునేవాళ్లం. రెండో ఏడాదిలో నేను గిలెట్ రేజర్ కొన్నానని గుర్తు.

హాస్టల్లో ఉదయం కాఫీ, సాయంత్రం టీ ఇచ్చేవారు. పరీక్షలప్పుడు రాత్రి పదింటికి మరోసారి టీ ఇచ్చేవారు. వాటికి కచ్చితమైన సమయం ఉండేది. అందువల్ల తొందరగా వెళితేగాని అవి దొరికేవి కాదు. కాఫీ తాగి వచ్చాక గదుల్లో కాసేపు మాటలు, రాజకీయ విషయాలపై చర్చలు, భావోద్వేగపరమైన వాదనలు జరిగేవి. కొందరు మాత్రం హాస్టలు రీడింగ్ రూమ్‌లో దినపత్రికలు, మ్యాగజైన్లు చదివేవారు. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా అక్కడే ఉండేవి. ఉదయం పదింటి నుండి సాయంత్రం 5 వరకూ క్లాసులు జరిగేవి. సాయంత్రం హాస్టలుకు తిరిగి వచ్చాక ఎక్కువమందికి బీచ్ కు తప్పకుండా వెళ్లేవారు. అందునా మొదటి ఏడాది వారికి సముద్రం అంటే చెప్పరానంత ఇష్టంగా ఉండేది. కొందరు ఆటలు ఆడుకునేవారు.

ఇంకొందరు హాస్టలు కిందనే కాలక్షేపం చేసేవారు. అక్కడ ఒక లౌడ్ స్పీకరుండేది, అది హాస్టల్ ఆఫీసు గదిలోని రేడియోకి అనుసంధానమై ఉండేది. అక్కడ విద్యార్థులు సేకరించిన 78ఆర్పీఎమ్ గ్రామఫోను రికార్డులుండేవి. వాటిని వినేవాళ్లం లేదంటే రేడియో సిలోన్ కేంద్రం వేసే హిందీ సినిమా పాటలు వినేవాళ్లం. ఏదైనా సాయంత్రం 5 నుంచి 7 వరకూ రేడియోనే శరణ్యం. కొందరు మాత్రం టౌనులోకి దాదాపు నాలుగైదు మైళ్లు నడిచి సినిమా థియేటర్లకు వెళ్లి, రాత్రి పదింటికి అలా గదులకు చేరుకునేవారు. వాళ్లకు రాత్రి భోజనాలను రూమ్మేట్లు జాగ్రత్త పెట్టేవారు. థియేటర్లు దూరం కనుక విద్యార్థులు ఒంటరిగా వెళ్లేవారు కాదు, ఎవరో ఒకరిని తోడు తీసుకునే వెళ్లొచ్చేవాళ్లు.

ఇక కొందరు విద్యార్థులు సాయంత్రం సిగరెట్లు కాల్చడానికి, కిళ్లీలు నమలడానికి యూనివర్సిటీ బయటకు వెళ్లేవారు. మరికొందరికి జాలరిపేట జీవితం చూడటం సరదాగా ఉండేది. అక్కడ శ్రమ విభజన స్పష్టంగా ఉండేది. మగవారు తెల్లవారకముందే వలలు తీసుకుని పడవల్లో సముద్రం మీదకు వేటకు వెళ్లేవారు. మధ్యాహ్నం కావొస్తుండగా వాళ్ల పడవలు చేపలతో తిరిగివచ్చేవి. వాళ్లు రాగానే వచ్చిన చేపలను విభజించడం, మార్కెట్టుకు తీసుకుని వెళ్లి అమ్ముకొని రావడం ఆడవాళ్ల పని. నెత్తి మీద గంపలు పెట్టుకుని వాళ్లు ఉరుకులుపరుగులతో బజార్లకు వెళ్లేవారు. చిన్నపిల్లలుంటే వారిని కూడా నడుముకు కట్టుకుని మరీ పరుగులు పెట్టేవారు. మగవాళ్లు మధ్యాహ్నాలు కాస్త మందు పుచ్చుకుని విశ్రమించేవారు. ఆడవారు అమ్మకాల తర్వాత రాత్రి తొమ్మిదింటికి అలా ఇల్లు చేరేవారు. తిరిగి వచ్చేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వచ్చేవారు. నోట్లో చుట్ట సాధారణం. అయితే వెలుగుతున్న వైపు నోట్లో పెట్టుకుని ‘అడ్డపొగ’ వెయ్యడం కేవలం ఉత్తరాంధ్ర పల్లె పడతుల్లోనే కానవచ్చేది.

వాల్తేరులో మరో విశేషం ప్రభుత్వ పిచ్చాసుపత్రి. అక్కడ చేరిన రోగులను హింసించే పద్ధతి చూస్తే, పగవారికి సైతం ఆ కష్టం వద్దనిపించేది. మనోవైకల్యం బారిన పడి అక్కడ చేరినవారిని ఇనుప గొలుసులతో కట్టెయ్యడం, ఒంటరిగా ఉంచి కొట్టడం వంటివి సర్వసాధారణంగా కనిపించేవి. చికిత్స పేరుతో వారి మీద జరిగే కౄరమైన పనులకు అంతుండేది కాదు. అక్కడ చేరినవారిలో ఒక్కరైనా బాగయి ఇంటికి వెళ్లారని వినడం అరుదే.

వాల్తేరులో మిగిలిన భాగమంతా వివిధ జమీందారుల బంగళాలు, భవనాలు కనిపించేవి. గంగాపూరు, కురుపాం, జయపురం, విజయనగరం రాజులు వేసవి విడిదులుగా ఏర్పాటు చేసుకున్న భారీ బంగళాలు అక్కడక్కడా ఉండేవి. వారందరికీ కలిపి ఒక విశాలమైన గోల్ఫ్ కోర్సు మైదానం ఒకటి ఉండేది. అక్కడ ఎవరూ ఆడగా చూసిన గుర్తు లేదు. అన్నిటిలోకూ పరమ సుందరమైనది ఏదంటే ఆనాటి బెంగాల్ – నాగపూర్ రైల్వే (అప్పటికింకా జోన్ పద్ధతి రాలేదు)వారి అతిథి గృహం. చాలా అందంగా ఉండేది, దాని నిర్వహణ కూడా పద్ధతిగా ఉండేది.

యూనివర్సిటీ మెయిన్ హాస్టలు నాలుగు భవనాల్లో విద్యార్థుల అమరిక ఒక క్రమపద్ధతి ప్రకారం ఉండేది. మొదటేడాది విద్యార్థులను యుద్ధ సమయంలో కట్టిన షెడ్లలో ఉంచేవారు. ఐదుగురికో గది. కాని గుడ్డిలో మెల్లలాగా వీటికి స్నానపు గదులు అటాచ్ డ్ గా ఉండేవి. 24 గంటలు నీళ్లొచ్చేవి. ఆ తర్వాత జూనియర్లను కిందన, సీనియర్లు పైన అన్నట్టుగా పెట్టేవారు. వాటిని చూస్తే, అక్కడున్న విద్యార్థుల ఏడాది తెలిసిపోయేట్టు ఉండేది వాతావరణం. ఉదాహరణకు కింద గదుల్లో సరదా మాటలు, చర్చలు, వాదోపవాదాలు నడుస్తుండేవి, కాని ఒకో అంతస్తూ పెరుగుతున్నకొద్దీ అవి తగ్గిపోయి సీరియస్‌నెస్ పెరిగేది. మూడో ఏడాది విద్యార్థులు చాలా సీరియస్ గా ఉండేవారు. మాట్లాడితే ఓ మార్కు పోతుందేమో అన్నంత గంభీరంగా ఉండేవారు. అర్ధరాత్రి దాకా చదువుతూనే ఉండేవారు. మార్చిలోనైతే పై అంతస్తులో ఓ నాణెం నేల మీద పడినా ఖంగుమని మోగేంత నిశ్శబ్దంగా ఉండేది.

హాస్టలు విద్యార్థుల్లోనూ గొప్ప వైవిధ్యం ఉండేది. చాలా తెలివైనవారుండేవారు. తరగతి గదుల్లోనే కాదు, మైదానంలోనూ, చర్చల్లోనూ అన్నింటిలోనూ చురుగ్గా ఉండేవాళ్లు కొందరు. రచయితలు కొందరు, కళాకారులు కొందరు, నటులు కొందరు – ఎవరిని కదిలించినా ఏదోక ప్రజ్ఞ బయటపడేది. కొద్దిమంది మాత్రం రోడ్డు పక్కన రోమియోల్లా కేవలం ఆడపిల్లల వెంటపడుతూ గడిపేసేవారు. యూనివర్సిటీలో పాలిటిక్స్, ఫిలాసఫీ, మేథమేటిక్స్, సాహిత్యం విద్యార్థుల సంఖ్య తక్కువ. న్యాయశాస్త్రం, ఆర్థికశాస్త్రాలు చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. మా బ్యాచ్ ఎకనమిక్స్ లో (1950 – 53) ఇంకా వైవిధ్యం ఉండేది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినవారు, రైతులు, న్యాయవాదులు, భూస్వాముల పిల్లలు, కొద్దిమంది వెనుకబడిన వర్గాల వారు… మొత్తమ్మీద విశ్వవిద్యాలయం ఎన్నో రంగుల ఇంద్రధనుస్సులా ఉండేది. జీవితంలోని అన్ని రంగులు, సమాజంలోని వైవిధ్యమంతా అక్కడ మాకు పరిచయమయ్యింది. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అవకాశాలను అన్వేషించడం – ఇటువంటివన్నీ జీవితానికి బాటలు వేశాయి. మాకు అన్నానికీ, నీళ్లకూ ఇబ్బందులున్నా అవి పెద్ద చికాకు పెట్టలేదు. ఆ మూడేళ్లలో విద్యార్థులు వ్యక్తులుగా ఎదిగేవారు. ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఒత్తిళ్లు, మలుపుల వల్ల వాళ్ల వ్యక్తిత్వం, భవిష్యత్తు ఒక పద్ధతిలోకి వచ్చేవి.

మొదటి ఏడాది విద్యార్థులకు చదువు భారం తక్కువగానే ఉండేది. మేం ఇంగ్లిషు, ఫ్రెంచ్ పాసవ్వాలి. అదే సైన్స్ విద్యార్థులకు ఇంగ్లిషు, జర్మన్ ఉండేవి. ఫ్రెంచ్, జర్మన్ – రెండింటినీ ఒకే టీచర్ చెప్పేవారు. ఆయన నవ్వు ముఖంతో ఉండేవారు, కాని ఎప్పుడూ ఆడపిల్లలపై ఓ కన్నేసి ఉంచేవారు. ఆ రెండు భాషలు ఎందుకు ఉపయోగపడతాయో మాకు తెలిసేది కాదు. అందుకని ఏడాదిలో ఏదో తూతూ మంత్రంగా నేర్చుకునేవాళ్లం. పరీక్షల్లో పాసేజీ ఇచ్చి అనువాదం చెయ్యమనేవారు. అది పుస్తకాల్లో అంతకుముందు ఉన్నదే. అందువల్ల అందరం ఏదోకటి రాసేసి అయిందనిపించేవాళ్లం. మంచి మార్కులు వచ్చేసేవి.

ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే దానర్థం – వాళ్లు తమ ప్రవర్తనతో ఆ టీచర్‌కు కోపం తెప్పించినవాళ్లయి ఉంటారంతే. వాళ్లను కూడా తర్వాత సెప్టెంబరులో ‘పోనీలే పాపం’ అని గట్టెక్కించేసేవాళ్లు. ఇంగ్లిష్ కూడా తక్కువ సిలబస్సే ఉండేది. ‘మోడర్న్ ఇంగ్లిష్ ప్రోజ్’ అని ఒక పాఠ్యపుస్తకం, జార్జి మెరిడిత్ రాసిన ‘ఎవాన్ హారింగ్టన్’ అనే ఒక పుస్తకం నాన్ డిటెయిల్ టెక్స్ట్ ఉండేది. ఇంగ్లిష్ క్లాసు వినడానికి లిబరల్ ఆర్ట్ కోర్సుల విద్యార్థులంతా ఒకచోటికి చేరేవారు. ఆ సమయం చాలా ఉత్సాహంగా ఉండేది. లెక్చరర్ కూడా చాలా ఉత్సాహంగా ఉండేవారు, ముందు కాస్త నవ్వించి, తర్వాత గంటపాటు పూర్తిగా పాఠం చెప్పేవారు.

ఎకనామిక్స్ లో ఏడాదికి ముప్ఫైమంది చొప్పున ఉండేవారు. అప్పట్లో అదే ఎక్కువ అనుకునేవారు. మా బ్యాచ్ లో ఆడపిల్లలు లేరు. ఫస్టియర్‌లో కొందరు వయసురీత్యా పెద్దవాళ్లు కూడా ఉండేవారు. ఒకాయన పెళ్లయి పిల్లలున్నవాడు, మరో ఎక్స్ సర్వీస్ మ్యాన్, వాళ్లు ఇతరులతో కలిసేవారు కాదు. ఎకనామిక్స్ విద్యార్థుల్లో రెండు రకాలుండేవారు. ఎకనామిక్ థాట్ ప్రత్యేక సబ్జెక్టుగా ఉన్నవారు ఒక వర్గం. మేథమేటికల్ ఎకనామిక్స్, స్టాటిస్టికల్ కంప్యుటేషన్స్ సబ్జెక్టులుగా ఉన్నవారు మరో వర్గం. ఈ రెండు సబ్జెక్టుల్లో మార్కులు తెచ్చుకోవడం సులభం. 90 శాతం వరకూ వస్తాయి. దానివల్ల మిగిలిన సబ్జెక్టులు తక్కువ వచ్చినా, వాళ్లకు ఫస్ట్ క్లాస్ అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఎకనామిక్ థాట్ వాళ్లకు ఆ పప్పులు ఉడకవు. వాళ్లు చచ్చినట్టు ఎనిమిది సబ్జెక్టులూ బాగా రాయాల్సిందే.

అది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర విభాగం పెనుమార్పులకు లోనవుతున్న కాలం.

1949 వరకూ ఎకనామిక్స్, సోషియాలజీ విభాగాల ప్రొఫెసరు, హెడ్ గా డాక్టర్ వి. ఎస్. కృష్ణగారుండేవారు. మేం చేరినప్పుడే ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అయ్యారు. డిపార్ట్ మెంటులో వేరే సీనియర్ ఎవరూ లేకపోవడం వల్ల ఆయనే గౌరవ హెడ్ గా కొనసాగేవారు. యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో పి.హెచ్. డి. చేశారాయన. ఫ్రీ మార్కెట్ల సామర్థ్యం పట్ల నమ్మకం ఉన్న అర్థశాస్త్రవేత్తలు మైజెస్, హయెక్ ల వద్ద ఆయన పి.హెచ్.డి. చేశారు. గొప్ప అధ్యాపకుడు అనే పేరుండేది ఆయనకు. కాని వీసీగా బాధ్యతలు పెరగడం వల్ల మాకు క్లాసులు చెప్పలేదు. లైబ్రరీకి తరచూ వచ్చేవారు. భారీ మనిషి, దానికి తగినట్టే నెమ్మదిగా నడిచేవారు. డ్రైవరు నడుపుతుండగా తళతళలాడే ఇంపోర్టెడ్ కారులో కూర్చుని వచ్చేవారు. వస్తూనే లైబ్రరీకి వెళ్లేవారు. పుస్తకాలు తీసుకుని మళ్లీ కారెక్కి తన ఆఫీసుకు వెళ్లిపోయేవారు. పాఠాలు చెప్పకపోయినా, సబ్జెక్టుకు సంబంధించి ఏం జరుగుతోందన్నది ఆయన నిత్యం తెలుసుకునేవారు, అధ్యయనం చేస్తూ ఉండేవారు. కొత్త పుస్తకాలు, ఆర్టికల్స్ ఫాలో అవుతూ ఉండేవారు. వాటికోసం ఆయనక్కొన్ని ప్రత్యేక ఏర్పాట్లుండేవి.

ఆరోజుల్లో మద్రాసు, మైలాపూర్ ప్రాంతంలో ఒక పెద్ద పుస్తకం దుకాణం ఉండేదట. మద్రాసు ప్రెసిడెన్సీ అంతటికీ అదే పెద్ద షాపు. దాని యజమాని కె. మహదేవన్ ఎవరికేది కావాలన్నా అందుబాటులో ఉంచేవారట. ఒకవేళ లేకపోతే తెప్పించి మెయిల్లో పంపేవారట. అలాగే అక్కడ క్యాష్ కౌంటర్, రిజిస్టర్ ఉండేవి కాదట. వచ్చినవారు కావలసినవి తీసుకొని ఆయన ఎంత చెబితే అంత ఇచ్చేసి వచ్చెయ్యడమే. అదొక దుకాణం కాదని, ప్రెసిడెన్సీకంతటికీ ఒక మేధో కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలని మహదేవన్ తపనపడేవారని అందరూ చెప్పుకొనేవారు. ఆయనకు డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు బాగా తెలుసు. అందువల్ల కావలసిన పుస్తకాలను పోస్టులో పంపేవారు. వి. ఎస్. కృష్ణగారికి వ్యక్తిగతంగా మంచి పుస్తకాలయం ఉండేదని చెప్పుకునేవారు.

అప్పట్లో యూనివర్సిటీ లైబ్రేరియన్ గా అబ్బూరి రామకృష్ణారావుగారుండేవారు. ఆయన కూడా చాలా హుందా అయిన పెద్దమనిషి. తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానమున్న వ్యక్తి. మొదటి ఏడాది విద్యార్థులతో డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు మాట్లాడకపోయినా, ఆయన నడవడిక నుంచి మేం ఎంతో స్ఫూర్తి పొందేవాళ్లం. లైబ్రరీని తరచూ సందర్శిస్తూ ఉండేవాళ్లం.

ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ లో సీనియర్ మోస్ట్ లెక్చరర్ భావరాజు సర్వేశ్వర్రావుగారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే డిగ్రీ చదువుకున్నారు. డాక్టరు వి. ఎస్. కృష్ణగారి విద్యార్థి. మేం చేరినప్పటికి ఆయన పై చదువుల కోసం విదేశాలకు అంటే ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మాకు పబ్లిక్ ఫైనాన్స్ సబ్జెక్టులో కొన్ని క్లాసులు తీసుకున్నారు. ఇటలీకి చెందిన ప్రసిద్ధ పబ్లిక్ ఫైనాన్స్ రచయిత – ఆంటోనియో డివిటి డి మార్కో వంటివారిని ఆయనే పరిచయం చేశారు. ఎకనామిక్స్ విద్యార్థులు ఏమేం చదవాలో నిర్ణయించింది సర్వేశ్వర్రావుగారు, వి. ఎస్. కృష్ణగారు. (రికమెండెడ్ రీడింగ్) వాటిలో అప్పటికి కొత్తగా వస్తున్న ధోరణులు, కొంత విప్లవాత్మకమైనవి సైతం ఉండేవి. ఉదాహరణకు మార్క్స్, ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోను వారు విద్యార్థులతో చదివించారు. జె. ఆర్. హిక్స్ రాసిన సోషల్ ఫ్రేమ్ వర్క్ అనే గ్రంధాన్ని చదివించారు. (చాలా ఏళ్ల తర్వాత నేను ఆయనను వ్యక్తిగతంగా కలిశాను. అది తాను రాసిన పుస్తకాల్లో అత్యుత్తమైనదని, అయితే దానికి రావలసినంత ప్రాచుర్యం రాలేదని ఆయన అన్నారు) సర్వేశ్వర్రావుగారి అపారమైన అనుభవం నుంచి మేమేమీ లబ్ధి పొందలేకపోయాం. మేం చేరిన కొద్దికాలానికే ఆయన ఇంగ్లండు వెళ్లిపోయారు, మళ్లీ మేం వెళ్లిపోయేముందు వచ్చారు, డిపార్ట్ మెంట్ పగ్గాలు చేపట్టారు.

అధ్యాపక బృందంలో మరో సీనియర్ ఎన్. వి. ఎ. నరసింహంగారు. రెండేళ్లలో ఆయన కూడా మా డిపార్ట్ మెంట్ వదిలి స్టాటిటిక్స్ విభాగానికి మారిపోయారు. యూనివర్సిటీలో అప్పుడే ఎమ్మెస్సీ స్టాటిటిక్స్ కోర్సును ప్రారంభించారు. ఆయన ఆలోచనాశీలి, లెక్చర్ మధ్యలో నిశ్శబ్దంలోకి జారుకునేవారు. ఎంతో విశ్లేషణాత్మకంగా, సిన్సియర్‌గా పాఠాలు చెప్పినప్పటికీ మా శ్రద్ధను పొందడంలో విఫలమయ్యారు. ఆయన నిశ్శబ్దమైపోతే, విద్యార్థులు దిక్కులు చూసేవారు. అందువల్ల ఆయన పాఠం చెప్పే తీరు పెద్ద స్ఫూర్తిదాయకంగా ఉండేది కాదు. అలాగని ఆయన సిన్సియారిటీ, సబ్జెక్టులో సామర్థ్యాలను శంకించడానికి లేదు. తర్వాత ఆయన హాలండ్ వెళ్లారు. ప్రొఫెసర్ టిన్బర్జెన్ పర్యవేక్షణలో డాక్టరల్ థీసిస్ రాశారు. మన దేశానికి మొట్టమొదటి ఎకనామెట్రిక్ మోడల్ రాసినది ఎన్.వి.ఎ. నరసింహంగారే. తిరిగివచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యంతో విభేదాలు వచ్చి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లిపోయారు.

కె.వి.ఎస్. శాస్త్రి మాకు మరో లెక్చరర్‌గా ఉండేవారు. ఎప్పుడూ సూట్ వేసుకుని దర్జాగా వచ్చేవారు. పొడుగ్గా హుందాగా ఉండేవారు, అప్పటికింకా అవివాహితుడు. మేథమేటికల్ ఎకనామిక్స్ లో నిష్ణాతుడు. ఆయన పట్ల అందరికీ ఒక సానుకూల, ఆశావహ దృక్పథం ఉండేది. క్లాసులు పాఠం చెబుతున్నప్పుడు మాత్రం ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, విద్యార్థులు ఎవ్వరివైపూ చూడకుండా అలా చెప్పుకుంటూ పోయేవారు. ఫలితం – ఆయన చెబుతున్న సబ్జెక్టు పట్ల మాలో ఎవ్వరికీ ఆసక్తి ఉండేది కాదు. మా మూడేళ్ల చదువు ముగిసేనాటికి ఆయన కూడా బ్రిటిష్ కౌన్సిల్ ఫెలోషిప్ మీద ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిపోయారు. అక్కడ సాక్షాత్తూ లేడీ హిక్స్ పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశారు. తనకిష్టమైన ఎకనామిక్ థియరీని వదిలేసి పబ్లిక్ ఫైనాన్స్ వైపు వెళ్లారు. మరీ ముఖ్యంగా ఫెడరల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా సబ్జెక్టును విస్తృతంగా అధ్యయనం చేశారు.

తిరిగి వచ్చిన తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ అధిపతిగా చేరారు. ఆయన ఆకస్మికంగా మరణించకుండా ఉండి ఉంటే, ఆయన విస్తృతమైన జ్ఞానం కొంతయినా భావి తరాలకు అందేదేమో. ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. ఆయనకు పి.జి.వుడ్‌హౌస్ నవలలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర వుడ్ హౌస్ నవలలు చాలా ఉండేవి. ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు అందులో తనను ఆకట్టుకున్న భాగాలు మాకు చెప్పి ఆనందించేవారు. నాకు పి.జి.వుడ్‌హౌస్ పేరు, రచనలు పరిచయమయ్యాయంటే ఆయన వల్లనే.

ఆంధ్రా యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో మరో ఇద్దరు లెక్చరర్లుండేవారు. వారిలో ఒకరు వి. జగన్నాధం. ఆయన మాకు లేబర్ ప్రాబ్లమ్స్ చెప్పేవారు. ఇంటర్నల్ పరీక్షల్లో నాకు తొలిసారి ఫస్ట్ మార్కులిచ్చినది ఆయనే. కాని చదువుపరంగా ఆయన ఎకనామిస్ట్ కాదు. పొలిటికల్ సైన్సు, న్యాయశాస్త్రం చదివి వచ్చారాయన. మాది ‘ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ’ విభాగం గనక ఆ రెండో భాగానికి ఆయన ప్రతినిధిగా ఉండేవారు. అద్భుతమైన అధ్యాపకులు ఆయన. లేబర్ రిలేషన్స్ గురించి అధ్యయనం చెయ్యమని ప్రోత్సహించేవారు. తర్వాత హోలండ్ లో పి.హెచ్.డి. చేశారు, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేరారు, కాలక్రమంలో దానికి డైరెక్టర్ అయ్యారు.

మాకు మరో లెక్చరర్ డి.వి.రమణగారు. ఆయన యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ లో చేరి ఏడాదే అయ్యింది. కష్టపడి పనిచేసేవారు, బోధన అంటే పంచప్రాణాలుగా ఉండేవారు. క్లాసుకు చాలా గొప్పగా ప్రిపేరయివచ్చేవారు, అలాగే చెప్పేవారు కూడా. కాని ఆయన నిరుపేదలని ఆయన బట్టలు చూస్తేనే తెలిసిపోయేది. కాని అది ఆయన ప్రతిభకు, సిన్సియారిటీకి అడ్డురాలేదు. కుటుంబ పోషణ కోసం ఆయన రెండేళ్లు చదువు ఆపేసి రేషనింగ్ డిపార్ట్ మెంట్ లో క్లర్కుగా పనిచేశారట. ఆయన పట్టుదల, శ్రమ మా అందరికీ ఎంత స్ఫూర్తినిచ్చేవో చెప్పడానికి మాటలు చాలవు. విద్యార్థులతో మరీ కలివిడిగా కాకుండా కాస్త దూరంగానే ఉండేవారు. కాని ఆయన మాకు ఉన్నత అవకాశాల గురించి, యూనివర్సిటీ పరిధి దాటి ఆలోచించడమూ నేర్పించారు. మేం ఎకనామిక్స్ నేర్చుకున్నామంటే అది ఆయన కృషివల్లనే అని చెప్పవచ్చు.

జేమ్స్ హిల్టన్ నవలలోని మిస్టర్ చిప్స్ కారెక్టరులాగా ఆయన మాకు గొప్ప స్ఫూర్తినిచ్చేవారు. ముభావంగా ఉన్నా, మాపట్ల ఆయన అభిమానం మాకు తెలుస్తూనే ఉండేది. అధ్యాపకత్వం, మేధోపరమైన బాధ్యతలు తప్ప మరేదీ పట్టని రుషివర్యునిలాగా ఉండేవారు డి.వి.రమణగారు. మా చదువు ముగిసే సమయానికి ఆయన అమెరికాలోని షికాగో యూనివర్సిటీలో చేరారు. మిల్టన్ ఫ్రెడ్ మాన్ ఆధ్వర్యంలో పిహెచ్.డి. చేసిన తొలి భారతీయుడు ఆయనే. ఇలా స్టడీ లీవ్ పొందినవాళ్లు ఆంధ్రా యూనివర్సిటీకి తిరిగివచ్చి ఐదేళ్లు తప్పకుండా పనిచెయ్యాలన్న నిబంధన ఉండేది. దానివల్ల విద్యార్థులకు చాలా మేలు జరిగేది.

డి.వి.రమణగారు అలాగే తిరిగి వచ్చి ఐదేళ్లు క్లాసులు చెప్పారు. తర్వాత బ్యాంకాక్ లోని ఆసియన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ లో ఉన్నత అధికారిగా వెళ్లారు. నేను పెద్దయ్యాక ఆ ఇనిస్టిట్యూట్ కు నన్ను ఆహ్వానించారు ఆయన. ఆ సందర్భంలో ప్రసంగిస్తూ నేను, నా సహాధ్యాయులమందరం ఏయే స్థాయుల్లో ఉన్నప్పటికీ అదంతా ఆయన మాపట్ల పెట్టిన శ్రద్ధకు తార్కాణమని, మేమంతా ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పాను. అటువంటి కృతజ్ఞత నా ప్రసంగంలో ఊహించని ఆయనకు కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆంధ్రా యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ లో అందరికన్నా చిన్నవారు కె.వి.రమణ అనే లెక్చరర్. ఆయన అప్పుడే చదువు పూర్తిచేశారు. ఫ్యాకల్టీ మెంబరుగా, రీసెర్చి స్కాలర్‌గా రెండు రకాలుగా ఆయన నియామకం జరిగింది. ఆయన మాకు క్లాసులు చెబుతూ బోధన నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. కాలక్రమంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, విద్యార్థుల ఎదుట సునాయాసంగా ప్రసంగించే ధైర్యం సంపాదించుకున్నారు. పొరపాట్లు చేసినా, విద్యార్థులతో మంచి సాన్నిహిత్యం ఉండేది కనుక మేమెవ్వరం వాటిని పట్టించుకునేవాళ్లం కాదు. డిపార్ట్ మెంట్ లో ఇతర అధ్యాపకులందరూ ఆయనకు సీనియర్లు, టీచర్లు. అందువల్ల ఆయన వాళ్లతో కన్న, మాతో కలివిడిగా ఉండేవారు. ఎప్పుడైనా కొత్తగా పెట్టిన ఇండియా కాఫీ హౌస్ కు మాతో వచ్చి కాఫీ తాగి వెళ్లేవారు.

మొత్తమ్మీద విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగం అప్పుడప్పుడే ఒక కొలిక్కి వస్తున్నట్టుగా ఉండేది. అందులో రెండు సంప్రదాయాలుండేవి. వాటిని పాటించడంలోని మంచిచెడ్డలు విభాగాన్ని ప్రభావితం చేసేవి. మొదటిది – అక్కడ చదివి పట్టభద్రులైనవారినే అధ్యాపకులుగా నియమించడం (ఇన్ బ్రీడింగ్) అనేదొక సంప్రదాయంగా స్థిరపడింది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్లు కూడా ఏయూ పూర్వ టీచర్లే. దీనివల్ల బయట ఆర్థికశాస్త్రంలో జరుగుతున్న పరిణామాలేమిటో, ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో ఏం జరుగుతోందో ఇక్కడి అధ్యాపకులకు పెద్దగా తెలిసేది కాదు.

రెండోది క్లాసు మీద కంట్రోలుండాలనే భావన. అందరికీ పాఠం బాగా చెప్పాలని, విద్యార్థుల అభిమానం చూరగొనాలనే ఉంటుంది. కాని కొంతమంది దానిలో విఫలమయ్యేవారు. కాని విద్యార్థులు దాన్ని పరిగణనలోకి తీసుకునేవారు కాదు. దానికో బలమైన కారణం ఉంది.

యూనివర్సిటీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి రాసిన జవాబు పత్రాలను అక్కడి అధ్యాపకులు ఒకసారి, (ఇంటర్నల్) వేరే యూనివర్సిటీ అధ్యాపకులు మరోసారి (ఎక్స్ టర్నల్) దిద్దేవారు. ఆ రెండింటి సగటు మార్కులు విద్యార్థికిచ్చేవారు. వాళ్లిద్దరి మార్కుల మధ్య తేడా ఒక్క శాతాన్ని మించితే మరో యూనివర్సిటీ లెక్చరర్ కు ఇచ్చి మూడోసారి దిద్దించేవారు. దీనివల్ల విద్యార్థికి న్యాయం జరిగేది. నిజానికి ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే అధ్యాపకుడికి మా ఫలితాలను ప్రభావితం చెయ్యగలిగిన అధికారం ఉన్నట్టే. వార్షిక పరీక్షల్లో మా గ్రేడ్ నిర్ణయించే కీలక పాత్ర వారిదే. దీనివల్ల విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పట్ల భయం ఉండేది. లెక్చర్ బాగలేకపోయినా, ఆసక్తికరంగా ఉండకపోయినా కూడా విద్యార్థులు సర్దుకుపోయేవారు. ఎదిరించి మాట్లాడేవారు కాదు. అలా మాట్లాడితే ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని భయపడేవారు. కొన్నిసార్లు, కొందరు విద్యార్థులు విషయంలో అది నిజమైనట్టు లీలగా తెలుస్తూనే ఉండేది. కాని సాధారణంగా అధ్యాపకులు విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండేవారు, వారి ఉన్నతి కోరుకునేవారు.

ఈ రెండు సంప్రదాయాల వల్ల ఏం నష్టం జరిగిందనేది విభాగం పరిశోధనల విషయంలో తేటతెల్లమయింది. అప్పటికి యూనివర్సిటీ పెట్టి 22 ఏళ్లు అయినా, డాక్టర్ వి. ఎస్. కృష్ణగారికి తప్ప మరొకరెవరికీ పీహెచ్.డి.లు లేనేలేవు. అన్నేళ్లలో ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినది ఒకే ఒక విద్యార్థి. అదికూడా ప్రొఫెసర్ల గైడెన్స్ కన్నా, ఆ విద్యార్థి శ్రద్ధాసక్తులకు లభించిన ప్రతిఫలం అని అందరికీ తెలుసు. ఆయన పేరు వి. వి. రామనాథం. తర్వాత ఆయన ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీల్లో పలు ప్రశంసలు, ఉన్నత స్థానాలు అందుకున్న అధ్యాపకుడిగా రాణించారు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో నిపుణుడు. బోలెడన్ని పరిశోధన పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆ విభాగం నుంచి రెండో పిహెచ్డి లభించినది 1954లో డి. ఎల్. నారాయణ అనే విద్యార్థికి. తర్వాత ఆయన తిరుపతి యూనివర్సిటీకి వెళ్లారు.

సైన్సు విభాగాల్లో ప్రతి ఏడాదీ కనీసం రెండు పి.హెచ్.డి.లు వస్తూ ఉండగా, ఎకనామిక్స్ విభాగం మాత్రం ఈ విషయంలో ఎడారిలాగా ఉండేది.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఈ సంప్రదాయాల్లో కొంత మార్పు తీసుకురావాలని ఆలోచించి ఆచరణకు శ్రీకారం చుట్టింది. ఆ మార్పులు మా పాలిట వరాలయ్యాయి. డాక్టర్ వి. ఎస్.కృష్ణ వీసీగా, భావరాజు సర్వేశ్వర్రావు పై చదువులకు వెళ్లిపోయాక, ఎకనామిక్స్ విభాగం అధిపతిగా బయటివారిని మూడేళ్ల కాలవ్యవధికి నియమించాలన్న నిర్ణయం వాటిలో మొదటిది.

అలా వచ్చిన వ్యక్తి ఎమ్.హెచ్.గోపాల్. ఆయన మైసూరుకు చెందిన వ్యక్తి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పనిచేసేవారు. అప్పుడప్పుడే ఆ సంస్థ పాకడం నుంచి నడవడం వైపు అడుగులేస్తోంది. పొడుగ్గా, నవ్వు ముఖంతో ఉండే గోపాల్ గారు హుందాగా ఉండేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పిహెచ్డీ పట్టా పొందిన ప్రతిభాశాలి. అప్పటికే కొన్ని పుస్తకాలు కూడా రాసి ఉన్నారు.

డిపార్ట్ మెంట్లో మిగిలినవారి కన్న భిన్నంగా నిత్యం ఉత్సాహంగా, చలాకీగా ఉండేవారు. విద్యార్థులుగా మేం ఆత్మవిశ్వాసంగల వ్యక్తులుగా ఎదగాలని, సొంత ఆలోచనలను నిర్మించుకుని మంచి కెరీర్ కు బాటలు వేసుకోవాలని ఎప్పుడూ చెబుతుండేవారు. వాల్తేరు అనేది అందమైన ప్రదేశమేగాని, మేధోపరమైన, రాజకీయపరమైన పవనాలేమీ సోకని మారుమూల ప్రాంతమని ఆయన తరచూ అనేవారు. మేం ఆ వలయాన్ని మించి ఎదగాలని చాలా అభిలషించేవారు. ఆయనకు సంప్రదాయ వైఖరి పడేది కాదు. విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, మంచి క్రీడాకారులుగా, చర్చాకారులుగా, రాజకీయపరంగా అన్ని విషయాలూ తెలుసుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఎదగాలని కోరుకునేవారు. ఆయన గైడెన్స్ మాకు గొప్ప వరంగా అనిపించేది. జీవితాన్ని ఆయన చూసే తీరు మాకు అబ్బురంగా అనిపించేది. అవకాశం వచ్చినప్పుడు మేం పై చదువులకు ఢిల్లీని ఎంచుకున్నామంటే అది ఆయన ప్రభావమేనని నేను గట్టిగా చెప్పగలను. మా శక్తిసామర్థ్యాలను మేం తెలుసుకునేలా చెయ్యడంలో ఆయన పోషించిన పాత్ర అమోఘమైనది, ఎప్పటికీ మరపు రానిది.

*****

కాలం కొంత గడిచేసరికి, మొదట్లో ఇబ్బంది పెట్టిన ఆహారం, నీళ్ల సమస్యలతో మేం సర్దుకుపోగలిగాం. విదేశాలకో, సుదూరతీరాలకో వెళ్లేవారికి తిండి, వాతావరణం వంటివి అన్నీ సమస్యలుగానే ఉంటాయి. ఎముకలు కొరికే చలి, తీవ్రమైన మంచు, మాడ్చేసే ఎండలు – ఇటువంటివాటితో పోలిస్తే, మన సమస్యలు అసలు సమస్యలే కాదు అనిపిస్తుంది.

నెమ్మదిగా ఆంధ్రా యూనివర్సిటీ హాస్టలుకు అలవాటు పడ్డాం. మాదైన ఒక రోజువారీ రొటీన్ రూపుదిద్దుకుంది. అప్పట్లో హాస్టల్లో మాకు మంచాలుండేవి కాదు. మొదట్లో చాపలు వేసుకుని గోడకు దగ్గరగా తలగడ పెట్టుకుని పడుకునేవాళ్లం. దానికి మేం ఊహించని కష్టం ఎదురైంది. అక్కడు నల్లులు పుష్కలంగా ఉండేవి. మాకు కాస్త కునుకు పట్టే సమయానికి అవి వాటి ప్రతాపాన్ని చూపించేవి. అర్థరాత్రి లేచి వాటిని చంపే కార్యక్రమం పెట్టుకునేవాళ్లం. కాని ఆ యుద్ధం సమఉజ్జీల మధ్య కాదని మాకు త్వరగానే అర్థమైపోయింది. వాటి ముందు మేం తరచూ ఓడిపోయేవాళ్లం. దాంతో చాపలు వదిలేసి ఓ దుప్పటి పరుచుకుని పడుకోవడం అలవాటు చేసుకున్నాం.

ఇటువంటి రోజువారీ చికాకుల నుంచి బయట పడేందుకు కొన్ని మార్గాలుండేవి. వాటిలో మొదటిది యంగ్ సోషలిస్ట్ లీగ్ సమావేశాలు. అది సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యువజన విభాగం. దానిలో ఎక్కువగా ఆర్థిక శాస్త్ర విద్యార్థులే ఉండేవారు. సాయంత్రాలు తరచూ కలిసేవారు. రాజకీయ విశేషాల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగేవి. నేను ఆ సమావేశాలకు వెళ్లేవాణ్ని. ఆ పార్టీ పట్ల నిబద్ధత ఉండి కాదు, చాలామంది నా క్లాస్ మేట్లు వెళుతూ ఉండేవారని నేనూ వెళ్లడం అంతే. రొటీన్ నుంచి కాస్త పక్కకు వెళ్లే వీలుంటుందని.

ఇటువంటిదే మరొకటి – హాస్టల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు. వాటిలో నా మనసులో నిలిచిపోయింది ఒకటుంది. అదేమంటే మహాకవి శ్రీశ్రీ వచ్చి తన కవిత్వాన్ని చదివి వినిపించడం. ఒకనాటి ఉదయాన్నే హాస్టల్ రీడింగ్ రూములో ఆ కార్యక్రమం జరిగింది. నేను ఇంటర్లో ఉన్నప్పుడే ఆయన కవిత్వాన్ని ఓ క్లాస్మేట్ నాకు పరిచయం చేశాడు. అది నన్ను బలంగా ఆకర్షించింది. చాలా శీఘ్ర గతిలో ఉండే ఆయన కవిత్వాన్ని పెద్ద గొంతుతో పాడితే చాలా బాగుంటుందేమో అనిపించింది. అందువల్ల ఆయన స్వయంగా వస్తారంటే నేను ఉత్సాహంగా సమావేశానికి వెళ్లాను. కాని ఆయన తన కవిత్వాన్ని చదివిన తీరు నన్ను ఆకట్టుకోలేదు. చాలా లోగొంతుక, అదొకలాంటి పీల స్వరంతో ఆయన చదవడం వల్ల ఆ ఉద్యమ పదును కవిత్వంలోంచి మాయమైపోయినట్టు అనిపించింది. ఒక గొప్ప వ్యక్తి చేతిలో మోసపోయిన వాళ్లలాగా ఉసూరుమంటూ తిరిగివచ్చాం గదులకు.

రాజకీయ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కాక మాకున్న మరో కాలక్షేపం సినిమాలు. మూడు గంటలు సినిమా చూస్తే మూడు రోజుల పాటు వాటిలోని మంచీచెడూ మాట్లాడుకునే వీలుండేది.

యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్ మెంటులో అధ్యాపకులు చదువులకు, విదేశాలకు రాకపోకలు సాగిస్తుండటంతో క్లాసుల కన్నా లైబ్రరీలోనే మా సమయం ఎక్కువ గడిచేది. కనిపించిన పుస్తకాలన్నీ చదవడంలో నిమగ్నమయ్యేవాళ్లం. పాఠ్యపుస్తకాల కన్నా, బెన్ హామ్, కానన్, విక్సెల్, మార్షల్ టౌసిగ్… ఇటువంటి అర్థశాస్త్రజ్ఞులు రాసినవి చదవడం ఒక్కటే పని. వారి అభిప్రాయాల్లో, దృక్పథాల్లో భేదాలను గమనించడం మాకు వచ్చేది కాదు. మార్షల్స్ ప్రిన్సిపుల్స్ మాకు పాఠ్యపుస్తకం. కాని మేం సామ్యూల్ సన్స్ ఎకనామిక్స్ చదివేవాళ్లం. అప్పటికది కొత్త పుస్తకం. ఎకనామిక్స్ లో అది ఆవిష్కరించిన నూతన మార్గాల గురించి మాకేం తెలియదు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదువుకుంటూ పోయేవాళ్లమంతే. మేథమేటికల్ ఎకనామిక్స్ విద్యార్థులు ఆర్ జి డి అలెన్, జె.ఆర్. హిక్స్ పుస్తకాలతో ప్రారంభించేవారు. మేక్రో ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్ అప్పటికి సుదూర భవిష్యత్తులో కూడా లేవు.

ఇలా చదువుకుంటూ రెండో టెర్మ్ అంటే డిసెంబరుకు వచ్చేశాం. కాన్వొకేషన్ – స్నాతకోత్సవం జరగబోతోందన్న వార్తతో యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్త ఉత్సాహం అలముకుంది. దాన్ని డిసెంబరు తొలి వారంలో తలపెట్టారు. అప్పటికి కాన్వొకేషనుకు ప్రత్యేకంగా హాలంటూ ఏదీ లేదు క్యాంపస్ లో. ఆరుబయటే నిర్వహించాలనుకున్నారు. రాష్ట్రానికి లేదా ప్రావిన్సుకు గవర్నరు యూనివర్సిటీ ఛాన్సలరుగా వ్యవహరిస్తారు గనక వారిని ఆహ్వానించారు. అంతా సన్నద్ధమయ్యాక, ఆవేళ్టికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. హోరున గాలి, జోరున వర్షం. అంతా రసాభాస అవుతుందన్న ఆదుర్దాలో పెద్దవారున్నారు. మా ఉత్సాహాన్ని అవేమీ తగ్గించలేకపోయాయి. ఆ రోజున పట్టాలు పొందుతున్నవారు అఫిలియేటెడ్ కాలేజీలవారు. వాళ్లు యూనివర్సిటీ క్యాంపస్ కు రావడం అదే తొలిసారి. వాళ్ల రంగురంగుల గౌన్లు, హుడ్స్ ప్రాంగణాన్ని శోభాయమానం చేశాయి. మొత్తానికి ఆ కార్యక్రమం అనుకున్నట్టుగానే జరిగింది.

దాని తర్వాత అర్థ సంవత్సర పరీక్షలు, ఆ తర్వాత వారం పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రతిరోజూ సాయంత్రం ప్రఖ్యాత వ్యక్తులు, రచయితలు, రాజకీయ నాయకుల ప్రసంగాలుండేవి. తెన్నేటి విశ్వనాధంగారు యూనివర్సిటీకి చాలాసార్లు వచ్చి ప్రసంగించేవారు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక శాఖామాత్యులుగా వ్యవహరించేవారు. ఆయన ధారాళంగా ప్రసంగించే తీరు మమ్మల్ని అబ్బురపరిచేది. దానికి ఆయన హాస్యచతురత కొంత కారణం. ఆయన బుర్రలో ఎన్ని విషయాలుండేవంటే, అసలు ఆయనకు తెలియని విషయాలుంటాయా అన్నంత ఆశ్చర్యంగా ఉండేది మాకు. ఎన్నిసార్లు విన్నా, ఇంకా వినాలనేలాగ ఉండేది ఆయన ఉపన్యాస శైలి. చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉండే నాయకుడాయన.

ప్రసంగాల తర్వాత ఒక నాటిక తెలుగు, మరొకటి ఇంగ్లిషులో ఉండేది. వీటిలో యూనివర్సిటీ విద్యార్థులు, అఫిలియేటెడ్ కాలేజీల విద్యార్థులు పాల్గొనేవాళ్లు. డిబేట్లు, పాటల పోటీలు – ఒకటేమిటి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అంతా బయటకు వచ్చే సమయం అది.

ఈ డ్రామా కార్యకలాపాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె. వి. గోపాలస్వామి పర్యవేక్షించేవారు. ఆయన తండ్రి బ్రిటిషు ప్రభుత్వంలో ఒక ప్రాంతానికి గవర్నరుగా పనిచేశారు. గోపాలస్వామిగారు ప్రఖ్యాత విద్యాలయాల్లో చదువుకున్నారు, లండన్ వెళ్లి ఐ.సి. ఎస్ చదవాలనుకున్నారు. కాని ఆర్థిక మాంద్యం వల్ల బార్ ఎట్ లా పట్టాతో తిరిగి వచ్చేశారు. పట్టా ఉన్నా, ఆయన మనసుకు న్యాయవాద వృత్తి అంతగా పట్టలేదు. దాంతో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్లు వార్ టైమ్ షెడ్స్ లో నివాసం ఉండేవారు. చాలా భారీ మనిషి. తెలుగు నాటకాలంటే మక్కువ. పీవీ రాజమన్నార్, ఆత్రేయ, ఆమంచర్ల గోపాలరావు వంటి రచయితలంటే ఆయనకు ఇష్టంగా ఉండేది. వాళ్లు రాసిన సరికొత్త నాటికలను ఆయన విద్యార్థులతో ఈ సందర్భంగా ప్రదర్శింపజేసేవారు. ఆయన ప్రతిభావ్యుత్పత్తులు – అటు వాటిలో పాల్గొనేవారికి, ఇటు చూసేవారికి కూడా కొత్త ఆలోచనలను తెరుచుకునేలా చేసేవి.

ఆ తర్వాత యూనివర్సిటీకి క్రిస్టమస్ సెలవులిచ్చారు. నా జీవితంలో పెద్ద మలుపులు రానున్నాయని అప్పుడు నాకు తెలీదు. నేను మామూలుగానే ఇంటికి వెళ్లిపోయాను. మొదట కొన్ని రోజులు బాగానే గడిచింది. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తీవ్రమవుతూ వచ్చింది. పగలు కూడా పోలీసుల సోదాలు పెచ్చుమీరాయి. గ్రామీణుల్లో ఎవర్ని సందేహించాలో, ఎవర్ని నమ్మాలో తెలియక అందర్నీ చితకబాదడం మొదలుపెట్టారు. ప్రజలు భయంతో నలిగిపోయారు. అటు ఉద్యమస్ఫూర్తి గల కమ్యూనిస్టు పార్టీ, ఇటు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసు వ్యవస్థ – రెండూ వారిని ఇబ్బందుల పాల్జేశాయేగాని, అభివృద్ధినివ్వలేదు. దాంతో ప్రజలకు రెండింటి పట్లా విముఖత కలిగింది. ఉన్నదానిలో అంతోఇంతో కమ్యూనిస్టు దాడులే నయమనుకునేవారు, ఎందుకంటే వార కేవలం సంపన్నులనే లక్ష్యం చేసుకుంటారు తప్ప సామాన్యులను కాదు.

కొద్దిరోజుల తర్వాత ఒక రాజకీయ సభలో పాల్గొన్న మా నాన్న నూజివీడులో తన బసకు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడి సెవెంత్ డే ఎడ్వెంటిస్టు హాస్పిటల్లో చేర్పించారు ఆయనను. అమెరికన్ వైద్యుడు డాక్టర్ ఆలివర్ చికిత్సనందించారు. వార్త తెలిసినవెంటనే మేమంతా వెళ్లాం. మధుమేహం ఎక్కువ కావడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కొద్ది రోజుల్లో స్పృహ వచ్చింది. పూర్తిగా విశ్రాంతి అవసరమైంది. కాస్త నయమయ్యేదాకా ఆయన్ను కదపకుండా మేం అక్కడే ఉన్నాం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక నేను కాస్త ఆలస్యంగా యూనివర్సిటీకి ప్రయాణమయ్యాను. కాని మా నాన్న ఆ తర్వాత పూర్వపు మనిషి కాలేకపోయారు. తనను తాను పరామర్శించుకుంటూ, సమీక్షించుకుంటూ అంతర్ముఖులుగా మారిపోయారు. మా పట్ల ఆయనలోని ఆప్యాయత మాత్రం అప్పుడు బయటకు తెలిసేది.

యూనివర్సిటీకి వచ్చాక నేను రొటీన్ లో పడ్డాను. సంవత్సరాంత పరీక్షలను ప్రిలిమ్స్ అనేవారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ ముఖ్యం. ఇంగ్లిష్ లో మొదటి మార్కు సాధించినవారికి స్టాన్లీ ప్రైజు అని ఇచ్చేవారు. కొందరు దాన్ని సాధించాలనే లక్ష్యంతో సీరియస్ గా చదివేవారు. ఎందుకనో నేను అటువంటి లక్ష్యమే పెట్టుకోలేదు. నా చదువు సాధారణంగా సాగేది.

మార్చి నెల వచ్చేసింది. గాలిలో వేడి, అటు పరీక్షల టెన్షన్ పెరుగుతున్న వేళ మా నాన్న వాల్తేరుకు వచ్చారు. మూడు రోజులున్నారు. ఆయన వచ్చిన రోజే ఓ వార్త తెలిసింది. అదేమంటే కమ్యూనిస్టు పార్టీలో కార్డు హోల్డరుగా ఉన్న ఆయన మేనల్లుడొకరు పోలీసు ఎన్ కౌంటర్లో మరణించాడని. నేను దాన్ని ఆయనకు చూపించినప్పుడు మా నాన్న ఏమీ చలించలేదు. అయ్యో అని ఊరుకున్నారంతే. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకు తర్వాత తెలిసిందేమంటే పోలీసులు అతని విషయంలో మా నాన్నను ముందే పిలిచి మాట్లాడారు. అతన్ని ఆస్పత్రికి పంపి, ఈ తరహా వార్త విడుదల చేస్తామని, అతను బతికున్నట్టు తల్లిదండ్రులకు, భార్యకు సైతం తెలియనివ్వకూడదని మాట తీసుకున్నారు. దానికి నాన్న అంగీకరించారు. ఆ వ్యక్తి తర్వాత సుదీర్ఘ కాలం జీవించాడు, రాజకీయాల్లో సైతం రాణించాడు, కాంగ్రెసు పార్టీ సభ్యుడిగా! తన తోటి కామ్రేడ్ల ఆచూకీ, ఇతర గుట్టుమట్లు అన్నీ బహిర్గతం చేసినందుకు ఆయనకు దక్కిన బహుమానం అది. తన సహచరుల గురించి ఎంత చక్కగా చెప్పాడంటే, ఆయన ఇచ్చిన వివరాల వలన దాదాపు ఓ ఇరవై మంది ఎన్ కౌంటరయిపోయి ఉంటారు. జీవితాలకేం విలువ ఉన్నదో లేదో తెలియదుగాని వాళ్ల చావులు పలికిన ధర ఈ వ్యక్తి జీవితం. విలువలను వదులుకోవడం అంటే ఏమిటో నాకు అర్థమయినదప్పుడే.

ఆ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చాం. మా రెండో అన్నయ్య మధురప్రసాద్ జీవితంలో మార్పులకు శ్రీకారం చుట్టుకున్నది అప్పుడే.

మా నాన్న తాను కష్టపడి పనిచెయ్యగలిగే కాలం అయిపోతున్నదని గ్రహించారు. కాని మా చదువులు పూర్తి కావాలంటే ఆర్థిక సాయం అవసరం. అప్పట్లో మగపిల్లల పెళ్లి దానికో మార్గం. వరుడి చదువు పూర్తిచేసేందుకు తగిన డబ్బు ఇస్తామని, దాన్నే కట్నంగా భావించాలని కోరేవారు వధువువైపు వారు. అటువంటి భరోసా ఇచ్చే కుటుంబం దొరికితే మా అన్న చదువు పూర్తవుతుందని మావాళ్లు అనుకున్నారు. కాని దానికి మాకు అడ్డంకులున్నాయి.

మా అన్నకన్న పెద్దది మా రెండో అక్కయ్య కృష్ణకుమారి. ఆమె అప్పటికే ఎమ్మే బియ్యూడీ పూర్తిచేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు పెళ్లి కాకుండా ఈయనకు చేస్తే సమాజం ఆక్షేపిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి ముందు జరగాలి. తనకు తగిన వరుడి కోసం మా నాన్న బోలెడు ప్రయత్నాలు చేశారు. కాని మేం కట్నం ఇవ్వలేని కుటుంబం కావడం వల్ల, ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడం వల్ల ఏ సంబంధమూ కుదిరేది కాదు. కొందరికి వయసు పట్టింపు, మరికొందరికి కట్నం ముఖ్యం, ఇంకొందరికి చదువు ఉండేది కాదు.

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మా నాన్నకు అర్థం కాలేదు. ఒకవైపు క్షీణిస్తున్న తన ఆరోగ్యం బెంగ పెట్టేది. వాస్తవానికి కట్నం ఇవ్వడం, తీసుకోవడం – రెండూ ఆయన దృష్టిలో హీనమైనవే. వాటిలో ఏది చేసినా తాను నమ్మిన విలువలను వదులుకున్నట్టే. కాని విలువల మీద ఆర్థిక అవసరాలే నెగ్గాయి.

ఆ వేసవిలో మా అన్న పెళ్లి నిశ్చయమయ్యింది. వధువుకు తల్లి లేదు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. రెండు వివాహాల నుంచి అధిక సంతానం. అయితే తల్లి పేరిట ఉన్న పొలాలు ఈ అమ్మాయికి ఇచ్చేందుకు, అవి మా అన్న చదువుకు ఉపయోగపడేట్టు ఒప్పందం కుదిరింది. మా అన్న పెళ్లికి బంధుబలగం అంతా వచ్చారు. చాలాకాలం తర్వాత కుటుంబంలో శుభకార్యం జరుగుతున్నందుకు అందరిలోనూ ఉత్సాహం పొంగింది. అయితే, అందరిలోనూ అక్క పెళ్లి కాలేదన్న బాధ సూదిలాగా గుచ్చుతూనే ఉంది. పెళ్లి తర్వాత మా రెండో వదిన కూడా మా ఇంట్లో సభ్యురాలయ్యింది.

*****

రెండో ఏడు క్లాసులు మొదలయ్యాయి. నేను యూనివర్సిటీకి తిరిగి వచ్చేశాను. నా జీవితానికి సంబంధించినంత వరకూ ఆ ఏడు పెద్ద చెప్పుకోదగిన సంఘటనలేమీ లేవు.

ఫస్ట్ సెమిస్టర్ మొదట్లో నా సహాధ్యాయి సుంకర ఆళ్వార్ దాస్ హెపా (హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అసోసియేషన్) సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దాని తరపున సెమినార్ నిర్వహించాలనుకున్నాడు. (అనంతర కాలంలో ఆళ్వార్ దాస్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించాడు, విశాఖలో ఆయన స్థాపించిన విద్యాసంస్థలు నేటికీ ఉన్నాయి) మా సీనియర్ ఎస్. ఎ. ప్రసాద్ కొరియా యుద్ధం మీద పేపరు తయారుచేసుకొచ్చాడు. 51 పేజీలు. మాకేమీ అర్థం కాలేదు. నిజానికి ఆ దేశం ఎక్కడుందో కూడా అప్పటికి మాలో చాలామందికి తెలియనే తెలియదు. అక్కడ యుద్ధం ఎందుకో, దాని ప్రభావం ఏమిటో ఇంకేం తెలుస్తుంది? దాంతో రచయిత ధైర్యానికి చాలా అబ్బురపడ్డాం. తర్వాత సెమినార్ కు పేపరు నన్ను రాయమన్నాడు ఆళ్వార్ దాస్.

నేను వారన్ హేస్టింగ్స్ అభిశంసన తీర్మానం గురించి రాయాలనుకున్నాను. లైబ్రరీలో ఉన్న మేరకు సమాచారం సేకరించాను. సంక్షిప్తంగా ఒక పేపరు తయారుచేశాను. వారన్ హేస్టింగ్స్ బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యున్నత అధికారి. అతను చాలా అవినీతికి పాల్పడ్డాడని అభియోగాలు వచ్చాయి. కాని దానికి అతన్ని శిక్షించిన విధానం ఆశ్చర్యకరం. కేవలం అతను భారత్ ను విడిచి వెళ్లాలని ఆదేశించారు, అంతేకాదు, తాను సంపాదించినది తీసుకుపోయే వెసులుబాటు కల్పించారు. అదేమంటే మాతృదేశానికి అతను చేసిన సేవలకు ప్రతిఫలంగా అతనికి కఠిన శిక్ష ఏదీ విధించలేదు. అది అప్పట్లో ఎంతో విచిత్రం. అది స్వతంత్ర భారతావనిలో ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపింది. నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అవినీతిపరులని తేటతెల్లమయినప్పటికీ శిక్షలు కఠినంగా ఉండడం, ఇతరులకు గుణపాఠం కావడం మనం చూడటం లేదు. 1950ల్లోనే కొందరు ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాని వారి మీద విచారణ అన్నదే తూతూ మంత్రంగా జరిగింది. ఏ ఒక్కరూ జైలుకు వెళ్లిన దాఖలాలు లేవు. అవి అంతే నిశ్శబ్దంగా చరిత్ర పుటల్లోకి జారుకున్నాయి.

ఇదీ నా పేపరు సబ్జెక్టు. ఆనాటి సెమినార్ కు బోలెడుమంది వచ్చారు. దాన్ని మోడరేట్ చేసింది ఎస్. గోపాల్. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కుమారుడు. చదువయ్యాక ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ లో హిస్టారికల్ డివిజన్ డైరెక్టర్‌గా పనిచేశారు. తన తండ్రితో పాటు, నెహ్రూ గారి జీవిత చరిత్రనూ రాసినవాడు. నేను నా పేపరు రాయడానికి ఎవరి సాయమూ తీసుకోలేదు. మా ఇండియన్ హిస్టరీ అధ్యాపకుడికి అది కొంచెం నచ్చలేదు. ఆయన సెమినార్‌కు కూడా రాలేదు. ఆ కోపం మనసులో పెట్టుకొని తర్వాత అర్థసంవత్సర పరీక్షల్లో నేను 36 పేజీలు రాస్తే, ఆయన నాకు 36 మార్కులిచ్చారు. నిజానికి నేను చాలా బాగా రాశాను. నాకు డిస్టింక్షను మార్కులు రావాలి. కాని ఆయన నాకో గుణపాఠం నేర్పాలనుకున్నారు. అలాగే ఆ జవాబు పత్రాన్ని నా చేతికిస్తున్నప్పుడు ‘దీనిలో అవసరమైనవి తప్ప అన్నీ ఉన్నాయి’ అని లోగొంతుకలో వ్యాఖ్యానించారు. ఒక్కటే మంచి విషయం ఏమంటే – ఆ కోపాన్ని ఆయన ఎక్కువ కాలం మనసులో పెట్టుకోలేదు. తర్వాత సంవత్సరాంత పరీక్షల్లో నేను బాగా రాశాను, ఆయన మంచి మార్కులూ వేశారు.

మొత్తమ్మీద ఈ సెమినార్ పుణ్యమా అని నేను ఇంగ్లిషులో రాయడం మొదలుపెట్టాను. తర్వాత విస్తృతంగా రాస్తానని అప్పడు నేను ఊహించనే లేదు.

ఈలోగా కొన్ని ముఖ్యమైన రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. అవేమంటే – రెండో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం సడలించారు. అప్పటివరకూ ఆ పార్టీ నాయకులంతా అజ్ఞాతంలో ఎక్కడెక్కడో తలదాచుకునేవారు. పార్టీకి పెద్ద వనరులేం లేవు. కేడర్ ను పోలీసులు నాశనం చేశారు. ఎలా చూసినా కాంగ్రెసుకు బలమైన ప్రత్యర్థి కాజాలదని అందరూ అంచనా వేసుకున్నారు.

కేసీపీ చక్కెర కర్మాగారం వ్యవస్థాపకులు అడుసుమిల్లి గోపాలకృష్ణగారు (తాతగారు) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యాలనుకున్నారు. ఆయన వెంటే తిరుగుతూ మా నాన్న ఎన్నికల ప్రచారానికి మేనేజరుగా వ్యవహరిస్తూ బిజీ అయిపోయారు. ఎక్కువ ప్రయాణించేవారు. అప్పటికే అటూఇటూగా ఉన్న మా నాన్న ఆరోగ్యం ఇంకా దెబ్బతినడం మొదలయ్యింది.

నాకిదేం తెలియదు. డిసెంబరు 11 తేదీ, మధ్యాహ్నం మెస్ లో భోజనం చేసి హాస్టలు గదికి వచ్చేసరికి పోస్టుమ్యాన్ నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తూనే ఏదో జరగరానిది జరిగి ఉంటుందన్న ఊహ నాలో రాకపోలేదు. ఎందుకంటే అతను మామూలుగా హుషారుగా ఉంటాడు, విద్యార్థులకు ఇళ్ల నుంచి వచ్చే మనీయార్డర్లు అందజేసి వాళ్లిచ్చే తృణమోపణమో తీసుకుని నవ్వుతూ వెళ్లిపోతాడు. కాని ఈసారి నాకిచ్చినది ఎమ్.వో. కాదు. టెలిగ్రామ్. మా నాన్న ఆ ఉదయమే మరణించారని, నన్ను ఇంటికి త్వరగా రమ్మని దాని సారాంశం. నెత్తిన పిడుగు పడితే ఎలా ఉంటుందో నాకప్పుడు తెలిసింది. అంతకన్నా పెద్ద దెబ్బ అది నాకు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసినప్పటికీ, నా చదువు అయ్యేదాకా ఉంటారని, అంతా ఆయన చూసుకుంటారని అనిపించి భరోసాగా ఉండేవాణ్ణి. ఆ నీడ పోయిందని తెలిసి ఉగ్గబట్టుకోవడం నావల్ల కాలేదు.

నా రూమ్మేట్లు సాయం చేశారు. సాయంత్రం ట్రెయినుకు టికెట్టు కొని నన్నందులో ఎక్కించారు. నా శోకం ఆపలేకపోయాను. చిన్నప్పుడు నేను మా నాన్నకు దూరంగా మసలుకొనేవాణ్ణి. ఆయన కూడా క్రమశిక్షణ పేరుతో మమ్మల్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. నా పెడసరం ప్రవర్తనకు కాస్త ఎక్కువే కొట్టేవారు కూడా. కాని నేను విజయవాడ కాలేజీలో చేరాక మేమిద్దరం దగ్గరయ్యాం. నా మీద ఆయనకు నమ్మకం కుదిరింది. నా భవిష్యత్తు పట్ల ఆయన కలలు, ఆలోచనలు నాతో పంచుకునేవారు కూడా.

అంతకుముందు మార్చిలో ఆయన వాల్తేరు వచ్చినప్పుడు సాయంత్రం మేమిద్దరం బీచికెళ్లాం. సూర్యాస్తమయం అయ్యేదాకా అక్కడే ఉన్నాం. అప్పుడే ఆయన నేను ఆంధ్రా యూనివర్సిటీ చదువు ముగిసిన తర్వాత తప్పకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ సంస్థ పేరు ఎక్కడ, ఎలా విన్నారో తెలియదు. కాని ఆ సాయంత్రం సంభాషణ, ఆయన ఆకాంక్ష నాలో బలంగా నాటుకుపోయింది.

అది తల్చుకున్నకొద్దీ నాలో దు:ఖం ఎక్కువయ్యింది. ఎందుకంటే లండన్ స్కూలు మాట దేవుడెరుగు, ఇప్పుడు చదువుతున్న డిగ్రీ గట్టెక్కుతుందో లేదో అన్న సంశయం నన్ను పట్టికుదిపేసింది. నాన్నకు వచ్చే 150 రూపాయల్లో నా హాస్టలు, ట్యూషన్ ఫీజులు కట్టేవారు. ఇప్పుడు ఆయనే లేకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు? నేనేం చెయ్యాలి? అమ్మని, చెల్లిని ఎవరు చూస్తారు? ఏమీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు అంతా చీకటిమయంగా అనిపించింది. రైల్వే స్టేషన్ వరకూ వచ్చిన నా సహాధ్యాయులకు కూడా నేను మళ్లీ చదువుకు వస్తానో రానో అని చెప్పాను. వారిలో కొందరికి అప్పటికే నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని తెలుసు. ఉన్న కాస్త ఆసరా కూడా పోయిందన్న సంగతి వారికి ఎంత అర్థమయ్యిందో మరి.

విజయవాడ స్టేషనులో దిగేసరికి మా బావ (నాన్న మేనల్లుడు) శివరావు నా కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. నేను చేరిన తర్వాత మా రెండో అన్నయ్య, అక్కయ్య, పెద్ద వదినల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. దహనక్రియ ఎప్పుడని నేను బావను అడిగాను. అయిపోయిందని, మర్నాడుదయం అస్థికలు తేవాలని చెప్పారు. అదెలాగో నాకు అర్థం కాలేదు. సంప్రదాయం ప్రకారం పెద్దకొడుకు వచ్చి తలకొరివి పెట్టాలి కదా, మా అన్నయ్య రేపుదయానికి కాని రాలేడు, అలాగని పల్లెటూళ్లో అంతవరకూ శవాన్ని ఉంచరు… ఈ తరహా ఆలోచనల్లో కొట్టుమిట్టాడాను.

అసలు జరిగింది ఏమిటంటే – విజయవాడలో సమావేశం తర్వాత మా నాన్న, తాతగారి వెంట గుడివాడకు అర్థరాత్రి వచ్చారు. ఆ రాత్రి సమయానికి భోజనం లేదు. వంటవారు తెచ్చి పెరుగు ఇచ్చారు. దానిలో పంచదార కలిపారని వారు నాన్నకు చెప్పలేదు. దాంతో తెల్లవారు జామున 3.30కి ఆయనకు డయాబెటిక్ అటాక్ వచ్చింది. చనిపోయారు. హాస్పిటల్‌కు తరలించి అమ్మను తీసుకురావడానికి బండి పంపారు అక్కడివారు. అమ్మ, అక్క, పెద్ద బావగారు అంతా హాస్పిటల్ కు చేరుకునేసరికే నాన్న ప్రాణాలు పోయాయి.

కాని ఆ రాత్రి మా పెద్దన్నయ్య అనుకోకుండా వాళ్ల అత్తవారిల్లు తెనాలిలో ఉన్నాడు. అప్పటికి అతను పనిచేస్తున్న ఇండియన్ రిపబ్లిక్ పేపరుకు ఎన్నికల వార్తలివ్వడానికి విలేఖరిగా వచ్చాడు. ఆ రాత్రి అన్నయ్యకో కల వచ్చిందట. మా నాన్న మీద తెల్ల దుప్పటి కప్పి ఉన్నట్టుగా పాడు కల. అది అతన్ని దు:ఖపెట్టినా, అలాగేం కాదని మనస్సును సమాధానపరచుకుని మద్రాసు వెళ్లడానికి సిద్ధపడి జి.టి. ఎక్స్ ప్రెస్ ఎక్కడానికి రైల్వేస్టేషనుకు వెళ్లాడట. అక్కడ మద్రాసు నుండి కలకత్తా వెళ్లే మెయిలు వస్తూ కనిపించింది. దాంతో అన్నయ్య విజయవాడకు టికెట్టు కొనుక్కొని వచ్చేశాడు. కడవకొల్లుకు ఎడ్లబండిలో వస్తూ ఉంటే, నాన్న పార్థివ దేహం ఉన్న జీపు తనను దాటుకుంటూ ఇంటికి చేరింది. తన కల నిజమైనందుకు ఒకవిధమైన షాక్ లోనికి వెళ్లిపోయాడు అన్నయ్య. తీవ్రంగా శోకిస్తూ ఆ ఉదయమే అంత్యక్రియలు పూర్తిచేశాడు.

సముదాయించడానికి వీల్లేనంత దు:ఖం నాలో పెల్లుబికింది. మద్రాసు నుంచి మిగిలినవాళ్లొచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాను. ఇంటికెళ్లి అమ్మ మొహం ఎలా చూడాలని బెంగ పట్టుకుంది. అన్నేళ్ల వారి వైవాహిక జీవితంలో మా అమ్మ డబ్బుకు ఇబ్బంది పడని రోజు ఒక్కటీ లేదు. ఆరుగురు పిల్లలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా చలించకుండా రోజులు గడిపింది. ఎన్నో పండగలు వచ్చి వెళ్లాయి కాని ఆమె ఒక్కనాడు పట్టుచీర కట్టుకోగా మేం చూడలేదు. ఒక్క చిన్న నగకు సైతం నోచుకోలేదు. ఆమె మంగళసూత్రం ఒట్టి దారమూ పసుపు కొమ్మే. ఏమున్నా లేకున్నా నాన్న ఉంటే చాలు బలం అన్నట్టు ఉండేది.

మా కన్నీళ్లకు ఏ భాషా లేదు. భవిష్యత్తు అగమ్యగోచరం. మా అన్నలు, అక్కలు నా చదువు ఊసేంటో చెబుతారని ఎదురుచూశాను. వాళ్లలో ఎవ్వరైనా బాధ్యత తీసుకుంటారేమో అని ఊహించాను. కర్మలు ముగిశాక మా పెద్దన్నయ్య మద్రాసు వెళ్లడానికి తొలి బస్సు పట్టుకోవడానికి వెళుతుంటే ఉదయాన్నే లేచి ఉయ్యూరు వరకూ ఆయనతో నడిచాను. ఆయన దారంతా మౌనంగానే నడిచాడు. నావైపు చూడనుకూడా లేదు. అలాగే బస్సెక్కాడు. చదువును గురించి భరోసా మాట దేవుడెరుగు, నాన్న పోయినందుకు ఒక్క ఓదార్పు మాట కూడా మాట్లాడలేదు. తన చేతగానితనానికి తానే సిగ్గుపడ్డాడేమో మరి. దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఎంత రక్తసంబంధమైనా, ఇతరులకు సాయం చేసేంత డబ్బుండదు.

నాకు దిగులు కొండలా పెరిగిపోయింది. నాన్న తన జీవితంలో అలాంటివెన్నో సందర్భాలను ఎదుర్కొని ఉంటారు. కాని ఆయనలో ఆశావహ దృక్పథం బృహత్తరమైనది. ఎన్ని కష్టాలెదురైనా చివరకు మంచే జరుగుతుందని ఆయన బలంగా నమ్మేవారు. ఆ నమ్మకంతోనే తాను చదువుకోవాలని ఉమ్మడి కుటుంబం నుంచి బయటకొచ్చారు. ఆస్తి అమ్మేసి బడి నిర్మాణం చేశారు, కేవలం తన గురించే కాదు, తన పిల్లలు, ముందు తరాలు బాగు పడతాయని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన మనిషి ఆయన. భావితరాలు కొత్తదారుల్లో పయనించాలని కలలు కన్న ఆధునికవాది. తనకంటూ చెప్పుకోదగిన ఉద్యోగం లేకపోయినా, తన పిల్లలతోపాటు అన్నలు, అక్కచెల్లెళ్ల పిల్లలను సైతం చదివించారు. జీవితంలో యుద్ధాలను ధైర్యంగా పోరాడారు, సానుకూల దృక్పథమే ఆయన బలంగా ఉండేది.

ఆయన పోయాక మాకు మిగిలినది కడవకొల్లులోని పూరిల్లు. దాచుకున్న డబ్బంటూ ఏమీ లేదు. రెండో ఏడాది చదువులో నేను. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి. ఉయ్యూరులో ముస్లిం కిరాణాదారుడికి ఇంత అప్పు. అదీ క్లుప్తంగా మా పరిస్థితి. ఆయన మా గురించి కన్న కలలేమీ నిజం అయ్యే దారి కనిపించలేదు. జీవితంలో ఉన్న ఒక్క తలుపూ మూసుకుపోయి చుట్టూ చీకటి పేరుకున్నట్టు అనిపించింది. నేను అనాధ అయిపోయినట్టు భావన కలిగి, తీవ్రంగా ఏడ్చేవాణ్ణి.

*****

క్రిస్మస్ సెలవుల తర్వాత నేను యూనివర్సిటీకి తిరిగి రాగలిగానంటే అది కేవలం కేసీపీ వారి ఔదార్యంతో అని చెప్పాలి. మా నాన్న పోయిన కొద్ది నెలల వరకూ ఆయన పేరిట జీతం ఇస్తామని వారు చెప్పారు. కారుచీకట్లో అది కాంతిరేఖ.

ఈలోగా ఎన్నికలు అయ్యాయి. రాజకీయ, ఆర్థిక కోణాల్లో భారీ మార్పులు వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలను వదిలి ఎన్నికల్లో పాల్గొని రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. పోటీ చేసిన స్థానాల్లో 60 – 70 శాతం సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీలో పావు వంతు ఉండి మంచి ప్రతిపక్షంగా అవతరించింది. ప్రావిన్సు, కేంద్ర సభల్లో సైతం వాళ్లు తమ స్వరాన్ని వినిపించే అవకాశం తెచ్చుకోగలిగారు. పోలీసు బలం బలం కాదని, భయపెట్టి ప్రజల మనసులను, మెదళ్లను గెలుచుకోలేమని కాంగ్రెసు ప్రభుత్వానికి అప్పటికి అర్థమయ్యింది.

ఆర్థికంగా – అప్పటివరకూ చెత్తగా నడిచిన రేషన్ పద్ధతి అంతమయ్యింది. ఫ్రీ మార్కెట్ పద్ధతి మొదలైంది. విచిత్రం ఏమంటే ఏ కుటుంబానికి నెలవారీ ఖర్చులేం పెరగలేదు. విద్యార్థులకు కావలసినంత భోజనం దొరకడం మొదలైంది.

మాకు ఆ ఏడాది కూడా వార్షిక పరీక్షల్లేవు. సిలబస్ పూర్తి చెయ్యడానికి కొద్దిగా కష్టపడ్డాంగాని సాఫీగానే చదివాం. ప్రొఫెసర్ గోపాల్ గారికి పబ్లిక్ ఫైనాన్స్ ఇష్టమైన సబ్జెక్టు. ఆయన పి.హెచ్.డి. ఆ రంగంలోనే చేశారు. అదే మాకు బోధించేవారు కూడా. కీనేషియన్ ఎకనమిక్స్ చెప్పాల్సిన అధ్యాపకుడికి సమయం తక్కువగా ఉండేది. దాంతో మాకు ఆ సబ్జెక్టు అంతగా పట్టుబడలేదు. మేమూ అంతగా పట్టించుకోలేదు.

వేసవి సెలవులు ఇచ్చేశారు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లే దృశ్యాన్ని చూసితీరాల్సిందే. అప్పటివరకూ చిలకలు వాలిన చెట్టులా ఉన్న యూనివర్సిటీ ప్రాంగణం ఒక్కసారిగా నిర్మానుష్యమైన ప్రాంతంగా మారిపోయేది. సాధారణంగా ఫైనలియరు విద్యార్థులు క్రిస్మస్ సెలవులకు ఇళ్లకు వెళ్లకుండా ప్రిపరేషన్ సాగించేవారు. ఫైనల్ పరీక్షల తర్వాత వాళ్లు అన్నీ సర్దుకుని వెళ్లిపోవడం, ఫలితాల కోసం ఆత్రంగా వేచి చూడటం, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటాని ఆలోచించుకోవడం – మాలో తెలియని భావాలను రేపెట్టేవి.

నేను సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు ఆర్థిక ఇబ్బందులను గమనించాను. మా రెండో అన్నయ్య మావగారు ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయనకు ఏ రాజకీయ నేపథ్యమూ లేదు. అయినా ఎన్నికల్లో తొలిసారిగా నిలబడ్డారు, ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. దాంతో మాకే ఇబ్బందీ లేనప్పటికీ, ఆయన ఎలక్షన్ డిపాజిట్ కు, ప్రచారానికి సొమ్ము వృధాగా ఖర్చయిపోయింది. ఫలితం –వదిన ద్వారా మా అన్న చదువుకని ఉంచిన భూమి మీదే వారి కుటుంబమంతా ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. దాంతో అతని చదువుకు నెలవారీ డబ్బు రావడం ఆలస్యమవుతూ వచ్చింది, చివరికి పూర్తిగా ఆగిపోయింది.

ఈలోగా కెసిపివారు ఇక నాన్నకు జీతంగా డబ్బు పంపేది లేదని వార్త పంపారు. దానికీ ఓ కారణముంది. మా నాన్న తన పరిచయస్తులొకరిని అక్కడ ఉద్యోగానికి పెట్టారు. తర్వాత అతను ట్రేడ్ యూనియన్ నాయకుడి అవతారం ఎత్తాడు. కార్మికులను యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉసిగొలిపి కూడగడుతున్నాడన్నది వాళ్ల అభియోగం. తమ ఇబ్బందికి పరోక్షంగా నాన్నే కారణమని వాళ్లకు అనిపించింది. మేం ఆర్థిక సాయం కోరుతూ మౌఖికంగానూ, రాతపూర్వకంగానూ చేసిన విన్నపాలన్నీ చెత్తబుట్ట పాలయ్యాయి.

అప్పుడే కె.సి.పి.కి కొత్త ఛైర్మన్ వచ్చారు. ఆయన వెలగపూడి రామకృష్ణగారు. ఐ.సి.ఎస్. చదివిన ఉన్నత విద్యావంతులు. మేం ఆయన్ని కలవడానికి వెళ్లాం. అప్పటికాయన ఓ కుర్చీలో కూర్చున్నారు, పనివారు ఆయనకు షూ వేస్తున్నారు. మావైపు చాలా తిరస్కారంగా ఓ చూపు చూశారు. ‘నా సమయం వృధా చెయ్యకండి. మీ నాన్న వల్ల ఇవాళ మేం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం…’ అని గట్టిగా కసురుకున్నారు. దబదబా నడుస్తూ ఆఫీసు లోపలకు వెళ్లిపోయారు. ఏదైనా కాస్త సాయం దొరుకుతుందన్న మా ఆశలు అడియాసలయిపోయాయి. అవమానానికి గురై, దీనమైన హృదయాలతో మేం ఇంటికి చేరుకున్నాం.

నా ఆలోచనలు రెండే రెండు. ఒకటి నా చదువు ఎలా సాగుతుంది? రెండు కడవకొల్లులో అమ్మ, చెల్లి జీవనానికి మార్గమేది? అప్పు చేద్దామన్నా నాకు ఎవరిస్తారు? నాకంటూ సంపాదన లేదు, డిగ్రీ లేదు, కుదువపెట్టేందుకు ఆస్తేమీ లేదు. ఉన్న పూరిల్లు కూడా నాన్న పేరున లేదని తెలిసింది. మా పెద్దబావకు ఋణపడిన ఆయన అప్పు తీర్చలేక ఆ ఇల్లు ఆయన పేరున చేసేశారు.

అలాంటి సమయంలో నాకు రెండు అవకాశాలు వచ్చాయి. మా చిన్నాన్న (పిన్ని భర్త) వారిదీ పెద్ద కుటుంబమే. ఆయన ఒకేసారి మాకు 400రూపాయలు అప్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తిరిగి తీర్చడానికి కంగారు పడకుండా, నా దగ్గర ఎప్పుడుంటే అప్పుడు తిరిగివ్వమని చెప్పారు. పెద్దక్కయ్య బావగారు మా ఇంటి ఖర్చు తాము భరిస్తామని చెప్పారు. అవి రెండూ దేవుడు పంపినట్టే అనిపించింది అప్పటికి. ఆ సాయంతో నా చదువు కొనసాగింది, మా కుటుంబం నిలబడింది. నేను పెరిగి సంపాదనాపరుణ్ణయ్యాక 12శాతం చక్రవడ్డీ కలిపి చిన్నాన్నగారికి అప్పు తీర్చేశాను. కాని ఆ పరిస్థితిలో ఆయన ఆదుకోకుంటే ఏమయ్యేవాణ్నో అన్న ఊహే నన్ను వణికిస్తుంది.

*****

ఎలాగయితేనేం చివరి ఏడాది చదువులోకి వచ్చేశాను. హాస్టల్లో మా గదులు మారిపోయాయి. రెండో అంతస్తులో 16 గదుల్లో 32మందిని పెట్టారు. అన్ని సబ్జెక్టుల వాళ్లూ ఉండేవారు. మా బ్లాక్ కు వచ్చినవారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. వివాదాస్పదమైనవారూ ఉండేవారు. కాని చివరి ఏడాది క్లాసులు ప్రారంభమయ్యేసరికి రాజకీయాలు, వివాదాలు, సరదాలు అన్నీ కాస్త నెమ్మదించాయి, చదువే ముఖ్యమనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే అందరూ అంతోఇంతో మధ్యతరగతివారే, చదువు పూర్తి చేసుకుని పట్టాలతో ఇళ్లకెళ్లాలన్న ఆశలున్నవారే. దాంతో శ్రమించడానికి సిద్ధపడ్డారు. యూనివర్సిటీ అధికారులు కూడా నా ఆర్థిక పరిస్థితిని గమనించారు. అనంతపురం జిల్లా బోర్డు సీనియర్ ఫెలోషిప్ ఇచ్చారు. నెలకు ఇరవై రూపాయలు. అది నా ట్యూషన్ ఫీజుకు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఆ డబ్బుకు ఒకపూట టిఫిను కూడా రాకపోవచ్చునేమో, కాని ఆనాడు అదే పెద్ద భాగ్యం నా పాలిట.

ఏడాది గడుస్తుండగా చదువులో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫస్టు క్లాసు వస్తుందని ఆశ చిగురించింది. డి.వి.రమణగారు మాకు హిస్టరీ ఆఫ్ ఎకనామిక్ థాట్ చెప్పేవారు. మిగిలిన సబ్జెక్టులతోపాటు క్వార్టర్లీ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థికి బహుమతినిస్తానని ప్రకటించారు. దాంతో మాలో ఉత్సాహం, పరిశ్రమ పెరిగాయి. పేపర్లు దిద్దాక మాలో ఇద్దరికి మార్కులు సమానంగా వచ్చాయి. దాంతో ఆయన బహుమతిని వాయిదా వేశారు. హాఫియర్లీ మార్కుల ఆధారంగా ఇస్తానన్నారు. ఈసారి నాకే మార్కులు ఎక్కువ వచ్చాయి, బహుమతికి అర్హుణ్ణయ్యాను. ఏడాది చివర్లో ఓ సభ పెట్టారు, వి.సి. ప్రత్యేకంగా వచ్చి ప్రశంసించారు. బ్రియాన్ ట్యూ రాసిన ‘ఇంటర్నేషనల్ మానెటరీ కోపరేషన్’ అన్న పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆయన బ్రిటిష్ ప్రొఫెసర్. ఆ పుస్తకాన్ని అందుకుంటున్నప్పుడు నేను ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ లో భవిష్యత్తులో పనిచేస్తానన్న ఊహ కూడా లేదు నా మనసులో. అసలు అటువంటి కల కనే అవకాశం కూడా లేదు. కాని ఎక్కువ ఉద్యోగ జీవితాన్ని గడిపింది అక్కడే!

అప్పుడే రెండు మార్పులు వచ్చాయి. ఒకటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించినది, మరొకటి ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధిలో ఓ మైలురాయి అనదగినది.

మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రా కోస్తా, సీడెడ్ జిల్లాలను సవతి పిల్లల్లాగా చూస్తున్నారన్న భావన1930ల నుంచి ఆంధ్రుల్లో పాతుకుపోయి ఉంది. ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ఎక్కువమంది అధికారులు తమిళనాడువారు. వాళ్లకు తమ ప్రాంతాలు, భాష పట్ల శ్రద్ధ ఉండేది. ఆంధ్ర ప్రాంతాలకు కేటాయింపులు తక్కువ. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. విద్యాసంస్థలు, రహదారులు, మునిసిపాలిటీ వ్యవస్థ, నీళ్లు, కాలవలు అన్నీ వాళ్లకే తప్ప ఇటువైపు వచ్చేవి కాదు. మూడు జీవనదులు, మరెన్నో పెద్ద నదులు ఉన్నప్పటికీ నీళ్లిచ్చే వ్యవస్థ ఉన్న మునిసిపాలిటీ ఒక్కటి కూడా ఉండేది కాదు ఆంధ్రలో.

ఈ అసమానతలను గుర్తించి సరిచెయ్యాలని కాంగ్రెస్ పెద్దల్లో కొందరు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం గళమెత్తారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ గుర్తించి వాటిని వేరే ప్రాంతంగా ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచనను పాదుకొనేలా చేశారు. కాని అప్పట్లో జాతీయ నాయకులు, కాంగ్రెసు అధిష్టానం కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖంగా ఉండేవారు కాదు. అలా చేసుకుంటూ పోతే దేశమంతా ముక్కచెక్కలుగా విడిపోతుందని, గొడవలు చెలరేగుతాయని వారు భయపడేవారు. కాని కొంతకాలానికి దిగివచ్చి, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ పార్టీని విభజన చేసిందిగాని, అడ్మినిస్ట్రేషన్‌ను కాదు.

ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు అనే నేత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించారు. ఇది జరిగింది 1952 అక్టోబరు 19న మద్రాసులో. ఆనాటి దినపత్రికలు దీనికి ప్రచారం ఇచ్చాయి. వివిధ లక్ష్యాల కోసం నిరాహార దీక్షలు చేసిన చరిత్ర ఆయనకు ఉంది అప్పటికే. అవి స్థానిక సమస్యలు. అందువల్ల అవి త్వరగా పరిష్కారమై ఆయన దీక్ష విరమించేవారు. కాని ఈసారి ఆయన డిమాండ్లు చాలా పెద్దవి. ఒకటి ఆంధ్ర రాష్ట్రం విడిగా ఏర్పడాలి, రెండు దానికి రాజధాని మద్రాసు పట్టణం కావాలి. రెండూ వివాదాస్పద విషయాలే.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పచ్చజెండా ఊపినట్టే. దీనికి సమ్మతిస్తే దేశంలో గుజరాత్, మహరాష్ట్ర, మైసూరు, హర్యాణా, పంజాబ్… ఇలాంటివాటికి కూడా సమ్మతించాలి. ఆయన రెండో డిమాండు – మద్రాసు రాజధానిగా కావాలన్నది మరికాస్త వివాదాస్పదమైనది. పూర్వం అది తెలుగువారిదే అన్న వాదన ఎలా ఉన్నా, అప్పటికి అక్కడ తమిళుల సంఖ్య ఎక్కువ, అక్కడున్న తెలుగువారు సైతం దైనందిన జీవితంలో తమిళం మాట్లాడక తప్పదన్న పరిస్థితి ఉండేది.

వీటన్నిటికీ కేంద్రం వ్యతిరేకం గనక పొట్టి శ్రీరాములుగారి దీక్ష ఫలిస్తుందని ఎవరూ అనుకోలేదు. మొదటి మూడు వారాలు ఆయన రోజుకో గ్లాసు పళ్లరసం తాగి గడిపారు. నాయకులు తలో స్టేట్ మెంట్ ఇవ్వడమేగాని, పద్ధతైన రాజకీయ చర్యలేవీ ఎవరూ తీసుకోలేదు. నవంబరు మధ్యకు వచ్చేసరికి దీక్ష తీవ్రత అందరికీ తెలిసొచ్చింది. కేంద్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే సమయం ఇదేనని రాష్ట్ర నాయకులకు అర్థమైపోయింది. దాంతో అన్ని తెలుగు ప్రాంతాల నుంచి మద్రాసుకు చేరుకున్నారు. పత్రికల కవరేజ్ పెరిగింది. శ్రీరాముల ఆరోగ్యం విషమించడం ప్రారంభమయింది. వైద్యులు డెయిలీ బులెటిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన మరీ ఇబ్బంది అనుకున్నప్పుడు తన దీక్షలను మధ్యలోనే విరమించేవారు, పూర్వం. ఈసారి అలా చేస్తేగనక రాజుకున్న వేడి చల్లారిపోతుందని నాయకులు భయపడ్డారు. ఆయన దీక్ష సడలించకుండా, డిమాండ్లకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు. నిరాహార దీక్ష 40వ రోజుకు చేరి ఆయన కిడ్నీలు పనిచెయ్యని పరిస్థితి తలెత్తింది. రోజంతా స్పృహ కోల్పోయి ఉండేవారు. ఇక ఆయన ప్రాణత్యాగం తప్పదని అందరికీ అర్థమైపోయింది. దాంతో నాయకులంతా ఎవరి ప్రాంతాలకు వారు వచ్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు. నిరసనలు హోరెత్తించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడం, తగలబెట్టడం, రైల్వేస్టేషన్లను దోచుకోవడం, రైళ్ల రాకపోకలు ఆపడం, ఇతర వాహనాలను నిర్బంధించడం వంటివెన్నో చేశారు. మా స్నేహితులు చైతన్య, ఆళ్వార్ దాస్ వంటి విద్యార్థులు వీటిలో చురుగ్గా పాల్గొని విశాఖపట్నంలో రాలీలు చేశారు.

1952 డిసెంబరు 15న పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆయన అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కోసం నినాదాలిచ్చారు. విజయనగరం నుంచి ప్రకాశం వరకూ అనేక ప్రాంతాల్లో అల్లర్లు కూడా చెలరేగాయి. మద్రాసులో నాలుగైదు రోజుల పాటు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

ఆనాటి ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా – కొత్తగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబరు 29న ప్రకటించారు. మద్రాసు రాజధానిగా ఇవ్వలేదు. 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ఏర్పడింది. అక్కడనుంచి అన్ని విషయాలూ అందరికీ తెలిసినవే.

కాని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం రాజకీయాల్లో రెండు విషయాలకు అద్దం పట్టింది. ఒకటి – వాళ్లు అనుకున్నది సాధించడానికి రాజకీయనాయకులు తమ స్నేహితుల ప్రాణాలను పణంగా పెట్టడానికి సైతం వెనకాడరన్నది. రెండు – ప్రజాస్వామ్యంలో సాధారణ మార్గాలు పనిచెయ్యనప్పుడు పోరుబాట పట్టడం, జననిరసనలే ఫలితాలనిస్తాయన్నది. ఈ రెండూ వాస్తవమని తర్వాత చరిత్ర అనేకసార్లు మనకు ఋజువుచేస్తూ వచ్చింది.

*****

ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడి పాతికేళ్లయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ పండగ చెయ్యాలన్న ప్రతిపాదన వచ్చింది. ఏయూలోని వివిధ శాఖల ప్రస్థానాన్ని, యూనివర్సిటీ జీవితాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన ఏర్పాటు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించిన అల్లర్ల వల్ల ఆ ప్రయత్నాలన్ని కొద్ది రోజులు వాయిదా పడ్డాయి. 1953 కొత్త సంవత్సరం వస్తూ ఉండగా మాకున్నది తక్కువ సమయమని అర్థమైంది.

మా అధ్యాపకులు డి.వి.రమణగారు ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ గురించిన ప్రదర్శన బాధ్యత ఉత్సాహంగా తనమీద వేసుకున్నారు, మేమంతా సాయం చెయ్యాలని కోరారు. ఒకవైపు మా ఫైనల్ పరీక్షలు వచ్చేస్తున్నాయన్న టెన్షన్ ఉన్నప్పటికీ మేం కూడా ఉత్సాహంగా పాల్గొన్నాం. ఒక వారంరోజుల పాటు, రాత్రులంతా మేల్కొని చార్టులు తయారు చేశాం. భారతదేశం, ఆంధ్ర ప్రాంతం పరిస్థితులు, చరిత్ర వాటిలో ప్రతిఫలించేలా చూసుకున్నాం. ఆర్థికశాస్త్ర విభాగం అటువంటి ప్రదర్శన ఏర్పాటు చెయ్యడం అదే ప్రథమం అని, చాలా ఉపయుక్తంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు.

మొత్తానికి మార్చి వచ్చేసింది. ఆ నెల మధ్యలో అందరికీ పరీక్షలు మొదలై నెలాఖరు లోపు అయిపోతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివేవాళ్లకు ఏప్రిల్ మొదటివారంలో ప్రాక్టికల్సు ఉంటాయి. పరీక్షలప్పుడు యూనివర్సిటీ అంతా గొప్ప టెన్షన్ అలముకుని ఉండేది, అలాగే చిత్రవిచిత్ర దృశ్యాలు మా కంటపడేవి. పాత ఆర్ట్స్ కాలేజీ రూమ్ నెంబరు 28లో అందరికీ ఒకేచోట పరీక్ష పెట్టేవారు. ఒక వరుసలో పదిమంది చొప్పున విద్యార్థులకు సీట్లుంటాయి. ఒక్కోరిదీ ఒక్కో సబ్జెక్టు అన్నమాట. అంటే నా పక్కన ఇంగ్లిష్ లిటరేచర్, వారి పక్కన హిస్టరీ… ఇలాగ కూర్చుంటారు. ఉదయం ఎనిమిదింటి నుంచి పదకొండు వరకు పరీక్ష. అది అయిపోగానే గదికి వచ్చి మర్నాటి పరీక్షకు సిద్ధం కావడం. ఉదయం పూట టిఫిను పెట్టినా, చాలా తక్కువమంది తినేవాళ్లు. ఎక్కువమంది ఓ గ్లాసు పాలు లేదా కాఫీ మాత్రం తీసుకుని ఎగ్జామ్ హాలుకు వెళ్లిపోయేవారు.

మా పరీక్షలన్ని రోజులూ ప్రొఫెసర్ గోపాల్ మాకోసం హాలు బయట నిరీక్షిస్తూ ఉండేవారు. మేం వస్తూనే ఆయన శుభాకాంక్షలు, ధైర్యవచనాలు చెప్పేవారు. ప్రశ్నపత్రాలిచ్చాక విద్యార్థుల స్పందన రకరకాలుగా ఉండేది. అనుకున్న ప్రశ్నలొస్తే సంతోషం, రాకపోతే దు:ఖం – ఒకరికి ఖేదం ఒకరికి మోదం అన్నట్టుగా ఉండేది. కొందరయితే అక్కడే ఏడ్చేసేవాళ్లు. మూడో రోజు ఎకనామిక్ థియరీ పరీక్ష. అందరికీ కష్టంగానే అనిపించింది. మొదటి ప్రశ్న వాల్యూథియరీ గురించి రాబర్ట్ ట్రిఫిన్ రాసిన దాన్నుంచి ఇచ్చారు. అందులో ‘ప్రోగ్నోసిస్’ అనే మాటకు అర్థం మాలో చాలామందికి తెలియలేదు. ప్రొఫెసర్ గోపాల్ హాల్ బయట ప్రశ్నపత్రాన్ని చదివారు, మా పరిస్థితి అర్థం చేసుకుని లోపలికొచ్చి ఆ మాటకు అర్థం చెప్పారు. ఆ కాస్త ఊతంతో మేం తోచినంత, శక్తిమేరకు రాశాం. ఆ రోజంతా ఆ భయం మమ్మల్ని వదల్లేదు. నేరుగా ప్రశ్నలు వస్తే రాయడానికి సిద్ధపడి ఉన్నాం తప్ప ఇలాంటివి మేం ఊహించలేదు.

మర్నాడు పరీక్ష హాల్లో ఎవరి హడావుడిలో వాళ్లున్నాం. అకస్మాత్తుగా కొద్దిపాటి కలకలం వినబడింది. ఇన్విజిలేటర్లు హడావుడి పడటం కనిపించింది. ఒకరు కాఫీ తీసుకొచ్చారు, మరొకరు డాక్టరుకు కబురుపెట్టారు… జరిగిందేమంటే హిస్టరీ విద్యార్థి ఒకరు చాలా కష్టజీవి. అతను ముందురోజు రాత్రంతా మేలుకుని బాగా చదివేసి నేరుగా పరీక్ష హాలుకు వచ్చేశాడు. నిద్రలేమి, బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల అతనిలో నీరసం వచ్చేసి, వేళ్లు కొంకర్లుపోయి, పరీక్ష రాయలేకపోయాడు! డాక్టరు వచ్చి తన వేళ్లు కదిలించడానికి ప్రయత్నం చేసినా ఏమీ ఫలితం లేకపోయింది. ఆఖరుకు ఆ విద్యార్థి ఖాళీ జవాబు పత్రమే ఇచ్చి గదికి వెళ్లిపోవలసి వచ్చింది. అతని రోల్ నెంబరు సైతం ఇన్విజిలేటరే రాశారు. మూడేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దానివల్ల అతనికి థర్డ్ క్లాస్ డిగ్రీ వచ్చింది. తర్వాత అతను ఏమయ్యాడో, ఎలా స్థిరపడ్డాడో మాకెవ్వరికీ తెలియలేదు.

ఆ మర్నాడు పరీక్ష రాస్తుండగా ఒక విద్యార్థిని వెక్కిళ్లు పెట్టడం వినిపించింది. గ్యాలరీలో పై వరుసల్లో కూర్చున్న మాకు ఆమె ఏడవడం స్పష్టంగా వినిపించింది. చీరచెంగుతో మాటిమాటికీ కళ్లొత్తుకోవడం కనిపించింది. విషయం ఏమంటే – ఆమె మాథమెటిక్స్ స్టూడెంటు. ఆ పరీక్షలో తనకు తెలిసింది ఒక్కటి కూడా రాలేదు. లెక్చరర్లు సముదాయించి తోచినంత రాయమన్నారు. కాని అదేమీ ఆమె విషయంలో పనిచెయ్యలేదు. ఫలితాలు వచ్చాక ఆమెకు రికమెండెడ్ బాచిలర్ డిగ్రీ వచ్చింది. అంటే యూనివర్సిటీకి రాకముందు, మూడేళ్ల క్రితం ఉన్న స్థాయే. ఇటువంటి చిత్రాలు కొన్ని మాకు దడ పుట్టించేవి.

క్లాసులో కొందరికి ఉన్నత లక్ష్యాలు, కలలు ఉండేవి. కాని కొందరు పాసయితే చాలు అన్నట్టు ఉండేవారు. హాలుకొచ్చి తమకు వచ్చిందేదో రాసి నిమ్మళంగా వెళ్లిపోయేవారు, అంతే.

పరీక్షలన్నీ పూర్తయ్యాక చివరిరోజు మ్యాటినీ ఆటకు సినిమాకు వెళ్దామని అనుకున్నాం. కాని భోజనాలు చేసేసరికి అన్నాళ్ల అలసట ఒక్కసారిగా కమ్ముకొచ్చింది. సినిమా ఎంత వ్యామోహమున్నా, వెళ్లే ఓపిక లేక హాస్టలు గదుల్లోనే కూలబడ్డాం. సాయంత్రం బీచ్ కు వెళ్లి భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం. అప్పటివరకూ పరీక్షలు తప్ప మరేదీ ఆలోచించలేదు. అప్పుడు ముందే చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. ఎవరికి ఏ క్లాసు వస్తుంది, మాముందున్న విద్య, ఉద్యోగ అవకాశాలేమిటని బేరీజు వేసుకున్నాం. ఉన్నవి కొన్నే అవకాశాలు. అఫిలియేటెడ్ కాలేజీల్లో లెక్చరర్‌గా చేరడం, లేదా ఏజీ ఆఫీసులో అప్పర్ డివిజన్ క్లర్కుగా చేరడం, మరీ కాదంటే కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్స్ పెక్టర్ – ఇంతే. మాకివేవీ ఇష్టం లేదు. ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలో తెలియదు. దేనికైనా ఫలితాలు వచ్చేదాకా ఆగవలసిందే.

ఆ తర్వాత రెండు రోజుల్లో హాస్టల్లో సామాన్లన్నీ సర్దుకున్నాం. బిల్లులన్నీ కట్టేశాం. ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటామని ప్రమాణాలు చేసుకున్నాం. వీడ్కోలు చెప్పుకున్నాం. విశ్వవిద్యాలయ ప్రాంగణానికీ వీడ్కోలు చెప్పేశాం. మూడేళ్లు మమ్మల్ని తనలో దాచుకున్న ఇల్లు అది. మూడేళ్ల క్రితం ఏయే ట్రైన్లలో వచ్చామో, అవే ట్రైన్లలో తిరిగి స్వస్థలాలకు బయల్దేరాం.

విడిపోవడం ఎవరినైనా బాధిస్తుంది. కాని సుదీర్ఘ మానవజీవితంలో అది తప్పదు. మానవమాత్రులుగా మనం ముందుకు వెళుతూనే ఉంటాం. అన్నిటినీ తట్టుకుంటాం. మాలో చాలామందికి చదువు అక్కడితో అయిపోయినట్టే. కొత్త, తెలియని జీవితాల్లోకి ప్రయాణం మొదలైనట్టే.

ఇంటికి వెళ్లాక ఎప్పట్లానే ఆర్థిక ఇబ్బందులు పలకరించాయి. కొన్ని ఇతర ఇబ్బందులూ మేమున్నామని చెయ్యూపాయి. ఆర్థిక సాయం అందుతుందని మా అన్నయ్యకు పెళ్లి చేశారు మా నాన్న. కాని దురదృష్టవశాత్తు అతనికది లభించలేదు. పైగా అత్తమామల భారీ కుటుంబం ఒకటి. మా రెండో అక్కయ్యకు మంచి ఉద్యోగం ఉందిగాని, ఆమె కులాంతర వివాహం చేసుకున్నది, అందువల్ల ఆమె నుంచి మేం ఆశించగలిగే సాయమేదీ లేదు. మా పెద్దన్నయ్యకూ ఆర్థిక ఇబ్బందులే తప్ప కుదురైన జీవితం లేదు. అప్పటికి ఇండియన్ రిపబ్లిక్ సంపాదకుడిగా అతని ఉద్యోగం పోయింది. సంపాదన కోసం ఆయన బొంబాయి, ఢిల్లీల్లో కొన్ని పత్రికలకు స్ట్రింగర్ గా పనిచెయ్యడం మొదలుపెట్టాడు. చివరకు ఇంగ్లిష్ లో కన్న, హిందీ పాత్రికేయంలో తనకు అవకాశాలున్నాయని అతనికి అర్థమయ్యింది.

(అప్పుడే అతను దక్షిణ దేశపు ఆచారవ్యవహారాలను ప్రతిబింబిస్తూ కధానికా రచన మొదలుపెట్టాడు. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా పోటీలు పెడితే అందులో ఆయనకు కన్సొలేషన్ బహుమతి వచ్చింది. దాంతో మా అన్నలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత రచయితగా బాగా రాణించాడు. నవలలు, కథానికలు, నాటకాలు, బాలసాహిత్యం రాశారు. ఎన్నో రచనలకు వివిధ అకాడమీల నుంచి బహుమతులూ అందుకున్నాడు. హిందీ రచయితగా తెలుగువారు రాణించడం అరుదనుకుంటే, ఆ అరుదైన ఘనత మా అన్నయ్య అరిగపూడి రమేశ్ చౌదరి సొంతమైంది.)

మాది దిగువ మధ్యతరగతి కూడా కాదు, పేదరికం అని నాకు అర్థమవడానికి ఎక్కువకాలం పట్టలేదు. అప్పటివరకూ ఉన్న ఆశ ఏదో అడుగంటిపోతోందని నాకు స్పష్టంగా తెలిసేది. నేను ఇంటికి వెళ్లేసరికే మా పెద్ద బావగారు వచ్చి ఉన్నారు. ఆయనక నాకోసం కొన్ని సంబంధాలు తీసుకుని మరీ వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, ఉన్నత చదువులో, ఉద్యోగమో ఏది ప్రయత్నించాలన్నా కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడమే మార్గమని నాకు నూరిపోశారు. దానికి నేను సిద్ధంగా లేనని వాదించాను. ఓటు హక్కు కూడా లేనివాడికి పెళ్లేమిటని, అయినా కట్నం తీసుకోవడం నా విలువలకు విరుద్ధం అని పోట్లాడాను. కాని ఆయన నన్ను మించి మాట్లాడారు. ‘నువ్వూ నీ విలువలూ గంగలో దూకండి, ఇప్పటికి నీకు వేరే మార్గమేదీ లేదు’ అని దెబ్బలాడారు.

1953 మే 8వ తేదీన నా పెళ్లి జరిగింది.

నా భార్య ఆస్తులపైన ఆదాయంతో మా అప్పులన్నీ తీర్చేశాం, మా చెల్లికి పెళ్లి చేశాం. కొత్త జీవితం వైపు అడుగులు వెయ్యగలననే నమ్మకం నాలో కలిగింది. పెళ్లి తర్వాత రెండు వారాలకు నా ఆనర్స్ ఫలితాలు వచ్చాయి. నా పరిశ్రమ ఫలితమో, నా భార్య వెంట తెచ్చిన అదృష్టమో – నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా క్లాసులోని 32 మందిలో ముగ్గురికి ఫస్ట్ క్లాసులు వచ్చాయి. ఇది సంతోషం కలిగించింది.

కాని మళ్లీ అటుపైన ఉద్యోగమా, ఉన్నత విద్యా అన్న ఆలోచన మళ్లీ రగిలింది.

*****

అరిగపూడి ప్రేమ్ చంద్

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వ్యాసం చదవగానే హెచ్. ఆర్. మాచిరాజు గారు వ్రాసిన రెండు పుస్తకాలు తెప్పించుకున్నాను. ఈ వ్యాసం వల్లనే ఆయన పుస్తకాలగురించి తెల్సింది. ఆ పుస్తకాలూ మంచి ఇన్ఫోర్మెటివ్ గా ఉన్నాయి.
    కాని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం రాజకీయాల్లో రెండు విషయాలకు అద్దం పట్టింది. ఒకటి – వాళ్లు అనుకున్నది సాధించడానికి రాజకీయనాయకులు తమ స్నేహితుల ప్రాణాలను పణంగా పెట్టడానికి సైతం వెనకాడరన్నది.
    పొట్టిశ్రీరాములును వాళ్ల మిత్రులే చంపేశారని మా నాన్న కూడా చెప్పేవాడు. అతను విరమణకు సిద్ధం ఆయనా ఆనాటి నాయకులు పడనివ్వలేదని చెప్పేవాడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు